తేది 09.04.2024...(13) ఉగాది కవితల కోలాహలం... సంపాదకులకు కవిమిత్రులకు...శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్




























 ఉగాది  కవితల ఇండెక్స్...

1.  ఉగాది పర్వదినమెప్పుడంటే..?
2. శ్రీ క్రోధినామ సంవత్సర
    ఉగాది పర్వదిన పంచాంగ శ్రవణం..!
3. ఉగాది అంటే..? ఒక ఉషస్సు..!
4. ఏమి కోరేది..?నేనేమి అడిగేది..?
5. ఓ ఉగాది లక్ష్మీ రావమ్మా రా
6. ఉగాది పర్వదినమంటే..?(1)
7. ఉగాది పర్వదినమంటే..?(2)
8. ఉగాది అంటే..?
    ఒక సాహితీ సందడే..!
9. వచ్చింది వచ్చింది ఉగాది..!
10. ఉగాది సందేశమొక్కటే...?
11. ఉగాదిలక్ష్మికి
     స్వాగతం..! సుస్వాగతం..!! 
12. ప్రతి ఉషోదయం ఒక ఉగాదే..!
13. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

1. ఉగాది పర్వదినమెప్పుడంటే..?

పచ్చని పంటలు పండిననాడు ! 
ఆకలి మంటలు ఆరిననాడు !!
అక్షర దీపాన్ని వెలిగించిననాడు !
అజ్ఞానాంధకారాన్ని తొలిగించిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే యుగాది !!

నిరుద్యోగాన్ని నిర్మూలించిననాడు !
నిరాశతో యువత నిట్టూర్చనినాడు !!
వరకట్న పిశాచి కోరల్ని విరిచిననాడు ! 
ముత్తైదువలై కన్యలు మురిసిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే యుగాది !!

కులాలనే అడ్డుగోడల్ని కూల్చినవాడు ! 
మతరక్కసిని మంటల్లో కాల్చిననాడు !!
కొమ్మల్లో కోయిలమ్మ కలసి కాకమ్మతో ! 
పరవశించి యుగళగీతం పాడిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే యుగాది !!

మంచితనం మాతవత్వం ప్రతిమనిషి 
గుండెల్లో తేనెజల్లులా కురిసిననాడు !!
సమానత్వం సౌబ్రాతృత్వం ప్రతివ్యక్తి 
ఊహల్లో హరివిల్లులా విరిసిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే యుగాది !!

తినగ తినగ వేప తియ్యనన్న...
కలసివుంటే కలదు సుఖమన్న... 
నగ్నసత్యాన్ని మనిషి ఎరిగిననాడు !!
నలుగురు కలసి నవ్వుతూ బ్రతికిననాడు
యుద్ధవిమానాలతో ధరణి దద్దరిల్లనినాడు 
ప్రపంచమంతా శాంతి ప్రజ్వరిల్లిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే యుగాది !! 

2. ఉగాది పర్వదిన పంచాంగ శ్రవణం
 
ఎందరో 
మహానుభావులు
అందరికీ వందనాలు..!
ఓ కవిమిత్రులారా..!
సాహితీ మూర్తులారా..!
సరస్వతీ పుత్రులారా..! 
శ్రీ క్రోధి నామ సంవత్సర
ఉగాది పర్వదినాన 
నేను మీకందించే నా
పంచాంగ శ్రవణమిదే...
అంతా ఆదాయమే  తప్ప 
వ్యయం లేని పంచాంగం 

ఓ మిత్రులారా..!
సరస్వతీ పుత్రులారా..! 
సాహితీమూర్తులారా..!
అంతులేని 
ఆనందసాగరాన 
ఎగిసి ఎగిసిపడే
మీ ఆలోచనల అలలు 
అభివృద్ధి తీరం చేరును గాక..!
మీరు కన్న కమ్మని
కలలు ఫలించును గాక...

ఆ పంచభూతాలు
మీకు అక్షయపాత్రలగును గాక..!
ఉదయించే ప్రతిప్రొద్ధూ
మీ కోటికోర్కెలను తీర్చును గాక..!

ఆ ఏడుకొండల వెంకన్న మీకు 
వెయ్యేనుగుల బలాన్నిచ్చునుగాక..!
కంచుకోటై మీకు రక్షణనిచ్చును గాక..!
లక్ష కోట్ల నక్షత్రకాంతిని మీ బ్రతుకుబాటలో విరజిమ్మునుగాక..!

