8... రిపబ్లిక్ డే కవితలు...

 8...రిపబ్లిక్ డే కవితల ఇండెక్స్...

1. రక్షణకవచం..! మనరాజ్యాంగం..!
2. ఏమన్నది..? ఏమన్నది..?
    నా భారత రాజ్యాంగం..?
3. మన భారత రాజ్యాంగం...
4. ఎగురవేద్దాం..! ‌ఎగురవేద్దాం..!
     మన మువ్వన్నెల జెండా..!
5. వందేమాతరం...! వందేమాతరం...!!
6. మురిపించే నా 
    మువ్వన్నెల జాతీయ జెండా..!
7. మన "స్పూర్తిగీతం"..!
    వందేమాతరం..! వందేమాతరం..!
8. ఏమన్నది..? ఏమన్నది..?
    ఎగిరే నా త్రివర్ణ పతాకం..?

1. రక్షణకవచం..! మనరాజ్యాంగం..!

కోట్లమంది జీవితాలలోని
చిమ్మచీకట్లను తొలగించి 
వెన్నెలవెలుగులను పంచి
కొండంత జీవితాన్ని...
కొవ్వొత్తిలా కరిగించి...
కొందరికోసం కాదు
కోట్లాది భారతీయుల 
సంక్షేమాన్ని ఆకాంక్షించి
అమరజీవి అంబేద్కర్ 
అందించిన..."అమృతభాండం"...
"మన భారత రాజ్యాంగం"...

తన రక్తాన్ని...
చెమటచుక్కల్ని... 
సిరాచుక్కలుగా మార్చి...
తన ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి...
కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి
అతిక్లిష్టమైన విదేశాల రాజ్యాంగాలన్నీ
రాత్రింబవళ్ళు అధ్యయనం చేసి...చేసి
అమరజీవి అంబేద్కర్  అందించిన... విలువైన...విశిష్టమైన...వినూత్నమైన 
ప్రపంచమేధావులచే ప్రశంసింపబడిన
ప్రజాస్వామ్య దేశాలకన్న 
మిన్నైన..."మణిమకుటం"...
"మన భారత రాజ్యాంగం‌...

రాబోవు 
వెయ్యితరాలకైనా
చెక్కుచెదరని చక్కని 
సుపరిపాలన సూత్రాల్ని...
సురక్షితమైన జీవనానికి... 
మహత్తరమైన ప్రణాళికల్ని... 
మంగళకర మార్గాల్ని లిఖించి...
ఇందులో దేవతలకే తప్ప 
దెయ్యాలకు ప్రవేశంలేదన్న...
గొప్పఆశయంతో అమరజీవి 
అంబేద్కర్ నిర్మించిన...
"సువర్ణశోభిత‌ దేవాలయం"
"మన భారత రాజ్యాంగం"...

2. ఏమన్నది..? ఏమన్నది..?
    నా భారత రాజ్యాంగం..?

సమగ్రతకు...సమైక్యతకు 
నా దేశం...సోపానమన్నది...

భిన్నత్వంలో...ఏకత్వమే 
మన...నిత్య నినాదమన్నది...

సర్వమతాలకు...
కులాలకు...జాతులకు...
సంస్కృతి‌...సంప్రదాయాలకు... 
నా భరతజాతి...నిలయమన్నది...

ప్రజాస్వామ్యమే... 
భారతావనికి...ఆరవప్రాణమన్నది...
అదే భరతమాతకు...స్వర్ణాభరణమన్నది
రాజ్యాంగమే దేశానికి రక్షణ కవచమన్నది

3. మన భారత రాజ్యాంగం...

అపరమేధావి 
రాజ్యాంగ నిర్మాత
డా.బి.ఆర్ అంబేద్కర్ 
2 సంవత్సరాల
11 నెలల
18 రోజులు
తన రక్తాన్ని 
స్వేదంగా చిందించి
మనకు అందించిన 
ఈ రాజ్యాంగం...
రాజ్యాంగ సభచే
1949 నవంబరు 26 న 
ఆమోదించబడే...
1950 జనవరి 26 న 
అమలులో కొచ్చే...

న్యాయం...
సమానత్వం...
సౌభ్రాతృత్వం...
స్వేచ్ఛ స్వాతంత్ర్యమే...
పటిష్టమైన నాలుగు
పునాదులుగా
నిర్మితమైన నవభారతం
ప్రజాస్వామ్య...
లౌకిక...సామ్యవాద...
స్వతంత్ర...గణతంత్ర...
రాజ్యంగా అవతరించే...

