1. జై పాతాళభైరవి ! (హాస్య కవిత)
జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను అప్పుల్లో మునిగిపోయా...
"మోకాళ్ళోతుకు" కూరుకుపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను త్రాగుడుకు బానిసనైపోయా...
"నడుముల్లోతుకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! మళ్ళీ ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను డ్రగ్స్ కు బానిసనైపోయా...
"భుజాలవరకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! ప్రేమపిచ్చి పట్టి నేను
"పీకల్లోతుకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
హైదరాబాద్ మహానగర జలమండలి తెలంగాణ
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్తంగా నిర్వహించే
భూగర్భజల పరిరక్షణ కవిత్వోత్సవం... కోసం
తేది.27.03.2022 ఆదివారం
2. భూతల స్వర్గం...?
భూమ్యాకాశాల్ని...సూర్యచంద్రుల్ని
ఎనభై నాలుగు లక్షల...జీవరాశుల్ని
97 శాతం...ఉప్పునీటి సముద్రాలను
రెండు శాతం...మంచు పర్వతాలను
ప్రాణికోటి దాహం...తీర్చుకునేందుకు
ఒక్కశాతం...త్రాగునీటిని భూగర్భంలో దాచిన
ఓ పరమాత్మా ! మీ సృష్టి ఎంత వింతసృష్టియో కదా!
మనిషి బ్రతుకును మార్చేది...
అక్షర దీపమే
ఆకలిని తీర్చేది పరబ్రహ్మ స్వరూపమైన...ఆహారమే
కానీ ప్రాణికోటికి దాహాన్ని తీర్చేది.....భూగర్భజలమే
కనిపించనివి రెండే...
కాలం...భూగర్భజలం
అడుగంటిన ఆ జలం...
భూగోళం...గందరగోళం
విశ్వమంతా విలవిలా...
ఈ ప్రాణికోటి గిలగిలా...
చెరువులపూడికతో చెక్
డ్యామ్ ల ఇంకుడుగుంతల...
నిర్మాణాలతో భూగర్భజలం
పెరిగిననాడే జగతిలోప్రగతి
సంరక్షించిన ప్రతి
నీటిచుక్క...పాలచుక్కే
కలుషితమైన ప్రతి
నీటిచుక్క...కన్నీటిచుక్కే
దోసిలితో ఒడిసిపట్టిన ప్రతి నీటిచుక్క...తేనెచుక్కే
వృధాగా విడిచిపెట్టిన ప్రతినీటిచుక్క...విషపుచుక్కే
జగతికి జీవనాధారం నీరే...
ప్రగతికి మూలాధారం నీరే
నీరే కదాని వృధాచేస్తే...
భావితరాలకు మిగిలేది కన్నీరే
ఔను తమిళనాడులో...
వెల్లూరులో...నాగానదిలో
20 000 మంది స్త్రీలు...
3500 బావులను తవ్వి
ఎండిపోయిన నాగానదికి
జీవంపోసి...నీటికొరతను తీర్చి
నిజమైన జలశక్తికి నిదర్శనంగా...
ప్రపంచానికి ఆదర్శంగా
నిలిచిన ఆ మహిళా
మణిరత్నాలకు సెల్యూట్ చేద్దాం
రేపటిరోజున త్రాగునీటికోసం
యుద్ధాలుజరగవచ్చు...జనం
నీరులేక స్నానాలకు రసాయన
లేపనాలను రాసుకోవచ్చు
అందుకే జలసంరక్షణే...
జనసంరక్షణనకు....రాజమార్గం
సంరక్షించిన భూగర్భజలం...
మన బ్రతుకే భూతలస్వర్గం
3. శుభ శుభోదయం !
సహృదయులైన
సంపాదకులారా !
నా సాహితీమిత్రులారా !
మీ అందరికి సకల
శుభములు కలుగును గాక !
ఉషోదయ కిరణాలు
మీ హృదయాల్లోకి
చొచ్చుకొని వచ్చును గాక !
అనంతమైన
ఇంద్రియశక్తిని ఇచ్చును గాక !
మీ సత్సంకల్పాలన్నీ
సత్వరమే సిద్ధించును గాక !
కనిపించని ఆ దైవం
మిమ్మును కరుణించును గాక !
ఆ కరుణామయుని
కటాక్ష వీక్షణాలు
మీపై మీ కుటుంబంపై
కుంభవర్షమై కురియును గాక !
ఆకస్మికంగా ఏ కన్నీటి వరదలు
మీపైకి రాకుండా అడ్డుకొనును గాక !
ఏ మొండివ్యాధులు
మిమ్మల్ని పిశాచులై
పీడించకుండా
అండగా ఉండును గాక !
మీ సమస్యల
సర్పాలను
సంహరించును గాక !
కాటు వేయకుండా
మిమ్మల్ని కంటికి
రెప్పలా కాపాడును గాక !
ఆ పరమాత్మ ఆత్మ
దివినుండి
భువికి దిగి వచ్చును గాక !
దివ్యమైన దీవెనలను
వరాలను ఇచ్చును గాక !
అంతులేని ప్రశాంతతను
మీకు ప్రసాదించును గాక !
4. శుభోదయం
మీరు "నిద్ర" లేచింది మొదలు
తిరిగి "నిద్ర" పోయేంత వరకు
మీకన్నీ శుభాలే జరుగును గాక!
శుభ సందేశాలే మీరు విందురుగాక !
మీ సందేహాలకు చక్కని సమాధానాలు
మీ సకల సమస్యలకు పరిష్కారాలు
మీ చిక్కు ప్రశ్నలకు
జవాబులు దొరుకును గాక !
మీరు తలపెట్టిన ప్రతికార్యము
సఫలమగును గాక !
మీ కలలన్నీ పండును గాక !
మీ ఆశలన్ని నెరవేరును గాక !
