73...కవితల కవితా కిరణాల ఇండెక్స్
1. మౌన ప్రార్థన
2. కన్నతల్లి ఇందిర కన్ను మూసిందిర
2A. కన్నతల్లి ఇందిర ! కన్ను మూసిందిరా
3. షాక్ (ఔరా ! అది మల్లెపువ్వా..!
కాదు నిప్పురవ్వ..! )(హాస్య కవిత)
4. యువతా! ఓ యువతా!!
5. వెలివేసే...వెర్రిసంఘం..?
6. కాలగర్భంలో
కలిసిన కార్మికులు...(కార్మికుల కవిత)
7. మై నేమ్ ఈజ్ "మని”..!
8. కాలమే నా కలమైతె..?
9. ఆశబోతు అల్లుళ్ళు..?
10. తొలకరి జల్లుల తొలిరాత్రి...!
(క్రొత్త దంపతుల..."పిచ్చికోరిక".)
11. నేనొక నిదురరాని నిరుద్యోగిని..?
12. మతాలు...మారణహోమాలు
13. మై అడ్రస్...?
14. మాతృత్వం
(మాతృత్వం..! మానవత్వం..!)
15. రైక ముడెట్టక పడుకోయే...
రంగీ రాత్రిపూట!
16. అమరజీవి అంబేద్కర్
17. మిత్ర ద్రోహం...?
18. ఓం శాంతి శాంతిః
19. ప్రేమ పూజారి
20. 'O' My Dear Son...!
21. గుంటనక్కలకు గుణపాఠం..?
22. కులం కుళ్ళు...మతం ముళ్ళు..!
23. క్రిస్మస్ పండుగ..!!!
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)
24. ఆడపిల్లల తండ్రి...! (మినీ కవిత)
25. నోరు జారకు..!
26. జాలి గుండెల ఓ జాతినేత..!
27. పెళ్ళి...గిళ్ళి
28. ఎగిరే తారాజువ్వలమై...
రగిలే నిప్పురవ్వలమై...
(బాలల విప్లవం కవిత)
29. ఆరనిజ్యోతి..!
(ఆకాశంలో ఆరనిజ్యోతి..!)
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)
30. మీ శ్రీమతి మీకొక బహుమతి..!
31. రైతువీర లేవరా...!
32. అభిషిక్తుని అమరత్వం...!
33. కలకాలం కవివై...
బ్రతకాలీ భువిపై...
33A. కల్తీలేని...కవిత్వం
34. బంగారుగుడ్లు పెట్టే బాతులు..?
34A. కుబేరులెవరు...?
34B. బొమ్మలాట...?
34C. బంగారు బాతులు
35. నాడే ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది
36. సంస్కారం
37. గాడిద
38. మోసం చేస్తే (ప్రేమకు అర్థం..?)
39. ప్రేయసీ నా ఊహల ఊర్వశి
40. కారుమబ్బులే...కదా?
41. మందిరమా...మసీదా
(బడా భక్తులు...? కార్పోరేట్ శక్తులు..??)
42. స్త్రీకి...పెళ్ళైతే?
43. కొత్త సంవత్సరం వస్తుంది
44. మురిపించే ముద్దు గులాబి
45. అర్హుడు...?
46. మగువ - మచ్చ
47. హార్ట్ ఎటాక్...?
48. వనితల విప్లవం
(స్త్రీలే సింహాలైతే...?)
49. ప్రణయం - ప్రళయం..!
50. ఆశాజీవి
51. అగ్ని పరీక్ష ...?
52. అదృష్టం...!
53. రిక్వెస్ట్...?
54. నేలకొరిగిన నేతలు...
55. ఫ్రీడం ఈజ్ నాట్ ఫ్రీ
56. ఆకలి బొమ్మ
57. భగ్నప్రేమ
58. డబ్బు! డబ్బు!! డబ్బు!!!
59. హిందువు
60. భక్తుడు
61. చాకచక్యం
62. అర్ధాంగి అదృష్టం
1. మౌనప్రార్థన...
దైవమా !
ఓ నా దైవమా !
"రక్షించాలని"
ఉందీలోకాన్ని
మూఢనమ్మకాల
"మురికికూపం నుంచి"
అందుకు అక్కర్లేదు తండ్రీ !
ముందుజన్మలో నాకే "ముక్తి"
ప్రసాదిస్తే చాలు
శ్రమజీవుల్లో
చైతన్యాన్ని రగిలించే "శక్తి"
దైవమా !
ఓ నా దైవమా !
"చక్కనిసందేశం
ఇవ్వాలని ఉందీ
సమాజానికి"
స్వచ్ఛ సాంప్రదాయాల
"సంకెళ్లు త్రెంచి"
అందుకు అక్కర్లేదు తండ్రీ !
నాకే "దక్కనిధనము"
మ్రొక్కెద నొసగిన
ఓ చక్కని "సాహిత్యవరము"
2. కన్నతల్లి ఇందిర కన్ను మూసిందిర
విశాల భారతావనిని
అద్వితీయంగా పరిపాలించి
విశ్వశాంతి స్థాపనకై అహర్నిశలు పరితపించి విశ్వాస ఘాతకులైన అంగరక్షకుల అమానుషత్వానికి
...బలిపశువులా ఇందిర...బలైపోయిందిర
కారుచిచ్చులా దహించే
కటిక దారిద్య్రంలో జీవించే
కార్మిక కర్షక బ్రతుకుల్లో
కారుచీకట్లు తొలగించిన...
కాంతి రేఖలు వెలిగించిన...
...కన్నతల్లి ఇందిర...కన్నుమూసిందిర
విదేశీయుల మద్దతుతో
విజృంభించే విచ్ఛిన్నకర శ క్తులు తీవ్రరూపందాల్చి దేశాన్ని చీల్చి
ప్రజల రక్తాన్ని పీలుస్తాయని... ప్రజాస్వామ్యాన్ని కూలుస్తాయని...
... చింతిస్తూ ఇందిర...చితికి చేరిందిర
అనేక సూత్రాలు అమలుపరచి
ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచి అట్టడుగునున్న బడుగు వర్గాల
ఆకలి బాధలు తీర్చిన...
ఆశలన్ని నెరవేర్చిన...
...ఆశాజ్యోతి ఇందిర...ఆరిపోయిందిర
అగ్రరాజ్యాలు ఉన్మాదంతో
ఉగ్రరూపం దాల్చక మునుపె
అనంత విశ్వాన్ని భస్మం చేసె అణుబాంబులను పేల్చక మునుపె
అణు యుద్ధాన్ని ఆపమని...
అగ్రరాజ్యాలను ఆదేశించమని...
దాగివున్న ఆ దైవాన్ని
...అర్ధించ ఇందిర...అసువులు బాసిందిర
త్రాగిన మైకంలో
తల తిరిగె తరుణంలో
కన్నీరు నింపిన కలంతో
విధి వ్రాసిన నిరుపేదల
"తలరాతల రాజ్యాంగాన్ని"
...సవరించ ఇందిర...స్వర్గానికేగిందిర
2A. కన్నతల్లి ఇందిర !
కన్ను మూసిందిరా !
1984 అక్టోబర్ 31 తేది
ఉదయం 9.20 ని.లకు...
ఏం జరిగిందిరా ?
దేశచరిత్ర రక్తసిక్తమైపోయిందిరా...
కన్నతల్లి ఇందిర కన్నుమూసిందిరా...
చింతిస్తూ ఇందిరా చితికి చేరిందిరా...
శాంతి కపోతమై
శాంతిసందేశాన్ని అందించిన ఇందిర
రక్తాన్ని చిందించిందిరా...
నిరుపేదల తలరాతల రాజ్యాంగాన్ని
సవరించ ఇందిర స్వర్గానికేగిందిరా...
కంచే చేను మేసినట్లుగా
కూర్చున్న కొమ్మనే నరికినట్లుగా
పాలు త్రాగి ఒకడు
తల్లిరొమ్మునే గుద్దినట్లుగా
ఉగ్రవాదుల మిషన్ గన్నులనుండి
ప్రత్యర్థుల తూటాలనుండి
శత్రువుల నుండి మృత్యువునుండి
రాత్రింబవళ్ళు కన్నతల్లి ఇందిరను
రోజూ రక్షించే అంగరక్షకులే...
కడకు కసితీరా.....
పగతో రగిలి రగిలి...
30 బుల్లెట్లతో కాల్చికాల్చి...
ఆమె గుండెను చీల్చి చీల్చి...
ఆమె రక్తపుమడుగులో
"గిలగిల" కొట్టుకుంటూవుంటే
"కిలకిల" నవ్వేరు ఆ కిరాతకులు
ఆ మూర్ఖులు ఆ ముష్కరులు
పగబట్టిన ఆ సిక్కుమతోన్మాదులు...
రెప్పపాటున ఆ తల్లి
కుప్పకూలిపోయింది
దేశమంతా కన్నీటి సంద్రమైంది...
ఎక్కడ మతగ్రంథాలు
మంచిని బోధిస్తాయో
అక్కడ మానవత్వం
ఫరిడవిల్లుతుంది... కానీ
ఎక్కడ ఉగ్రవాదం మతోన్మాదం
పడగవిప్పి బుసలు కొడుతుందో
అక్కడ మహాత్ములరక్తం
ఏరులై పారుతుంది...
"నా చిట్టచివరి రక్తపుబొట్టు" వరకు
"శాంతిసామరస్యం" కోసమే
దేశ "ప్రజలసంక్షేమం" కోసమే
పోరాడుతానని ప్రతినపూని
"గరీబి హటావో" అంటూ నినదించి
తన జీవితాన్ని త్యాగం చేసిన
"ఉక్కుమహిళ" మొట్టమొదటి
మహిళా ప్రధానమంత్రి
మన శ్రీమతి ఇందిరా గాంధీ
అశృనయనాలతో ఆతల్లి కిదే
నా అక్షర నీరాజనం....
3. షాక్
(ఔరా ! అది మల్లెపువ్వా..! B
కాదు నిప్పురవ్వ..! )(హాస్య కవిత)
నక్కను త్రొక్కానేమో బస్
ఎక్కగానే లక్కీగా ఓ
చక్కనిచుక్క చలాకీగా నా
ప్రక్కన వచ్చి నిలుచుంది...
బస్ కుదుపు కుదుపుకు
మిస్ మీద మీదకు వస్తుంటె...
మనసు అదుపు తప్పింది...
పరువం పడగ విప్పింది....
చిలిపిగా ఓ చూపు విసిరాను
చిలక చిత్తై పోయింది...
కవ్వింపుగా కన్ను గీటాను
కలికి కరిగి పోయింది...
మెల్లగా మేను తాకాను
మెరుపుతీగ మెలికలు తిరిగింది...
మెత్తగా కాలు నొక్కాను క్రొత్తగా
వుందేమో మత్తుగా మూల్గింది...
ఆపై ఇక ఆగలేక
నాజూకైన ఆమె నడుముపై
చిలిపిగా చెయ్ వేశా - అంతే...
"చెంప చెల్లుమంది"
"గుండె గుభిల్లుమంది"
"కళ్ళు" బైర్లు కమ్మాయి...
"పళ్ళు" పదహారు రాలాయి..
అప్పుడు
ఆమె కళ్ళనుండి
కురిసిన "ఆ నిప్పు"
కలిగించింది నాలో "కనువిప్పు"
చూసి సుఖించు...
లేదా తాకి తరించు...
అంతేకాని వెర్రివేషాలు
వెయ్యడం వ్యర్ధం...అత్యాశ అనర్ధం...
అనికాబోలు ఆమె "చివరి చూపులకర్ధం"
ఔరా ! అది మల్లెపువ్వా కాదు నిప్పురవ్వ !
4. యువతా! ఓ యువతా!!B
యువతా ! యువతా !
ఓ చిలపి యువతా !
మీకోసమే నా ఈ చిరుకవిత !!
కన్నతల్లి పాలలా
కల్తీ లేనిది నా కవిత !
కఠినాత్ములను కూడా
కరిగించేది నా కవిత !
నిజంలా నిజాయితిలా
"నిప్పులాంటిది" నా కవిత !!
