72...ఆగస్టు నెల 2023 కవితలు

 72...ఆగస్టు నెల 2023 కవితల ఇండెక్స్ 


1. శత్రువు...ఒక్కరు చాలు..!

2. ఆ రెండడుగులు..?

3. రామబాణంలా...దూసుకుపోవాలి..!

4. ఆ ముగ్గురిలో మీరెవ్వరు..?

5. ఆ దేవదేవుడు 

6. నమ్మక ద్రోహులు...

7. గుడిలో దైవం గ్రుడ్డివాడా..?

8. ఎన్నో ప్రశ్నలు ఇక్కడ..!

‌    సమాధానాలు ఎక్కడ..?

9. కృతజ్ఞతా కుసుమాంజలి

10. నిద్రరాక నిట్టూర్చేదెవరు..?

11. వాస్తవాల వక్రీకరణ...?

12. నమ్మకం 

13. కొందరు భక్తులు 

14. జ్ఞానదేవత డాక్టర్ సాకే 

      భారతికి అక్షరాభిషేకం...

15. టక్కరి టమోటా 

16. సాకే భారతికి 

      వందనం..!అభివందనం..!

17. భారతి జీవితాశయం...

18. భారతి సందేశం ....

19. అవకాశాలు...

20. చదువుల తల్లి డాక్టర్ సాలే భారతి

21. బంగారు తల్లి భారతీ..!

22. సినారె...ఎవరిని 

       అడిగితే నేనేమని చెప్పేది?

23. ఓటమి వెనుకనే విజయం...?

24. మృత్యువుతో ముద్దూ ముచ్చట...

25. బొట్టు లోగుట్టు..! 

26. తెలుసుకో నేస్తమా "బొట్టు"లోగుట్టు

27. జాతినేతలకు... జేజేలు...!

28. విప్లవ సింహం గద్దరన్న...?

29. చీకటి పడక ముందే...!

30. నేతగా...ధర్మదాతగా...!

31. అమరజీవి...

      డాక్టర్ బిఆర్ అంబేద్కర్...

32. అస్తమించని సూర్యుడు అంబేద్కర్..!

33. వద్దురా వద్దురా"అప్పుజీవితం"..!

34. మణిపూర్...

       రగిలే ఒక రావణ కాష్టం..?

35. మణిపూర్...

       ఆరని ఒక అగ్ని గుండం..?

36. మణిపూర్ మారణకాండకు 

       దోషులెవరు...?‌ దొంగలెవరు...?

 37. మణిపూర్" 

       మారణకాండకు బాధ్యులెవరు

38. సమయం రావాలి..!

       సహనం కావాలి..!

39. వాడొక భయస్తుడు..! బద్దకస్తుడు..!

40. బోసినవ్వుల బాపూజీకి 

      వందనం..! అభివందనం..!!

41.  కొత్త జంట 

42. భూగోళం మండే ఓ అగ్నిగోళం..!

43. టమోటాల" విశ్వరూపం...?

44. ఎన్నెన్నో జన్మల బంధం..? 

45. ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?

46. పంచభూతాల సాక్షిగా పతనం..?

47. వందేమాతర గీతం...

48. వందేమాతరమంటే...?

49. ఏమన్నది..? ఏమన్నది..? 

      నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..? 

50. శ్రమ..?

51. చిత్ర కవిత... 

52. వానర వీరుల విజయం...

53. బంధాలు కలవాలంటే..?

      కలకాలం నిలవాలంటే..?

54. ఎక్కడ స్వర్గం? ఎక్కడ నరకం ?

55. పాటే తూటాగా..!మాటే మంత్రంగా..!!

56. అన్న..! పాట ఆగి పోయె...!

      అన్న..! గొంతు మూగబోయె...!!

57. గగనానికి కేగిన యుద్ధనౌక గద్దర్...

58. ప్రాణం కన్నా మానమే మిన్న 

59. పాపం ప్రీతి...రాబందుల చెరలో

60. గుండెగుడిలో వెలిగే

       విప్లవజ్యోతి గద్దరన్న..! 

61.  చూసి సుఖించు...! తాకి తరించు..!!

62. చివరికి ఎవరికి లాభం?

63. పెద్దలమాట...సద్దిమూట

64 . దక్షిణధృవంపై... 

        భారత్ విజయ కేతనం... 

65. అఖండ భారతం...అంతరిక్ష విజయం 

66. విక్రమ్ ల్యాండర్ విజయగాథ!

67. జయహో..! జయహో..!!

      చంద్రయాన్ 3... జయహో..!!!

68. "హంస"లా హాయిగా జీవించు..!

69. ఖరీదైన (రెండులక్షల) త్యాగం..!

70. ఎవరైతే...

71. ఓ అమ్మ...ఓ బ్రహ్మ...ఓ బొమ్మ..!

72. విదేశీయానం ఒక వరమె..?


1. శత్రువు...ఒక్కరు చాలు..!


అమ్మా...

నాన్నలిద్దరు చాలు... 

నీకు జన్మనిచ్చేందుకు...


ఆ పరమాత్మ... 

ఒక్కడు చాలు... 

నీకు ప్రాణం పోసేందుకు... 


కొడుకు... 

ఒక్కడు చాలు...

రేపు నీకు కొరివి పెట్టేందుకు...


స్నేహితులు... 

నలుగురు చాలు... 

రేపు నీ పార్థివదేహం మోసేందుకు... 


శత్రువు... 

ఒక్కరు చాలు... 

నీలోని లోపాలను ఎత్తిచూపేందుకు... 


ఔను సంబంధాలెన్ని చూసినా...

అమ్మాయిలనెందర్ని ప్రేమించనా...

కడకు కళ్యాణం జరిగేది ఒక్కరితోనే...


2. ఆ రెండడుగులు..?


ఓ నా ప్రియమిత్రమా !

చెబుతా వినుమా ఒక నిజం 

నీకు అర్థం కాని నిండు నిజం

ఎవరూ కాదనలేని పచ్చినిజం 


నిన్న నీవు "ఒంటరిగా" నడిచావు

నడుస్తూ నడుస్తూ పడిపోయావు

పాపం కిందపడి లేవలేకపోయావు

అది నిజమే కదా ...ఔను నిజమే... 


కానీ నేడు నీవు పడి పైకి లేచావు

ఓ "అదృశ్యశక్తి తన అభయహస్తం" 

అందించి లేపిందని నీకు తెలియదు

కానీ ఇదెవరూ కాదనలేని పచ్చినిజం 


నిన్న నీవు నీ జీవితపు 

"ఇసుక ఎడారిలో" నడిచావు 

నీకు తోడుగా ఓ "అదృశ్యశక్తి" నడిచింది  

నిన్న నీవు "నాలుగడుగులు" చూశావు 


కానీ నేడు "రెండడుగులే" చూస్తున్నావు 

"మరో రెండడుగులు"మాయమైనవని... 

నీకెవరు తోడులేరని...

నీవు ఒంటరివాడవని... 

నిరాశతో కృంగిపోతున్నావు... 

ఇది నిజమే కదా ...ఔను నిజమే... 


కానీ నీ కళ్ళకు కనిపించే 

"ఆ రెండడుగులు" నీవు కావని... 

నిన్ను భుజాలపైకెత్తుకొని నడుస్తున్న 

ఒక "అదృశ్యశక్తివని" నీకు తెలియదు...

ఔను ఇదెవరూ కాదనలేని పచ్చినిజం ...


3. రామబాణంలా...దూసుకుపోవాలి..!


రామబాణంలా...

దూసుకు పోవాలి... 

దూసుకు పోవాలి... 

ఎక్కడికి..? ఎక్కడికి..?

అగాధంలోకి కాదు 

అభివృద్ధి శిఖరం వైపుకు...


రామబాణంలా...

దూసుకు పోవాలి...

దూసుకు పోవాలి... 

ఎక్కడికి..? ఎక్కడికి..?

రామరాజ్యమంటూ...

రావణ రాజ్యమేలే 

రాక్షసుల వైపుకు...పదికాదు...

పాతిక తలల రావణాసురుల వైపుకు...


రామబాణంలా...

దూసుకు పోవాలి... 

దూసుకు పోవాలి... 

ఎక్కడికి..? ఎక్కడికి..?

పరమటి కొండల్లోకి కాదు..!

సూర్యుడు కనిపించే వైపుకు...

సుప్రభాతం వినిపించే వైపుకు... 

వెలుగులు విరజిమ్మే తూర్పువైపుకు...

అభ్యుదయపు ఆకాశపుఅంచులదాకా...


4. ఆ ముగ్గురిలో మీరెవ్వరు..?


నిత్యం ఈ సమాజంలో 

ముగ్గురు మనుషులు 

మనకు తారసపడతారు


ఒకరు...

ఎవరికే ఇబ్బంది వచ్చినా 

స్పందించేవారు 

స్వచ్చందంగా తమ వంతు 

సహాయాన్ని తక్షణమే 

అందించేవారు...వారే ఉత్తములు...


కొందరు...

కోటీశ్వరులైనా

పిల్లికి కూడా బిక్షం పెట్టక

తాలి కట్టిన ఆలికి 

కడుపున పుట్టిన బిడ్డలకు 

బుట్టువులకు పెట్టి 

రహస్యంగా లెక్కలు వ్రాసుకునే

పరమ పిసనారులు...వారే అధములు


మరికొందరు...

తమ రెండు హస్తాలకు తోడుగా 

ఆదుకునే తత్వమున్న 

కొన్ని వందల 

అమృత...ఆపన్న...

అభయ...హస్తాలను జతచేసి ఎన్నో 

ప్రజాహిత సామాజిక కార్యక్రమాలను 

నిర్వహిస్తూ...నిరుపేదల...

ఆశలను...ఆకలిని...

అవసరాలను తీర్చే... 

వారే మహాత్ములు...మహనీయులు...

వారే ధన్యజీవులు...పుణ్యమూర్తులు...

వారే సహృదయులు...సంస్కారవంతులు...


5. ఆ దేవదేవుడు 


నిన్ను 

ఆటలో 

ఓడిపోనివ్వడు

 

నీటిలో 

మునిగి పోనివ్వడు 

 

చెట్టులా 

ఒరిగి పోనివ్వడు 


భయపడకు 

నిన్ను క్రింద పడనివ్వడు 


పడినా పైకిలేచే 

శక్తిని నీకు ప్రసాదిస్తాడు 


6. నమ్మక ద్రోహులు...


వీరు కొనరు

ఒకరిని కొననివ్వరు...

వీరు తినరు

ఒకరిని తిననివ్వరు...


ఒకరు పచ్చగా

వుండడం వీరికి నచ్చదు...

ఒకరు బాగుపడితే

వీరు తెగ బాధపడిపోతారు...


ఒకరు పైకి వెళ్తుంటే

వీరికి కడుపులో మంట

వారే...అసూయాపరులు...

వారే...అభివృద్ధి నిరోధకులు...


వారు మీ ప్రక్కనే

నక్కలా నక్కినక్కివుంటారు...

ప్రక్కలో బల్లెంలా

కంటిలో కారంలా వుంటారు...


వారు చిన్న చిన్న

ఇబ్బందుల్లో ఆదుకుంటారు...

ఆ తర్వాత అనేక

ఇబ్బందులకు గురిచేస్తారు...


వారు

నటిస్తూ వుంటారు...

నవ్వుతూ వుంటారు...

నమ్మకంగా వుంటారు...

తియ్యగా మాట్లాడుతుంటారు...


వెనుక లోతుగా గోతులు 

త్రవ్వుతూ వుంటారు...

వారు మీ వెంటే వుంటారు...

మీ చుట్టే వుంటారు అట్టి వారిని

ఓ కంట కనిపెట్టకున్న గట్టి ప్రమాదమే.!


నక్కను నమ్మవచ్చు...

కుక్కనూ నమ్మవచ్చు....

కానీ కుక్క కడుపున పుట్టిన

నక్కను మాత్రం నమ్మరాదు...జాగ్రత్త..!

వాటి "తోకలే" కాదు "బుద్దులూ వంకరే

కారణం అవి సంకరజాతి జంతువులు 


7. గుడిలో దైవం గ్రుడ్డివాడా..?


కాదు కాదు 

నీవు నీ శరీరమిక్కడే

నీ మనసెక్కడో సప్తసముద్రాల ఆవల

అంతరిక్షంలో తిరుగాడి వస్తుంది

దైవం గుడిలోనే...గర్భగుడిలోనే 

విగ్రహమై ఉన్నాడు నీ నిగ్రహం కోసమే


కానీ దైవం సర్వాంతర్యామి... 

కనిపించని మలయ మారుతంలా

క్షణమిక్కడ మరుక్షణంలో మరెక్కడో

అదృశ్యంగా ఈ 

అనంత విశ్వంలో అంతటా తానే...


ఔను మనిషిలా దైవం నిద్రించడు

నిత్యం మేల్కొనే ఉంటాడు 

భక్తుల కన్నీటి ప్రార్థనలను

ఎప్పుడు ఆలకిస్తూనే ఉంటాడు 


ఓ పర్యాటకుడిలా

ప్రపంచమంతా పయణిస్తూనే 

ఉంటాడు కళ్ళకు కనిపించక   


రెప్పవాల్చక ఆ పరమాత్మ

ఈ లోకమంతా వీక్షిస్తూనే ఉంటాడు 

నిన్నునన్ను నిత్యం పరీక్షిస్తూనే ఉంటాడు


ఏమీ తినడు ఏమీ త్రాగడు

భక్తుల భజనలు 

ఆశలు ఆక్రందనలు వింటుంటే

ఆ పరమాత్మకు 

ఆకలిండదు దాహముండదు


ఆయనెప్పుడూ మౌనవ్రతమే

కానీ కురిపిస్తాడు వరాలవర్షమే


మనిషికి తెలుసు తినడమే

ఆ పరమాత్మకు తెలుసు

కళ్ళు మూసుకొని కనడమే  

చెవులు మూసుకొని వినడమే 


నరుడు భక్తిపరుడు యుక్తిపరుడు

ఆ పరమాత్మ శక్తిస్వరూపుడు ముక్తిప్రదాత


8. ఎన్నో ప్రశ్నలు ఇక్కడ..!

‌    సమాధానాలు ఎక్కడ..?


భూమ్యాకాశాలను...సముద్రాలను...

సూర్యచంద్ర...నక్షత్రాలను...సృష్టించిన

ఆ దైవం సృష్టికి ముందెక్కడుండేవాడో..?


నిజంగా దేవుడు నిరాకారుడేనా?

ఆయన నిజమైన నివాసమెక్కడ..?

రూపమేలేని దైవానికి ఇన్ని పేర్లెక్కడివి..?


అసలు భగవంతుని భాషేమిటి..?

ప్రపంచంలో భాషలన్నీ 

భగవంతుడికి వచ్చా..? మనం మాట్లాడే భాష ఆ భగవంతుడికి అర్థమౌతుందా..? ఎలా వినిపిస్తుంది..? ఆధారాలేమిటి..?


సృష్టి జరిగిన తర్వాత ఏ ఒక్క 

భక్తుడికైనా దైవదర్శనం జరిగిందా..?


దైవంతో ముఖాముఖిగా లేదా

అదృశ్యంగానైనా సంభాషించిన 

వారెవరైనా వున్నారా..?


సృష్టిలో మొట్టమొదట జన్మించిన మొట్టమొదట మరణించిన మనిషి 

ఎవరు..?ఎప్పుడు..?ఎక్కడ..?ఎలా..?


సృష్టిలే మరోజన్మ మనుషులకేనా..? 

జంతువులకు పశుపక్ష్యాదులకు లేదా..?


మూగజంతువులకు...జలచరాలకు

పశుక్ష్యాదులకు దేవుడెవరు..?


మూగజంతువులు మనతో...మనం 

మూగజీవులతో మాట్లాడేదెప్పుడు..?


కనిపించని గాలి మన 

కళ్ళకు కనిపించేదెప్పుడు..?


స్వర్గ నరకాలెక్కడున్నాయి..? 

సృష్టిలో వాటిని కళ్ళతో చూసిందెవరు..?


ఈ జనన మరణాలకంతమెప్పుడు..?


వ్యక్తి...శక్తి...భక్తి...ముక్తి... 

ఈ పదాల అంతరార్థమేమిటి..?


మన కళ్ళముందే ఏనాడో కట్టిన

ఖరీదైన ఒక ఇంద్రభవనం వుంది...

మరి దాన్ని కట్టినవాడు... 

దానికి డబ్బులు పెట్టినవాడు... 

ఉన్నారన్నది పచ్చినిజమైతే...?


ఈ అవంతమైన ఈ అద్బుతమైన 

ఈ అఖండమైన సృష్టి పుట్టుకకు సైతం 

ఒక వ్యక్తికాని ఒక శక్తికాని వుండివుండాలే..?


అన్నింటికి సమాధానం ఒక్కటే...

నమ్మకం..! నమ్మకం..!! నమ్మకం..!!


9. కృతజ్ఞతా కుసుమాంజలి..!


