(బంటిని నమ్మిన భార్గవి)...
మొన్న అమృత ప్రణయ్...
నేడు మాల బంటి భార్గవి...
"కులాంతర ప్రేమ" అనగానే
అగ్నిజ్వాలలా ఎగిసిపడుతూ
కనుమూసి తెరిచే లోపే
బూడిదచేసే కుల అగ్నిహోత్రం
ఇంకా మండుతూనే ఉంది..!
కులహీనున్ని ప్రేమించిందని...
కుటుంబ పరువు కాల్చేసిందని...
పరువు గంగలో ముంచేసిందని...
మూగ ప్రేమకు...
మూడు ముళ్లకు...
దహన సంస్కారం జరిపారు..!
కసి నిండిన కులవృశ్చికాలై
దుర్బుద్ధితో విషం వర్షించారు..!
చాటుమాటుగా కాటేశారు...కులసర్పాలై.!
కన్నతల్లి కడుపులో దాగిన
కన్న తండ్రి గుండెల మీద
ఊయల లూగిన భార్గవి
తన మనసుకు నచ్చాడని
మాల బంటీని మనువాడితే
ఆత్మీయతలను మరిచి
పుట్టలో పాముల్లా పగబట్టి
కులదురహంకారంతో బుసలుకొట్టి
"బంటిని నమ్మిన భార్గవిని"...నవ్వుతూ
నరకంలోకి నెట్టారు...నరరూప రాక్షసులై.
కుటుంబమంతాఏకమై కత్తులు దూసి
కిరాయి గుండాలతోపగాప్రతీకారాలతో
ప్రాణానికి ప్రాణమైన తన "బంటీని బలి"
తీసుకున్నారు అతి కిరాతకంగా చంపి...
అమ్మమ్మ...అన్నలు...అమ్మానాన్నలు
ప్రేమలేని పశువులై...! మానవమృగాలై..!
ఇది అత్తమీద కోపం
దుత్త మీద చూపడమే..!
నేడు కసితో చంపింది
కులంలేని కూతురు భర్తనే...
రేపు జీవితాంతం ప్రత్యక్ష నరకం
అనుభవించేది తమ కన్నకూతురే..!
"కులాంతర వివాహాలు"...
"సహపంక్తి భోజనాలు"...
కుల నిర్మూలనకు
శాశ్వత పరిష్కారాలని...
అమరజీవి అంబేద్కర్ ఆత్మ
ఇంకా "కుల అగ్నిగుండంలో "...
కాలి భస్మమౌపోతూనే ఉంది..!
కత్తులింకా నూరుతున్నారు...
పరువు దహన సంస్కారానికి
సిద్ధమవుతున్నారు..!
కన్నబిడ్డ ప్రేమిస్తే కాళ్ళుకడిగి
కన్యాదానం చేసే కన్నతండ్రి
కత్తివేటు వేస్తున్నారు..!
కన్నతల్లి పాలిచ్చిన
పెదాలపై విషం రాస్తున్నారు..!
కూతురు మెళ్ళో మెరిసే
మంగళసూత్రాన్ని త్రెంచేసి
వివాహితను విధవరాల్ని చేస్తున్నారు..!
పరువు హత్యల మంటల్లో చిక్కి
ముగిసే యువ జంటల...
మూగప్రేమకు గుళ్లో మూడుముళ్లకి
ముహూర్తాలెప్పుడూ...రక్తసిక్తతమే..!
పోలయ్య కవి,
కూకట్లపల్లి, హైదరాబాద్
2. కులాంతర వివాహాల కుంపట్లు...?
మొన్న అమృత ప్రణయ్
నేడు మాల బంటి భార్గవి
కులాంతర వివాహపు
అగ్నిజ్వాలలకు ఆహుతైపోయే...
కులం తక్కువ వానితో
కులాంతర వివాహమని...
కుటుంబ పరువు తీసిందని...
పరువు గంగలో కలిపిందని..
కసి బట్టి బుసలు కొట్టారు
చాటు మాటుగా
కాటు వేశారు...కులసర్పాలై...
కన్న కూతురు జీవితాన్ని
బుగ్గిపాలు చేశారు...బుద్దిహీనులై...
నవ్వుతూ నరకంలో
త్రోశారు...నరరూప రాక్షసులై...
కుటుంబమంతా
కుట్రలు పన్ని
పగా ప్రతీకారాలతో
కిరాయి గుండాలతో
పరువు హత్యకూ
పాల్పడ్డారు అమ్మమ్మ
అన్నలు అమ్మానాన్నలు
పచ్చగడ్డి మేసే పశువులై...
సహపంక్తి భోజనాలే
కులాంతర వివాహాలే
కులనిర్మూలనకు చక్కని
పరిష్కారమార్గాలని..
