అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కొన్ని కవితలు కొన్ని కలర్ ఫుల్ ఫోటోలు మీకోసం మిత్రులారా... చూసి చదివి ఆనందించండి... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
అంబేద్కర్ 134 వ జయంతి కవితలు
1. రాజ్యాంగాన్ని
రక్షించుకుందాం...రండి..?
2. జై భీం మంత్రం జపిద్దాం..!
3. రక్తపాతమా? రాజ్యాధికారమా?
4. ప్రశ్నించు...ప్రతిఘటించు..?
1. రాజ్యాంగాన్ని
రక్షించుకుందాం...రండి..?
(అంబేద్కర్ ఆత్మ ఘోష)...
( డా.బి ఆర్ అంబేద్కర్ 134 వ
జయంతి సందర్భంగా ప్రత్యేక కవిత...)
ఓ మేధావులారా..!
ఓ బహుజన బాంధవులారా..!
ఓ అంబేద్కర్ వారసులారా...!
తన రక్తాన్ని సిరగా మలచి...
తన శ్వాసల్ని సూత్రాలుగా నేసి...
రాత్రింబవళ్ళు శ్రమించి స్వేదం చిందించి...
"భారత రత్నగా"...
"సంఘ సంస్కర్తగా"...
"నవ సమాజ నిర్మాతగా"
"భారత రాజ్యాంగ శిల్పిగా"...
"భరత మాత ముద్దు బిడ్డగా"...
"అణగారిన వర్గాల ఆశాకిరణంగా"...
అవతరించిన...అమరజీవి...
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్...!
ఒక మహనీయుడు..!ఒక మహర్ వీరుడు!
ఆయన మనకిచ్చిన
భారత రాజ్యాంగం
ఒక మతగ్రంథం కాదు...
అది ఒక మంత్రదండం...
అందులోని ఒక్కొక్కఅక్షరంలో...
దాగి ఉంటుంది ఒక రక్తచరిత్ర..!
పొందు పరిచిన ఒక్కొక్కహక్కు...
దొరలదోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యం..!
కానీ నేడు...
నీవు గాఢనిద్రలోనూ
నిష్క్రియలోనూ ఉండగా
ఆ పుస్తకంలోని పుటలను
చీకటిలో చించేస్తూన్నారు...
నీ భవిష్యత్తును అంతులేని
అంధకారంలో ముంచేస్తున్నారు..!
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి...
ఇది నీ బ్రతుకు పోరాటం..!
ఇది నీ బిడ్డల ఆశల ఆశయాల
అంతులేని అభద్రతల ఆరాటం..!
రేపు నీ పిల్లలు రెక్కలున్నా
ఎగరలేని పక్షులౌతారు...
రెక్కలు తెగిన పావురాలౌతారు...
చరిత్రలో పేరులేని పేజీలౌతారు...!
అందుకే ఓ అమాయకులారా..!
"చలివేంద్రం" పగిలిన తర్వాత
నీరెక్కడిది మీరు పంచుకోవడానికి..?
నీరెక్కడిది మీ దాహం తీర్చుకోవడానికి..?
కలహించుకుంటూ...
కత్తులు నూరుకుంటూ...
కుత్తుకలు తెంచుకుంటూ...
మనువాద మత్తులో మునిగిన
మీ ప్రయాణం సాగేది ఎక్కడికి..?
నిశ్శబ్దంగా శాశ్వతంగా శ్మశానానికే కదా..!
ఆలోచించండి..! రాజకీయ ఒత్తిళ్ళను...
పక్కన పెట్టండి...తీర్పుల చీకట్లలో...
వినాశనకర బీజాలు నాటుతున్నారు...
రాజ్యాంగం...మనువాదుల చేతిలో మృత్యుశాసనంగా...మారబోతుంది...
ప్రభుత్వాలు మారినప్పుడు...
పౌరహక్కులు కార్పొరేట్
పందికొక్కుల జేబుల్లోకి చేరినప్పుడు...
తినేతిండి పంచుకునే కరువురోజులొస్తే
నేటి నీ మౌనం రేపు నీకు శాపమౌతుంది..!