మీ కోరికలన్నీ తీరును గాక !
మీ పెదవులపై చిరునవ్వులు
చిందులు వేయును గాక !
మీ ఇంట సిరిసంపదలు
పొంగిపొరలును గాక !
మీ ముఖాలలో సుఖశాంతులు
వెల్లివిరియును గాక !
కనిపించని ఆ దైవం కరుణించి
ప్రశాంతమైన జీవితాన్ని మీకు
ప్రసాదించును గాక !
5. జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లి నేను నెట్టులో
"జుట్ఠు"దాకా కూరుకుపోయా
ఐనా భయపడబోకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! మళ్ళీ ఏమిరా నీ కోరిక ?
తల్లి నేను నిద్రాహారాలుమాని
వాట్సాప్ ఫేస్ బుక్
ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లలో
ఎరక్కపోయి ఇరుక్కుపోయా !
ఔరా బాలకా ! ఈ సోషల్ మీడియా
కొందరికి దైవంరా ! కొందరికి భూతంరా!
ఇది ఒక కరెంటు తీగరా !
కాంతినిస్తుందిరా !
కాల్చిబూడిద చేస్తుందిరా!
తెలుసుకోరా బాలకా ! ఒక నిండునిజం !
బానిసలైతే సోషియల్ మీడియాకు...
బ్రతుకు భారమేనని ! ఘోరమేనిని !
దుర్భరమేనిని ! దుఃఖభరితమేనని !
"ఫేస్ బుక్ "కాలాన్ని
హరించే కారుచిచ్చని !
"వాట్సాప్" ఉక్కిరిబిక్కిరి చేసే
ఒక ఊబియని !
జారిపోతే అందులోకి...జాతకాలే
మారిపోవునని ! తలరాతలే తారుమారౌనని !
అందుకే ఓ బాలకా !
మీడియా మాయలో పడిపోవద్దురా!
బానిసవై పోయి సోషియల్మీడియాకు
బంగారు బ్రతుకును బలిచేసుకోవద్దురా!
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లి నేను నెట్టులో
"జుట్ఠు"దాకా కూరుకుపోయా
ఐనా భయపడబోకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! మళ్ళీ ఏమిరా నీ కోరిక ?
తల్లి నేను నిద్రాహారాలుమాని
వాట్సాప్ ఫేస్ బుక్
ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లలో
ఎరక్కపోయి ఇరుక్కుపోయా !
ఔరా బాలకా ! ఈ సోషల్ మీడియా
కొందరికి దైవంరా ! కొందరికి భూతంరా!
ఇది ఒక కరెంటు తీగరా !
కాంతినిస్తుందిరా ! కాల్చిబూడిద చేస్తుందిరా!
తెలుసుకోరా బాలకా ! ఒక నిండునిజం !
బానిసలైతే సోషియల్ మీడియాకు...
బ్రతుకు భారమేనని ! ఘోరమేనిని !
దుర్భరమేనిని ! దుఃఖభరితమేనని !
"ఫేస్ బుక్ "కాలాన్ని హరించే కారుచిచ్చని !
"వాట్సాప్" ఉక్కిరిబిక్కిరి చేసే ఒక ఊబియని !
జారిపోతే అందులోకి...జాతకాలే
మారిపోవునని ! తలరాతలే తారుమారౌనని !
అందుకే ఓ బాలకా !
మీడియా మాయలో పడిపోవద్దురా!
బానిసవై పోయి సోషియల్మీడియాకు
బంగారు బ్రతుకును బలిచేసుకోవద్దురా!
6. స్వర్గ లోకం...నరక కూపం...?
ఎక్కడున్నాయి ?
స్వర్గ లోకాలు...నరక కూపాలు...
ఎవరు చూశారు ?
స్వర్గ ద్వారాన్ని...నరక కూపాన్ని...
అన్నీ అవన్నీ ఈభూమి మీదనే కాదా ?
నిత్యం మనం అనుభవించడం లేదా ?
మన కళ్ళకు కనిపించవు కదా
ఏ కష్టనష్టాలు...ఏ సుఖదుఃఖాలు
సుఖమే స్వర్గమని...దుఃఖమే నరకమని...
ఈ మట్టిమనిషికి అర్థమయ్యేదెప్పుడో?
మన ఆనందమే మనకు స్వర్గమని...
మన వ్యధ ఆవేదనే మనకు నరకమని...
ఈ మట్టి మనుషికి జ్ఞానోదయమయ్యేదెప్పుడో?
మన చిరునవ్వే స్వర్గమని...
మన చింత చీకటే నరకమని...
ఈ మట్టిమనిషికి కనువిప్పు కలిగేదెప్పుడో?
ఏ మొండివ్యాధి సోకో
ఏ హాస్పిటల్లో బెడ్ మీదనో
ఏ ఐసీయూలోనో ప్రాణభయంతో
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై పోవడమే నరకమని...
ఇంట్లో పిల్లాపాపలతో
ఉల్లాసంగా...ఉత్సాహంగా
విందు...వినోదాల్లో మునిగి
సంతోష...సంబరాల్లో తేలుతూ
హాయిగా...ఆనందంగా...సరదాగా
ప్రశాంతంగా...జీవించడమే స్వర్గమని...
ఈ మట్టిమనిషికి అర్థమయ్యేదెప్పుడో?
కళ్ళకు గంతలు కట్టుకున్న
మాయా ముసుగును కప్పుకున్న
అజ్ఞానాంధకారంలో మునిగివున్న
ఈ మట్టిమనిషికి ఈ సత్యం అర్థమయ్యేదెప్పుడో ?
ఔనిదినిజం నవ్వితే...నరకమైనా స్వర్గమౌతుంది
ఔనిదిపచ్చినిజం ఏడిస్తే...స్వర్గమైనా నరకమైపోతుంది
7. అలెగ్జాండర్ అంతిమ సందేశం ?