కొందరు...కవితలను 

రోజువారీ వార్తలుగా 

"ప్రచురిస్తున్నారు"... 


కొందరు...కవితలను 

కొత్త పెళ్ళికూతురులా...

"ముద్దుగా ముచ్చటగా" 

"ముస్తాబు" చేస్తున్నారు... 


కొందరు... కవితలను 

అందంగా...అద్భుతంగా 

ఆకర్షణీయంగా...అజంతా"

"శిల్పంలా" చెక్కుతున్నారు... 


కొందరు...కవుల

కమనీయమైన కవితలకు

రమణీయమైన రంగులద్ది...

ఎంతో శ్రమకోర్చి... ఎంతో శ్రద్ధతో 

కవితలను తీర్చి దిద్దుతున్నారు

కనువిందుగా...పసందుగా...

డీసెంట్ గా డిజైన్ చేస్తున్నారు... 


చూడగానే చదవాలపించేలా...

చదివి పదికాలాలపాటు

భద్రంగా దాచుకునేలా...

కవితలకు "ప్రాణం" పోస్తున్నారు ... 


అందుకే... 

సహృదయులైన అట్టి

సంపాదక శిఖామణులకు 

వారి డిజైనర్ లకు...

చేతులు జోడించి... 

శిరసువంచి నమస్కరిస్తూ.... 

వేలవేల ధన్యవాదాలు 

కోటి కృతజ్ఞతలు...

శత సహస్ర ప్రణామాలు 

తెలియ జేస్తున్న...


10. నిద్రరాక నిట్టూర్చేదెవరు..?


జీవితంలో

హాయిగా తృప్తిగా

నిద్రించేదెవరు..?


తినేది....దొరికినవారు...

తిన్నది...అరిగినవారు...

వారెంతో అదృష్టవంతులు 


రాత్రుల్లో నిద్రరాక నిట్టూర్చేదెవరు..?

పెనువిషాదంలో మునిగితేలేదెవరు..?


విచ్చలవిడిగా...తిరిగినవారు... 

విలాసాలకు.....మరిగినవారు... 


తల్లిదండ్రులంటే...

అనురాగం ఆప్యాయత...


భగవంతుడంటే...భయము భక్తి...  

గురువంటే...వినయ విధేయతలు ...


పెద్దలంటే...

గౌరవం...మర్యాద లేక...

క్రమశిక్షణ లేక ...

అమాయకంగా...పెరిగినవారు

అజ్ఞానంతో...

అహంకారంతో...ఎదిగినవారు


వారే దురదృష్టవంతులు...

వారే దుష్టులు..దుర్మార్గులు... 

వారే ఈ సమాజానికి పట్టిన...చీడపురుగులు...


11. వాస్తవాల వక్రీకరణ...?


ఎన్నో 

దశాబ్దాలుగా

శతాబ్దాలుగా   

దండయాత్రలు చేసి 

ఎన్నో సామ్రాజ్యాలను

ఆక్రమించిన చక్రవర్తులు... 


రాజ్య కాంక్షతో 

రగిలిన నియంతలు... 

నిరంకుశ వాదులు... 

నాయకులు నవాబులు...

ఈ భారతదేశాన్ని 

పరిపాలించిన బడానేతలు...


సత్యాలనెన్నింటినో 

సమాధి చేశారు... 

పచ్చినిజాలను...

పాతాళంలో పాతిపెట్టారు...

నిప్పులాంటి నిజాలను... 

కాలగర్భంలో కలిపేశారు...


మనదేశ సంపదను 

దోచుని తమదేశాలకు

తరలించుకు పోయిన దొంగలు 

మన పండితులు మేధావులు లిఖించి 

నిక్షిప్తం చేసిన పురాతన బృహత్ గ్రంథాలను

చీకటి గదుల్లో శాశ్వతంగా బంధించారు...

ఘనమైన మన చరిత్రను వక్రీకరించారు...


ఇప్పుడు మనం "త్రవ్వి" తీసేదేముంది?

"ఆనవాలు దొరకని అవశేషాలను" తప్ప...


12. నమ్మకం 


రక్షకుడని 

అభిషక్తుడని

రాజులకు రాజని

ప్రభువులకు ప్రభువని


దేవదేవుడని

దైవకుమారుడని

ప్రేమామయుడని

దయామయుడని 

కృపా కరుణాసాగరుడని 

వేనోళ్ళ కొనియాడి


తన 

పవిత్రరక్తాన్ని 

చిందించిన ఆ 

మరియ సుతుడే 

పాపుల రక్షణకోసం 

శిలువపై మరణించి

మూడవదినమున

మృత్యుంజయుడైన

మనుష్య కుమారుడని

మహిమాస్వరూపుడని

నిత్యం విశ్వసించి  

భక్తితో ప్రార్ధించినచో

తన కుడి చేతిని ఎత్తి 

కృపావరాలను 

మీపై కుమ్మరిస్తాడు


కానీ...

పాపపు కూపంలో

కూపస్థమండూకంలా 

మీరు కూరుకుపోతే

తన ఎడమ చేతిని ఎత్తి 

మిమ్మల్ని శపిస్తాడు 

అధఃపాతాళానికి 

మిమ్మల్ని త్రోసేస్తాడు 

జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త 


13. కొందరు భక్తులు 


వ్రాసిన పరీక్ష పాసై

మంచి ర్యాంకు 

వచ్చినందుకు 

కోరుకున్న ఉద్యోగం 

వచ్చినందుకు

నచ్చిన సంబంధం

కుదిరినందుకు

ఆపరేషన్ సక్సెస్

ఐనందుకు

పాపనో బాబునో

పుట్టినందుకు

వ్యాపారంలో

ఊహించని లాభాలు

ఆర్జించినందుకు

ఖరీదైన కారు 

కొన్నందుకు 

కోవెలలో 

కొబ్బరికాయలు 

కొట్టేదెందుకు...?

కోరిక కోరికలు 

తీరినందుకు 

మొక్కుబడులు

చెల్లించేందుకు... 


తమ కష్టాల బాధల 

తలలు పగిలిపోవాలని 

ప్రశాంతత మిగలాలని 

ఆ దేవునికి మొక్కేదెందుకు 

సకల శుభములు కలగాలని 

సుఖశాంతులు దక్కాలని 


14. జ్ఞానదేవత డాక్టర్ సాకే 

      భారతికి అక్షరాభిషేకం...


డాక్టర్ సాకె భారతి...

ఎరుకల కులంలో పుడితేనేమి...?

ఆమె‌ ఎవరెస్టు శిఖరం ఎక్కింది...!

ఆమెకు పి హెచ్ డి పట్టా దక్కింది..!


తినడానికి తిండి...

కట్టుకోవడానికి బట్టలు...

కాలికి చెప్పులు... 

కప్పుకోవడానికి దుప్పటి...

పడుకోవడానికి మంచం...

ఉండడానికి ఇల్లేలేని...

ఒక బిడ్డకు తల్లిగా... 

ఒక దినసరి కూలీగా... 

ఎర్రని ఎండలో...జోరు వానలో 

8 కి.మీ కాలినడకన వెళ్లి...


పదవ తరగతి...ఇంటర్మీడియట్

డిగ్రీ...పీజీ...ఏడు సంవత్సరాలు

కసితో కృషితో గట్టిపట్టుదలతో చదివి...

గైడ్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ పర్యవేక్షణలో...

అతి క్లిష్టమైన రసాయనశాస్త్రంలో

"ది స్టడీ ఆఫ్ బైనరీ లిక్విడ్ మిక్చర్స్"అను

అంశంపై పరిశోధన పత్రాలు సమర్పించి

శ్రీ కృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయంలో

గవర్నర్ చేతులమీదుగా... 

ఒక "పి హెచ్ డి" పట్టాను 

అందుకోవడానికి...ముందు 


ఆమె ఎన్ని నిద్రలేని 

రాత్రుల్ని గడిపిందో...

ఎన్ని కన్నీళ్ళను 

దిగమింగిందో...

ఎన్ని అవమానాలు....

ఎన్ని అష్టకష్టాలు పడిందో...

ఎన్ని బాధలు భరించిందో...

ఎందరు ఎంతగా 

ఎగతాళి చేశారో ...

మానసికంగా ఆమెను 

ఎంతగా వేధించారో... 

మన ఊహలకు అందదు... 


ఒక ముతక చీర కట్టుకొని...

పారగాన్ చెప్పులు తొడుక్కుని...

ముఖానికి పౌడరైనా రాసుకోకుండా...

మహా మేధావులున్న వేదిక నెక్కి 

గవర్నర్ చేతులమీదుగా... 

అతి క్లిష్టమైన రసాయనశాస్త్రంలో

"డాక్టరేట్ పట్టాను" పొందిన 

ఆ శ్రమజీవికి...ఆ జ్ఞాన సరస్వతికి... 

ఆ సావిత్రి భాయి పూలేె వారసురాలికి...

ఆ చదువులతల్లికి అక్షరాభిషేకం చేయడం 

మన తెలుగు జాతికి గర్వకారణం... 

ఆమె జీవితం ఎందరికో స్పూర్తిదాయకం... 


15. టక్కరి టమోటా 


వరదొస్తే గోదారి

నీటిమట్టం పెరుగుతుంది

ఆపై క్రమేపీ తరుగుతుంది


ఆకాశంలో అందమైన నెలవంక 

అమావాస్యనాడు తరుగుతుంది

పున్నమి నాడు పెరుగుతుంది 


తారాజువ్వలా...

రివ్వుమని రాకెట్ లా... 

నింగి కెగిరిన టమోటా ధరలు 

అక్కడే చక్కర్లు కొడుతున్నాయి 


నిన్న నిగనిగలాడుతూ 

ముద్దొచ్చిన టమోటా

నేడు "నిప్పుకణికలా" 

ఎర్రగా మారిపోయింది 

భగభగమని మండిపోతోంది


పంటకు మార్కెట్లో  

గిట్టుబాటు ధరలేక 

రైతులు కొందరు 

గిలగిల లాడుతుంటే...


కొనలేక తినలేక

మధ్యతరగతి ప్రజలు 

విలవిల లాడుతుంటే...


వంటగదిలో వనితలు 

కంటతడి పెడుతుంటే...


నేడు టమోటా పంటను 

నమ్మిన అమ్మిన రైతులు

కొందరు రాత్రికిరాత్రే 

లక్షాధికారులౌతున్నారు...

కొందరు కోటీశ్వరులౌతున్నారు...

ఔరా ఇదేమి చోద్యమో ఇదేమి వింతో

ఎంతకూ ఈ మనిషికీ అర్థం కాకున్నది...


16. సాకే భారతికి 

      వందనం..!అభివందనం..!


ఆకలి...

కష్టపడడం 

అలవాటు 

చేస్తుంది. 


ఆలోచన.... 

బతకడం 

నేర్పిస్తుంది. 


ఆశయం... 

జీవితాన్ని 

విజయపథాన 

నడిపిస్తుంది. 


పేదరికం...

లక్ష్యసాధనకు 

అడ్డుకాదని 

రుజువు చేసింది

పీహెచ్‌డీ సాధించిన

డాక్టర్ సాకే భారతి...

 

కష్టేఫలి... 

శ్రమయేవ జయతే...

నినాదాలకు నిలువెత్తు 

నిదర్శనంగా నిలిచింది...

పేదరికాన్ని గెలిచింది...


17. భారతి జీవితాశయం...


ప్రొఫెసర్ శుభ నేతృత్వంలో 

కెమిస్ట్రీలో ‘‘ఎ స్టడీ ఆఫ్ బైనరీ లిక్విడ్ మిక్చర్స్’’ లో పీహెచ్‌డీ  పట్టా పొందిన 

డాక్టర్ భారతి కనేకల ప్రొఫెసర్ కావాలని...


‘‘నాకు ప్రొఫెసర్‌గా ఉద్యోగం వస్తే మా పాపను మా లాంటి పేదలకు ఎవరికైనా అనారోగ్యం చేస్తే, చికిత్స అందించేలా డాక్టరును చేయాలని అనుకుంటున్నా. 

మా వాళ్లు కూడా డబ్బులు లేక, డాక్టరుకు చూపించుకునే స్థోమత లేక చనిపోయారు


డబ్బు ఉంటే నేనే డాక్టర్ చదివేదాన్ని, కానీ ఏదో ఒకటి చదువుకుంటే రాణించవచ్చు 


18. భారతి సందేశం ....


ఆడపిల్లలను ఎవరూ తక్కువచేయవద్దు

‘‘ఆడపిల్లలు పుట్టారని హీనంగా చూడక తల్లిదండ్రులు వాళ్లను చక్కగా చదివించాలి. చిన్నప్పుడే పెళ్లి చేయకండి. 

వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడిన తర్వాతే చేయండి. 

ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పినట్లు చదువుపై దృష్టి పెట్టి శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ 


జననం...

అనంతపురం జిల్లా 

గుత్తి మండలం 

సూరసింగనపల్లిలో...


కుటుంబం...

తండ్రి...తిమ్మప్ప

భర్త... శివప్రసాద్

కూతురు: గాయత్రీ 


విద్యాభ్యాసం...

ఒకటి నుంచి ఐదవ వరకు 

తాత సుంకన్న ఊరైన 

శింగనమల మండలం  

నాగులగూడెం గ్రామంలోని 

ప్రాథమిక పాఠశాలలో...


ఆరు నుంచి పది వరకు 

శింగనమల మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో... 


ఇంటర్మీడియట్‌...

పామిడి ప్రభుత్వ 

జూనియర్‌ కళాశాలలో...   


డిగ్రీ...పీజీ...

అనంతపురం 

ఎస్‌ ఎస్‌ బి ఎన్‌ కళాశాలలో...


కెమిస్ట్రీలో పిహెచ్‌డి పట్టా...

అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో... 


ప్రొఫెసర్ డా.శుభ నేతృత్వంలో 

"బైనరీ మిక్సర్ "అనే అంశంపైన 

పరిశోధనా పత్ర సమర్పణ... 


19. అవకాశాలు...


కాళ్ళ దగ్గరకు వచ్చినా 

అందుకోలేని వారు కొందరు

అవకాశాలు లేని చోట కూడా 

అవకాశాలను సృష్టించేవారు కొందరు 


సంకల్పబలంతో... 

అడ్డంకులను అనుమానాలను

అవమానాలను దిగమింగుతూ 

అనుకున్నది లక్ష్యాన్ని సాధిస్తారు కొందరు


ఈ ప్రపంచంలో 

విజ్ఞానమే ఒక వరంగా...  

అక్షరమే బలమైన ఆయుధంగా...

అద్భుతాలను సృష్టిస్తారు మరికొందరూ


అక్షరాలతో కఠిన హృదయాలను 

క్రూరమైన మనసులను కరిగించవచ్చు

పేదరికం ఆకలి నిత్యం వేధిస్తున్నా 

మొక్కవోని ధైర్యంతో శ్రద్ధతో 

ఓపికతో ఓర్పుతో 

అసమానతలతో నిండిన 

ఈ సిగ్గులేని సమాజానికి నిగ్గదీసి అడగుతారు...కడుగుతారు ఇంకొందరు 


20. చదువుల తల్లి డాక్టర్ సాలే భారతి..!


అనంతపురం జిల్లాలో... 

సింగనమల మండలంలో...

నాగులగూడెం పల్లే

మారుమూల పచ్చని పల్లె...

విరిసిందొక  ఒక మరుమల్లె...

ఆమే వెలుగులు విరజిమ్మే... 

అక్షర దీపం...డాక్టర్ సాలే భారతి..!


ఊరిచివర పూరిగుడిశెలో...

గుడ్డిదీపం వెలుగులో...

రాత్రింబవళ్ళు కసితో 

కృషితో పట్టుదలతో చదివి 

పీహెచ్ డీ పట్టా అందుకొన్న 

అక్షర‌జ్యోతి సావిత్రి భాయి పూలేె

వారసురాలు డాక్టర్ సాలే భారతి..!


చదువు ఎవరి సొత్తు కాదని...

ఆటంకాలను అధిగమిస్తే 

అనుకున్నది సాధించవచ్చని 

ప్రపంచానికి చాటి చెప్పిన

చదువులతల్లి డాక్టర్ సాలే భారతి..!

జయహో జయహో సాలే భారతి జయహో 

 

21. బంగారు తల్లి భారతీ..!


ప్రతి మగాడి విజయం వెనుక

ఒక మహిళ తప్పక ఉంటుంది 

అంటారు మన పెద్దలు అనుభవగ్నులు 


కానీ నిన్న సీన్ రివర్స్...

పూరి గుడిసెలో‌ పుట్టిన పులిబిడ్డ 

మన చదువుల తల్లి డాక్టర్ సాలే భారతి...

