32 బైబిల్ కవితలు...

 32. బైబిల్ కవితల ఇండెక్స్...

1. క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు...
2. ప్రభువైన యేసుక్రీస్తు సంక్షిప్త జీవితచరిత్ర
3. క్రిస్మస్ శుభాకాంక్షలతో...
    యేసుక్రీస్తు శుభసందేశాలు..
4. క్రిస్మస్ పండుగ..!!! 
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)
5. ఆకాశంలో ఆరనిజ్యోతి..!
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత
6. క్రిస్మస్ ట్రీ అంటే....
7. క్రీస్తు అంటే...?
8. పరమపావనం...క్రిస్మస్ పర్వదినం
9. ప్రేమించే ప్రేమమయుడు
10. పరిశుద్ధ వివాహం..! 
      పెళ్లినాటి ప్రమాణాలు..!!
11. కుటుంబ ప్రార్ధన...
12. మారని మనిషికి మరణమే శిక్ష...
13. కన్నీటి ప్రార్థన....
14. అడుగు - వెదుకు - తట్టు
15. ఆగదు ఆగదు నా పరుగు
      ఆగదు ఆగదు నా ప్రయాణం
16. మృత్యుంజయుడే..!
17. దీపావళిచ్చే దివ్యమైన సందేశం...?
18. ఓ దైవమా ! మమ్ము క్షమించుమా !
19. అభిషిక్తుని అమరత్వం...!
20. ఎంతటి దారుణం...!
       ఆ క్రీస్తు శిలువ మరణం...!!
21. నరరూపుడా! నరరూపుడా!
22. క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు
23. పరిశుద్ధ వివాహం? 
       ఒకముడి అక్కడ! 
       మూడుముళ్ళిక్కడ!! 
24. దైవ మందిరం - నిత్య సుందరం 
25. నేనొక గొర్రెల కాపరిని..!
26. ప్రత్యేక ప్రార్థన...
27. అనుదిన కుటుంబ ప్రార్థన
28. 2+7+3="12" = పరిశుద్ధ వివాహం
29. ప్రభు ప్రార్థన... 
30. ముళ్ళకిరీటధారీ..!
       మృత్యుంజయుడు..!!
31. ఆ దేవదేవుడు 
32. బంగారు బైబిల్ గనిలో...

1. క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు...

మిత్రులారా..! మీకోసం 
ఈ క్రిస్మస్ పర్వదినాన నేను 
ఆ కరుణామయున్ని కోరేదొక్కటే...

ఆ ప్రభువు యొక్క ఆపార 
కృపా కరుణా కటాక్ష వీక్షణాలు...

దయా దాక్షిణ్యాలు... 
ప్రేమాభిమానాలు...
శాంతి సమాధానాలు...
మీపై మీ కుటుంబసభ్యులపై 
కుంభవర్షమై కురియును గాక..!
 
సకల శుభములు 
మీకు కలుగును గాక..!
కలనైనా ఊహించని రీతిలో 
మీరు ఆశ్చర్యచకితులయ్యేలా...
ఇరుగుపొరుగు వారు ఈర్ష్య పడేలా... 

మీరు...ఆయురారోగ్యాలతో...
భోగభాగ్యాలతో...అష్టైశ్వర్యాలతో...

అనునిత్యం...
మీ ముఖాన...చెరగని చిరునవ్వులతో... 
మీ ఎదలో......కరగని సుఖశాంతులతో... 
మీ ఇంట........తరగని సిరిసంపదలతో...

మీరు మీ పిల్లాపాపలతో 
హాయిగా...ఆనందంగా...సంతోషంగా...
ఎంతో ప్రశాంతంగా...జీవించెదరుగాక..! 
నిండూనూరేళ్లు...చల్లగా వర్ధిల్లెదరుగాక..!

(అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో)

2. ప్రభువైన యేసుక్రీస్తు సంక్షిప్త జీవితచరిత్ర 
(క్రిస్మస్ సందర్భంగా.......శుభాకాంక్షలతో)

ఆదియందు వాక్యముండెను 
వాక్యము దేవుని వద్ద ఉండెను 
వాక్యము దేవుడై ఉండెను 
ఆ వాక్యము అబ్రాహాము కంటే 
ముందే ఉండెను... అన్నది
పరిశుద్ధ గ్రంథలేఖనము..
"ఆ వాక్యమే"...
వృద్ధుడైన ఏసేపుకు 
ప్రధానం చేయబడి... 

కన్య మరియ గర్భాన 
పరిశుద్ధాత్మచే బెత్లెహేంలో 
నజరేతను ఊరిలో... 
ఒక చిన్న పశువులపాకలో 
శిశువుగా జన్మించే... 
మనుష్యకుమారుడిగా అవతరించె... 
యోహానుచేత యోర్దానునదిలో 
బాప్తీస్మం పొంది... 
పరిశుద్ధాత్మచే అభిషేకింపబడె...
ఆపై నలుబది దినములు 
అడవిలో అపవాదిచే శోధింపబడె...

కొండలు గుట్టలు ఎక్కిదిగి 
ఊరూరా తిరిగి తిరిగి "ఒక వైద్యునిలా"
ఎన్నెన్నో మొండిరోగాలను నయం చేసి 
ఎన్నెన్నో అద్భుతకార్యాలను 
నమ్మలేని సూచకక్రియలను చేసి 
యూదులలో కొందరికి 
"ఆరాధ్య దైవమాయె"...
"అధికారులకు కంటిలో కారమాయె"...
"రోమా సైనికులకు ప్రక్కలో బల్లెమాయె"...

ఒక "బోధకునిలా"
చక్కని బోధనలు చేసి 
నేనే సత్యము... 
నేనే మార్గము... 
నేనే జీవము...
నేనే ఒక మంచి గొర్రెలకాపరిని...
నేనే సకలజనుల పాపములను 
మోసుకొని పోవు గొర్రె పిల్లనంటూ...
నా ద్వారా తప్ప 
ఎవరు తండ్రి వద్దకు రాలేరంటూ...
నా దగ్గరికి వచ్చిన వారికి 
ఆకలి...దప్పిక లుండవని...

"రక్షణ పొందుదురని"
"చనిపోయినా తిరిగి" 
"మృతులలోనుండి పైకి లేచెదరని" 
నిత్యజీవానికి వారసులగుదురని... 
అందరి "పాపాలు" తాను శిలువపై 
చిందించిన "పరిశుద్ధ రక్తముతో " 
శుద్ధి చేయబడునని...
ఒకడు ఒక దేవాలయాన్ని పడగొట్టి 
తిరిగి మూడుదినములలో కట్టురీతిగా
తాను మరణించి మూడవ దినమున 
తిరిగి లేచెదనని ముదుంగానే ప్రకటించే...
 
నిజానికి తాను నిర్దోషినని...
ఏ పాపం ఎరుగని పరిశుద్ధుడనని...
ఐనా పాషాణులైన మతపెద్దల చేత 
లేని పోని నీలాపనిందలు మోపబడి... 
పొంతిపిలాతు ఎదర విచారణచేయబడి 
తనలో ఏదోషము లేకపోయినా...
తాను నేరము చేయకపోయినా... 
కక్షతో సిలువ శిక్ష వేయబడి...

మోయలేని సిలువను 
భుజాన మోపబడి... 
వీధిలో ఒక బందిపోటులా 
ఈడ్చుకొనిపోబడి... 
తలపై ముళ్ళకిరీటం పెట్టబడి...
పిడిగుద్దులు గుద్దుతూ 
కొరడాలతో వీపును చీరుస్తూ...
"నీవు యూదుల రాజువా" 
అంటూ అవహేళన చేయబడి...
కలువరిగిరి పైకి చేర్చబడి... 

ఇద్దరు దొంగల నడుమ
అరచేతుల్లో అరికాళ్లల్లో 
మరమేకులు దిగగొట్టబడి... 
వధకు తీసుకుని వచ్చిన 
గొర్రెపిల్లలా శిలువపై వ్రేలాడదీసి...
"నిజంగా నీవు దేవుడివైతే క్రిందికి దిగిరా"... 
అంటూ అవమానపరచబడి... 
ప్రక్కలో బల్లెంతో పొడవపడి... 
క్రూరంగా ఘోరంగా హింసింపబడినా...

"తండ్రి వీరేమి చేయుచున్నారో 
వీరికి తెలియదని" ప్రేమగా పలికే... 
ఆపై అతికిరాతంగా చంపబడిన క్రీస్తు... 
తన ఆత్మను తండ్రికి కందించి... 
మరణించి సమాధి చేయబడి... 
మూడవ దినమున
మృత్యుంజయుడైన లేచి... 
పరలోకానికి ఆరోహణమైపోయి... 
తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండె...

తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏకమైపోయిన 
ఆ "నిత్యసత్య సజీవవాక్యమే"..
అనంత శక్తి స్వరూపుడు... 
పరమపావనుడు...
పాపుల రక్షకుడు.. 
మృత్యుంజయుడు... 
కరుణామయుడు... 
ప్రేమామయుడు...
త్యాగధనుడైన... 
ప్రభువైన ఏసుక్రీస్తు... 
ఆయన జననం... 
సర్వలోకవాసులకు ఒక పర్వదినం... 

( క్రైస్తవ సోదర సోదరీమణులందరికి
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో.....)

3. క్రిస్మస్ శుభాకాంక్షలతో...
    యేసుక్రీస్తు శుభసందేశాలు..

బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథము
అది ప్రభువైన యేసుక్రీస్తు 
బోధనలతో నిండిన
ఒక బంగారు గని గుప్త నిధి 
అందులో నుండి వెలికి తీసిన 
కొన్ని "ఆణిముత్యాలు"...
కొన్ని "అమృతధారలు"...మీకోసం... 

కన్నవారిని పూజించవలె...
శతృవులను ద్వేషించరాదు...
నిన్నువలె నీ 
పొరుగువారిని ప్రేమించవలె...
రోగులకే వైద్యుడు అవసరం...