ఇదెవరి పాపం ?
ఇది ఏ దేవుడి శాపం ?
ఏ పాపం ఎరుగక ప్రశాంతంగా బ్రతికె
ప్రజలెందరో నీ యుద్ధోన్మాదానికి
నీ కౄరత్వానికి బలైపోతున్నారే
జింకపిల్లవంటి
ఉక్రేనియన్ ను
ఉక్కిరిబిక్కిరి చేస్తు
పులిలా వేటాడుతున్నావే ఓ పుతిన్
భూమండలమంతా ఆక్రమించినా
నీ రాజ్యకాంక్ష దాహం తీరేనా ?
భీకరమైన బాంబుదాడులతో
లక్షలాదిమంది అమాయకపు
ప్రజలప్రాణాలను బలితీసుకొని
భూమండలాన్ని బుగ్గిచేసి
రాక్షసుడవై రక్తపాతాల్నిసృష్టించే
ఓ పుతిన్ నీవు సాధించేదేమిటి?
ఏదీ నీ వెంటరాదే
నేడు తప్ప రేపు నీది కాదే
ఈ భూమిపైన ఎవరూ శాశ్వతం కాదే
దండయాత్రలు చేసి దేశాలెన్నో ఆక్రమించిన
భీకరయుద్దాలుచేసి రాజ్యాలెన్నో జయించిన
కడకు అలెగ్జాండర్ ఖాళీచేతులతోనే కాటికెళ్ళలేదా ?
8. అమరజీవికి అశ్రునివాళి...
పుణ్యదంపతులైన
శ్రీ గురవయ్య మహాలక్ష్మమ్మల
గర్భాన మద్రాసులో జనియించి
బొంబాయిలో విద్యనార్జించి...
నవయవ్వనంలోనే
పిన్న వయసులోనే
పుట్టిన బిడ్డను కోల్పోయినా
కట్టుకున్న భార్య కన్నుమూసినా
మిన్ను విరిగి మీదపడినా
సమస్యల పిడుగులవర్షం కురిసినా
వెరవక వెన్ను చూపక కలత చెందక
కారుచీకట్లో కూర్చొని కన్నీరు కార్చక
కరుణ దయలేదని కర్త కర్మ క్రియయైన
ఆ పరమాత్మను నిందించక
కమ్మని కలలు కన్నాడు
ఊరికి దూరంగా ఉన్న
అభాగ్యులందరికీ
ఆలయప్రవేశం జరగాలని...
ఆంధ్రుల చిరకాల స్వప్నమైన
ఆంధ్రరాష్ట్రం అవతరించాలని...
కులమతాలకతీతంగా
అందరిఇంట భోజనం చేస్తూ
సత్యం ప్రేమ అహింసలనే
ఆయుధాలుగా ధరించి
గాంధీజీ ఆశయాలకే అంకితమై
అడుగునున్న బడుగుల ఉద్దరణకు...
ఆంధ్రరాష్ట్ర అవతరణకు...
అహర్నిశలు కృషిచేసినా 58 రోజులు
ఆమరణ నిరాహారదీక్ష చేసినా
ప్రభంజనమై ప్రజలు మద్దతిచ్చినా
ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్పందించక
ప్రాణబిక్ష పెట్టేవారులేక
నిమ్మరసమిచ్చి నిరాహారదీక్షను
విరమింపజేసేవారే కరువై కన్నుమూసిన
ఆంధ్రరాష్ట్ర సాధనకోసం అమరుడవైన
ఓ శ్రీ పొట్టిశ్రీరాములయ్యా మీకు వందనం...అభివందనం...పాదాభివందనం
తెలుగువారి గుండెలే మీకు సింహాసనం
మీరు చిరంజీవులు చిరస్మరణీయులు
మీ కీర్తి అజరామరం అది ఆచంద్రతారార్కం
9. నిశ్శబ్దసందేశం?
గడియారంలోని
మూడు ముళ్లు
మూడుముళ్ల బంధానికి
భార్యా భర్తల చక్కని
సంసార జీవితానికి
అరమరికలులేని అనుబంధానికి
ఒక తీపిగుర్తుగా గుర్తించి
అది అందించే నిశ్శబ్ద సందేశాన్ని
నిజ జీవితానికి అన్వయించుకొన్న
దంపతులందరు నిజంగా ధన్యులే
భార్యా భర్తలందరు భాగ్యవంతులే
గడియారంలోని
మూడుముళ్లలో
పెద్ద ముళ్ళు భర్తకు
చిన్న ముళ్లు భార్యకు
మూడోముళ్ళు
అమ్మానాన్నల ఆశిస్సులకు
కనిపించక వెనుక వుండి
నిరంతరం గడియారాన్ని
కదిలించే బ్యాటరీ
కనిపించకపోయినా కరుణించే
కరుణామయుడైన ఆ దైవమేగదా
ఏ ముళ్ళు ఏ ముళ్ళుకన్న గొప్ప కాదు
మూడుముళ్లకు ఆధారం ఒక్కబ్యాటరే
ఎవరికంటే ఎవరూ గొప్పవారు కాదు
భార్యా భర్తలిద్దరూ సమానమే
కాపురమనే బండికి ఇద్దరూ కాడెద్దులే కదా
ఇద్దరిలో సహనమున్నచాలు
సర్దుబాటుగుణమున్న చాలు
ఆ సంసారం పచ్చని సంసారమే
ఆ కాపురం పండంటి కాపురమే
ఆ కుటుంబం ఆదర్శ కుటుంబమే
ఆ ఇల్లు భూతల స్వర్గమే
ఇది నగ్నసత్యమే
ఇది నిశ్శబ్దసందేశమే
ఇది నిప్పులాంటి నిజమే
10. జ్ఞానం విజ్ఞానం
ఆదిమానవ కాలంలో
జ్ఞానం విజ్ఞానం
విస్తరించని చీకటి రోజుల్లో...