నీవు మూర్ఖుడివి కాదు మునివి కాదు...
కానీ నీ మౌనం నీ అజ్ఞానం నీ శత్రువు
చేతికి ఒక వజ్రాయుధమౌతుంది...!
ఓ మేధావులారా..!
ఓ బహుజన బాంధవులారా..!
ఓ అంబేద్కర్ వారసులారా...!
ఇకనైనా జాగ్రత్త పడండి...!
చుట్టూ కళ్ళు తెరిచి చూడండి...
అంబేద్కర్ చూపిన దారిలో కుట్రలు
కుతంత్రాలు పన్నేవారిని గుర్తించండి...
నవ్వించే నయవంచకుల్ని నమ్మకండి...
ఈ "విషసర్పాల వింతఆట" కట్టించాలి...
ఇది చీకటి పేటికలో మన బంగారు
భవిష్యత్తు దాచే భయంకరమైన కుట్ర..!
ఇది శోకగీతం కాదు
ఇది "సజీవ సమర గీతం"..!
అంబేద్కర్ ఆశయాలు పండేలా...
ఆయన ఆత్మ క్షోభించని రీతిలో...
రక్తతర్పణ చేసైనా సరే
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి..!
రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి...!
2. జై భీం మంత్రం జపిద్దాం..!
( ఏప్రిల్ 14 న అంబేద్కర్
జయంతి సందర్భంగా...)
ఓ అన్నలారా..! ఓ అక్కలారా..!
ఓ చెల్లెల్లారా..! ఓ తమ్ముల్లారా..!
ఓ అంబేద్కర్ వారసుల్లారా..!
నిశ్శబ్దపు నీడలలో నిగ్రహంగా మిణుకు
మిణుకుమని మెరిసే మిణుగురుల్లారా..!
ఏప్రిల్ 14 తరతరాలుగా అణచివేతకుగురై అంటరానితనానికి బలైన అణగారిన వర్గాల
ఆశాకిరణం రాజ్యంగ నిర్మాత
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మ దినం..!
బడుగుల ఆత్మ గౌరవం అంబేద్కర్...
పుస్తకం చేత పట్టుకున్న పులి అంబేద్కర్..
న్యాయ పోరాటం చేసిన వజ్రం అంబేద్కర్
ఆశల ఆశయాల అగ్నిజ్వాల అంబేద్కర్.!
పొలాల్లో ఎదిగే పచ్చని
మొక్కలే మానవ హక్కులు...
గుడిసెలో పుట్టిన
అంబేద్కర్ ఆశయమే రాజ్యాంగం...
పెనుగాలికి వొణికి ఒరిగే
పచ్చనిచెట్టు కాదు మన "జై భీం"దీక్ష..!
సమానత్వపు వేటలో...
అంబేద్కర్ చూపిన బాటలో...
ఓటును వజ్రాయుధంలా సంధించాలి
నిప్పులు చెరిగే నీ " జై భీం" నినాదాలు
"మనువాదుల గుండెల్లో"
"మందుపాతరలు" కావాలి..!
రక్తపాతమా...? రాజ్యాధికారమా...?
ఎంచుకోవాల్సిన సమయమిదే...
తలుపులు తెరవాల్సిన వేళ ఇదే..
ఇది పిలుపు కాదు...ప్రత్యక్ష యుద్ధభేరి..!
ఓ బహుజనులారా..!
మీ జీవితాలు నవ్వే నక్షత్రాలు కావాలంటే..?
మీరు చలిచీమలవోలె ఐక్యంగా...
చిరుతపులులై...పోరాడాలి...!
మీ ఒంట్లో ఓపిక
ఉన్నంత వరకు...కాదు...కాదు…
బొందిలో ఊపిరున్నంతవరకు...
మీ కోసం...కాదు...కాదు
రేపటి మీ కన్నబిడ్డల
సుభిక్షమైన...సురక్షితమైన...
సుఖమయ జీవనం కోసం....!
3. రక్తపాతమా? రాజ్యాధికారమా?
ఓ అన్నలారా..! ఓ అక్కలారా..!
ఓ చెల్లెల్లారా..! ఓ తమ్ముల్లారా..!