వెదుకుడి దొరుకును...
తట్టుడి తియ్యబడును..
అడుగుడి మీకియ్యబడును...
నమ్మువారి సమస్తము సాధ్యమే...
ఒకడు ఒక చెంపమీద 
కొడితే మరో చెంప తిప్పవలె...

రేపేమి జరుగునో మీకు తెలియదు
గనుక రేపటి గురించి చింతించవద్దు...
ముందు నీ 
కంటిలోని "దూలము" తీసుకో...
ఆపై నీ సహోదరుని కంటిలోని
"నలుసు" నీకు తేటగా కనిపిస్తుంది...

ధనవంతుడు పరలోక రాజ్యములో 
ప్రవేశించుట కంటే...
సూదిబెజ్జంలో ఒంటెదూరుట సులభం...
ఆత్మస్వరూపులకే...
పాపరహితులకే పరలోక రాజ్యప్రాప్తి.....

ఆ ప్రభువిచ్చిన 
ఈ శుభసందేశాలను
చెవులు గలవారు విందురుగాక !
ఆత్మశుద్ధి గలవారు ఆచరించెదరుగాక !
హృదయశుద్ది గలవారు గ్రహించెదరుగాక !

తెలిసి చేసిన తప్పులను
తెలియక చేసిన పాపాలను 
ఒప్పుకున్నవారు
మారుమనస్సును పొందినవారు
ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని  

ఆయన కలువరిగిరిపై 
తన పరిశుధ్ధరక్తాన్ని చిందించి 
శిలువవేయబడి మరణించి
సమాధి చేయబడి మృత్యుంజయుడై 
మూడవ దినాన లేచాడని... 
మృత్యువు ముల్లు విరిచాడని 
గాఢంగా నమ్మేవారు...
అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగివున్నవారు...

ఖచ్చితంగా పరలోకరాజ్యంలో ప్రవేశించెదరుగాక !
ప్రభువు కుడిపార్శ్వమున కూర్చుండెదరుగాక !
ఆకలిదప్పులు మృత్యుభయంలేని 
నిత్యజీవితాన్ని పొందెదరుగాక !

(క్రైస్తవ సోదరులందరికి 
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో)

4. క్రిస్మస్ పండుగ..!!! 
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)

రక్షకుడుదయించే రండో రండి...
అని దూత పిలవగానే పొదలోనుండి... 
చెంగు చెంగున దూకి చెంత కేగి...
పశువుల పాకలో ప్రభువును గాంచిన... 
...గొల్లలకే కాదు గొప్ప పండుగ..!

తార ఒకటి తూర్పున పొడిచి... 
దారిచూపగా ముందు నడిచి... 
అరుదెంచి అచ్చెరువొంది కానుకలతో
అభిషిక్తునికి అర్చన చేసిన జ్ఞానులు 
...ముగ్గురికే కాదు ఘనమైన పండుగ..! 

శరణంటే చేయి చాపి... 
రుగ్మతలను రూపుమాపి...
ముక్తిని ప్రసాదించునని మురిసిపోతూ ...
...భజనల్ చేసే భక్తులకేకాదు భలేపండుగ..!

ఆధ్యాత్మికంగా అంధులై...
చింతలకు చికాకులకు గురై... 
చిరుచీకటిలో చిందులు వేసే... 
...పాపులందరికీ ఇది పసందైన పండుగే...!

5. ఆకాశంలో ఆరనిజ్యోతి..!
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)

కక్షలతో... 
కార్పణ్యాలతో... 
కుట్రలతో... 
కుతంత్రాలతో... 

దారిదోపిళ్ళతో...
దారుణ హత్యలతో... 
శిలాపహరణాలతో... 
చిత్రహింసలతో... 

కులతత్వాలతో... 
కుమ్ములాటలతో... 
మతవిద్వేషాలతో... 
మారణహోమాలతో... 
మారణాయుధాలతో 

భీకరమైన యుద్దాలతో... 
భయంకరమైన
బాంబుదాడులతో... 
రాజ్య కాంక్షతో...
రక్తపాతాలతో...

మానవత్వం
మంటకలిసిపోతూ...
మలినమైపోతున్న 
తరుణాన..."మానవజాతి"... 

పరిశుద్ధాత్మ ఫలితంగా... 
పాపుల రక్షణే ధ్యేయంగా... 
ప్రపంచ ప్రక్షాళనే 
ప్రధాన లక్ష్యంగా... 

మరియ గర్భాన... 
మనుష్య రూపాన... 
అరుణారుణ రక్షణ 
కిరణాలను వెదజల్లుతూ... 
ఆవిర్భవించింది..."ఒక ఆరనిజ్యోతి"

6. క్రిస్మస్ ట్రీ అంటే....

నాడు..
ఏదేను తోటలో 
దైవం ఏర్పరచిన "జ్ఞానవృక్షం"
అందించిన పళ్ళను ఆరగించిన
ఆదాము అవ్వలకు జ్ఞానోదయమాయె

నాడు...
మోషే ధర్మశాస్త్రమను
"పరిశుద్ధ గ్రంథ వృక్షం" అందించిన
పది ఆజ్ఞల ఫలాలను ఆరగించిన
జనులందరి జన్మలు ధన్యమైపోయె

నేడు... 
క్రిస్మస్ ట్రీ అంటే....
అది ఒక "వరాల వృక్షం"
ప్రేమ...దయ...జాలి...కరుణ... 
కృప...శాంతి...సమాధానాలె...
దాని శాఖలు...కొమ్మలు రెమ్మలు

క్రిస్మస్ పర్వదినాన
ప్రతి క్రైస్తవకుటుంబం
క్రిస్మస్ ట్రీ ని ఇంటింటా 
ఏర్పాటు చేసుకుంటారు
ఎంతో అందంగా...
ఎంతో ఆకర్షణీయంగా... 
విద్యుత్ దీపాలతో...
అలంకరించుకుంటారు

దైవమందిరంలో
అందరి కలిసి 
ప్రార్థనలు చేసుకుంటారు
విలువైన బహుమతులను 
ఇచ్చిపుచ్చుకుంటారు
క్రిస్మస్ మరియు రాబోయే 
నూతన సంవత్సర 
శుభాకాంక్షల్ని తెలుపుకుంటారు
ఆపై రుచికరమైన పదార్థాలు 
ప్రేమతో ఇరుగుపొరుగుకు పంచి 
తాము ఆరగిస్తారు...ఆనందిస్తారు

7. క్రీస్తు అంటే...?

ఒక ప్రవక్త
ఒక వైద్యుడు
ఒక బోధకుడు

ఒక అభిషిక్తుడు
ఒక పరిశుద్ధుడు
ఒక త్యాగధనుడు

ఒక ప్రేమామయుడు
ఒక పాపుల రక్షకుడు
ఒక కరుణామయుడు

ఒక "మృత్యుంజయుడు"
ఒక మంచి "గొర్రెల కాపరి"
ఒక "మనుష్యకుమారుడు"

ఒక "దైవాంశ సంభూతుడు"
ఒక "మహిమా స్వరూపుడు"
దావీదు మహారాజు "వంశాంకురం"

యేసేపు మరియమ్మల "గర్భఫలం"
పాపులను చేపలను పట్టు "జాలరి"
ఆ "దేవుని అద్వితీయ కుమారుడు"

క్రీస్తు అంటే ఒక "రక్షణ దుర్గం"...
క్రీస్తు అంటే ఒక‌ "శాంతి మార్గం"...
క్రీస్తు అంటే క్రమాగుణానికి "ప్రతిరూపం"
క్రీస్తు అంటే ఎన్నటికీ ఆరని‌ ఒక "ఆత్మ‌దీపం"

(క్రైస్తవ సోదర సోదరీమణులందరికి
క్రిస్మస్ శుభాకాంక్షలు) 

8. పరమపావనం...క్రిస్మస్ పర్వదినం

కనిపించని కాలం
విభజింపబడింది
చీకటి వెలుగులుగా...

మనిషి జీవితం
విభజింపబడింది
జనన మరణాలుగా...

ప్రపంచంలో ఉనికిలో ఉన్న
క్యాలండర్ విభజింపబడింది
క్రీస్తుకు పూర్వం...క్రీస్తు తర్వాతగా...

నిజానికి వృద్ధుడైన యేసేపుకు
కన్య మరియకు పశువులపాకలో 
పరిశుద్ధాత్మచే మనుష్యకుమారుడుగా
క్రీస్తు జననం...ఒక వింత ఒక  విచిత్రం...

రోమా సామ్రాజ్యాధినేతల
అకృత్యాలను ప్రశ్నించి తన బోధనలతో
అమాయకపు ప్రజల్ని మేల్కొల్పినందుకు
ఏ పాపమెరుని పరమపావనుడిపై
ఏ నేరం చేయని నిర్దోషిపై నిందలు మోపి
తలపై ముళ్ళ కిరీటం పెట్టి...
కొరడాలతో దారుణంగా కొట్టి...
అరచేతుల్లో మరమేకులతో బహిరంగంగా...
శిలువ శిక్ష వేసి చిత్రహింసలకు గురిచేసిన
క్రీస్తు మరణం...ఒక వింత ఒక  విచిత్రం...

నిజానికి యేసుక్రీస్తు ఈ నేలపై
నడయాడిన కాలం అత్యంతస్వల్పం...
కానీ అది ఒక చారిత్రాత్మకం...కారణం
2000 సంవత్సరాల క్రితం
1400 సంవత్సరాలుగా
40 మంది ప్రవక్తలచే...ఏర్చి...కూర్చి...
ఎంతో శ్రమకోర్చి...లిఖించబడిన
అద్భుతమైన...అపురూపమైన
పవిత్రమైన బృహత్ గ్రంథం బైబిల్ "
"మతంలో మచ్చలుండవచ్చు"
కానీ "బైబిల్" మాత్రం స్వచ్ఛమైనది
ఆ బైబిల్ లోని క్రీస్తుబోధనలలోని
ప్రతిఅక్షరం ఒక "ఆణిముత్యమే"...
ప్రతివాక్యం ఒక "అమృతబింధువే"...
నేటికీ మతాలకతీతంగా సదా పఠనీయమే
శిరోధార్యమే...చిరస్మరణీయమే...

