8... ఓటర్ల కవితలు

 8...ఓటర్ల కవితల ఇండెక్స్...

1. అన్నా..! ఓ ఓటరన్నా..! 
   నీవు ఓడరాదు..!నీ ఓటు ఓడరాదు..!
2. ఓటర్లంటే...ఎవరు?
    మట్టికరిపించే మాంత్రికులు...
3. ఓటరు మాంత్రికుల్లారా ఒక్కమాట...?
4. ఉచితాలు మాకొవద్దు... 
     సుపరిపాలనే మాకు ముద్దు... 
5. నా ఓటు ఎవరికంటే...?
6. నిజమైన ప్రజాప్రతినిధికే మన ఓటు ?
7. ఓటరు దేవుళ్ళారా..! 
    మీకు వందనం పాదాభివందనం..!!
8. ఆయుధాలు...
   అతీంద్రియ శక్తులు..?

1. అన్నా..! ఓ ఓటరన్నా..! 
   నీవు ఓడరాదు..! నీ ఓటు ఓడరాదు..!

అయ్య బాబోయ్ వచ్చేస్తున్నాయట..! 
తేళ్ళు...తోడేళ్ళు...విషసర్పాలు... 
ఊసరవెల్లులు...బంగారు బల్లులు...
ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 
నీ వ్రేలికి ఉందిగా..."సుదర్శన చక్రం"
నీ భుజం మీద ఉందిగా..."గండ్రగొట్టలి"
నీ అరచేతిలో ఉందిగా..."అణుబాంబు" 
నీ వ్రేలిమీద వేసే సిరాచుక్కలో ఉందిగా...
ఓటనే "వజ్రాయుధం"... 
నీ హక్కుల అంబుల పొదిలో ఉందిగా... 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి .ఆర్.
అంబేద్కర్ అందించిన..."రామబాణం"...
ఆ రామబాణాన్ని సంధించాలి
రాజకీయ రాక్షస రావణాసురులను
కారడవులకు పంపాలి 
రామరాజ్యాన్ని స్థాపించాలి
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి...
అమ్మ బాబోయ్ వచ్చేస్తున్నాయట..!
గుడ్లగూబలు...
గుంటనక్కలు...
కులం గజ్జి కుక్కలు...
గోడమీది పిల్లులు...
గోముఖ వ్యాఘ్రాలు...
దోపిడీ దొంగలు...కొల్లేటి కొంగలు... 
ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 
నీ ఆత్మసాక్షిగా...
నీ ఆయుధాలు నీవు ధరించి...
నిర్భయంగా...నిష్పక్షపాతంగా...
నీళ్ళను పాలను వేరుచేసే హంసలా... 
నీవు విజ్ఞతతో విచక్షణతో ఓటు వేయాలి...
రేపు నీకు పగటిపూటే చుక్కలు చూపించే
ఆ "అవినీతి అనకొండలకు"
ఆ "అడవి పందికొక్కులకు"
నీవు చుక్కలు చూపించాలి 
అయ్య బాబోయ్ వచ్చేస్తున్నారట..! 
మేకవన్య పులులు...
తేనె పూసిన కత్తులు...
మాటల మాంత్రికులు...
అరచేతుల్లో స్వర్గాన్ని 
చూపించే అబద్దాలకోరులు...
ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 
కానీ ఓ ఓటరన్నా..!
నీతిమంతులను...
నిస్వార్థపరులను... 
సేవాతత్పరులను...
పరమాత్మ స్వరూపులను...
ఘనులను త్యాగధనులను... 
ఆపదలో ఆదుకునే ఆత్మబంధువులను... 
సమస్యలకు స్పందించే సహృదయులైన...
నేతలను నీవు గెలిపించాలి నీవు గెలవాలి...
నీవు ఓడిపోరాదు....నీ ఓటు ఓడిపోరాదు...

2. ఓటర్లంటే...ఎవరు?
    మట్టికరిపించే మాంత్రికులు..!

ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..! 
ఒక పచ్చినిజం..! తెలుసుకోండి..! 
పకృతిలో పంచభూతాలలో 
స్వేచ్ఛగా విహరించే పక్షులు
చెట్ల మాటున దాగిన వేటగాళ్లు 
విసిరే మత్తుగింజలకాశపడితే...
వలలో చిక్కుకుపోయి
విలవిలలాడుట తథ్యమని...
ఉచితాలకాశపడితే...
వేటగాళ్ల ఉరిలో చిక్కుకున్నట్లే...
ఈ ప్రజాస్వామ్యంలో
ఈ ఎన్నికల జాతరలో
ఓటు హక్కున్న
ఓ ఓటరు పక్షుల్లారా..!
ఏ మత్తు మందుకో...
ఏ మటన్ బిర్యానీకో...
ఏ పచ్చనోటుకో మీరు ఆశపడి...
అతిశక్తివంతమైన... 
అత్యంత విలువైన...
పవిత్రమైన మీ ఓటును... 
ఏ దుష్టులకో...
ఏ దుర్మార్గులకో... 
ఏ దగాకోరులకో...
ఏ దోపిడీదారులకో...
ఏ మోసగాళ్ళకో...
ఏ మాయగాళ్ళకో...
ఏ రాజకీయ రాబందులకో.... 
ఏ మత్తులోనో...
ఏ మైకంలోనో...మీరు అమ్ముకుంటే...
ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..!
ఓ పచ్చినిజం..! తెలుసుకోండి..! 
ఆపై అందలమెక్కేది వారేనని...
అధికారం దక్కేది వారికేనని...
అంధకారంలోకి జారిపోయేది ...
అస్థిపంజరాలుగా 
మారిపోయేది మీరేనని...
అధఃపాతాళానికి 
అణగద్రొక్కేది మిమ్మల్నేనని...
మరో ఐదేళ్ళు మీరంతా 
రెక్కలున్నా ఎగరలేని పక్షులని...
మీ కళ్ళకు గంతలు కట్టినట్లేనని...
మీ గొంతులు మూగబోయినట్లేనని...
ప్రశ్నించేహక్కును కోల్పోయినట్లేనని..
అందుకే ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..! 
ఒక పచ్చినిజం..! తెలుసుకోండి..! 
అమరజీవి అంబేద్కర్ 
అందించిన ఓటే మీకు 
ఒక వజ్రాయుధమని...
ఆది మీ అరచేతిలో 
దాగిన అణుబాంబని..! 
అదే మీ ఆర్థిక రుగ్మతలకు 
ఒక దివ్యఔషధమని..!
ఐదేళ్ల కోసారి దర్శనమిచ్చే...
వాగ్దానాల వర్షం కురిపించే...
అరచేతిలో స్వర్గం చూపించే... 
నేతల తలరాతల్ని ఆశలను 
అంచనాలను అవినీతిమయ 
జీవితాలను తారుమారు చేసి...
నేతల్ని మట్టికరిపించి...
అవినీతిని అంతం చేసే
మహామాంత్రికులు మీరేనని...

3. ఓటరు మాంత్రికుల్లారా ఒక్కమాట...? 

"నాలుగు పిల్లర్స్" ‌లేకుండా 
ఏ మేస్త్రి 
కొత్తగా ఇళ్లు...కట్టలేడు...
"చేతిలో కత్తెర" 
"మెడలో టేపు" లేకుండా
ఏ టైలరూ 
కొత్తగా డ్రెస్...కుట్టలేడు...
నీతిగా...నిజాయితీగా...
నిస్వార్థంగా ప్రజలకోసమే 
జీవితాలను త్యాగం చేసే
"ప్రజానాయకుడు" లేకుండా 
ఏ గ్రామం...అభివృద్ధి చెందదు...
అందుకే 
ఓటు వేసేముందు
ఒక్కక్షణం ఆలోచించండి...
వజ్రాయుధంవంటి ఓటున్న
ఓ ఓటరు మాంత్రికుల్లారా..! మీ
తిరుగులేని తీర్పు మార్పును తేవాలి... 
కళ్ళబొల్లి మాటలు చెప్పే 
నేతలకు కరెంట్ షాక్ ఇవ్వాలి...
గుంటనక్కలకు గుణపాఠం నేర్పాలి...
నయవంచకులైన 
నాయకులందరికి... 
కన్న కలలన్నీ కల్లలై...
జాతకాలన్నీ తారుమారై....
అంచనాలన్నీ తల్లక్రిందులై... 
కళ్ళుబైర్లు కమ్మి మైండ్ బ్లాక్ కావాలి...
ఎన్నికల బరిలో దిగిన
అభ్యర్థులందరికి అర్దం కావాలి 
ఓటర్లంటే...
మట్టిబొమ్మలు కాదని...
మట్టి కరిపించే మాంత్రికులని... 
ఓటర్లంటే...బిక్షగాళ్లు కాదని...
నేతల తలరాతలు వ్రాసే బ్రహ్మదేవుళ్ళని...

