54. మంచి కవితల ఇండెక్స్
1. ఆ కనురెప్పలు కనిపించడం లేదు
2. గుప్పెడు గుండె గంపెడు ఆశ
3. అవును సముద్రం ప్రవహిస్తుంది
4. నేనెవరో తెలుసా
5. స్వాగతం పలికే ఓ స్మశానం
6. రాణి గారు రామచిలుక
7. గుడి నేర్పిన గుణపాఠం
8. రుధిరస్నానం
9. మృత్యువుతో మూడుముళ్ల బంధం
10. అమ్మో ఆన్లైన్ చదువులు
11. మారిన గౌతమ బుద్ధుడు
12. హాయిగా జీవించు నిండు నూరేళ్లు
13. మనుషుల్లోదేవుడుగా మారాలంటే
14. ఆ చిరునవ్వు లో ఏముంది
15. ఖచ్చితంగా విజయం సాధిస్తాడు
16. శాంతి చర్చలు ఎందుకు
17. ఏమన్నది నా మువ్వన్నెల జెండా
18. మీరే మహాత్ములు
19. మీరు ఆడపిల్లలకాదు అగ్గి పుల్లలు
20. నీవు ఎవరిని అతిగా పొగడకు
21. దేవతలారా దీవించండి
ప్రేమికులారా క్షమించండి
22. అమృత బిందువులు
23. ఒకటే గమ్యం ఒకటే లక్ష్యం
24. గరుడ పురాణం ఘోషిస్తుంది
25. ఈ పిచ్చి ముదరక ముందే
26. పాలకొండ అ పచ్చని
చెట్టు పడుచు పిల్ల
27. రంగులు మార్చే ఊసరవెల్లులు
28. నీతి లేని సంకరజాతి
29. కాకి హంస కథ కాకి హంస బ్రతుకు
30. పది సంవత్సరాల సిద్ధాంతం
31. అపురూపమైన ఆడజన్మ
32. ప్రశ్నలు సమాధానాలు
33. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడ
34. విశ్వవిజేతవై విజయఢంకా మోగించి
35. కరోనా పిచ్చికుక్క కరవక ముందే
36. కరోనా కథ చెబుతా
37. నిర్లక్ష్యం వద్దు నియంత్రణే ముద్దు
38. ఒకే కులం ఒకే మతం ఒకే జాతి
39. కలియుగ దైవం సోనుసూద్
40. ఏడుకొండలవాడా వెంకటరమణ
41. విగ్నేశ్వరునికి విన్నపం
42. ఆ నాస్తికుడు ఆస్తికుడెలా అయ్యాడు
43. ఓ గురు దేవుళ్ళారా
మీకు పాదాభివందనాలు
44. పరమత సహనం పరమత ద్వేషం
45. అమ్మా నీకు
వందనం పాదాభివందనం
46. ఓ నాన్న నీకు పాదాభివందనం
47. కన్నతల్లి కన్నీటి ప్రార్థన
48. వీరులు మగధీరులు
49. పాపం కన్నెపిల్లలు కొందరు
50. విదేశీ వివాహం
52. అక్కడెక్కడో ఢిల్లీ నడిబొడ్డున
53. మీ భక్తులు కోరేదొక్కటే...
54 .ఓసీ కరోనా రాక్షసి !
ఎవరే నిన్ను కన్నది
55. నా సూక్తులు నా శుభాషితాలు
56. నిండు కుండలా..?మంచు కొండలా..?
57. అంతా ఆ దైవనిర్ణయమే..!
1. కనురెప్పలు కనిపించడంలేదు
కడలన్నాక అలలు తప్పవు
కనులున్నాక కలలు తప్పవు...
ఇది పచ్చినిజం
రోజు గురకలు పెట్టి నిద్ర పోయేనేను
నిన్నరాత్రి కలత నిద్రలో ఓ కలగన్నాను
నా కనురెప్పలు రెండు కనిపించడం లేదు
నా మనసు మసకచీకటిని
అలసిసొలసి పోయి మంచంపైన వాలిన
నా ఒళ్ళు మెత్తని పరుపును
నా చేతులు రెండు దిండును వేడుకుంటున్నాయి
కాస్త అలజడిని ఆందోళనను తగ్గించమని
కొంచెం విశ్రాంతినివ్వమని...
కాస్త కునుకును ప్రశాంతతను ప్రసాదించమని....
కానీ నా కళ్ళురెండు గూటిలో గువ్వల్లా
గుసగుసలాడు కుంటున్నాయి
గుడ్లగూబల్లా ఉరిమి ఉరిమిచూస్తున్నాయి
మౌనంగా ఏవో మాట్లాడుకుంటున్నాయి
కనురెప్పల వాకిళ్ళు మూతపడలేదెందుకని....
ఔను నా కనురెప్పలు రెండు కనిపించడంలేదు
అవి పరమాత్మ పాదాలు పట్టుకొని వ్రేలాడుతున్నాయి వేడుకుంటున్నాయి అర్థిస్తున్నాయి ప్రార్థిస్తున్నాయి
తమను శాశ్వతంగా ఏకమైపొయేలా అజ్ఞాపించవద్దని
ఎట్టకేలకు నా నిట్టూర్పు
గాఢనిద్రగా మారింది
తెల్లవారగానే నా
కమ్మనికలకరిగిపోయింది
చీకటి తెరలు చిరిగిపోయాయి
కనురెప్పల వాకిళ్లు భళ్ళున తెరుచుకున్నాయి
వెండివెలుగుల్లో నాకన్నులురెండు స్నానమాడుతున్నాయి
నిన్నరాత్రి నా కనురెప్పలు
కోరిన ఆ కోరిక తీరాలని
నే కన్నకమ్మని కల నెరవేరాలని పగటికలకారాదని
నేను సైతం వేయిదేవుళ్లను వేడుకుంటున్నాను
ఔను కనురెప్పలు రెండూ ఏకమైతే...
కాస్త మగతనిద్ర......శాంతి.......విశ్రాంతి
అవే విడిపోతే మనకు.......వెన్నెలకాంతి
ఆ రెప్పలురెండూ శాశ్వతంగా ఒక్కటైతే...
అదే మనిషికి...అవనిపై"ఆఖరినిద్ర"...
ఆపై అందినట్లే పరలోక ప్రయాణానికి..."ఆమోదముద్ర"
2. గుప్పెడు గుండె - గంపెడు ఆశ
నేను గుప్పెడు గుండెను
గంపెడు ఆశతో తవ్వుతున్నాను
మనిషి మానవత్వానికి
మనిషిలోని సకల సద్గుణాలకు
గుర్తుండిపోయేలా ఒక గుడికట్టడానికి
నేను గుప్పెడు గుండెను
గంపెడు ఆశతో తవ్వుతున్నాను
మానవత్వమనే శిలను చెక్కి
దైవత్వమనే సుందర శిల్పాన్ని
గాలిచొరపడని
గర్బగుడిలో ప్రతిష్టించడానికి
నేను గుప్పెడు గుండెను
గంపెడు ఆశతో తవ్వుతున్నాను
ఉక్కిరిబిక్కిరైపోయిన
నా ఊపిరి చెబుతోంది
అరిషడ్వర్గాలను
అంతరంగాన ఆహుతి చేయమని
నేను గుప్పెడు గుండెను
గంపెడు ఆశతో తవ్వుతున్నాను
రేపటి సూర్యోదయం సాక్షిగా
వెలుగు కిరణాలు
నన్ను వెక్కిరిస్తున్నాయి
చీకటితెరలు చిరిగిపోతేనే
తప్ప అది సాధ్యంకాదని
3. ఔను సముద్రం ప్రవహిస్తుంది !
పిల్లకాలువకు ప్రాణం వుంది
అది ఏరు వైపు ప్రవహిస్తుంది
ఏరుకు ప్రాణముంది
అది నది వైపు ప్రవహిస్తుంది
నదికి ప్రాణముంది
అది కడలివైపు ప్రవహిస్తుంది
కడలికి ప్రాణంలేదని
అది ప్రవహించదని
ప్రపంచమంతా భావిస్తుంది
"కనిపించని కాలం"
శరవేగంతో పరుగులు తీస్తుంది
పాదాల్లేని పాములా...
అన్నది నిన్న
నిరూపించబడిన నిజమే
"కదలని భూమి"
తనచుట్టుతాను తిరుగుతూ
సూర్యునిచుట్టు ప్రచండవేగంతో
తిరుగుతుంది
కనిపించని గాలిలా...
అన్నది కూడా నిన్న
నిరూపించబడిన నిజమే
ఔను కడలి కూడ ప్రవహిస్తోంది !
ఎటు ? ఆకాశం వైపు ?
వెళ్ళి అది మేఘాలలో
దాక్కుంటుంది!
ఉరుమై ఉరుముతుంది!
మెరుపై మెరుస్తుంది!
చల్లగాలితో స్నేహం చేస్తుంది!
చివరికి చినుకై నేలపై రాలుతుంది
బిందువు బిందువూ సింధువౌతుంది
ఔను సముద్రం ప్రవహిస్తుంది !
అతిరహస్యంగా...అదృశ్యంగా !
దాని పరుగు పరమాత్మకే ఎరుక !
కారణం అది అర్థంకాని ప్రకృతిధర్మం !
అది అంతు చిక్కని ఓ సృష్టిమర్మం !
4. నేనెవరో తెలుసా ?
నేను మిడిసిపడే
"మిడతను"కాను
మీ పంటలను ధ్వంసం చేసే
"మిడతలదండును" కాను
శ్రీ రామసేతుకు ఇసుకరేణువుల్ని
మోసిన చిరు"ఉడుతను" నేను...
నేనెవరో తెలుసా ? నేను
ఉరిమే "ఉరుమును"కాను
మెరిసే "మెరుపును" కాను
అకస్మాత్తుగా నెత్తినపడే
"పిడుగును" కాను...
నేనెవరో తెలుసా?
మండే ఎర్రని ఎండలో
మీ "చల్లనినీడను" నేను
కురిసే తొలకరి జల్లులో
మీరు తడవకుండా వుండే
మీ"చేతిగొడుగును" నేను...
నేనెవరో తెలుసా ?నేను
ఎత్తైన "కొండను" కాను
మీరు మోయలేని
"బండను"కాను బరువును కాను
మీ "గుప్పెడుగుండెను" నేను...
నేనెవరో తెలుసా?
మీ "పంచప్రాణాన్ని"నేను
మిమ్ము ఎల్లవేళలా
ఉల్లాసపరిచే ఉత్తేజపరిచే
మీకు ఉపశమనాన్ని కలిగించే
మిమ్మల్ని పరవశింపజేసే
స్వర్గంలో విహరింపజేసే
మీ "వేణుగానాన్ని" నేను...
నేనెవరో తెలుసా ?
మీ "నేస్తాన్ని" నేను
మిమ్మల్ని ఆపదలో ఆదుకునే
మీ "అభయహస్తాన్ని"నేను...
నేనెవరో తెలుసా ?
మీ "ప్రత్యర్థిని" కాను
ప్రమాదకారినసలే కాను,
మీ "ప్రాణస్నేహితున్ని"నేను...
5. స్వాగతం పలకకే ఓ శ్మశానమా !
ఒకనాడు కడుపేదరికంలో
దారిద్ర్యంలో దగ్ధమైన మనిషి
నేడు ధనవంతుడయ్యాడు,కాని
దానకర్ణుడు కాలేకపోయాడు
దొంగచాటుగా దోచుకున్నది
బ్యాంకుల్లో భద్రంగా దాచుకున్నది
ఎలా పట్టుకెల్లాలో
అర్థంకాక జుట్టు పీక్కుంటున్నాడు
సమాధిలో ఎలా దాచుకోవాలో
ఏమి చేయాలో అర్థంకాక
ఎవరికీ వినపడకుండా
కన్నీళ్ళు ఎవరికీ కనపడకుండా
చీకటిలో కుర్చొని చింతిస్తున్నాడు
కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ... ఏడుస్తూ
కుప్పకూలిపోయాడంతే...
రెప్ప మూయలేదు... ఇంకా...
బ్రతికే వున్నాడు...
అందుకే తొందరపడి....
స్వాగతం పలకకే ఓ శ్మశానమా !
కాటికాడి కాకులు రమ్మంటున్నా
కన్పబిడ్డలే కాటికి పొమ్మంటున్నా
రాత్రింబవళ్ళు తన రక్తాన్ని ధారబోసి
అష్టకష్టాలుపడి ఆర్జించిన ఆస్తినంతా
ఒక్కరోజు కూడా...ఒక్కగంట కూడా...
ఒక్క చెమటచుక్కనైనా కార్చని...
కాయకష్టమంటే ఏంటో ఎరుగని...
ఒక్కపూటైనా కడుపు నిండా
కన్నతల్లిదండ్రులకింత తిండిబెట్టని....
పరమ ఆశబోతులైన...దుష్టులైన...
దుర్మార్గులైన... దురాశాపరులైన...
కన్నవారిమీద ప్రేమలేని కఠినాత్ములైన...
కరుణ జాలిలేని కర్కశహృదయులైన...
ఈ కన్నబిడ్డల చేతుల్లో
ఎలాపెట్టాలో అర్థంకాక
మదనపడి... మదనపడి...
మంచాన పడిపోయాడంతే...
మరణించలేదు...ఇంకా ....
మాట్లాడుతూనేవున్నాడు...
అందుకే తొందరపడి...
స్వాగతం పలకకే ఓ శ్మశానమా !
ఈ జంజాటానికి ఈ ఆశలఆరాటానికి
ఈ జీన్మరణ పోరాటానికి కారణమొక్కటే
పోతూపోతూ పట్టుకు పోవడానికి...
వస్తూవస్తూ తానేమీ తేలేదన్న వాస్తవం ఎరుగక...
నాదినాది అనుకున్నదేదీ
నీదికాదన్న నిజం తెలియక...
6. రాణిగారికి ముద్దుపెట్టిన
రామచిలుక! (హాస్య కవిత)
ఓ బంగరు రంగుల రామచిలుక ! నా
రామచిలుక ! ఎక్కడ ఎగురుచుంటివి ?
రాజుగారి తోటలో విహరించుచుంటిని
రాజుగారి తోటలో విహరిస్తు ఏమిచేస్తివి ?
నా కిష్టమైన జామపళ్ళు కొరికి తింటిని
జాంపళ్ళు తిన్న నిన్ను భటులేమిచేసిరి ?
పట్టుకెళ్ళి మహారాణి మందిరంలో వేసిరి
అప్పుడు రాణిగారొచ్చి ఏమి చేసిరి ?
పెద్ద పంజరంలో నన్ను బంధించి వేసిరి
అయ్యే ! ఓ రంగుల రామచిలుకా ! బంధీవై
నీవేమి చేసితివి ? ఆకలేసి అల్లరిచేస్తిని
అప్పుడు రాణిగారొచ్చి ఏమిచ్చిరి ?
మంచిఫలము లిచ్చిరి ముద్దులిచ్చిరి
రాణిగారు ముద్దుపెట్టగా నీవేమిచేస్తివి ?
రాణిగారి బుగ్గమీద నేచిన్నగాటు పెడితిని
భగ్గుమన్న రాజుగారు నీకేమి శిక్షవేసిరి ?
మళ్ళీ నన్ను పంజరంలో బంధించి చేసిరి
అయ్యో ! ఓ రంగుల రామచిలుక !
బంధీవై మళ్ళీ నీవేమి చేస్తివి ?
పంజరం నుండే మంచిపాట పాడితిని
ఏ మాపాట కొంచెం పాడి వినిపించవా!
"ఓ బంగరు రంగుల చిలకా పలకవా...
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ....
నాపైన ప్రేమే ఉందని ఈఈఈ...
నా పైన అలకే లేదని ఈఈఈ."