ఆమె ధైర్యం పులి ధైర్యం

ఆమె సహనం భూదేవి అంత

ఆమె ఆశయం ఎవరెస్టు అంత


పచ్చగడ్డి తెస్తూ రోజు 

పశువులను మేపుకుంటూ

పొలంలో కూలీ పనులకెళ్తూ

పచ్చడి మెతుకులు తింటూ  

అవి దొరకనినాడు పస్తులుంటూ

ఆకలికి తాళలేక కొన్ని రాతృలు

కన్నీళ్ళతో కడుపు నింపుకుంటూ

రేయింబవళ్ళు రెక్కల్ ముక్కల్ చేస్తూ

ఏ వసతులు లేని పచ్చి పల్లెటూరిలో

అతి సాదాసీదాగా... 

ఎవరినుండి ఏ సహాయం

ఆసించక అర్థించక ఆత్మ గౌరవంతో

కొండంత ఆత్మ విశ్వాసంతో 

నిరుపేద బ్రతుకు బ్రతుకే

భార్య సాలే భారతిని

అతి క్లిష్టమైన 

రసాయన శాస్త్రంలో (కెమిస్ట్రీ)

ఏడేళ్ళు చదివించిన

భర్త శివప్రసాద్

కృషి కసి పట్టదల త్యాగం 

భార్య పై ఉన్న గట్టి నమ్మకం 

కురిపించిన ప్రేమ వెలకట్టలేనిది


తన భార్య 

ఒక బిడ్డకు తల్లి 

గవర్నర్ చేతులమీదుగా

శ్రీకృష్ణ దేవరాయల 

విశ్వవిద్యాలయంలో 

గైడ్ శోభ గారి పర్యవేక్షణలో

పీ హెచ్ డి పట్టా పుచ్చుకునేందుకు...

చిరిగిన చేనేత చీర కట్టుకుని

కాళ్ళకు పారగాన్ చెప్పులు తొడుక్కుని

"స్టేజీ ఎక్కింది" కాదు కాదు 

ఆమె "ఎవరెస్టు శిఖరం" ఎక్కింది

ఆమెకు "పి హెచ్ డి పట్టా" దక్కింది 

అప్పుడు ఆ వేదిక కరతాళ 

ధ్వనులతో మారుమ్రోగిపోయింది

శ్రమయేవ జయతే కష్టే ఫలి

అన్న నినాదాలను ప్రతిరూపం

మన చదువుల తల్లి డాక్టర్ సాలే భారతి...


రేషన్ బియ్యపూ గంజి.....బ్రేక్ ఫాస్ట్

కారం మెతుకులు...మధ్యాహ్నం లంచ్ 


కూలీనాలీ చేసుకుంటూ చ‌దువుకున్నా.. ఇప్పుడు గ‌ర్వంగా పీహెచ్‌డీ సాధించిన. 

ఈ చ‌దువుల త‌ల్లికి స‌లాం కొట్టాల్సిందే...

    

ఆమె..మ‌ట్టిలో మాణిక్యం 

కూలీ ప‌నికి వెళ్తే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి. ఆర్థిక స‌మ‌స్య‌లెన్నున్నా అడుగు ముందుకే


పదవ తరగతిలో పెళ్లి త‌ర్వాత త‌ల్లి 

ఐనా చేయ‌లేదు చ‌దువును నిర్ల‌క్ష్యం

పీహెచ్‌డీ పట్టాయే దానికి ప్రత్యక్షసాక్ష్యం 

ఇప్పుడ కూలీ భార‌తి కాదు...డాక్ట‌ర్ భార‌తి


లక్ష్యసాధనకు 

అడ్డంకి కాదు పేదరికం...

28 కి.మీ. దూరంలో కాలేజీ 

ఆటోకి డబ్బు లేక

ఎనిమిది కిలోమీటర్లు...నడక

20 కి. మీ బస్ ప్రయాణం


భారతి ప్ర‌తిభ‌ను చూసిన  

పీహెచ్‌డీ చేయాల‌ని టీచర్ల సలహా  

ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర 

‘బైనరీ మిక్చర్స్‌’ అంశంపై పరిశోధన 


దినసరి కూలీగా... 

ఎండనకా, వాననకా చెమటోడ్చింది.

ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో... రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించింది. 

 

స్నాతకోత్సవంలో.... 

పీహెచ్‌డీ పట్టాను అందుకునేందుకు 

పారగాన్‌ చెప్పులతో...సాదాచీరలో 

వచ్చిన భారతి ఆహార్యం 

వేదికకొక కొత్త వెలుగును తెచ్చింది 


పేదరికం లక్ష్యసాధనకు 

పేదరికంఅడ్డంకి కాదని 

రుజువు చేస్తూ నడిచొచ్చిన

ఆ చదువుల సరస్వతిని చూసి 

అతిథులంతా ఆశ్చర్యచకితులైపోయారు


22. సినారె...ఎవరిని 

       అడిగితే నేనేమని చెప్పేది?


బహుముఖ ప్రజ్ఞాశాలి... 

తెలుగు సాహితీ క్షేత్రంలో 

అలసిపోని తోటమాలి 

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత...

 

విశ్వకవి రవీంద్రుడు 

విశ్వనాథ సత్యనారాయణ 

వివేకానందుని విశిష్ట లక్షణాల

విశాలమైన అభ్యుదయ భావాల 

అలుపెరుగని సాహితీ కృషీవలుడు...

సినారే...ఎవరని అడిగితే నేనేమని చెప్పేది.


సినీ గేయకవి సినారె

భావ గాంభీర్యం...

శబ్ద మాధుర్యం అమోఘం... 

వారు వ్రాసిన ప్రతిపాట ఓ పంచామృతం...


తెలుగు భాషా వికాసానికి 

సాహిత్యంలోని అనేక ప్రక్రియలో

రచనలు చేసి రాణించి..

నన్ను దోచుకుందువటే 

వన్నెల దొరసాని...అంటూ 

గులేబకావళి చిత్రంలో

శ్రీకారం చుట్టి 3500 గీతాలు వ్రాసి

సినీ జగత్తులో సంచలనం సృష్టించి 

ప్రేక్షకుల హృదయాలను దోచిన...

సినారే...ఎవరిని అడిగితే నేనేమని చెప్పేది?


మట్టిలో మాణిక్యం...

పల్లెలో పుట్టి 

పరిమళించిన 

పారిజాత పుష్పం...

తెలుగు తల్లి మెడలో 

మెరిసే ముత్యాల హారం...


అద్భుతమైన 

అపురూపమైన 

అద్వితీయమైన

85 బృహత్ గ్రంథాలను 

ఆవిష్కరించిన అక్షర శిల్పి...

సినారె...ఎవరిని అడిగితే నేనేమని చెప్పేది?

 

నాడు ఆంధ్రరాష్ట్రంలో 

అనేకమైన ఉన్నత 

పదవులను నిర్వహించి 

ఆ పదవులకే వన్నె తెచ్చిన 

అనేక విశ్వవిద్యాలయాల 

డాక్టరేట్లు ప్రతిష్టాత్మకమైన 

పద్మశ్రీ ...పద్మభూషణ్ 

అవార్డులు పురస్కారాలు సినారేను 

వరించాయి...వరించి....తరించాయి 


యుగోస్లేవియాలో జరిగిన 

ప్రపంచ కవి సమ్మేళనంలో 

పాల్గొన్న విశ్వనరుడు 

విశ్వకవి విశ్వంభరుడు  

సినారె...ఎవరని అడిగితే నేనేమని చెప్పేది.


సినారె ఎవరంటే...?

సినారె ఒక గొప్ప వక్త... 

సినారే ఒక సాహితీ ప్రవక్త... 

సినారే ఒక రవి కిరణం... 

సినారె ఒక సాహితీ శిఖరం... 

సినారె ఎవరంటే...?

సినారే "మరణం లేని ఒక మహాకవి"..!


23. ఓటమి వెనుకనే విజయం...?


ఓటమి అంటే..? 

ఒక తీర్పు కాదు... 

ఓటమినెప్పుడూ 

ఒప్పుకోవద్దు... 


ఓటమి అంటే..?

ఒక ఓర్పు... 

ఒక నేర్పు...

ఒక మార్పు...


కాలం...

మంచులా కరిగిపోతుంది

క్షణక్షణం... 

ఆయుష్షు తిరిగి పోతుంది 


వీరులను... 

విజేతలను తప్ప...

పిరికిపందలనెప్పుడూ

విజయం విందుకు పిలువదు...

విజయమెవరికీ  బంధువు కాదు...

మూర్ఖుడికెప్పుడు ముక్తి లభించదు... 


24. మృత్యువుతో ముద్దూ ముచ్చట...


మృత్యువునెప్పుడూ 

ముద్దు పెట్టుకోకు 

అది ఎంత అందమైనదైనా... 

అందాలు చెందే 

అతిలోకసుందరియైనా...


కానీ ఏదో ఒక రోజు 

వద్దు వద్దు అన్నా 

మృత్యువే నిన్ను 

గాఢంగా... 

ముద్దు పెట్టుకుంది...

తెగ మురిసి పోతుంది...


అప్పుడు నీవు 

నీ కనురెప్పలు 

మూయవలసిందే...


భూలోకంలో 

నీ అద్దెఇంటిని

ఖాళీ చేయవలసిందే...


నీ ఆస్తికి...నీ అధికారానికి 

నీ అందానికి...నీ అనుబంధానికి 

శాశ్వతంగా స్వస్తి పలకవలసిందే...


నావి నావి అనున్నవేవీ 

నీవికావని తెలిసి 

ఆర్జించినవన్నీ మూటకట్టి 

ఆస్తికలతో పాటుగా...

గంగలో నిమజ్జనం చేయవలసిందే... 


ఏది నీ వెంట రాదు...

ఎవరూ నీ వెంటరారు...

ఒంటరిగానే నీవు తిరిగిరాని

లోకాలకు తరలి పోవలసిందే...


25. బొట్టు లోగుట్టు..! 


తెలుసుకో నేస్తమా !

నీ నుదిటి"బొట్టు"లోగుట్టు..!  

నీకు...అది...

తరగని ఒక సౌభాగ్య నిధి !


పెట్టుకో నేస్తమా..! 

నుదుట "బొట్టు" పెట్టుకో...!

నీ "నుదిటి బొట్టు"

నీ అందానికి...

నీ అహంకారానికి...

ఇతరులపై 

నీ ఆధిపత్యానికి...ప్రతీక కారాదు...


అది నీలోని అచంచలమైన భక్తికి...

నీలోని సమయస్ఫూర్తికి శ్రమశక్తికి...

సకల సమస్యలనుండి నీ విముక్తికి...


నీలోని ప్రేమతత్వానికి... 

స్వచ్ఛమైన నీ వ్యక్తిత్వానికి... 

నీలోని మంచితనానికి మానవత్వానికి...


నీలోని సహనానికి సౌభ్రాతృత్వానికి...

నీలో దాగిన దాతృత్వానికి దైవత్వానికి...

ప్రతిబింబం కావాలి నీకు జ్ఞాననేత్రం కావాలి.


26. తెలుసుకో నేస్తమా "బొట్టు"లోగుట్టు..! 


తెలుసుకో నేస్తమా !

నీ నుదిటి"బొట్టు"లోగుట్టు..!  

నీకు అది...తరగని ఒక సౌభాగ్య నిధి !


పుట్టిన 11 వ రోజు నుండీ 

చనిపోయిన 11 వ రోజు వరకూ 

బొట్టు నీ జీవితంలో ఒక భాగం కావాలి! 


నీ నుదురు ఖాళీగా ఉంటే 

అది దారిద్ర్యం తాండవించే స్మశానమే!


నీ గుండ్రని చందనం బొట్టు...  

నీ పూర్ణత్వానికి చిహ్నం!


నీ విభూతి బొట్టు... 

నేటి నీ ఐశ్వర్యానికి !

రేపటి చితిలో నీ భస్మానికి ప్రతీక !


నీ నామం బొట్టు...

నిన్ను ఉన్న స్థితినుండి

ఉన్నత స్థితికి చేర్చే సాధనం !


నీ కుంకుమ బొట్టు...  

నీ సౌభాగ్యానికి సోపానం!


నీ సింధూరం బొట్టు...  

నీకు హనుమంతుడి ఆశీర్వాదం!


నీ కనుబొమ్మల 

మధ్యన బొట్టు ఆజ్ఞాచక్రం

72000 నాడులకది నిలయం 

అందమైన నీ ముఖం చూడగానే 

కలిగించు ప్రతిమదిలో చేతులు జోడించి నమస్కరించాలనే పవిత్రమైన భక్తి భావన !


నీ నుదుట ఒక బొట్టు ఉంటే

ఎవరూ నీకు కీడు చేయసాహసించరు

అడగకకున్నా నీకు మంచినే చేసిపెడతారు 

ఆ మంచి కోసమైనా 


(మిత్రుడు చిన్నబాబు గారు షేర్ చేసిన సందేశాన్ని కవితగా మార్చడం జరిగింది...

అజ్ఞాతమిత్రునికి ఆత్మీయ అభినందనలతో)


27. జాతినేతలకు... జేజేలు...!


దేశభక్తుల దేహాలలో

మానని గాయాలెన్నో ఎన్నెన్నో...

బిక్షగాళ్లుగా వచ్చిన బ్రిటిష్ దొరలు 

రక్తం త్రాగే రాక్షసులైనారని భరతమాత కుమిలిపోయిన క్రుంగిపోయిన రాత్రులెన్నో..


నాటి భారత మాత దాస్య 

శృంఖలాలను త్రెంచేందుకు...

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో

మ్రోగించిన యుద్ద భేరీలెన్నో...

పూరించిన విప్లవ శంఖారావాలెన్నో ...

చేసిన ఉద్యమాలెన్నో భీకరపోరాటాలెన్నో...


త్రివర్ణ పతాకాన్ని...చేబూని 

ఉద్యమకారులు...ఉరుములై 

ఉరిమి మెరుపులై మెరిసి పులులై 

ఉరికిన రక్తసిక్తపు రహదారులెన్నో...


వందేమాతరం...వందేమాతరమంటూ

నిజమైనదేశభక్తులు నిరసనలనిప్పులు 

కురిపించిన సభలు...సమావేశాలెన్నో....


విప్లవ వీరుల...

ఆవేదనలు ఆక్రందనలు...

కౌగిలించుకున్న కష్టాలెన్నో...

కూలిపోయిన కుటుంబాలెన్నో...

అనుభవించిన చిత్రహింసలెన్నో...

రగిలి పగిలిపోయిన గుండెలెన్నో...

రాలిపోయిన...లేతకుసుమాలెన్నో...

కారుచీకటిలో కార్చిన కన్నీటిధారలెన్నో...


ఆ త్యాగమూర్తులు...

చేసిన నిస్వార్ధమైన త్యాగాలెన్నో...

ఒరిగిపోయిన పర్వత శిఖరాలెన్నో...

జైళ్ళలో మ్రగ్గిన...జాతినేతలెందరో...

క్విట్ ఇండియా...క్విట్ ఇండియా అంటూ 

దిక్కులు పిక్కటిల్లేలా నినదించి నినదించి 

ఆగిపోయిన మూగపోయిన గొంతులెన్నో...

ఆ చీకటిరోజుల్లో తెల్లారగానే తెల్లదొరల క్రూరకరవాలాలకు తెగిపడిన శిరస్సులెన్నో..


తిరిగి రాని లోకాలకు

తరలివెళ్లిన త్యాగధనులెందరో...

నింగినిచేరి ధృవతారలై వెలిగిపోతున్న 

స్వాతంత్ర్య సమరయోధులెందరో ఎందరో

అందరికీ వందనాలు...పాదాభివందనాలు


నేడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం!

త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేద్దాం!

జయహో...జయహో...

జేజేలు మీకు ఓ జాతినేతలారా ! 

"మీ స్మరణే మాకు ప్రేరణ" అంటూ

వారి అడుగుల్లో అడుగులు వేద్దాం!వారి 

ఆశయాలకు జీవితాలను అంకితం చేద్దాం! 


28. విప్లవ సింహం గద్దరన్న...?


ప్రజల కోసమే తన జీవితం 

అంకితం చేసిన ఘనుడు

"త్యాగధనుడు"...మన గద్దరన్న 


నీతిగా నిజాయితీగా 

నిస్వార్థంగా నిప్పులా

పాటే ప్రాణంగా...

మాటే మంత్రంగా...

అగ్ని జ్వాలగా...రగిలిన

"బ్రతికిన మహానాయకుడు"... 

"ప్రజాగాయకుడు" మన గద్దరన్న 


శత్రువుల తూటాలు 

గుండెల్లోకి దూరినా 

భయపడక...మొండిధైర్యంతో

ఎర్రజెండా చేపట్టిన

గజ్జకట్టిన తొడగొట్టిన 

దండుగట్టి కొండలనే ఢీకొట్టిన

"ప్రజాయుద్ద నౌక " మన గద్దరన్న 


నిజాం నిరంకుశ 

పాలకుల నెదిరించిన 

వారి గుండెల్లో నిదురించిన

గాయపడిన పులిలా

విప్లవ వేదికలపై 

గాండ్రించిన...గర్జించిన ...

