14.04.2024 భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా అక్షరాంజలి... కొన్ని కవితలు... వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కమనీయమైన రమణీయమైన రంగుల్లో కవితా కుసుమాలు... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్





















 1. అంబేద్కర్ అంటే ఒక సైన్యం   

మహర్ కులంలో వెలసిన
"వేగుచుక్క" మన అంబేద్కర్
గంజాయి వనంలో మొలచిన 
"తులసిమొక్క" మన అంబేద్కర్         

కోట్లాది పూరిగుడిసెల మధ్య 
వెలిసిన వెయ్యంతస్తుల 
"పాలరాతి భవనం" మన అంబేద్కర్

వేలాది మంచుకొండల మధ్య 
గుట్టల మధ్య ఎదిగిన ఎత్తైన
"ఎవరెస్టు శిఖరం" మన అంబేద్కర్

ఎండిన లక్షలాది వృక్షాల మధ్య 
వేలాది ఎకరాలలో విస్తరించిన 
"మహా భోధివృక్షం" మన అంబేద్కర్

ఆకాశవీధిలో కావుకావుమని అరిచే 
నల్లని కాకుల మధ్య హాయిగా ఎగిరే 
"తెల్లని రాజహంస" మన అంబేద్కర్

కులమత రహిత మానవతారాగం 
ఆలపించి విశ్వమంతా వినిపించిన 
"మహర్ కోయిల" మన అంబేద్కర్

అడుగడుగున అవమానాలముళ్ళు 
గుండెల్లో గుచ్చుకున్నా...గుభాళించే
"గులాబీ పువ్వు" మన అంబేద్కర్

అమాయకపు గొర్రెలమందలో 
దూరిన తోడేళ్ళతో..."పోరాడి 
గెలిచిన పొట్టేలు" మన అంబేద్కర్

పకపకమని నవ్వే పులినిచూసి 
గజగజ వణికే జింకలమధ్య 
గంభీరంగా నిలుచున్న 
"గజరాజు" మన అంబేద్కర్

అంబేద్కరంటే...ఒక సైన్యం...
అంబేద్కరంటే...ఒక యుద్ధనౌక

2. దళితజాతి జ్యోతి
    డాక్టర్ .బి.ఆర్. అంబేద్కర్..! 

మహర్ కులంలో
వెలసిన "వేగుచుక్క"
గంజాయి వనంలో
మొలచిన "తులసి మొక్క" 
దళితుల పాలిటిదైవం...
దారిచూపే దీపం...
అణగారిన పేదప్రజల ఆశాకిరణం...
ఓ అమరజీవి అంబేద్కర్ ! 
దండాలయ్య మీకు దండాలు!!
మీకు జన్మనిచ్చిన " 
ఆ అమ్మనాన్నలకు" కోటిదండాలు !

వీధి బడికెళ్తుంటే మిమ్ము 
వింతగా చూస్తుంటే 
విదేశాలకేగి ఉన్నత విద్యనార్జించి
బుక్కులెన్నో పఠించి... 
హక్కులన్నీ గ్రహించి... 
గాఢనిద్రలో ఉన్న 
గబ్బిలాలకు "జ్ఞానబోధ" చేసిన... 
బావిలోని కప్పలకు 
"బ్రతుకుదారి" చూపిన... 
కావు కావుమని అరిచే కాకులకు 
"కోకిలరాగాలు" నేర్పిన... 
పూరిగుడిసెలో పుట్టిన 
బహుజనులను "పులులుగా" 
మార్చిన...ఓ అమరజీవి అంబేద్కర్ !
దండాలయ్య మీకు దండాలు!!
మీ "ఆదర్శ భావాలకు" వేయి"దండాలు !