మీ కష్టాలు కారుమబ్బుల్లా 
కరిగిపోవును గాక...
మీ సమస్యలు ఎండుటాకుల్లా
ఎగిరిపోవును గాక...

మీ మదిలో శాంతిసుధలు..!
మీ ఇంటిలో సిరిసంపదలు...!
మీ కన్నీళ్ళతో కాంతిరేఖలు..!
మీ ముఖంలో చిరునవ్వులు..!

అలసిన 
మీ గుండెలనిండా 
అంతులేని ఆత్మతృప్తి...
ఊహల కందని ప్రశాంతత...
కుంభవర్షమై కురియునుగాక..!
జలపాతమై జలజల దూకును గాక..!
సెలయేరులై గలగల ప్రవహించును గాక..!
మీ జీవితం ఆనందనిలయమౌనుగాక..!

మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో
సుఖశాంతులతో విలసిల్లుదురు గాక..!
పిల్లాపాపలతో చల్లగా...
భోగభాగ్యాలతో హాయిగా... 
నిండూనూరేళ్ళు వర్థిల్లుదురు గాక..!
నవ్వుల నది...కోటి వరాల నిధి...
ఈ క్రోధినామ సంవత్సర ఉగాది అంతా 
మీ ముఖాలలో... 
చిరునవ్వులు తాండవించునుగాక...
మీకు సకల శుభములు కలుగును గాక..!
అందరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

(మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థచే 09.04.2024 శ్రీ క్రోధినామ ఉగాది సందర్భంగా "సహస్ర కవి భూషణ్ "బిరుదు ప్రధానం చేసిన 
కవి సమ్మేళనంలో చదివిన కవిత)

3. ఉగాది అంటే..? ఒక ఉషస్సు..!

1...
ఉగాది అంటే...
శుభకార్యాలకొక 
శుభముహూర్తమే...

ఉగాది అంటే...
ఓ పచ్చదనమే
ఓ ప్రకృతి చైతన్యమే

ఉగాది అంటే... 
తెలుగు లోగిళ్ళకు 
తొలి పర్వదినమే...
నక్రత్ర కాలగమనమే...
వసంతఋతువు ఆగమనమే...

ఉగాది అంటే...
ఊరించే 
షడ్రుచుల పచ్చడే...
కొమ్మల్లో కోయిలమ్మల
కమ్మని రాగాలే...
మామిడాకులే...
మంగళ తోరణాలే... 

పసందైన విందులే...
చిరునవ్వుల చిందులే...
ఇళ్ళంతా... సందడే...
ఊరంతా...ఉత్సాహమే...
మనసంతా... ఉల్లాసమే...

2...
ఉగాది అంటే... 
తెలుగు భాషకు... 
కమ్మని కవితలతో 
కనకాభిషేకమే...
తెలుగు తల్లికి... 
పసందైన పద్యాలతో 
పట్టాభిషేకమే...
తెలుగు జాతికి... 
జగతికి పండితుల
పంచాంగ శ్రవణాల 
క్షీరాభిషేకమే...

ఉగాది అంటే...
కోటి కొత్త ఆశలకు
రెక్కలు తొడిగే 
పండితుల ప్రవచనాలే...

అందరి 
ముందరి జీవితాలు
సుందర నందన‌వనాలో...
కన్నీళ్ళో...కారుచీకట్లో...
అర్థంకాకున్నా బంగారు భవితపై
భారీ అంచనాలే...అంతులేని ఆశలే...

3...
ఉగాది అంటే...
సాహితీ సందడే...
కవి సమ్మేళనాలే...
కవుల కలాల పండుగే... 
కవి కోకిలల కలయికలే...
ప్రేమపూర్వక పలకరింపులే...
కవుల కమ్మని కవితా గానాలే...
పసందైన పండితుల ప్రసంగాలే...
సాహితీ మూర్తులకు...
సన్మానాలే...సత్కారాలే...
అంబరాన్నంటే సంబరాలే...

ఉగాది అంటే...
మరపురాని 
మరిచిపోలేని
మధుర జ్ఞాపకాలే...
సుందర స్వప్నాలే...

ఉగాది అంటే...
ఆశాకిరణమే...
ఆశలపందిరిని 
అల్లుకోవడమే...
కమ్మనికలలు కనడమే...

భవిష్యత్తొక 
అక్షయపాత్రన్న 
కొండంత ఆశతో
ఆత్మస్థైర్యంతో 
సవాళ్ళనెదుర్కోవడమే...  
సమస్యలతో సతమతమౌతూ
సాహసంతో ముందుకు సాగడమే...