విరుచుకుపడిన ఒక 

"విప్లవ సింహం" మన గద్దరన్న


అమరుడైన అన్న గద్దరన్నకు

అశృనయనాలతో అర్పిద్దాం...

ఘనమైన నిజమైన నివాళి ....


29. చీకటి పడక ముందే...!


చీకటి పడక ముందే... 

"దీపం" వెలిగించుకోవాలి... 

బొందిలో ప్రాణముండగానే...

భక్తితో "దైవాన్ని" ధ్యానించాలి 


ఈ భూమిపై బ్రతికి ఉండగానే...

అమ్మ నాన్నలను...ఆదరించాలి

ప్రేమించాలి గౌరవించాలి పూజించాలి

ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించాలి 


జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రత్యక్ష 

దైవాల పవిత్రమైన పాదాలపై పడక...

ఆ పాదాలను కన్నీటితో కడగక...

"సాష్టాంగ నమస్కారం" చేయక...


నీవు ఏడుకొండలెక్కినా...

ఎన్ని కొబ్బరి కాయలు కొట్టినా...

ఎన్నిసార్లు ఆ కోనేటిరాయునికి మ్రొక్కినా...

దక్కదు ఈ సమాజంలో నీకు...ఏ గౌరవం ...

చిక్కదు...ఈ జన్మలో...నీకు ఏ పుణ్యం‌......


30. నేతగా...ధర్మదాతగా...!


యవ్వనంలో ఉన్నప్పుడే... 

విశాలమైన అభ్యుదయ 

భావాలతో ఉన్నతంగా ఎదగాలి

గౌరవంగా ఆదర్శంగా జీవించాలి 

"ప్రజానేతగా"...నీవు గుర్తింపు పొందాలి


చేతిలో ధనమున్ననాడే... 

అనాధలకు అభాగ్యులకు

నీడలేని నిరుపేదలకు 

దానధర్మాలు చేయాలి 

ఊరంతా నీ పేరు మారుమ్రోగాలి

"ధర్మదాతగా"...నీ చిరునామా మారాలి


ఉద్యోగంలో ఉన్నప్పుడే...

"నాలుగురాళ్లు" వెనకేసుకోవాలి 

ఆరోగ్యంగా ఉన్నప్పుడే... 

"నాలుగు పుణ్యక్షేత్రాలు" దర్శించాలి 


కంటిచూపుండగానే... 

బైబిల్ ఖురాన్ భగవద్గీత 

భారత భాగవత రామాయణాది

బృహత్ "గ్రంథాలను" పఠించాలి


పరమాత్మను ప్రార్థించాలి 

ఆపై ప్రశాంతంగా నిద్రించాలి

పంచభూతాలలో లీనమైపోవాలి


31. అమరజీవి...

      డాక్టర్ బిఆర్ అంబేద్కర్...


సమసమాజం కోసం...

నిస్వార్థంగా తమ 

నిండు జీవితాలను 

తృణప్రాయంగా త్యాగం చేసిన 

ఎందరో ఘనులు...త్యాగధనులు 

ఎందరో మహాత్ములు మహానీయులు 

అందరికీ వందనాలు పాదాభివందనాలు


పైకి కులం కులం...అంటూ...

కావు...కావుమని... అరిచి...అరిచి 

అంతర్ముఖంగా అందరికీ సమానమైన అవకాశాలు...రావు రావు...లేవు లేవు 

అంటూ...సమానత్వాన్ని సమాధిచేసిన

కాకులగుంపులో "ఒక రాజహంస"లా

సమసమాజం కోసం సర్వం ధారబోసిన

తన రక్తాన్ని స్వేదంలా చిందించినవాడు... 

తన జీవితాన్ని తాకట్టుపెట్టినవాడు ...

తన కన్నబిడ్డలను పోగొట్టుకున్నవాడు...

అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...


కులం వేటకు గురైనవాడు... 

కులం కాటుకు బలైనవాడు... 

క్రీస్తు శిలువను మోసిన రీతిగా 

"కులం కొండను" మోసినవాడు... "కులనిర్మూలన"..."శూద్రులు ఎవరు"

బృహత్ గ్రంథాలను లిఖించినవాడు...

అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...


కులంపేర కుంపటి రాజేసిన 

మనుషుల మధ్య "ఇనుపగోడలు" 

సృష్టించిన "మనుధర్మశాస్త్రాన్ని" 

మంటల్లో వేసి బహిరంగంగా 

కాల్చి "బూడిద" చేసినవాడు... 

మనువాదుల్ని...మతోన్మాదుల్ని

"ప్రజాబలిపీఠం" పై ఉరిదీసినవాడు... 

అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...


32. అస్తమించని సూర్యుడు అంబేద్కర్..!


కులం దహించే 

ఒక "కారుచిచ్చని"...

విషం చిమ్మే ఒక "కుల సర్పమని"...

తన జాతిని జాగృతం చేసినవాడు... 

తనకు తనజాతికి...బడిని...గుడిని 

త్రాగే "మంచినీటిని" దూరం చేసిన 

వర్ణవ్యవస్థ మీద..."విప్లవ శంఖాన్ని" 

పూరించిన సాహసి...విప్లవ వీరుడు... 

అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...


స్వాతంత్ర్యం కోసం...తెల్లదొరలతో 

నాడు అల్లూరి సీతారామరాజులా...

బహుజనుల స్వేచ్ఛ...స్వాతంత్ర్యం... సంఘంలో సమానత్వం...సౌభ్రాతృత్వం ప్రాధమిక హక్కులకోసం...నల్లదొరలతో... 

ఒంటరిగా ఒక ప్రజాయుద్ధనౌకై...పోరాడి 

రాజ్యాధికారంకోసం కమ్మనికలలు కంటూ కన్నుమూసి కడకు కాటికెళ్ళేవరకు 

చాటుమాటుగా కాటువేసే "కులవివక్ష 

విషసర్పాల కోరలు విరిచినవాడు...

పూర్తిగా కుటుంబాన్ని మరచినవాడు...

అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 


జనం మరచినా...చరిత్ర మరువని... 

ప్రపంచ మేధావి...నడిచే లైబ్రెరీ... 

ప్రపంచ చరిత్రలోని ప్రతిపుటలో

సువర్ణాక్షరాలతో లిఖించబడి...

విశ్వమంతా ప్రతిధ్వనించే ఒకే ఒక్క పేరు... 

అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 


ఓ "చైనాగోడలా" రాజ్యాంగ 

రక్షణ కవచాన్ని...నిర్మించి  

"బహుజన రాజ్యం" కోసం 

తపించి...తపించి అసమానతలు లేని

బుద్ధుని సిద్దాంతాలకు ఆకర్షితుడై... 

త్రికరణ శుద్ధిగా నమ్మి ఆరాదించి... 

"అభినవ బుద్ధుడిగా" అవతరించి... 

అశువులు బాసిన...అస్తమించని 

బ్రిటిష్ సామ్రాజ్యాంలా... 

"అస్తమించని సూర్యుడు" 

అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...

జై భీం...జైభీం...జయహో అంబేద్కరా!


33. వద్దురా వద్దురా"అప్పుజీవితం"..!


నేడు అప్పు..."అమృతంరా"...

రేపది "పచ్చివిషం" చిమ్మురా...

నా ఈ మంచిమాట నమ్మురా...


నేడు అవసరాలకోసం

ఆశతో "అప్పుల వల" 

విసిరేది నువ్వేరా...

రేపు ఆ వలలో చిక్కుకుని 

విలవిలలాడేది నువ్వేరా...


నేడు అప్పు..."తిరుపతి లడ్డురా"...

రేపది జీవితాంతం..."వదలని జిడ్డురా"...


నేడు అప్పు...చేయడం ఒక "హాబిరా"...

రేపది...నీ ఊపిరి తీసే ఒక "ఊబిరా"...


నేడు అప్పు...

పరిమళించే "గంధపు చెక్కరా"...

రేపది కాలేసి 

జర్రునజారిపడే "అరటి తొక్కరా"... 


నేడు బ్రతుదారిలో

"అప్పుల అరటి తొక్కను" 

విసిరేది నువ్వేరా...

రేపు "కాలుజారి"పడి

నలుగురిలో...నవ్వుల 

పాలైపొయ్యేది నువ్వేరా... 


వద్దురా వద్దురా..! 

మెప్పుకోసం అప్పుజీవితం..! 

నేడది ఉప్పురా....రేపది తప్పురా..! 

నేడది తప్పైతే.....రేపది ముప్పురా..! 

నేడది ముప్పైతే...రేపది ఆరని నిప్పురా..!


నేడు అప్పు..."కానరాని కారుచిచ్చురా"...

రేపు...తీర్చుకున్న నీమెడకది "ఉచ్చురా"...


అందుకే వద్దురా...వద్దురా... 

"మెప్పుకోసం ఈ అప్పుజీవితం" వద్దురా...


34. మణిపూర్...

       రగిలే ఒక రావణ కాష్టం..?


కులం పేర...

కుమ్ములాటలకు...

మతం పేర...

మారణహోమాలకు...

లింగ వివక్షతకు... 

స్వజాతి ఘర్షణలకు.. 

వర్ణ వర్గ వైషమ్యాలకు... 

ప్రాంతీయ భాషాభేదాలకతీతంగా... 


మనమంతా 

భారతీయులమేనని...

భారతమాత ముద్దు బిడ్డమేనని...

ఇల్లు తగలబెట్టుకోవడాలు...

తలలు పగలగొట్టుకోవడాలు... 

నిత్య ఘర్షణలు మనలో ఉండరాదని...


ఏ పాపమెరుగని అమాయకపు మహిళలను మానభంగం చేసి

శారీరకంగా మానసికంగా  

చిత్ర వధచేసి...హింసించి...

అతినీచంగా...

అతికౄరంగా...

అతిదారుణంగా...

ప్రపంచమే దిగ్ర్భాంతి చేందేలా...

జంతువులను నరికేసినట్లుగా చంపి

ఉన్మాదంతో హత్యలకు పాల్పడమని...


పవిత్ర గ్రంథాలైన 

బైబిల్ భగవద్గీత ఖురాన్ లమీద 

నేడే ప్రమాణం చేద్దాం...!

తల్లిభారత పాదారవిందాలకు 

ప్రణమిల్లి ప్రతిజ్ఞ చేద్దాం...?


అందుకే 

ఓ సమతావాదులారా రండి..!

రావణ కాష్టంలా  రగిలే...

మణిపూర్లో..."ఆరని మంటలు" 

ఆర్పుదాం..! రండి..!

ఈ నరజాతికి..."శాంతి పాఠాలు" 

నేర్పుదాం..! కదలి రండి..! కలిసి రండి..!


35. మణిపూర్...

       ఆరని ఒక అగ్ని గుండం..?


అంబేద్కర్ 

అందించిన 

రాజ్యాంగంలోని 

ప్రాథమిక హక్కులకు 

భంగం కలిగించమని...

నిరుపేదల ఇళ్ళను దగ్ధం చేయమని...

నిస్సహాయురాళ్ళైన మహిళలను

వివస్త్రలను చేసి వీధిలో ఊరేగించమని...


ఆకులు మేసే 

మేకలమందలో  

తోడేళ్ళు దూరినట్లు...

బెదురు చూపుల జింకలమీద

పులులు సింహాలు దాడిచేసినట్లు...

మారణాయుధాలతో

నిరాధీయుల మీద విరుచుకుపడి 

దారుణంగా హింసించి హింసించి 

మారణహోమాలు సృష్టించమని..!


రాజ్యాంగమే 

మనకు రక్షణ కవచమని... 

ప్రజాస్వామ్యంలోనే ప్రజలు

సురక్షితంగా‌ నిద్రిస్తారని...

సుభిక్షంగా బ్రతుకుతారని...

సుఖశాంతులతో ఉంటారని...

భిన్నత్వంలో ఏకత్వానికే

కట్టుబడి ఉంటామని...

దానవత్వాన్ని దగ్ధం చేస్తామని..

 

ప్రతి మనిషి గుండెను 

గుభాళించే కరుణ దయ ప్రేమ 

పరిమాళాలతో నింపుతామని...

నేటి మానవత్వమే... రేపటి 

దైవత్వమన్న సత్యాన్ని విశ్వసిస్తామని..!


పవిత్ర గ్రంథాలైన 

బైబిల్ భగవద్గీత ఖురాన్ లమీద 

నేడే ప్రమాణం చేద్దాం...!

తల్లిభారత పాదారవిందాలకు 

ప్రణమిల్లి ప్రతిజ్ఞ చేద్దాం...?


అందుకే 

ఓ సమతావాదులారా రండి..!

మణిపూర్లో..."ఆరని మంటలు" 

ఆర్పుదాం..! రండి..!

ఈ నరజాతికి..."శాంతి పాఠాలు" 

నేర్పుదాం..! కదలి రండి..! కలిసి రండి..!


36. మణిపూర్ మారణకాండకు 

       దోషులెవరు...?‌ దొంగలెవరు...?


పోయిన హక్కులకై 

తిరుగుబాటు చేస్తూ

ఎదురు తిరిగి ప్రశ్నించిన కుకీలను

పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపడానికి... 

రాత్రికి రాత్రే వందల గ్రామాలను "వల్లకాడుగా"... మార్చడానికి...


మైతీలకు"మారణాయుధాలు" 

సరఫరా చేసిందెవరు..?

అగ్నికి ఆజ్యం పోసిందెవరు..! 

నడిరోడ్డులో నరబలికి బాధ్యులెవరు..?

దోషులెవరు...?‌ దొంగలెవరు...?

తెరవెనుక వ్యక్తులెవరు..?దుష్టశక్తులేవి?


ఈ పాపం ఎవరిది..?

అంధులైన అధికారులదా..?

ప్రేక్షకులైన పోలీసుల బలగాలదా..?

పారామిలిటరీ...సైనిక దళాలదా..?

మౌనవ్రతం దాల్చిన పాలకులదా..?


ఇంటర్నెట్ బంద్ చేసి 

మూడునెలల్లో మణిపూర్ లో 

జరిగిన ఘోరాలు నేరాలు

అరాచకాలు అమానవీయ‌మైన

భయంకరమైన క్రూరమైన కృత్యాలు


యదేచ్చగా విచ్చలవిడిగా సాగిన

విధ్వంసకర దాడులు ఘర్షణలు...

సామూహిక గృహదహనాలు...

సామూహిక అత్యాచారాలు...

నిర్దాక్షిణ్యంగా జరిగిన హత్యలెన్ని...

వెలికి తియ్యాలి వెలుగులోకి రావాలి... 

ఈ మూడు నెలలు ఏం జరిగిందో 

ప్రజలకు ప్రపంచానికి తెలియాలి...


37. మణిపూర్" 

       మారణకాండకు బాధ్యులెవరు? 


ఎవరు..?ఎవరు..?

ఈ మణిపూర్ దారుణ 

మారణకాండకు బాధ్యులెవరు

ఖచ్చితంగా కారకులెవరు..?

ఇంటర్నెట్ బంద్ చేసిందెవరు...?

చేయించిందెవరు...?ఎందుకు..?


మేకలమీదకు తోడేళ్ళను

జింకలమీదకు పులులను

ఉసిగొల్పిందెవరు..? 

ఉగ్రవాదులా..?ఉన్మాదులా..?

మనువాదులా..?మతోన్మాదులా..?


కుకీలరక్తం 

ఏరులై ప్రవహించడానికి... 

కళ్ళముందే కుకీల ఇళ్ళు... 

ప్రార్థనా మందిరాలు...

తగలబడి పోవడానికి...

కాలిబూడిదై మసిబొగ్గైపోవడానికి...


గుర్తుపట్టలేని కుకీల 

అనాధశవాలు వీధుల్లో 

గుట్టలుగుట్టలుగా పడివుండడానికి...

ప్రాణభయంతో కొండల్లోకి కోనల్లోకి 

కుకీలు పరుగులు పెట్టడానికి...

కుటుంబాలు చెల్లాచెదురై పోవడానికి...


బిక్కు బిక్కుమంటూ ఇళ్ళల్లో  

బంధీలైన మహిళల్ని బయటకీడ్చి 

వివస్త్రలను చేసి వీధుల్లో ఊరేగించడానికి...


రెండు ఆదివాసి గిరిజన

తెగల మధ్య పగలు రగిలి

రాష్ట్రం రావణ కాష్టమై...

కనీవినీ ఎరుగని ఘోరమైన 

హింసాత్మక ఘటనలు ఘర్షణలు

మూడు నెలలుగా‌...

ఎదేచ్చగా జరుగుతున్నా...

రాత్రులందు రిపోర్ట్ లు వీడియోలు

రహస్యంగా వస్తున్నా...చూస్తున్నా...

రక్షక భటుల సాక్షిగా...

రక్తం ఏరులై పారుతున్నా...

మానవత్వం మరణిస్తున్నా...

దారుణ మారణహోమం సృష్టిస్తున్నా...