పాటకు పరవశించిన
రాజు రాణి ఏమిచ్చిరి?
మెచ్చుకొని
ఓ బంగారుహారం మెళ్ళోవేసిరి
ఓ బంగరు రంగుల
రామచిలుక ! నీవేమిచేస్తివి?
నేనలిగి.....మూతిని ......
ముడుచుకుంటిని
రాణిగారు ముద్దుపెట్టి
అలకెందుకని అడిగింది
ఓ రంగుల రామచిలుక !
మరి నీవేమి కోరితివి ?
ఆకాశాన...హాయిగా...
పిచ్చిగా...తిరగాలంటిని
గాలిలో ఎగరాలంటిని
ఆడుకోవాలంటిని అంతే
రాజు రాణి నవ్వి నన్ను
ఆకాశంలో ఎగురవేసిరి
ఇప్పుడు నేనాకాశంలో
ఎంతో ఎత్తులో హాయిగా
హాయి హాయిగా
ఎంతో స్వేచ్చగా
ఎగురుతుంటినీ
అంతఃపురంలో కన్న...
స్వేచ్చ... ఆకాశంలో మిన్న
అన్న ఒకచిన్న నగ్నసత్యం నేడు తెలుసుకుంటిని
7. గుడి నేర్పిన గుణపాఠం (హాస్య కవిత)
చేదైనా సరే
ఒక నిజం చెప్పుకోవాలి
ఆ భార్యాభర్తలవి
బక్కరిక్షావాళ్ళు
భయపడే భారీశరీరాలే...
పుణ్యం పురుషార్థమాశించి
గుడిలో పూజలు ప్రదక్షిణలు
చేయ భక్తితో బయలు దేరారు
భార్యాభర్తలిద్దరు
పిసనారీతనంలో పిహెచ్ డీ చేశారు..
బేరమాడకుండా వస్తువులు కొనడం
వారి ఇంటా వంటాలేదు.....
ఇంటినుండి గుడిదాక బేరాలే
రిక్షావాడితో బేరం...
పూలు పళ్ళు కొబ్బరికాయలు
కొనేవారితో బేరం...
గుడిముందర అడుక్కునే
బిక్షగాళ్ళ దగ్గర బేరం...
గుడిలో పూజారి హారతి
పళ్ళెంలో వేసేదక్షిణ దగ్గర బేరం....
చివరికి సాక్షాత్తు భగవంతునితోనే బేరం
గుండెపోటులాంటి రోగాలు రాకుండా చేస్తే
గుడికివచ్చి గుండుకొట్టించుకొంటామని
నూటొక్క ప్రదక్షిణలు చేస్తామని వింతబేరం
దర్శనం చక్కగా జరిగినా ఆతృప్తి అరక్షణం
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
గుడిబయటకురాగానే గూబగుయ్ మన్నది
గుండెపోటు వచ్చినంతపనైంది
చెంపచెల్లుమన్నది కొంపకొల్లేరైంది
భార్య చెప్పు తెగిపోయింది
భర్త ఖరీదైన కొత్త షూస్
దొంగలెత్తుకుపోయారు
ఐనా వారి బుద్ధిమారలేదు
మళ్ళీపాతచెప్పుకుట్టే వాడితోబేరం
కొత్త చెప్పులు కొంటూ బేరం
ఇళ్ళు చాలా దూరం, అందుకే
ఆటోడ్రైవర్ తో అరగంటబేరం..పాపం
ఇంటిమలుపు దగ్గర రెండు ఆటోలుఢీ
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
ఆటో తిరగబడి భర్తకుడికాలు విరిగింది
భార్య ఎడమచెయ్యి విరిగింది
తిరిగి అదేఆటోలో ఆసుపత్రికి ప్రయాణం
ఆసుపత్రిలో వారి బేరాలన్నీ బంద్
డాక్టర్ ఫీజు....నో బేరం
మందులషాపులో... నో బేరం
ఆసుపత్రి బిల్లులో...నో బేరం
ఈ బేరాల వల్లే వారికి జ్ఞానోదయమైంది
మిగిలిందానికన్న చేతికి తగిలిందే మిన్న
ఆగుడే వారికొక గొప్ప గుణపాఠం నేర్పింది
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
దానవత్వమే దైవత్వమని..............
మంచితనమే మానవత్వమని.......
చిత్తశుద్ధిలేని శివపూజలు శుద్ధదండగని....
8. రుధిర స్నానం...
మన ఆచారవ్యవహారాలు
అతి ప్రచారాలకు
అతి విశ్వాసాలకు
ఆలవాలమైతే...
అతి విద్వేషాలకు
అజ్యం పోస్తే...
వింత పోకడలకు
విత్తనాలైతే...
అది ఘోరసంక్షోభానికి
సంకేతమే...
మన ఆచారవ్యవహారాలు
ఒక నీతిని
ప్రబోధించినంతకాలం
ఒక జాతిని
నిర్మించినంతకాలం
నిస్తేజమైన ఈ జనాలను
జాగృతి చేసినంతకాలం
ఏ ప్రమాదం లేదు...
మన ఆచారవ్యవహారాలే
మన నియమ నిబంధనలే
మన కఠినమైన కట్టుబాట్లే
మన సంస్కృతి సాంప్రదాయాలే
కొందరి అంధవిశ్వాసాలకు బంధీలైతే...
అప్పుడంతటా...
విషాదమే వినాశనమే విధ్వంసమే
కొందరి అధికారం అహంకారం
అణచివేతలకు అసమానతలకు
స్వేచ్ఛా స్వాతంత్రాలకు
సోదర భావాలకు సంకెళ్లు వేసినప్పుడే....
గళాలు కత్తులై కుత్తుకలు త్రెంచేది
పిడుడికిళ్ళు పిడుగులను కురిపించేది
తూర్పున సూర్యుడు రుదిరస్నానం చేసేది
ఎర్రని తిరుగుబాటు జెండాలు ఎగిసిపడేది
ధిక్కారస్వరాలు దిక్కులు
పిక్కటిల్లేలా నినదించేది
ప్రశ్నించేది ప్రతిఘటించేది
నవ్వుతూ ప్రాణాలనర్పించేది
9. మృత్యువుతో
మూడుముళ్లబంధం?
ఔను ఈ జీవితం
ఒక ఆశల ఆరాటం...
ఈ జీవితం
ఒక నిరంతర పోరాటం...
ఈ జీవితం
ఒక నిప్పుల కుంపటి...
ఈ జీవితం
ఒక కత్తుల వంతెన...
అందుకే నీవెప్పుడైనా
శాంతికి సంధికి బంధీవైనా
నిశిరాత్రిలోనైనా సరే
నిప్పులు కురుస్తున్నా సరే
యుద్ధానికెప్పుడు
సిద్ధంగా ఉండాలి
రెక్కలు విరిగిన శాంతికపోతం
చుక్కల్లో విహరిస్తుందా? లేదే
దారాన్ని మింగిన గాలిపటం
నింగిలో నిద్రిస్తుందా? లేదే
నింగి నేలకు ఎంత దూరమో
జీవాత్మ పరమాత్మకు
ఎంత భారమో ఎవరికెరుక?
అందుకే ఆ భగవంతునితో
బ్రతుకు బేరమెందుకు?
మృత్యువుతో మూడునాళ్ళ
మూడుముళ్ల బంధమెందుకు?
10. అమ్మో ! ఆన్ లైన్ చదువులు???
పుస్తక పఠనమెందుకంటూ
నెట్లోనే అన్నీవున్నాయంటూ
భక్తితో భగవద్గీతను చదవాలని
విద్యార్ధులు కొందరు నెట్ ఓపెన్ చేశారు
పదినిముషాలు భగవద్గీతను
భక్తి శ్రద్దలతోచదివారు, అంతే
ఆపై బ్రేక్ పడింది, కారణం
చక్కని బాపుబొమ్మ ఒకటి
ప్రక్కనే కనపడుతోంది కన్నుకొడుతోంది
మనసును కలవరపెడుతోంది
ఆపై భగవద్గీత ప్రక్కకెళ్ళింది
అందమైన ఒంపుసొంపుల
బాపుబొమ్మ ఒకటి ముందుకొచ్చింది
కన్నార్పకుండా అందరు
అలా చూస్తూ,చూస్తూవుంటే,
క్షణంలో, ఆ బాపుబొమ్మ
ఒక్కసారి బూతుబొమ్మగా మారింది
అంతే, వయసు పులకరించింది.
మనసు పరవశించింది.
కొందరు కోర్కెలతో రగిలిపోయారు
మరికొందరు మత్తులో ఊగిపోయారు
సలసల కాగిపోయారు, సందేహాలతో
విద్యార్థులందరు సతమతమైపోయారు
భగవద్గీతనా?
బాపుబొమ్మనా?
బూతుబొమ్మనా?,ఏది?...
ఏది చూడాలో,ఏది చదవాలో అర్ధంకాక
జుట్టు పీక్కున్నారు.పిచ్చివాల్లై పోయారు
అసలే కోరికలతో రగిలే ఆ కుర్రకుంకల
కళ్ళన్నీ ఆ బూతుబొమ్మ...మీదనే
అది విద్యార్దుల తప్పు కాదు...
నిద్రలేచింది మొదలు పిల్లలు
చేసేపనిని, వెళ్ళేచోటును, కలిసేమిత్రుల్ని
నెట్లోచూసే బొమ్మల్ని,గమనించని,
నిఘాపెట్టని, తప్పనిచెప్పని, తల్లీదండ్రులదే
పిల్లలు చెడిపోయిన తర్వాత
ప్రేమలో పడిపోయిన తర్వాత
పీకలదాకా మునిగిపోయిన తర్వాత
తిట్టి,కొట్టి,ఇంటినుండి గెంటి,లాభమేంటి ?
అందమైన ఆ బూతుబొమ్మలె మీ
బంగారు బ్రతుకుల్నిఅంధకారం చేస్తాయని
వారికి తెలియజెప్పవలసిన బాధ్యత
ఇంటి పెద్దదే కాదు, ఇంటిలోవుండే ప్రతిఒక్కరిది
ఔను పుస్తకపఠనమే ఉత్తమం కారణం
భగవద్గీత ఓపెన్ చేస్తే భగవద్గీతనే చదువుతారు
బైబిల్ ని ఓపెన్ చేస్తే బైబిల్నేచదువుతారు
అందుకే ఆన్లైన్లో పాఠాలు వినే విద్యార్థులారా!
పాఠాలు బోధించే ఓ పంతుల్లారా! జాగ్రత్త!
మీ కళ్ళు జాగ్రత్త ! ...మీ సెల్లు జాగ్రత్త !
మీ ఒళ్ళు జాగ్రత్త.!..మీ మనసు జాగ్రత్త !
11. మారిన గౌతమబుద్దుడు.....
అమ్మా
మాతా కవళం
భవతీ భిక్షాందేహి
తల్లీ అన్నపూర్నేశ్వరి
కాస్త బిక్ష వేయండి తల్లి
ఆకలి దహించుకు పోతోంది
ఇది మూడవసారి
ఎంత గొంతుచించుకున్నా
ఎంతగా పిలిచినా ఆ ఇల్లాలు
కరుణించడంలేదు కనిపించడం లేదు
కారణమేమిటో అసలు తెలియకున్నది
వారం తర్వాత ఇంటిముందు
అవే అరుపులు అవే ఆకలికేకలు
గుమ్మం వైపు గుడ్లగూబలా చూపులు
ఇల్లాలు బయటికి రాదాయె
బిక్ష వేయదాయె
ఆమెకు ఈ సన్యాసులంటే భయమేమో?
ఆ తల్లికి ఈ బిక్షగాళ్ళంటే అసహ్యమేమో ?
అరిచి అరిచి గొంతు బొంగురు పోతుంది కాదు
కాదు ఖచ్చితంగా
ఆ ఇల్లాలు చెవిటిమేళమే?
సందేహాలతో
సతమతమౌతూ
ధైర్యంచేసి తలుపు
తట్టి కొట్టి భవతీ భిక్షాందేహి
మాతా కవళమంటూ
బిగ్గరగా పెట్టిన ఆ గావుకేకకు
తలుపు తెరుచుకుంది
తన శ్రమ ఫలించింది కాని
ఆ ఇల్లాలును చూడగానే
కళ్ళు రెండుబైర్లు కమ్మాయి,కాలికింద భూమికదిలింది
ఆ ఇల్లాలు బిక్షతో రాలేదు
బిడ్డనెత్తుకొని వచ్చింది
వారెవరో కాదు సాక్షాత్తు
తన భార్యా తన కన్నబిడ్డే
తానప్పులపాలై తీర్చేదారిలేక
"వేషంమార్చి" సన్యాసైతే
తనభార్య "ఊరినేమార్చి"
ఒంటరిగా బ్రతుకుతోంది బిడ్డతో
భిక్షకోసం కాదు
భార్యబిడ్డల కోసం అరచినట్టైంది
కన్నీళ్ళతో ఎదురుగా
కట్టుకున్న భార్యా... కన్నబిడ్డ
అందుకే సన్యాసం ఆశ్రమానికి
తాను మాత్రం ఇంటిలోనికి...
నాటి బుద్ధుడు భార్యాబిడ్డలను
వదిలి సన్యాసిగా మారాడు
నేటి బుధ్దుడు సన్యాసాన్ని
త్యజించి భార్యాబిడ్డల్ని చేరాడు
12. హాయిగా ! జీవించు నిండూనూరేళ్లు !!
ఓ మనిషీ!
ఆత్మహత్యలతో
అన్ని అంతమౌతాయా ?
లేదే...చావే సకల సమస్యలకు పరిష్కారమా?...కాదే
ఈ మానసిక వ్యధలకు....
కాదు మరణం ఒక మందు
అది విషాదాల విందు...
తెలుసుకో ఆ సత్యం ముందు
ఈ జీవితం చాలా
చిన్నది ఏమంటున్నది?
నీలో ఓపిక... ఊపిరి ఉన్నంతవరకు
నిన్ను వేధించే మానసిక వ్యధలతో...
నిన్ను వెంటాడే ప్రాణ భయభూతంతో...
నిన్ను చాటుమాటుగా కాటు వేయాలని
పొంచిఉన్న సమస్యల సర్పాలతో...పోరాడమన్నది...
ఈ జీవితం చాలా
చిన్నది ఏమంటున్నది?
నిత్యం చెరగని చిరునవ్వుతో...
ఆవగింజంత ఆశతో... జీవించమన్నది...
చితిఒడికి చేరాలన్న... చింత వొద్దన్నది...
ఎంతటి విపత్తుల హోరుగాలి వీచినా...
ఎంతటి అవాంతరాల...అవరోధాల
జడివానలు కురిసినా...
నీ ఆశాదీపాన్ని ఆరనియ్యకన్నది...
ఈ జీవితం చాలా
చిన్నది ఏమంటున్నది?
నీలో జీవమున్నది...
అది నిన్న మొన్న రేపు నీది కాదన్నది...
నేడే నీదన్నది...ఇదినిజమన్నది
తనువును
చాలించాలన్న తలంపే...
చిత్తంలో చేరనీయకన్నది...
నీరున్ననది ఒడ్డున వేరున్న
తరువులా చిగురించమన్నది...
నీ జీవితం చాలా
చిన్నది ఏమంటున్నది?
మాయనిగాయాలతో
మనశ్శాంతి కరువైందని
"మరణాన్ని మందు" అడగకన్నది...
ఆయుష్షునే ఆయుధంగా మార్చుకోమన్నది...
మృత్యువును బెదిరించడం
ఎదిరించడం నేర్చుకోమన్నది...
ఈ జీవితం చాలా
చిన్నది ఏమంటున్నది?