ముందున్నది 
ముళ్ళబాటకాదు...
మరుమల్లెల తోటయని...
ఆశేశ్వాసగా సాగే ఒక అన్వేషణే...
ఉగాది అంటే...ఒక ఉషోదయమే...

4. ఏమి కోరేది..?నేనేమి అడిగేది..?

ఈ క్రోధినామ
సంవత్సరమంతా... 
ఉప్పొంగే... 
ఉల్లాసంతో...ఉత్సాహంతో...
చిగురించే... 
సంతోష సంబరాలతో... 
నవవసంతాలు మీ జీవితాల్లో 
విరబూయాలని...తప్ప
ఏమి కోరేది..? మీకోసం 
ఈ క్రోధినామ సంవత్సర 
ఉగాదిలక్ష్మిని నేనేమి అడిగేది..?

ఈ క్రోధినామ
సంవత్సరమంతా...
తరగని 
సిరిసంపదలను...
ఊహించని 
ఘనవిజయాలను...
మీకు ప్రసాదించమని...తప్ప 
ఏమి కోరేది..? మీకోసం 
ఈ క్రోధినామ సంవత్సర 
ఉగాదిలక్ష్మిని నేనేమి అడిగేది..?

ఈ క్రోధినామ
సంవత్సరమంతా...
గెలుపు గుర్రమై... 
చీకటిని తరిమే ఉపోదయమై...
చిగురాకుల ఊయలలో 
నవరాగాల కోయిలలా...
నట్టింట అడుగు పెట్టాలని...
మీకంతా మంచే జరగాలని...తప్ప
ఏమి కోరేది..? మీకోసం 
ఈ క్రోధినామ సంవత్సర 
ఉగాదిలక్ష్మిని నేనేమి అడిగేది..?

5. ఓ ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా !

ఓ క్రోధినామ సంవత్సర
ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా !
చిరునవ్వులు 
చిందిస్తూ రావమ్మా !
సిరిసంపదలు‌ మాకు తేవమ్మా !

ఓ క్రోధినామ సంవత్సర
ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా !
కుహూ కుహూ కోయిల 
రాగాలతో కులుకుతూ రావమ్మా !
మా కలలను కోరికలను ఫలింపజేసి
మా చిరుఆశలను చిగురింపజేయవమ్మా !

ఓ క్రోధినామ సంవత్సర
ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా !
మామిడాకులతో 
మంగళతోరణాలతో 
ముత్తైదువులా రావమ్మా !
మాకు మారిచిపోలేని మధుర 
జ్ఞాపకాలను మిగిల్చి పోవమ్మా !

ఓ క్రోధినామ సంవత్సర
ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా‌ !
వేయి శుభాలనొసగే 
వసంత ఋతువుతో రావమ్మా !
మా అందరి జీవితాల్లో ప్రశాంతతను
సుఖశాంతులను ప్రసాదించిపోవమ్మా !

6. ఉగాది పర్వదినమంటే...(1 )

ఉగాది పర్వదినమంటే...
"నక్రత్ర కాలగమనమే"...
"వసంతఋతువు" ఆగమనమే...
"బ్రహ్మదేవుడిచే"
సకలచరార సృష్టి జరిగిన దినమే...
"శాలివాహన చక్రవర్తి"
పట్టాభిషక్తుడైన‌ శుభదినమే...

ఉగాది పర్వదినమంటే... 
"తెలుగులోగిళ్ళకు"... 
తొలిపర్వదినమే...
"తెలుగు నెల" 
చైత్రమాసం ప్రారంభమే...
"తెలుగు నేల" 
అంతర్జాలంలో పంచాంగం 
శ్రవణాలతో...పులకించే వేళ... 

ఉగాది పర్వదినమంటే... 
"తెలుగుజాతి" 
నిండుపున్నమిలా వెలిగేదినమే...
"తెలుగుభాషకు"
కవిసమ్మేళనాల్లో
కమ్మని కవితలతో కనకాభిషేకమే...
"తెలుగు తల్లికి"
పసందైన పద్యాలతో పట్టాభిషేకమే...

ఉగాది పర్వదినమంటే... 
ఒక ఉషోదయమే...
ఉగాది పర్వదినమంటే...
శుభకార్యాలకు ఒక శుభముహూర్తమే....

7. ఉగాది పర్వదినమంటే..? ( 2 )
 
ఉగాది పర్వదినమంటే..?
ఉల్లాసమే ఉత్సాహమే...
అంబరాన్ని తాకే 
సంతోషాల సంబరమే..!