అత్యున్నత పీఠాన్నధిరోహించిన

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలైన

రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని 

హోం శాఖ మంత్రుల గుండెలు 

రాతిగుండెలై పోయాయే...

ఎందుకింతగా మౌనవ్రతం దాల్చడం..?

ఎంతుకింతటి చవితితల్లి ప్రేమ..? 

ఎందుకు మణిపూర్ మంటల్ని 

మారణహోమాన్ని ఆపలేకున్నారు..?

ఎందుకు..?ఎందుకు..?ఎందుకు..? 


38. సమయం రావాలి..!

       సహనం కావాలి..!


అరిషడ్వర్గాలైన

కామం... 

క్రోధం... 

లోభం... 

మోహం... 

మదం... 

మాత్సర్యం... 

అంతరంగంలోని ఈ అదృశ్యశక్తులతో

ప్రాణమిత్రులంతా...బద్ధశత్రువులే...

ఈ దుష్టశక్తుల నిత్యనియంత్రణకు 

తారకమంత్రం ఒక్కటే..."సహనం" 


కుండపోతగా కుంభవర్షం కురిసినా...

వందబిందెలతో నిత్యంనీరు పోసినా...

ఏ చెట్టూ తక్షణమే కాయలు కాయదు...

కోరుకున్న పనులన్నీ క్షణాల్లో జరిగిపోవు


దేనికైనా...ఎవరికైనా... 

సహనం కావాలి...సమయం రావాలి 


ఒక శిల్పి అందమైన 

ఒక సుందరశిల్పాన్ని చెక్కడానికి... 

"సమయం" కావాలి....

ఒక శాస్త్రవేత్త కొత్త విషయం 

కనుగొనటానికి..."సహనం" కావాలి...


ఒక అందమైన బిడ్డకు 

జన్మనివ్వటానికి 

తల్లికి సమయం కావాలి....

ఒక గొంగళి పురుగు 

ఒక సీతాకోక చిలుకలా 

మారటానికి సమయం సహనం కావాలి. 


ఓర్పు అనేది చేదుగా ఉంటుంది 

దాని ఫలితం తీయగా ఉంటుంది 

అనుభవానికి ప్రతిస్పందనకు 

మధ్య స్థితే సహనం అదే స్థితప్రజ్ఞత

 

సాధన శిఖరంపై 

విజయపతాకను ఎగరేసే 

వారందరి విజయ రహస్యమొక్కటే 

సహనంతో నిరంతర సాధనే 

వారికి అసాధ్యం సుసాధ్యమే 

వినే సహనంలేని వారు విజ్ఞానులు కాలేరు 

సహనమే ఘనవిజయానికి చక్కనిసోపానం


39. వాడొక భయస్తుడు..! బద్దకస్తుడు..!


వాడు ఆపదలొస్తే ఆలస్యంగా

స్పందించే ఒక "సోమరిపోతు"..!

వాడో "వెర్రిబాగుల వెంగళప్ప"..!

వాడు పిరికిపంద భయస్తుడు..! 

భయంకరమైన "బద్దకస్తుడు"...! 


వాడు ఒక "అజ్ఞాని"..! 

సత్సంబంధాలు లేని 

ఒక  "సన్యాసి వెధవ"..! 

అందరినీ నమ్మి మోసపోయేటి 

ఒక "అమాయకపు చక్రవర్తి"......!


వాడు పరులకోసం 

లక్షలు ధారబోయు "ధర్మదాత"..! 

కానీ తనకోసం పైసా కూడా 

ఖర్చుచేయని "పరమపిసనారి"..!


వాడు శ్రద్ధంటూ లేని "శుద్దమొద్దు" 

వాడు పనులు"చెక్కబెట్టలేని చవట".......! 


వాడు ఆస్తినార్జించడమే తప్ప 

అనుభవించుటెరుగని"అమాయకుడు"...!


అట్టివాడీ భూమిపై పుట్టి లాభమేమి..?

అట్టి వింత విచిత్రమైన వ్యక్తిత్వమున్న 

వాన్ని బాగుచేయ...ఆ భగవంతుడే ఇక

దిగిరాక తప్పదేమో...దివినుండి భువికి..!


40. బోసినవ్వుల బాపూజీకి 

      వందనం..! అభివందనం..!!


ఎన్నో ఏళ్లుగా

పరాయి పాలనలో ఉన్న 

మన భారతీయులందరికీ

స్వేచ్ఛ స్వాతంత్య్రం 

సమానత్వం సౌభ్రాతృత్వం 

ప్రసాదించిన బోసినవ్వుల...

బాపూజీకి...వందనం...!అభివందనం..!! 


మందు మటన్ 

మగువలను ముట్టనని...

విందు వినోదాలలో 

విలాసాలతో మునిగితేలనని...  

విదేశీ వనితలతో

విచ్చలవిడిగా విహరించనని... 

మాట ఇచ్చి మాటమీద

నిలబడిన "దృఢచిత్తుడు"

ప్రతి భారతీయుడిలో స్వాతంత్ర్య

కాంక్షను రగిలించిన"చైతన్య జ్వాల

బాపూజీకి...వందనం..!అభివందనం..!!


నల్లని త్రాచుల్లాంటి తెల్లదొరలను

సహాయనిరాకరణ ఉద్యమంతో

ఉక్కిరిబిక్కిరైపోయేలా చేసిన

ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంతో 

ఊపిరాడకుండా చేసిన

క్విట్ ఇండియా ఉద్యమంతో

పారిపోయేలాచేసిన ఎత్తులతో

పైఎత్తులతో చిత్తుచిత్తుచేసిన

ఉక్కు సంకల్పమున్న"ఉక్కు మనిషి"

బాపూజీకి...వందనం..!అభివందనం..!! 


నిగర్వి...

నిర్మలమూర్తి...

నిరాడంబరుడు...

జాతినేత...జాతిపిత...

శాంతిదూత...సత్యాన్వేషి...

"నిత్య తాత్వికుడు"...

కులమతాలకు అతీతంగా 

హిందూ ముస్లిం క్రిస్టియన్లు సహోదరులేనని...

అందరూ సమానమేనని......

సమతా మమతల 

సందేశాన్నిచ్చిన "సంఘసంస్కర్త" 

బాపూజీకి...వందనం..!అభివందనం..!!


41. కొత్త జంట 


పరమానందంతో

పంది పడిపడి

దోర్లేది పోర్లేది

ఓ మురికి గుంట


కన్ను మూస్తే 

కాటికి నడిచేది

ఎవరు నీ వెంట 


కొట్టే గుడి గంట

ఆరే గుండె మంట 

అదిగో పచ్చని పంట

తయారాయె చక్కనివంట

ఇక తీరునులే ఆకలిమంట


42. భూగోళం మండే ఓ అగ్నిగోళం..!


ఎండలు ఎండలు ఎండలు 

వరదలు వరదలు వరదలు 

కరువులు కరువులు కరువులు 

యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు 

భూకంపాలు భూకంపాలు భూకంపాలు


లక్షా ఇరవై ఏళ్ల నాటి ఉష్ణోగ్రత 

మళ్లీ భూమి మీద...జూలై నెలలో...


కారణం..? 

కరువులు... 

కారుచిచ్చులు... 

మంచు కరగడాలు... 

వరదలు వడగాల్పులు ... 


చలి ప్రదేశాల్లో సైతం 

ఎండలు మండిపోతున్నాయి 

సూర్యుడు సెగలు గ్రక్కుతున్నాడు 


కారు చిచ్చుకు

దట్టమైన అడవులు 

దగ్ధమైపోతున్నాయి 

బూడిదైపోతున్నాయి

 

మంచు తుఫాన్లు 

విరుచుకుపడుతున్నాయి 

విధ్వంసం సృష్టిస్తున్నాయి 


ఇది గ్లోబల్ వార్మింగ్ కాదు...

ఖచ్చితంగా ఇది గ్లోబల్ బాయిలింగ్...


43. టమోటాల" విశ్వరూపం...?


మొన్న...నిగనిగ.....లాడే...

నిన్న.....ధగధగ.....మెరిసే...

నేడు.....భగభగ.....మండే...


మొన్న...కొమ్మల్లో రెమ్మల్లో

ఉయ్యాల జంపాలలూగే...

నిన్న...కోతులై కొండలెక్కి

వెక్కిరించే...నిక్కినిక్కిచూసే ...

నేడు...నింగిలో నీలిమేఘాల్లో

దూరి...తొంగి తొంగి చూసే...


కోటీశ్వరులై కొందరు 

రైతులు...పొంగి పొంగి పోయే...

కొనలేక తినలేక మధ్యతరగతి 

ప్రజలు...క్రుంగి క్రుంగిపోయే...


మొన్న...వంటచేసే వనితల 

గుండెలో మంటగా మారే...

గుండెల్లో గుబులు రేపే...

నిన్న...దొరలకే భారమయ్యే...

మధ్యతరగతికి దూరమయ్యే...

నేడు...రాకెట్లలా అందనంత ఎత్తులో 

అంతరిక్షంలోకి దూసుకు పోయే...


మొన్న...పాతాళంలో...

నిన్న.....ఆకాశంలో...

నేడు.....అంతరిక్షంలో...

ఏమిటో ఈ టమోటాల ఇంద్రజాలం..! 

మార్కెట్లో దళారుల మాయాజాలం..!

ఎవరికీ ఎన్నటికీ ఎప్పటికీ అర్థం కాదాయే..! 


ఇంతకీ 

ఈ పాపమెవరిది...? 

ప్రభుత్వపాలకులదా..? 

ప్రకృతి వైపరీత్యాలదా..? 

ఇక మీరే తేల్చండి..! 

ఓటును తూటాగా పేల్చండి..!

అసమర్థ పాలనను నేల కూల్చండి..!

బాధ్యులైన అధికారుల భరతం పట్టండి..! 


44. ఎన్నెన్నో జన్మల బంధం..? 


"ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది

ఎన్నటికీ మాయని మమత నాదీనీది

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను...

ఒక్క క్షణం ఈ విరహం నేతాళలేను"...

ఈ సినీ సుమధుర గీతం భార్యాభర్తల 

"బలమైన బంధానికి" ఒక ప్రతిబింబం...


ఔను ఈ సృష్టిలో 

ప్రాణం పోసేది బ్రహ్మ..!

జన్మనిచ్చేది అమ్మా నాన్న..! 

అది పెనవేసుకున్న ఒక 

పేగు బంధం..! ప్రేమ బంధం..!

అది "జన్మజన్మల రక్తసంబంధం"..!


ఎప్పుడో పుట్టి ఎక్కడో పెరిగిన

యువతీయువకులిద్దరు

ఒక్కటైపోతారు...

మూడుముళ్ళ బంధంతో... 

మెళ్ళోమెరిసే ఒక తాళితో...

అది"విచిత్రమైన ఒక వివాహబంధం"..! 


అందుకే ఈ నేల మీద బంధమేదైనా...

అది అబద్ధమాడని ఒక "అద్దంలా"... 

ఎన్నడూ "వీడని ఒక నీడలా"...ఉండాలి 


కానీ... 

బంధాలను... 

భవబంధాలను...

అనుబంధాలను...  

పెంచేది..! త్రుంచేది..!

శాసించేది..! శపించేది..! 

బంధాలకు మరణ శాసనం 

లిఖించేది..! భగవంతుడేనన్న

నగ్నసత్యం తెలుసుకోవాలి నరులంతా..!


45. ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?


ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?

మతోన్మాదులైన మైతీలు ఇంటర్నెట్ 

బంద్ చేసి ప్రభుత్వ పోలీస్ పారామిలిటరీ బలగాల అండతో...మూడు నెలలుగా విచ్చలవిడిగా...మారణాయుధాలతో 

సాగించిన మారణకాండకు రావణకాష్టంలా రగిలే  "మణిపూర్ మంటల్లో "...నేనక్కడ..!


ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?

కుకీ మహిళలిద్దరిని వివస్త్రలను చేసి 

"నడిరోడ్లో నగ్నంగా" ఉన్మాదులై ఊరేగించి రాక్షసానందం పొందిన మైతీ "ఉగ్రవాద యువకుల"ఉక్కుపాదాల క్రింద" నేనక్కడ..!


ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?

పోయినహక్కులకై ప్రశ్నించే ప్రతిఘటించే...

ఎదిరించే...పోరాడే...నిస్సహాయులైన బడుగు...బలహీన...బహుజన...గిరిజన

దళిత యువతపై‌..."మూత్రవిసర్జన చేసే

మూర్ఖులమస్తిస్కాలల్లో... నేనక్కడ..


ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?

ఆర్జించిన ఆస్తులన్నీ...ప్రేమతో పంచి 

అనాధలైపోయి...ఆకలికి అలమటిస్తు అస్థిపంజరాలైన...అమ్మానాన్నలను నిర్ధాక్షిణ్యంగా ఆనాధాశ్రమాల్లో చేర్పించే 

"కుక్కలకన్నా హీనులు కసాయిలైన కన్నబిడ్డల"రాతిగుండెల్లో "...నేనక్కడ..! 


ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?

ఉన్మాదుల..."ఉరి కంభంపై" నేనక్కడ

కామాంధుల..."కబంధ హస్తాల్లో" నేనిక్కడ

తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు "బలిపశువులై వ్రేలాడే బలిపీఠంపై" నేనక్కడ 


46. పంచభూతాల సాక్షిగా పతనం..?


ప్రతి మనిషిలో

"దైవత్వం"

మొలకెత్తేదెప్పుడు..?

గుండె గుండెలో 

"మంచితనం"... 

"మానవత్వం"...

చినుకై రాలినప్పుడు..!

చిరుజల్లై కురిసినప్పుడు..!


ఈ మనిషి 

ఒక మృగంలా...

మూర్ఖుడిలా...

ఒక రాక్షసుడిలా...

రాబందులా...

ఒక పశువులా...

విచ్చలవిడిగా  

ప్రవర్తించేదెప్పుడు..?

మనిషిలోని ఆలోచనలు 

మలినమైనప్పుడు..!

మానవత్వమన్నది

మంటకలిసినప్నుడు..!


కానీ మచ్చలేని... 

స్వచ్ఛమైన మనసే కదా

అపురూపమైన ఆహ్లాదకరమైన 

అనురాగ రాగాలను ఆలపించేది...


చల్లగా సాగే ఆ

"చల్లని గాలులే" కదా

మనసుకు హాయిని 

ఆనందాన్ని అందించేది...

ఆగిపోయి అల్లరి చేసే...

ఆ "పిల్లగాలులే" కదా

ఉక్కపోతతో మనిషిని 

ఉక్కిరిబిక్కిరి చేసేది...


ప్రభాత వేళలో 

వెచ్చని..."నీరెండే" కదా

అలసిన మనసుకు 

అంతులేని ఉత్సాహాన్ని...

ఉల్లాసాన్ని...అందించేది... 

ఉయ్యాల జంపాలలూగించేది...


భగ్గుమనే ఆ

మధ్యాహ్నపు

మండుటెండలు...

వీచే వడగాల్పులే...కదా

మృత్యువు చేతిలో 

మారణాయుధాలు...

ఔను 

ప్రకృతిలోని 

ఆ పంచభూతాలు..‌

మదిలోని అరిషడ్వర్గాలే... 

మనిషి పతనానికి...

పురోగమనానికి...పునాది రాళ్ళు


47. వందేమాతర గీతం...


ఏ పాట వింటే...

భారతీయులందరి 

ఒళ్ళు పులకరిస్తుందో...


ఏ పాట వింటే... 

తెల్లదొరల గుండెల్లో 

మరఫిరంగులు పేల్తాయో...


ఏ పాట వింటే...

ప్రజలు ఒక ప్రభంజనమై 

ఒక ఉప్పెనై విరుచుకుపడతారో...


ఏ పాట వింటే... 

పశువులు శిశువులు 

సైతం ఉలిక్కిపడి లేస్తాయో...


ఏ పాట వింటే...

అణువణువునా 

తరతరాలుగా నరనరాలలో 

స్వాతంత్ర్య కాంక్ష

దేశభక్తి రగులుతుందో... 


ఏ పాట వింటే... 

మన స్వాతంత్ర్య 

సమరయోధులంతా

పిడికిళ్లు బిగించి సింహాలై

స్వరాజ్య సమరానికి సిద్దమౌతారో...


ఏ మంత్రదండంతోనైతే...

మన విప్లవవీరులు...

భగత్ సింగ్

ఝాన్సీలక్ష్మీబాయి

అల్లూరి సీతారామరాజు

పరమక్రూరులైన

ఆ తెల్లదొరలను ఎదిరించారో... 

వారి గుండెల్లో నిదురించారో...

అదేఅదే మన జాతి పదేపదే 

పాడుకునే "వందేమాతర గీతం" 


48. వందేమాతరమంటే...?


వందేమాతరమంటే...?

ఒక పాట కాదు 

ఒక తూటా...

వందేమాతరమంటే...? 

ఒక గేయం కాదు 

ఒక ఆయుధం...

వందేమాతరమంటే...?

