తెలుగు ఎక్కడో వెలుగు అక్కడ...
నా భాష తెలుగు భాష
అది నా జాతి ఆత్మ ఘోష
నా యాస తెలుగు యాస
అది నా జాతి జీవనశ్వాస
నాడు శ్రీ కృష్ణ దేవరాయల వారిచే
దేశభాషలందు తెలుగు లెస్స యని...
నాడు ప్రపంచ భాషా పరిశోధకులచే
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్...
అంటూ ప్రశంసింపబడి...
ప్రపంచ ప్రజలు మాట్లాడే
7139 బాషల్లో 14వ స్థానంలో
ఆసియాలో 7 వ స్థానంలో...ఉంటూ
మన భారతావనిలో మాట్లాడే
22 భాషల్లో హిందీ తరువాత
అత్యధికంగా మాట్లాడే...
నా తెలుగుభాష వైభవాన్ని...
ఏమని వర్ణింతు...నేనేమని వర్ణింతు...?
నాటు నాటు అన్న
నా తెలుగు పాటకు
అతి ప్రతిష్టాత్మకమైన
ఆస్కార్ అవార్డు దక్కి
ఆకాశం అంచులు తాకిన
నా తెలుగు జాతి గౌరవాన్ని...
ఏమని వర్ణింతు...నేనేమని వర్ణింతు..?
ఎందరో పుణ్యమూర్తులు సాహితీ స్రష్టలు
ఎందరో ప్రాచీన ఆధునిక కవుల జననంతో
లిఖించిన ఉత్కృష్టమైన కావ్యాలతో...
తరగని నా తెలుగు సంస్కృతి
సంప్రదాయాలతో పులకించిపోయే...
నా తెలుగునేల సౌభాగ్యాన్ని...
ఏమని వర్ణింతు...నేనేమని వర్ణింతు..?
సప్తసముద్రాలు దాటిన
నా తెలుగు జాతి ఖ్యాతిని...
విశ్వమంతా విస్తరించిన
నా తెలుగు తల్లి కీర్తిప్రతిష్టలను...
ఎన్నో యుద్ధాలలో పాల్గొని
విజయఢంకా మ్రోగించిన
నా తెలుగు వీరుల పౌరుషాన్ని...
ఏమని వర్ణింతు...నేనేమని వర్ణింతు..?
వేయి మాటలేల ఒక్కనిజం
చెప్పనా ఓ గుట్టు విప్పనా...
ఎక్కడ తెలుగు వుంటుందో
అక్కడ వెలుగు వుంటుంది...
ఎక్కడ వెలుగు వుంటుందో
అక్కడ వికాస ముంటుంది...
అందుకే
ఓ తెలుగుతల్లి..! నీకు వందనం..!
అభివందనం..! పాదాభివందనం..!
నీ కడుపున పుట్టడం..!
మా అందరి పూర్వజన్మ సుకృతం..!
జై తెలుగు తల్లి...
రచన...
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502


Comments
Post a Comment