కరుడుగట్టిన
మతఛాందసవాదులు
కొందరు సృష్టించినవే
ఈ దేవుళ్ళు...
ఈ దెయ్యాలు...
ఈ ముక్కోటి దేవతలు...
ఆధిపత్యపోరులో
మతంమత్తులో
మునిగితేలే రోజుల్లో...
అహంకారులు
పరమ మూర్ఖులు
పరమత సహనంలేని
మతోన్మాదులు
తమ పొట్టకూటికోసం
తయారు చేసినవే
ఈ స్వర్గనరకాలు...
ఈ పాపపుణ్యాలు...
ఈ మాయలు మంత్రాలు...
తమ ఉనికి కోసం
తమ ఆధిపత్యం కోసం
తమకీర్తి ప్రతిష్టల కోసం
కట్టినవే
ఈ దైవమందిరాలు...
ఈ గుళ్ళు గోపురాలు...
ఈ చర్చీలు ఈమసీదులు...
మతోన్మాదులు కొందరు
జరిపిన మతయుద్ధాలలో
ఓడి గెలిచి
పెట్టినవే
ఈ నిబంధనలు...
ఈ నియమనిష్టలు...
ఈ ఆచార వ్యవహారాలు...
భక్తి ముక్తి
ముసుగులో
కల్పించినవే
ఈ భయాందోళనలు...
ఈ అంధవిశ్వాసాలు...
ఈ మూఢనమ్మకాలు...
11. అయ్యో పాపం పల్లె ప్రజలు...!
కొందరు
పల్లెటూళ్ళలో
నక్కనక్కి
తిరుగుతువుంటారు
మేకవన్నె పులుల్లా...
తేనెపూసిన కత్తుల్లా...
పాపం
ఆ పల్లెటూళ్ళలో
ఆ పల్లెప్రజల
ఆకలిని అజ్ఞానాన్ని
అమాయకత్వాన్ని
ఆసరాగా చేసుకుని
ఆ పల్లె ప్రజల
మంచితనాన్ని
బలహీనతగా భావించి
వారి పేదరికాన్ని
పెట్టుబడిగా మార్చుకొని
వారి పొలము పుట్రా
నగదు నట్రా
వారి పంటపొలాలను
ఇంటి స్థలాలను
వారి ఆవులను
ఊట బావులను
వారి గొర్రెలను
పాలిచ్చే బర్రెలను
దొంగల్లా...దోచుకొని
దాచుకొని...
దొరల్లా...దర్జాగా...
తిరుగుతువుంటారు ...
ఆ పల్లె ప్రజలకు
అవసరానికి
అప్పులిస్తారు
ఆదుకుంటారు
ఆ పైవడ్డీ మీద
వడ్డీవేసి నడ్డివిరుస్తారు
కౌగలించుకుంటారు
కానీ కడుపులో పదునైన
కత్తులుంచుకుంటారు
ఆ పల్లెప్రజల బంధువులను
వారి కుటుంబ సభ్యులను
వారికి బద్ద శత్రువులను చేసి
కలతలే లేని కలహాలే రాని
కలిసిమెలిసున్నవారందర్ని
కత్తులు నూరుకునేలా
కుత్తుకలు త్రెంచుకునేలా చేస్తారు
ఆపదలో ఆదుకొంటారు
ఆపద్బాంధవులమనిపించుకొంటారు
కరుణించే దైవాలని నమ్మిస్తారు
ఆపై లోతుగా గోతులు త్రవ్వుతారు
నవ్వుతూనే నట్టేట ముంచేస్తారు
బ్రతకాలని ప్రార్థన చేస్తారు
కానీ చచ్చేందుకు మందులిస్తారు
పొమ్మనకుండా వారికి పొగపెడతారు...
ఆ పల్లె ప్రజల
తలలపై కెక్కుతారు
పాపం వారిని
పాతాళానికి అణగద్రొక్కుతారు
వారి పీకలు నొక్కుతారు
వారిని మూగవాళ్ళని ముద్ర వేస్తారు
వారిపైకి వలలు విసురుతారు
వారి కమ్మనికలల తలలు కోసేస్తారు
పాపం వారిని మరో వెయ్యి ఏళ్ళకైనా
పైకి రానివ్వక ఊబిలోనే సమాధి చేస్తారు
అందుకే ఓ అమాయకపు జనమా !
ఇప్పటికైనా సమయం మించి పోలేదు
ఇకనైనా ఈ ఆధునిక యుగంలోనైనా
కొంచెమైనా మారండి విద్యావంతులుకండి !
అనాదిగా మోసపోయిన మీరు
ఈ కంప్యూటర్ యుగంలోనైనా కళ్ళుతెరవండి !
మీ హక్కులను కాలరాసే
దుష్టదుర్మార్గులపై సమిష్టిగా
పోరును సలపండి !
నోరు తెరిచి ప్రశ్నించండి !
పిడికిలి బిగించి ప్రతిఘటించండి !
ఉద్యమిస్తే ఉషోదయం మీదే ! విశ్వవిజేతలు మీరే !
మిమ్మల్ని వారు పక్షుల్లా స్వేచ్చగా ఎగరనివ్వరు !
మిమ్మల్ని వారు వృక్షాల్లా పచ్చగా ఎదగనివ్వరు !
మనుషులుగా మారనివ్వరు!
ప్రశాంతంగా బ్రతకనివ్వరు!
అందుకే జాగ్రత్త !
ఓ పల్లె ప్రజలారా ! తస్మాత్ జాగ్రత్త !!
12. యుద్ద భీభత్సం...