బైబిల్ లోని ప్రభువు బోధనలు
మనుషుల జీవితాల్నిమార్చే మంత్రాలు...
చేసిన పాపాలను కడిగి వేసి...
శాపాల నుండి విముక్తి కలిగించే..‌
పాపాంధకారాన్ని పారద్రోలే...
ఆరని దారి దీపాలు...ఆత్మీయ రూపాలు...
సుఖజీవనానికి పునాదులు...అందుకే
క్రీస్తుయేసు జననం క్రైస్తవులకు పర్వదినం

పాపుల కోసమే
ప్రాణాలర్పించిన ఆ యేసుక్రీస్తు
రాజులకు రాజు ప్రభువులకు 
ప్రభువు పరమపావనుడు ...
పాపుల రక్షకుడు
అభిషక్తుడు...అద్వితీయ కుమారుడు
మహిమాస్వరూపుడు...నరరూపదారుడు
చిత్రహింసలకు గురియై శిలువ శిక్షకు బలియై
మరణించిన మహనీయుడు...
మూడవదినాన లేచిన మృత్యుంజయుడు
అందుకే క్రీస్తు స్మరణ ప్రతివ్యక్తికి 
ఒక ప్రేరణ సుఖజీవనానికి 
ఒక సోపానం క్రీస్తు జననం

9. ప్రేమించే ప్రేమామయుడు..! 

ప్రేమించే 
ప్రేమామయుడు... 
కలువరి గిరిపై రక్తం 
చిందించిన లోకరక్షకుడు...
మన ఘోరమైన పాపాలను 
తన పరిశుద్ధ రక్తంతో కడిగి 
మనలను పాపవిముక్తులను
చేసిన ఆ విమోచన కర్త...
మేఘారూఢుడై వచ్చువేళ
ప్రతినేత్రము ఆయనను చూచును

అల్ఫాయు 
ఓమెగయు ఆయనే...
భూత భవిష్యత్ 
వర్తమాన కాలాలలో ఉండేది 
సర్వాధికారియైన ఆ ప్రభువే...
మహా తేజస్సుతో 
ప్రకాశించేది ఆ నీతిసూర్యుడే...

మరణము మరియు 
పాతాళలోకపు తాళపు చెవులు 
ఆయన స్వాధీనములోనే ఉన్నవి...

మొదటివాడు కడపటి వాడు 
నిత్యం జీవించువాడు ఆయనే... 

మృతుడైననేమి 
మూడవ దినమున 
మృత్యుంజయుడై లేచి
యుగయుగములు 
సజీవుడైయున్నాడు 

మృతులలోనుండి ఆది 
సంభూతుడుగా లేచినవాడు
భూపతులకు అధిపతియైన ప్రభువైన 
యేసుక్రీస్తు నుండి కృపా కరుణ కనికరం 
శాంతిసమాధానముల్ మీకు కలుగునుగాక.

10. పరిశుద్ధ వివాహం..! 
      పెళ్లినాటి ప్రమాణాలు..!!

Part - 1

భర్త ప్రమాణం:
ఓ నా ప్రియసఖీ !
నేడు నీ చేతికి తొడిగిన
ఈ బంగారు రింగుసాక్షిగా
నీ కాలికి పెట్టిన మెట్టెలసాక్షిగా
నీ మెళ్ళో కట్టిన తాళిబొట్టుసాక్షిగా నేటి నుండి
జీవితాంతం నీకు తోడుగా నీడగా ఉంటానని
నీ చేతిని విడనాడనని,
నిన్ను ఎన్నడు ఎడబాయనని,
నిస్సహాయస్థితిలో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి
ఎక్కడికీ ఎప్పుడూ పిరికిపందలా పారిపోనని
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈ మాటను తప్పనని
భర్తా అనే నేను భార్యా అనే నీకు
మనస్పూర్తిగా మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తునన్నాను

భార్య ప్రమాణం:
ఓ నా ప్రియుడా !
నేడు నా చేతికి తొడిగిన
ఈ బంగారు రింగుసాక్షిగా
నా కాలికి పెట్టిన మెట్టెలసాక్షిగా
నా మెళ్ళో కట్టిన తాళిబొట్టుసాక్షిగా నేటి నుండి
జీవితాంతం నీకు తోడుగా నీడగా ఉంటానని
నీ చేతిని విడనాడనని,
నిన్ను ఎన్నడు ఎడబాయనని,
నిస్సహాయస్థితిలో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి
ఎక్కడికీ ఎప్పుడూ పిరికిదానిలా పారిపోనని
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈ మాటను తప్పనని
భార్యా అనే నేను భార్తా అనే నీకు
మనస్పూర్తిగా ఈ మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తునన్నాను

Part - 2

భర్త ప్రమాణం:
ఓ నా ప్రియసఖీ!
నేటినుండి నీ మెళ్ళోతాళినై
నిత్యం నీకళ్ళకు
మిలమిలమెరుస్తూ కనిపిస్తానని
నీ గుండె చప్పుడునై నీకు వినిపిస్తానని
నీ సిగలో సిరిమల్లెనై నిన్ను మురిపిస్తానని
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈ మాటను తప్పనని
భర్తా అనే నేను భార్యా అనే నీకు
మనస్పూర్తిగా మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాను

భార్య ప్రమాణం:
ఓ నా ప్రియుడా !
నేటినుండి నీ మెళ్ళోహారాన్నై
నిత్యం నీ కళ్ళకు
మిలమిల మెరుస్తూ కనిపిస్తానని
నీ గుండె చప్పుడునై నీకు వినిపిస్తానని
నీ పెదవిపై చిరునవ్వునై నిన్ను మురిపిస్తానని
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈ మాటను తప్పనని
భార్యా అనే నేను భార్తా అనే నీకు
మనస్పూర్తిగా ఈ మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాను

Part - 3

భర్త ప్రమాణం:
ఓ నా ప్రియసఖీ !
ప్రపంచసుందరి ప్రక్కనే వున్నా
అందానికి ఆకర్షణకు నేబంధీని కానని
అంధుడనై పరస్ర్తీపొందుకోరనని
నీ చేయి ఎన్నడు విడనాడనని
మాటిస్తున్నాను

ఇచ్చిన ఈమాటను తప్పనని,
తల ప్రక్కకు తిప్పనని,
భర్తా అనే నేను భార్యా అనే నీకు
మనస్పూర్తిగా మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాను

భార్య ప్రమాణం:
ఓ నా ప్రియుడా !
చుక్కల్లో చంద్రుడు ప్రక్కనే వున్నా
అందానికి ఆకర్షణకు నేబంధీని కానని
అంధురాలనై పరపురుషుడి పొందుకోరనని
నీ చేయి ఎన్నడు విడనాడనని
మాటిస్తున్నాను

ఇచ్చిన ఈ మాటను తప్పనని,
తల ప్రక్కకు తిప్పనని,
భార్యా అనే నేను భర్తా అనే నీకు
మనస్పూర్తిగా ఈ మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాను

Part - 4

భర్త ప్రమాణం:
ఓ నా ప్రియసఖీ !
నీవు నాకు ఆ భగవంతుడు
ప్రసాధించిన ఒక బంగారు బహుమతివని
నిన్ను నా భాగస్వామిగానే తప్ప
ఒక బానిసగా చూడనని
నీ హక్కులనెప్పుడూ కాలరాయనని,
నీకు సంపూర్ణమైన స్వేచ్చనిస్తానని,
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈమాటను తప్పనని
భర్తా అనే నేను భార్యా అనే నీకు
మనస్పూర్తిగా మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాను

భార్య ప్రమాణం:
ఓ నా ప్రియుడా !
నీవు నాకు ఆ భగవంతుడు
ప్రసాధించిన ఒక బంగారు వరమని
నిన్ను నా భాగస్వామిగానే తప్ప
ఒక భారంగా చూడనని
నీ హక్కులనెప్పుడూ కాలరాయనని,
నీకు సంపూర్ణమైన స్వేచ్చనిస్తానని,
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈ మాటను తప్పనని
భార్యా అనే నేను భర్తా అనే నీకు
మనస్పూర్తిగా ఈ మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాను

Part - 5

భర్త ప్రమాణం:
ఓ నా ప్రియసఖీ !
నీ కష్టాలలో కన్నీళ్ళలో కంటికిరెప్పలా
నిన్ను కాపాడుకుంటానని
నీ కనుపాపనై నీ కంటికి వెలుగైవుంటానని
నీ బాధల్లో భయాల్లో బ్రతుకినంతకాలం
నీ నీడలా నీవెనుకే నేవెన్నంటివుంటానని
నీ ఆనందంలో అనారోగ్యంలో
నీకు కొండంత అండగా నేవుంటానని
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈమాటను తప్పనని
భర్తా అనే నేను భార్యా అనే నీకు
మనస్పూర్తిగా మంగళసూత్రం సాక్షిగా 
నేడు ప్రమాణం చేస్తున్నాను

భార్య ప్రమాణం:
ఓ నా ప్రియుడా !
నీ కష్టాలలో కన్నీళ్ళలో కంటికిరెప్పలా
నిన్ను కాపాడుకుంటానని
నీ కనుపాపనై నీ కంటికి వెలుగైవుంటానని
నీ బాధల్లో భయాల్లో బ్రతుకినంతకాలం
నీ నీడలా నీ వెనుకే వెన్నంటివుంటానని
నీ ఆనందంలో అనారోగ్యంలో
నీకు కొండంత అండగా వుంటానని
సేవలు చేస్తానని మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈ మాటను తప్పనని
భార్యా అనే నేను భర్తా అనే నీకు
మనస్పూర్తిగా ఈ మంగళసూత్రం సాక్షిగా 
నేడు ప్రమాణం చేస్తున్నాను

Part - 6

భర్త ప్రమాణం:
ఓ నా ప్రియసఖీ !
నీవు నా రక్తంలో రక్తమని
నా పక్కటెముకలో ఎముకవని
నా మాంసంలో మాంసమని
నా ప్రాణంలో ప్రాణమని నా ఊపిరిలో ఊపిరివని
మరణించేంత వరకు నేను నిన్ను మరువనని
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈ మాటను తప్పనని
భర్తా అనే నేను భార్యా అనే నీకు 
మనస్పూర్తిగా మంగళసూత్రంసాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాను

ఇట్లు
ప్రేమతో నీ భర్త!
దివి నుండి దీవించునుగాక !
మన ఇద్దరిని ఆ సృష్టికర్త!!