ఉగాది పర్వదినమంటే..?
కుహూకుహూ అంటూ 
కొమ్మల్లో కోయిలమ్మల 
రమ్యమైన రాగాలే...
గుమ్మాలకు 
మామిడాకులతో 
మంగళ తోరణాలే..!

ఉగాది పర్వదినమంటే..?
అభ్యంగన స్నానాలే...
అందరికీ నూతన వస్ర్తాలే...
పిల్లల ఆటలు పాటలే...
అల్లరిచేష్టలే...కేకలే కేరింతలే... 
ఇంటింటా ఘుమఘుమలాడే
రుచికరమైన వంటలే...
వినోదాల.....విందులే...
యువజంటల చిందులే...
ఇళ్ళంతా ప్రేమపందిళ్ళే...

ఉగాది పర్వదినమంటే..?
నోరూరించే షడ్రుచుల 
ఉగాది పచ్చళ్ళే...వీనులవిందైన 
పండితుల పంచాంగ శ్రవణాలే...
కనువిందైన...కవిసమ్మేళనాలే...
కవులకు సత్కారాలే...తేనెలూరు 
నా తెలుగు భాషకు పట్టాభిషేకాలే...  

అందుకే గుడిసె గుడిసెలో
ఆశల ఆకలి దీపాలను వెలిగించే...
గుండె గుండెకు కొండంత
ధైర్యాన్ని నూరిపోసే...
పచ్చని బ్రతుకుల్ని ప్రసాదించే... 
కోటి వరాల నిధికి 
శ్రీ క్రోధి నామ సంవత్సరానికి
పలుకుదాం..! పలుకుదాం..!
స్వాగతం...సుస్వాగతం...ఘనస్వాగతం

8. ఉగాది అంటే..?
    ఒక సాహితీ సందడే..!

ఉగాది అంటే...
సాహితీసందడే...
కవిసమ్మేళనాలే...
కవుల కలాల పండుగే... 
కవికోకిలల కలయికలే...
ప్రేమపూర్వక పలకరింపులే...
కవుల కమ్మని కవితాగానాలే...
పసందైన పండితుల ప్రసంగాలే...
సాహితీమూర్తులకు...
సన్మానాలే...సత్కారాలే...
అంబరాన్నంటే సంబరాలే...

ఉగాది అంటే...
మరపురాని 
మరిచిపోలేని
మధుర జ్ఞాపకాలే...
సుందర స్వప్నాలే...

ఉగాది అంటే...
ఆశాకిరణమే...
ఆశలపందిరిని 
అల్లుకోవడమే...
కమ్మనికలలు కనడమే...

భవిష్యత్తొక 
అక్షయపాత్రన్న 
కొండంత ఆశతో
ఆత్మస్థైర్యంతో 
సవాళ్ళనెదుర్కోవడమే...  
సమస్యలతో సతమతమౌతూ
సాహసంతో ముందుకు సాగడమే...

ముందున్నది 
ముళ్ళబాటకాదు...
మరుమల్లెల తోటయని...
ఆశేశ్వాసగా సాగే ఒక అన్వేషణే...
ఉగాది అంటే...ఒక ఉషోదయమే...

9. వచ్చింది వచ్చింది ఉగాది..!

వచ్చింది వచ్చింది 
కోటి వరాల నిధి 
శ్రీ క్రోధి ఉగాది 
తెచ్చింది తెచ్చింది 
నవవసంతాన్ని
ఇచ్చింది ఇచ్చింది 
సుఖజీవన సందేశాన్ని

జీవితం మంటే...
మంచి చెడుల...
సుఖ దుఃఖాల...
చీకటి వెలుగుల...

పాపపుణ్యాల
స్వర్గ నరకాల...
మాయమర్మాల
మార్మిక నదియని...

ఉగాది అంటే...
చేదు...తీపి...
ఉప్పు... కారం...
పులుపు...వగరుల
షడ్రుచుల పచ్చడియని...

విషాదం వెంటాడినా
ఆనందం వెల్లివిరిసినా
నెత్తిన పూలుజల్లినా
పిడుగులు పడినా...ఒకేలా 
సుఖదుఃఖాలను స్వీకరించడమే..
మనిషి జీవిత పరమార్ధమన్న సత్యాన్ని 
తెలుసుకొని ప్రశాంతంగా జీవించాలని...

10. ఉగాది సందేశమొక్కటే...?