4. ఉచితాలు మాకొవద్దు... 
    సుపరిపాలనే మాకు ముద్దు...
 

ఉచితాలకు ఆశపడితే... 
ఉచ్చులో చిక్కుకున్నట్లే..!
ఉచితాలకు ఆశపడితే...
ఊబిలోకి జారిపోయినట్లే..!
ఉచితాలంటూ ఊకదంపుడు
ఉపన్యాసాలు విని మెడకు 
ఉరిత్రాళ్ళు బిగించుకోకండి..!
ఉచితాలన్నవి
ఉరుములు మెరుపులే
కరుణలేని కారుమేఘాలే..!
నేడు ఉచిత బస్సు 
రేపు తుస్సు బుస్సు.!
నేడు 5000 పెన్షన్
రేపు వస్తుందో రాదో టెన్షన్..!
నేడు ఉచిత గ్యాస్ బండ
రేపు మననెత్తిన గుదిబండ..!
నేడు ఉచిత కరెంట్ పక్కాచీటింగ్ 
రేపు పన్నుల్తో మనజేబుల్ కటింగ్..!
అందుకే వద్దు వద్దు..!
ఉచితాలు మాకొవద్దు..!
సుపరిపాలనే మాకు ముద్దు..!
 
5.  నా ఓటు ఎవరికంటే...?

రేపు 
ఎన్నికల
బూతులో
నా వ్రేలిమీద వేసే 
ఒకే ఒక్క సిరాచుక్క మీద
ప్రమాణం చేసి చెబుతున్నా...
నేను 
ఏ బీరుకో...
ఏ బిర్యానీకో... 
ఏ ఉచితాలకో...
ఏ పచ్చనోటుకో...
ఆశపడి నా 
"విలువైన ఓటును"
ఎవరికీ అమ్ముకోనని... 
నా ఓటు 
...త్యాగధనులకే...
నా ఓటు 
...నీతిమంతులకే...
నా ఓటు 
...నిస్వార్థపరులకే... 
నా ఓటు 
...ప్రేమమూర్తులకే...
నా ఓటు 
...ప్రజాప్రతినిధులకే...
అని నేడు నేను 
ప్రమాణం చేస్తున్నా...
అంబేద్కర్ అందించిన 
నా ఓటు...నిజంగా 
"ఒక వజ్రాయుధమని" 
నేను గట్టిగా నమ్ముతున్నా....

6. నిజమైన ప్రజాప్రతినిధికే మన ఓటు ?

అన్నా...
అనగానే
విన్నాను...
నేనున్నాను...
వస్తున్నానంటూ
రియల్ హీరో సోనుసూదల్లా
ఏ సమస్య వచ్చినా రెక్కలు 
కట్టుకుని మీ ముందరవాలే
మీ కష్టాలను తన కష్టాలుగా
మీ బాధల్ని తన బాధలుగా భావించే
నిగర్వి...
శాంతమూర్తి...
అందరివాడు...
అజ్ఞాత శతృవు...
నిత్యం నవ్వులు... 
రువ్వే నిర్మలమూర్తి...
అందరికీ ఆత్మబంధువు...
స్నేహశీలి...సేవాతత్పరుడు... 
సమస్యలకు తక్షణమే స్పందించే
సహృదయుడు...దయాసముద్రుడు...
ఊరికిఉపకారి... 
వివాదరహితుడు...
ఉదార స్వభావుడు...
ఊరంతా బాగుండాలి... 
అందులో నేనుండాలనే...
మంచి మనసున్న మహారాజే...
నిజానికి...నిజమైన ప్రజాప్రతినిధి...అట్టి 
నేతకే మన పవిత్రమైన ఓటును వేద్దాం..!
వేసి...ప్రజాస్వామ్యానికే పట్టం కడదాం..!!