భార్య ప్రమాణం:
ఓ నా ప్రియుడా !
నేను నీ పక్కటెముకలో ఎముకనని
నీ రక్తంలో రక్తమని
నీ మాంసంలో మాంసమని
నీ ప్రాణంలో ప్రాణమని నీ ఊపిరిలో ఊపిరినని
మరణించేంత వరకు నేను నిన్ను మరువనని
మాటిస్తున్నాను,

ఇచ్చిన ఈ మాటను తప్పనని
భార్యా అనే నేను భర్తా అనే నీకు 
మనస్పూర్తిగా ఈ మంగళసూత్రం సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాను

ఇట్లు
ప్రేమతో నీ భార్య!
దివినుండి మన ఇద్దరిని 
దాగివున్న ఆ దైవం !దీవించునుగాక !!

11. కుటుంబ ప్రార్ధన...

ఓ దేవా ! 
ప్రేమగల ఓ మా ప్రభువా ! 
పరిశుద్దుడా ! పరమాత్మ స్వరూపుడా ! 
కృపను కుమ్మరించే
కనికరంగల ఓ కరుణామయుడా !
చుట్టూ చీకట్లు అలముకొన్నా 
ట్యూబ్ లైట్ వెలుగుల మధ్య ఎలాగైతే  
మేము నిలుచున్నామో అలాగే
మా శత్రువైన సాతాను మాచుట్టే 
తిరుగుతూ మా పై విసిరే వలల్లో 
చేపపిల్లల్లా చిక్కుకుని మేము 
విలవిలలాడకుండా మా చుట్టూ 
రక్షణ కవచాన్నిఏర్పరచిన 
ఓ మా తండ్రీ ! 
మీకు స్తుతులు, స్తోత్రములు !

ఈ చల్లని 
సాయంకాల సమయంలో 
ఇక్కడ మేమందరం చేరి 
మిమ్ము ప్రార్ధిస్తున్నాము తండ్రీ ! 
నిబ్బరంగా వుండండి, 
ధైర్యంగా వుండండి 
భయపడకండి, 
మీ ప్రభువు 
మిమ్ము విడువడు, 
మిమ్ము మరువడు
అని సెలవిచ్చిన ఓమా తండ్రీ !
రెండు కాళ్ళులేని 
ఎక్కలేని వారిని సైతం 
ఎత్తైన కొండల్ని ఎక్కించే 
సర్వశక్తిగల ఓ మా తండ్రీ !
గతం కంటే రెట్టింపు ఘనతల్ని 
అందిస్తానని వాగ్దానం చేసిన ఓ మా తండ్రీ !

మీరు కట్టని పురాలను
మీరు నాటని తోటలను
మీకిచ్చేదనని మీ కుటుంబాలను 
విస్తారమైన పంటపోలాల వలె 
ఫలింపచేసెదనని  
పలికిన ఓ ప్రేమగల మా తండ్రీ ! 
ఒక తల్లి తనుకన్నబిడ్డను మరిచినా
మరుచునేమో కాని, నీను 
మాత్రం మిమ్మును మరువనని 
మాట ఇచ్చిన మహిమగల ఓ మా తండ్రీ !

ఒక ముత్యం
వాన చినుకుకై ఎదురుచూసినట్లు 
ఒక దుప్పి, వాననీటికై వెదకినట్లు
ఒక తప్పిపోయిన కుమారుడు 
తన తండ్రి ప్రేమకై తపించినట్లు
మా పాపాల కోసం
పరిశుద్దరక్తాన్నిచిందించిన మీ కోసం
మీ కుడిపార్శ్వాన కూర్చుండే లాగున
ఆగిపోక, అలసిపోక, సాగిపోయేలాగున
మీ సన్నిధివైపు మేము 
పరుగులు పెట్టులాగున 
మా ఆత్మలను ఆశీర్వదించండి తండ్రీ !   

మీ పరిశుద్దాత్మ ఆవరించి ఉన్న 
ఈ సన్నిధిలో ఇలా నిత్యం నిలిచి 
మిమ్ము పిలిచి జీవజల ధారలకన్న 
మధురమైన మీ వాక్యాన్ని 
మనసులో నింపుకొని
మిమ్ము ప్రార్ధిస్తున్నాము తండ్రీ !
మాచుట్టు అలముకొన్న 
ఈ గాడాంధకారాన్నితరిమివేసి
అనునిత్యం మా జీవితాలను 
వెలుగులోనికి నడిపించమని 
వేడుకుంటున్నాము తండ్రీ !

అడుగుడి మీకియ్యబడును
వెదకుడి మీకు దొరుకును
తట్టుడి మీకు తియ్యబడును
అని మీరు లేఖనములలో 
ప్రవచించిన ప్రకారం మేము 
అర్ధిస్తున్నాము ఆశతో మిమ్ము 
ప్రార్దిస్తున్నాము తండ్రీ !  
మహిమగల, మహాశక్తిగల ఓ మా తండ్రీ ! 

మీ అమృత హస్తములను చాచి
మీ కృపావరాలను మాపై
కుండపోతగా కురిపించమని
ఇక్కడ కూడిన ప్రతిఒక్క కుటుంబాన్ని 
చక్కగా దీవించమని
వీరికి ఎలాంటి ఇంటి బాధలు
ఈతి బాధలు, ఆర్ధిక వ్యధలు 
ఆరోగ్య సమస్యలు లేకుండ చూడండి.

వీరిని ఎల్లవేళలా 
ఒక కోడితన రెక్కలక్రింద 
తన పిల్లలను” కాపాడినట్లు 
“ఒక మంచి కాపరి తన 
గొర్రెల మందను 
తోడేల్లనుండి కాపాడినట్లు” 
తోడేలు లాంటి సైతాను
శోధనలనుండి, వేదనలనుండి
గొర్రేమందల వంటి మా అందరిని కాచి,
కాపాడి, రక్షించమని, నజరేయుడైన యేసుక్రీస్తు 
నామమున వేడుకుంటున్నాము తండ్రీ ! ఆమెన్ !

12. మారని మనిషికి మరణమే శిక్ష...

ఓ మనిషీ  ! 
నిన్ను నీ తల్లి 
గర్భంలో వేసిన 
నీకు ప్రాణం పోసిన
నీ సృష్టికర్తనే నీవు మరిచావు
నీ ఇష్టం వచ్చినట్లు,పిచ్చిపిచ్చిగా 
విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు
నా మాటలు వినడంలేదు
నన్ను లెక్క చెయ్యడంలేదు 
నన్నే ఎదురిస్తున్నావు
నాపై తిరుగుబాటు చేస్తున్నావు
నేనిచ్చిన పది ఆజ్ఞలలో 
ఏ ఒక్కటీ పాటించడం లేదు
ఎవరినో ప్రేమిస్తున్నావు
ఎవరినో ఆరాధిస్తున్నావు
ఎవరినో ఆశ్రయిస్తున్నావు
నన్ను అవమానిస్తున్నావు
నా శక్తిని శంకిస్తున్నావు
నాలో కోపాన్ని రగిలిస్తున్నావు
నీవు అధికారంతో, అహంకారంతో
ధనమదంతో విర్రవీగుతున్నావు
నేను సైగచేస్తే నీ శత్రువులు నిన్ను
కత్తులతో నరికేస్తారు నీప్రాణం తీసేస్తారు
నిన్ను సర్వనాశనం చేస్తారు
ఒక్కరాత్రిలో నీవు సర్వం కోల్పోతావు
నేను పిలిస్తే నీవు ఒట్టిచేతులతో రాక తప్పదు
నీవు జీవంలేని కట్టెవై కాటికెళ్ళక తప్పదు
కాలి బూడిదకాక తప్పదు, 
మట్టిలో మట్టైపోక తప్పదు
ఓ మనిషీ ఇకనైనా కళ్ళు తెరిచి చూడు
నీ దైవాన్ని దర్శించు 
ఆ దివ్య నామాన్ని స్మరించు
ఆయన సన్నధి చేరి
పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి
చేతులు జోడించి శిరస్సువంచి
కళ్ళుమూసి ప్రార్థించు
ప్రభువు పాదాలను తాకి, 
ప్రమాణం చెయ్, ప్రతిజ్ఞ చెయ్
ఓ దైవమా నన్ను క్షమించు 
నీవే నాకు దిక్కు నీవేనాకు రక్ష
ఇకపై నీకు విరుద్ధంగా జీవించిస్తే 
విధించు నాకు కఠినమైన శిలువ శిక్ష

13. కన్నీటి ప్రార్థన....