ఉగాది 
పచ్చడంటే..?
తీపి...చేదు 
ఉప్పు...కారం...
పులుసు...వగరుల 
షడ్రుచుల...కలయికని

జీవితమంటే...
చిరునవ్వుల...
చీకటి వెలుగుల
చింతల‌ చీకాకుల...
సుఖదుఃఖాల 
సమ్మిళితమని...

అందుకే
ఈ క్రోధినామ
ఉగాది సందేశమొక్కటే..? 
ఈ జీవితంలో...
ఎన్ని కష్టాలొచ్చినా...
ఎన్ని నష్టాలొచ్చినా...
ఎన్ని కన్నీళ్ళొచ్చినా...
ఎన్ని సమస్యలొచ్చినా...
ఎన్ని సవాళ్లెదురైనా... 
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా 
ఏటికి ఎదురీదాలని...
సాహసంతో ముందుకు సాగాలని...
సైనికుల్లా పోరాడి గెలవాలని...

11. ఉగాదిలక్ష్మికి
     స్వాగతం..! సుస్వాగతం..!! 

ఓ నా ప్రియ 
కవిమిత్రులారా..!
సరస్వతీ పుత్రులారా..!
సాహితీ మూర్తులారా..!
మీకోసం నేనీ 
క్రోధినామ సంవత్సర 
ఉగాదిలక్ష్మిని కోరేదొక్కటే..!

లేతమామిడి పూతరేకులతో
పారాణి రాసిన మీ గుమ్మానికి 
"పచ్చని తోరణాలు" కట్టాలని...
కోయిల గొంతు మీకు 
"కొత్త రాగాలు" నేర్పాలని...

మీ జీవితంలో 
అంతులేని ఆనందోత్సహాల
పూలవర్షం కురిపించాలని...

సముద్రమంత 
సంతృప్తిని అనంతమైన 
ఆత్మతృప్తిని మీకు అందించాలని ...

సమస్యల చీకటిపొరలను చీల్చాలని... 
వెచ్చని కరుణకిరణాలను వెదజల్లాలని...
వెన్నెలవెలుగుల్ని బ్రతుకున విరజిమ్మాలని

అందుకే...
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిలక్ష్మికి 
స్వాగతం..! సుస్వాగతం ఘనస్వాగతం..!
(అందరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు)
 
12. ప్రతి ఉషోదయం ఒక ఉగాదే..!

ఒక ప్రకృతిని...
సర్వ సృష్టికి 
వెలుగు నిచ్చేందుకు
సూర్యచంద్రుల్ని
రెండు జ్యోతులుగా...

మూడు లోకాలను...
నాలుగు దిక్కులను...
పంచభూతాలను...
ఆరుఋతువులను...
ఏడువర్ణాల ఇంద్రధనుస్సును...

అష్టదిక్పాలకులను...
ఆకాశవీధిలో నవగ్రహాలను...
84 లక్షల జీవరాశులను...
సృష్టించిన ఓ పరమాత్మా ! 
మీకిదే మా నివేదన...!
 
కరోనావంటి కంటికి కనిపించని 
కర్కశ రాక్షస మృత్యుసమానమైన 
వికృత వింత వైరస్ లు పుట్టని... 
ఈ భారతావనిలో అడుగు పెట్టని...
యుగాది...మాకు కావాలి రావాలి...

అప్పుడు...
...ప్రతి ఉదయం మాకు 
...శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదే...
...ప్రతి సాయంత్రం మాకు సంక్రాంతే...
...ప్రతి రాత్రి మాకు నవ్వుల నవరాత్రే....

13. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు 

మిత్రులారా..!
సరస్వతీ పుత్రులారా..!
ఈ క్రోధినామ సంవత్సర 
ఉగాది మిమ్మల్ని మీ 
కుటుంబ సభ్యులందరిని
ఊరించి ఊరించి... 
ఊహల ఉయ్యాలలో  
ఊగించి ఊగించి... 
ఉత్సాహంతో...ఉల్లాసంతో... 
ఆశలపల్లకిలో ఊరేగించి ఊరేగించి...
సంతోష సాగరాన ముంచాలని ...

నవ్వుల నది...కోటి వరాల నిధి...
ఈ క్రోధినామ సంవత్సర ఉగాది 
అంతా మీకు మంచే జరగాలని...
మీరంతా ఈ సంవత్సరమంతా
వినోదయాత్రలో విహరించాలని...
విజయాల తీరాలను చేరుకోవాలని... 
మనసారా కోరుకుంటూ... 

మీ ఆత్మీయ సాహితీ మిత్రుడు 
పోలయ్య కవి కూకట్లపల్లి హైదరాబాద్ 





Comments