కలలెన్నో కన్నారు
అమరజీవి అంబేద్కర్
కాని పరువు హత్యలకు
కసితో కత్తులు నూరుతున్నారు
నవదంపతుల తలల నరికేస్తున్నారు
నిర్ధాక్షిణ్యంగా యువజంటల పచ్చని
జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు
వెంటపడి వేటాడుతున్నారు...వేటగాళ్ళై...
కన్న కూతురన్న
కనికరం జాలిలేక
విషం గ్రక్కుతున్నారు...
అమ్మా నాన్నలే కూతురు
మంగళసూత్రాలను తెంచి
వివాహితను విధవరాలిని చేస్తున్నారు...
మానవత్వమే లేని...మానవ మృగాలై...
ఇకనైనా ఈ కంప్యూటర్
యుగంలోనైనా...
మారాలి మారాలి...
మనుషుల తత్త్వం మారాలి
కూలాలి కూలాలి...
కులం అడ్డుగోడలు కూలాలి
వేయాలి వేయాలి...
నవ సమాజ నిర్మాణానికి
పునాదులు వేయాలి...
మంచితనం మానవత్వం...
సమానత్వం సౌభ్రాతృత్వం...
ప్రతి మనిషి గుండెల్లో
గంగాగోదారిలా పొంగిపొర్లాలి
రచన:
"కవిరత్న"
"సహస్రకవి భూషణ్"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
3. కుల పిశాచులు...!
అయ్యో…అయ్యో…
ఎక్కడ మోసపోయావమ్మా...
మా బంగారు తల్లి భార్గవి..?
నీ నమ్మకం
నీ విశ్వాసం
నీ అమాయకత్వం కన్న…
నీ ప్రేమే మిన్న...
అది పునీతం…నవనీతం
కానీ ఆ కులపిశాచాలు
నీ ప్రేమకు సంకెళ్ళువేశాయి...
నీ పసినవ్వును మసిచేశాయి...
నీ పచ్చని కాపురంలో
ఆరని చిచ్చును రేపాయి...
అమృత ప్రణయ్ ల
కన్నీటి గాథను మరిచావా...?
పరువు హత్య పేర
ప్రణయ్ ప్రాణం తీశారన్న వేదన
నీ గుండెల్లో మెరుపై మెరవలేదా..?
నీకా విషాదగీతం వినిపించలేదా..?
ఏ ప్రమాద ఘంటికలు మ్రోగలేదా..?
బంటిని ప్రేమించినదానికి శిక్షగా
కులరాక్షసులు కసితో కక్షతో
విసిరే విషపు వలలనెందుకు
పసిగట్టలేకపోయావమ్మా..? నీ
ఇంటిచుట్టూ తిరిగే ఆ నయవంచకులపై
నీమదిలో సందేహమెందుకు పుట్టలేదమ్మా
పరువు పేరిట ఈ బీభత్సం ఈ రక్తపాతం
నీ మనసును మాల బంటికిచ్చినందుకా..?
నీ ప్రియుడిపై వారు కత్తి దూసిన వేళ
నీ మనసు మూగబోయిందా..?
కులంముందు నీ ప్రేమ చిన్నబోయిందా...?
బంటీ నీ గుండెలో మండే సూర్యుడే ..! అసమానతలపై...అఘాయిత్యాలపై
ఈ కులరక్కసిపై నడుం కట్టి పోరాడు...
నీ ప్రేమే నీకు ధైర్యం…
నీ న్యాయమే నీ ఆయుధం..!
నీ కంటిచూపుతో కులరక్కసిని కూల్చెయ్
రేపటి సమాజానికి నీవొక దిక్చూవికావాలి
నీ పోరాటం మరో అమృతను రక్షించాలి
నీ ఈ గుండెపోటు మరెవరికి రారాదు..!
భార్గవీ ఇంకా భయమెందుకు …?
సాహసంతో సాగిపో ముందుకు...
మీ ఆత్మీయ బంధం సజీవమే...
నీ బంటి నీ గుండెల్లో ఆరని వెలుగే…
నీ పోరాటంలో వజ్రయుధమే...
నీ మోములో చెరగని చిరునవ్వే...!
ప్రేమకు కులమేంటి..?
నీది న్యాయపోరాటం..!
నీది ధైర్యపు జయగీతం..!
నీ హృదయమే దేవాలయం..!.
నీ బంటియే నీకు భగవంతుడు..!
4. మా బంగారు తల్లి భార్గవి..? (1)
అయ్యో అయ్యో...
ఎక్కడ మోసపోయావమ్మా..?
మా బంగారు తల్లి భార్గవి..!
నాడు అమృతకు
జరిగిన అన్యాయాన్ని
ఆమె కన్నీటి గాథను
ప్రేమించిన ప్రణయ్ ని
కన్నతండ్రి కత్తులతో నరికిస్తే
కళ్ళముందే భర్త రక్తపుమడుగులో
గిలగిలలాడే...ఆవిషాదపు వేళ...