కసాయి గూండాలకు సైతం
"కనువిప్పు కలిగించేది" నా కవిత !!
చీకటి జీవితాలకు
"చిరుదీపం" నా కవిత !
నిరుపేదల కన్నీటిగాధలకు
"నిజరూపం" నా కవిత !!
నవచైతన్యానికి
"నాంది" నా కవిత !
సమసమాజానికి
ఓ "దివ్యసందేశం" నా కవిత !!
నా ప్రతికవిత
చెప్పేది ఓ యదార్థం...
ప్రజా సంక్షేమమే నా
ప్రతి కవిత పరమార్ధం...
సామాజిక హితమే
ఒక అభిమతంగా
స్వేదమే సిరాగా నేవ్రాసిన
ఏ ఒక్క కవితయైనా...
ఏ ఒక్క వ్యక్తిలోనైనా...కాసింత
చైతన్య జ్వాలను రగిలించినా ...
నవజీవన రాగాన్ని రవళించినా...
నా ఆశకు ఆకలి తీరినట్లే...
నా కోరిక కోతై కొండెక్కినట్లే...
నా ప్రతి కవితకు పెళ్ళయినట్లే...
"కష్టేఫలి" అన్ననినాదం నిజమైనట్లే...
5. వెలివేసే...వెర్రిసంఘం..?
రక్తార్పణ చేసినా...
ప్రాణం ధారపోసినా...
రౌద్రులై ఉరికి......."రణరంగానికి"
ప్రతిభను చూపినా...
సర్వం త్యాగం చేసినా...
ప్రమిధలై వెలిగి..."ప్రతిరంగానికి"
మగమృగాల
విషపు కోరలకు చిక్కి
మగువగురైతే..."మానభంగానికి"
వేధించి...బాధించి...
వెతలకు గురిచేసి...
వెలివేసే ఈ......."వెర్రిసంఘానికి"
భయపడితె చాలు
బ్రతుకు బుగ్గిపాలు...
ఎదురు తిరిగితె కలుగు
స్త్రీ జాతికి ఎంతో మేలు...
6. కాలగర్భంలో
కలిసిన కార్మికులు...(కార్మికుల కవిత)
కాలువగా పారి
కడలిగా మారెనట...?
కార్చిన కన్నీటి..."చుక్కలన్ని"...
నిన్న ఉన్నశక్తి వెన్నలా
కరిగి...విరిగి పోయెనట...
ఉక్కులాంటి......"రెక్కలన్ని"...
కూటికిలేని
కష్టజీవుల కన్నీటిగాథలు
చెప్పుకుని కులుకునట...
కాటికాడి........"కుక్కలన్ని"...
పంపునీళ్ళతో
కమ్మగా కడుపు నింపుకునే
కార్మికులను గాంచి ఫక్కున నవ్వెనట...
ప్రక్కనున్న...."పిచ్చిమొక్కలన్ని"...
కానీ నిలువ నీడలేని
నిరుపేదలను గాంచి
"నిట్టూర్చెనట"...పాపం
నింగిలోని ............ "చుక్కలన్ని"...
నేడు చిమ్మచీకటిలో మిలమిల
మెరిసే...ఆ "చుక్కలే" కాబోలు...
నిన్న సంస్థ కోసం రెక్కల్ ముక్కల్ జేసి
పోయిన హక్కులకోసం పోరాడి పోరాడి
కళ్ళుమూసి కాలగర్భంలో కలిసినకార్మికులు
7. మై నేమ్ ఈజ్ "మని”..!
ఓ మనిషీ..!
నీ చేతిలో
నేను ఉదయిస్తే..!
ప్రతి వారు నిన్ను
ప్రేమగా పిలచి...
పెన్నిధివని తలచి...
పాలుపోసి...
పాదాభిషేకం చేసి...
పూలుజల్లి...
పూజలు చేసి...
"ఘనంగా" చూస్తారు..!
........."GOD" లాగ.......
ఓ పిచ్చి మనిషీ..!
నీ జేబులో
నేను అస్తమిస్తే..!
ప్రతివారు నిన్ను
దోషిగా తలచి...
దొంగగా పిలచి...
రంగులు పూసి...
రాళ్ళు రువ్వి...
ఉమ్మివేసి...
ఊబిలో త్రోసి...
"హీనంగా" చూస్తారు..!
........" DOG" లాగ.........
అందుకే...
బీ కేర్ ఫుల్ ఎబౌట్ మి...
బికాజ్ మైనేమ్ ఈజ్.....
........"MONEY"............
8. కాలమే నా కలమైతె..?
కాలమే నా "కుంచె" ఐతె..?
...చీకాకుల్ని నే చిత్రించను...
కాలమే నా "కంచె" ఐతె..?
...మంచితనాన్ని నే మేయనివ్వను...
కాలమే నా "కలమైతె"..?
...రాక్షసత్వాన్ని నే రచించను...
కాలమె నా "గళమైతె"..?
...విషాదాన్ని నే వినిపించను...
కాలమే నా "హలమైతే"..?
...పిరికితనాన్ని నే పండించను...
కాలమే నా "వాలమెతె"..?
...కన్నెపిల్లలను కవ్వించె
...కన్యత్వాన్ని కాటువేసే
...కామాంధులను నే కాల్చేస్తాను...
కాలమే నా "త్రిశూలమైతె"..?
...అభ్యుదయారణ్యంలో
...అవతరించె
...విచ్చలవిడిగా విహరించె
...కులమృగాలను నే కూల్చేస్తాను...
9. ఆశబోతు అల్లుళ్ళు..?✓
అదనంగా...
కట్నకానుకలు కావాలని...
ఆశబోతు అల్లుళ్ళు వ్రాసే...
"ప్రతి కవ్వింపు ఉత్తరమొక కత్తి పోటు"..!
అది తప్పక తెస్తుంది......"గుండెపోటు"..!
కాని -
కలహాల కాపురాన్ని ఈదలేక
తన కన్న కూతురు వ్రాసే...
ప్రతి "కన్నీటి ఉత్తరమొక గుండె కోత"..!
అది గుర్తుకు తెస్తుంది.
"విధి వ్రాసిన వింత......నుదిటి వ్రాత"..!
ఆర్థికంగా చితికి...
అప్పుల్లో బ్రతికె...
ప్రతి ఆడపిల్లల తండ్రి
వేయి గుడిమెట్లు ఎక్కి
వేడుకునేది ఒక్కటే..!
కోటి దేవుళ్ళకు మ్రొక్కి
కోరుకునేది ఒక్కటే..!
ఆశబోతు అల్లుళ్ళ
"జాతకాలు" మార్చమని..!
ఆడపిల్లల తండ్రులుగ
వారికి "పునర్జన్మ" నివ్వమని..!
10. తొలకరి జల్లుల తొలిరాత్రి...!
క్రొత్త దంపతుల..."పిచ్చికోరిక".)
స్వాగతం
పలికిన ఆ శోభనం రాత్రి
పరిమళించే ఆ పడక గదిలో...
పకపకలాడుతూ పరవశించిపోతూ... రకరకాల కోరికలతో రగిలిపోతూ...
ముద్దులయుద్ధంలో మునిగితేలుతూ యిద్దరు...నిదురరాని ఆ యిద్దరు
సుసంసారంలోని సరిగమలను... శృంగారంలోని శృతిలయలను...ఆలపిస్తూ
ఇలాగే ఇలాగే....ప్రతిక్షణం ప్రతిదినం మధురంగా.......అతి మధురంగా...
ఇలాగే ఇలాగే....ప్రతిపగలు ప్రతిరాత్రి గాఢంగా...........అతి గాఢంగా...
ఆ రతీమన్మధులకే మతిపోయేలా
బ్రతికినంత కాలం ఒకరినొకరు పెనవేసుకుపోయి బ్రతకాలన్నదే....
నేడా గదిలో
మనస్పూర్తిగా...
మంగళసూత్రం...సాక్షిగా...
సర్వం యిచ్చి.....పుచ్చుకునే
ఆ క్రొత్తదంపతుల..."పిచ్చికోరిక".
11. నేనొక నిదురరాని నిరుద్యోగిని..?
నా మనసు యిప్పుడు
...తేనెతుట్టెలా వుంది
దానిలో వున్నది
...తేనెకాదు...
...తీయని బాధ...
అందులో వున్నవి
...ఈగలు కావు
...గజిబిజి ఆలోచనలు
ఉరివేసుకుంటున్న
...ఊహలు
ఆరిపోతున్న
...ఆశలు
కొండ దిగుతున్న
...కోరికలు
కరిగి కన్నీరవుతున్న
... కమ్మని కలలు
కారణం.....
...నేనొక నిదురరాని నిరుద్యోగిని...
చుట్టూ చీకటి వున్నా...
చేతినిండా డిగ్రీలు వున్నా...
వ్యధలు ఎదలో ఎన్నున్నా...
వెలుగుకోసం వేయికళ్ళతో
వెతుకుతువున్న వెర్రివాణ్ణి...
...నేనొక నిదురరాని నిరుద్యోగిని...
పగబట్టిన విధి
పగలబడి నవ్వుతున్నా...
నాలోని ప్రతిభ
నన్ను చూసి వెక్కిరిస్తున్నా...
పట్టించుకోక
పేరాశతో ముందుకు
సాగిపోతున్న పిచ్చివాణ్ణి...
...నేనొక నిదురరాని నిరుద్యోగిని...
12. మతాలు...మారణహోమాలు✓
ఊరేగింపులు...ఉత్సవాలు
అర్చనవేళ......ఆర్తనాదాలు
గూండాలు......గృహదహనాలు
గుడిముందే....గుర్తుతెలియని హత్యలు
పోటీపడి.....లూటీలు
పోలీసుల....లారీచార్జీలు
కర్ఫ్యూలు...కక్షలు
కసితీరా......కత్తిపోట్లు
ఎటు చూసినా...
రాజకీయ కాలుష్యం
ఎక్కడ చూచినా...
రక్తపుటేరుల ప్రవాహం
ఏటేట జరిగే
ఈ దారుణ మారణ హెూమం
చూడలేకనే
గుడిలోని దైవం గ్రుడ్డివాడైపోయె...
గుండెలేని బండరాయిగా మారిపోయె...
నిన్న మతం........ఒక మత్తు మందు
నేడు ఆ పేరు ఎత్తితేనే...రక్తం చిందు
13. మై అడ్రస్...?✓
నా...రంగులు...రెండు
ఆకారం పాల తెలుపు...
అంతరంగం కారు నలుపు...
నన్ను...పోలినవి...రెండు
గోడ మీది తెల్లని పిల్లి...
రంగులు మార్చె ఊసరవెల్లి...
నా...కోరికలు...రెండు
తీరని ధన దాహం...
తరగని పదవీ వ్యామోహం...
నా...సలహాలు...రెండు
అందితే జుట్టు పట్టు...
అందకపోతే కాళ్ళు పట్టు...
నా...లక్ష్యాలు...రెండు
పక్షపాతం చూపించడం...
రక్తపాతం సృష్టించడం...
నా...ట్రిక్కులు...రెండు
పరమ శతృవును
సైతం పలకరించడం...
కడుపులో కత్తులు
ఉంచుకొని
కౌగిలించుకోవడం...
ఈపాటికి నేనెవరో
మీకు తెలిసే ఉంటుంది
కానీ నా శత్రువులు
నేనంటే గిట్టని వారు
నాపై అనేక నిందలు వేస్తారు
నేను అరచేతుల్లో
స్వర్గం చూపిస్తానని...
వాగ్దానాల వర్షం కురిపిస్తానని...
ఏరుదాటిన తర్వాత
తెప్ప తగలేస్తానని...
ఓట్లు రాగానే...
సీట్లు గెలవగానే...
ఇంటి గేట్లు మూసేస్తానని...
కోట్లుకోట్లు ఆర్జించి
కోటీశ్వరున్నౌతానని...
కుర్చీలో కూర్చోగానే
కుబేరుడనౌతానని...
ఇక "నా దర్శనం"
ఐదేళ్లకొక్కసారేనని...
అందుకే మీలో ఎవరికైనా
అర్జంటుగా నన్ను కలవాలనిపిస్తే...