ఆ పరమాత్ముని ఆత్మ నీలో వుందన్నది...ఎంతో
సంతోషంతో ప్రశాంతంగా హాయిగా నిండూనూరేళ్లు జీవించమన్నది...
వెయ్యేళ్ళు చిరంజీవిగా వర్ధిల్లమన్నది...
13. మనుషుల్లో దేవుడిగా మారాలంటే?
ఓ మనిషీ !
నీ సహనం సర్దుబాటుగుణం,
నీ మంచితనం మానవత్వమే,మచ్చలేని
నీ వ్యక్తిత్వానికి, "మంగళతోరణాలు"
ఓ మనిషీ !
నీ త్యాగం, నిరుపేదలపై నీ అనురాగం
నీ స్నేహం, నీ సేవాభావం, నీ ఆశయాలు,
నీ ఆదర్శభావాలే, నీకు "పెట్టనిఆభరణాలు"
ఓ మనిషీ !
నీ కీర్తి,నీ స్పూర్తి, నీ స్మరణే
మనిషి మనిషిపై వెచ్చని వెలుగులు
విరజిమ్మే, ఉషోదయపు "సూర్యకిరణాలు"
అందుకే, ఓ మనిషీ ! నీవు
రాళ్ళలో రత్నంగా మెరవాలంటే
మట్టిలో మాణిక్యమై పోవాలంటే
ఆకాశంలో ధృవతారగా వెలగాలంటే
చరిత్రలో చిరంజీవిగా మిగలాలంటే
మనుషుల్లో దేవుడిగా మారిపోవాలంటే
నీ గుండెను గుడిగా చేసుకుని
అతి నిష్టాగరిస్టుడివై, భక్తితో, దీక్షతో
దినదినం స్మరించాలి,ఆ దివ్యనామం
శరణం శరణమంటు ఆ "శ్రీవారిచరణాలు"
14. ఆ చిరునవ్వులో ఏముంది?
ఆ చిరునవ్వులో ఏముంది ?
మనోవేదనకు మందుంది
సకల సమస్యలకు పరిష్కారముంది
మేను పులకరించే వేణు గానముంది
చింతను చీకటిని తరిమేసే చిరుదివ్వెవుంది
అమృతాన్ని చిలకరించే అక్షయపాత్రవుంది
ఆ చిరునవ్వులో ఏముంది ?
కిలకిల నవ్వే నది వుంది
గిలగిల పారే సెలయేరు వుంది
జలజల దూకే జలపాతముంది
అందాల అలలు ఎగిసి ఎగిసిపడే
అంతులేని ఆనంద సాగరముంది
ఆ చిరునవ్వులో ఏముంది ?
ఎంత తిలకించినా తనివితీరని
ఏడు రంగుల ఇంద్రధనస్సుంది
శాంతి సౌభాగ్యాల సంపద వుంది
మాయని గాయాలకు మందుంది
ఉరకలు వేసే ఉల్లాసం,ఉత్సాహముంది
ఆ చిరునవ్వులో ఏముంది ?
సూర్యోదయముంది,చల్లని వెన్నెల వుంది
ఆకాశవీధిలో ప్రకాశించే ధృవతార వుంది
అసలా చిరునవ్వులో లేనిది ఏముంది?...
ఒక చక్కని చిరునవ్వునవ్వి సాధించలేనిది...
పొందలేనిదంటూ ఏముంటుంది? చెప్పండి...
15. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు
కల గన్న వాడు
కసి ఉన్న వాడు
కత్తిలా పదునైనవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు
పట్టుదల ఉన్నవాడు
పడినా లేచి పరిగెత్తేవాడు
పదే పదే ప్రయత్నించేవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు
ఒక ప్లాన్ ప్రకారం ముందుకు దూకేవాడు
పగలు రాత్రి శ్రమించేవాడు, పడుకున్నా
సరే,పనిపని అని నిద్రలో కలవరించేవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు
తన తప్పులు తాను తెలుసుకున్నవాడు
తన శక్తినే తాను నమ్ముకున్న వాడు
తల్లిదండ్రుల మాటలు విన్నవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు
భయమన్నది ఎరుగనివాడు
భక్తిలో నిండా మునిగిన వాడు
భగవంతునిపై భారం వేసినవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు
16 .శాంతి చర్చలెందుకు?
ఆ ప్రేమ ఎందుకు?
మనిషిలోని మానవత్వాన్ని
మేల్కొల్పేందుకు
ఈ ద్వేషమెందుకు ?
ప్రాణాలకు తెగించి ప్రత్రర్థులపై
ప్రతీకారం తీర్చుకునేందుకు
ఆ పరశురాముని గొడ్డలెందుకు?
అడవిలోని విషవృక్షాలను
తెగనరికేందుకు
ఈ మారణాయుధాలెందుకు?
యుద్ధములో శత్రువులను
హతమార్చేంచేందుకు
ఆగని ఆ కన్నీటి ధారలెందుకు?
20 మంది భారతమాత బిడ్డలు
మంచుకొండల్లో నేలకొరిగినందుకు
ఈ గులాబీ పూలెందుకు ?
దేశరక్షణకై ప్రాణాలర్పించిన
ఆ వీరజవాన్ల పాదపద్మాలపై చల్లేందుకు
అశృనయనాలతో శ్రద్దాంజలి ఘటించేందుకు
ఆ మెరుపుదాడు లెందుకు?
చైనా దురాక్రమణదారుల,గుండెల్లో
తూటాలు పేల్చేందుకు,గుణపాఠం నేర్పేందుకు
బద్దశత్రువులతో ఈ చర్చలెందుకు?
శాంతి పావురాలను ఎగుర వేసేందుకు
మంచుకొండల్లో రక్తపుటేరులను ఆపేందుకు
17. ఏమన్నది? ఏమన్నది?
నా మువ్వన్నెలజెండా ?
అదిగో అదిగో అల్లదిగో
ఆ నీలి ఆశలఆకాశంలో
రెపరెపలాడుతూ
ఎగురుతోంది ఎగురుతోంది
నా మువ్వన్నెలజెండా
ఏడురంగుల ఇంద్రధనస్సులా...
కోటిప్రభల సూర్యబింబంలా...
ముత్యాల, మురిపాల, ముచ్చటైన
నా మువ్వన్నెలజెండా
ఏమన్నది ఏమన్నది ?
నీతిగా...నిజాయితీగా...
నిప్పులా బ్రతకమన్నది
నిర్భయంగా...తలఎత్తుకు తిరగమన్నది
ఏమన్నది ఏమన్నది ?
నా మువ్వన్నెల జెండా
ఎందరో నిస్వార్థపరుల,
మహానుభావుల
మహాత్ముల, స్వాతంత్ర్య
సమరయోధుల,
జాతినేతల, జైలు జీవితాల, రక్తతర్పణాలకు
ప్రతిఫలమే...మన అర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది
ఏమన్నది ఏమన్నది?
నా మువ్వన్నెల జెండా
మన మహనీయులు
మహర్షులందించిన నాలుగు
వేదాలే ధర్మాన్ని
నాలుగుపాదాలపై నడిపిస్తాయన్నది
ఎండిన పంటపొలాలను
సస్యశ్యామలం చేసే
గంగాయమున బ్రహ్మపుత్రలే
మనకు జీవధారలన్నది
ఏమన్నది ఏమన్నది ?
నా మువ్వన్నెల జెండా
సర్వమతాలకు, కులాలకు,
జాతులకు
వర్ణాలకు వర్గాలకు సంస్కృతీ సంప్రదాయాలకు
నా భారతజాతి...నిలయమన్నది
భిన్నత్వంలో ఏకత్వమే...మన నినాదమన్నది
ఏమన్నది ఏమన్నది ?
నా మువ్వన్నెల జెండా
ప్రజాస్వామ్యమే... మనకు ఆరవప్రాణమన్నది
అదే మన భరతమాతకు... స్వర్ణాభరణమన్నది
అంబేద్కర్ రాజ్యాంగమే
మనకు రక్షణ కవచమన్నది
ఏమన్నది ఏమన్నది ?
నా మువ్వన్నెల జెండా
అహింసావాది గాంధీజీ
ప్రథమ ప్రధాని చాచా నెహ్రూ
సర్దార్ వల్లభాయ్ పటేల్
సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్
అల్లూరి సీతారామరాజుల...
త్యాగాలే పునాదిగా
ఇందిరా రాజీవ్ అటల్
బిహారీ వాజపేయి
అబ్దుల్ కలాం జాతినేతల...
ఆశయాలే ఊపిరిగా
అదిగో అదిగో అల్లదిగో ఆ నీలి ఆశలఆకాశంలో రెపరెపలాడుతూ ఎగురుతోంది ఎగురుతోంది
నా మువ్వన్నెల జెండా నా
ముచ్చటైన జెండా... జైహింద్
18. మీరే మహాత్ములు....
పరీక్షలు ఎదుర్కోండి
విద్యార్థుల వోలె..........
కలలు కనండి
కన్నతల్లిదండ్రుల వోలె...
ఆరుగాలాలు శ్రమించండి
రైతుల వోలె...........
పగలు రాత్రి పని చేయండి
కష్టజీవుల వోలె.......
పనే మా ఊపిరి అనండి
ఉద్యోగుల వోలె.....
అవినీతికి దూరంగా వుండండి
అధికారుల వోలె....
వెన్నుచూపక పోరాడండి
యోధుల వోలె.....
విజయాలు సాధించండి
వీరుల వోలె..........
సేవే మా ప్రాణం అనండి
నేతల వోలె...........
ఉన్నతంగా ఆలోచించండి
మేధావుల వోలె......
మానవత్వాన్ని ప్రభోదించండి
మహనీయుల వోలె...
ప్రశాంతంగా జీవించండి
మహాత్ముల వోలె......
అప్పుడు మహనీయులు
మహాత్ములు మీరు కాక మరెవ్వరు?
19 .మీరు ఆడపిల్లలు కాదు అగ్గిపుల్లలు
ఓ అమాయకపు అమ్మాయిల్లారా !
మీరు కమ్మని కలలుకనే
కన్యపిల్లలే కావొచ్చు కానీ
ఆ కలలను కాలరాస్తే మీలో నిగ్రహం నశిస్తే
ఉగ్రరూపం దాల్చే శత్రువులను చీల్చే
"కలకత్తా కాళికలు" మీరన్న
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !
ఓ అమాయకపు అమ్మాయిల్లారా !
మీరు పూరిగుడిశల్లో
పుట్టివుండవచ్చు కానీ గాండ్రించి
మానవమృగాలను చీల్చిచెండాడే
"చిరుతపులులు" మీరున్న
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !
ఓ అమాయకపు అమ్మాయిల్లారా !
మీరు ఆకారానికి ఆడపిల్లలే కావచ్చు కానీ
అన్యాయాలకు అక్రమాలకు పాల్పడే
అవమానాలకు గురిచేసే అక్రమార్కులను
అంతంచేసే "అగ్గిపుల్లలు" మీరని
కాంతినివ్వగలరని.
కాల్చిబూడిద చేయగలరన్న...
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !
ఓ అమాయకపు అమ్మాయిల్లారా !
మీరు అబలలే కావొచ్చు, కాని
అమ్ముడుపోవడానికి
మీరు "అంగడిబొమ్మలు" కాదని
మీరు "ఆదిపరాశక్తికి" ప్రతిరూపాలన్న
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !...
ఓ అమాయకపు అమ్మాయిల్లారా !
ఎప్పుడైనా ఎక్కడైనా
మగువలుగురైతే మానభంగానికి
వేధించి వెతలకు గురిచేసి
వెలివేసే ఈ వెర్రి సంఘానికి
భయపడితే చాలు బ్రతుకు బుగ్గిపాలు
"ఉద్యమిస్తేనే" స్త్రీ జాతికి ఉషోదయమన్న
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !
20. నీవు ఎవరినీ అతిగా పొగడకు...
ఎవరినైనా నీవు...దొరా దొరా...అన్నావంటే
దొరా నా తలపై కెక్కు
నన్ను అధఃపాతాళానికి అణగద్రొక్కుఅని...అర్థం
ఎవరినైనా నీవు...రాజా రాజా...అన్నావంటే
వారి తలపై ఓ బంగారుకిరీటాన్ని పెట్టి
సర్వెంటులా వొంగి వారికి సలాం కొట్టడమని...అర్థం
ఎవరినైనా నీవు...అన్నా అన్నా...అన్నావంట
వారు అన్నింటా నీకన్నా మిన్నని
నీవు మాత్రం ఓ గుండుసున్నని...అర్థం
ఎవరినైనా నీవు...స్వామీ స్వామీ...అన్నావంటే
వారేకంగా ఏడుకొండల వెంకటేశ్వరస్వామియేనని
నీవుమాత్రం కొండకెళ్ళి గుండుగీయించుకోవాలని...అర్థం
ఎవరినైనా నీవు...గురూ గురూ...అన్నావంటే
నీవే వారికి "గురువుగా" గొప్ప గుర్తింపునిచ్చావని
నీకు నీవే ప్రియ"శిష్యుడిగా శిక్ష" వేసుకున్నావని...అర్థం
ఎవరినైనా నీవు...బ్రదర్ బ్రదర్...అన్నావంటే
వ్యక్తులు వేరువేరైనా భావాలు ఒక్కటని,ఆపదే వస్తే ఒకరికొకరు ప్రాణాలు సైతం అర్పించుకుంటారని...అర్థం
అందుకే ఎవరినీ అతిగా పొగడకు...ఆకాశానికి ఎత్తకు
ఎత్తినీవు ఏ అగాధానికి అధఃపాతాళానికో జారిపోకు
బలహీనులకు ఎప్పుడూ భజన చేయకు...చేసి
వారిని బాహుబలిగా మార్చి...నీవు బలహీనుడివై పోకు...
బానిస మనస్తత్వానికి...బలైపోకు...
ఆత్మన్యూనతకు...ఆహుతైపోకు...
ఆత్మగౌరవాన్ని...అంగడిలోసరుకులా అమ్ముకోకు...
21 .దేవతలారా......దీవించండి...
ప్రేమికులారా... క్షమించండి....
లాడ్జిలో దొరికింది ఓ Love Letter
అందులో వుంది మత్తెక్కించే Matter
కారణం ఏదైనా జరిగింది ఒక దారుణం, అది
ప్రతిఇంట ప్రతికంట కన్నీరుచిలికే ఓ జంటమరణం
పది మంది మెచ్చిన జంట
పది కాలాలపాటు పచ్చగా వుండునంట
నలుగురికి నచ్చని జంట నవ్వులపాలౌనంట
నదిలోదూకి చచ్చునంట ఆఘోరమే జరిగిందంట
సమాజానికో మాయని మచ్చని తెచ్చిన
కన్నవాళ్ళ గుండెల్లో గునపాలను గుచ్చిన
కామంతో కళ్ళు పొరలు కమ్మన ఆ జంట
లాడ్జిలో కడకు Love Game ఆడిందట
ఆ జంట ఒకరికొకరు బంగారమంట
ముద్దొచ్చే ముద్ద మందారమంట
బంగారం...
Please tell me Why Why
We should Drink and Die ?
ఏంలేదే బంగారం...
అసలు మనముచ్చట్లే ఈ సమాజానికి నచ్చట్లే
అందుకే... Let us Drink and Die...
ఓకే చచ్చి మనం ఏం సాధిస్తాం బంగారం...?
ఔను బంగారం....
మన కులాలు వేరని మన మతాలు వేరని
మనమసలు మనుషులమే కాదని
మనల్ని వెక్కిరించిన వెలివేసిన వేలెత్తి చూపిన
వేటాడిన వేధించిన చిత్రహింసలకు గురిచేసిన ఈ
వెర్రి సమాజంనుండి వెళ్ళిపోదాం అందరినీ వేదిద్దాం
Love is Sweet & Our Love is Great
అని నిరూపిద్దాం బంగారం...నిరూపిద్దాం...