ఔను ఈ భారత రాజ్యాంగం
ప్రజారాజ్యానికి రాచబాట...
ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ...
భారతీయులకు ఒక రక్షణకవచం...

అందుకే రాజ్యాంగ సృష్టికర్త 
అందరివాడు అమరజీవి
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను 
మనం కలలోనైనా మరువరాదు... 
ఆ మహనీయుని "స్మరణే"... 
ప్రతిభారతీయునికి " ఒక ప్రేరణ" 

4. ఎగురవేద్దాం..! ‌ఎగురవేద్దాం..!
     మన మువ్వన్నెల జెండా..! 

స్మరించుకుందాం..! 
స్మరించుకుందాం..!
వందేమాతరం...జనగణమన...
సృష్టికర్తలైన...
ఆ బంకించంద్ర చటర్జీ...
రవీంద్రనాథ్ ఠాగూర్ లను...
జాతీయ పతాక రూపశిల్పి 
శ్రీ పింగళి వెంకయ్యను...

తెలుపుదాం..!  
తెలుపుదాం..! 
విప్లవాభివందనాలు...
దేశరక్షణకోసం 
తృణప్రాయంగా
ప్రాణాలను త్యాగంచేసి 
తల్లిభరతమాత నుదుట 
రక్తతిలకాన్ని దిద్దిన 
విప్లవవీరులైన 
ఆ భగత్ సింగ్...అల్లూరి...
ఝాన్సీలక్ష్మీబాయిలకు...

గుర్తుచేసుకుందాం..! 
గుర్తుచేసుకుందాం..!
భారతమాత 
దాస్యశృంఖలాలను త్రెంచి...
ఆంగ్లేయుల అకృత్యాల 
నెదిరించి...జైళ్ళలో మ్రగ్గిన 
స్వాతంత్ర్య సమరయోధులు...
దేశభక్తులు మన జాతినేతలైన... 

మన గాంధీజీ... 
నెహ్రూ...నేతాజీ... 
సర్దార్ వల్లభాయ్ పటేల్... 
అటల్ బిహారీ వాజపేయి...
ఇందిర...అబ్దుల్ కలాంలను...

తన రక్తాన్ని 
స్వేదంగా చిందించిన...
రక్షణ కవచంలాంటి
రాజ్యాంగాన్ని అందించిన...
అపర మేధావి...జ్ఞాన సూర్యుడు 
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను...

చేద్దాం..! చేద్దాం..! అందరం
నేడే భగవద్గీతపై ప్రమాణం...
"బంగారుతల్లి భరతమాత" 
పాదారవిందాలకు మ్రొక్కి... 
త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూ...
దేశ‌రక్షణే...మా ఆశయమని...
దేశ సమగ్రతే...మా ఆఖరి లక్ష్యమని...
ఏ సమరానికైనా... 
ఏ ప్రాణార్పణకైనా...సదా మేం సిద్ధమని...

5. వందేమాతరం...!
    వందేమాతరం...!!

ఏ పాట వింటే...
భారతీయులందరి 
ఒళ్ళు పులకరిస్తుందో..!

ఏ పాట వింటే... 
తెల్లదొరల గుండెల్లో 
మరఫిరంగులు పేల్తాయో..!

ఏ పాట వింటే... 
ప్రజలు ఒక ప్రభంజనమై 
ఒక ఉరిమే ఉప్పెనై 
విరుచుకుపడతారో..!

ఏ పాట వింటే... 
పశువులు శిశువులు 
సైతం ఉలిక్కిపడి లేస్తాయో..!

ఏ పాట వింటే...
నరనరాలలో
తరతరాలుగా 
అణువణువునా
స్వాతంత్ర్య కాంక్ష
దేశభక్తి రగులుతుందో..!
 
ఏ పాట వింటే... 
మన స్వాతంత్ర్య 
సమరయోధులంతా
పిడికిళ్లు బిగించి సింహాలై
సమరానికి సిద్దమౌతారో..!

ఏ మంత్రదండంతోనైతే
మన విప్లవవీరులు
భగత్ సింగ్...
ఝాన్సీలక్ష్మీబాయి...
అల్లూరి సీతారామరాజు...
ఆ తెల్లదొరలను ఎదిరించి 
వారి గుండెల్లో నిదురించారో..!