ఈ మనుషులు మొండిమనుషులు
కనులుండియు వీరు చూడకపోయిరి
చెవులుండియు వీరు వినకపోయిరి
మనసుండియు వీరు మారకపోయిరి
హృదయముండియు వీరు గ్రహించకపోయిరి

ఈ మనుషులు మొండిమనుషులు
ఆకలన్నవారికి ఆహారం పెట్టకపోయిరి
దాహమన్నవారికి నీళ్ళు పోయకపోయిరి
చలిగా వున్నదన్నవారికి బట్టలనివ్వకపోయిరి
అనారోగ్యంతో వున్నవారిని పలకరించకపోయిరి
నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించకపోయిరి

ఈ మనుషులు మహా మొండిమనుషులు
అడుగుడి మీకివ్వబడునన్న అడగకపోయిరి
వెదకుడి మీకు దొరుకునన్న వెదకక పోయిరి
తట్టుడి తలుపులు తీయబడున్న 
తలుపులు తట్టకపోయిరి
ప్రార్థించుడి ప్రభువును పూర్ణఆత్మతో 
ప్రార్థించకపోయిరి
నిరీక్షించుడి ప్రభువుకై రక్షణ దొరుకునన్న 
నిరీక్షంచకపోయిరి

ఈ మనుషులు పరమ మొండిమనుషులు
దైవసన్నిధికి వెళ్ళుడదే మీకు 
పెన్నిదన్న వెళ్ళకపోయిరి
వాక్యమును వినుడదే మీపాదాలకు 
వెలుగన్న వినకపోయిరి
బైబిల్ పఠించుడదే 
మీకాత్మీయాహారమన్న పఠించకపోయిరి
క్రీస్తును నమ్ముకొనుడాయనే 
మనరక్షకుడన్న నమ్మకపోయిరి
పాపాలనొప్పుకొన్న పరలోకరాజ్యమన్న 
ఒప్పుకొనకపోయిరి

ఈ కఠినహృదయుల కోసమే,
వారిలో పెనుమార్పుల కోసమే
మొరపెట్టవలే,ఆశతో అర్థించవలే, 
కన్నీటితో ప్రార్థించవలే.....

14. అడుగు - వెదుకు - తట్టు

అడుగు - అడుగు - అడుగు
అడుగుతూనే ఉండు 
నీవు అడిగింది నీవు తప్పక 
పొందుతావు నీవుపొందింది
నీవు అనుభవిస్తావు ఆనందిస్తావు

వెదుకు - వెదుకు - వెదుకు 
వెదుకుతూనే వుండు 
నీవు వెదికే ఆ నిధి నీదే 
నీకే దొరుకుతుంది నీకే దక్కుతుంది 

తట్టు - తట్టు - తట్టు 
తడుతూనేవుండు 
తట్టిన ప్రతితలుపు తెరువబడుతుంది 
ఆ గదిలో బంగారు గనులుండవచ్చు 
నీ బ్రతుకు బంగారుమయం కావచ్చు 

భయపడకు ఆ భగవంతుణ్ణి 
నిస్సందేహంగా, నిర్మొహమాటంగా 
ఇష్టపూర్వకంగా ప్రార్ధించు !
ప్రభువు నీ మొర ఆలకిస్తాడు ఆపై 
నీపై నిండుగా దీవెనలు కుమ్మరిస్తాడు 

15. ఆగదు ఆగదు నా పరుగు
      ఆగదు ఆగదు నా ప్రయాణం

ఓ విశ్వాసీ !
ఎక్కడికి నీ పరుగు ?
ఎక్కడి వరకు నీ ప్రయాణం ?
అక్కడి వరకు... 
అంటే, ఎక్కడి వరకు ?
కడవరకు
కలువరిగిరి వరకు
పరిశుద్ధుడు,రక్షకుడు
ప్రేమామయుడు, 
పరమ పావనుడని పిలువబడినా
ఏ పాపం ఎరుగకపోయినా
తిట్టబడిన, కౄరంగా
కొరడాలతో కొట్టబడిన
శిరస్సున 
ముళ్ళకిరీటం పెట్టబడిన
ప్రక్కలోబల్లెంతో పొడవబడిన
చిత్రహింసలకు గురిచేయబడిన
శిలువ వేయబడిన
గొర్రెపిల్లలా వధింపబడిన
సమాధి చేయబడిన
మూడవ దినాన 
మృత్యువును జయించి 
తిరిగి లేచిన నా తండ్రిని 
తిలకించే వరకు 
తిలకించి పులకించిపోయేంత వరకు
నా దైవాన్ని దర్శించేంతవరకు
కనులారగాంచి తరించేంత వరకు
ఆయన పరిశుద్దరక్తంతో నా 
సకల పాపాలన్నీ 
సంపూర్ణంగా కడగబడేంత వరకు
ఆయన కృప, ప్రేమ,కరుణ,జాలి
శాంతి, సమాధానాలు 
సదా నాపై కుండపోతగా
కుమ్మరించ బడేంత వరకు
శుభకరమైన 
సుందరమైన,సుఖవంతమైన 
నిత్యమైన,
సత్యమైన,స్వర్గతుల్యమైన,
ప్రశాంతకరమైన జీవితాన్ని నాకు
ప్రసాదించేంత వరకు
ప్రతినిత్యం ఆయన 
సన్నిధిలో నిలబడి
పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి
దివారాత్రములు ధ్యానించి
కన్నీటితో ప్రార్థనచేసి
రక్షణభాగ్యాన్ని పొందేంత వరకు
పరలోకరాజ్యాంలో ఆయన 
కుడిపార్శ్వాన కూర్చునేంత వరకు
*ఆగదు ఆగదు నా పరుగు*
*ఆగదు ఆగదు నా ప్రయాణం*
అయ్యో దైవమా? ఏమాయె మా ప్రార్ధనలు?

16. మృత్యుంజయుడే..!

మీ హృదయాలను
...శోధించువాడు
మీ జీవితాలను
...ప్రేమించువాడు

మీ తప్పులను
...సహించువాడు
మీ నేరాలను
...క్షమించువాడు

మీ అవసరాలను
...గ్రహించువాడు
మీ పాపకృత్యాలను
...దహించువాడు

మీ కోరికలను
...తీర్చువాడు
మీ బ్రతుకులను
...మార్చువాడు

ఆ లోకరక్షకుడే...
ఆ దయాసాగరుడే ...
ఆ కరుణామయుడే ...

ముళ్ళకిరీటం ధరించి
సిలువపై రక్తాన్ని చిందించి
కలువరిగిరిపై కన్నుమూసి
మరణించి మూడో దినాన
లేచిన ఆ మృత్యుంజయుడే...

17. దీపావళిచ్చే దివ్యమైన సందేశం...?

వీరమరణం 
పొందిన ఒక సైనికుడు 
ఉన్మాదులను...ఉగ్రవాదులను 
దుష్టులను...దురాక్రమణదారులను
సరిహద్దుల్లోనే మట్టు పెట్టినట్లు...
ఏర్పాటువాదులను ఏరివేసినట్లు... 

చిత్రహింసలకు
శిలువమరణానికి గురియైప
మరియ సుతుడు
కలువరి గిరిపైన కార్చిన 
తన పరిశుద్ధరక్తంతో 
ఎందరినో పాపవిముక్తుల్ని చేసినట్లు...

ఒక్క "చిరుదీపం"
"చిమ్మచీకట్లను" చీల్చివేస్తుంది
"వెన్నెలవెలుగుల్ని" విరజిమ్ముతుంది
ఇదే "దీపావళిచ్చే దివ్యమైన సందేశం"... 

18. ఓ దైవమా ! మమ్ము క్షమించుమా !

ఓ దైవమా ! మేము 
"దారం తెగిన" గాలిపటాలమై... 
చెట్టుకొమ్మల్లో వ్రేలాడుతున్నాము
"రెక్కలు విరిగిన" పక్షులమై...
వీధుల్లో విలపిస్తున్నాము

మురికి కూపాన మునిగి 
నలుగురిలో నవ్వుల పాలై  
చిత్రవధ ననుభవిస్తున్నాము 
చీకటిలో బ్రతుకుతున్నాము
వెన్నెల వెలుగుకోసం 
వెర్రిగా వెతుకుతున్నాము

అందుకే ఓ మా ప్రభువా!
మీ దివ్యమైన సన్నిధిచేరి
మీ పాదాలముందు ప్రణమిల్లి 
ఈ "వేదన" నుండి ఈ "రోదన" నుండి
ఈ "శాపం" నుండి "నరకకూపం" నుండి
ఈ "సైతాను శోధన" నుండి రక్షించమని
కన్నీళ్ళతో మేము అర్ధిస్తున్నాము తండ్రీ! 

మీ చల్లనికృపను
మాపై కుమ్మరించమని
మలినమంటిన...మత్తెక్కిన
మా "వక్ర బుద్ధిని" శుద్ధి చేయమని
మా"వంకరచూపుల్ని"సరిచేయమని

"చితికిన" మా బ్రతుకుల్ని 
చిగురింపచేయమని... 
మా "అక్రమసంబంధాలను" 
ముక్కలు చేయమని...
ముక్కలైపోయిన 
మా జీవితాలను చక్కదిద్దమని...

మా "కళ్ళలో కాంతిని"... 
మా "మనసులో శాంతిని" నింపమని...
చీకటికమ్మిన మా జీవితాలను 
వెలుగుమయం చేయమని...
"తెలిసి చేసిన తప్పులను" వేసిన 
"తప్పటడుగులను" మన్నించమని...
మమ్మల్ని శోధించి...వేధించి 
చిత్రహింసలకు గురిచేసేటి
ఆ సైతాను "విషకౌగిలినుండి" 
మాకు విముక్తిని ప్రసాధించమని...
బరువెక్కిన హృదయాలతో...
కన్నీటితో...వేడుకుంటున్నాము తండ్రీ...ఆమేన్...ఆమేన్...ఆమేన్

19. అభిషిక్తుని అమరత్వం...!

పేదలను ప్రేమించిన పాపాత్ముడు... 
దుర్భోధలు చేసిన దుర్మార్గుడు... 
లొంగిపోయెనని లోకరక్షకుడు... 
లోలోన పొంగిపోయెను ప్రతిరాక్షసుడు...

పాపాంధ కారాన్ని పారద్రోలడం...
రోగుల రుగ్మతలను రూపుమాపడం... 
లోకరక్షకునిలోని లోపాలనడం... 
జ్ఞానరాహిత్యానికి గొప్పతార్కాణం...

పాపమెరుగని పరమ పావనుడని... 
కోపం క్రోధం రాని కరుణామయుడని... 
దోషం ద్వేషం లేని దయాసముద్రుడని... 
దివి నుండి దిగి వచ్చిన 
దీనజన బాంధవుడని...

ఆయన హృదయం అనురాగ భరితమని... 
జాలె ఎదలో ప్రవహించు జలపాతమని... 
పేదలకు పంచెను ప్రేమామృతమని... 
సహనానికి శాంతికి క్రీస్తె సంకేతమని...