నా "అడ్రస్" కనుక్కోవడానికి
మంచి...మార్గాలు...రెండు
ఒకటి...
మర్డర్లు మాఫీ చేసే
ఏ పోలీస్ స్టేషన్ కైనా
ఫోన్ చెయ్యండి...
రెండు...
గుర్తుతెలియని హత్యలు చేసే
ఏ గూండానైనా అడగండి...
14. మాతృత్వం B
(మాతృత్వం..! మానవత్వం..!)
తగిలితే చిన్న దెబ్బ
తల్లడిల్లిపోతూ...
కంటికి రెప్పలా
కాపాడుకుంటూ...
తన ఎర్రని రక్తాన్ని
తెల్లని పాలుగ చేసియిస్తే...
తనివితీర త్రాగి పెరిగిన
ఆ తనయుడే....
తప్పత్రాగి వచ్చి...
నేడు కన్నతల్లినే
కాలితో తన్నబోతె...
అబ్బా...ఆ దెబ్బ..!
...తగిలేది....
తలకు కాదు
గుడికన్న పదిలమైన
ఓ గుండెకు...
...కారేది....
కన్నీరు కాదు
"పరిమళించే
ప్రేమ పన్నీరు"
...ముక్కలయ్యేది...
మూగమనసు కాదు
"మంచిని మమతను
పంచిన ఓ మాతృత్వం"
...కుప్పకూలేది...
ఆ కన్నతల్లి కాదు
తప్ప తాగిన తనయునిలో
"మంటకలిసిన మానవత్వం"...
15. రైక ముడెట్టక పడుకోయే...
రంగీ రాత్రిపూట! ✓
విరోధిలా కసి బట్టి
విషసర్పంలా బుసలు కొట్టి
విధి ముక్కల్జేసిన మన బ్రతుకు
వీధికుక్కలు చించిన విస్తరైనాదని
ఆస్తి నాస్తి కాగా ఆకలి అప్పులాగ
దహించి వేస్తుంటే ...దారిలేక
ఎండనక వాననక...
పండగనక పబ్బమనక...
పగలంతా రెక్కలు
ముక్కల్జేసి...ప్రొద్దుపోనాక
పిడికెడు పచ్చడి మెతుకులు
మింగి పిచ్చిగ నిదురోతావు...
గుడిసెలో గుడ్డి దీపం
ఆశలా ఆరిపోతూ వుంటే...
మనసు నిండా అసమర్ధత
అంధకారమై అలముకుంటుంటే...
అద్దరేతిరిలో ఆకలేసి
నిరాశలా నిద్రలేచి
"గుక్కెట్టి గుంటడు"
గీపెట్టి "పాలకోసం"
పాకులాడుతుంటె...
గుర్తు తెచ్చుకోక
గుర్ గుర్ మంటావు...
కుక్కి మంచంలో
కునుకుతుంటావు...
మరిచిపోకె...."మాఁవ మాట"...
"రైక ముడెట్టక "
పడుకోయే... రంగీ రాత్రిపూట"...
16. అమరజీవి అంబేద్కర్ ✓
మహర్ కులంలో
వెలిసిన వేగుచుక్క...
గంజాయి వనంలో
మొలిచిన తులసిమొక్క...
దళితుల పాలిటిదైవం...
దారిచూపే దీపం...
అణగారిన పేదప్రజల ఆశాకిరణం...
ఓ అమరజీవి అంబేద్కర్ !
దండాలయ్య మీకు దండాలు!!
మీకు జన్మనిచ్చిన "
మీఅమ్మనాన్నలకు" కోటిదండాలు !
వీధి బడికి వెళ్తుంటే
వింతగా మిము చూస్తుంటే
విదేశాలకేగి ఉన్నత
విద్యనార్జించి
బుక్కులెన్నో పఠించి
హక్కులన్నీ గ్రహించి
గాఢనిద్రలో ఉన్న
గబ్బిలాలకు "జ్ఞానబోధ" చేసిన
బావిలోని కప్పలకు
"బ్రతుకుదారి" చూపిన
కావు కావుమని అరిచే
కాకులకు "కోకిలరాగాలు" నేర్పిన
పూరిగుడిసెలో పుట్టిన
బహుజనులను "పులులుగా" మార్చిన
ఓ అమరజీవి అంబేద్కర్ !
దండాలయ్య మీకు దండాలు!!
మీ "ఆదర్శ భావాలకు" వేయి దండాలు !
అణగారినవర్గాల
అభ్యున్నతికి
జీవితాన్ని అంకితం చేసి
ఊరూరా తిరిగి
ఉద్యమాలు రేపి
ఉపన్యాసాలతో ప్రజలను ఉర్రూతలూగించి
మనిషి మనిషి
మధ్య మంటలు రేపే
మనుశాస్త్రాన్ని మట్టుపెట్టి
అడుగునున్న
బడుగువర్గాల
అభివృద్ధికి గొడుగు బట్టి
పిచ్చిమతాచార్యులు
నెత్తిన పిడుగులా పడి
అస్పృశ్యతను అంటరానితనాన్ని
నిరసించిన నిప్పులు కురిపించిన
ఓ అమరజీవి అంబేద్కర్ !
దండాలయ్యా మీకు దండాలు !!
మీ "కండబలానికి
గుండెబలానికి" కోటి దండాలు !
కరెంట్ షాక్ కన్నా
కాలకూటవిషం కన్నా
అతిభయంకరమైన
అంటరానితనానికి
ఆహుతైపోకుండా
అగ్రవర్ణాల వారి
అడుగులకు మడుగులొత్తే
బానిస బ్రతుక్కి బలైపోకుండా
రాజ్యాంగ రక్షణలెన్నో కల్పించి
కులంపేర ఈ సంఘం
కుళ్ళు పోకముందే
కులమనే విశ్వవృక్షాన్ని
కూకటివేళ్లతో సహా
పెకలించి వేయాలని ప్రబోధించిన...
సాంఘిక దురాచారాలను
"సమాధి" చేసిన...
సమసమాజానికి "పునాది" వేసిన...
ఓ అమరజీవి అంబేద్కర్ !
దండాలయ్యా మీకు దండాలు!!
మీ "సాంఘిక సంస్కరణలకు"
శతకోటి దండాలు !
ఓ మహాత్మా !
మీరే మాకు దైవం !
మీ మాటే మాకు వేదం !
మీ బాటే మాకు శరణం !
మీ స్మరణే ఓ ప్రేరణ !
మీ అడుగుల్లో అడుగులు వేస్తాం !
మీ ఆశయాలకు మా జీవితాలను అంకితం చేస్తాం!!
ఓ అమరజీవి అంబేద్కర్
మీకిదే మా అక్షరనీరాజనం!!!
(అంబేద్కర్ వర్థంతి సందర్భంగా అక్షర నివాళి)
17. మిత్ర ద్రోహం...?✓
హలో మై డియర్ ఫ్రండ్....
నీవు నాకు సెల్యూట్
చేయనక్కరలేదు.
షేక్ హ్యాండ్ యివ్వనక్కరలేదు
నన్ను చూడగానె "చిరునవ్వుతో
పలకరిస్తే" చాలు నా కదే పదివేలు.
హలో మై డియర్ ఫ్రండ్....
నీవు నన్ను పగలు రేయి అదే పనిగ పదిమందిలో పొగడనక్కరలేదు
నేను అటుప్రక్కకు వెళ్ళగానె నా పై
కుళ్ళు జోకులు వేసుకొని
కోతుల్లా పకపకమని "పగలబడి
నవ్వకపోతె" చాలు నా కదే పదివేలు.
హలో మై డియర్ ఫ్రండ్....
నీవు నా భుజంకొట్టి బేష్ అనికాని
వెన్నుతట్టి శహబాష్ అనికాని
అనవలసిన పనిలేదు.
వెళ్ళివస్తానని చెప్పి నేను
వెనుతిరగ్గానె నన్ను "వెన్ను పోటు" పొడవకపోతె చాలు నా కదే పదివేలు.
18. ఓం శ్శాంతి శ్శాంతిః
మతంచిచ్చు రగిలించే
ఓ మతోన్మాదులారా !
రక్తపాతం సృష్టించే
ఓ రాజకీయ నాయకులారా !!
అదిగో అటు చూడండి
కన్నతల్లి భరతమాత
కలవర పడుతున్నది
కన్నీరు పెడుతున్నది.... ఎందుకు ?
రధయాత్రల పేరుతో
రమ్యమైన రామ కధను
రాజకీయం చేస్తున్నందుకు
కరసేవ పేరుతో కట్టడాలు కూలుస్తున్నందుకు
మతం పేరుతో దారుణ మారణ హెూమాలు సృష్టిస్తున్నందుకు
నిన్న మానవత్వానికి
చిహ్నం మతం కాని నేడది
భగ్గుమంటున్న ఓ అగ్నిగుండం.
మతంచిచ్చు రగిలించే
ఓ మతోన్మాదులారా !
రక్తపాతాలు సృష్టించే
ఓ రాజకీయ నాయకులారా !!
మన పవిత్ర మతగ్రంధాలు
మనకు ఏమని బోధించాయి
సర్వమతాల సారం ఒక్కటని
మానవసేవయే మాధవ సేవయని కాదా !
మన మహాపురుషులు
ఏమని ఉద్భోధించారు
పోరునష్టం పొందులాభమని...
కలసివుంటేనే కలదు సుఖమని కాదా !
నిజానికి...
ఎవరు హిందువు ? ఎవరు ముస్లిం ? ఎవరు క్రిస్టియన్ ? ఎవరు సిక్కు ? స్వేచ్ఛగా బ్రతకడం ఈ సృష్టిలో
కాదా ! ప్రతి వ్యక్తి జన్మహక్కు...?
అందుకే...
మతంచిచ్చు రగిలించే
ఓ మతోన్మాదులారా !
రామరాజ్యం కోసం రక్తాన్ని
చిందించే ఓ రాజకీయ నాయకులారా !
అధికార దాహం మాని
ఆలోచించండి మన దేశం
మరుభూమిగా మారకమునుపె
మతం రక్కసిని మట్టుబెట్టండి
ఈ అఖండ భారతావనిలో ఇంకా
సెక్యులరిజం చెక్కుచెదరలేదని...
ప్రజాస్వామ్యం ముక్కలు కాలేదని...
ప్రపంచానికి చాటిచెప్పండి.
ఓం శ్శాంతి శ్శాంతిః అంటూ
జగమంతా ప్రతిధ్వనించేలా
జన్మంతా జపించండి.
కళ్ళుతెరచి చూడండి...
కదలిరండి ! కలసిరండి !
కన్నతల్లి భరతమాత కన్నీరు తుభ్రబ
19. ప్రేమ పూజారి✓
పురివిప్పిన నీ పరువాలకు
పులకించే పూజారిని
ప్రేమ పూజారిని..!
అందరి కాళ్ళకు
బందాలు వేసే ఓ సుందరీ..!
నీ అందచందాలకు నే బందీని..!
అందుకే అర్థిస్తున్నా ఓ ప్రేయసీ..!
నీ స్నేహాన్ని నాకు చెందనీ..!
హృదయాన్ని నాకు అందనీ..!
నీ మధురమైన
ప్రేమను నన్ను పొందనీ..!
చరిత్ర పుటల్లో మన ప్రేమగీతం
సువర్ణాక్షరాలతో చెక్కనియ్...!
ఆ గీతం ఆలపించె అదృష్టం
ప్రతి గాయనీగాయకులకు దక్కనియ్..!
20. 'O' My Dear Son...!✓
సూర్యుని కంటే...
...ముందులెయ్..!
...సుఖపడతావ్..!
...రోజూ వ్యాయామం చెయ్..!
...రోగాలు రొప్పులుండవ్..!
...ప్రతినిత్యం పరమాత్ముని ప్రార్థించు..!
...ప్రమాదాలు తప్పుతాయ్..!
...ఆహార నియమాలు తప్పక పాటించు..!
...ఆరోగ్యంగా వుంటావ్..!
...పుష్టికరమైన ఆహారం తీసుకో..!
...షష్టిపూర్తి చేసుకుంటావ్..!