అణగారిన వర్గాల అభ్యున్నతికి 
జీవితాన్ని అంకితం చేసి 
ఊరూరా తిరిగి ఉద్యమాలు రేపి 
ఉపన్యాసాలతో ప్రజలను 
ఉర్రూతలూగించి 
మనిషి మనిషి మధ్య మంటలు రేపే
మనుశాస్త్రాన్ని మట్టుపెట్టి... 
అడుగునున్న బడుగువర్గాల 
అభివృద్ధికి గొడుగు బట్టి... 
పిచ్చిమతాచార్యుల
నెత్తిన పిడుగులాపడి...  
అస్పృశ్యతను అంటరానితనాన్ని
నిరసించిన...నిప్పులు కురిపించిన 
ఓ అమరజీవి అంబేద్కర్ ! 
దండాలయ్యా మీకు దండాలు !!
మీ "కండబలానికి 
గుండెబలానికి" కోటి" దండాలు !

కరెంట్ షాక్ కన్నా...
కాలకూటవిషం కన్నా... 
అతిభయంకరమైన 
అంటరానితనానికి 
ఆహుతైపోకుండా 
అగ్రవర్ణాల వారి అడుగులకు 
మడుగులొత్తే బానిస 
బ్రతుక్కి బలైపోకుండా 
రాజ్యాంగ రక్షణలెన్నో కల్పించి 
కులంపేర...ఈ సమాజం 
క్రుళ్ళి పోకముందే 
కులమనే విశ్వవృక్షాన్ని... 
కూకటివేళ్లతో సహా 
పెకలించివేయాలని
ప్రబోధించిన...సాంఘిక 
దురాచారాలను "సమాధి" చేసిన... 
సమసమాజానికి "పునాది" వేసిన... 
ఓ అమరజీవి అంబేద్కర్ !
దండాలయ్యా మీకు దండాలు!! 
మీ "సాంఘిక సంస్కరణలకు" 
"శతకోటి" దండాలు !

ఓ మహాత్మా !
మీ రక్తాన్ని సిరాగా మార్చి 
భారతదేశానికి
రక్షణకవచం లాంటి
రాజ్యాంగాన్ని రచించిన
ఓ మహామేధావీ..!
ఓ ఉద్యమకారుడా..!
ఓ జ్ఞానసూర్యుడా..!
ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి..!
ఓ భావిభారత స్పూర్తి ప్రదాతా..! 

మీరే మాకు దైవం..!
మీ మాటే మాకు వేదం..!
మీ బాటే మాకు శరణ..!
మీ స్మరణే ఓ ప్రేరణ..!
మీ అడుగుల్లో అడుగులు వేస్తాం..!
మీ ఆశయాలకు 
మా జీవితాలను అంకితం చేస్తాం!
ఓ అమరజీవి అంబేద్కర్ 
మీకిదే మా అక్షర నీరాజనం!!
జైభీమ్...జై తెలుగుతల్లి...జై భారత్....

3. అస్తమించని జ్ఞానసూర్యుడు
    డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్... 

గంజాయి వనంలో ఓ తులసి మొక్క 
మహర్ కులంలో వెలిసిన వేగుచుక్క
దళితుల పాలిటి దైవం దారిచూపే దీపం 
అణగారిన పేదప్రజల ఆశాకిరణం...
అందరి బంధువు డా.బి.ఆర్ అంబేద్కర్
 
నాడు విదేశాలకేగి విద్యనార్జించి
గాఢనిద్రలో ఉన్న 
గబ్బిలాలకు,"జ్ఞానబోధ" చేసిన 
బావిలోని కప్పలకు 
"బ్రతుకు దారి" చూపిన... 
కర్ణకఠోరంగా అరిచే కాకులకు 
"కోకిల రాగాలు" నేర్పిన... 
పూరి గుడిసెలో పుట్టిన 
బహుజనులను "పులులుగా" మార్చిన...   
జ్ఞాన సూర్యుడు...డా.బి.ఆర్ అంబేద్కర్
 
నాడు మనుధర్మశాస్త్రాన్ని మంటల్లో కాల్చి 
రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా అందించి 
కులవిషవృక్షాన్ని కూకటివేళ్లతో పెకలించి
సాంఘిక దురాచారాల్ని"సమాధి"చేసిన...
సమ సమాజానికి "పునాదులు" వేసిన... 
పోరాట యోధుడు...డా.బి.ఆర్ అంబేద్కర్