పరిపరి విధముల ప్రభువును 
ప్రశంసించిన పిమ్మట నిరపరాధియని...
పిలాతు నిరూపించెనట...

అంతట...కేకలేశారట 
కర్ణకఠోరంగ కాకుల్లాగ...
పరమ పవిత్రుడైన 
వరపుత్రున్ని వధించమని... 
వీడించారట పిలాతును పిశాచుల్లాగ...  
బందిపోటు బరబ్బాను బ్రతికించమని...

అల్లిపెట్టిరట తలపై ముళ్ళకిరీటం... 
పెల్లుబికెనట ప్రభువులో ఆరాటం... 
నిర్దోషిపై మోపిరట నీలాప నిందలు... 
గొల్లుమని నవ్వెనట గొర్రెల మందలు...

మరియసుతుని మేనుపైన 
కొరడాలు ఝలిపించిరట 
ఆ క్రూరులంత... 
కరుణగారె కరములందు 
మరమేకులు మొలిపించిరట 
ఆ మూర్కులంత...

పులినోట చిక్కిన లేడిలా 
అల్లాడి అల్లాడి అలమటించెనట... 
బలిపీఠమెక్కిన పశువులా 
వ్రేలాడి వ్రేలాడి విలపించెనట...

పరిహసించిరట ప్రక్కలో బల్లెంచెక్కి... 
వికటాట్టహాసం చేసిరట విషం వెళ్ళగ్రక్కి... 
చిత్రహింసలకు గురియాయెనట...
ప్రభువు సిలువపైకెక్కి... 
అసువుల నర్పించెనట 
ఆ పశువుల చేజిక్కి...

అశ్రుధారలు రాలుస్తు...
మృత్యువు కోరలు చీలుస్తు... 
ఆత్మను తండ్రికి అందిస్తు...
అందరిని క్షమించమని క్రీస్తు...
కమ్మగా పలికెనట 
కలువరిగిరిపై కళ్ళుమూస్తు...

అభిషిక్తుడు అస్తమించగానే 
అంధకారమలముకుందట...ఆకాశమంత 
ప్రభువు పవిత్రరుధిరం ప్రవహించగానె 
పకపక నవ్విందట...

కృంగెనట క్రీస్తు శిరస్సు... 
పొంగెనట శాంతి సరస్సు...
తరగిపోయెనట నరుల పాపతపస్సు... 
కరిగిపోయెనట యూదుల క్రూరమనస్సు... 
పిలిచిందట ప్రభువును సురలోక సదస్సు...

అందుకే....
అద్భుతం అద్భుతం... 
అభిషిక్తుని అమరత్వం...
ఔను ఔను...
ప్రభు యేసుపాదమె...
ఇక ప్రతి పాపికి శరణం....

(ఈస్టర్ పండుగ సందర్భంగా కవిత)....

20. ఎంతటి దారుణం...!
       ఆ క్రీస్తు శిలువ మరణం...!!

పార్టు...1

మన రక్షకుడు 
ప్రభువైన యేసుక్రీస్తు
చిన్నచిన్న ఊర్లెన్నో తిరిగి తిరిగి
కొండలు గుట్టలు ఎక్కిఎక్కి
నాటుపడవల్లో సముద్రాలను దాటి 
అనేక కష్టాలుపడి అనేక శ్రమలకోర్చి
అనేక ఉపమానాలతో అఙ్ఞానులకు
చక్కగా బోధించడం 
మంచి విఙ్ఞానాన్ని పంచడం 
రోగులెందరినో బాగుచెయ్యడం

పాపులందరిని తన 
పరిశుద్దరక్తంతో కడగడం 
ప్రభువు చేసిన గొప్ప నేరాలని
రోమ్ ప్రధానయాజకుల
అధికారుల అసత్య ఆరోపణలు
అందుకే క్రీస్తు చేయని నేరాలకు
సిలువపై తన పరిశుద్దరక్తాన్ని 
చిందించాల్సి వచ్చింది

ముళ్ళకిరీటం అల్లితలపై పెట్టినప్పుడు
ఆ ముళ్లు గుచ్చుకుంటున్నప్పుడు
ఆ ప్రేమామయుడు "అనుభవించిన 
ఆ బాధ ఆ వేదన వర్ణనాతీతం",ఆపై
శిరస్సునుండి ధారలు ధారలుగా 
*ఆ ప్రభువు చిందించిన ఆ పరిశుద్ధరక్తం  
మన పాపాలకై చెల్లించిన భారీమూల్యం*

పార్టు...2

ఒళ్ళంతా రక్తసిక్తమయ్యేలా 
రాక్షసుల్లా ఆ రోమా సైనికులు
లెక్కలేనన్ని కొరడాదెబ్బలు
ఒకరి తరువాత ఒకరు 
మార్చిమార్చి కొట్టినప్పుడు...ఎర్రగా 
దేహమంతా కందిపోయినప్పుడు... 
ఆ అభిషిక్తుడు "అనుభవించిన 
ఆ బాధ ఆ వేదన వర్ణనాతీతం", ఆపై
*ఆ ప్రభువు చిందించిన ఆ పరిశుద్ధరక్తం 
మన పాపాలకై చెల్లించిన భారీమూల్యం*

"ప్రయాసపడి భారం మోయు ప్రజలారా! 
నాయొద్దకు రండి మీ భారం నాదేనన్న"
ఆ ప్రభువు భుజస్కంధాలమీద 
బరువైన ఆ చెక్కశిలువను మోపి 
కొరడాలతో కృూరంగా కొట్టి కొట్టి... 
ప్రధాన వీధులవెంట తిప్పితిప్పి...
 
కలువరి గిరిపైకి మోయించినప్పుడు 
ఆ నిరపరాధి "అనుభవించిన 
ఆ బాధ ఆ వేదన వర్ణనాతీతం",ఆపై 
*ఆ ప్రభువు చిందించిన ఆ పరిశుద్ధరక్తం 
మన పాపాలకై చెల్లించిన భారీమూల్యం*

పార్టు...3

అక్కడ అప్పుడు అందరు చూస్తుండగా 
అదే సిలువపైన పడుకో బెట్టి 
తన రెండుకాళ్ళల్లో రెండుచేతుల్లో 
పదునైన మేకులు బలమైన సుత్తెలతో  
గట్టిగా దిగకొడుతూ వున్నప్పుడు
పాపం ఆ ప్రభువు ప్రాణం ఎంతగా
విలవిలలాడి పోయిందోఎవరికి తెలుసు
పంపిన ఆ పరలోకపు తండ్రికి తప్ప
అప్పుడు ఆ రక్షకుడు"అనుభవించిన 
ఆ బాధ ఆ వేదన వర్ణనాతీతం", ఆపై
*ఆ ప్రభువు చిందించిన ఆ పరిశుద్ధరక్తం 
మన పాపాలకై చెల్లించిన భారీమూల్యం*

ముఖాన ఉమ్మివేసి పిడిగుద్దులుగుద్ది
"నీవు యూదులరాజువా"అంటూ 
ఎగతాళిచెేస్తూ...హేళన చేస్తూ
ప్రక్కలోబల్లెముతో ఒక పోటు పొడిచినప్పుడు
ఆ ప్రజావైద్యుడు"అనుభవించిన 
ఆ బాధ ఆ వేదన వర్ణనాతీతం",ఆపై  
*ఆ ప్రభువు చిందించిన ఆ పరిశుద్ధరక్తం
మన పాపాలకై చెల్లించిన భారీమూల్యం*

శత్రువులందరు ఒక్కటై తనను  
అంతక్రూరంగా అంత ఘోరంగా 
అతిదారుణంగా హింసించినా 
తనపై ఎన్నో నిరాధారమైన 
నీలాప నిందలు మోపినా
"తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించమని" 
తన తండ్రిని వేడుకొని... 

పార్టు...4

"ఈ దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 
మూడవ దినమున నిర్మించెదనని"
నర్మగర్బంగా పలికి శిలువపై తాను
ఒక "బలిపశువులా" వ్రేలాడి వ్రేలాడి
విలపించి...విలపించి..
నిస్సహాయులై దూరంగా నిలబడి 
గుండెలు బాదుకుంటూ...
కన్నీరుమున్నీరయ్యే...
లక్షలాది మంది ప్రజలసాక్షిగా
ఆత్మను తండ్రికి అప్పగించి...
శిలువపై మరణించి,సమాధి చేయబడి
తిరిగి మూడవ దినమున మృత్యువును
జయించి లేచిన ఆ కరుణామయుడు

చేసిన నేరమేమి ? యేమీలేదు 
పాపులందరి కొరకు తన ప్రాణాలను 
త్యాగం చెయ్యడమే కావొచ్చు...

"నేను మంచి గొర్రెలకాపరినని 
మంచికాపరి తన గొర్రెలమందకోసం
తన ప్రాణాలను ఫణంగా పెడతాడని"
ముందే పలికి ఒక "అమాయకపు 
గొర్రెపిల్లలా" వధించబడడం కావొచ్చు...

"ఈ లోకానికి నేనే వెలుగునని" చెప్పి
పాపాంధకారంలో ఉన్న ప్రపంచ ప్రజలందరికి "నిత్యజీవమనే 
వెలుగును" ప్రసాధించడం కావొచ్చు...

కాని "తన దగ్గరకు వచ్చిన ప్రతివాడు 
దప్పిక గొనడు ఆకలి గొనడ"ని పలికిన 
ఆ ప్రభువుచెంతకు చేరిన ప్రతిపాపికిక 
"ఆకలుండదు"... 
"దాహముండదు"...
"మరణముండదు"...
"నిజమైన నిత్యజీవమే" తప్ప... 

21. నరరూపుడా! నరరూపుడా!

పల్లవి:
నరరూపుడా! నరరూపుడా!
నా జన్మకు కారకుడా !
పరిశుద్ధుడా పరిశుద్ధుడా!
పరమాత్మ స్వరూపుడా!
లెక్కలేని స్తోత్రముల్ 
చెల్లించెదం చెల్లించెదం 
నిన్నే నిత్యం
పూజించెదం పూజించెదం
హల్లెలూయ !హల్లెలూయ!
హల్లెలూయ !హల్లెలూయ!