O My Dear Son!
"Sound mind" dwells in
"Sound Body"
Sound Body gives us
"Sound Sleep"
Sound Sleep is the
Symbol of..."Good Health"
Good health
Provides us ..."Long Life"
Long life is a..."Gods Great Gift"
So,
Be as a principled person
and get it soon my dear son..!
21. గుంటనక్కలకు గుణపాఠం..?✓
ఎలచ్చన్లు వచ్చాయని
"ఎంకడు" ఎగిరి పల్లేదు
కొత్త నోటు చూపినా
"కోటిగాడు" నోరెళ్ళ బెట్టలేదు
సారాయి ఘాటు తగిలినా
"సత్తిగాడు" సచ్చుబడి పోలేదు
కారణం వాళ్ళు మొన్న
ఓట్లు వేస్తూ అనుకున్నారు
ఆ ఓట్లే అన్యాయాలకు
అక్రమాలకు..."వెన్నుపోట్లని "...
ఆ ఓట్లే ఆకలికి..." రోకటిపోట్లని"...
కాని జరిగింది వేరు...
మిగిలింది కంటినిండా కన్నీరు...
ఆ ఓట్లె "అంతులేని
అవినీతికి" ఆజ్యం పోశాయి...
ఆ ఓట్లే వారి "ఆకలి
చావులకు" కారణమయ్యాయి....
కానీ అక్కడ చోటానాయకులు
బార్లలో బీర్లు కొడుతున్నారు
ఇక్కడ వీరు కార్చే...చెమట ఖర్చుతో...
కానీ అక్కడ బడానాయకులు
కోట్లకోట్ల నోట్ల కట్టలతో
ఖజానాలు నింపుకుంటున్నారు
ఇక్కడ వీరు కార్చే...కన్నీటిచుక్కలతో...
అందుకే వారంతా మూకుమ్మడిగా
"నిప్పులాంటి నిర్ణయం" తీసుకున్నారు....
"కూలివాన్ని...కూటికి లేనివాన్ని"...
"కుక్కలకంటె"...హీనంగా చూసే...
ఆ"గుంటనక్కలకు గుణపాఠం" నేర్పాలని...
నవ్వుతూ చాటుమాటుగా కాటువేసె
ఆ"కాలనాగులకు" ఓటు వెయ్యరాదని...
"స్వశక్తియే స్వర్గాన్ని" చూపుతుందని...
"నమ్మితే వారిని నరకమే"మిగులుతుందని..
22. కులం కుళ్ళు...మతం ముళ్ళు..!
నేస్తం ! ఓ నా నేస్తం !
గుడిలో మ్రోగెను
గణగణమని గంటల ధ్వని బాధలు తెలియని భక్తుల భజనలు విని
తెలుసుకో నేస్తం ! నిజం తెలుసుకో !
భాషలు నేరైనా భావం ఒకటేనని...
భక్తులు వేలైనా భగవంతుడు ఒకడేనని...
నేస్తం ! ఓ నా నేస్తం !
వినీల గగనంలో వింత వింత
రంగుల్లో బారులుతీరి విహరించే
విహంగాలను తిలకించి ఓసారి
తెలుసుకో నేస్తం ! నిజం తెలుసుకో !
పక్షులు వేలైనా రెక్కలు రెండేనని...
రంగులు వేరైనా రక్తం ఒక్కటేనని...
నేస్తం ! ఓ నా నేస్తం !
నిలదీసి అడిగే ముందు
నీ కులమేమని...
తెలుసుకో నేస్తం ! నిజం తెలుసుకో !
కులం గజ్జి కుక్కని...
తిరగనిస్తే తప్పని....
మతం పిచ్చిమొక్కని..
పెరగనిస్తే ముప్పని...
ఎందుకు నేస్తం..?
మనకీ భేదాలు ఈ విభేదాలు
జగతికి ప్రగతికి యివి కావా జాడ్యాలు...
కాలికూలి పోవాలీ కులమతకుడ్యాలు...
23. క్రిస్మస్ పండుగ..!!! ✓
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)
రక్షకుడుదయించే రండో రండి...
అని దూత పిలవగానే పొదలోనుండి...
చెంగు చెంగున దూకి చెంత కేగి...
పశువుల పాకలో ప్రభువును గాంచిన...
...గొల్లలకే కాదు గొప్ప పండుగ..!
తార ఒకటి తూర్పున పొడిచి...
దారిచూపగా ముందు నడిచి...
అరుదెంచి అచ్చెరువొంది కానుకలతో
అభిషిక్తునికి అర్చన చేసిన జ్ఞానులు
...ముగ్గురికే కాదు ఘనమైన పండుగ..!
శరణంటే చేయి చాపి...
రుగ్మతలను రూపుమాపి...
ముక్తిని ప్రసాదించునని
మురిసిపోతూ ...
...భజనల్ చేసే భక్తులకేకాదు భలేపండుగ..!
ఆధ్యాత్మికంగా అంధులై...
చింతలకు చికాకులకు గురై...
చిరుచీకటిలో చిందులు వేసే...
...పాపులందరికీ ఇది పసందైన పండుగే...!
24. ఆడపిల్లల తండ్రి...! ✓
(మినీ కవిత)
ఆ కుటుంబం
"ఒక ఆరని నిప్పుల కుంపటి"
అక్కడ అన్ని సమస్యలే...
నిముష నిముషం నిట్టూర్పులే...
ఆడపిల్ల పెళ్ళి
"ఒక అగ్ని పరీక్ష"...
"మంచి సంబంధం"
"ఒక మధుర స్వప్నం”..
"కోరినంత కట్నం
"యివ్వడం కొండంత త్యాగం"...
కాని...
కన్నకలలే కల్లలైతే...
విధి ఓ విషపు నవ్వు నవ్వితే...
"కారుచీకటిలో కురిసేది కన్నీటి వర్షం"
అందుకే...
ఈ అనంత విశ్వంలో
"అభాగ్యుడొక్కడే...ఆడపిల్లల తండ్రి"
25. నోరు జారకు..!✓
నోరు జారితే...
నోట మాట జారితే...
మాట విలువ ఏమౌతుంది..?
మంట కలిసి పోతుంది...
...విలువలేని మాట
...విచారానికి బాట
రంకెలు వేసి
అది కష్టాలు రప్పిస్తుంది...
గుప్పెడు కన్నీళ్ళను
నీ గుండెలో గుప్పిస్తుంది...
నోరు జారితే...
నోట మాట జారితే...
మనిషి గౌరవం ఏమౌతుంది..?
మట్టి కరిచి పోతుంది.
...గౌరవం లేని బ్రతుకు
...గడ్డిపోచ కంటే అలుసు
ఆరని ఆవేదనకు
అది ఆర్డరు యిస్తుంది...
మారని నీ మంచితనాన్ని
మర్డరు చేస్తుంది...
26. జాలి గుండెల ఓ జాతినేత..!✓
"అమ్మా" అని
పిలవగానె కమ్మగా పలికె...
"జాలి గుండెల ఓ జాతినేత"..!
ఆనాటి మీ అకాల మరణవార్త...
అయ్యో!"రాతిగుండెలకైనా రంపపుకోత"..!
శాంతి కోసం ప్రతిక్షణం
పరితపించి...పరితపించి...
"శలవు తీసుకున్న ఓ శాంతిదూత"..!
"మీరులేని ఆ లోటు"...రోదించే
"మా హృదయాలపై రోకటిపోటు"....!
ఆశలుతీర్చి...
ఆడపడుచులకు అండగ నిల్చి... "అనువులు బాసిన ఓ అమృతమూర్తి”..! అష్టకష్టాకోర్చి అవమానాలెన్నో భరించి "ఆర్జించి పెట్టావు...మాకు అఖండ కీర్తి"..!
మహిళాజ్యోతివై...
మహిలోన వెలిగి
వింతకాంతులు
విరజిమ్మి ...
విశష్ట సేవలు చేసి...
"దివికేతెంచిన ఓ ధీరవనిత"..!
మరువక నీ త్యాగం...మహిళాలోకం..! దినదినం స్మరించు....నీ దివ్యనామం..!
27. పెళ్ళి...గిళ్ళి✓
పొంగి పొంగి పోయింది.
...ప్రేమప్రేమ అనగానె...
తృళ్ళితృళ్ళి పడింది
...పెళ్ళి పెళ్ళి అనగానె...
చెంగుచెంగున దూకింది
...చేయి చేయి కలపగానె...
మురిసి ముద్దయిపోయింది
...ముద్దు ముద్దు అనగానె...
దూరిపోయింది దుప్పట్లో
...సారి సారి అంటూనె...
కరిగిపోయింది కౌగిట్లో
...కస్సు బుస్సు మంటూనె...
కళ్ళుతెరిచి చూసింది
...మెల్లగ మెలుకువ రాగానే...
ఒళ్ళువిరిచి లేచింది
...తెల్లగ తెలవారగానే...
కృంగికృంగి పోయింది
...ప్రేమ ప్రేమ అనగానె...
క్రుళ్ళిక్రుళ్ళి ఏడ్చింది
...పెళ్ళిగిళ్ళి అనగానె...
28. ఎగిరే తారాజువ్వలమై...
రగిలే నిప్పురవ్వలమై...
(బాలల విప్లవం కవిత)
వస్తున్నాం...
వస్తున్నాం బాలలం...
భావి భారత పౌరులం...
బయలుదేరి వస్తున్నాం...
భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం...
వస్తున్నాం...
వస్తున్నాం బాలలం...
రయ్ రయ్ మని రాకెట్లలా...
బుయ్ బుయ్ మని బులెట్లలా...
హస్తం చూస్తాం...నేస్తం చేస్తాం...
మోసం చేస్తే.......మీసం తీస్తాం...
వస్తున్నాం...
వస్తున్నాం బాలలం...
ఎగిరే తారాజువ్వలమై...
రగిలె నిప్పురవ్వలమై ...
రణభేరి మ్రోగిస్తూ రణశూరులమై...
వస్తున్నాం...
వస్తున్నాం బాలలం ...
జాతికి చక్కని జవాబులం...
అవినీతికి మ్రొక్కని నవాబులం...
ఉచ్చులు విసిరినా చిక్కని ఉడతలం...
బుర్రల బూజులు దులిపె బుడతలం...
వస్తున్నాం...
వస్తున్నాం బాలలం...
అన్యాయాన్ని అక్రమాలను
ఎదిరించే అగ్ని జ్వాలలం...
పుణ్య పురుషుల మెడలో
నిదురించె పూలమాలలం...
వస్తున్నాం...
వస్తున్నాం బాలలం...
భావి భారత పౌరులం...
చిరునవ్వులు చిందిస్తూ
అందిస్తె మీరు మాకు ఆశీస్సులు...
చిటికెలో కత్తిరిస్తాం
చీకటి వ్యాపారస్తుల శిరస్సులు...
(మహాకవి శ్రీశ్రీ కి విప్లవజోహార్లతో...)
29. ఆరనిజ్యోతి..!✓
(ఆకాశంలో ఆరనిజ్యోతి..!)
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)
కక్షలతో...
కార్పణ్యాలతో...
కుట్రలతో...
కుతంత్రాలతో...
దారిదోపిళ్ళతో...
దారుణ హత్యలతో...
శిలాపహరణాలతో...
చిత్రహింసలతో...
కులతత్వాలతో...
కుమ్ములాటలతో...
మతవిద్వేషాలతో...
మారణహోమాలతో...
మారణాయుధాలతో
భీకరమైన యుద్దాలతో...
భయంకరమైన
బాంబుదాడులతో...
రాజ్య కాంక్షతో...
రక్తపాతాలతో...
మానవత్వం
మంటకలిసిపోతూ...
మలినమైపోతున్న
తరుణాన..."మానవజాతి"...
పరిశుద్ధాత్మ ఫలితంగా...
పాపుల రక్షణే ధ్యేయంగా...
ప్రపంచ ప్రక్షాళనే
ప్రధాన లక్ష్యంగా...
మరియ గర్భాన...
మనుష్య రూపాన...
అరుణారుణ రక్షణ
కిరణాలను వెదజల్లుతూ...