ఓ మా దైవమా..!
మీ స్మరణే మాకు ఓ ప్రేరణ..! 
మీ అడుగుల్లో అడుగులు వేస్తాం..! 
మీ ఆశయాలకు 
మా జీవితాలను అంకితం చేస్తాం..!
రక్తతర్పణచేసైనా రాజ్యాధికారం సాధిస్తాం

4. అవమానాలే 
    అంబేద్కర్...ఆయుధాలు 

తన జాతికి దాహమేస్తే 
చెరువులోని మంచినీరు
తోడుకో నివ్వకున్నా...
తనకు దాహమేస్తే కాలేజీ కూజాలో
మంచినీళ్ళు...త్రాగనివ్వకున్నా...

అంటరానివాడంటూ
ఊరికి దూరంగా ఉంచినా...
బడి బయటే...కూర్చోబెట్టినా...

వెనుకున్న టిఫిన్ బాక్సులు
మైలపడతాయని లెక్కలు వ్రాసే 
బ్లాక్ బోర్డును...తాకనివ్వకున్నా...

13 మంది పిల్లలను కని
పోషించలేక నిరుపేదలైన ఆ
తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నా...
14వ సంతానంగా అంబెడ్కర్ పుట్టినా

ఏ ఆర్థిక స్తోమత లేక దుర్గంధభరిత
చేపలమార్కెట్లో రాత్రివేళ రహస్యంగా 
చిన్నవయసులోనే వివాహం జరిగినా...
జీవితాంతం తాను అనుభవించిన
అవమానాలే అంబేద్కర్ కి ఆయుధాలు

ఔను అంబేద్కర్ అంటే...
మట్టిలో ఓ మాణిక్యం రాళ్ళలో ఓ రత్నం
పూరిగుడిసెలో పుట్టిన ఓ పెద్ద పులి...  
ఓ జాతినేత...భరతమాత ముద్దుబిడ్డ 
అందరివాడు...అపరమేధావి...
ఆత్మబంధువు...జ్ఞానసూర్యుడు...
విశ్వమానవుడు...పోరాటయోధుడు 
ఉద్యమాల యుద్ధనౌక...
బహుముఖ ప్రజ్ఞాశాలి... 
భారత రాజ్యాంగ నిర్మాత...
భావిభారత స్పూర్తి ప్రదాత...
అణగారిన వర్గాల ఆశాజ్యోతి... 
ఓ అమరజీవి‌ అంబేద్కర్...
మీకిదే మా అక్షర నీరాజనం...

5. ఘనుడు త్యాగధనుడు అంబేద్కర్ 

తన రక్తాన్ని ధారబోసి... 
రక్షణకవచం లాంటి 
భారత రాజ్యాంగాన్ని వ్రాసి...
మహిళల హక్కులకోసం 
హిందూ కోడ్ బిల్లు ఆమోదంలో 
"నా నూతన కేబినెట్ లో 
ఆణిముత్యం అంబేద్కర్" అన్న 
ప్రధాని నెహ్రూతోనే విభేదించి
న్యాయశాఖమంత్రిగా రాజీనామా చేసి
గాంధీజీ కుట్రలు కుతంత్రాలు నచ్చక 
జాతీయ కాంగ్రెస్ లో ఇమడలేక...

అడుగునున్న 
బడుగులందరి
అభివృద్ధి కోసం ...
ఆత్మ గౌరవం కోసం... 
కులనిర్మూలన కోసం ...
మనిషి మనిషి 
మధ్య మంటలు రేపే
మనుధర్మ శాస్త్రాన్ని కాల్చివేసి...

అంటరానివారి
ఆలయ ప్రవేశం కోసం
మహద్ చెరువులో నీళ్ళకోసం
రిపబ్లికన్ పార్టీని స్థాపించి...
ఒక్కడే ఒక సైన్యమై 
రాజకీయంగా పోరాటాలెన్నో చేస్తూ

ఎన్నో సభలలో సమావేశాలలో
వందల వేల ప్రసంగాలు చేసి ...
బడుగు బలహీన వర్గాల 
అభ్యున్నతికి విశేషమైన కృషి చేసి...

ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
తన రక్తాన్ని స్వేదంగా మార్చి
ప్రపంచంలోని ప్రజాస్వామ్య 
దేశాధినేతలే  నివ్వెరపోయేలా
రాజ్యాంగ రచనచేసి...
రక్షణలెన్నో కల్పించి..హ
బహుజనుల బ్రతుకుల్లో 
వెన్నెల వెలుగులు నింపిన...

ఓ జాతినేత...అందరివాడు...
అపరమేధావి...ఆత్మబంధువు...
జ్ఞానసూర్యుడు...విశ్వమానవుడు... పోరాటయోధుడు 
ఉద్యమాల యుద్ధనౌక
బహుముఖ ప్రజ్ఞాశాలి... 
భారత రాజ్యాంగ నిర్మాత...
భావిభారత స్పూర్తి ప్రదాత...
అణగారిన వర్గాల ఆశాజ్యోతి... 
ఓ అమరజీవి‌ అంబేద్కర్...
మీ కిదే మా అక్షర నీరాజనం...

6. అంబేద్కర్...ఒక విజ్ఞాన గని..!

నాడు 
మంచితనం 
మానవత్వమున్న
బరోడా మహారాజు
ఉదారహృదయంతో 
అమృతహస్తాలతో ఆశీర్వదించి 
అందించిన స్కాలర్ షిప్ తో 
భార్యాపిల్లలను ఊరిలో వదిలేసి 
ఒంటరిగా ఓడల్లో విదేశాలకేగి...
 
కసితో కృషితో...
ఒక ఆశయంతో... 
గట్టి పట్టుదలతో...
తెల్లదొరల మధ్య సూటు బూటు 
వేసుకొని "తెల్లనికొంగలా"తిరుగుతూ
భారతదేశంతో తనను 
సంస్కృతం చదవనివ్వకున్నా...

ఇంగ్లీష్ విద్యలో పట్టును సాధించి
విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో 
ఆర్థిక...రాజకీయ...గ్రంధాలను
న్యాయ...తత్త్వ...శాస్త్రాలను
రాత్రింబవళ్ళు ఔపాసన బట్టి
ఉన్నత విద్యను ఆర్జించి...

ఇటు భారత దేశంలోను  
అటు ప్రపంచంలోను 
సకల సౌకర్యాలున్న 
ధనవంతుల శ్రీమంతుల 
అగ్రవర్ణాల విద్యార్థులెవరూ 
కలలోనైనా ఊహించని 
తమ జీవితంలో సాధించలేని 
డిగ్రీలెన్నిటినో సాధించి...

నిద్రాహారాలు మాని ఏళ్ళతరబడి
పురాతన గ్రంధాలను పరిశోధించి 
ఏ బహుభాషా పండితులు సైతం 
వ్రాయలేనన్ని అతివిలువైన 
విజ్ఞాన దాయకమైన బృహత్ 
గ్రంథాలను భావితరాలకోసం వ్రాసిన 
చరిత్రగదిలో రహస్యనిధిలా దాచిన
అపర మేధావి...విజ్ఞాన గని అంబేద్కర్

జాతినేత...భారత రాజ్యాంగ నిర్మాత...
చదువుల తల్లి ముద్దుల తనయుడు 
అందరివాడు...ఆత్మబంధువు...
జ్ఞానసూర్యుడు...విశ్వమానవుడు... 
పోరాటయోధుడు...
ఉద్యమాల యుద్ధనౌక...
బహుముఖ ప్రజ్ఞాశాలి... 
భావిభారత స్పూర్తి ప్రదాత...
అణగారిన వర్గాల ఆశాజ్యోతి... 
భారత రత్న అమరజీవి‌ అంబేద్కర్...
మీకిదే మా అక్షర నీరాజనం...

రచన:
"కవి రత్న" 
"సహస్ర కవి భూషణ్ "
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

 

 



 

Comments