ఏ కళ్ళు చూసినా
ఆగని కన్నీటి ధారలే
ఏడ్చి ఏడ్చి ఎండిపోయి
కన్నీళ్ళకు బదులు రక్తం
ప్రవహిస్తున్నదాఖలాలే
ఏ గుండెల సవ్వడివిన్నా
లోన రగిలే అగ్నిపర్వతాలే
అద్దాలలా పగిలి ముక్కలు
ముక్కలైన హృదయాలే
ఏ చూపులు చూసినా
నిప్పుఖణికలే వేడినిట్టూర్పులే
ఆపన్నహస్తాలకోసం అర్థింపులే
ఆదుకోమని యుద్ధం ఆపమని
ఆశతో కన్నీటితో వేడుకోవడాలే
రేయింబవళ్ళు ప్రార్థించడాలే
ఏ పాదాలు చూసిన
బిక్కుబిక్కుమంటూ
ప్రాణభయంతో పిల్లాపాపలతో
ఉరుకులు పరుగులు పెడుతున్నవే
ఏ వైపు చూసినా
శిధిలమైన అందమైన భవనాలే
చిధ్రమైన మానవ అవయవాలే
కొనవూపిరితో కొట్టుకులాడుతువున్న
బాధితుల ఆక్రందనలే...హాహాకారాలే
ఔను రష్యా ఉక్రేనియన్ ల యుద్దం
భీభత్సం భీకరం భయంకరం ప్రాణాంతకం
ఉక్రెయిన్లపై ఉక్కుపాదం మోపి
భీకరమైన బాంబుదాడులతో
రష్యా చేసే
ఈ దండయాత్రను...
ఈ దురాక్రమణను...
ఈ దారుణమారణ కాండను...
అగ్రరాజ్యాలు అడ్డుకోలేవా?
ఆకలికి అలమటించే
ఆ ఉక్రేనియన్లను
ఆదుకోలేవా?
అక్కున చేర్చుకోలేవా?
ఆ యుద్దోన్మాదికి బుద్ది చెప్పలేవా?
ఈ రాక్షసత్వాన్ని
ఈ రక్తపాతాన్ని ఆపలేవా?
ప్రేక్షకపాత్ర వహించుట
ప్రపంచదేశాలకు తగునా?
13. రేపెంత తియ్యగా ఉంటుందో...
నేడు మీరు కష్టపడి కార్చే
ప్రతి స్వేదబిందువు చెబుతుంది
రేపు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం
ఎంత తియ్యగా వుంటుందో....
నేడు భార్యాభర్తల్లో...
ఒకరిమీద మరొకరికున్న గౌరవం
ఒకరిమీద మరొకరు చూపే ప్రేమ
ఒకరి శ్రేయస్సు కోసం మరొకరు
పడే తపనే తెలియజేస్తుంది
భవిష్యత్తులో ఇద్దరి మధ్య బంధం
ఇంకెంత బలంగా వుంటుందో....
నేడు మీరు ఏ బీరువాలోనో
ఏ బ్యాంకులోనో భద్రంగా దాచుకొని
రోజూ చూసుకునే డబ్బుకన్న
నమ్మకంతో, ధైర్యంతో,వ్యాపారంలో
పెట్టిన మీ పెట్టుబడే చెబుతుంది
మీరెంతటి తెలివిగలవారో...
మీరెంతటి ముందు చూపుగలవారో...
నేడు మీరు విద్యకోసం
చేసే ఖర్చే చెబుతుంది
రేపు మీరున్నా లేకున్నా
మీ పిల్లలకేలోటు రాకూడదని
వారి భవిష్యత్తు
బంగారుమయం కావాలని
వారి జీవితం
సుఖమయం కావాలని
మీరెన్ని కమ్మని కలలు కొంటున్నారో....
నేడు మీరు కొనే
స్థలాలు పొలాలు
ఖరీదైన విల్లాలే చెబుతాయి
మీరెంత శ్రమపడి ప్రేమతో రేపటికి
పిల్లలకు ఆస్తిని ఆర్జించి పెడుతున్నారో...
14. ఆరోగ్యం వుండాలంటే....,?
ఆయుస్సు పెరగాలంటే....?
ఆస్తులు ఆర్జించాలంటే
ఆనందంగా జీవించాలంటే
ఆరోగ్యం వుండాలంటే
ఆయుస్సు పెరగాలంటే
ఆందోళన తొలగాలంటే
అందరి మెప్పు పొందాలంటే
ప్రాణమిత్రులతో వివాదం వద్దు
బద్దశతృవులతో విరోధం వద్దు
ఒక మెట్టు దిగి రాజీకి సిద్దం కావాలి
వీలైతే విహార యాత్రలకు వెళ్ళిపోవాలి
నిత్యం నాలుకను నియంత్రించుకోవాలి
ప్రతినిత్యం వ్యాయామం యోగ చెయ్యాలి
నవ్వుతూ ఎప్పుడూ వుండాలి
నలుగురితో కలిసిమెలిసి తిరగాలి
ఆథ్యాత్మిక గ్రంథాలైన
బైబిల్ భగవద్గీత భారత భాగవత
రామాయణాది మహాగ్రంధాలు పఠించాలి
భక్తితో నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ వుండాలి
ఎప్పుడైనా ఏ ఒక్కరోజైనా ఏ ఒక్కపూటైనా
పై ఈ నియమాలు పాటించక పోతే
మీ జీవితకాలం పదిరోజులు తరిగినట్లే
పాటిస్తే మాత్రం పదిదినాలు పెరిగినట్లే
15. భగవంతుడిచ్చిన
బంగారు బహుమతి...