ఆవిర్భవించింది..."ఒక ఆరనిజ్యోతి"
30. మీ శ్రీమతి మీకొక బహుమతి..!✓
సర్వరుచుల
సమ్మేళనంతో
వడివడిగా వంటలు చేసి
ప్రక్కనే కూర్చొని ప్రేమతో
చక్కగా కొసరి కొసరి వడ్డించేది...
అడిగిన తడవే
"ఆహ ఉహూ" అని
అడ్డు చెప్పక...పగలు రేయి
పడక గదిలో...పరవశింపచేసేది...
చీదరించుకోక...
చిరుబురులాడక...
"అతిధిదేవుళ్ళను" ఆదరించేది...
వినయ విధేయతలతో
"అత్తమామలను" గౌరవించేది...
చిక్కు సమస్యలెదురైతే...
సహనం చూపి సర్దుకుపోయేది... సమయస్ఫూర్తితో చక్కని సలహాలిచ్చేది...
కష్టాలలో కన్నీరు కార్చక...
చిక్కుల్లో చీకాకు పడక...
చిరునవ్వులు చిలకరించేది...
చిలిపిగా కవ్వించి కడుపుబ్బ నవ్వించేది...
పతినే "ప్రత్యక్ష దైవంగా"
భావించేది...భక్తితో ఆరాధించేది...
అనుదినం "భర్తను" తనివితీర "అనురాగామృతంతో " అభిషేకించేది...
ఒక దేవతే "ఔను ఆమే మీ శ్రీమతి"
ఆమె మీకొక "బంగారు బహుమతి"
చక్కగా సాగిపోయే మీ "సంసార నౌకకు"
ఆమె"చుక్కాని"వంటిది"చురకత్తి"లాంటిది
31. రైతువీర లేవరా...!✓
కొక్కొరోక్కో యని కోడి కూసెరా...
తెల్లవారెనని తెలియజేసెరా...
తూర్పున సూర్యుడు తొంగిచూసెరా...
వెలుగు చీకటిని మ్రింగివేసెరా...
ప్రగతిరధం మోయగా...
జగతికి జీవం పోయగా...
వర్తమాన వీరుడవై...
సుఖాల నొసగు సూర్యుడవై...
లేరా...లేరా...రైతన్నా...
పొలం పోరా...పోరా...పోతన్న...
నీ సేద్యమందు...స్వేదమందు
విశ్వానికి విశ్రాంతి చిక్కురా...
ఈ భూమిపైన భుక్తికైనా...
నీవే దిక్కురా...యిది నీకే మ్రొక్కురా...
మోడువారిన బీడు బ్రతుకున చిరునగవులు చిగురించాలంటే...
కారుచీకటి క్రమ్మిన కళ్ళలో
జాబిల్లి వెల్గు జన్మించాలంటే...
"శ్రమయేవ జయతే" నినాదం చేస్తూ
గురకలు మానాలిరా...అరకలు కట్టాలిరా...
వెచ్చని మంటలు ఎగిసే బంజరుభూముల్లో
పచ్చని పంటలు పండించాలంటే....
అన్నమో రామచంద్రా అంటు అలమటించే.. అస్థిపంజరాల ఆకలిమంటలు తీర్చాలంటే..
"కృషితోనాస్తి దుర్భిక్షమంటూ"
హలంను పట్టాలిరా...
పొలమును దున్నాలిరా...
అంధులు ఏలే...రాబందులు ఎగిరే...
రావణరాజ్యం రాలిపోవాలంటె...
రక్షణ దొరికె...క్రమశిక్షణ పెరిగె...
రామరాజ్యమె రావాలంటె...
"కష్టేఫలి" యంటూ
కండల్ని కరిగించాలిరా...
కొండల్ని పిండిచేయాలిరా...
లేరా...లేరా...రైతన్నా ....
పొలం పోరా...పోరా...పోతన్న...
32. అభిషిక్తుని అమరత్వం...!✓
పేదలను ప్రేమించిన పాపాత్ముడు...
దుర్భోధలు చేసిన దుర్మార్గుడు...
లొంగిపోయెనని లోకరక్షకుడు...
లోలోన పొంగిపోయెను ప్రతిరాక్షసుడు...
పాపాంధ కారాన్ని పారద్రోలడం...
రోగుల రుగ్మతలను రూపుమాపడం... లోకరక్షకునిలోని లోపాలనడం...
జ్ఞానరాహిత్యానికి గొప్పతార్కాణం...
పాపమెరుగని పరమ పావనుడని...
కోపం క్రోధం రాని కరుణామయుడని...
దోషం ద్వేషం లేని దయాసముద్రుడని...
దివి నుండి దిగి వచ్చిన
దీనజన బాంధవుడని...
ఆయన హృదయం అనురాగ భరితమని... జాలె ఎదలో ప్రవహించు జలపాతమని... పేదలకు పంచెను ప్రేమామృతమని... సహనానికి శాంతికి క్రీస్తె సంకేతమని...
పరిపరి విధముల ప్రభువును
ప్రశంసించిన పిమ్మట నిరపరాధియని...
పిలాతు నిరూపించెనట...
అంతట...కేకలేశారట
కర్ణకఠోరంగ కాకుల్లాగ...
పరమ పవిత్రుడైన
వరపుత్రున్ని వధించమని...
వీడించారట పిలాతును పిశాచుల్లాగ... బందిపోటు బరబ్బాను బ్రతికించమని...
అల్లిపెట్టిరట తలపై ముళ్ళకిరీటం...
పెల్లుబికెనట ప్రభువులో ఆరాటం...
నిర్దోషిపై మోపిరట నీలాప నిందలు...
గొల్లుమని నవ్వెనట గొర్రెల మందలు...
మరియసుతుని మేనుపైన
కొరడాలు ఝలిపించిరట
ఆ క్రూరులంత...
కరుణగారె కరములందు
మరమేకులు మొలిపించిరట
ఆ మూర్కులంత...
పులినోట చిక్కిన లేడిలా
అల్లాడి అల్లాడి అలమటించెనట... బలిపీఠమెక్కిన పశువులా
వ్రేలాడి వ్రేలాడి విలపించెనట...
పరిహసించిరట ప్రక్కలో బల్లెంచెక్కి... వికటాట్టహాసం చేసిరట విషం వెళ్ళగ్రక్కి... చిత్రహింసలకు గురియాయెనట...
ప్రభువు సిలువపైకెక్కి...
అసువుల నర్పించెనట
ఆ పశువుల చేజిక్కి...
అశ్రుధారలు రాలుస్తు...
మృత్యువు కోరలు చీలుస్తు...
ఆత్మను తండ్రికి అందిస్తు...
అందరిని క్షమించమని క్రీస్తు...
కమ్మగా పలికెనట
కలువరిగిరిపై కళ్ళుమూస్తు...
అభిషిక్తుడు అస్తమించగానే
అంధకారమలముకుందట...ఆకాశమంత
ప్రభువు పవిత్రరుధిరం ప్రవహించగానె
పకపక నవ్విందట...పాతాళమంత
కృంగెనట క్రీస్తు శిరస్సు...
పొంగెనట శాంతి సరస్సు...
తరగిపోయెనట నరుల పాపతపస్సు... కరిగిపోయెనట యూదుల క్రూరమనస్సు... పిలిచిందట ప్రభువును సురలోక సదస్సు...
అందుకే....
అద్భుతం అద్భుతం...
అభిషిక్తుని అమరత్వం...
ఔను ఔను... ళ
ప్రభు యేసుపాదమె...
ఇక ప్రతి పాపికి శరణం....
(ఈస్టర్ పండుగ సందర్భంగా కవిత)....
33. కలకాలం కవివై...
బ్రతకాలీ భువిపై...✓
యువకా..!
ఓ నవయువకా..!!
నీవు కలకాలం కవివై...
బ్రతకాలీ భువిపై...
అమాయకులకు అజ్ఞానులకు
అందించాలి...నీ నాలెడ్జీని..!
నిరుపేదలు కార్చే కన్నీటి కడలికి
నిర్మించాలి.....ఒక బ్రిడ్జీని..!!
నాడు ప్రభంజనమై చెలరేగింది
- ప్రతికలం..!
దానికి మన స్వాతంత్ర్యమే
- ప్రతిఫలం..!!
మెరిసే మేఘం జనులకిస్తుంది
- వర్షాన్ని..!
పలికే రాగం వీనుల కందిస్తుంది
- హర్షాన్ని..!!
తిరిగే హలం పండిస్తుంది
- పచ్చని పంటల్ని..!
కదిలే కలం అంతమొందిస్తుంది
- అవినీతి మంటల్ని..!!
ఓ యువకా..!
ఓ నవయువకా..!!
కనిపించలేదా
- కప్పులేని పూరి పాకలు..!
వినిపించలేదా నీకింకా
- నిప్పులాంటి ఆకలి కేకలు..!!
తప్పించువారి
పైకి వచ్చే ఆర్తి వెల్లువను..!
కప్పించుకో వారిచే కీర్తి శాలువను..!!
కాని ....
యువకా..!
ఓ నవయువకా..!!
వ్రాయకు కవిత్వం...
తెలుసుకోక వారి తత్వం...
దాగిఉండదు వారి ఎదలో దానవత్వం...
మంచిగంధమె వారియందలి మానవత్వం.
33A. కల్తీలేని...కవిత్వం ✓
చెడు నుంచి మంచి
చీకటి నుండి వెలుగు
పుట్టినట్లే
బురద నుండి కమలం
హాలాహలం నుండి అమృతం
కన్నీటి నుండి కవిత్వం
విషాదం నుండి విప్లవం పుట్టేనురా
ఔనిది నిజమే గదరా ! ఓ మానవా !
నిరుపేదల
కన్నీటి కడలికి
నిర్మిస్తే ఒక బ్రిడ్జిని
అనాధలకు అజ్ఞానులకు
అందిస్తే నీ నాలెడ్జీని
చితికి చేరితే నేమిరా
నీ ఖ్యాతి చీకటిలో చిరుదివ్వేనురా
ఔనిది నిజమే గదరా ! ఓ మానవా !
కలం పట్టి
వ్రాయాలిరా
కల్తీలేని కవిత్వం
శ్రమజీవుల ఎదలో
దాగి ఉండదురా"దానవత్వం"
మంచి గంధమే
వారి యందలి "మానవత్వం"
శక్తిహీనులను బహు బలవంతులుగా
భక్తిహీనులను భగవత్ స్వరూపులుగా
మార్చే మహత్తర శక్తిఉన్నదే "నీ కవిత్వం"
ఔనిది నిజమే కదరా ! ఓ మానవా !
34. బంగారుగుడ్లు పెట్టే బాతులు..?
ఎన్నికల వేళ
అరచేతిలో స్వర్గం
చూపే మన నాయకులు
నిద్రలో లేపినా చెబుతారు
తీయంగ...." నీతులు"
భద్రంగ వెనుక తీస్తారు
లోతుగ......"గోతులు"
పేదల కొంపలు
కాల్చి కూల్చే ఈ
కొండమీది..."కోతులు"
కాదురా బాబు
రేపు బంగారు గుడ్లు
పెట్టే.........."బాతులు"
34A. కుబేరులెవరు...?
ఎన్నికల్లో గెలవగానే...
ఏదో పదవి రాగానే...
కుర్చీలో కూర్చోగానే...
కుబేరులైపోతారు మన
రాజకీయ నాయకులు
బ్రతకలేని...
మెతుకులేని...
బీదలపై నిరుపేదలపై
వీరికెన్నో..."భక్తి శ్రద్ధలు"
ప్రజాసేవ పేరుతో
మ్రింగేస్తారు కోట్ల
కోట్ల నోట్ల..."వెన్న ముద్దలు"
గద్దెలనెక్కి
గారడి చేస్తూ...పేదల
రక్తాన్ని పీల్చే..."ఈ పెద్దలు"
గుట్టుగా
చెంతకు చేరి...
చిరునవ్వుల బాణాలతో
గుండెల్ని చీల్చే..."గ్రద్దలు"
34B. బొమ్మలాట...?