ఒక శంఖారావం 

ఒక సింహనినాదం...

వందేమాతరమంటే...?

జాతిపిత మనకిచ్చిన 

ఒక "జైలుపిలుపు"...

వందేమాతరమంటే...?

చారిత్రాత్మకమైన 

ఒక "గొప్ప మలుపు"

వందేమాతరమంటే...?

అది మన "భరతమాత గెలుపు"


49. ఏమన్నది..? ఏమన్నది..? 

      నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..? 


ఏమన్నది..? ఏమన్నది..?

నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?

ఎందరో మహాత్ముల...

నిస్వార్థపరుల...మహానుభావుల... 

స్వాతంత్ర్య సమరయోధుల...

జాతినేతల  జైలు జీవితాల...

రక్తతర్పణాలకు ప్రతిఫలమే...

ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది...


ఏమన్నది..? ఏమన్నది..?

నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?

అహింసావాది గాంధీజీ 

ప్రథమ ప్రధాని చాచా నెహ్రూ 

సర్దార్ వల్లభాయ్ పటేల్ 

సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ 

అల్లూరి త్యాగాలే మనకు పునాదులన్నది...


ఇందిరా రాజీవ్...అటల్ బిహారీ 

వాజపేయి అబ్దుల్ కలాం జాతినేతల 

ఆశలు ఆశయాలే మనకు ఆయుధాలన్నది


ఏమన్నది ఏమన్నది? 

నా అర్థరాత్రి స్వాతంత్ర్యం ?

మన మహనీయులు మహర్షులందించిన 

నాలుగు వేదాలే నా సనాతనధర్మాన్ని 

నాలుగు పాదాలపై నడిపిస్తాయన్నది...


ఎండిన పంటపొలాలను సస్యశ్యామలం చేసే గంగా యమున కావేరీ బ్రహ్మపుత్రలే 

మన అన్నదాతలకు ప్రాణదాతలన్నది...


ఏమన్నది..? ఏమన్నది..?

నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?

సర్వమతాలకు కులాలకు

జాతులకు వర్ణాలకు వర్గాలకు 

సంస్కృతీ సంప్రదాయాలకు

నా భారతజాతి...నిలయమన్నది... 

భిన్నత్వంలో... ఏకత్వమే 

భారతీయుల నిత్య నినాదమన్నది...


ఏమన్నది..? ఏమన్నది..?

నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?

ప్రజాస్వామ్యమే... 

మనకు ఆరవప్రాణమన్నది...

అదే మన భరతమాతకు... స్వర్ణాభరణమన్నది...

అమరజీవి అంబేద్కర్ లిఖించిన

రాజ్యాంగమే మనకు రక్షణ కవచమన్నది...


ఏమన్నది ఏమన్నది ? 

నా అర్థరాత్రి స్వాతంత్ర్యం ?

నీతిగా...నిజాయితీగా...

నిప్పులా బ్రతకమన్నది...

నిర్భయంగా తలఎత్తుకు తిరగమన్నది... హిందూ ముస్లిం క్రిస్టియన్లు చేయి చేయి...

కలిపి భాయిభాయి అంటూ బ్రతుకమన్నది.


జైహింద్...జైహింద్...జయహో భారత్......


50. శ్రమ..?


ఉదయిస్తే 

శ్రమలో నుంచే... 

స్వేచ్ఛను త్రుంచే... 

"స్వేద బిందువులే"

.....నీ నుదుట.... 


ఉరిపోసుకోవు 

సుమా‌‌..!

చీకటిని 

తొలగించే... 

చిత్తాన్ని 

వెలిగించే... 

"చిరునవ్వులు" 

.....నీ ఎదుట...‌. 


51. చిత్ర కవిత... 


టిప్పుసుల్తాన్ 

కత్తి ఖరీదు 143 కోట్లు..?


అప్పుడు టిప్పుసుల్తాన్ 

మిలమిల మెరిసే ఆ కరవాలంతో...

ఎన్ని శిరస్సులను చేధించాడో... 

ఎదురు తిరిగిన ఎంతమంది

అమాయకులను ఖతం చేశాడో... ఎవరికెరుక...ఆ అల్లాకు తప్ప


ఇప్పుడది 143 కోట్ల ధర పలికింది... 

ఆహా ఆ కత్తికెంతటి గౌరవం దక్కింది...

దానికి కారణం ఆ కత్తిని తయారు 

చేసిన ఆ కళాకారుని నైపుణ్యమే కదా...


తన శత్రువులు ఎవరు ఎప్పుడు 

ఏ వైపునుండి దూసుకు వస్తారో అంచనాలకందక ఆత్మరక్షణకోసం 

కత్తిని పడకగదిలో భద్రంగా దాచుకున్న టిప్పుసుల్తాన్ ...పాపం కంటినిండా 

ఏనాడు కునుకు తీసి ఉండడేమో... 


రోజూ"కలత" నిద్రే... 

రోజు "పీడకలలే" కాబోలు...

కారణం ఆర్జించిన ఆస్తిఅంతా 

పరులపాలౌతుందన్న అనుమానం...

క్షణక్షణం శత్రువులనుండి ప్రాణభయం...


52. వానర వీరుల విజయం...

       (వీడియో చిత్ర కవిత).... 


కోతులే పులులై పులిని వేటాడిన వేళ‌...

మూకుమ్మడిగా పులిపై దాడిచేసిన వేళ...

అడవికి రాజైన పులి జింకలా మారిన వేళ...

ప్రాణభయంతో పులి పరుగులు పెట్టిన వేళ!

"ఐక్యతే"... అణ్వాయుధమని...

సమిష్టి కృషితో...సర్వం సాధ్యమని...

వానర సైన్యం నరజాతికిచ్చె...శుభసందేశం! 


ఔరా ! అడవిలోని జంతువుల్లో

ఎంతటి అబ్బుర పరిచే ఐక్యత..!

మానవుల్లో ఆ ఐక్యత ఆ సఖ్యత

కంటికి కనిపించకున్నది లేశమైనా... 

వేయి దివిటీలతో వెతికినా విశ్వమంతా... 


దండుగా కదిలిన చలిచీమల సైన్యం 

కోరలు చాచే కోడెనాగులను సైతం సంహరించి "సమాధి" చేసినట్లు...


ఆకస్మికంగా అహంకారంతో తమపైకి 

దాడికి దిగిన చిరుతను మూకుమ్మడిగా ఎదురించి చీల్చిచండాడింది వానరసైన్యం 


ఉక్కిరిబిక్కిరి చేసి పళ్ళతో... 

రక్కిరక్కి‌ పులికి చుక్కల్ చూపించి...

జింకలా ప్రాణభయంతో పారిపోయేలా..

చేసిన ఆ కోతుల ఐక్యత...ఆ సఖ్యత...

 

అసూయా...ద్వేషాలతో... 

కుట్రలతో.....కుతంత్రాలతో... 

పగలతో......ప్రతీకారాలతో....

రగిలే...ఈ మనుష్యులకు...


కరుణ...జాలి...దయాదాక్షిణ్యాలు...

ప్రేమాభిమానాలు...గౌరవ మర్యాదలు...

మరచిన మనుష్యులకు నేర్పింది గుణపాఠం 


53. బంధాలు కలవాలంటే..?

      కలకాలం నిలవాలంటే..?


అందమైనవి

కొన్నిబంధాలు

భవబంధాలు...

అనుబంధాలు...

బంధాలు ఏవైనా... 

పేగు బంధమైనా...

ప్రేమ బంధమైనా...

స్నేహ బంధమైనా...

భక్తి బంధమైనా...

రక్త బంధమైనా...

ఆత్మ బంధమైనా...

అనురాగ బంధమైనా...

వివాహ బంధమైనా...

వ్యాపార బంధమైనా...

అది ఏ బంధమైనా...

 

పాలు నీళ్ళలా...."కలవాలంటే"

రుణానుబంధముండాలి

అది చిరకాలం..."నిలవాలంటే" 

ఎవరెస్టు శిఖరమంత

ఎత్తుకు ఎదగాలంటే...

చిగురించే చెట్టులా

పది కాలాలపాటు 

పచ్చగా ఉండాలంటే...

ఆకాశాన సూర్యచంద్రులు 

నక్షత్రాలున్నంతకాలం 

బంధాలు స్థిరంగా...

శాశ్వతంగా ఉండిపోవాలంటే...


అర్థం చేసుకునే 

అద్దం లాంటి...

మల్లె పువ్వు లాంటి... 

మంచి మనసుండాలి... 

మంచు ముక్కలాంటి

చక్కని గుణముండాలి...

బంధాలు నిలుపుకోవాలనే 

మధురభావన మదిలో ఉప్పొంగాలి...

 

కావాలి మన బంధం 

ఓ పవిత్రమైన బంధం... 

నిత్యం పఠించే ఓ పవిత్ర గ్రంథం... 

కావాలి మన బంధం 

సువాసనల సుగంధం...

కావాలి మన బంధం 

సధా సుందరం సుమధురం... 


కారాదు మన బంధం 

క్షణక్షణం మండే ఓ అగ్నికణం... 

కారాదు మన బంధం 

భగభగ మండే అగ్నిగుండం...

కారాదు మన బంధం దినదిన గండం...

కావాలి మన బంధం ఒక అమృత భాండం

బలమైన బంధం ఒక  బంగారు ఆభరణమే

ప్రతిబంధం భగవంతుడు ప్రసాదించే వరమే


54. ఎక్కడ స్వర్గం? ఎక్కడ నరకం ?


నిజంగా...

నిజ్జంగా...

నిస్వార్థమైన

నర్సుల సేవలు 

అమోఘమే

అపురూపమే...

అద్వితీయమే...

నిరుపమానమే...


డాక్టర్లు...దేవుళ్ళే...

నర్సులు...దేవతలే...

హాస్పిటల్...

ఒక దైవమందిరమే... 

రోదించే రోగులు

భజనలు చేసే భక్తులే... 

చెల్లించే బిల్లులు...

హుండీలోవేసే...కానుకలే...


ఆపరేషన్ విజయవంతమైతె 

మొండి జబ్బులు నయమైతే... 

సంపూర్ణ ఆరోగ్యంతోమనిషి

ఇంటికి తిరిగొస్తే...అదే స్వర్గం... 


మనిషి మృత్యుంజయుడై  

తిరిగి ఇంటికి రావాలని

నిద్రాహారాలు మాని నిరీక్షిస్తూ 

ఎన్ని పూజలు చేసినా 

ఎందరు దేవుళ్ళకు మ్రొక్కినా...


లక్షలు లక్షలు ఖర్చు చేసినా

ప్రాణదాతలెంతగా ప్రయత్నించినా 

మాయరోగం మృత్యువుగా మారి

ఇంటికి మనిషి రాలేకపోతేె

అటునుంచి అటే కన్నుమూసి

కాటికెళ్తే...అదే నరకం...


55. పాటే తూటాగా..!మాటే మంత్రంగా..!!


"బండెనక బండి కట్టి"...

"పదహారు బండ్లు కట్టి"...

"ఏ బండ్లోవస్తవ్ కొడుకో నైజాం సర్కరోడా"... "నాజీల మించినవ్ రో నైజాం సర్కరోడా"...

"నీఘోరికడతం కొడుకో నైజాం సర్కరోడా"...

పాటతో "మాభూమి"చిత్రంలో వెండితెరపై 

తళుక్కున ఒక మెరుపై మెరిసి...

గజ్జగట్టి...గర్జించిన.."ప్రజా యుద్దనౌక" 

గద్దరన్నకు జోహార్లు..!విప్లవ జోహార్లు... 

 

"పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న 

"కాలమా అమ్మ తెలంగాణమా"...అంటూ...

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది...

పల్లెపల్లెలో విప్లవ శంఖాన్ని పూరించి...

కోట్లమంది ప్రజల్ని చైతన్యవంతుల్నిచేసి...

గజ్జగట్టి...గర్జించిన..."ప్రజా గాయకుడు"... గద్దరన్నకు  జోహార్లు..! విప్లవ జోహార్లు!!

 

"నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా 

"నీ తోడ బుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా" అంటూ ఆబాలగోపాలాన్ని అలరించి కంటతడి పెట్టించిన ఆపాటకు వచ్చిన "నందిఅవార్డును" తిరస్కరించి...

గజ్జగట్టి...గర్జించిన..."విప్లవ వీరుడు"

గద్దరన్నకు జోహార్లు..! విప్లవ జోహార్లు...!!

 

పాటే శ్వాసగా... 

పాటే ప్రాణంగా...

పాటే తూటాగా...

పాటే ఆయుధంగా...

మాటే మంత్రంగా... 

బ్రతికినంతకాలం...

అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా...

కులమత రహిత సమసమాజం కోసం... 


తాడిత...పీడిత...బహుజన...గిరిజన... 

బడుగు బలహీనవర్గాల హక్కులకోసం... ధిక్కారస్వరంతో ఎలుగెత్తి నినదించిన...

గజ్జగట్టి...గర్జించిన"ఉద్యమ సూర్యుడు" 

గద్దరన్నకు జోహార్లు..! విప్లవ జోహార్లు...!!


అన్నా మీ పాటకు 

మాటకు మరణం లేదు.! 

అన్నా మీ ఆత్మకు 

శాంతి కలుగును గాక..!!

 

56. అన్న..! పాట ఆగి పోయె...!

      అన్న..! గొంతు మూగబోయె...!!


ఒక విప్లవ తార...నేలకొరిగే...

ఒక విప్లవ గీతం...ఆగిపోయే...

ఒక విప్లవ జ్యోతి...ఆరిపోయే...

ఒక విప్లవ గళం...మూగబోయే...

ఎందుకు? ఎందుకు? స్వర్గంలో 

"విప్లవ శంఖం" పూరించేందుకు...


అది గొంతా....కాదు గండ్ర గొడ్డలి

అది పాటా....కాదు పేలిన తూటా 

అది మాటా...కాదు మందుపాతర 

అది సభావేదికా...కాదు జన జాతర


త్రినేత్రుని గళంలో "గరళం"

గద్దరన్న గళంలో "అగ్నిగోళం"

త్రినేత్రుని చేతిలో త్రిశూలం 

గద్దరన్న చేతిలో "విప్లవ దండం" 


పాటల తోటలో ఎర్రజెండా 

పాతిన ఎర్రసూర్యుడు గద్దరన్న...

పాటల ఏకే 47 పేల్చి

నక్సల్ బరి ఉద్యమంలో 

విప్లవ బీజాలు...నాటిన...

విప్లవ శంఖం.....పూరించిన...

విప్లవ జ్వాలలు...రగిలించిన...

విప్లవ వీరుడు ప్రజాయుద్దనౌక గద్దరన్న...


అన్నా మీ అకాల మరణవార్త...

పీడిత ప్రజల గుండెల్లో ఫిరంగి మోత 

కానీ అన్నా మీ పాటకు 

మాటకు మరణం లేదు.! 

అన్నా మీ ఆత్మకు 

శాంతి కలుగును గాక..!!

 

57. గగనానికి కేగిన యుద్ధనౌక గద్దర్...


1949లో మెదక్ జిల్లా

తుఫ్రాన్ ...గ్రామంలో...

ఓ దళిత కుటుంబంలో...

లచ్చమ్మ...శేషయ్యలను

పుణ్యదంపతులకు...

ఎన్నో జన్మల పుణ్యఫలంగా

గుమ్మడి విఠల్ రావు జననం

విమలతో వివాహం...

ముద్దులొలికే ముగ్గురు బిడ్డలు 

సూర్యుడు...చంద్రుడు...వెన్నెల


బ్రిటిష్ దొరల నెదిరించిన

"గదర్ పార్టీ" అభిమానిగా

"గద్దర్ గా" మారిన విఠల్ రావు

పీపుల్స్ వార్ "మావోయిస్టుగా"...

సాంస్కృతిక ఉద్యమాలకు

ఊపిరిలూదిన..."విప్లవ వీరుడు"...

తెలంగాణ‌ ముద్దుబిడ్డ...మన గద్దరన్న


1997 ఏప్రిల్ 6 న...

చంద్రబాబు ఫాసిస్టు పాలనలో

గద్దరన్నపై బులెట్ల వర్షం కురిసి

భార్య విమల కళ్ళముందే

రక్తపు మడుగులో గిలగిలా

కొట్టుకున్న ఆ "ప్రజాయుద్దనౌక "

గుండెలో "6 బుల్లెట్లు"దిగినా...

తన రక్తం ఏరులై పారినా...


అభిమానుల ఆశీస్సులతో

తిరిగి మృత్యుంజయుడై లేచి...

"విప్లవ శంఖాన్ని" పూరించిన

"గాయపడిన పులి" మన గద్దరన్న

"పాతికేళ్ళుగా ఆ గుండెచప్పుడు 

"నిత్యం నిప్పులు" కురిపిస్తూనే ఉంది


పేద విద్యార్థుల మహాబోధి పాఠశాల

వ్యవస్థాపకుడు "ఉదార హృదయుడు"

"విద్యావేత్త జ్ఞానప్రదాత"...మన గద్దరన్న


40 ఏళ్ళు నక్సల్ బరి

ఉద్యమానికి ఊపిరివై...

నిజాం నిరంకుశ పాలనకు...

తెలంగాణ రాష్ట్ర సాధనకు...

కారంచేడు...చుండూరు...

దళితుల దారుణ హత్యలపై...

అణగారిన వర్గాల హక్కులకై....

అవిశ్రాంతంగా పోరాడి...పోరాడి...


వేలవేల విప్లవ వేదికలపై...

"పాటల మందుపాత్రలు" పేల్చి...పేల్చి

ఫాసిస్టు పాలకులకు సింహస్వప్నమై...

గజ్జకట్టి..గర్జించి గర్జించి..కడకు వేటగాళ్ల

వేదింపులకు...మదపడి...మదనపడి


2023 జూలై 6 న...

మరణించిన...మహాయోధుడు...

నాయకుడు...ప్రజాగాయకుడు...

మా గద్దరన్నానీకివే మా...విప్లవ జోహార్లు...


గద్దరన్న భౌతికంగా...

దూరమైనందుకు...కన్నీరు మున్నీరయ్యే

ఓ కళాకారులారా..! ఓ అభిమానులారా...

ఆ "సూర్యుడు చంద్రుడు వెన్నెల" నక్షత్రాలు

నింగిలో వెలుగులు విరజిమ్మునంతకాలం

గోచి కర్ర గొంగళితో గద్దరన్న చిరంజీవియే...

అన్నపాట నిత్యం ప్రవహించే ఒక జీవనది..

అన్నకు అన్న పాటకు లేదు మరణం లేదు..

అన్న ఆత్మకు శాంతి కలుగును గాక..!

అశృనయనాలతో...

అన్నకిదే నా అక్షర నీరాజనం...


58. ప్రాణం కన్నా మానమే మిన్న 


కరుడుగట్టిన 

ఓ మణిపూర్ 

మతోన్మాదులారా

నైతిక విలువల 

వలువలను ఊడదీసి

మానమే ప్రాణంగా బ్రతికే

మహిళలను నగ్నంగా

నడిరోడ్డుపై నడిపిస్తూ

వీరుల్లా విర్రవీగుతూ

వికటాట్టహాసం చేస్తూ

వికృతచేష్టలతో

చిత్ర హింసలకు గురిచేసే

ఓ అంధులారా

కామాంధులారా

ఆ స్త్రీ మూర్తుల్లో 

మీ అక్కాచెల్లి మీ కన్నతల్లి

మీ కళ్ళకు కనిపించలేదా


సామూహికంగా

అత్యాచారం చేశారే

సాక్ష్యాలను దగ్గం చేశారే

ఆ సిగ్గుతో చితికి పోతుంటే

విలవిల లాడుతుంటే 

ఉన్మాదులై ఊరేగించారే

పశువుల్లా ప్రవర్తించారే

మానవ మృగాలుగా మారారే

మానవత్వాన్ని మంటల్లో 

కాల్చి బూడిద చేశారే


59. పాపం ప్రీతి...రాబందుల చెరలో


నీవు చేయని తప్పుకు

ఇంత పెద్ద శిక్ష వేసుకున్నావే

ఇది న్యాయమా...?

ఐనా నీవు ఆ ర్యాగింగ్

రాక్షసుల రాబందులపాలిట

...సింహ స్వప్నమయ్యావట...

...కంటిలో కారమయ్యావట...

...గుండెల్లో గునపమయ్యావట...

...నిత్యం దహించే నిప్పురవ్వవయ్యావట...


నిజమే కానీ తల్లీ..!

ఓ ఆంగ్ల కవి చెప్పిన ఓ

గొప్ప జీవితసత్యాన్ని 

నీకు గుర్తుచేస్తా...

"టు ఎస్కేప్ 

ఫ్రమ్ సమ్ సీరియస్ 

సారోఫుల్ సిట్యువేషన్స్...

...యాజ్ యాన్ ఇండివిడ్వల్...

...యు కాంట్ డు ఎనీథింగ్...

...యాజ్ ఎ గ్రూప్... 

...ఉయ్ కెన్ డూ సమ్ థింగ్...

...బట్ ...యాజ్ ఎ స్ట్రాంగ్ గ్రూప్... 

...ఉయ్ కెన్ డూ ఇవెరిథింగ్... 

ఉయ్ మే నాట్ రిమూవ్ 

ది షాడ్ సిట్వేషన్ బట్... 

ఉయ్ కెన్ ఎట్లీస్ట్ ఛేంజ్ 

ది ప్రజెంట్ క్రిటికల్ సిట్వేషన్స్...

ఫర్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ 

అవర్ ఫ్యూచర్ జనరేషన్స్"...అని


కానీ ఓ నా బంగారు తల్లీ..!

కన్నబిడ్డ కన్నీటిని తుడవలేని

ఆపదలో ఆదుకోలేని అసమర్థులం మేం

కన్నబిడ్డను క్రూరంగా...అతిఘోరంగా 

మానసికంగా...వేధించిన...

నిర్దాక్షిణ్యంగా  కడతేర్చిన

ఆ "కులసర్పాలను"

ఆ "ర్యాగింగ్ భూతాలను"...

ఖతంచేసి కాటికి పంపలేక 

వెక్కివెక్కి ఏడుస్తున్న వెర్రివాళ్ళం...

కళ్ళులేని న్యాయదేవత కాళ్ళు

పట్టుకు వ్రేలాడుతున్న...గబ్బిలాలం...

అన్యాయాన్నెదురించలేని అభాగ్యులం...

క్షమించు తల్లీ..! మమ్మల్ని క్షమించు..!!

నీ ఆత్మకుశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...

ఓ అభాగ్యుడు చేస్తున్న ఆక్రందన...

ఇది ఓ కన్నతండ్రి కన్నీటి వీడ్కోలు...


60. గుండెగుడిలో వెలిగే

       విప్లవజ్యోతి గద్దరన్న..! 


బండెనక బండి కట్టి"...

"పదహారు బండ్లు కట్టి"...

"ఏ బండ్లోవస్తవ్ కొడుకో నైజాం సర్కరోడా"... "నాజీల మించినవ్ రో నైజాం సర్కరోడా"...

"నీ ఘోరికడతం కొడుకో నైజాం సర్కరోడా"..

పాటతో "మాభూమి"చిత్రంలో వెండితెరపై 

మెరిసిన "ప్రజా యుద్ధనౌక"మన గద్దరన్న...


పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న 

"కాలమా అమ్మ తెలంగాణమా"...అంటూ...

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది...

పల్లెపల్లెలో విప్లవ శంఖాన్ని పూరించి...

పూరిగుడిశెలో పుట్టిన బహుజనులను పులులుగా మార్చిన ప్రజాగాయకుడు 

విరుచుకుపడే"విప్లవసింహం"మన గద్దరన్న

 

"నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా 

"నీ తోడ బుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా" అంటూ ఆబాలగోపాలాన్ని అలరించి కంటతడి పెట్టించిన...ఆపాటకు అందిన "నంది అవార్డును" తిరస్కరించిన...

"విప్లవ వీరుడు"గర్జించే...మన గద్దరన్న...


అదిగో అన్న అకాలమరణంతో 

ఒక విప్లవ తార...నేలకొరిగే...

ఒక విప్లవ గీతం...ఆగిపోయే...

ఒక విప్లవ జ్యోతి...ఆరిపోయే...

ఒక విప్లవ గళం...మూగబోయే...

ఎందుకు? ఎందుకు? స్వర్గంలో 

"విప్లవ శంఖాన్ని" పూరించేందుకు...


అది గొంతా....కాదు గండ్ర గొడ్డలి...

అది పాటా....కాదు పేలిన తూటా... 

అది మాటా...కాదు మందుపాతర...

అది సభావేదికా...కాదు జన జాతర...


పాటే శ్వాసగా.....

పాటే ప్రాణంగా...

పాటే తూటాగా...

ఆటే ఆయుధంగా...

మాటే మంత్రంగా...

అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా...

కులమత రహిత సమసమాజం కోసం... 

బ్రతికిన "త్యాగధనుడు"...మన గద్దరన్న...


తాడిత...పీడిత...బహుజన...గిరిజన... 

బడుగు బలహీనవర్గాల హక్కులకోసం... ధిక్కారస్వరంతో నినదించిన నిప్పులు 

కురిపించిన"ఉద్యమ సూర్యుడు"గద్దరన్న...


అన్న గద్దరన్నా... 

ఎక్కడే నువ్ అంటే...ఎవరైనా ...

నీ ప్రక్కనే ఉన్నరా భాయ్ ...

నీవు గొంతెత్తి పాట పాడితే...

ఫిరంగిమ్రోతనై"...నీకు వినిపిస్తా..!

నీవు గజ్జకట్టి ఆట ఆడితే...

చిరుతపులినై....నీకు కనిపిస్తా... !


అన్న...అన్నా గద్దరన్నా... 

నీ పాటకు నీ ఆటకు నీ మాటకు 

మరణం లేదు...నీకు మరణం లేదు

నేడు నీవు అస్తమించింది...

రేపు అరుణోదయ సూర్యుడవై 

తూర్పుదిక్కున ఉదయించడానికే..!

అన్నా గద్దరన్నా..!

మీకివే మా జోహార్లు ..!విప్లవ జోహార్లు..!

మీపవిత్రమైన ఆత్మకుశాంతి కలుగును గాక!


61. చూసి సుఖించు...! తాకి తరించు..!!


ప్రేమ సంతకం పెట్టమనే 

...మధువులూరే ఆ పెదవులు...


సిగ్గులు మొగ్గలు తొడిగే 

...ఆ నునులేత బుగ్గలు...


నవ్వుతూ నాట్యమాడే 

...ఆ నల్లని కురులు...

 

ముద్దుల వర్షానికి తడిసి 

...ముద్దైన ఆ ముద్దుల మోము...


కమ్మని కలలకు 

సంకెళ్లు వేసి బంధించే  

కవ్వించే కైపెక్కించే 

...మిళమిళ మెరిసే...ఆ కళ్ళు...


ఏమని వర్ణింతు అక్షరాలకు

...అందని ఆమె అందాలు... 

అందరి ముందరి కాళ్ళకు 

...బంధాలు వేసే ఆమె అందాలు... 

తిలకించి పులకించి పోని

...వారంతా తిక్కశంకరులే...సుమా..!  


ఔను ఆమె ఎవరు ?

...ఆమె ఒక మెరుపు తీగ...


ఆమె ఎవరు ?

...గుండెల్లో గుట్టుగా దూరి 

...తియ్యగా కుట్టే తేనెటీగ... 


ఆమె ఎవరు ?

...జాలి చూపుల జాబిల్లి 

...మత్తెక్కించే మరుమల్లి 


ఆ మెడ ఆ వాలు జడ 

...చూస్తుంటే నా 

...గుండెల్లో దడదడ...


ఆమె ఎవరు ?

...చిత్తంలో కోటి ఆశలు రేపే 

...చిలిపి చూపుల చిరునవ్వుల చిలక... 


ఆ చిలకను చాటు మాటుగా... 

చూసి సుఖించు లేదా తాకి తరించు... 

అంతే...కానీ అత్యాశ అనర్థం...

వెర్రి వేషాలు వేయడం వ్యర్థం...అని 

కాబోలు ఆమె చురుకైన చూపులకర్థం...


కావాలంటే ఆమె...

కవ్వించే నీ కలల రాణి... 

కావాలంటే ఆమె...

ఊరించే నీ ఊహల ఊర్వశి...


తెలుసుకో మిత్రమా ఆమె ఎవరో...

ఆమె నివురుగప్పిన నిప్పుల కొలిమి... నిప్పుతో చెలగాటమే ఆమెతో చెలిమి ....

అందుకే మిత్రమా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త... 


62. చివరికి ఎవరికి లాభం?


చెరువులో చేపలు...

కొట్లాడుకుంటే...కొంగలకు లాభం 

గుంపలో కోళ్లు...

పోట్లాడుకుంటే...నక్కలకు లాభం 


పిల్లులు...

కొట్లాడుకుంటే...కోతులకు లాభం 

ఎద్దులు...

పోట్లాడుకుంటే...పులులకు లాభం 


ఎలుకలు...

పోట్లాడుకుంటే...పిల్లులకు లాభం

కప్పలు...

కొట్లాడుకుంటే...పాములకు లాభం


జింకలు...

పోట్లాడుకుంటే...సింహాలకు లాభం 

మేకలు..‌.

పోట్లాడుకుంటే...తోడేళ్ళకు లాభం 


కోడిపిల్లలు...

కొట్లాడుకుంటే..‌.గద్దలకు లాభం 


భార్యాభర్తలిద్దరు...

కొట్లాడుకుంటే...లాయర్లకు లాభం

దొంగలిద్దరు...

పోట్లాడుకుంటే...పోలీసులకు లాభం


రెండుకులాల మతాలవాళ్ళు

కుత్తుకలు త్రెంచుకునేందుకు 

కత్తులు నూరుకుంటుంటే...

నయవంచకులైన...నాయకులకు లాభం


ఇకనైనా బలహీనశక్తులు

బలం పుంజుకోవాలి పులులై గర్జించాలి

సమిష్టిగా బలమైనశక్తుల భరతం పట్టాలి

"రాజ్యాధికారం" అంటూ రంకెలు వేయాలి

"రాజ్యాంగమే" మన రక్షణకవచం మంటూ 

"రక్త తర్పణకైనా"...సిద్దం కావాలి"..."

"సమర శంఖారావం"...పూరించాలి...


63. పెద్దలమాట...సద్దిమూట


ఔను..!

మనం మన...మతాన్ని... 

పూజాగదిలోనే బంధించాలని...

అది గర్భగుడిలో ప్రతిష్టించిన ఒక

సుందర దేవతాశిల్పమై పోవాలని...

చేసే‌ అర్చనలకే అర్పణమైపోవాలని...

వేసే ధూపంలో అది కలిసి పోవాలని...


ఔను..! 

మనం మన...కులాన్ని... 

నాలుగుగోడలకు

పరిమితం చేయాలని...

గడపదాటి బయటకు రానివ్వరాదని...

నా కులమే గొప్పదంటూ కులకరాదని...

కులంపేర మతంపేర కుమ్ములాటలొద్దని...


ఔను..!

బయట 

మనందరం... 

భారతీయులమని...

భరతమాత ముద్దుబిడ్డలమని...

అరమరికలులేని అన్నాతమ్ముళ్ళమని...

కలతలన్నవిలేక కలిసిమెలిసి వుండాలని..

భిన్నత్వంలో ఏకత్వమే మన నినాదమని..

కదా మన "పెద్దలమాట"..! అదికదా 

సకలజనుల ఆకలి తీర్చేటి..."సద్దిమూట"...


64. దక్షిణ ధృవంపై 

       భారత్ విజయకేతనం 


ఏ దేశమేగినా...

ఎందు కాలిడినా...

పొగడరా ఈ ఇస్రో 

చంద్రయాన్ - 3 

విజయగాథను...

అని ఓకవి పలికినట్టు... 


తెలుగునేల 

నెల్లూరు జిల్లా

శ్రీహరి కోటనుండి...


1000 మంది 

భారతీయ శాస్త్రవేత్తలు

తిండి నిద్ర జీవనమే

చంద్రయాన్ - 3 కాగా 

అకుంఠిత దీక్షతో...

అంకితభావంతో...

4 ఏళ్ళ నిరంతరం కృషికి 

నిదర్శనంగా రూపకల్పన చేసిన...


615 కోట్ల ఖరీదైన...

3915 కిలోల బరువైన...

చంద్రయాన్ - 3 అంతరిక్ష నౌక


14 జూలై 2023... 

మధ్యాహ్నం 2.35 

నిముషాల సుముహూర్తానికి...


140 కోట్ల మంది 

భారతీయులు గర్వపడేలా...

నిప్పులు చెరుగుతూ నింగికెగిసి...


భూమికి దూరంగా

3,84,800 కిలోమీటర్లు

41 రోజుల సుధీర్ఘ ప్రయాణం చేసి 

ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళని దారిలో...


అగ్రరాజ్యాలు

సైతం అసాధ్యమని 

ఆశలు వదులుకున్న ఏ దేశం 

సాహసించని చంద్రుని దక్షిణధృవానికి...


23 ఆగస్టు 2023...

సాయంత్రం 6.04 నిముషాలకు 

సూర్యోదయం వేళ...

అనేక క్లిష్టమైన దశలను దాటి... 

సాప్ట్ ల్యాండింగ్ చేసి...

చంద్రునిపై ఒక పగటి పూట... 

(భూమిపై 14 రోజుల) పరిశోధనలకు...

విక్రమ్ ల్యాండర్...ప్రగ్యాన్ రోవర్ లు 

విశ్వమే విస్తుపోయేలా విజయవంతంగా

"చల్లని చంద్రుని ఒడిని " చేరినవేళ...