ఆమె ఆలోచనలు ఊహలు
అభివృద్ధికి సోపానాలు
ఆమె సమయస్ఫూర్తి
అద్భుతం ఆశ్చర్యకరం
ఆమె ఉచిత సలహాలు
పాటిస్తే
ఉజ్వల భవిష్యత్తే
ఆమె సేవాభావం
దయాగుణం ఆచరణీయం
ఆమె దూరదృష్టి గలది
ప్రతిది లోతుగా పరిశీలిస్తుంది
ఆమె పట్టుదల పట్టిందంటే
సాధించి తీరుతుంది
ఆమె సహనం
సర్దుబాటుగుణం
ఊహకందనిది
ఆమె ప్రేమతత్వం
మదర్ థెరిస్సానే
మరపిస్తుంది
ఆమె క్షమాగుణం
క్రీస్తునే గుర్తు చేస్తుంది
ఆమె మంచితనం
మానవత్వం అంతులేనిది
ఆమె కలుపుగోలుతనం
భగవంతుడిచ్చిన ఓ వరం
ఆమె ఓర్పు నేర్పు
ఇతరుల్లో తెస్తుంది గొప్ప మార్పు
ఆమె ఆతిథ్యం
అతిరుచికరం మరుపురానిది
ఆమె ఇచ్చే చక్కని సలహాలు ఆణిముత్యాలు
ఆమె ఉత్సాహం ప్రోత్సాహం
వెయ్యేనుగుల బలం
ఆమె అభిమానం
పొందడం ఒక అదృష్టం
ఆమె ఇతరుల ఇచ్చే గౌరవం
అంతులేనిది విలువైనది
ఆమె లౌకికం చాకచక్యం
అంతుచిక్కనిది
ఆమె భక్తిభావం అపారం
నిజం నిత్యనూతనం
ఆమె అనురాగం ఆప్యాయత
అమృతంతో సమానం
ఆమె కోపం క్షణికం
ఒక నీటి బుడగలాంటిది
ఆమె శాంతం సముద్రం కన్న మిన్న
ఆమె స్నేహానికి చక్కని చిరునామా
ఆమె మా కంటికి ఒక ఆశాజ్యోతి
ఆమె మా ఇంటికి ఒక ఆరని దీపం
ఆమె ఎవరో కాదు
నా చిరునవ్వుల శ్రీమతి
ఆమె భగవంతుడు నా కిచ్చిన
ఓ బంగారు బహుమతి
16. మనిషి ఉండాలి మధ్యస్తంగా
నిత్యం ఇది నగ్న సత్యం
సూర్యుని చుట్టు
భూమి తిరుగుతున్నట్లు
దైవం చుట్టు మనిషి
తిరుగుతూ ఉంటాడు
కాని ఆ దైవాన్ని దర్శించాలన్న ఆశతో
మనిషి దైవానికి అతి చేరువగా వెళ్తే
మసైపోతాడు మాయమైపోతాడు
వెయ్యి సూర్యుల సమమైన
ఆ దివ్యతేజోమయున్ని
తన రెండుకళ్ళతో వీక్షించలేక
కళ్ళు మూసేస్తాడు
కనుమరుగౌపోతాడు
అలాగే దైవానికి
మారీ దూరంగా ఉన్న మనిషి
అజ్ఞానంలో అంధకారంలో
మునిగి ఉంటాడు
అందుకెే మనిషి ఉండాలి
మధ్యస్తంగా అప్పుడే
నిత్యం వెలుగుతూ వుంటాడు
అందరికి వెలుగునిస్తాడు
సూర్యుని కంటే
ముందు లెయ్
సుఖపడతావు
పుష్టికరమైన
ఆహారం తీసుకో
షష్టిపూర్తి చేసుకుంటావు
నియమబద్ధ జీవితమే నిత్యసుందరం
దయ గల హృదయమే దైవ మందిరం
17. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు
ఓ ప్లవనామ సంవత్సర
ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా !
చిరునవ్వులు
చిందిస్తూ రావమ్మా !
సిరిసంపదలు మాకు తేవమ్మా !
ఓ ప్లవనామ సంవత్సర
ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా !
కుహూ కుహూ కోయిల
రాగాలతో కులుకుతూ రావమ్మా !
మా కలలను కోరికలను ఫలింపజేసి
మా చిరుఆశలను చిగురింపజేయవమ్మా !
ఓ ప్లవనామ సంవత్సర
ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా !
మామిడాకులతో మంగళతోరణాలతో
ముత్తైదువులా రావమ్మా !
మాకు మారిచిపోలేని మధుర
జ్ఞాపకాలను మిగిల్చి పోవమ్మా !
ఓ ప్లవనామ సంవత్సర
ఉగాది లక్ష్మీ ! రావమ్మా రా !
వేయి శుభాలనొసగే
వసంత ఋతువుతో రావమ్మా !
మా అందరి జీవితాల్లో ప్రశాంతతను
సుఖశాంతులను ప్రసాదించిపోవమ్మా !
అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో...
18. ఆ రెండు అడక్కు?
ఆకాశంలోఎగిరే పక్షులకు తెలుసు
ఆహారం ఎక్కడ దొరుకుతుందో...
అడవిలో తిరిగే మదపుటేనుగులకు తెలుసు
మంచినీటి సరస్సులెక్కడుంటాయో...
చెరువు గట్టుకుచేరి తొంగి తొంగి చూసే
కొంగలకు తెలుసు చేపలెక్కడ చిక్కుతాయో...
ఎక్కడోవున్న రాబందులకు తెలుసు
చచ్చిన కళేబరాలెక్కడ పడివుంటాయో...
పుట్టలోని చలిచీమలకు తెలుసు
ఎక్కడ చెక్కెర లేదా బెల్లంముక్క పడివుందో...