ఎన్నికల వేళ
వాగ్దానాల వర్షం
కురిపించే మన నాయకులు
బాగు చేస్తామంటారు
బీదల........"బ్రతుకుబాటలు"
అతిమధురంగా చెబుతారు
అందరికి...."మాయమాటలు"
తెలుసుకున్ననాడు
ప్రజలు వీరి..."తెలివితేటలు"
బయట పడకపోవును కదా
ఈ నాయకుల..."బొమ్మలాటలు"
34C. బంగారు బాతులు
నిద్రలో లేపినా చెబుతారు
తియ్యగా... నీతులు
భద్రంగా వెనుక తీస్తారు
లోతుగా... గోతులు
పేదల కొంపలు కాల్చి
కూల్చే ఈ... కోతులు
కాదురా బాబూ బంగారు
గుడ్లు పెట్టే... బాతులు
35. నాడే ! ఉగాది
ఆనాడే శోభకృత్ ఉగాది !!✓
"పచ్చని పంటలు" పండిననాడు !
"ఆకలి మంటలు" ఆరిననాడు !!
"అక్షర దీపాన్ని" వెలిగించిననాడు !
"అజ్ఞానాంధకారాన్ని" తొలిగించిననాడు !!
"నిరుద్యోగాన్ని" నిర్మూలించిననాడు !
నిరాశతో యువత నిట్టూర్చనినాడు !!
"వరకట్న పిశాచి" కోరల్ని విరిచిననాడు ! ముత్తైదువలై కన్నెలంతా మురిసిననాడు !!
"కులాలనే" అడ్డుగోడల్ని కూల్చినవాడు ! "మతరక్కసిని" మంటల్లో కాల్చిననాడు !!
కొమ్మల్లో "కోయిలమ్మ కలసి కాకమ్మతో " ! పరవశించి "యుగళగీతం" పాడిననాడు !!
యుద్ధవిమానాలతో ధరణి దద్దరిల్లనినాడు !
ప్రపంచమంతా "శాంతి" ప్రజ్వరిల్లిననాడు !!
"మంచితనం మాతవత్వం" ప్రతిమనిషి
గుండెల్లొ "తేనెజల్లులా" కురిసిననాడు !!
"సమానత్వం సౌబ్రాతృత్వం" ప్రతివ్యక్తి ఊహల్లో "హరివిల్లులా" విరిసిననాడు !!
తినగ తినగ వేప తియ్యనన్న...
"కలసివుంటే కలదు సుఖమన్న"...
నగ్నసత్యాన్ని ప్రతి మనిషి ఎరిగిననాడు !!
"నలుగురు కలసి"నవ్వుతూ బ్రతికిననాడు!!
నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది
36. సంస్కారం
గుర్తుకు వస్తుంది
చిన్న పాపను చూస్తె
"కన్న కూతురు"
గుర్తుకు వస్తుంది
మధ్యవయసు స్త్రీని చూస్తె
"మాతృమూర్తి"
కాని
గుర్తుకు రానిదొక్కటే
సొగసులొలికె పిల్లను చూ సే
"సొంత చెల్లెలు" అక్క
కారణం ఒక్కటే
వయసు పెరిగినా...
మనసు పెరగక పోవడం
చదువుకున్నా...
సంస్కారం లేకపోవడం.
37. గాడిద
రాతృల్లో రహస్యంగా
పరాయి వంటపొలాలపై బడి
"కంచర గాడిద" ఒకటి
కంగారు కంగారుగా
మేస్తుంది... "కడుపు మండి"
ఆఫీసుకు వచ్చినవాళ్ళ
అమాయకత్వాన్ని
అక్కర్లను ఆసరాగా చేసుకొని
దర్జాగా ధైర్యంగా దాదాలా...
పట్టపగలే దోస్తూ...
పబ్లిక్గా మేస్తూ... లక్షలు లక్షలు ఆర్జిస్తున్నాడో ..."లంచగొండి"
38. మోసం చేస్తే
(ప్రేమకు అర్థం..?)
ప్రేమకు అర్థం
తెలియదంటే...
..."బచ్ఛా"...అంటారు
ప్రేమించిన
పిల్లనే పెళ్లాడితే
..."అచ్ఛా"...అంటారు
లక్షలకాశ పడి
మోసం చేస్తే
వాడికేమైనా లక్ష్మీ
..."పిచ్చా"...అంటారు
39. అంగడి బొమ్మ..!
(ప్రేయసీ నా ఊహల ఊర్వశి)
అందాలు ఆరబోసే
ఓ సుందరీ గుర్తుంచుకో ...
అందమైన నీ తనువు
"చక్కని అద్దమే"...
ప్రతిబింబం చూసుకొన
"ప్రతిఒక్కరు సిద్దమే"...
నేడు బాహుబంధాలలో
బంధించుకుంటారు రేపు
నిన్ను "బహుదూరం" నెట్టేస్తారు
నేడు నీచుట్టూ తిరిగే ఈమగవారే...
రేపు నీ మీద వాలేటి ఈగలౌతారు...
రేపు "పెనురోగం"
పట్టి పీడిస్తుంటే...
"అనురాగం" చూపి
నిన్ను ఆదరించేదెవరు..?
ఓ మగువా గుర్తుంచుకో..!
వీరు నిన్ను ఆదరించడం కల్ల..!
రేపు సర్వనాశనం నీబ్రతుకు వీరివల్ల..!
అందుకే అందాలతో విందుచేయాలని
విచ్చలవిడిగా విలాసవంతమైన జీవితాన్ని
ఆశించే ఓ అందాల సుందరి...ఈ అందం అశాశ్వతమన్న....ఒక్కనిజం తెలుసుకో!
శీలాన్ని అమ్ముకోకు..!
కాలాన్ని నమ్ముకో...!
పద్దతి మార్చుకో..!
జీవితాన్ని సరిదిద్దుకో..!
బలహీనతలకు బలికాకు..! బ్రతుకుమార్చుకో..!
కోరికల్ని చంపుకో..!
కష్టపడి కడుపు నింపుకో..!
40. కారుమబ్బులే...కదా?
ఎండే కడుపులతో...
మండే గుండెలతో...
మండుటెండల్లో...
కొండల మీద
కండలు కరిగేలా
బండలు మోస్తు
బ్రద్దలుచేస్తూ
బ్రతికే...
నిరుపేదలకు
నీడనిచ్చేదెవరు ?
అండగా
వుండేదెవరు ?
ఆదరించేదెవరు ?
చేరదీసేదెవరు ?
సేదదీర్చేదెవరు ?
అలా అలా
ఆ ఆకాశంలో
కాసేపు
చల్లనిగాలికి
కదిలే....
కదిలి...కరిగే
కరిగి...కురిసే
ఆ నల్లని చల్లని
కారుమబ్బులే కదా.
41. మందిరమా...మసీదా ✓
(బడా భక్తులు...? కార్పోరేట్ శక్తులు..??)
ఔరా ! బడా నాయకులే భక్తులైతే...?
కార్పోరేట్ దుష్టశక్తులకు బానిసలైతే..?
ఏమౌతుంది... ప్రతి రాష్ట్రం
రావణకాష్టంలా రగులుతుంది...
మణిపూర్ లా మతోన్మాద
మంటల్లో పడి కాలి బూడిదౌతుంది...
నిన్న విధి చెప్పింది.....ఓ విషాధ గాథ
నేడు కాలం పాడింది...ఓ కన్నీటి పాట
విధి చెప్పిన...ఆ విషాధగాథ
ఏడ్చే పాపలకు తెలుసు...
ఎగిరే పక్షులకు తెలుసు...
కాలం పాడిన...ఆ కన్నీటి పాట
కడుపులో దూరిన కత్తులకి తెలుసు...
నడివీధిలో నగ్నంగా
ఊరేగింపబడిన కుకీమహిళలకు తెలుసు...
విధి చెప్పిన...ఆ విషాధ గాథ
చిరిగిన చీరలకు తెలుసు..
పగిలిన గాజులకు తెలుసు...
కాలం పాడిన...ఆ కన్నీటి పాట
నక్కినక్కి తిరిగె
మైతీకుక్కలకు తెలుసు...
ముక్కలైన కుకీపూల
మొక్కలకు తెలుసు...
విధిచెప్పిన...ఆ విషాధ గాథ
కళ్ళు మూసుకున్న
ఏసుక్రీస్తుకు తెలుసు...
గోడకు వ్రేలాడె
శ్రీరామచంద్రుడికి తెలుసు...
కాలంపాడిన...ఆ కన్నీటి పాట
తెగిన తాలిబొట్లకు తెలుసు...
రాలిన రక్తపుచుక్కలకు తెలుసు...
పరిమళించే మంచితనం...
మానవత్వం...అమాయకత్వం...
స్వచ్చమైన స్నేహం...సౌభ్రాతృత్వం...
"పాలుతేనెల్లా" ప్రవహించే మణిపూర్ లో
ఏ మతోన్మాదుల వికృత సృష్టియో ఇది..? ఔరా జాతుల మధ్య ఈ జగడాలేమిటి...?
ఘడియఘడియకు ఈ ఘర్షణ లేమిటి..?
మతం పేర ఈ మారణ హోమమేమిటి..?
సందేహమే లేదు ?
ఇది కార్పోరేట్ శక్తులు...
భక్తులైన బడానాయకులు...
ఏకమై సృష్టించిన
భీభత్సమే నరమేధమే...
భక్తి ముసుగులో
జరుగుతున్న భాగోతమే...
42. స్త్రీకి...పెళ్ళైతే?
స్త్రీకి పెళ్ళైతే...?
శత్రువులు "నలుగురు"
కిరోసిన్ మీదజల్లి
కిలకిలమని నవ్వే
"కిరాతకపు మొగుడు"
అగ్గిపెట్టె అందించి
ఆలస్యమెందుకు...?
అగ్గిపుల్ల గీసి
అంటించమనే
"ఆడపడుచు"
అంటించి
అయ్యో ! అయ్యో !
అమ్మో ! అమ్మో ! అంటూ
అరిచి అరిచి అల్లరిచేసె
"ఆశబోతు అత్త"
అంతటి
దారుణాన్ని కూడ
"ఆత్మహత్యగా" చిత్రించి
అందరి ముందే...!
మౌనంగా రోదించే
"మాయదారి మామ"
43. కొత్త సంవత్సరం వస్తుంది
(శుభోదయం
అందరికీ శుభ శుభోదయం....)
చెప్పుకుందాం...
చెప్పుకుందాం...
శుభోదయం...
అందరికీ "శుభ" శుభోదయం
"శుభోదయం" అనగా
ఒక సుందర సూర్యోదయాన
అందరికీ రోజంతా"శుభాలు"జరగా,లని
శుభాకాంక్షలా...కాదు...కాదు
పొడిచే...
ప్రతి పొద్దు...
నుదుటి కుంకుమలా
అందరినీ మురిపించాలని...
నడిచే...
ప్రతి నిమిషం...
నవ్వే నక్షత్రమై అందరి
జీవితాలలో వెలుగులు విరజిమ్మాలని...
గడిచే...
ప్రతి గంట...
గంగానది నిర్మలత్వాన్ని
అందరి గుండెల్లో నింపాలని...
కన్నకలల్ని కంచికి చేర్చాలని...
ఆశల్ని అమృతంలో ముంచాలని...
ప్రతిరోజు...
రోజాలా విరబూయాలని...
ప్రతి వారం...
పచ్చని హరితహారం కావాలని...
ప్రతినెల...
కరగని కమ్మని కలగా మిగిలిపోవాలని...
అందరికీ ఆపరమాత్మ
సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలనందించాలని...
చెప్పుకుందాం...చెప్పుకుందాం...
అందరికీ శుభోదయం...శుభ శుభోదయం.
44. మురిపించే ముద్దు గులాభి
అత్తరు ఒంటికి అద్దుకుని
ముద్దుగులాబీలా ముస్తాబై
అమరసుఖం అందించేందుకు
పడకగదిలోకి పరుగులుతీసే ఓ పడతీ !
అందమైన నీ తనువు
చక్కని అద్దమె...
ప్రతిబింభం చూసుకొన
ప్రతి ఒక్కరు సిద్ధమె...