నాడు అమృత
అనుభవించిన
ఆ మానసిక క్షోభను
ఎలా మరిచావమ్మా...
మా బంగారు తల్లి భార్గవి..?
తక్కువ కులం
మాలోన్ని మనువాడావని
నీ కుటుంబ సభ్యులంతా
కోపంతో రగిలిపోతూ
నిన్నేదో మాయచేసి
మత్తులో ముంచేసి
వల్లో వేసుకున్నాడని...
గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడని...
మీ కుటుంబ పరువు తీశాడని...
మాలబంటికి మనసిచ్చానని...
చావనైనా బ్రతుకైనా బంటితోనేనని
కులం కాదు ముఖ్యం గుణమంటూ
గుళ్ళో మూడు ముళ్లు వేయించుకుని
కళ్ళముందే ఊరిలో కాపురం పెడితే..?
కసితో పగతో రగిలిపోయే
రక్తం త్రాగే ఆ రాక్షసులు
నీ "బంటిని బలి" తీసుకోరని
ఎలా భావించావమ్మా...
మా బంగారు తల్లి భార్గవి...?
పగా ప్రతీకారాలతో...
కిరాయి గుండాలతో...
బంటిని బ్రతక నివ్వమని
కత్తులతో నరికిచంపాలని
రాత్రింబవళ్ళు రాక్షసులు
నీ ఇంటిచుట్టే తిరుగుతువుంటే
ఇంతటి ప్రమాదాన్నెందుకు
పసికట్టలేక పోయావమ్మా...
మా బంగారు తల్లి భార్గవి..?
మా బంగారు తల్లి భార్గవి..? (2)
నీ మీద ప్రేమతో కోపంతో
బంటి మీద కసితో కక్షతో
కడుపులో కత్తులుంచుకొని
కౌగలించుకునే
ఆ నయవంచకుల
నెందుకునమ్మావమ్మా...
మా బంగారు తల్లి భార్గవి..??
అసమానతలపై
కులనిర్మూలనకై
నడుంకట్టి పోరాడే
అంబేద్కర్ అభిమానులంతా
నీ న్యాయమైన పోరాటంలో
నీకండగా ఉంటారమ్మా...
ధైర్యమే ఆయుధంగా సాగిపో
బంటీని గుర్తుచేసుకో భయపడకు...
నీది న్యాయమైన కులపోరాటం
విజయం నీదే సభ్య సమాజం నీ వెనుకే
నీ బంటీనీ బలితీసుకున్న ఆ
మానవ మృగాలను ఉరితీసేంతవరకు
మహిళా సంఘాల మద్దతుతో
చెయ్ న్యాయపోరాటం చెయ్...
మొండి ధైర్యంతో...సాగిపోముందుకు
కుల దురహంకారంతో విర్రవీగే
విషపురుగులకు కనువిప్పు
కలిగించే వీరనారివి నీవేనమ్మా...
మా బంగారు తల్లి భార్గవి..?
సమాజంలో సమతా మమతలకు
దీపస్థంభానివి నీవేనమ్మా...
నేటి రక్త చరిత్రకు చిరునామా
రేపటి నవ సమాజ నిర్మాణానికి
పునాది రాయివి నీవేనమ్మా...
దిక్కులేని ఈ దీనజనులకు
రేపు దిక్కు నీవే దిక్సూచివి నీవేనమ్మా...
మా బంగారు తల్లి భార్గవి..?
నేడు నీ కళ్ళల్లోని ఆ రక్తకన్నీరు
రేపు ఆనంద బాష్పాలుగా
మారును గాక..!
బంటి పవిత్రాత్మకు
శాంతి కలుగును గాక..!
బంటి పవిత్ర ప్రేమ నిత్యం
నీగుండెల్లో ఆరనిదీపమై వెలుగును గాక..!
5. ధైర్యమే నీ ఆయుధం భార్గవి..!
కలలు కనడం నీ నేరమా..?
ప్రేమించడం నీ పాపమా...?
కులం ముందు ప్రేమ చిన్నదా..?
మానవత్వం కన్నా కులం గొప్పదా..?
కులమే జీవితమా..? కాదే...
కులమే మారణహోమానికి కారణమైతే..?
ధైర్యమే నీ ఆయుధం కావాలి భార్గవి..!
నీ గుండె గొంతు తెరిచింది...
ప్రేగులు తెగేలా...అరిచింది...
నీ కన్నీటిలో నిప్పులున్నాయి...
అయినా భయపడకు భార్గవి...
నిర్భయంగా
నిప్పులా మండుతూ...నీతిగా ఉండు
నీది స్వచ్చమైన ప్రేమ అదే నీ ఊపిరి..!
నీ జీవితం నీది...
నీ ప్రయాణం నీది...
నేడు నీవు ఒంటరివైనా
బంటి స్మృతులే నీకు...