ప్రజలు టీవీలకు అతుక్కుని

ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ... 

గడిపిన ఆ క్షణాలు అత్యంత 

ఉత్కంఠ పూరితం...ఉద్వేగ భరితం...

ఉత్కృష్టమైన చంద్రయాన్ - 3 తో ఇస్రో 

చేపట్టిన ఈ"సాహసయాత్ర"విజయవంతం


జయహో...జయహో ఇస్రో జయహో

జయహో...జయహో సోమనాథ్ జయహో

జయహో...జయహో ఇస్రో శాస్త్రవేత్తలారా 

జయహో...జయహో జయహో...

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి...

చంద్రుని దక్షిణధృవంపై...కాలుమోపి 

చరిత్ర సృష్టించిన...ఏకైక దేశం...

అఖండ భారత్ జయహో...జయహో...


65. అఖండ భారతం అంతరిక్ష విజయం 


చంద్రయాన్ -3 

చందమామపై 

సాప్ట్ ల్యాండింగ్ తో 

అంతరిక్ష ప్రయోగాలకు

అగ్రరాజ్యాలైన ...

అమెరికా రష్యా చైనాల 

తరువాత నాలుగో దేశంగా...


రష్యా లూనా - 25 సైతం తాకలేని

చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన

ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా...

అవనిపై "భారత్ " ఒక 

"అంతరిక్ష శక్తిగా" అవతరించింది..


ప్రపంచమంతా... 

ప్రశంసల కుంభవర్షం కురిపించింది

అంతరిక్షంలో భారత్ 

త్రివర్ణ కీర్తిపతాకం...రెపరెపలాడింది


చంద్రుని గర్భంలో ఉపరితలంలో 

దాగిన నిధి నిక్షేపాల అన్వేషణకై

సాంకేతిక సాహసయాత్రను చేసి 

యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా...

 

అపురూపమైన

ఒక మహోజ్వల ఘట్టాన్ని...

అంతరిక్షంలో ఒక 

మహాఅద్భుతాన్ని...ఆవిష్కరించింది...

అంతరిక్ష చరిత్రలో 

ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది...

రోదసిలో "భారత్" రారాజుగా నిలిచింది...


ఈ అనిర్వచనీయమైన అపూర్వమైన 

అఖండ భారత అంతరిక్ష విజయానికి 

నిద్రాహారాలుమాని  నిర్విరామంగా 

రాత్రింబవళ్ళు శ్రమించిన  

శాస్త్రవేత్తలందరికి చేద్దాం పాదాభివందనం


జయహో...జయహో...

ఇస్రో జయహో...

జయహో...జయహో...

చంద్రయాన్ - 3...జయహో

జయహో... జయహో...

చైర్మన్ సోమనాథ్ జయహో...

జయహో...భారత్ జయహో...జైహింద్. 


66.  విక్రం ల్యాండర్ విజయగాథ


నిన్న రాత్రి నేను

నింగిలోకి తొంగి చూశా

నా శిరస్సుపైన 

నిండు పున్నమి

చంద్రుడున్నాడు 

చుక్కల్లో నక్కి ఉన్నాడు

నిండుగా నవ్వుతున్నాడు ...


నేటి రాత్రి నేను

టీవీలోకి తొంగి చూశా

టీవీ చానెల్స్ ఘోషిస్తున్నవి... 

అంతరిక్ష నౌక చంద్రయాన్ - 3  

చంద్రుని తలపై అడుగు పెట్టిందని...

చంద్రమా ఇదెంత వింత.,.?

నిన్ను నా తలపై నీవు...

నేడు నీ తలపై మేము... 


బాల్యంలో నేను తిండితినకున్న

అమ్మ పాడేది ఓ కమ్మని పాట

చందమామ రావే జాబిల్లి రావే 

కొండెక్కి రావే గోగుపూలు తేవే అని...


అద్దంలో ఆ చంద్రున్ని చూపిస్తూ 

కొసకొసరి పెట్టేది గోరుముద్దలు 

నాడు అద్దంలో కంటికి కనిపించే

ఆ చంద్రుడు చేత చిక్కడాయె

బాల్యంలో ఒకే ఒక తీరని కోరిక

చంద్రున్ని చేరాలని...చుక్కల్తో ఆడాలని


ఋగ్వేదంలో ఒక శ్లోకం...

చందమామ ఓ చందమామ

నేలకు నీవు దిగిరాలేవు...మేమే 

నీ దగ్గరకు వస్తాం దారి చూపమని...


మా శాస్త్రవేత్తల ప్రార్థన ఫలించింది 

సంక్లిష్టమైన అతిప్రమాదకరమైన

ఉత్కంఠభరిత దశలెన్నో దాటుకొని 

ఎన్నో ఏళ్లుగా సూర్యకిరణాలు తాకని

ఎవరూ చేరని‌...అడుగు పెట్టని

చంద్రుని దక్షిణధృవం పై 

దిగ్విజయంగా సురక్షితంగా దిగాయి 

"విక్రమ్ ల్యాండర్"..."ప్రగ్యాన్ రోవర్ లు"...

విశ్వమంతా...విస్తుపోయేలా...


ఆ వాయురహిత చల్లని వాతావరణంలో 

ముందుకు నడుస్తూ రోవర్ ముద్రించింది 

అందమైన ఆ చందమామ గుండెలమీద 

ఇశ్రో లోగోను...జాతీయ సింహం చిత్రాన్ని... 

ఎన్నేళ్ళైనా చెక్కుచెదరని ఓ గుర్తుగా...

చంద్రునిపై భారత్ నడిచిందని...

ఆనందంతో అడుగులు వేసిందని... 

రోదసి సామ్రాజ్యానికి రారాజు భారత్ అని...


67. జయహో..! జయహో..!!

       చంద్రయాన్ 3... జయహో..!!!


భారతదేశ అందరిక్ష నౌక

చంద్రయాన్ 3... చంద్రునిపై

సేఫ్ గా ల్యాండ్ కావడం... 

అంతరిక్ష చరిత్రలో

ఒక మహోజ్వల ఘట్టం...

ఆ ఘనత సాధించిన 

మొట్టమొదటి దేశం 

ప్రపంచాన భారతదేశమేనని

అది "విశ్వవిజేతగా" అవతరించింది

అనేక దేశాలకు "దిక్సూచిగా"మారింది 


అకుంఠిత దీక్షతో అంకితభావంతో

అహోరాత్రులు నిద్రాహారాలు మాని

శ్రమించిన శాస్త్రవేత్తలు సంతోషంతో 

పట్టరాని ఆనందంతో పొంగిపోయేరు

ప్రపంచమంతా ప్రశంశలవర్షం కురిపించేను


నేడిది 140 కోట్లమంది 

భారతీయులకు దీపావళి పండుగే...

ఎటు విన్నా జయ జయధ్వానాలే...  

ఎటు చూసినా అంబరాన్నంటే సంబరాలే‍...

వినువీధిలో రెపరెపలాడేది త్రివర్ణ పతాకమే

ఓ నా ప్రియ భారతీయుడా...!  

దేశమేగినా ఎందు కాలిడినా...

పొగడవోయ్ ఇస్రో చంద్రయాన్ - 3 

వీర విజయగాథను..


జయహో..!జయహో..! 

ఇస్రో జయహో..!

జయహో...!జయహో..!

ఇస్రో శాస్త్రవేత్తలారా..! జయహో..!

జయహో..!జయహో..! 

చంద్రయాన్ - 3 జయహో..!


68. "హంస"లా హాయిగా జీవించు..!


ఓ నా ప్రియ నేస్తమా ! 

నీ పరుగు ఆపకు... ‌

నీ గమ్యం‌ చేరేవరకు...

నీ లక్ష్యం నెరవేరేవరకు...

నీ ప్రతి మాటలో బాటలో 

భారతీయతనే "జపించు"

నిత్యం విశ్వశాంతికై "తపించు"

విశ్వగురువు - స్వామి వివేకానందలా...


ఓ నా ప్రియ నేస్తమా ! 

నీలోని పగను...

ప్రతీకారాన్ని...ద్వేషాన్ని

కోపాన్ని తక్షణమే "త్యజించు"

శాంతమూర్తి - గౌతమ బుధ్ధునిలా...


ఓ నా ప్రియ నేస్తమా ! 

నీ శత్రువులను సైతం "ప్రేమించు"

నిన్ను హింసించిన వారిని "క్షమించు" 

మంచిని మానవత్వాన్ని "ప్రబోధించు"

కరుణామయుడు-ప్రభువైన యేసుక్రీస్తులా

 

ఓ నా ప్రియ నేస్తమా ! 

అట్టడుగు వర్గాల హక్కులకై 

నీ రక్తాన్ని స్వేదంలా "చిందించు"...

నిప్పులా "జ్వలించు"

నిరంతరం "పోరాడు" 

రాజ్యాంగ శిల్పి- డా.బి.ఆర్ అంబేద్కర్ లా


ఓ నా ప్రియ నేస్తమా ! 

అహింసే ఆయుధంగా...

రక్తపాత రహితంగా 

నీ బొందిలో ఊపిరి ఓపిక ఉన్నంతవరకూ..."ఉద్యమించు"

సింహాలనైనా "ఎదురించు" 

నీ హక్కులు "సాధించు"

అహింసావాది - మహాత్మా గాంధీలా...


ఓ నా ప్రియ నేస్తమా ! 

అమాయకుల అజ్ఞానుల 

శక్తిహీనుల నేత్రాలు"తెరిపించు"

సుఖ జీవన సూత్రాలను"బోధించు"

ఆరోగ్యంగా ఆనందంగా అందరికీ 

ఆదర్శంగా ప్రశాంతంగా "జీవించు" 

సమతామూర్తి -

శ్రీ రామకృష్ణ పరమ"హంస"లా...


69. ఖరీదైన (రెండులక్షల) త్యాగం..!


అనగనగా

ఒక పొదుపరి...

ఒక మదుపరి...

దూరదృష్టిగల 

పక్కాలెక్కల మనిషి...

"ఉదార హృదయుడే"

కానీ పరుల దృష్టిలో 

పాపం "పరమ పిసినారి" 


ఆ పిసినారి మనిషి 

పేదవాడిగా పుట్టినోడు... 

కష్టం విలువ ఎరిగినోడు...

ధనం విలువ తెలిసినోడు...


"రెండులక్షలు" ఖర్చు చేశాడు... 

మా విహారయాత్రల కోసం...

మేము తొలిసారి విమానాలెక్కి 

విదేశాలలో విహరించడం కోసం...


నిజమే కళ్ళు చెదిరే ఈ

అందమైన అతిసుందరమైన 

అత్యంత ఆశ్చర్యకరమైన 

మలేషియా భవనాలను 

ఎత్తిన తలను దించక 

ఒళ్ళంతా కళ్ళుచేసుకొని చూసేందుకు...

ఈ రెండుకళ్ళు చాలవు...వేయి కావాలి... 


ఔరా ఇదికదా "స్వర్గ సీమంటే"

అనిపించే ఆ ఆకాశ హార్మ్యాలను 

తిలకిస్తుంటే...మది పులకిస్తుంటే...


అంతులేని ఆత్మ తృప్తి...

అనంతమైన ఆనందం... 

వర్ణించతరం కాదే ఏకవికైనా


ఈ ఎత్తైన భవనాల మధ్య 

తిరుగుతూ వున్నంత సేపు... 

ఇప్పటికిక మా జన్మ ధన్యమే... 

మరో జన్మంటూ ఉంటే 

ఇక్కడే జన్మించాలని...

ఆ భగవంతున్ని కోరుకోవాలి...


ఔను నిజంగా ఇది

మా సంతోషం కోసం...

మా మనశ్శాంతి కోసం....

మా ఇద్దరి వినోదం కోసం...

మా మానసికానందం కోసం... 

"మా పిసినారి" మాకు అందించిన

గొప్పఅదృష్టమే అపూర్వమైన అవకాశమే

మరిచిపోలేని...ఒక మధురానుభూతియే...


ఇది జీవితాంతం

వీడని మా నీడై మా వెంటే ఉంటూ

గుర్తుకు వచ్చిన ప్రతిసారి

మా మదిని పులకింప జేస్తుంది 

తేనె కంటే తీయనైన... 

మామిడి రసం కంటే... 

మధురాతి మధురమైన ఈ తీపి జ్ఞాపకం...


ఔను ఇది చాలా చాలా "ఖరీదైన త్యాగం"... 

ఈ త్యాగానికి చూపాలి విజ్ఞత...కృతజ్ఞత...

అప్పుడు కదా... 

ఈ నర జన్మకు ఒక అర్థం పరమార్థం...

ఇకనుంచి మా పిసనారికి 

పేరు మార్చాలి "మా బంగారు కొండని"...

నేడే ప్రమాణం చేయాలి...ఈ కొండకి

మేము జన్మంతా ఋణపడి ఉంటామని...


70. ఎవరైతే...


ఎవరైతే...వజ్రంలా 

...అరుగుతారో 


ఎవరైతే...ఐస్ ముక్కలా

...కరుగుతారో 


ఎవరైతే...వరదలో మొక్కలా 

...వొరుగుతారో 


ఎవరైతే...చల్లని నీడను

కమ్మని ఫలాలనిచ్చే పచ్చనిచెట్టులా

...పెరుగుతారో 


ఎవరైతే...ముందస్తుగా

ప్రమాదాన్ని పసికట్టి ప్రక్కకు

....జరుగుతారో


అట్టి వారు అత్యున్నత

శిఖరాలకు చేరుకుంటారు

వారే విశ్వవిజేతలౌతారు


ఎవరైతే...బజారులో 

అచ్చోసిన ఆంభోతులా 

సిగ్గూలజ్జా లేకుండా విచ్చలవిడిగా

...తిరుగుతారో

విందు వినోదాలకు విలాసాలకు

...మరుగుతారో


ఎవరైతే...కోట్ల ఆస్తుల్ని 

పంచినా సంతృప్తి లేక కని...పెంచిన

దేవతలైన అమ్మానాన్నలు

కనిపించగానే శునకాల్లా

...మొరుగుతారో

 

అట్టివారు ఎన్నో 

పాపాలను శాపాలను

మూటగట్టుకొని కళ్ళముందే...

కనుమరుగైపోతారు...

కాలగర్భంలో కలిసిపోతారు....


71. ఓ అమ్మ...ఓ బ్రహ్మ...ఓ బొమ్మ..!


అదృష్టం...

+ హార్డ్ వర్క్... 

= సక్సెస్ ...అంటే 

నీ విదేశీయానం

ఒక అదృష్టమైతే... 

అది దివిలో ఆదైవనిర్ణయమైతే...


నీకు సంపాదనే లేకపోతే 

నీ టిక్కెట్ల ఖర్చులకు...భువిలో 

శ్రమపడి సర్దేది నీ అమ్మానాన్నలే...


నీ పుట్టుక...అంటే...

పరలోకం నుండి నీరాక

నీ విదేశీయానం...అంటే 

పరదేశాలకకు నీ పయణం

దివిలోని ఆ దైవనిర్ణయమే ఐతే...

నీకు జన్మనిచ్చేది మాత్రం 

భువిలో నీ అమ్మానాన్నలే...


ఆ జననానికి ఈ పయణానికి

ఎవరు కారకులో ఎవరికెవరు?

కనిపించని ఆ పరమాత్మనే... 

అమ్మా నాన్నల రూపంలో నీకు

ప్రత్యక్షమయ్యేది ఆ పరమాత్ముడే...


ఇద్దరి రూపంలో ఉన్న ఒక్కరు

అనంతుడు రూపరహితుడు

అదృశ్యశక్తి సర్వాంతర్యామి 

అమ్మా నాన్నలే... 

పరమాత్మకు ప్రతిరూపాలు... 

అమ్మా నాన్నలే ప్రత్యక్ష దైవాలు...


నిజానికి ఓ అమ్మ ...ఓ బ్రహ్మ...

ఈ భూమిపై నీవొక మరబొమ్మ... 

ఆ బ్రహ్మచేతిలో నీవొక కీలుబొమ్మ...

అంతే...నిజానికీ మానవజన్మ బహు వింతే


72. విదేశీయానం ఒక వరమె..?


ఒక జననం...

ఒక మరణం...

ఒక విదేశీ యానం...

ఒక పెళ్లి సంబంధం... 


ఒక ఉన్నత విద్య... 

ఒక ఉన్నతమైన ఉద్యోగం...

ఒక కోరుకున్న బిడ్డను కనడం... 

ఒక ఉత్తమురాలైన భార్య దొరకడం... 

అన్నది నరునిచేతిలో లేదన్నది నగ్నసత్యం.


కారణం అన్నీ దైవాధీనాలే‌...

ఆ పరమాత్మ అపురూపమైన 

అమృత అదృశ్య హస్తకృత్యాలే...

ఆ దైవం అందించే అద్భుత వరాలే...

కాదనక నమ్మినోళ్ళే ధన్యులు ఈ ధరణిలో..














Comments