అందం నీలో చిందు లేసినంత కాలం అందరు నీకు దగ్గరి బంధువులే
బాహుబందాలలో నేడు బంధించుకుంటారు...రేపు
బహుదూరం నిన్ను నెట్టేస్తారు.
రావోయి రావోయి ఓ చందమామ
అంటు కులికే ఓ అందాల భామ
పైసల కోసమై గదా నీవు పగలు
రేయి అందించేవు అందరికి హాయి
దేహంలో
దాగిన అందాలతో కాముని
దాహం తీర్చి కౌగిలిలో కరిగేవు...
హద్దులు మీరి మీదమీద పడి
ముద్దుల వర్షం కురిపించేవు...
నేడు కాముని కౌగిళిలో
కాంచితివే స్వర్గాన్ని కాని
కళ్ళుతెరిచి చూసుకోవు
నీ జీవిత మార్గాన్ని తరుణీ
నీ జీవిత సంద్రానికేది తీరం
తెలుసుకో
రేపు నీ జీవితం గాఢాంధకారం.
వారు నిన్ను ఆదరించడం కల్ల... సర్వనాశనం నీ బ్రతుకు వారివల్ల...
వృధా అవుతుంది నీ యవ్వనమంతా... వ్యధ ననుభవిస్తావు జీవితమంతా...
నీయింటి చుట్టుతిరిగె ఈ మగవారె
రేపు నీ ఒంటి మీద వ్రాలే ఈగలౌతారు
"ఎయిడ్స్" వంటి పెనురోగం" పీడిస్తుంటే
అనురాగం చూపి నిన్ను ఆదరించేదెవరు ?
దిక్కుమొక్కు
లేరంటూ వెక్కివెక్కి ఏడుస్తావు...
ఎన్నాళ్ళీ కన్నీళ్ళని
ఏటిచేస్తావు ? "ఏటిలోతు” చూస్తావు.
45. అర్హుడు...?
అన్యం పుణ్యం
ఎరుగని అతివలను...
అభం శుభం
తెలియని అబలలను...
మాయామర్మం
ఎరుగని మగువలను...
కల్లాకపటం
తెలియని కన్నెపిల్లలను...
కల్లబొల్లి కబుర్లతో...
అల్లిబిల్లి ఆశలతో...
కవ్వించి...నవ్వించి
మాయచేసి...మనసుదోచి...
కన్యాత్వాన్ని కాటువేసిన
క్రూరుడెవడైనా...
కఠినశిక్షకు అర్హుడే ఏనాడైనా...
46. మగువ - మచ్చ✓
నిప్పు పైనా
ఉప్పు పడినా...
ఉప్పు పైనా
నిప్పు పడినా...
"ఉలిక్కి" పడేది - "ఉప్పె"
అరిటాకు పైన
ముళ్ళు పడినా...
ముళ్ళు మీద
అరిటాకు పడినా...
"అడ్డంగా" చిరిగేది - "అరిటాకె"
మగాడితో
మగువ తిరిగినా...
మగువతో
మగాడు తిరిగినా...
"మచ్చ"మిగిలేది మాత్రం - "మగువకె "
47. హార్ట్ ఎటాక్...?✓
ఆటలుపాటలన్నవి లేక
యోగాసనాలు మరిచి
నిత్యం ఎక్సర్సైజ్ చేయక
ఆన్లైన్ గేమ్స్ కే అంకితమై
జంక్ ఫుడ్స్ ఆరగించే
బద్దకస్తులైన కుర్రకారును
- "గట్టిగా ప్రేమిస్తుంది"
మందుకు బానిసలై
మత్తులో మునిగితేలె
మధ్యతరగతి మనిషుల్ని
- "మట్టి కరిపిస్తుంది"
క్రొవ్వు పట్టిన
కోటీశ్వరులను
సైతం కాలరు పట్టి
- "కాటి కీడుస్తుంది"
అదిఅదే -
చిటికవేసే సరికి
చితికి చేర్చేటి...
గుట్టు చప్పుడు
కాకుండా వచ్చేటి...
- "గుండె జబ్బు"....
48. వనితల విప్లవం
(స్త్రీలే సింహాలైతే...?)✓
మెడన తాళి
కట్టించుకుని...
శోభనం పేరుతో
సర్వం అర్పించుకుని...
మెట్టినింట
అడుగు పెట్టిన
నాటి నుండి...
ఏటేట కడుపున
...పుట్టే బిడ్డలకు...
సంసారంలో చిచ్చు
...పెట్టే చుట్టాలకు...
...తిట్టే ఆడపడుచులకు...
...కొట్టే అత్తామామలకు...
...తిట్టి - కొట్టి - వాతలు పెట్టి
...బయటకు...నెట్టే భర్తకు...
బ్రతికినంత కాలం
...వెట్టిచాకిరి చేస్తున్నా...
...ఇంకా...ఇంకా...ఇంకా
కట్నాలపేరుతో
కట్టుకున్న భార్యల్ని
కొందరు మగాళ్ళు క్రూరంగా...
మృగాలకన్న అతిఘోరంగా...
హింసిస్తూ వుంటే...
"చిత్రవధలకు" గురిచేస్తూ వుంటే...
స్త్రీలెన్నడు..."సింహాలై" గర్జించేది...?
వనితల్లో ఎన్నడు..."విప్లవం...వచ్చేది..?
49. ప్రణయం - ప్రళయం..!✓
ప్రళయ గర్జనలేల
ఓ ప్రణయ దేవత ?
విలయ తాండవమేల
ఓ మలయ మారుతమా ?
నిన్న చిలిపివలపులు
చిలికిన నీ హృదయం
నేడు విషవలయమాయె నెందులకో..?
నిన్న నీకై నిముష నిముషం
తపించిన నా మది నేడు
నిరాశా నిలయమాయె నెందులకో ?
నిన్న నా కళ్ళలో
కలల కనకవర్షం కురిపించి
నేడు ఆ కళ్ళలోనె ముళ్ళెన్నో విరిచి మురిసిపోతున్నావా ఓ ముగ్ద మోహిని.
ఓ సీ నా ప్రేయసీ !
నిన్న సిగ్గులుమొగ్గలు తొడిగె
నీ నునులేత బుగ్గల మీద
ముద్దుల మ్రుగ్గులు వేసే తరుణాన
ఏదో తన్మయత్వాన
నా ఎదపై ఒదిగి మత్తుగా మూల్గి
నా కళ్ళలోకి చూస్తూ కమ్మగా పలక లేదా?
ఓ ప్రియతమా !
నీ పొందు మరుజన్మకైనా
మరువలేని "మత్తుమందని"...
నా కన్యత్వాన్ని కానుకగా చేసి
నీకు పగలురేయి అందిస్తా
"పసందైనవిందని"...
మరేల ? ఈ
ప్రళయ గర్జనలు
ఓ ప్రణయదేవత..!
ఇకనైనా ఆపవా
ఈ విలయ తాండవం
ఓ మలయమారుతమా..!
50. ఆశాజీవి
కళ కళ లాడుతూ
బ్రతకాలని
కిల కిల నవ్వుతూ
తిరగాలని
విఫల ప్రయత్నం చేసినా
విధి వక్రిస్తే
అదృష్ట దీపం ఆరిపోయే...
ఈ బ్రతుకంతా విషవలయమే !
అడుగడుగున గండాలె !
సుఖ దుఃఖాల సుడిగుండాలె!
ఇది ప్రతి నిరాశాజీవి
నిరంతరం చేసె నినాదమె
అందుకె ఓ ఆశాజీవి !
వెన్నడు నిరాశ చెందకు!
"ఆశే" ఊపిరిగా సాగిపో ముందుకు. !!
51. అగ్ని పరీక్ష ...?✓
కుదురుతుంది...
కుదురుతుంది...
ఓ పిచ్చి సంబందం
అరిగిపోగ...అరిగిపోగ
పదిజతల...“పాదరక్షలు”
పెద్ద చదువులు
చదివిన పెళ్ళి కొడుకు
కూతురు మెళ్ళోవేసె
మూడుముళ్ళ
ఖరీదు..."ముప్పై లక్షలు"
అత్తారింట అడుగు
పెట్టిన నాటి నుండి
కన్నకూతురు
అనుభవించేది
కారుచీకటిలో
కఠిన..."కారాగార శిక్షలు"
అందుకే అయ్యో
ఓ శ్రీ రామచంద్రా !
ఆడపిల్లల తండ్రులకే
ఎందుకయ్యా ఇన్ని..."అగ్ని పరీక్షలు”.
52. అదృష్టం...!
కట్టుకున్న మొగుడు
కరుణామయుడైతే...
కళ కళ లాడుతుంది
...కలికి బ్రతుకు...
పది కాలాలపాటు...పచ్చగ...
పదిమంది ఎంతో...మెచ్చగ...
కట్టుకున్న భర్త
కఠినాత్ముడైతే...
కలికిక మిగిలేది
...కన్నీరే...
...కారణం...
...కాపురం
కలతలతో...కలహాలతో...
వేడెక్కి వుంటుంది...వెచ్చగ...
ఒకరితత్వం ఒకరికి...నచ్చక...
53. రిక్వెస్ట్...?
కాకిముక్కుతో నైనా...
కార్డుముక్కతో నైనా...
కాసింత
కబురైనా అంపక...
గుట్టుగా మూటముల్లె
గుమ్మంలో- దింపమాక...
ఉరుము లేని
మబ్బల్లే ఊడిపడమాక...
Hellow !
Mydear Guest..!
Remember our request..!
Keep it always in your mind..!
Don't come like a blind wind..!
54. నేలకొరిగిన నేతలు...
ఏ చరిత్ర
పుస్తకాన్ని
తిరగేసినా
ఏ మున్నది వినోదం...?
అంతా విషాదం...!
గత మన భారతమంతా
గాయాలమయం...!
అన్నీ
చెరసాల శిక్షలే...
చేతులకు బేడీలే...
చెరగని రక్తపు మరకలే...
అంతటా వినిపించేది
అతి దారుణమైన
"మర ఫిరంగుల మ్రోతలే"...
అంతటా కనిపించేది -
"వందే మాతరం" అంటూ
దిక్కులు పిక్కటిల్లేలా
నినదిస్తూ "నేలకొరిగే నేతలే"...
నాటి
ఆ జాతినేతల
"త్యాగ ఫలమేనోయ్...
నేడు నీవు నేను అనుభవించే
ఈ "సంపూర్ణ స్వేచ్చా స్వాతంత్ర్యం”.
55. ఫ్రీడం ఈజ్ నాట్ ఫ్రీ
It is a fun!
One plus one may be three
But, It is a true!
Freedom is not so free
A Great leader should cry or die Otherwise freedom
won't come from the sky.
అడుగడుగునా అహింసనే ప్రబోధించి పిరికివాళ్ళను సైతం పిడుగులుగ మార్చి ఉప్పు సత్యాగ్రహంచేసి ఉద్యమాలురేపి నిరహార దీక్షలుచేసి నిప్పులు కురిపించి త్యాగాలెన్నో చేసి తెల్లదొరల్ని తరిమేసి ప్రతి భారతీయుడికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని ప్రసాదిస్తే...?
....తుదకు గాంధీజీనేం చేశారు ?
....తుపాకి గుళ్ళకు బలిచేశారు.
పెరిస్త్రోయికా అంటు పెనుతుఫాను రేపి అగ్రరాజ్యమైన రష్యా రూపురేఖల్నే మార్చివేసి కమ్యూనిజం కారుచీకట్లను తొలిగించి ప్రజాస్వామ్యపు ఉషోదయాన్ని ప్రసాదించి ప్రజాస్వామ్యవాదిగా ప్రపంచ మేధావిగా అఖండ కీర్తినార్జించి
ఉన్నత శిఖరాలధిరోహించే...
....గోర్బచేవ్ నేంచేశారు గోతిలో త్రోశారు
....సంస్కరణల సాక్షిగ ఆయన్ని
....సమాధి చేశారు.