చచ్చిపోయి ఈ సమాజాన్ని...సా...ధి...ద్దాం
కానీ, అది అసాధ్యమే... బంగారం
కారణం,కన్ను మూసిన మరుక్షణమే
మనం కాలగర్భంలో కలిసిపోతాంగా...
OK...బంగారం... No Problem
Let us Drink and Dance
Let us Fly in the Sky
No No రెక్కలు తెగిన పక్షులు
ఎక్కడికి ఎగరలేవుగా.... బంగారం...
Let us Drink and Die, because
We are not Birds We are Lovers
Lovers are only Little Flowers
ఔను బంగారం...You are Correct మనం
ఆ ప్రేమదేవతకు అర్పించుకున్న పువ్వులం
Yes... Yes it is 200% true that
Love is Blind where as Lovers
Find...Moon...in the...Noon....
22. అమృత బిందువులు...
నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు
నేడు ఆడుకునే అల్లరిచేసే పిల్లలే పిడుగులే
రేపటి ఆరోగ్యవంతులు అదృష్టవంతులు
అట్టి పిల్లల్నికన్న ఆ తల్లిదండ్రులే ఆదర్శవంతులు
కంటే సరిపోదు పిల్లల్ని ఇష్టపడి కష్టపడి నవమాసాలు మోసి
కంటే సరిపోదు తీయని కలలు వారున్నతస్థితిలో ఉండాలని
పిల్లలకు రక్తాన్నే కాదు ప్రేమను పంచాలి శ్రద్ధతో తీర్చిదిద్దాలి
వారి బంగారుభవిష్యత్తుకు గొప్ప ప్రణాళికల్ని సిద్ధం చేయాలి
వారికి ఆరోగ్యాన్ని ఆస్తిగా అందించాలి అంగవైకల్యాన్ని కాదు
రేపీ పసిమొగ్గలే ఆరోగ్యంగా పచ్చని మొక్కల్లా పెరగాలంటే
అంగవైకల్యమనే పిశాచి కోరల్లో చిక్కుకోకుండా వుండాలంటే
రేపు రెక్కలున్నా ఎగరలేని పక్షులుగా మారకూడదనుకుంటే
ముందర జీవితాలు ముక్కలు కాకుండా ఉండాలనుకుంటే
కన్నవారి కళ్ళనుండి కన్నీటిచుక్కలు రాలకూడదనుకుంటే
ఒక్కటే మార్గం పోలియో చుక్కలు...అవే సంజీవినిచుక్కలు
అవేవారికి రక్షణకవచాలు అవేవారికి అంతర్గత ఆయుధాలు
అవే వారికి అమ్మ పాలతోపాటు పంచే అమృత బిందువులు
23. ఒకటే గమ్యం ఒకటే లక్ష్యం....
తిని తిరిగే వారికన్న
తిని,కూర్చునేవారికన్న
కూర్చొని వేళాపాల లేకుండా
సెల్ లో గేమ్స్ ఆడేవారికన్న
లాప్ టాప్ లో ఇంగ్లీష్ సినిమాలు
టీవీలో చెత్తప్రోగ్రామ్స్ చూసేవారికన్న
పగటి పూట పనులుమాని
గుడ్లగూబల్లా గురకలు పెట్టేవారికన్న
జీవితంలో ఏదైనా సాధించి తీరాలన్న
కసితో కృషితో పగతో పట్టుదలతో
దృఢమైన దీక్షతో ఒక తపనతో
నిత్యం రగిలిపోతూ...
ఒక గమ్యం చేరాలన్న లక్ష్యంతో
ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు
ఎన్ని అవరోధాలు ఎదురైనా
ఎన్ని సమస్యలు సవాళ్లు విసిరినా
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా
ఎవరూ చేయూత నివ్వకపోగా
ఏ సహాయం చెయ్యకపోగా
ఎందరెంతగా నిరాశకు గురిచేసినా
ఎన్ని ఘాటైన విమర్శలు చేసినా
భయపడక బాణంలా దూసుకుపోయేవారే
అగ్నికణంలా భగభగమని మండేవారే
పులిలా ధైర్యంగా ముందుకు దూకేవారే
కార్యసాధకులు... వీరులు... విశ్వవిజేతలు,ఔను
గదిలో గాఢాంధకారంలో గబ్బిలాలవోలె తిరిగేవారికన్న
రేసుగుర్రాలవోలె శరవేగంతో పరుగులు తీసేవారే మిన్న
24. గరుడపురాణం ఘోషిస్తుంది
సిగ్గూలజ్జ అన్నది ఏ మాత్రం లేకుండా
నవ్వుతూ తిరిగే గుంటనక్కల్లారా !
గజ్జికుక్కల్లారా! గాడిదకొడుకుల్లారా !
కామంతో కళ్లు పొరలుకమ్మి
వావివరస మరచి మృగాల్లా ప్రవర్తించే
మూర్కుల్లారా!ముష్కరులారా !
కరుణ దయ జాలి ఇసుమంతైనా లేని
అంధులారా! కామాంధులారా !
రాక్షసులారా! రాబందులారా !
మీ కన్నబిడ్డల వయసున్న
బంగారు భవిష్యత్తు ముందువున్న
కమ్మని కలలు కంటున్న
అన్యంపుణ్యం ఎరుగని
అభం శుభం తెలియని అమ్మాయిల
ముందు ఎంతో మంచిగా నటించి
ఎన్నోమాయమాటలు చెప్పి ప్రలోభపెట్టి
ఏ ముళ్ల పొదల్లోకో తీసుకెళ్లి
భయపెట్టి బాధపెట్టి చిత్రహింసలకు గురిచేసి
కామంతో రగిలిపోతూ కోర్కెలు తీర్చుకొని
అరిస్తే పీకపిసికి ఎదురు తిరిగితే
కౄరంగా కొట్టి ప్రాణాలు తీసి
చచ్చిపోతే ఈడ్చుకెళ్ళి ఏపొదల్లోనో పారేసి
లేదంటే పెట్రోలుపోసి తగులబెట్టి
రాజకీయనాయకుల అండతోనో
లంచాలు పుచ్చుకునే అధికారుల అండతోనో
దైర్యంగా తిరుగుతూ దర్జాగా బ్రతుకుతున్న
ఓ క్రూరులారా !
మీరు కుక్కలకన్నాహీనులు !
మీరు నీచులు మీరు బ్రతికిఉన్న శవాలు
మిమ్మల్ని ఉరేసి క్షణాల్లో ఊపిరితీసేకన్నా
సలసలకాగే నూనెలో వేయాలని
సూక్ష్మంగాల్లో సూదులు గుచ్చాలని
చెట్లకు కట్టేసి కాలిన సువ్వలతో వొళ్ళంతా
వాతలు పెట్టాలని కొరడాలతో కొట్టాలని
మీకు ఘోరాతి ఘోరమైన శిక్షలు విధించాలని గరుడపురాణం ఘోషిస్తుంది
గుర్తుంచుకోండి ! ఇకనైనా మీరు మనుషుల్లా జీవించండి !
పశువుల్లా ప్రవర్తించకండి ! ఏ మచ్చలేకుండ మరణించండి !
(పరీక్షలు వ్రాసే స్కూలు పిల్లలమీద అత్యాచారం)
అన్న వార్త చదివి వ్రాసిన కవిత ఇది
25. ఈ "పిచ్చి" ముదరక ముందే....
ఫేస్ బుక్ వాట్సాప్ ల పిచ్చిపట్టి
ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
ముఖ్యమైన పనులన్నీ మూలకునెట్టి
సత్సందేశాలివ్వాలనే
దృఢసంకల్పంతోఅర్ధరాత్రివరకు
కంటిమీద కునుకు లేకుండా
తిండి తిప్పలు మాని పూర్తిగా
ఇంట్లో శ్రీమతితో "చీవాట్లు తింటూ"
తెల్లవార్లూ మెసేజ్ లు టైపుచేసుకుంటూ
ప్రొద్దుటే శుభోదయమంటూ పెట్టేవ్ "పోస్ట్"
ఆపై ఎంతో ఆశతో ఒక చకోరపక్షిలా
కామెంట్ల కోసం, లైకుల కోసం
కళ్ళు రెండు కాయలు కాసేలా
ఎదురు చూస్తావ్, ఎంత టైమ్ "వేస్ట్"
ఓ అమాయకపు మిత్రమా!
ఇకనైనా ఈ పిచ్చి మానుకో
ఓ పచ్చి నిజం తెలుసుకో
వెయ్యి మాటలేల ఇది వెఱ్ఱితనమే
మూటికి ముమ్మాటికి ఇది మూర్ఖత్వమే
అవివేకమే అజ్ఞానమే, నిజానికి
ఇదంతా నాటకమే ఫేకుల బూటకమే
తగిలేది...ఎదురు దెబ్బలే
చివరికి మిగిలేది... పెడబొబ్బలే
ఇదందరూ పరుల మెప్పుకోసం
తెలిసీ తెలియక చేసే పెద్ద తప్పు
నేడు నిప్పు కాని రేపు సునామీలా
ముంచుకొస్తుంది పెద్ద ముప్పు
అందుకే రేపటి "శుభోదయం"
కలిగించాలి మీకు గొప్ప"జ్ఞానోదయం"
వ్యర్థం చెయ్యక విలువైన కాలం
అర్ధం చేసుకున్న వారికి దక్కు
గంగిగోవు పాలు గరిటెడు కాదన్న
వారికి చిక్కు ఖర్మపాలు కడివెడు
అన్న యోగి "వేమన్న వేదాంతం"
గుర్తుంచుకుందాం జీవితాంతం
26. పాలకుండ -
పచ్చని చెట్టు - పడుచు పిల్ల*
*పాలకుండకు*
పదిచిల్లులు పడినా పర్వాలేదు
కాని పాలకుండలో
ఒక్క విషపు చుక్క పడితే చాలు
పెనుప్రమాదం ముందున్నట్లే, ముంచుకొచ్చినట్లే
*పచ్చని చెట్టు*
పెనుగాలుల్ని, పెనుతుఫానుల్ని
సైతం తట్టుకొని నిలబడుతుంది
కాని వేర్లకు చెదలు పడితే మాత్రం
ఏం చెట్టు తట్టుకోలేదు
నిట్టనిలువునా కుప్పకూలిపోతుంది
*వయసొచ్చిన ఆడపిల్ల* ప్రేమ పిచ్చిపట్టి
కామంతో కళ్ళు పొరలు కమ్మి
కన్నవారి కళ్ళుగప్పి బరితెగించి బజారులో
సిగ్గులజ్జా లేకుండా తిరుగుతూ వుంటే
ఏ జిత్తులమారి నక్కతోనో
ఏ గజ్జికుక్కతోనో పక్కపెంచుకోవడానికి
పరుగులు పెడుతూ వుంటే
ఖర్మకాలి కాలుజారినా, కడుపొచ్చినా, ఆపై
ఉలుకూపలుకు లేని ఆపిల్ల తల్లిదండ్రులు
ఉరివేసుకోక తప్పదు,ఊపిరి తీసుకోక తప్పదు
*ఔను తెలిసి ఘోరమైన తప్పులు చేసేది ఒకరైతే*
*నిప్పులు కురిసేది చెప్పులు విసిరేది మరొకరిపైన*
27. రంగులుమార్చే ఊసరవెళ్ళులు
రియల్ ఎస్టేట్ రంగమంటేనే అర్థం
రంగులు మార్చే ఊసరవెళ్ళులని
మొసళ్ళ మోసగాళ్ళమయమనిరక్తం త్రాగే
రాక్షసమూకల రంగమని తెలుసుకో నేస్తమా !
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా !
ఇందులో పరిచయమయ్యేప్రతివాడు ప్రాణమిత్రుడే
పైకి, లోపల వాడొక బద్దశత్రువని తెలుసుకో నేస్తమా !
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా !
కనిపిస్తే వాడు కాళ్లకు నమస్కారం చేస్తాడు
కాని, వాడే రేపు కడుపులో కత్తులుంచుకొని,
కౌగలించుకుంటాడని తెలుసుకో నేస్తమా !
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా !
ఇందులో మాయమాటల మాంత్రికులు
అరచేతిలో స్వర్గం చూపించే అఖండులు
నమ్మించి నట్టేటముంచే నయవంచకులు
మనచుట్టే వుంటారని తెలుసుకో నేస్తమా!
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా!
ఇందులో ఆశబోతులు అబద్ధికులు
సిగ్గూ లజ్జలేనివాళ్ళు నీముందే వుంటారని
మానవత్వమన్న పదానికి అర్థం తెలియని
మూర్ఖులు ముసుగులు వేసుకొని నీ ప్రక్కనే
నక్కల్లా నక్కి వుంటారని తెలుసుకో నేస్తమా !
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో మిత్రమా !
28. నీతిలేని సంకరజాతి ?....
కుండను పగలగొట్టి
కూడుదిన్న
కుక్కను నమ్మవచ్చు
నవ్వుతూ నవ్వుతూ
లోతుగా గోతులు త్రవ్వే
నక్కను నమ్మవచ్చు
కక్కినదానికి ఆశపడే
కుక్కను నమ్మవచ్చు
నమ్మినవారిని నట్టేటముంచే
నక్కను నమ్మవచ్చు
కానీ
నక్క కడుపున పుట్టిన కుక్కను కాని
కుక్క కడుపున పుట్టిన నక్కను కాని
నమ్మరాదు
కారణం
అవి సంకరజాతి జంతువులు
వాటి తోకలే కాదు వంకర
వాటి బుద్దులు కూడా వంకరే
అవి పేరుకే కుక్కలు నక్కలు
వాటిని నమ్మిన వారికి
అవి చూపిస్తాయి ఆకాశంలో చుక్కలు
29. కాకి బ్రతుకా? హంస బ్రతుకా?
ఓ మిత్రమా!
ఎంతకాలమిలా నీవు అగ్నానంలో
అమాయకత్వంలో అంధకారంలోవుంటావు
ముందు నీ బలహీనతలనుండి,
తరతరాల నీ బానిసత్వపు మనస్తత్వం వుండి
బయటపడాలనుకో
శిలను శిల్పాంగా చెక్కాలనుకో
ఎవరెస్టు శిఖరం ఎక్కాలనుకో
నిన్ను పైకి రానీయకుండా
అడుగడుగునా అడ్డుపడిన అణగదొక్కిన
మోసగాళ్ళ కాళ్ళకు మొక్కాలనుకోకు
వారి కాలి కింది చెప్పులా
ఆ చెప్పుకింది తేలులా బ్రతకాలనుకోకు
వారిమెడ మీది కత్తిలా
వారికి ప్రక్కలో బల్లెంలా బ్రతకాలనుకో
దహించే అగ్నిలా రగలాలనుకో
ఆకులు మేసే మేకలా కాక
గర్జించే సింహంలా బ్రతకాలనుకో
కాకిలా బ్రతికితే నీకు దొరికేది
కాటిలో పిండమే
కాని హంసలా బ్రతికితే నీవు
అందుకోగలవు అమృత భాండమే
30. పదిసంవత్సరాల సిద్ధాంతం ?
కొందఱు "పొదుపు" చేస్తారు
పదిసంవత్సరాల వారి సిద్ధాంతం...
తినుము... త్రాగుము... సుఖించుము
పదిసంవత్సరాల తర్వాత...
బ్యాంకుబ్యాలెన్స్... నిళ్లు
మిగిలేది... తీరని అప్పులు
తరిగేది... ఆర్జించిన ఆస్తులు
ఎదుగుబొదుగులేని... జీవితం
ఆశలఆరాటం... జీవన పోరాటం
పైనపటారం... లోనలొటారం
మరి కొందఱు "పొదుపు" చేస్తారు
ముందుచూపుతో "మదుపు" చేస్తారు
పదిసంవత్సరాల వారి సిద్ధాంతం...
వారికోసం... వారిమీద
ఆధారపడిన వారికోసం
భారీగా ఆస్తులు కూడబెట్టడం
పదిసంవత్సరాల తర్వాత...
వారి నివాసం...విలాసవంతమైన విల్లాలలో
వారు తిరిగేది... ఖరీదైన స్కోడాకార్లలో
వారు తినేది... పంచభక్షపరమాన్నాలు
వారు సంపాదించేది... సమాజంలో గౌరవం
వారు జీవించేది... అందరికి ఆదర్శవంతమైన
ఉన్నతమైన... కలనైనా ఊహించని ఉత్కృష్టజీవితం
31. అపురూపమైనది ఆడజన్మ
నిజమే కారణం నిన్న
కామంతో కలిశారో
ప్రేమతో పిలిచారో తెలియదుకాని
నేడు కెవ్వుమని కేకపెట్టి
తాను ఏడుస్తూ అందరిని నవ్విస్తూ
మహాలక్ష్మిలా ఈలోకానికి వస్తుంది
ఆ యింటికి వెలుగును తెస్తుంది
నిన్నటి భార్యాభర్తల్ని
నేడు తల్లిదండ్రులుగా మారుస్తుంది
తాను జన్మించి ఒక అమ్మకు
మాతృత్వపు మాధుర్యాన్ని
రుచి చూపిస్తుంది
అమ్మా నాన్న అంటూ పిలిచి
ఆ ఇద్దరినీ మైమరమింపచేస్తుంది
ఆమె ఎవరో కాదు ఒక ఆడపిల్ల
ఆపై ఆ పిల్లే పెరిగి పెద్దదై
తిరిగి తానే ఒక తల్లై మళ్ళీ
నవమాసాలు మోసి
మరోబిడ్డకు జన్మనిస్తుంది
పుట్టిన బిడ్డకు పాలిస్తుంది
అల్లారుముద్దుగా పెంచుతుంది
కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దచేసి
ఈ సమాజానికి ఒక మంచి పౌరుణ్ణో
ఈ దేశానికి ఒక గొప్ప నాయకుణ్ణో
అందిస్తుంది, కానీ ఇన్ని చేసిన
ఇంతటి శక్తి స్వరూపిణియైన స్త్రీ
ఒక్కటి మాత్రం చేయలేకపోతోంది
అదే తనకిష్టమైన పాపను
తన భర్తకు అత్తామామలకు
ఇష్టమైన బాబును
మాత్రం కనలేకపోతుంది కారణం
"భర్తను కలవడం వరకే...
కమ్మని కలలు కనడం వరకే...
తొమ్మిది నెలలు మోయడం వరకే...
కడకు ఎవరినో ఒకరిని కనడం వరకే...
ఆమె చేతిలో వున్నది
కాని ఎవరిని కనాలి ? అన్నది
"నిర్ణయించేది మాత్రం పైనున్న ఆ పరమాత్మే
32. ప్రశ్నలు నావి - సమాధానాలు మీవి
*మన ఇంట్లో ప్లాస్టిక్ పూలు*
*మన పెరటిలో బంతిపూలు*
ఉంటె జుమ్మంటూ తుమ్మెదలు
వేటిమీద వాలుతాయి?
ఆకలేసి నప్పుడు
ఎదురుగా
*కప్ప*
*కొబ్బరిచిప్ప*
ఉంటె పాము దేన్ని మింగుతుంది?
అర్జెంటుగా ఆఫీసుకు
వెళ్లాల్సివస్తే ఎదురుగా
*ఆటోవుంది*
*అంబాసిడర్ కార్ వుంది*
ఛార్జ్ ఒక్కటే ఐనప్పుడు
మనం ఎందులో వెళ్తాము?
కిటకిటలాడే బస్సులో
*ఒక బామ్మ*
*ఒక బాపు బొమ్మ*
ఎక్కిమన ఒక్కరినే సీట్ రిక్వెస్ట్ చేస్తే
ముందు లేచి మనం ఎవరికి సీటిస్తాము?
మన ఆఫీసులో మన ప్రక్కనే
*మురికి బట్టలతో ఒకవ్యక్తి*
*మంచి సూటుబూటుతో ఒకవ్యక్తి*
ఉంటె మనం ఎవరికి గౌరవం ఇస్తాము?
ముందు ఎవరికి నమస్కారం చేస్తాము?
మనం శాకాహారులం
ఆకలేసినప్పుడు,మన ఎదురుగా
*ఒక అరిటాకులో ఆవకాయ
నెయ్యి వేసిన భోజనం
మరో అరిటాకులో
ఘుమఘుమలాడే బిర్యాని*
ఉంటె ఆతృతగా దేన్నీ తింటాము?
సరిగాఆలోచించంచండి సమాధానాలు చెప్పండి
33. ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడు?
మొరిగే కుక్క
మొరగడం ఆపుతుంది ఎప్పుడు?
తిండి పెట్టినప్పుడు...
పెరిగే మొక్క
ఎదగడం ఆపుతుంది ఎప్పుడు?
చెదలు పట్టినప్పుడు...
కుండలా ఒక కొండలా
బొజ్జ పెరిగేదెప్పుడు?
వ్యాయామం చెయ్యనప్పుడు...
కొవ్వు పేరుకుపోయినప్పుడు...
చెరువులల్లో చేపలు చేరేదెప్పుడు?
కుంభవర్షాలు కురిసినప్పుడు...
చెరువులు బాగా నిండినప్పుడు...
తల్లిపాలకోసం పాప గుక్కపెట్టి
వెక్కివెక్కిఏడ్చేదెప్పుడు?
ఆకలేసినప్పుడు... నిద్రలేచినప్పుడు...
భార్యమీద భర్త అలిగే దెప్పుడు?
తెచ్చిన పట్టు చీర కట్టుకోనప్పుడు...
ఇచ్చిన మల్లెపూలు పెట్టుకోనప్పుడు...
సిగ్గుా లజ్జా లేకుండ
బజారులో పిల్లలు తిరిగేదెప్పుడు?
బరితెగించి నప్పుడు బాధ్యత లేనప్పుడు...
పిరికిపంద ఆవేశంతో రంకెలేసేదెప్పుడు?
కిందపడినప్పుడు...నలుగురు నవ్వినప్పుడు...
కష్టపడి వ్రాసిన కవితకు కడుపు నిండేదెప్పుడు?
చదివి మీరు సకాలంలో స్పందించి నప్పుడు...
ఇష్టపడి పోస్టుచేసిన కవిత కలత చెందేెదెప్పుడు?
లైకులు కామెంట్లు లేకుండా
సమయమున్నా సరే మీరు సైలెంటుగా వున్నప్పుడు...
34. విశ్వవిజేతవై
విజయఢంకా మ్రోగించు
ఈ సృష్టిలో
అన్ని జన్మలకన్నా
ఉన్నతమైనది
ఉత్కృష్టమైనది
ఈ మానవజన్మే
అందుకే ఓ మనిషి!
నిన్ను నీవు తెలుసుకో
నీలోకి నీవు తొంగి చూడు
నీలో ఉన్నవి శక్తులు మూడు
నీ శరీరం నీ మనసు నీ ఆత్మ
ఇది పచ్చినిజం నీలోవుంది
ఆత్మ అనే ఒక అఖండజ్యోతి
ఆ సత్యమే తెలుసుకుంటే
ఆర్జిస్తావు నీవు ఖండాంతర ఖ్యాతి
నిజానికి
నీవు ఓటి కుండవు కాదు పాలకుండవు
నీవు చీమవు కాదు సింహానివి
నీవు జింకవు కాదు చిరుతపులివి
నీవు ఎలుకవు కాదు ఏనుగువు
నీవు శిలవు కాదు శిఖరానివి
నీవు వ్యక్తివి కాదు ఒక దివ్యమైనశక్తివి
పదిసార్లు పడినా సరే పైకి లేస్తావు
నేడు ఓడినా రేపు నీవు గెలుస్తావు
ఓడిపోవడానికి కాదు నీవు
జయించడానికే జన్మించావు
అందుకే ఓ మనిషీ!
భయమెందుకు? సందేహమెందుకు?
ఆశే శ్వాసగా సాగిపో ముందుకు
విశ్వవిజేత వయ్యేందుకు
విజయఢంకా మ్రోగించేందుకు
35. కరోనా పిచ్చికుక్క కరవకముందే...
కరోనా అంటే ఒక కత్తుల వంతెన
కరోనా అంటే ఒక నిప్పులు నిచ్చెన
కరోనా అంటే ఒక సర్పాల సరోవరం
కరోనా అంటే ఒక ఆరని అగ్నిగుండం
ఇది కరోనా కాలం అంతా అల్లకల్లోలం
ఇది కాదనిలేని నిజం కాని కలవరపడకండి
కరోనాను ఖతం చెయ్య కత్తుల్లేవని బాధపడకండి
అతిగా భయపడకండి ఆందోళన చెందకండి
మందు వచ్చేంతవరకు ముందుజాగ్రత్తలు తీసుకోండి
కరోనా అంటే రక్తసంబంధాల మీద ఒక రంపపుకోత
కరోనా అంటే ఒక గుండెకోత, కావచ్చు అదిఒక విధివ్రాత
ఐనా అధైర్యపడకండి ముందుచూపుతో ఆలోచించండి
సమిష్టిగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
కరోనా పిచ్చికుక్క వచ్చి కరవక ముందే
కరోనా ఒక కాలనాగై కాటు వేయక ముందే
కరోనా దొంగలా వచ్చి ప్రాణాలను దోచుకోక ముందే
ఇబ్బందులు సునామీలై ఇంటిని చుట్టుముట్టక ముందే
ఇమ్యూనిటీ కవచాన్ని ధరించండి కరోనాకు బలికాకముందే
అకస్మాత్తుగా కష్టాలువచ్చి నెత్తిన పిడుగులా పడితే
కుటుంబమంతా కుమిలిపోకుండా కృంగిపోకుండా
పకడ్బందీగా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుకోండి
ఆరోగ్యమే మహాభాగ్యమన్న నిజాన్ని కలనైనా మరవకండి
36. కరోనా కథచెబుతా.....
ఊ/కొడతారా...అనగనగా...చైనాలోని
ఊ/హాన్ లో పుట్టిన ఓ కరోనా మహమ్మారి
ఊ/పిరితిత్తుల్లో చొరబడి
ఉ/క్కిరి బిక్కిరి చేస్తుంది
ఉ/లిక్కి పడేలా చేస్తుంది
ఊ/పిరాడకుండా చేస్తుంది
ఊ/పిరి తీస్తుంది
ఊ/ర్లకు ఊర్లనే ఊడ్చేస్తుంది
ఉ/గ్రవాదిలా మారిన
ఉ/గ్రరూపం దాల్చిన
ఉ/న్మాదియైన ఈ కరోనా రక్కసిపైన
ఉ/క్కుపాదం మోపాడు మన ప్రధాని మోడీ
ఉ/దృతమౌతున్న
ఉ/ప్పెనలా విరుచుకుపడుతున్న
ఉ/పద్రవంలా ముంచుకొస్తున్న ఈ తరుణంలో
ఉ/పాయం లేకున్న పెద్ద అపాయమే
ఉ/క్కు మనుషులను సైతం
ఉ/రుకులు పరుగులు పెట్టిస్తుంది
ఉ/రితీస్తుంది
ఉ/రుములా ఉరుముతుంది
ఊ/బిలో తోస్తుంది నిన్న
ఊ/హాన్ లో
ఉ/మ్మెత్త పువ్వులా పుట్టి, నేడు
ఊ/డలమర్రిలా విస్తరిస్తోంది
ఊ/హించని విధ్వంసాన్ని సృష్టిస్తోంది
ఉ/న్నోడిని, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరున్ని
ఊ/రిచివర నున్న బిక్షగాన్ని
ఉ/న్నపళంగా ఇద్దరినీ కాటికీడుస్తోందీ కరోనా
ఉ/న్ననేమి విధ్వంసకర యుద్దవిమానాలు
ఉ/న్ననేమి మట్టికరిపించే మరఫిరంగులు
ఉ/న్ననేమి వేల క్షిపణులు, జలాంతర్గాములు
ఉ/న్ననేమి అగ్రరాజ్యాల వద్ద అణుబాంబులు
ఉ/ప్పుకు కొరగావే కరోనా ముప్పును తప్పించలేవే
ఉ/న్ననేమి అతిభయంకరులైన సాయుధ యుధ్ధవీరులు
ఉ/త్తరకుమారులయ్యారందరూ, అందుకే
ఉ/రితాళ్ళు సిద్ధం చేయండి ఆ కరోనా రక్కసిని
ఉ/రితీసేద్దాం,ఇండియా గేటుకు వ్రేలాడతీసేద్దాం
ఉ/త్సవం చేసుకుందాం కరోనాఉత్సవం చేసుకుందాం
37. నిర్లక్ష్యం వద్దు ...నియంత్రణే ముద్దు.
నెత్తిన కిరీటమున్న
కొమ్ములున్న కోరలున్న
సూదిమొనలో వెయ్యో వంతున్న
సృష్టిలో అత్యంత సూక్ష్మ క్రిమియైన
కరోనా రక్కసి ఎక్కడో
చైనాలో వూహాన్ నగరంలో
గబ్బిలాల కడుపున పుట్టి
పులిలా గాండ్రిస్తుంది
ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది
అగ్రరాజ్యాలను అల్లకల్లోలం చేస్తుంది
అందుకే, అజాగ్రత్తగా ఉన్నవారిని
గుంపులుగా, బార్లలో , రెస్టారెంట్లలో
షాపింగ్ మాల్స్ లో, పార్కుల్లో, బీచ్ లలో
రోడ్లమీద విచ్చలవిడిగా తిరిగేవారిని
అంటువ్యాధి కాదని ఇదీ ఒక స్వైన్ ఫ్లూ,
చికెన్ గున్యా, ఎబోలా,నిఫా, ఆంత్రాక్స్, సార్స్,
మార్స్ లాంటి వైరస్సేనని లైట్ గా తీసుకునేవారిని
ఇదెప్పుడొచ్చే దగ్గూ, జలుబు,జ్వరం,గొంతునొప్పేనని
అసలిది ముసలివాళ్ళ జబ్బంటూ,నిర్లక్ష్యం చేసేవారిని
క్వారెంటైన్లలో వుండని వారిని
స్వీయ నియంత్రణ పాటించని వారిని
ముఖానికి మాస్కులు ధరించని వారిని
సోపుతో చేతులు శుభ్రం చేసుకోని వారిని
సోషియల్ డిస్టెన్స్ పాటించని వారిని
అప్పుడప్పుడు ఆదమరచి చేతులతో
ముక్కును, నోటిని, కళ్ళను,రుద్దుకునే వారిని
సెల్ఫ్ లాక్ డౌన్ లో లేని వారిని
ఇమ్యూనిటీ కొరబడిన వారిని
ముందు జాగ్రత్తలేవీ తీసుకోని వారిని
కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కి కారకులైన వారిని
కరోనా వైరస్ "టార్గెట్" చేస్తుంది "టార్చర్ "పెడుతుంది.
అందుకే నిర్లక్ష్యం వద్దు వద్దు ..నియంత్రణే ముద్దు ముద్దు
38. వెంగళప్ప వేదాంతం
గడ్డిమేసే ఓ గుడ్డిగాడిదా !
మురికి బట్టలుమోసే ఓ ముసలి గాడిద!
ఊరంతా ఉలిక్కి పడేలా
ఓండ్ర పెట్టింది చాలిక
ఒంగోలు గిత్తలా పోజు పెట్టక వెళ్ళపోవే ఓ వెర్రిగాడిద అంటూ
పొట్టచెక్కలయ్యేట్టు నవ్వుకుంటూ
వెర్రివెంగళప్ప ఒకడు
గాడిద వెనకాలె నిలబడి
వెళ్ళేగాడిదను వెక్కిరిస్తుంటే
తోకను గట్టిగా మెలి పెడుతుంటే
కాళ్ళమీద కర్రతో కొడుతూవుంటే
ఒళ్ళుమండి గాడిద ఒక్కసారి
కాళ్ళురెండు జాడించింది
గట్టిగా ముఖాన ఒక్క తన్ను తన్నింది
అంతే పాపం ఎగిరి వెంగళప్ప
ముళ్లకంపలో పడ్డాడు
ముక్కు పచ్చడైంది
కళ్ళు బైర్లు కమ్మాయి
పళ్ళు పదారు రాలాయి
ఒళ్ళంతా గాయాలయ్యాయి
గాయాలపాలైన వెంగళప్పను
గాడిదమీదనే హాస్పటల్ కి తీసికెళ్ళారు
అప్పుడు కట్లు కడుతున్నప్పుడు
ఙ్నానోదయమైంది వెర్రివెంగళప్పకు
గాడిదలనుసైతం మనం గౌరవించాలని
39. ఒకే కులం ఒకే మతం
ఒకేజాతి(మినీ కవిత)
కులమంటూ
మతమంటూ
ఏలనోయీ ఆ కాకి గోల
ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని
కులం పేరు
ఈ కుమ్ములాటలు
మతంపేర
ఈ మారణహోమాలు
కులం గజ్జికుక్కని
తిరగనిస్తే తప్పుని
మతం పిచ్చిమొక్కని
పెరగనిస్తే ముప్పని
మతం ఒక మత్తు మందని
ఆపేరు ఎతైతేనే రక్తం
చిందునని తెలుసుకోండి
రాముడు కోరునా రక్తాభిషేకం లేదే
క్రీస్తు కోరునా కిరాతకం లేదే
అల్లాకోరునా అల్లకల్లోలం లేదే
మరెందుకు కులంపేర
ఈ కుమ్ములాటలు
ఇకనైనా మానండి
మానవత్వానికి
ప్రతిరూపాలుగా మారండి
మనమంత మనుషులమేనన్న
మనదంతా ఒకే కులంమన్న
మనదంతా ఒకే మతమన్న
మనదంతా ఒకే జాతన్న
అంబేద్కర్ అమృతవాక్కుల్ని
వివేకానందుడు విశ్వసందేశాన్ని
కలనైనా మరవకండి
భారతీయతను బలిచేయకండి
మానవత్వానికి మచ్చతేకండి
తోటి మనిషినిని
తోబూట్టువూగా చూడండి
ఇకనైనా ఈ కంప్యూటర్
యుగంలోనైనా కులమత రహిత
నవసమాజానికి నాంది పలకండి
40. కలియుగ దైవం సోనుసూద్....
పేదలపై ప్రేమ తప్ప,కన్నుల్లోకరుణ తప్ప
ఆపదలోవున్నవారిని తక్షణమే
ఆదుకోవాలన్నతపన తప్ప
చేతికి వెముక లేని, కడుపున కల్మషంలేని
మల్లెలా తెల్లని,మంచులా చల్లని
సముద్రమంత లోతైన,ఆకాశమంత విశాలమైన
మంచిమనసున్న,మంచితనం,మానవత్వం
సున్నితమైన మనస్తత్వం వున్నదాత ఎవరు?
ఇంకెవరు కలియుగ కర్ణుడు మన సోనుసూదే...
"అన్నా"అంటే నేనున్నానని
ఒక అన్నలా, ఒక అమ్మలా
ప్రేమామృతాన్ని కురిపించేవాడు
ఒక తండ్రిలా తపించేవాడు
ఒక ప్రాణస్నేహితునిలా ఆదుకునేవాడు
ఒక ఆపద్భాందవుడిలా, ఒక దేశరక్షకుడిలా
తనవాడు పరాయివాడనే తారతమ్యం లేక,
ఎక్కడైనా ఎవరైనా ఆపదలో చిక్కుకున్నారంటే
రెక్కలు కట్టుకుని అక్కడ వాలేదెవరు?
ఇంకెవరు కలియుగ దైవం మన సోనుసూదే...
ధనవంతులందరూ దాతలు కాదు
కాని,దయగల దాతలందరూ దైవాలే
ధన్యజీవులే పుణ్యమూర్తులే చిరంజీవులే
ముక్కోటి దేవుళ్ళకు మ్రొక్కిఅందరు కోరుకునేదొక్కటే
కనిపించే కరుణించే ఈ కలియుగ కర్ణుడు సోనుసూద్
130 కోట్లమంది భారతీయుల ఊపిరి పోసుకుని
హాయిగా చల్లగా నిండుగా నూరేళ్ళు వర్ధిల్లాలని.....
41. ఏడుకొండలవాడా !
వెంకటరమణా! గోవిందా ! గోవిందా !
వేస్తారు...వేస్తారు...
వెంకటేశ్వరుని మెడలో
మిలమిల మెరిసే ముత్యాల
రత్నాల బంగారు హారాలు
కోట్లఖరీదైన వజ్ర వైఢూర్యాలు
చేస్తారు...చేస్తారు...
హారతి కర్పూరాలతో
అర్చనలు అభిషేకాలు
పూజలు పునస్కారాలు
చేస్తారు... చేస్తారు...
పాలతో పాలాభిషేకాలు
పూలతో పూలాభిషేకాలు
ఊరంతా ఊరేగింపులు
ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు
కోరుకుంటారు వేడుకుంటారు
కనిపించమని కరుణించమని
కాపాడమని కోర్కెలు తీర్చమని
ఏడుకొండలవాడా ! వెంకటరమణా !
గోవిందా ! గోవిందా ! అంటూ గొంతెత్తి
నినదిస్తారు దిక్కులుపిక్కటిల్లేలా...
ఒక్కసారి కాలినడకన
ఏడుకొండలు "ఎక్కిన" చాలు
ఆ వెంకటేశ్వరుని
పాదపద్మాలకు"మ్రొక్కిన"చాలు
ఒక్కసారి తలనీలాలు
"సమర్పించుకున్న" చాలు
ఒక్కసారి ఒక్కక్షణం
కనులారా తనివితీర
ఆ దివ్యమంగళ రూపాన్ని
"దర్శించుకున్న" చాలు
మన బ్రతుకు ధన్యమే
దక్కును ఈ జన్మకు
వేయిజన్మల "పుణ్యఫలమే"
42. విఘ్నేశ్వరునికి విన్నపం..
నా ప్రియమైన మిత్రులారా !
ఆ వరసిద్ధి వినాయకుడు
మీ కష్టాలగండాలను తనతొండంతో తొలిగించి
బాధల సుడిగుండాల నుండి మిమ్ము
తప్పించును గాక ! పైకి రప్పించును గాక !
బుసలు కొట్టే సమస్యల సర్పాలను తన
తండ్రి శివునిమెడలో పూలహారాలుగా
వేయును గాక
తన తల్లి పార్వతి ఇచ్చే వరాలమూటలను తెచ్చి
పసందైన విజయాలవిందును మీకు
అందించును గాక !
మీరు తలపెట్టిన సమస్త కార్యాలలో ఎదురయ్యే విఘ్నాలనన్నింటిని,చింతల చీకట్లను చీల్చివేసి
వెన్నెల వెలుగులను మీ జీవితాల్లో నింపును గాక !
సకలశుభాలు,అష్టైశ్వర్యాలు,ఆరోగ్యసౌభాగ్యాలను
కోటివరాలను సమృద్ధిగా మీపై కుమ్మరించును గాక !
ఆ వరసిద్ది వినాయకుని కరుణా కటాక్ష
వీక్షణాలు సదాకాలం మీకు, మీ కుటుంబసభ్యులకు
తోడుగా, నీడగా, కొండంత అండగా, ఉండును గాక !
ప్రశాంతమైన జీవితాన్ని మీకు ప్రసాదించును గాక !
అని ఆ బొజ్జగణపయ్యను
శిరసు వంచి...
ముఖిలిత హస్తాలతో ...
పాదపద్మాల చెంత ప్రణమిల్లి...
అర్థిస్తున్నా... మనసారా ప్రార్థిస్తున్నా....
వినాయక చవితి శుభాకాంక్షలతో...
43. ఆ నాస్తికుడు ఆస్తికుడెలా అయ్యాడు ?
దేవుడు లేడు ,ఎక్కడున్నాడు ?ఎలా వుంటాడు?
వుంటే,అదిగో ఆ చెట్టులా మనకళ్ళకు కనిపించేవాడేగా
కనిపించడు కాబట్టే ,మనతో ఎప్పుడూ మాట్లాడడు కాబట్టే
మనం దేవుడు ఉన్నాడని నమ్మవలసిన పనిలేదు
దేవుడే లేడనే ఒక గట్టి నిర్ణయానికి రావచ్చు
దేవుడున్నాడనే వారిని ఒక్కసారి
కళ్లకు చూపించమని కోరవచ్చు
లేడూ లేడూ అని బల్లగుద్ధి చెప్పవచ్చు
దేవుడున్నాడని ఎవరైనా నిరూపిస్తే
ఆర్జించిన ఆస్తినంతా రాసిస్తామని
ఛాలంజ్ కూడా చెయ్యవచ్చు
అన్నాడో నాస్తికుడైన నిరాశావాది కానీ,
అదివిన్న ఆస్తికుడైన ఆశావాది నాస్తికుడితో
నవ్వుతూ అసలు "నీకు బుర్రేలేదు" అన్నాడు
"నాకు బుర్రలేదా" అంటూ బిగ్గరగా నవ్వాడు నాస్తికుడు
"ఉంటే చూపించు" అన్నాడు ఆస్తికుడు
కాని ఎలా చూపించాలో అర్థం కాక
బుర్ర గోక్కున్నాడు జుట్టు పీక్కున్నాడు,నాస్తికుడు
నిజంగా నీకు బుర్రేఉంటే,
పాలల్లో ఉన్న వెన్నను వ్రేలువంచకుండా,
కవ్వంతో చిలకుండా వేరుచెయ్?
నిజంగా నీకు బుర్రేఉంటే,
సముద్రంలో అలలను ఎగిసిపడకుండా
క్షణం సేపు ఆపుచెయ్ ?
నిజంగా నీకు బుర్రేఉంటే,
మిట్టమధ్యాహ్నం భగభగమండే సూర్యున్ని
ఒక్కగంట సేపు కన్నార్పకుండా వీక్షించు?
నిజంగా నీకు బుర్రేఉంటే,
వర్షాన్ని కురిపించు,
వేర్లులేని చెట్లను చూపించు ?
అడవిలోని చెట్లను,
ఆచెట్లకున్న ఆకుల్ని
ఆకాశంలోని నక్షత్రాలను
సముద్రతీరాన ఇసుక రేణువుల్ని లెక్కించు ?
అన్నాడు ఆస్తికుడు ఆవేశంతో
ఆప్రశ్నలకి నాస్తికుడి
బుర్రే కాదు భూమి కూడ గిర్రున తిరిగింది
ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక
బుర్ర గోక్కున్నాడు జుట్టు పీక్కున్నాడు,నాస్తికుడు
ఏటేటీ? పాలలోని వెన్నను వేరు చెయ్యాలా ?
సముద్రంలో అలలను ఎగిసిపడకుండా ఆపాలా?
మిట్టమధ్యాహ్నం సూర్యున్ని కన్నార్పకుండా చూడాలా?
వర్షం కురిపించాలా? వేర్లులేని చెట్లను చూపించాలా?
అడవిలోని చెట్లను,ఆచెట్లఆకుల్ని,ఆకాశంలోని నక్షత్రాలను
సముద్రతీరాప ఇసుక రేణువుల్ని లెక్కించాలా?
How is it possible? అంటూ మళ్ళీ
బుర్ర గోక్కున్నాడు, జుట్టు పీక్కున్నాడు, నాస్తికుడు
అందుకే ఓ నాస్తిక మిత్రమా !
సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో
ఆ సృష్టికర్త వున్నాడన్నది కూడా అంతే నిజం
నీవు మృత్యువును, తీగలోని కరెంటును
నీ రెండు కళ్ళతో ఎలా చూడలేవో
నీ రెండు చేతులతో ఎలా తాకలేవో
అలాగే కోటి సూర్యులతో సమానమైన
ఆదైవం నీ ముందు ప్రత్యక్షమైనా నీవు దర్శించుకోలేవు
నిజానికి
ఈ విశ్వంలో "కొన్ని,లేవన్నా"ఉన్నట్టే
పగటిపూట కనిపించని నక్షత్రాల్లాగ
"కొన్ని కంటికి కనిపించకపోయినా"
విశ్వమంతా వ్యాపించి వున్నట్లే
కనిపించక వీచే చల్లని గాలిలాగ అన్నాడు ఆస్తికుడు
అంతే
"అనంతమైన ఈ సృష్టి" వెనుక
"అఖండమైన ఒక శక్తి" వున్నదన్న,
నగ్నసత్యం తెలిసిన ఆనాస్తికుడు
"బుర్రవెలిగి"బుద్దిపెరిగి" ఆస్తికుడైపోయాడు
44. ఓ గురు దేవుళ్ళారా!
మీకు పాదాభివందనాలు !!
ఓ గురు దేవుళ్ళారా !
మేము పుట్టగానే
బడిలో అడుగుపెట్టగానే
పరిమళించే పువ్వులని పసిగట్టేది మీరే
మమ్ము కనని అమ్మానాన్నలు మీరే
మా భవిష్యత్తు భవననిర్మాతలు మీరే
మా జీవిత చక్రాలను తిప్పే
విష్ణుచక్రాలు మీ చేతుల్లోనే
మా దారిలో దీపాలు మీరే
మా జీవితమార్గ నిర్దేశకులు మీరే
మేము చదువుల్లో దిట్టలమైతే
మొట్టమొదట భుజం తట్టేది మీరే
సాన బట్టేది మీరే ముందుకు నెట్టేది మీరే
మమ్ము రాళ్ళలో రత్నాలుగా
మట్టిలో మాణిక్యాలు తీర్చిదిద్దేది మీరే
ఓ గురు దేవుళ్ళారా !
మా ఉజ్వల భవిష్యత్తును నిర్మించేది మీరే
మాలో అభ్యుదయ భావాలను రగిలించేది మీరే
మా హృదయాన్ని వికసింపజేసేది మీరే
ఒక "కన్నతల్లిలా "బుజ్జగించి,బుద్దిచెప్పేది మీరే
ఒక "కన్నతండ్రిలా చేయిబట్టి నడిపించేది మీరే
ఒక "ప్రాణస్నేహితుడిలా" ఎవరెస్టుశిఖరమంత
ఎత్తుకు మేము ఎదగాలని ఆశించేది మీరే
ఆపదలో "భగవంతుడిలా" ఆదుకునేది మీరే
మా బ్రతుకులను బంగారుమయం చేసేది మీరే
ఓగురుదేవుళ్ళారా !
మీరు నేలమీదున్నా మేము మాత్రం
వినువీధుల్లో విదేశాల్లో విమానాలలో
విహరించాలని కలలు కనేది మీరే
ఆ కలలే నిజమై మేము
డాక్టర్లం, సినిమా యాక్టర్లం
కలెక్టర్లం, కంప్యూటర్ ఇంజనీర్లమైతే,
రాజకీయ నేతలమై రాజ్యాలనేలితే
ఉప్పొంగి పోయేది మీ గుప్పెడు మనసే
ఆ కలలే నిజమై మేము
సైంటిస్టులం,అంతరిక్ష పరిశోధకులం
వ్యోమగాములం, మీలా ఉపాధ్యాయులమైతే
పరవశించిపోయేది మీ పసిహృదయాలే
మేము గురువులను మించిన శిష్యులమైతే
"ధీర్ఘాయుష్మాన్ భవా" యని దీవించేది మీరే
ఓ గురుదేవుళ్ళారా !