7. ఓటరు దేవుళ్ళారా..! 
    మీకు వందనం పాదాభివందనం..!!

ఓటర్లంటే...
బిక్షగాళ్లు కాదని... 
నేతల తలరాతలు 
వ్రాసే బ్రహ్మదేవుళ్ళని...
ఓటర్లంటే...
అవసరమైతే 
అందలమెఎక్కిస్తారని... 
మోసం చేసే దోచుకునే దొంగల్ని 
అధఃపాతాళానికి అణగద్రొక్కుతారని... 
ఓటర్లంటే...
నిస్వార్థంతో... 
నిత్యం ప్రజాసేవలో... 
నిమగ్నమయ్యే వారిని  
ప్రత్యక్ష దైవాలుగా ఆరాధిస్తారని...
ఐదేళ్ళకోసారి దర్శనమిచ్చే..‌.
వాగ్దానాల వర్షం కురిపించే...
ప్రజాసమస్యలు పట్టించుకోని 
బడానాయకుల భారతం పడతారని...
ఓటర్లంటే... 
అమాయకులు కాదని... 
తలలు పండిన నాయకుల్ని 
సైతం మట్టి కరిపించే మాంత్రికులని...
ఓట్లకోసం...
భారీ మెజారిటీకోసం...
ప్రత్యర్ధి పై గెలుపు కోసం...
ఎన్నో కలలుకంటూ ఎన్నికల బరిలో 
దిగిన అభ్యర్థులందరికి...అర్థం కావాలి...! 
అర్థమైంది..అందుకే ఓటరు దేవుళ్ళారా..! 
మీకు వందనాలు..! పాదాభివందనాలు..!
 
8. ఆయుధాలు...
    అతీంద్రియ శక్తులు..?

అన్నా..! ఓ ఓటరన్నా..!
ఓ పచ్చినిజం చెబుతా విను
శ్రీ "ఆంజనేయుడికి" తన శక్తి
తనకు తెలియదన్నట్లు...
నీకున్న నీ ఓటుకున్న
ఆ "అఖండమైన శక్తి"
నీకు సైతం తెలియదాయె...
నీ చేతిలో ఉంది ఓటు కాదు
అది ఒక త్రిశూలం...
అది ఒక రామబాణం...
అది ఒక వజ్రాయుధం...
అది ఒక పదునైన కరవాలం...
ఔను నీది ఏ దైవ స్వరూపమో ఏమో...
నీది ఏ దేవతా శక్తి ప్రతిరూపమో ఏమో...
మదించిన మాయమాటల
"మహిషాసురులను" వధించడానికి...
కామపిశాచులైన రాక్షస "రావణాసురుల"
పదితలలు తెగ నరకడానికి...
నమ్మించి నట్టేటముంచే నాయక
"నరకాసురులను" మట్టు పెట్టడానికి...
గుర్తుంచుకునే "గుణపాఠం" నేర్పడానికి...
నీకు సైతం
ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయి
అదృశ్యంగాఎన్నో చేతులున్నాయి
ఆచేతుల్లో ఎన్నో ఆయుధాలున్నాయి
రేపు నీవు ఎవరికి 
అమృతాన్ని పంచెదవో..?
ఎవరిపై విషం చిమ్మెదవో..?
ఎవరికి ఎరుక..? నీ చేతుల్లో
అదృశ్యంగా ఉన్న ఆయుధాలకు తప్ప
రేపు నీవిచ్చు ఆ తిరుగులేని తీర్పు...
తెచ్చేను దేశంలో విప్లవాత్మకమైన మార్పు

రచన:
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502
























Comments