రాత్రులందు రెక్కీలు నిర్వహించే దొంగలకు తెలుసు
ఏఇళ్ళు దోచుకోవచ్చో ఎలాఈజీగా తప్పించుకోవచ్చో
దొరల్లా తిరిగే దోపిడి దొంగలకు తెలుసు
దోచుకున్నది ఏస్విస్ బ్యాంక్ లో ఎలాదాచుకోవచ్చో...
కోర్టులోని న్యాయమూర్తులకు తెలుసు
ఎవరు నేరస్తులో ? ఎవరు నిర్థోషులో?...
పోలీసు బాసులకు తెలుసు
హత్యచేసింది ఎవరో ఆ హత్యవెనుక
ఏ అధికారి అదృశ్య హస్తముందో...
కానీ...ఈ మనిషికి తెలియనివి రెండే
ఒకటి...రేపు తనకు పుట్టబోయే బిడ్డా
ఆడా మగా అమ్మాయా అబ్బాయాయని...
రెండు... రేపటిరోజున మృత్యువు
ఏరూపంలోవచ్చి తనను కబళిస్తుందోనని...
19. అర్థంకాని జీవిత పరమార్ధం?
(మినీ కవిత)
కలల్లో...
కనకంబెంత దొరికినా
అరక్షణంలో అదృశ్యమైనట్లే...
ఎవరూ అనుభవించలేనట్లే....
అలల్లో...
అందమైన నురగలెన్ని పుట్టినా
నిముషాన నీట మునిగినట్లే...
అవి ఆవలి తీరానికి చేరనట్లే...
శిలల్లో...
ఎన్ని సుందర శిల్పాలున్నా
ఉలితో చెక్కనిదే రూపంలేనట్లే...
శివునిగా మారనిదే గర్భగుడిలో
ప్రతిష్టించనిదే...ధూపం దీపంలేనట్లే...
అర్చనలు.........అభిషేకాలు లేనట్లే...
ఇలలో...
ఎంతో శ్రమపడి భ్రమపడి ఆశపడి
ఎన్ని సిరిసంపదలు అష్టైశ్వర్యాలు
భోగభాగ్యాలను ఆర్జించినా...
ఆ పరమాత్మ
పిలుపుతో అంతా పరులపాలే
కొంతైనా అనుభవించకున్న...
ప్రేమతో పరులకింత పంచకున్న..
అంతావ్యర్థం అదే అర్థంకాని జీవితపరమార్ధం...
20. ఓ కవీ ! కవిత్వం ఇలా వ్రాయి !!
ఓ కవీ ! కవిత్వం ఇలా వ్రాయి..!
కష్టాలను "కట్టగట్టి"
"సమస్యలను "చుట్టచుట్టి"
ఎద ఎదను "ప్రేమతో తట్టి" వ్రాయి..!
"కాలమనే కలం పట్టి"వ్రాయి..!
"జీవితమనే కాగితం" మీద "మనసు పెట్టి" వ్రాయి..!
జంకుబొంకు లేకుండా "ఇష్టమనే ఇంకుతో"
"కష్టమనే కలంతో" సృష్టికర్తను స్మరిస్తూ
అదృష్టంపై కాక నీ స్వశక్తి మీదనే "దృష్టిపెట్టి" వ్రాయి..!
అవినీతి అక్రమాలపై "నిఘా పెట్టి"వ్రాయి..!
చెడును చీల్చిచెండాడి "కొరడాలతో కొట్టి" వ్రాయి..!
నిరుపేదల కన్నీటి కడలికి "ఆనకట్టలు కట్టి" వ్రాయి..!
బానిసబ్రతుకులు బ్రతికే వారి "భుజాలు తట్టి"వ్రాయి..!
జేగంటను మ్రోగిించి గుండెగుండెను తట్టి" రాయి..!
జయహో జయహో అనే నినాదంతో "జై కొట్టి "వ్రాయి..!
నిన్ను వెంటాడే ఓటమిని "గంగలోకి నెట్టి" వ్రాయి..!
సమాజంలోని రుగ్మతలను "సమాధిలోకి నెట్టి" వ్రాయి..!
ముత్యాల్లా మెరిసేటి అక్షరాలను "ముద్దు పెట్టి" వ్రాయి..!
శత్రువుల్ని భయపెట్టి "నీ మిత్రుల్ని సంతోష పెట్టి" వ్రాయి..!
కదిలే అలను కరిగే కలకు "జతకట్టి" వ్రాయి..!
మంచికి మానవత్వానికి నుదుట "బొట్టుపెట్టి" వ్రాయి..!
ఓ కవిశేఖరా! నీవేదైనా వ్రాయి..!
కానీ అణగారిన వర్గాలకు...ఆశాకిరణం...కావాలి..!
అజ్ఞానపు ఆకలితో ఉన్నవారికి...అమృతం...కావాలి..!
ఊపిరాడని బోరుబావి బ్రతుకులకు...ఆక్సిజన్...కావాలి..!
21. నేడు విజేతవే...
రేపు విశ్వవిజేతవే...!
నేడు నీవొకన్నీటి గీతానివే
కానీ రేపు జలజలదూకే
జలపాతానివే
నేడు నీవొపాపవే...కనుపాపవే
కానీ రేపు వెన్నెలవెలుగువే
కోవెలలో కొలువైవుండే
ఓ కులదైవానివే
నేడు నీవొక అందనిదానివే...
అంధకారానివే
కానీ రేపు...
ఆ అంధకారాన్ని చీల్చి
వెలుగులు విరజిమ్మే
అరుణోదయ కిరణానివే
నేడు నీవొక...
మట్టిలో దాగిన విత్తనానివే
కానీ రేపు విశ్వమంతా
విస్తరించే మహావృక్షానివే
నేడు నీవొక బండరాయివే....
శిధిలమైన శిలవే
కానీ రేపు ఒక కమ్మని కలవే ..
అందమైన అలవే
నేడు నీవొక బెదురుచూపుల జింకవే
కానీ రేపు అడవిలో గజరాజువే...