బ్యాంకులో తీసుకున్న
కోట్ల రుణాన్ని ఈ జన్మలో తీర్చవచ్చు
కాని ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది
మాకు జన్మనిచ్చిన అమ్మానాన్నల ఋణం
మాకు ప్రాణం పోసిన ఆ బ్రహ్మ ఋణం
మాకు జ్ఞానామృతం పంచిన మీ ఋణం
ఓ గురుదేవుళ్ళారా !
మీకు రెండు చేతులెత్తి మొక్కుతాం
మీ పాదాలకు పాలాభిషేకం చేస్తాం
మా గుండెల్లో గుడి గట్టి
గురు బ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరాః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువేనమః అంటూ,మిమ్మల్ని
దైవాలుగా ప్రతినిత్యం పూజిస్తాం
మా బిడ్డలకు మీ పేర్లే పెట్టుకుంటాం
ఇదే మీకు మా గురుదక్షిణ
ఇంతకుమించి ఇంకేమిచ్చి
మీ ఋణాన్ని తీర్చుకోగలం, చెప్పండి
ఓ గురుదేవుళ్ళారా ! మీకు వందనాలు !
అభివందనాలు ! పాదాభివందనాలు !!
45. పరమత సహనమా...?
పరమత ద్వేషమా ... ?
దేశభాషలందు తెలుగులెస్సని
మనం గర్వించవచ్చు
తెలుగు భాషను ప్రేమించవచ్చు
అభిమానించవచ్చు
కానీ..............
పరభాషా ద్వేషం పనికిరాదు...
మన కులం వాడని మన జాతివాడని
మన వర్గం వాడని పెద్దపీట వేయవచ్చు
కానీ............
ఇతరులనెవరినీ చిన్నచూపు చూడరాదు
అసూయ పడరాదు వారిఅవకాశాలకు గండికొట్టరాదు
వారి అభివృద్ధిని అడ్డుకోరాదు వారిని అణగద్రొక్కరాదు
ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకున్నారని
మన హిందూ సంస్కృతిని ధ్వంసంచేశారని
దూషించవచ్చు ద్వేషించవచ్చు నిందించవచ్చు
కానీ...............
ఆంగ్లభాషనుఅసహ్యించుకోరాదు అక్కసు పెంచుకోరాదు
పరబాషా పరిజ్ఞానం అవసరమేనన్న సత్యం మరువరాదు
చేయరాని నేరమేదో చేసినందుకు
దిద్దుకోలేని తప్పేదో చేసినందుకు
పరువును గంగలో కలిపేసినందుకు
చెప్పిన మాట విననందుకు చెడుమార్గంలో పోతున్నందుకు
తిట్టి కొట్టి కంటనీరు పెట్టిన అమ్మ మీద కోపం ఉండవచ్చు
కానీ............
అమ్మచేసిన వంటమీద అలకేల?ఆకలికి అలమటించ నేల?
అందమైనదని ఆస్తిపాస్తులున్నాయని
ఇష్టపడి మూడుముళ్ళు వేసి
ఎన్నో ఏళ్లుగా హాయిగా కాపురం చేయగానే
మోజు తగ్గవచ్చు ప్రేమవేడి కాసింత చల్లారవచ్చు
కానీ...............
పరస్త్రీ వ్యామోహం పనికిరాదు
అది న్యాయసమ్మతం కాదు
అది మనిషి వ్యక్తిత్వానికే మాయనిమచ్చ
ఆపై మూన్నాళ్ళ ముచ్చటే మూడుముళ్లు
ఇరువురి స్వేచ్ఛకు పడినట్లే ఇనుపసంకెళ్లు
రాగద్వేషాలకు కులమత భాషా బేధాలకుఅతీతంగా
పరమతసహనం ఫరిడవిల్లాలి ప్రతిమనిషిలో...
స్వేచ్చ స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం
వెల్లి విరియాలి ఈ వేదభూమిలో ఈ భారతావనిలో...
46. అమ్మా మీకు
వందనం ! పాదాభివందనం!!
అమ్మా ఓ అమ్మా ! చెప్పమ్మా ...
నీ కన్న ...మిన్న ఎవరమ్మా !
అమ్మా ఓ అమ్మా ! చెప్పమ్మా ...
ఏ దేవత... నీకంటే గొప్పమ్మా !
మా అమ్మ ప్రేమమయి
మా అమ్మ కరుణామయి
మా అమ్మ అమృతమయి
మా అమ్మ అనురాగమయి
మా అమ్మ మా ఇంటికి దీపం
మా అమ్మ మా కంటికి వెలుగు
మా అమ్మ...
ఎంత పెద్దతప్పు చేసినా క్షమిస్తుంది
ముందు గద్దిస్తుంది మారితే గర్విస్తుంది
తిరిగి అదే తప్పు పదేపదే చేస్తే శిక్షిస్తుంది
మా అమ్మే మాకు ఆది గురువు ...
మా అమ్మ...
అత్తమామలను గౌరవిస్తుంది
అమ్మానాన్నలను పూజిస్తుంది
అతిథి దేవుళ్ళందరిని ఆదరిస్తుంది
మా అమ్మే మాకు మార్గదర్శి ....
మా అమ్మ...
శాంతం అంతులేని అనంత సాగరం
ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
కోపమొచ్చినా చిరునవ్వులు చిందిస్తుంది
మా అమ్మ ఒక సహనశీలి....
మా అమ్మ...
ఇరుగుపొరుగువారకెంతో ఇష్టమైన అతిథి
ఆమె పిలుపులో చూపులో కలుపుగోలుతనమే
దూరపు బంధువులందరామెకు దగ్గరిబంధువులే
మా అమ్మ అందరికి ఒక ఆశాజ్యోతి....
అమ్మా ! ఓ అమ్మా చెప్పమ్మా !
ఎన్ని జన్మలెత్తితే మీ ఋణం తీరుతుందో
అన్ని జన్మలు ఎత్తైడానికి సదా మేము సిద్దం
ఓ దైవమా ! జన్మజన్మలకు
ఈ చల్లనితల్లి గర్భాన
జన్మించే భాగ్యం మాకు
ప్రసాదించండి తండ్రి !
అమ్మలేని ఇల్లు దేవుడులేని ఒక కోవెల...
మా అమ్మమాట...మధురం
మా అమ్మ ప్రేమ...మాకు ఆక్సిజన్
మా అమ్మ మాట...
మాకు...అమృతభాండం
మా అమ్మ ఆలనా పాలనతో...
మా జన్మధన్యం
మా అమ్మే ...మాకు దైర్యం...
అమ్మే మాకు దైవం
మా అమ్మే మాకు ప్రాణం...
అమ్మే మాకు సర్వస్వం
అమ్మా మీరు లేక మేము...లేము...లేము...లేము
అందుకే ఓ అమ్మా మీకు వందనం ! పాదాభివందనం!!
47. ఓ నాన్నా! మీకు పాదాభివందనం!!
మేము క్రిందపడిన ప్రతిసారి లేపి
నిలుచో పెట్టి పరుగులు తీయించి
మేము పోటీలోఓడిన ప్రతిసారి
Don't Worry Failures are
Stepping Stones for Success
Try and try till you fly into the Sky &
Try and try till you reach your Goal
అంటూ ఓదార్పు నిచ్చిన
ఓ నాన్న ! మీకు వందనం !పాదాభివందనం !
మా కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటుంటే
మీ కంటిలో గుచ్చుకున్నంతగా కన్నీరు కార్చి
మాకు కమ్మని తిండిపెట్టి మా అందరి
కడుపులునింపి మీ కడుపు నిండినంతగా
తృప్తిచెంది ఆనందంగా అర్థాకలితో నిద్రపోయిన
ఓ నాన్న ! మీకు వందనం ! పాదాభివందనం !!
మాకు జబ్బులుచేస్తే డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టి
చేతిలో డబ్బులేకపోతే తలనుతాకట్టు పెట్టి
కళ్ళుతిరిగే ఆ బిల్లులు కట్టలేక,
అప్పులు తెచ్చి
ఆపై ఆ ఆప్పులు తీర్చలేనక ముప్పుతిప్పలుపడిన
ఓ నాన్న ! మీకు వందనం ! పాదాభివందనం !!
మాకు బ్రాండెడ్ బట్టలుకొనిపెట్టి,
మీరు మాత్రం
చిరునవ్వుతో చిరిగిన బట్టలతో సరిపెట్టుకుని
మాకు నచ్చిన కొత్తబూట్లు కొనిపెట్టి,
మీరు మాత్రం
అరిగిపోయిన తెగిపోయిన
పాతచెప్పులతో తిరిగి
మాకు ఖరీదైన బైకులు కార్లు కొనిపెట్టి, మీరు
మైళ్ళదూరం కాలిబాటన నవ్వుతూ నడిచివెళ్ళిన
ఓ నాన్న ! మీకు వందనం ! పాదాభివందనం !!
నాడు అవకాశంలేక మీరు అరకొర చదువులు చదివి
మమ్ము మాత్రం విదేశాలకు పంపి కలనైనా ఊహించని
ఖరీదైన ఉన్నత విద్య నభ్యసించే భాగ్యాన్ని కల్పించిన
ఓ నాన్న ! మీకు వందనం ! పాదాభివందనం !!
ఇంతటి మంచి మనసు మంచితనం గల తండ్రిని
ఇంతటి ప్రేమదయ కరుణజాలిగుండెగల తండ్రిని
ఇంతగా నిస్వార్థంగా శ్రమించేతత్వం గల తండ్రిని
చేసిన తప్పుల్ని క్షమించే గుణంగల గొప్పతండ్రిని
కుటుంబ క్షేమంకోసం పిల్లల బంగారు భవిష్యత్తుకోసం
నిరంతరం నిద్రాహారాలు మాని తపించే తండ్రిని
ఒక అపురూపమైన ఒక బంగారుబహుమతిగా మాకు
ప్రసాదించిన ఓ పరమాత్మకు మీకు శతకోటిదండాలు
నాన్నా ! ఓ నాన్నా!!
మీకు రెండుచేతులు జోడించి
శిరస్సును వంచి నమస్కరించి
కన్నీటితో మీ పాదాలను కడిగి
కంటికి రెప్పలా కాపాడుకుంటామని
మాగుండెలో గుడికట్టి రోజు మిమ్మల్ని
ప్రత్యక్ష దైవంగా పువ్వుల్లో పెట్టి పూజిస్తామని
పంచభూతాల సాక్షిగా నేడు ప్రమాణం చేస్తున్నాం
48. కన్నతల్లి కన్నీటి ప్రార్థన ?
ఆమె ఒక తల్లి
కనడానికైతే తాను కన్నది కాని
కనేంతవరకు ఆ కడుపులో ఉన్నది
ఆడా? మాగా ?"అర్ధంకాక" అల్లాడిపోయింది
ఆ తర్వాత
బిడ్డను కనడానికి...
తాను తల్లి కావడానికి..
తన్మయత్వం చెందడానికి..
మాతృత్వపు మాధుర్యాన్ని
రుచి చూడడానికి కారణం
భర్తా ? లేక భగవంతుడా ?
"అర్ధంకాక" మళ్ళీ కుమిలిపోయింది
ఆపై పుట్టిన బిడ్డ
"అమ్మాఆకలంటూ కేకలు పెడుతుంటే
"ఆ పసికందు" ఆకలి తీర్చేదెలా ? అని
మదనపడుతుంటే...కలవరపడుతుంటే
తన "ఎఱ్ఱనిరక్తాన్ని" తెల్లనిపాలగా మార్చి
కన్నబిడ్డ "కడుపునింపే శక్తిని"
తనకిచ్చింది ప్రకృతా ? పరమాత్మా?
"అర్ధంకాక" మరోసారి మౌనంగా రోదించింది
కాని అన్నింటికీ కారణం
కనిపించక పోయినా కరుణించే
అఖండశక్తి స్వరూపుడైన ఆ దైవమేనని
"ఆ తల్లికి అర్థమైంది" అందుకే
ఆ పరమాత్మ పాదాలచెంతకు చేరి
ఆ కన్నతల్లి"కన్నీటితో ప్రార్ధన"చేసిందిలా
ఓ తండ్రీ ! ఆ పసికందుకు జన్మనిచ్చిన అమ్మనే నేను
కాని నాగర్భంలోని పిండానికి ప్రాణంపోసిన దైవం మీరు
49. వీరులు...మగధీరులు...(మినీ కవిత)
"చిరుదీపం" వెలిగించక
చీకటిని తిట్టుకుంటూ
కూర్చున్నంతకాలం నీవు
ఏ వెలుగునూ చూడలేవు
చీకటిలో "తడుముకుంటూ"
తిరిగినంతకాలం నీవెక్కడికీ వెళ్ళలేదు
చీకటిని "తరుముకుంటూ" వెళ్ళినవారే
చీకటి తెరలు "చీల్చుకుంటూ" వెళ్ళినవారే
వెలుగును "వెతకగలరు" సుఖంగా "బ్రతకగలరు"
నలుగురికి ఆదర్శంగా "నిలవగలరు"
ఎట్టి పోటీలోనైనా గట్టిగా నిలబడి "గెలవగలరు"
మట్టిని పిండైనా "తైలం" తీయగలరు
ఎట్టి క్లిష్టపరిస్థితులనుండైనా "బయట" పడగలరు
కొండమీది కోతినైనా నేలమీదికి "దింపగలరు"
సమాజాన్ని దేశాన్ని సుఖశాంతులతో "నింపగలరు"
పరులను హింసించేనరులను పాతాళానికి "పంపగలరు"
వారే వీరులు... మగధీరులు...ఘనులు...త్యాగధనులు
50. పాపం కన్నెపిల్లలు కొందరు*
ఒంటరిగా కనిపిస్తే
కొంటె చూపులతో
కన్నుగీటి కసిగా కవ్విస్తే
గాలిలో తేలిపోతారు
విహంగాలై విహరిస్తారు
*పాపం కన్నెపిల్లలు కొందరు*
చిరునవ్వులు చిందిస్తే
చిలిపి చేష్టలతో అలరిస్తే
చిత్తైపోతారు
హద్దులు దాటి ముద్దులిస్తే
మురిసిపోతారు
మాయమాటలతో మత్తెక్కిస్తే
మైమరిచిపోతారు
*పాపం కన్నెపిల్లలు కొందరు*
వేటగాడి వలలో
పావురాల్లు చిక్కుకున్నట్లు
పిచ్చిపట్టి నచ్చిన వాడితో
పీకలదాకా ప్రేమలో"మునిగిపోతారు"
కామంతో కళ్ళు పొరలుకమ్మి
కౌగిలిలో "కరిగిపోతారు"
నవ్వుతూ పువ్వుల్లా "నలిగిపోతారు"
*పాపం కన్నెపిల్లలు కొందరు*
"రమ్మంటే"
సినిమాలకు షికార్లకు
పబ్బులకు క్లబ్బులకు
కసాయివాడి వెంట మేకల్లా వచ్చేస్తారు
"ఇమ్మంటే"
కన్యత్వాన్ని కానుకగా ఇచ్చేస్తారు
*పాపం కన్నెపిల్లలు కొందరు*
బరితెగించి బజారులో
నచ్చిన వాడితో,
పిచ్చిగా తిరుగుతారు
కళ్యాణం జరగాలని
కడుపు పండాలని
కమ్మని కలలు కంటారు
*పాపం కన్నెపిల్లలు కొందరు*
కొన్ని కలలు పాపంపగటి కలలు
కొన్ని ప్రేమలు పరమాత్మ లీలలు
51. విదేశీ వివాహం
"మొన్న"
అమ్మ చేతి వంటతింటూ
నాన్న చేయి పట్టుకు తిరిగిన కన్నకొడుకు
విద్యార్థిగా "విదేశాలకు ప్రయాణం"
"నిన్న"
విలాసవంతమైన విల్లాలు
ఖరీదైన కార్లు - కాసుల గలగలు
విచ్చలవిడి జీవితం కారణం "విదేశీ ఉద్యోగం"
"నేడు"
విదేశీ వియ్యంకులతో వినూత్న సంబంధాలు
కారణం ఘనంగా "విదేశీ వనితతో వివాహం"
"రేపు"
ఏమౌతుందోనని
ఏమి జరుగుతుందోనని
ఒకటే భయంతో ఒకటే దిగులుతో
ఒకటే అనుమానంతో ఎదురుచూస్తూ
కొత్త కాపురం ఎలా వుందని
కన్నవాళ్ళు కాల్ చేస్తే ఎంతో కూల్ గా చెప్పారు
ఏడాది తిరగకముందే
పెళ్లి పెటాకులైపోయాయని
విడాకులు కూడా మంజూరయ్యాయని
ఇండియాకు ఇద్దరు కాదు ఒక్కరేవస్తున్నారని
"విదేశీ వివాహం"
ఏ రోజైనా మూడునాళ్ళ ముచ్చటే
దూరపు కొండలు ఎప్పుడూ నునుపే
52. అక్కడెక్కడో ఢిల్లీ నడిబొడ్డున....