తోడునీడ కొండంత అండ..!
గాలివానలో
హోరు గాలిలో
కొమ్మలు విరిగినా
చెట్టు ఒరిగిపోరాదు
విధి విషం చిమ్మినా విడదీసినా
నీ మది రాయిలా గట్టిగా ఉండాలి
నీ ఆశలు విలవిలలాడకూడదు..!
నువ్వు వెనకడుగు వేయకు...
నీ అడుగులు అగ్ని జ్వాలలవ్వాలి
నీ బంటీకి మాటివ్వు భార్గవి...
బంటి రక్తాన్ని రుచి చూసిన ఆ
చిరుత పులుల్తో పోరాడుతానని...
ఇంకే జంటకు ఇలా జరగకూడదని..!
నీ అడుగులే మార్గదర్శనం...
నీ పోరాటం కొత్త వెలుగు...
నీ ప్రేమ మరో ప్రేమకు జీవం..!
నీ పోరాటమే విజయ గీతం...
నీ పోరాటం చీకటిని చీల్చాలి...
నీ నడక సమాజానికి గుణపాఠం..!
స్వచ్ఛమైన...
నిస్వార్ధమైన...
నిష్కల్మషమైన...
నీ ప్రేమకు ఓటమి లేదు...
నీ గుండె బలానికి...
నీ మొండి ధైర్యానికి...
కులమతాలకతీతమైన
నీ అభ్యుదయ భావాలకు...
చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాం
మా బంగారు తల్లి భార్గవీ
6. కట్టుకున్నోడే కాలయముడైతే..?
గురుమూర్తి
మాజీ సైనికుడే కానీ
అర్థాంగిని పొట్టన
పెట్టుకున్న
పరమ కిరాతకుడు...
కనిపించే కాలయముడు...
కట్టుకున్న భార్యను
మట్టు పెట్టిన
మానవత్వం లేని
మానవ మృగం...
13 ఏళ్ళు కాపురం
చేసిన భార్యను కసితో
కక్షతో పగతో ద్వేషంతో
కాటేసిన కాలసర్పం...
పుట్టిన బిడ్డలకు కన్నతల్లిని
దూరం చేసిన...కసాయివాడు...
వాడు కరుణ జాలి
పశ్చాత్తాపం లేని పశువు...
వాడు మొగుడు కాదు మొసలి...
బిడ్డల బంగారు బ్రతుకుల్ని
బుగ్గిపాలు చేసిన పాపాత్ముడు...
పరమ పాపాత్ముడు
దుర్మార్గుడు దుష్టుడు...
వాడు రాముడు కాదు
రక్తం త్రాగే రాక్షసుడు...
కట్టుకున్న భార్యను
క్రూరంగా...అతి క్రూరంగా...
కిరాతకంగా...పరమ కిరాతకంగా
దారుణంగా...అత్యంత దారుణంగా...
హత్య చేసి శవాన్ని
ముక్కలు ముక్కలుగా నరికి...
ప్రెజర్ కుక్కర్లో ఉడకపెట్టి...
వాటర్ హీటర్ లో కాల్చి...
బూడిద చేసి చెరువులో
నిమజ్జనం చేసిన నీచుడు...
పరమ నీచుడు...గురుమూర్తి...
ఇట్టి "ఉన్మాదిని" ఉరితీయడం ఉత్తమమే...
7. మనిషి కాదు మానవ మృగం...
అగ్నిసాక్షిగా
వివాహమాడి
ఏ ఆపద వచ్చినా
జీవితాంతం నీకు తోడునీడగా
కొండంత అండగా ఉంటానని...
పులి మన మీదికి దూకినా
దానికి నేనే ఆహారమౌతానని...
మృత్యువును ముద్దాడుతానని...
చితిలోసైతం నీకు తోడుంటానని...
13 సంవత్సరాల క్రితం
అమ్మానాన్నలు...
అత్తామామలు...
బంధుమిత్రాదులు...
శతమానం భవతీ
భార్యా భర్తలిద్దరూ
చిలకా గోరింకల్లా చిరకాలం
కళకళలాడాలని ఆశీర్వదించిన
అతిథుల పూజారి సమక్షంలో...
అందరిలో...
పెళ్ళి పందిరిలో...
మూడు ముళ్లు వేసి
ఏడడుగులు నడిచి
పదిమందిలో ప్రమాణం చేసి
ప్రగల్భాలెన్నో పలికి
నేడు అతికిరాతకంగా ప్రాణాలు
తీసిన పరమ రాక్షసుడు...
ముమ్మాటికి ఉరిశిక్షకు అర్హుడు...
రచన:
కవి రత్న
సహస్ర కవి భూషణ్
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502



















































Comments
Post a Comment