ఓ అంబేద్కర్ వారసుల్లారా..!
పూరిగుడిసెలో పుట్టిన ఓ పులుల్లారా..!
సునామి ముంచుకొస్తున్నా...
పిడుగులు నెత్తిన పడుతున్నా...
ఎంతకాలంరా ఈ మొద్దు నిద్దుర....
వద్దురా వద్దురా ఈ మొద్దు నిద్దుర...
ఇకనైనా బద్దకం వీడరేమిరా...?
కళ్ళుతెరిచి ఇకనైనా చూడరేమిరా...?
మీ పిల్లల బంగారు భవిష్యత్తును
పెట్రోల్ పోసి తగల బెట్టడానికి
ఎన్ని గుంటకాడి నక్కలు...
ఎన్ని మేక వన్యపులులు...
ఎదురు చూస్తున్నాయో
ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరేమిరా..?
మీ రంతా చలిచీమల్లా
ఏకమై ఐక్యమై...చిరుత పులులై
ఒంట్లో ఓపికున్నంతవరకు కాదు కాదు బొందిలోప్రాణమున్నంతవరకు...
పోరాడాలిరా..! పోరాడాలిరా..!
మీ కోసమే కాదు...రేపటి
మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం...
అంబేద్కర్ ఆశయ సాధన కోసం...
ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు..?
ఇప్పుడు గొంతెత్తి మీ నిరసనను వినిపించకపోతే...ఇంకెప్పుడు..?
ఇప్పుడు ప్రతిఘటించకపోతే ఇంకెప్పుడు?
ఇప్పుడు పోరాడకపోతే ఇంకెప్పుడు..?
ఇప్పుడు శతృమూకల్ని ఎదిరించకపోతే?
ఇప్పుడు వారి గుండెల్లో నిదురించకపోతే?
గుండెల్లో గునపాలు దించకపోతే...?
గుణపాఠాలు నేర్పించకపోతే ఇంకెప్పుడు?
ఎదిరించండి..? బెదిరించండి..?
అంబేద్కర్ అందించిన ఓటునే
వజ్రాయుధంగా ధరించండి రక్తపాతమో..?
రాజ్యాధికారమో? తక్షణమే తేల్చుకోండి..?
పోరాడితే పోయేదేముంది చెప్పండి..?
మీ సంకెళ్ళు...
తెగిపోవడం తప్ప..!
మీ సమస్యలు...
పరిష్కారమైపోవడం తప్ప.!
తరతరాల బానిసత్వం నుండి
మీకు విముక్తి..! విశ్రాంతి తప్ప..!
4. ప్రశ్నించు...ప్రతిఘటించు..?
నేడు అడగని ప్రశ్న...
రేపు సమాధి ఔతుంది..!
నేడు ఆర్పని సమస్య...
రేపు అగ్నిగుండమౌతుంది..!
నేడు గొంతెత్తకపోతే...?
రేపు నిరసన నిప్పై దహించదు..!
నేడు ప్రశ్నించకపోతే..?
రేపు ఆ ప్రశ్న మౌనమౌతుంది
నేడు ప్రతిఘటించకపోతే..?
రేపు ప్రగతి ఎక్కడిది..?
విముక్తి ఎక్కడిది..?
వికాసమెక్కడిది..?
పిడుగులు పడుతున్నా…
సునామిలా ముంచుకొస్తున్నా
ఇంకా ఎంతకాలం ఈ మొద్దు నిద్ర..?
మీ పిల్లల బంగారు భవిష్యత్తును
దగ్ధంచేసే దాగాకోరుల్ని
నవ్వే నక్కల్ని నయవంచకుల్ని
ఒక్కసారి కన్నులారా చూడండి..
ఓటును...
వజ్రాయుధంలా సంధించండి..!
అంబేద్కర్ కన్న కలలపై
విరిసే విప్లవంగా మారండి..!
పోరాడండి..! మీ కోసం కాదు కాదు
మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం..!
రచన:
కవి రత్న
సహస్ర కవి భూషణ్
పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్






































Comments
Post a Comment