చరణం: 1
కల్వరిగిరిపై పరిశుద్ధరక్తాన్ని 
చిందించిన ఓ దేవా !
ఆత్మీయఆహారము మాకందించరావా! 
పాపాలకూపాన పడివున్నాము ఓదేవా!
అభయ హస్తం మాకందించరావా! 

చరణం: 2
ఓ దేవా ఓ దేవా నీ దివ్యరూపం 
కలనైన ఒకసారి కనిపించనీవా!
ఓ దేవా ఓ దేవా నీ మధుర స్వరం  
కనుమూసే లోపైనా వినిపించనీవా!

చరణం: 3
నేనే వెలుగు నేనే జీవం  
నేనే సత్యం నేనే మార్గమన్న ఓ మా తండ్రీ!
విడిపించవా మమ్మల్ని ఆ అపవాది చెరనుండి 
మీ కన్నవారు కాదనినా మిమ్ము
నేనెన్నడు ఎడబాయనన్న ఓ మా తండ్రీ!
నడిపించవా మా నావల్ని ఆవలితీరం చేరేవరకు 

22. క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు

ఓ క్రైస్తవ సోదరులారా !

పవిత్రమైన ఈ
క్రిస్మస్ పర్వదినాన
పరిశుద్ధుడు
పాపుల రక్షకుడు
ప్రభువైన యేసుక్రీస్తు
మీకు మరియు మీ
కుటుంబ సభ్యులందరికీ

చిరునవ్వులు ‌
సిరిసంపదలే తప్ప
చింతలు చీకాకులు లేని...

వెన్నెల వెలుగులే తప్ప
చిమ్మచీకట్లు లేని...

సంతోష సంబరాలే తప్ప
కలతలు కన్నీళ్ళు లేని...

ఆరోగ్యైశ్వర్యాలే తప్ప
రోగాలు రొస్టులురాని... 
శుభకరమైన 
మంగళకరమైన మంచి 
రోజులను మీకు ప్రసాదించును గాక ! 

(క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో...)

23. పరిశుద్ధ వివాహం? 
       ఒకముడి అక్కడ! 
       మూడుముళ్ళిక్కడ!! 

ప్రతి మనిషికి పేరు వుంటుంది 
ప్రతి చెట్టుకు వేరు వుంటుంది 
ప్రతి ఊరికి దారి వుంటుంది 
ప్రతి సమస్యకు పరిష్కారముంటుంది 
 
ఈ ప్రపంచంలో 
పరిశుద్ద వివాహమన్నది
ఒక పెద్ద చిక్కు ప్రశ్న
కాని ఆ చిక్కు ప్రశ్నకు 
చక్కని సమాధానాలు ఎన్నోఏళ్ళుగా 
దైవంచే వ్రాయబడి దాచబడి 
బైబిల్ నిండా విస్తరించి వున్నాయి 

బైబిల్ ఒక మహావృక్షమైతే  
ప్రతి వాక్యం ఒక పచ్చని ఆకైతే , 
ప్రతి వచనం ఒక తియ్యని పండైతే, 
ఆ పచ్చని ఆకులనిండా, 
ఆ తియ్యని పళ్ళనిండా, 
అతి పవిత్రమైన వెండికన్నా 
బంగారు కన్నా విలువైన సమాధానాలు 
రహస్య నిధుల్లా బైబిల్లో దాగివున్నాయి.

ఇక ఇద్దరు కలిసి 
ఆశతో అన్వేషించడం, 
ఓర్పుతో వెదకడం, 
ప్రేమతో పట్టుకోవడం 
కొత్తగా జతచేయబడిన 
భార్యాభర్తల ప్రథమ కర్తవ్యం. 
నెరవేర్చవలసిన ఒక బాధ్యత కూడా. 

ఐతే అది ఆ భగవంతుని 
సహకారంతో సత్సంకల్పంతోనే సాధ్యం.
వారి పవిత్ర వివాహబంధం 
పదికాలాలపాటు పచ్చగా వుండాలంటే

ఎదురుగా సిలువపై 
వ్రేలాడే ఆ యేసుప్రభువు సాక్షిగా, 
చేతుల్లోవున్న ఆ పరిశుద్ధగ్రంధం సాక్షిగా, 
మెళ్ళో కట్టిన ఆ మంగళ సూత్రం సాక్షిగా, 
పెళ్లిచేసిన ఆ పెద్దల సాక్షిగా, 
అక్షింతలు చల్లి ఆశీర్వదించిన 
ఆ అమ్మానాన్నల అత్తమామల 
బంధుమిత్రుల సాక్షిగా, 

ఇద్దరు కలిసి నిర్విఘ్నంగా 
నిరంతరం కొనసాగించవలసిన 
ఒక గొప్ప పుణ్యకార్యమిది  

24. దైవ మందిరం - నిత్య సుందరం 

మోషే ఇచ్చిన పది ఆజ్ఞలను
యేసు చెప్పిన రెండు ఆజ్ఞలను
త. చ. తప్పక పాటించి ఆచరించిన
ఆ జీవితమే
నిజమైన 
నిర్మలమైన 
నిష్కల్మషమైన 
నిత్యనూతమైన 
నిష్కళంకమైన క్రైస్తవ జీవితం

మోషే ఇచ్చిన పది ఆజ్ఞలను
యేసు చెప్పిన రెండు ఆజ్ఞలను
త. చ. తప్పక పాటించి ఆచరించి
ఆ దైవదీవెనలు పొందిన ఆ జీవితమే
శ్రేష్టమైన
పరమపవిత్రమైన   
సుందరమైన
శుభకరమైన
ఆదర్శవంతమైన
ఆరోగ్యకరమైన
ఆనందదాయకమైన క్రైస్తవ జీవితం

మోషే ఇచ్చిన పది ఆజ్ఞలను
యేసు చెప్పిన రెండు ఆజ్ఞలను
త. చ. తప్పక పాటించి ఆచరించి
రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధరక్తంతో
కడగబడి శుద్ధిచేయబడిన ఆ జీవితమే
మధురమైన 
మహత్తరమైన 
పాపరహితమైన
పరమానందభరితమైన
మచ్చలేని స్వచ్చమైన క్రీస్తవ జీవితం 

దయగల హృదయమే 
దైవ మందిరం 
నియమబద్ద జీవితమే 
నిత్య సుందరం
ప్రభువుకు అంకితమైన 
ఆ క్రీస్తవ జీవితమే పరమపావనం

25. నేనొక గొర్రెల కాపరిని..!

తప్పిపోయిన గొర్రె పిల్లల్ని 
వెతికి పట్టుకొస్తాను..!  

గుంటలో పడిన గొర్రెపిల్లల్ని 
పైకి తీసుకొస్తాను..!  

దెబ్బలు తగిలిన గొర్రెపిల్లల 
గాయాల్ని నయం చేస్తాను..! 

అనారోగ్యంతో ఉన్న 
గొర్రె పిల్లల్ని స్వస్థత పరుస్తాను..! 

అమాయకపు గొర్రె పిల్లల్ని 
అక్కున చేర్చుకుంటాను..! 

నేను కరుణా జాలి
దయ ప్రేమగల కాపరిని 
మంచి చేయడం నా ధర్మం..!

కానీ...పొగరుబోతు సోమరిపోతు
గొర్రె పిల్లల తోకలు కత్తిరిస్తాను..!

నా మాట వినని నన్ను లెక్కచేయని 
కొవ్విన గొర్రె పిల్లల పీకలు కోసేస్తాను..! 

కాపరి కళ్ళు గప్పి తిరిగే గొర్రె పిల్లల
గొంతు పిసికేస్తాను గొడ్డలితో నరకేస్తాను..!

నేను కాపరినే కాస్త కఠినంగా ఉంటాను...!!

26. ప్రత్యేక ప్రార్థన...

ఏ పాపమెరుగని మీపై 
నీలాపనిందలు మోపిన
చిత్రహింసలకు గురిచేసిన 
శత్రువులందరిని క్షమించిన

పరిశుద్దమైన రక్తాన్ని చిందించిన
కలువరిగిరిపై కన్నుమూసిన 
మూడవ దినమున తిరిగి లేచిన 
పరలోకపుతండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న

ఓ పరిశుద్దుడా ! 
ఓ కరుణామయుడా !
ఓ సర్వశక్తిసంపన్నుడా !
మీకు లెక్కించలేని స్తుతిస్తోత్రములు
అర్పిస్తున్నాము తండ్రీ !

మీరు మాకు నిరంతరం తోడుగా నీడగా 
ఒక మంచి గొర్రెల కాపరిలా
కొండంత అండగా ఉంటారని
మనస్పూర్తిగా నమ్ముచున్నాము తండ్రీ!

మేము ఈనేలపైన నివసించినంత కాలం 
ఆకాశంలో గ్రద్దలా తిరిగే
అపవాది చేతికి చిక్కకుండా రక్షించి
మాపై మీ కృపావరములు కుమ్మరించమని 

మీ పాదాల చెంత మోకరిల్లి
చేతులు జోడించి శిరస్సులు వంచి
వేడుకుంటున్నాము తండ్రీ ! 
కనికరించమని కన్నీటితో ప్రార్థిస్తున్నాము తండ్రీ !