అదే అదే మన జాతి పదే పదే 
పాడుకునే "వందేమాతర స్పూర్తిగీతం"...

6. మురిపించే నా 
    మువ్వన్నెల జాతీయ జెండా..!

అదిగో...
అదిగో...అల్లదిగో...
ఆ నీలినీలి 
ఆశల ఆకాశంలో
రెపరెపలాడుతూ...
ఎగురుతోంది ఎగురుతోంది...
నా మువ్వన్నెలజెండా..! 

ఏమన్నది ఏమన్నది ? 
త్యాగాలకు ప్రతిరూపమైన
నా ముత్యాల...మురిపాల
మువ్వన్నెల జాతీయ జెండా ! 

కమ్మని కలలు...
కనమన్నది...కన్న ఆ కలలు 
సాకారమయ్యేంతవరకు
కునుకు తియ్యకన్నది...

ఏమన్నది..? ఏమన్నది..?
మురిపించే...కరుణను కురిపించే 
నా మువ్వన్నెల జాతీయ జెండా..?

పచ్చని చెట్టల్లే...పెరగమన్నది
నింగిలో తారల్లా...మెరమన్నది
ఎవరెస్టు శిఖరంలా...ఎదగమన్నది
నీటిలో కలువల్లా‌...వికసించాలన్నది
సూర్యాచంద్రుల్లా...ప్రకాశించాలన్నది...

ఏమన్నది..? ఏమన్నది..?
మురిపించే...ప్రేమను కురిపించే 
నా మువ్వన్నెల జాతీయ జెండా..?

నిశ్చింతగా....నిద్రపొమ్మన్నది
నిప్పులా నిస్వార్థంగా...బ్రతకమన్నది
నీతిగా నిజాయితీగా...జీవించమన్నది
నిర్భయంగా...తలఎత్తుకు తిరగమన్నది.

7. మన "స్పూర్తిగీతం"..!
    వందేమాతరం..! వందేమాతరం..! 

వందేమాతరమంటే... 
అది ఒక పాట 
కాదు ఒక తూటా

వందేమాతరమంటే...  
ఒక గేయం కాదు 
ఒక ఆయుధం...

వందేమాతరమంటే... 
ఒక శంఖారావం 
ఒక సింహనినాదం...

వందేమాతరమంటే...
నాడు జాతిపిత మన
కిచ్చిన జైలుపిలుపు...

వందేమాతరమంటే...
చారిత్రాత్మకమైన 
ఒక గొప్ప మలుపు...

వందేమాతరమంటే... 
మన భరతమాత గెలుపు

8. ఏమన్నది..? ఏమన్నది..?
    ఎగిరే నా త్రివర్ణ పతాకం..?

ఏమన్నది..? ఏమన్నది ? 
ఎగిరే నా త్రివర్ణ పతాకం..?
మన మహాత్ములు 
మహనీయులు ఋషులు
మహర్షులు అందించిన 
ఆ నాలుగు వేదాలే రథాలై 
నా బంగారుతల్లి 
భర్తమాతను ఊరేగిస్తాయన్నది..!

ఏమన్నది..? ఏమన్నది ? 
ఎగిరే నా త్రివర్ణ పతాకం..?
ఎండిన పంటపొలాలను 
సస్యశ్యామలం చేసే ఆ
గంగాయమున బ్రహ్మపుత్రలే 
మనకు జీవనధారలన్నది..!

ఏమన్నది..? ఏమన్నది ? 
ఎగిరే నా త్రివర్ణ పతాకం..?
ఆరనిజ్యోతులు...అమరవీరులైన...
భగత్ సింగ్ ...సుభాష్ చంద్రబోస్ 
అల్లూరి సీతారామరాజుల...
నిస్వార్థపు త్యాగాలే...
మనకు నవజీవనరాగాలన్నది..!

ఏమన్నది..? ఏమన్నది ? 
ఎగిరే నా త్రివర్ణ పతాకం..?
ఘనులు...త్యాగధనులైన...గాంధీ 
నెహ్రూ...సర్దార్ వల్లభాయ్ పటేల్ 
ఇందిరా...రాజీవ్...అటల్ బిహారీ 
వాజపేయి అబ్దుల్ కలాం జాతినేతల 
ఆశయాలే...మనకు ఆదర్శమన్నది..! 




రచన:
"కవిరత్న"
"సహస్రకవి" 
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502





Comments