అక్కడెక్కడో ...
మెరుపులు మేఘాలను మ్రింగివేస్తుంటే
ఇక కుంభవర్షాలు కురిసేదెక్కడ ?
అక్కడెక్కడో ...
అంతరంగాన అసూయాగ్ని రాజుకుంటే
ఇక స్పందనలెక్కడ ?
అభినందనల వెల్లువలెక్కడ?
అక్కడెక్కడో ...
చింతలు చీకట్లో చిందులు వేస్తుంటే
ఇక చిరునవ్వుల విందులెక్కడ?
అక్కడెఎక్కడో ....
భక్తిభావం భస్మమైపోతుంటే
ఇక ముక్తిమార్గాలు తెరుచుకునేదెక్కడ ?
అక్కడెక్కడో ...
మృత్యుఘంటికలు మ్రోగుతువుంటే
ఇక శాంతిసందేశాలకు స్థానమెక్కడ?
అక్కడెక్కడో ...
యుద్ధఫిరంగులతో ధరణి ద్దరిల్లుతుంటే
ఇక శాంతికపోతాలు నింగికెగిరేదెక్కడ ?
అక్కడెక్కడో ....
విడాకులు బాకులై
గుండెల్లో గుచ్చుకుంటూవుంటే
ఇక వివాహ సంబందబాంధవ్యాలు
విరితోటలో కుసుమాలై విరబూసేదెక్కడ?
అక్కడెక్కడో ....
మిడతలదండు దాడితో
మిన్ను విరిగి మీద పడుతుంటే
ఇక పచ్చని పంటలు పండేదెక్కడ ?
ప్రజల ఆకలి మంటలు ఆరేదెక్కడ?
అక్కడెక్కడో ...
నల్లనిచట్టాల ఆరనికుంపట్లు రాజేస్తుంటే
ఇక అన్నదాతల ఆశలు చిగురించేదెక్కడ?
అక్కడెక్కడో ....
కర్కశచట్టాల కారుమబ్బులే కమ్ముకుంటూవుంటే
ఇక కర్షకులకళ్ళల్లో కాంతిరేఖలు వెలిగేదెక్కడ?
అందుకే ముందు...
అక్కడ అగాథాలను పూడ్చాలి...
అక్కడ రగిలే అగ్నిజ్వాలల్ని ఆర్పాలి...
అక్కడ కమ్మిన చిమ్మచీకట్లను చీల్చాలి...
అప్పుడే ఇక్కడ వేయిసూర్యబింబాల వెలుగు...
53. మీ భక్తులు కోరేదొక్కటే...
కోరిన కోర్కెలు తీర్చే ఓ కోదండ రామా !
మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...
నాడు రామబాణమెక్కుపెట్టి వాలిని వధించినట్లు
రావణాసురుని,పదితలలు నరికినట్లు
మాయలేడిలాగ,కంటికి కనిపించక,
నక్కినక్కి తిరిగే ఈ కరోనా రక్కసిని,
ఈ మాయదారి మహమ్మారిని,
తక్షణమే వేటాడి,తలనరికి అయోధ్యలో
కోటగుమ్మానికి వ్రేలాడదీసే శక్తిని,మాకివ్వుస్వామీ
దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే ఓ శ్రీకృష్ణా !
మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...
కురుక్షేత్రంలో మానసికంగా కృంగిపోయి
అస్త్రసన్యాసం చేసిన అర్జునుడికి గీతను బోధించి
చక్రంతో ఆ శిశుపాలుని శిరస్సును ఛేదించినట్లు
కంటికి కనిపించక,నక్కినక్కితిరిగే
ఈ కరోనారక్కసి,ఈ మాయదారి మహమ్మారి
శిరస్సును చేధించి,చిత్రవధ చేసే శక్తిని,మాకివ్వుస్వామీ...
ఏడుకొండలవాడా! ఓ వెంకటేశ్వరా !
మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...
ఏడుకొండలు ఎక్కలేక ఏం చేయాలో దిక్కుతోచక
మిమ్మల్ని దర్శించుకునే దారిలేక
128 సంవత్సరాల తర్వాత గుడికి తాళాలేశానని
విర్రవీగుతూ మమ్మును వెక్కిరిస్తూ గబ్బిలంలా
ఆ ఏడుకొండల్లో కంటికి కనిపించక,
నక్కినక్కి తిరిగే ఈ కరోనా రక్కసికి,
ఈ మాయదారి మహమ్మారికి,గుండు చేసి,
కొండదేవతకు బలినిచ్చే శక్తిని,మాకివ్వుస్వామీ.
యూదులరాజా ! ఓ క్రీస్తురక్షకా!
మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...
ఎందరో కుంటి, గుడ్డి,చెవిటి,మూగ, మూర్చ,
కుష్టు, పక్షవాత రోగులకు స్వస్థత చేకూర్చి
పీడించే దెయ్యాలను తరిమి కొట్టినట్లుగా
కంటికి నిపించక, నక్కినక్కి తిరిగే
ఈ కరోనా రక్కసిని,ఈ మాయదారి
మహమ్మారిని కలువరిగిరి సాక్షిగా
శిలువ వేసి,సమాధి చేసే శక్తిని,మాకివ్వు ప్రభూ....
అందరిని చల్లగా చూసే ఓ అల్లా!
మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...
తాళలిబాన్ ఉన్మాదిలా ఐయస్ఐ ఉగ్రవాదిలా
ఉగ్రరూపందాల్చి అగ్రరాజ్యాలనే అల్లకల్లోలం చేస్తున్న
విశ్వంపై విరుచుకుపడి,విలయతాండవం చేస్తున్న
కంటికి కనిపించక,నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని
ఈ మాయదారి మహమ్మారిని, రాళ్ళతో కొట్టి
మక్కాసాక్షిగా మట్టుపెట్టి,మాయంచేసే శక్తిని,మాకివ్వుదేవా..
ప్రత్యక్ష దైవమా! ఓ ప్రసన్నాంజనేయా !
మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...
మీరు నాడు లంకను దహనం చేసి
ఆ సీతమ్మ తల్లిని రక్షించినట్లు,
కంటికి కనిపించక,నక్కినక్కి తిరిగే
ఈ కరోనారక్కసిని,ఈ మాయదారి
మహమ్మారిని, కాల్చి బూడిదచేసి
కాశిలో అస్థికలు కలిపేసే శక్తిని,మాకివ్వు స్వామీ...
విఘ్నాలు తొలగించే ఓ విఘ్నేశ్వరా!
మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...
ఈ గండం నుంచి అందరిని గట్టెక్కించమని
కంటికి కనిపించక,నక్కినక్కి తిరిగే
ఈ కరోనా రక్కసిని, ఈ మాయదారి
మహమ్మారిని,అధఃపాతాళానికి
అణగద్రొక్కి,అంతంచేసే శక్తిని,మాకివ్వు స్వామీ....
54 .ఓసీ కరోనా రాక్షసి !
ఎవరే నిన్ను కన్నది?
కరోనా కరోనా కరోనా
ఎక్కడ చూసినా కరోనా
ఎవరి నోటవిన్నా కరోనా
అన్ని దేశాలల్లోదూరేనా
జనానికి సోకినా జనం జనం తాకినా
కడకు అందరు కాటికి చేరేనా
ఎక్కడో చైనాలో పుట్టి,
ఎందుకే భూమినంతటిని
భూతంలా చుట్టి వేస్తున్నావు
మాఅందరిని మట్టిలోకలిపేందుకా
కరోనా అంటేనే
కరెంట్ షాక్ కు గురైనట్లు
కలవరపడిపోతున్నారే
ఆ పేరు వింటేనే, గుండెదడ పుట్టి
ప్రజలూ గజగజ వణికి పోతున్నారే
జలుబు, జ్వరం, దగ్గు వచ్చినా
ఊపిరాడకున్నా ఉలిక్కిపడుతున్నారే
గుండెలు పిండేసే వార్తలు వింటూ
గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని
ప్రయాణాలు వాయిదా వేసుకొని
వర్క్ ఫ్రం హోం అంటూ ఇంటికే
పరిమితమై బిక్కుబిక్కు మంటూ
దిక్కుతోచక భయం భయంగా
దినదిన గండంగా బ్రతుకుతున్నారే
ఎక్కడో చైనాలో పుట్టి దెయ్యమై
ఎందుకే దేశాలన్నీ తిరుగుతున్నావు
మా అందరిని మట్టిలో కలిపేందుకా
నీ నోటికి చిక్కిన వారిని
నీ కంటికి కనపడిన వారిని
చిరుతలా చీల్చి వేయమని
సైలెంట్ గా సమాధి చేయమని
అనకొండలా చుట్టివేయమని
కాలసర్పమై కాటువేయమని
ఊరూ వాడా తేడా లేకుండా
పేద ధనిక బేధం లేకుండా
ఎల్లలు లేకుండా అన్ని దేశాలలో
అల్లకల్లోలం సృష్టించమని
సునామీలా దూసుకు రమ్మని
కారుచిచ్చులా చెలరేగి పొమ్మని
కనికరం,జాలిలేకుండా ఏ పాపం
ఎరుగని మానవాళిపై పగతీర్చుకోమని
కసితో ప్రపంచాన్ని కబలించి వేయమని?
సైలెంట్ గా అందరిని సమాధి చేయమని
మౌనంగా ఆ మృత్యువు ఆకలిని తీర్చమని?
ఓసీ కరోనా రాక్షసి ! ఓసీ కరోనా పిశాచి!
ఎవరే అన్నది? ఎవరే నిన్ను కన్నది?
మాయదారి రోగంగా మారమన్నది?
ఐతే ఒక్కటి మాత్రం పచ్చినిజం
షేక్ హ్యాండ్ ఇచ్చిపుచ్చుకున్న
ఇద్దరినీ కరోనా కాటేస్తుంది,
కరెంట్ లా షాక్కొడుతుంది,కాని
చేతులు రెండు జోడించి
నమస్కారం చేసిన వారిని మాత్రం
కరోనా కనికరిస్తుంది కరుణిస్తుంది,
ధీర్ఘాయుష్మాన్ భవా అంటూ దీవిస్తుంది
ఐతే ఈ కరోనాకు మందులేదని సోకితే
మరణమేనని భయపడకండి, ముందు
జాగ్రత్తగా,మందికి దూరంగా వుండండి
ముఖాలకు మాస్కులు వేసుకోండి
చేతులను శుభ్రంగా కడుక్కోండి
కరోనా మృత్యువు నుండి కాపాడుకోండి
మిత్రులారా ! జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త !
ప్రపంచానికేదో పెద్ద ప్రమాదమే పొంచివుంది
55.నా సూక్తులు...
నా సుభాషితాలు...
సకల
జనులకు
సుఖాలను
శుభాల నొసగే
నా సుందర...
సుమధుర సుభాషితాలు...
"సూర్యకిరణాలు ...
"సుప్రభాతాలు...
"నిత్య సత్యాలు...
"అభ్యుదయ భావాల
"ఆణిముత్యాలు...
అందరినీ అలరించే...
కనువిప్పు కలిగించే...
హృదయాలను కరిగించే...
నా సుందర...
సుమధుర సుభాషితాలు...
"నిండు కుండలు...
"నీతికి నిధులు...
"నిప్పురవ్వలు...
"చీకటిలో చిరుదివ్వెలు...
కత్తికన్నా పదునైన...
తేనెకన్నా తియ్యనైన...
మంచుకన్నా చల్లనైన...
నా సుందర...
సుమధుర సుభాషితాలు
"నిజాలకు నిచ్చెనలు...
"నీడనిచ్చే పచ్చని వృక్షాలు...
"వీనులకు విందులు...
"మొండి వ్యాధులకు మందులు...
56. నిండు కుండలా..?మంచు కొండలా..?
మీరు
మీ కుటుంబం
పెరటిలో చెట్లలా
పచ్చగా ఎదగాలంటే..!
చెరువులో చేపల్లా
స్వేచ్ఛగా బ్రతకాలంటే..!
నిండుకుండల్లా
నిశ్చింతగా ఉండాలంటే..!
మంచు కొండల్లా
చల్లగా జీవించాలంటే..!
చీకటి పడకముందే
దీపాలు వెలిగించుకోవాలి...
ఆర్జిస్తుండగానే...
ఆదాయముండగానే...
ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి...
క్రమపద్దతిలో పొదుపు చేసుకోవాలి...
ధైర్యంగా తెలివిగా మదుపు చేసుకోవాలి
ఆపై ధీమాగా...
తలెత్తుకు తిరగాలి...
దర్జాగా రాజాలా బ్రతకాలి...
ధన్యులై...స్పూర్తి ప్రదాతలై...
ఆదర్శమూర్తులై చరిత్రలో మిగిలిపోవాలి.
57. అంతా ఆ దైవనిర్ణయమే..!
ఏదో ఒకరోజు
ఏదో విషఘడియలో...
ఉన్నఫళంగా...
కుప్పకూలిపోయి...
అకస్మాత్తుగానో...
వృద్ధాప్యంతోనో...
పరమాత్మ పిలిస్తేనో...
మృత్యువు దాపురిస్తేనో...
ఖర్మకాలి మనిషి కన్నుమూస్తే...
కాటికొచ్చే
బంధువులు...
పెట్టే ఖర్చులు...
తీసే సమాధి సైజులు...
కట్టే సమాధి ఆకారాలు...
చితిని అంటించే మనుషులు...
కర్మకాండలాచరించే పూజారులు...
శవాలను చేర్చే స్మశానాలు...
కాల్చే కర్రలు...మారవచ్చునేమో...
కానీ "పూడ్చేమట్టి" మాత్రం మారదు...
ఔను
మనిషి...
మట్టిలో పుట్టి...
మట్టిలో పెరిగి...
మట్టినుండి పండిన...
ఆ పంటలు తిని కడకు...
ఆ మట్టిలోనే కలిసిపోవడం...
అంతా ఆ దైవ నిర్ణయమే కదా...
అందులో సందేహంలేదు ఆవగింజంతైనా
రచన:
కవి రత్న
సహస్ర కవి
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502
Comments
Post a Comment