27. అనుదిన కుటుంబ ప్రార్థన

ఆకాశంలోని 
ఆ సూర్యచంద్రులను 
ఆ నక్షత్రాలను
సువిశాలమైన ఈ భూమిని 
ఇందులోని సమస్తాన్ని
సృష్టించిన సర్వశక్తి సంపన్నుడు
మహిమగల మనదేవుడు 
మన తండ్రియైన యెహోవా 
ఘనమైన నామంనుండి

మన పాపముల కొరకై 
ఆ కల్వరి గిరిపై 
గొర్రె పిల్లలా బలియై
తన‌ పరిశురక్తాన్ని చిందించి 
మరణించి మూడవ‌దినమున 
తిరిగి సజీవుడై లేచిన 
మన రక్షకుడు 
పరిశుద్ధుడు మన ప్రభువు 
నజరేయుడైన యేసుక్రీస్తు 
మహిమగల నామం నుండి 

మీరు మీ ప్రార్థనలో అడిగిన అడగని,
మీరు కోరిన కోరని, మీరు ఆశించిన
ఆశించని అన్ని ఆత్మీయ వరాలతో పాటు

నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ 
ఆకాశంనుండి, వారి 
అదృశ్య అభయ హస్తములనుండి
అపారమైన కృప, అంతులేనిదయ, 
శాశ్వతమైన శాంతి, సమాధానం 

మీకు మీకుటుంబంలోని ప్రతిఒక్కరికీ
సమృద్ధిగా లభించును గాక ! 
ప్రవాహమై ప్రవహించును గాక !
కుంభవర్షమై కురియును గాక !
ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!

28. 2+7+3="12" = పరిశుద్ధ వివాహం

అంటే,
2- మనసులు+ 
7- అడుగులు + 
3- ముళ్లు =పరిశుద్ధ వివాహం

ఓ క్రైస్తవ దంపతులారా!
నిన్నటివరకు మీరు వేరు వేరు 
ఎవరికి వారు ఒక్కరే నేడు 
రెండు మంచి మనసులు కలసి 
రెండు కొత్త కుటుంబాలు ఏకమై  
జాతకాలు ఒకటై దైవంచే 
జత చేయబడ్డారు 
జంటగా మారారు
అంటే 
అందరిలో పెళ్లిపందిరిలో 
అదృశ్యంగా ఉన్న ఆ దేవదూతల సాక్షిగా 
ఆ కరుణామయుడి 
కృపావరములు మీపై కుంభవర్షమై కురిసి 
ఏనాడో పార్కులో
"ఏడు" అడుగులు నడిచిన మీరు నేడు 
"మూడు" ముళ్లబంధంతో ఏకమయ్యారు ఒక లోకమయ్యారు
ఇంతగా దీవించబడిన 
మీ దాంపత్యజీవితం 
మూడుపువ్వులు ఆరుకాయలు కావాలంటే  
మీరు బహుగా ఆశీర్వదించబడాలంటే  
మీరు ఆత్మీయ ఫలాలు పొందాలంటే  
మీరు బంగారు బిడ్డల్ని కనాలంటే 
మీరు సుఖంగా జీవనం సాగించాలంటే 
"12 ఆజ్ఞలు" మీరు తు.చ.తప్పక పాటించి తీరాలి

29. ప్రభు ప్రార్థన... 

ఓ ప్రభువా..!
పరలోకపు 
రాజాధిరాజా...!
సర్వోన్నతుడా...!
నీకు వందనం...!
పాదాభివందనం...!
నీకు లెక్క లేనన్ని 
స్తుతి స్తోత్రములు చెల్లించెదం...
నిత్యం నీ దివ్యసన్నిధి చేరి...
నీ దివ్య మంగళ
స్వరూపాన్ని తిలకిస్తూ...
నీ దివ్యనామాన్ని జపిస్తూ...
నిత్యం నిన్నే స్మరించెదం...

ఓ దేవాది దేవా...!
ఓ కరుణామయుడా...!
నీవే మాకు కొండంత అండ...ఆధారం
రాత్రి వేళల్లో మాకు సుఖనిద్ర నిస్తావు...
ఆ నిద్రలోనే కమ్మని కలలనిస్తావు...
మమ్మల్ని కనురెప్పల్లా కాపాడుతావు...
ఘోరమైన సైతాను శోధనలు నుండి 
మమ్మల్ని రక్షిస్తావు...
ఏ మొండివ్యాధులు మాకు సోకకుండ
అకస్మాత్తుగా ఏ ప్రమాదాలకు 
మేము గురికాకుండ 
నీ దూతలను రక్షణ కవచంలా 
మా చుట్టూ నిలుపుతావు...

ఓ పరిశుద్దుడా...!
ఓ పరమపావనుడా...!
మరణాన్నిజయించిన 
ఓ మరియ సుతుడా...!
ఆ నిశిరాత్రిలో...
ఆ గాఢమైన నిద్రలో... 
ఆ ప్రశాంతమైన వేళలో...
మా అంతరంగ లోతుల్లోనుంచి
నీ ఉన్నతమైన ఉహలే... 
బావిలో ఊటల్లా 
ఉబికి ఉబికి వస్తాయి...
నీ పవిత్రమైన ఆలోచనలే... 
అందమైన నక్షత్రాలై 
మిళమిళ మెరుస్తాయి... 
దేదిప్యమానంగా ప్రకాశిస్తాయి... 
నీ తియ్యని తలంపులే... 
పచ్చని పైరుల్లా ఉల్లాసాన్ని 
ఉత్సాహాన్ని నింపుతాయి...
పారిజాత కుసుమాలై 
వికసిస్తాయి పరిమళిస్తాయి...
నీ సుందరమైన 
సుమధుర భావనలే...
జీవనదుల్లా మాలో 
నిర్మలంగా నిశ్చలంగా ప్రవహిస్తాయి...

ఓ ప్రాణాదాతా...!
ఓ ప్రేమామయుడా...!
నీ దివ్యమైన దీవెనలతో... 
మా జీవితాలు  
హరివిల్లులై విరియును గాక..!
నీ అందమైన ఆశిస్సులతో...
మా జీవితాల్లో 
అమృతపుజల్లులు కురియును గాక...!
మా మనసులు మురియును గాక...!
నీ కరుణా కటాక్ష వీక్షణాలతో
సుఖము శాంతి సమాధానం 
ప్రేమ ప్రశాంతత మా హృదయాలలో
పంటకాలువలై ప్రవహించుగాక...!
అంతులేని ఆనందం సంతోషం 
సజీవనదులై పొంగి పొరలునుగాక...!
ఓ దైవమా నీకు వందనం పాదాభివందనం! 

30. ముళ్ళకిరీటధారీ..!
      మృత్యుంజయుడు..!!

పరిశుద్ధుడు 
లోక రక్షకుడు
పరమపావనుడు
మరియు సుతుడు 
మనుష్య కుమారుడు 

క్రీస్తు నరుల పాపాల నిమిత్తం 
ముళ్ళకిరీటాన్ని ధరించి 
కొరడ దెబ్బలు తిని 
సిలువపై వ్రేలాడి వ్రేలాడి 
పరిశుద్ధ రక్తాన్ని చిందించి  
చనిపోయి తిరిగి 
మూడవ దినాన 
మృత్యుంజయుడై లేచాడని...
 
ఎందరెందరో పండితులచే...
మేధావులచే చరిత్రాకారులచే...
అపోస్తలులచే భక్తులచే ప్రవక్తలచే...
బైబిల్లో లిఖించబడిన దాన్ని 
చదివి లేదా ఎవరైనా చెప్పగావిని 
ఒకడు పూర్తిగా విశ్వసిస్తాడు 
...వాడే నిజమైన ప్రభుభక్తుడు... 

ఒకడు ఇదంతా అసత్యం 
అసలు దేవుడే లేడని వాదిస్తాడం 
...వాడే నిత్యశంకితుడు హేతువాది...

ఒకడు ఓపికతో ఎన్నో ఏళ్ల క్రితం 
చదువు సంధ్యలు సరిగా లేనినాడు... 
అక్షరాలు వ్రాయడం తెలియని రోజుల్లో... 
పుస్తకాలు ముద్రించడానికి 
యంత్రాలు కనిపెట్టని కాలంలో... 

జరిగిన అనేక చిత్ర విచిత్ర 
వింత సంఘటనలన్నీ 
ఎంతవరకు నిజమని
ఎంతవరకు నమ్మవచ్చని.
 
లోతుగా 
వివిధ కోణాల్లో 
అనేక మార్గాల్లో 
విభిన్న పద్ధతులలో 
దీర్ఘంగా సుదీర్ఘంగా 
తన జీవితకాలమంతా...
 
ఆశతో అన్వేషిస్తూ...
పరిశోధిస్తూ...పరిశీలిస్తూ
ముందుతరాలవారికి 
ఒక సత్యాన్ని తెలియజేయాలని
తపించువాడే... 
అన్వేషించువాడే...సంఘసంస్కర్త...

31. ఆ దేవదేవుడు 

నిన్ను 
ఆటలో 
ఓడిపోనివ్వడు
 
నీటిలో 
మునిగి పోనివ్వడు 
 
చెట్టులా 
ఒరిగి పోనివ్వడు 

భయపడకు 
నిన్ను క్రింద పడనివ్వడు 

పడినా పైకిలేచే 
శక్తిని నీకు ప్రసాదిస్తాడు 

అందుకే ఓ భక్తా
అవాంతరాలెన్ని వచ్చినా 
అగ్ని పరీక్షలు ఎన్ని పెట్టినా ఆ
భగవంతునిపై భక్తిని తరగనివ్వకు
నీలోని అఖండ శక్తిని కరగనివ్వకు

32. బంగారు బైబిల్ గనిలో...

బైబిల్ ...
ఒక మహావృక్షమైతే  
ప్రతి వాక్యం... 
ఒక పచ్చని ఆకైతే...
 
ప్రతి వచనం... 
ఒక తియ్యని పండైతే...

ప్రతి అధ్యాయం
ఒక అమృత భాండమైతే...

ఆ పచ్చని ఆకులనిండా... 
ఆ తియ్యని పళ్ళనిండా...
ఆ అమృతభాండంనిండా...

వెండికన్నా 
బంగారు కన్నా 
వజ్ర వైడూర్యాలకన్న 
విలువైన శాంతిసమాధానాలు 
పవిత్రమైన జీవన సూత్రాలెన్నో
అగాధ జలనిధిలో ఆణిముత్యాల్లా
అంతులేని అంతుచిక్కని రహస్యనిధుల్లా 
బంగారు బైబిల్ గనిలో నిక్షిప్తమైఉన్నాయి

రచన:
కవిరత్న 
సహస్ర కవి భూషణ్ 
పోలయ్య కూకట్లపల్లి 
అత్తాపూర్ హైదరాబాద్ 





Comments