గాండ్రించే పులివే
నేడు నీవొక...
చెరువులో చేపవే...
బావిలో కప్పవే
కానీ రేపు సంద్రంలో
తిరుగులేని ఓ తిమింగలానివే
ఔను అంతా మంచే జరగాలంటే...
మన కథ కంచికి చేరాలంటే...
కాలం కలిసి రావాలి...
కనిపించని...ఆ దైవం కరుణించాలి...
ప్రేమను కురిపించాలి
22. అమ్మో ! ఈ భార్య నా కొద్దు !
(ఒక కామెడీ కవిత)
అక్షయ తృతీయనాడు
కనీసం ఒక లక్షరూపాయలకైనా
బంగారు కొనాలనే సెంట్ మెంట్ ఏంటి ?
నున్నగాఉండి నిగనిగ మెరిసేపోయే
లలితా జ్యువెలరీ షాపు యజమాని
గుండ్రని గుండు రోజు
కలలోకి రావడమేంటి ?
బట్టలషాపు కెళ్ళి
గుట్టలు గుట్టలుగా బట్టలు
ముందు వేసినాఒక్కటీ
నచ్చకపోవడమేంటి ?
తింటే గారెలే తినాలి...
వింటే భారతమే వినాలి
కొంటే పట్టుచీరలే కొనాలని
పట్టుపట్టడమేంటి ?
భర్త నెలజీతాన్ని
బట్టలషాపు వాడికి బాకీపెట్టి
రావడమేంటి? తీర్చలేక
ఆ భర్తకు తిప్పలేంటి ?
పక్కింటి పాపారావు
అందాలరాముడని అచ్చం
అక్కినేనిలా ఉంటాడని
రోజు పొగడడమేంటి ?
ఏమండీ ఆఫీసు
నుండి త్వరగా వచ్చి
అంట్లు తోమండి !
లేదంటే నేను తోముతా !
బట్టలు ఉతకండి !
లేదంటే నేను ఉతుకుతా !
అంటే
అర్థమేంటో అర్థం కాక రోజు
జుట్టుపీక్కోవడమేంటి?
సంసారం ఈదేకన్నా
సాగరంలో దూకడమే మేలని
ఇట్టి ఆశబోతు భార్యలతో
ఇట్టి గయ్యాళి గంపలతో
కాపురంచేసే కన్నా సన్యాసం
స్వీకరించడమే మేలని
భావించే ఓ భార్యా బాధితులారా !
భయపడకండి !
వారి బారినుండి తప్పించుకునే...
మార్గాలు మూడున్నాయి ముచ్చటగా !
ఒకటి...వారిచేత రామకోటి రాయించండి !
రెండు...వ్రతాలు పూజలు
నోములు చేయించండి!
మూడు...వారానికి ఒకసారి
మౌనవ్రతం దాల్చమనండి !
ఆపై భగవంతునిపై భక్తితో భర్తను
మరిచిపోవడం ఖాయం!
నా పతియే నాకు ప్రత్యక్ష దైవమంటూ
నిత్యం మీకు పూజలు చేయడం తథ్యం !
23. కోనేటి రాయున్ని...నే కోరేదొక్కటే ?
ఓ ఏడుకొండల ! వెంకట రమణా!
కోరిన కోర్కెలు తీర్చేటి ఓ కోనేటి రాయడా !
ఏడుకొండలు ఎక్కి మిమ్ము వేడుకునేది !
కోటి కొబ్బరి కాయలు కొట్టి మిమ్ము
కోరుకునేది "ఒకే ఒక్క వరం" తండ్రి !
వద్దు వద్దు మాకు ఖరీదైన
....."కార్లు" వద్దు
....."కోటాను కోట్ల
....."స్థిరాస్తులు"వద్దు
....."పట్టు వస్త్రాలు" వద్దు
....."మేడలు, మిద్దెలు" వద్దు
......"విలాసవంతమైన "విల్లాలు" వద్ధు
......"బంగారు వెండి ఆభరణాలు" వద్దు
కాస్త మంచితనము....మానవత్వం గల...
స్వచ్చమైన...మచ్చలేని...వ్యక్తిత్వం గల...
ఉన్నదాంతో తృప్తి చెందాలనే...
ఉన్నతమైన స్థానంలో ఉండాలనే...
ఆలోచనలు గల...
అభ్యుదయ భావాలు గల...
గురువులంటే...వినయం...
విధేయత గల...
పెద్దలంంటే...ప్రేమ...
గౌరవం...అభిమానం గల...
కన్న తల్లి తండ్రులంటే...
కని...పెంచే...
కనిపించే దేవతలని
కడవరకు...
కన్నుమూసి కాటికెళ్ళే వరకు
కట్టై కాలే వరకు...వారిపై
కనికరము...కరుణ
దయ...జాలిని చూపే
దయార్ద్రహృదయం గల...
భగవంతుడంటే...
అపారమైన...
భక్తి విశ్వాసాలు గల...
చేసే ఉద్యోగంలో
వ్యాపారంలో నీతి...నీజాయితీ గల...
చేపట్టిన ప్రతి కార్యక్రమంలో
ఏకాగ్రత...నైపుణ్యం గల...
సభ్యసమాజం పట్ల సంపూర్ణ
అవగాహన...బాధ్యత గల...
నిరుపేదల్ని...
అనాధల్ని సైతం ప్రేమించే
మంచిమనసు గల.
ఆపదలో ఉన్నవారిని తక్షణమే
ఆదుకోవాలనే సద్బుద్ధి గల...
బిడ్డలను మాకివ్వండి !
ఓ దయగల మా దైవమా !
ఈ ఒక్క వరమిచ్చిన చాలునయ !
కోటి వరాలిచ్చినట్లేనయా!
Comments
Post a Comment