పల్లవి:
ఎవరు హిందువు..?
ఎవరు క్రిస్టియన్..?
ఎవరు ముస్లిం..?ఎవరు సిక్కు..?
స్వేచ్ఛగా జీవించుట
కాదా మన జన్మహక్కు..?||ఎవరు||
చరణం...1
మతము మతము అంటూ
మారణ హోమాలు ఏల..?
మతం ఒక పిచ్చి మొక్క కాదా..?
పెరగనివ్వకు పెరగనివ్వకు
సోదరా...పెరటిలో ||ఎవరు||
కులము కులము అంటూ
కుమ్ములాట లేల..?
కులము ఒక గజ్జి కుక్క కాదా
తిరగనివ్వకు తిరగనివ్వకు
సోదరా... వీధిలో ||ఎవరు||
చరణం...2
కులం ఒక కుళ్ళు కాదా...?
మతం ఒక ముళ్ళు కాదా..?
నిన్న మతం ఒక మత్తుమందు కాదా..?
నేడు ఆ పేరెత్తితేనే రక్తము చిందుకాదా..?
కాలి కూలిపోవాలి కులమత కుడ్యాలు...
జగతికి ప్రగతికి ఇవి కావా జాడ్యాలు...
||ఎవరు||
చరణం...2
రాముడు కోరునా రక్తాభిషేకం లేదు లేదే...
అల్లా కోరునా అల్లకల్లోలం లేదు లేదే...
క్రీస్తు కోరునా కిరాతకం లేదు లేదే...
కులము మృగమును కూల్చివేసిన...
మతోన్మాదమును మంట కలిపిన...
మదిలో మానవత్వమే పొంగిపొరలదా..?
మహిలో మతసామరస్యమే వర్ధిల్లదా...?
||ఎవరు||
రచన:
పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్


Comments
Post a Comment