ఆయిల్ బావులపై ఆశపుట్టి కుట్రలెన్నో పన్ని కువైట్ ని ఆక్రమించి "యుద్ధానికి సిద్ధమేనని" సద్దాం ఓ సవాలు విసిరితే ఆగ్రహించిన అమెరికా బాగ్దాద్ పై "బాంబుల కుంభవర్షం” కురిపించి
హెల్ప్ లేని గల్ఫ్్ఫనేలను" గజగజలాడించి సద్దాం
సామ్రాజ్యమైన "రాక్ంటి ఇరాక్”ను
...బుష్ ఏం చేశాడు బూడిదగా మార్చాడు
...విర్రవీగే సద్దాంపై విజయం సాధించాడు.
దివ్యమంగళ తేజోమయుడు ధవళవస్త్రదారి...ధైర్యశాలి నిత్యం నవ్వులురువ్వే నిర్మలమూర్తి
అణగారిన పేదప్రజల ఆశాజ్యోతిగా ఖ్యాతికెక్కి బంగారు కలలు కంటూ బహిరంగ సభల్లో పాల్గొంటుంటే
మాష్టర్ ప్లాన్లేసి మానవబాంబును పెట్టి
...చిరునవ్వులు చిందించే రాజీవ్ గాంధీని
...శ్రీ పెరుంబుదూరులో ఏంచేశారు ...
...చిత్రవధచేశారు
Thats why
One plus one may be three
But Freedom is not free...
Freedom is not free.
56. ఆకలి బొమ్మ
ఆ బొమ్మని ఈ బొమ్మని
అతి తక్కువ ధర కిమ్మని
కొసరి కొసరి కొంటెగా బేరమాడె
"ఈ బొమ్మ" కేం తెలుసు ?
రెక్కలు ముక్కలు జేసి
చక్కనైన ఆ చెక్క బొమ్మల్ని
చెక్కి చెక్కి బక్క చిక్కిపోయి
బజారున పడి ఆశగా
ఆ బొమ్మలమ్ముకునే
ఆ వెర్రి వ్యాపారి
'ఆకలి చేతిలో ఆట బొమ్మని”
"విధి చేతిలో కీలు బొమ్మని".
57. భగ్నప్రేమ
నగ్న శరీరాలను
చూసుకుని నవ్వుకునే వేళ
భగ్నప్రేమికుల ఎదలో బంగారు కళ
ఆ ప్రణయం
కులమతాలు
అడ్డువస్తే - కూలిపోతుంది
ఆస్తి అంతస్తులు
అడ్డువస్తే - అంతమౌతుంది,
నగ్న సత్యం ఒక్కటే
భగ్న ప్రేమికుల చరిత్రలో
సుఖాలెప్పుడూ సువర్ణాక్షరాలతో లిఖించపడలేదు
తీయని బాధలు తీరని వ్యధలు తప్ప
58. డబ్బు! డబ్బు!! డబ్బు!!!
ఆరని కన్నీరు తుడిచి
తీరని బాధలను ఆవేదనలను
అణగార్చేది ఆశలు పెంచేది ?
పన్నీరు చల్లేది
పరవశింప చేసేది ?
శోకాల సాగరం లోంచి
దరిచేర్చేది...దారి చూపేది?
సుఖాల సోపానాలనెక్కించేది
దొరకని స్వర్గాన్ని దక్కించేది ?
ఏమిటది ? అదే డబ్బు ! డబ్బు !! డబ్బు !!!
59. హిందువు
చెడు
సంస్కృతులకు
చెందవు నీవు
పోరుతో లాభం
పొందవు నీవు
అందరి ఊహకు
అందవు నీవు
భిన్నత్వంలో ఏకత్వానికి
కేంద్ర బింధువు నీవు
అనాధ శరణార్ధులకు
ఆత్మ బంధువు నీవు
హింసకు ప్రతి హింస
అంటున్న హిందువు నీవు
మతాన్ని మత్తు మందుగా
వాడుచుందువు నీవు
హిస్టరిలో ఓ మిస్టరిగానె
మిగిలి వుందువు నీవు
60. భక్తుడు
నిరంతరం నిర్మలంగా
నీ మనసుంటె నిస్వార్ధంగా బాధల నెదుర్కోవడమె ధైర్యంగా భావిస్తె
బ్రతుకు పరమార్ధంగా
దిక్కు తోచక దీనంగ
విస్తుపోతూ వినయంగ ఆ దైవమె పూజించు నిన్ను దైవంగ
నాడు
నీకైనా నాకైనా ఏ వ్యక్తి కైనా
ఇహాన భుక్తి కైన పరాన ముక్తి కైనా
కొరత వుండదు కొంచెమైనా
61. చాకచక్యం
సింపుల్ గా బ్లౌజ్ కొనబోతె
షిఫాన్ చీరె కొనిపించాడు
"అప్పురేపు" అని వ్రాసి వున్నా
"అయ్యగారి జేబు" ఖాళీగా వున్నా
అర్ధాంగి ఆశ్చర్యం !! షాపువాడి చాకచక్యమా నా బొంద
ఆ షాపు వాడిదెంత చాకచక్యం !
ఒద్దు అనలేక ఓకే అన్నాడీ
పిరికి పంద శ్రీ వారి స్వగతం !!
నీ అదృష్టం నా దురదృష్టం !
62. అర్ధాంగి అదృష్టం
కట్టుకున్న మొగుడు
కరుణామయు డైతె
కలికి బ్రతుకు కళకళలాడుతుంది.
పది కాలాలపాటు -
పచ్చగ పది మంది ఎంతో - మెచ్చగ
కాని -
కట్టుకున్న భ ర్త
కఠినాత్ము డైతె
కలికిక మిగిలేది కన్నీ రె
కారణం కాపురం ఎప్పుడూ..
కలతలతో కలహాలతో.
వేడెక్కి వుంటుంది -
వెచ్చగ ఒకరితత్వం
ఒకరికి - - నచ్చక.
మినీ కవితలు... (11)
1. ఆ ఇద్దరు
(అదృష్ట జాతకులు..?)
కొందరు...
పట్టుకుంటే...
మట్టి పసిడౌతుంది
ముట్టుకుంటే...
ముత్యమౌతుంది
వారే - "అదృష్ట జాతకులు"
కొందరు...
పట్టుకుంటే...
కర్ర పామై కరుస్తుంది.
ముట్టుకుంటె...
ముల్లై గుచ్చుకుంటుంది.
వారే -"కాలం కలసిరాని దౌర్భాగ్యులు"
2. నీవు నేను
(కొంటె కోరిక...?)
ప్రియా..!
ఓ నా ప్రియా..!
గులాబి పువ్వులా
గుభాళించే నీ
గుప్పెడు మనసులో
గువ్వలా ఒదిగి
పోవాలన్నదే... నా కొంటె కోరిక...
ప్రియతమా..!
ఓ నా ప్రియతమా..!
జలజల కురిసే నీ
జాలిచూపుల జల్లులో
జలకాలాడే జాబిల్లినై
మత్తెకించే మరుమల్లెనై
ఉండిపోవాలన్నదే...నా పిచ్చి కోరిక...
3. శ్రమ
ఉదయిస్తె...
శ్రమలో నుంచే
స్వేచ్ఛను తుంచే
స్వేద బింధువులె
- "నీ నుదుట"
ఉరిపోసుకోవు సుమా...
చీకటిని తొలిగించే
చిత్తాన్ని వెలిగించ్నే
చిరునవ్వులు
- "నీ ఎదుట"
4. చెప్పకు
చెప్పకు
చెప్పకు...
బద్దకానికి
భయానికి
బానిసత్వానికి
సోమరితనానికి
..."ఘనస్వాగతం"
చెప్పకు
చెప్పకు
సాహసానికి
సంస్కారానికి
విజయానికి
వినోదానికి
..."శాశ్వతంగా వీడ్కోలు"
4A. చెప్పకు ! చెప్పకు !
చెప్పకు
చెప్పకు
స్వాగతం..!
.....స్వార్థానికి...!
.....సోమరితనానికి..!
చెప్పకు
చెప్పకు
వీడ్కోలు...!
....వినోదానికి..!
....విజయానికి..!
వెళ్ళకు
వెళ్ళకు
దూరంగా...!
.....మంచితనానికి...!
.....మానవత్వానికి..!
పడకు
పడకు
తెలిసీ తెలిసి..!
....పాపంలో...!
....నరకకూపంలో...!
నమ్ము
నమ్ము
మదిలో గట్టిగా...!
....విధిని ఎదిరించవచ్చని...!
....విజయాన్ని సాధించవచ్చని..!
5. కులం మతం
కులం...
గజ్జి కుక్క
వీధిలో
తిరగనివ్వకు
తిరగనివ్వకు
మతం...
పిచ్చి మొక్క
పెరటిలో
పెరగనివ్వకు
పెరగనివ్వకు
6. మందు...
నీవైనా...
నేనైనా...
ఎవరైనా...
నిన్నైనా..
నేడైనా...
రేపైనా...
ఏదైనా
చేదైనా...
మందైనా...
మాకైనా...
కుదురునా...
మాయదారి
మొండి
రోగం ముదిరిన...
7. కాపురం...
పుడుతుంది..!
నీళ్ళ నుండి
...నిప్పు..!
అమృతం నుండి
...హాలాహలం..!
ఆకలి నుండి
...ఆవేశం..!
విషాదం నుండి
...విప్లవం
చెడుతుంది..!
చెప్పుడు
మాటలవల్ల
చిరకాల...స్నేహం..!
కలహాల వల్ల
పచ్చని...కాపురం..!
8. నింద...!
ఈతి
బాధలకు
అసలు
భయపడకు..!
చిరు
సమస్యలకు
అతిగా
స్పందించకు..!
బాధలన్నింటికి
బాధ్యుడు
భగవంతుడేనని...
ఆ పరమాత్మను
నిత్యం నిందించకు..!
ఆనందాన్ని...
ఆరోగ్యాన్ని ...
ఆయుష్షును...
అందించమని...
ఆశతో అర్ధించు..!
కష్టాలను
కన్నీళ్ళను...
శ్రమలను
బాధలను...
భరించే శక్తిని
ప్రసాధించమని...
భక్తితో ప్రార్ధించు..!
9. కలువ పువ్వు...
విరబూసిన
కలువపూల
అందాలను
కనులారా...
తిలకించి
పులకించిపోయే
ఓ పున్నమి పువ్వా..!
ఆగు ఆగు క్షణమాగు..!
నీ ముఖంలో
చిరునవ్వు
...మొలవ నివ్వు...
విశాల
హృదయంతో
...విలువ నివ్వు...
నీటిలో
నిశ్చలంగా
...నిలువ నివ్వు...
కళ్ళు
తెరచిందిపుడే
పాపం కనువిందుచేసే ఆ
...కలువ పువ్వు...
10 .ఆస్తి ...స్వస్తి...?
అంకితమైతే...
ఆవేశానికి...
అవివేకానికి...
"ఆరని" ఆవేదనే..."నీ ఆస్తి"
సొంతమైతే...
స్వార్థానికి...
సోమరితనానికి...
"స్వచ్ఛమైన" సుఖం..."నీకిక స్వస్తి"
11. పగటి కలలు..?
(పడుచు పిల్లలు...పగటి కలలు..? )
అభూత
కల్పనలకు అద్దంపట్టే...
చెత్త సాహిత్య చదవబట్టే...
వాట్సాప్ కు...
ఫేస్ బుక్ కు...
ఇంటర్నెట్ కు...
యూట్యూబ్ కు...
సెల్లో వీడియో గేమ్స్ కు...
24/7 కట్టు బానిసలై పోబట్టే...
మత్తులై...ఉన్మత్తులై....
చపలచిత్తులై...ఊహాజగత్తులో
ఉయ్యాల జంపాల లూగుతూ...
కమ్మని కలలు కంటూ...
కన్నవాళ్ళ కళ్ళుగప్పి
సిగ్గూ లజ్జా లేకుండా
బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి
బజారులో బరితెగించి
వీధికుక్కలవోలె...
విచ్చలవిడిగా నడిరోడ్డుపై
చిరునవ్వులు చిందిస్తూ...
సరసాలాడుతూ...సంచరించే...
కన్నెపిల్లలకు....సహజం
కాలు జారడం...కనడం...(పగటి కలలు)
రచన:
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment