60...అక్టోబర్ నెల 2023కవితల ఇండెక్స్
1. దైవం దీవించిన దంపతులు..?
2. చింతలేని
కాపురానికి...చిరుచిట్కాలు...
3. నీ కాపురం...
అనురాగ గోపురం...కావాలంటే?
4. అజ్ఞాత గురువులు..?
5. సీతాపహరణం...
ఒక గొప్ప గుణపాఠం..?
6. పాలు...పచ్చగడ్డి..? ( మినీ కవితలు)
7. కాలం ఖరీదైన వజ్రం...?
8. సమతా మమతల శాంతిశిఖరం
(శాంతిదూత ముహమ్మద్ ప్రవక్త...)
9. మూడు వరాలు"పొందాలంటే...?
(ఆరోగ్యం...ఆనందం...ఆయుష్షు)
10. ఒక్కటే ఒక్కటి...?
11. నవజీవన వేదమే...నాదమే ..?
12. ధనం చెబుతుంది...
13. పంచభూతాలు"...
14. అబద్ధాలు ఆడిచూడు..!
15. విశ్వవిజేతలు
16. కాళ్ళు కడగాలా...?
కట్నమడగాలా.....? (హాస్య కవిత)
17. గుబులు రేపే గులాబి(ముల్లు)
18. అతీంద్రియ శక్తులు రెండు..?
19. అగ్ని గుండాలా..?
అమృత భాండాలా..?
20. నేనొక గొర్రెల కాపరిని..!
21. కవిని నేను... కాస్త జాగ్రత్త..!
22. పిచ్చి... పిచ్చి... పిచ్చి
23. నవ్వకు నవ్వకు...!
నమ్మకు నమ్మకు..!!
24. ఆత్మకు ప్రతిబింబం
25. చేతివేళ్ల సందేశం..?
26. అంబేద్కర్ చూపుడు
వేలికి అర్థమేమిటి..?
27. కాకి బ్రతుకా వద్దు..?
హంస బ్రతుకే ముద్దు..?
28. ఆ దేవదేవుడు
29. ఆలోచనాతరంగాల తాండవం..?
30. కవిరాజపోషకులకు
కళాభివందనాలు...!!!
31. ఓ వాల్మీకి వారసులారా
మీరు ధన్యులు...?
32. నగ్నసత్యాలు...ఆణిముత్యాలు
33. కవిరాజ పోషకులకు కనకాభిషేకం
34. ఓ నాన్నా ! మీకు వందనం !
అభివందనం ! పాదాభివందనం !!
35. ఉక్కుమహిళ శ్రీమతి ఇందిరాగాంధీ
(వర్థంతి సందర్భంగా ఓ కన్నీటి కవిత)
36. గుండెగుడిలో వెలిగే
విప్లవజ్యోతి గద్దరన్న..!
37. భార్య ఫోన్ ...భర్త వైర్...?
38. గదిలో గబ్బిలంలా...బ్రతక్కు...
39. కోర్కెల కొలిమి...?
40. ఆమెంటే నాకెంతో ఇష్టం..!
41. 265 ఏళ్ళ పైడితల్లి మహా జాతర
42. బంగారు బ్రతుకులు...?
43. నడక...పడక...
44. శివతాండవం..?(చిత కవిత)
45. ధన్యులెవరు..?
46. పెరుగు...పరుగు...?
47. అందాలు ఆరబోసే అంగడి బొమ్మ..!
48. అయ్యో ఓ దైవమా?
ఏమాయె...మా ప్రార్ధనలు..?
49. ఇజ్రాయెల్ హమాస్
యుద్దం కవితలు (12)
1. దైవం దీవించిన దంపతులు..?
ఎక్కడా కలవనినాడు
ఏపరిచయంలేనినాడు
ఎవరికి ఎవరు తెలియనినాడు
వారిద్దరు..."అపరిచితులు"
ఏదో సందర్భంలో అనుకోకుండా
కాకతాళీయంగా కలిసినప్పుడు
మాట మాట కలిసినప్పుడు
ఒకరి భావాలను ఒకరు
ఒకరి బాధలను ఒకరు
ప్రేమతో పంచుకున్నప్పుడు
వారిద్దరు..."స్నేహితులు"
అప్పుడప్పుడు కలిసినప్పుడు
మాట మాట కలిసినప్పుడు
చూపు చూపు కలిసినప్పుడు
మనసు మనసు కలిసినప్పుడు
ఒకరిని ఒకరు కోరుకున్నప్పుడు
వారిద్దరు... "ప్రేమికులు"
ఇద్దరు ఒకరితో ఒకరు
జీవితాన్ని పంచుకోవాలని కలిసి
బ్రతకాలని భావించినప్పుడు
నిశ్చితార్థం జరిగినప్పుడు
పెళ్ళి పీటలెక్కినప్పుడు
వివాహబంధం ఏర్పడినప్పుడు
వారిద్దరు..."నూతన వధూవరులు"
ఆపై శోభనం జరిగినప్పుడు
పడకగదిలో పట్టెమంచంలో
ఇద్దరు ఒక్కటై పోయినప్పుడు
కలిసి కాపురం చేసినప్పుడు
సంతానం కోసం తపించినప్పుడు
వారిద్దరు..."భార్యాభర్తలు"
ఆ ఇద్దరు ముగ్గురు కావాలని
కమ్మని కలలు కన్నప్పుడు
ఆకలలు నిజమైనప్పుడు
కడుపు పండినప్పుడు
పాపో బాబో పుట్టినప్పుడు
వారిద్దరు..."తల్లీదండ్రులు"
వారి పిల్లలకు
పెళ్ళిళ్ళు చేసినప్పుడు
వారిద్దరు..."అత్తామామలు"
ఆ పిల్లలకు
పిల్లలు పుట్టినప్పుడు
వారిద్దరు..."అవ్వాతాతలు"
వారికి కంటిచూపు కరువైనప్పుడు
కాళ్ళల్లో నడిచే సత్తువలేనప్పుడు
అందరిపై ఆధారపడుతున్నప్పుడు
వారిని భారంగా భావించినప్పుడు
వృద్ధాశ్రమంలో వదిలి పెట్టినప్పుడు
వారిద్దరు..."అందరుఉన్నా అనాధలు"
ఆకలికి అలమటించే..."అస్థిపంజరాలు"
ఎవరినీ నిందించలేని..."నిస్సహాయులు"
వారే కన్న కమ్మని కలలన్నీ కల్లలై
మరలిరాని లోకాలకు తరలిపోతున్న
నిన్న దైవం దీవించిన ఆదర్శ"దంపతులు"
నేడు ఆ దైవమే శపించిన "భార్యాభర్తలు"
2. చింతలేని
కాపురానికి...చిరుచిట్కాలు...
ఓ నూతన వధూవరులారా !
మీ పచ్చని సంసారానికి...
ఇవిగో చిరుచిట్కాలు...
మదినిండా
అనుమానాల...
విషాన్ని నింపుకోకండి !
ఏ చీకుచింతలు లేక
చిరునవ్వులు చిందిస్తూ
చిలకా గోరింకల్లా మీరు
చిరకాలం జీవించండి !
చెట్టుకులతల్లా పెనవేసుకున్న
మీ బంధాలను...తెంచుకోకండి !
కోపంతో రెచ్చిపోయి
పిచ్చిపిచ్చిగా...మాట్లాడుకోకండి !
మీ గతపరిచయాల
గాలిపటాలను...ఎగురవేయకండి !
అదేపనిగా పదేపదే
మూడోవ్యక్తితో...ముచ్చటలాడకండి !
గతాన్ని త్రవ్వుకోకండి !
మనసుల్ని గాయపరచుకోకండి!
ముఖాముఖి చర్చలే
మనస్పర్థలకు మందులని మరువకండి
ఒకరినొకరు ప్రేమించుకోండి !
గౌరవించుకోండి ! భావాలను పంచుకోండి !
అపార్థాల అగ్నిని...రగుల్చుకోకండి !
పచ్చని కాపురంలో...చిచ్చు పెట్టుకోకండి !
కడుపులో కక్షను పగను ...పెంచుకోకండి !
"అన్న" పోలన్న !
పలుకుపలుకులో ! తేనెలొలుకు !
విన్న చాలు
మీ జీవితంలో ! అమృతం చిలుకు !
3. నీ కాపురం...
అనురాగ గోపురం...కావాలంటే?
ఓ మగువా గుర్తుంచుకో ..!
..."నీ అతి మంచితనమే"...
..."నీ సున్నితమైన మనసే"...
...అన్నింటికీ
...అతిగా స్పందించే
..."నీ పసి హృదయమే"
అందరిచే మంచి
అనిపించుకోవాలన్న
..."నీ తపనే"...
..."తహతహలాడే...నీ తత్వమే"...
"మురికి మనుషుల్ని" సైతం
"కడిగినముత్యాలుగా" భావించి వారు
విసిరే "వలలో" చిక్కుకుని ఆవేదన చెందే
నీకు అర్ధం కాని..."నీ అమాయకత్వమే"...
దుర్బుద్ధి...
వంకర చూపులు...
దుష్టతలంపులు...
మదినిండా దాచుకొని...
కనిపించని...మంచితనపు
..."ముసుగును కప్పుకున్న మొసళ్ళను"...
అవకాశం కోసం...గుడ్లగూబల్లా
ఆశతో ఎదురు చూసే గుంటనక్కల్ని...
అవసరాల కోసం వాడుకొని వదిలేసే నిలువునా ముంచే నయవంచకుల్ని
నమ్మే "బహిర్గతం కాని నీ బలహీనతలే"...
నీ "అంతర్గత శత్రువులు"...
అవి ఇతరులతో అతిచనువుకు...
ఆ "అతిచనువు" అక్రమసంబంధాలకు
దారులు కావచ్చు నీవు దారితప్పిపోవచ్చు
నీ "బలహీనతలకే " నీవు బలికావొచ్చు
నీ "మంచితనమే" నిన్ను ముంచేయవచ్చు
ఈ పులులతో నీవు భీకరపోరాటం చేయాలి
ఆ విధిని ఎదిరించాలి విజయం సాధించాలి
ఓ మగువా..! మరువకు...
అప్పుడే...నీకు నలుగురిలో గౌరవం...
అప్పుడే...నీకు ప్రశాంతమైన జీవితం...
అప్పుడే...నీ కాపురం అనురాగ గోపురం...
4. అజ్ఞాత గురువులు..?
ఓ మిత్రులారా..!
గుర్తుంచుకోండి..!!
ఆరని ఆశలే...
తీరని కోరికలే...
ఖాళీ జేబులే...
కన్నీటి ధారలే...
కాలే కడుపులే...
కూలే గుడిసెలే...
జరిగే మోసాలే...
పెరిగే అరాచకాలే...
మట్టి వాసనలే...
మారని బ్రతుకులే...
పగిలిన గుండెలే...
తగిలిన గాయాలే...
నలిగిన మనసులే...
కోసే రంపపు కోతలే.....
విధివ్రాసే వింత వ్రాతలే...
విజ్ఞులకు చేసుకున్న విన్నపాలే...
గుండెల్లో గుచ్చుకున్న గునపాలే...
మీకు అపరిచిత...అజ్ఞాత...గురువులని...
మీకు జీవితాంతంపాఠాలు నేర్పుతాయని...
5. సీతాపహరణం...
ఒక గొప్ప గుణపాఠం..?
చిన్న మొక్కేకదాని...
పీకకు...పీక కోసేస్తా...
అన్నది నిన్నటి
ఓ సినిమాలో నటుని
సూపర్ హిట్ డైలాగ్
ఔను మిత్రమా...
చిన్న నిప్పురవ్వే కదాని...
వదిలేయకు...కారడివినే
అది కాల్చి బూడిద చేస్తుంది...
చిన్న రంధ్రమే కదాని...
నిర్లక్ష్యం చేయకు...అది పెద్ద
ఓడనే నీటిలో ముంచేస్తుంది...
చంచడే కదాని...
కాస్త కాస్త తోడేయకు...
కళ్ళముందే వంటపాత్ర
పూర్తిగా ఖాళీ ఐపోతుంది...
నాటి కామాంధులకది
చిన్నివిషయమే కావచ్చు...
కానీ లంకాదహనానికి...
రాక్షస సంహారానికి...
రావణరాజ్యం
కుప్పకూలిపోవడానికి
ఏమిటీ అసలు కారణం...
తల్లి సీతమ్మ అపహరణం...
అందుకే అంటారు పెద్దలు...
విజ్ఞులు...అనుభవగ్నులు...
చరిత్ర చెబుతోందని...
చిన్న విషయాలు
చీపురుపుల్లలు కాదని
అవి అగ్గిపుల్లలని...
వాటిపై సైతం కూసింత
దృష్టి పెట్టమని...
నిద్రపోక నిఘా ఉంచమని...
నిఘా ఉంచుకున్న...
నిర్లక్ష్యం వహించిన...
రేపు నీ జీవితంలో
కురిసేది నిప్పుల వర్షమేనని...
6. పాలు...పచ్చగడ్డి..? ( మినీ కవితలు)
పచ్చగడ్డి
మేసిన ఆవు
చిక్కని పాలిస్తుంది
కూడు తినే కుక్కకు
అదే పచ్చగడ్డి వేస్తే
బక్కచిక్కిచచ్చిపోతుంది
గులాబీలతో వంట...?
గులాబీ టమాటా కన్న
మిన్నగా గుభాళించవచ్చు
కానీ వంటగదిలో ఏ వనిత
గులాబీలతో కూరను వండలేదు
పరులకిచ్చిన వరాలు ..?
భగవంతుడు పరులకిచ్చిన
వరాలను చూసి అసూయచెందకు
నీకిచ్చిన అనంతమైన శక్తిసామర్థ్యాలకు
భక్తిశ్రద్ధలతో భగవంతున్ని
నోరారా స్తుతించు...
మనసారా కృతజ్ఞతలు చెల్లించు...
ఆటలో...? ఆ వేటలో...?
సింహం తిమింగలం రెండు
ఆటలో వేటలో ఆరితేరినవే...
కానీ సముద్రంలో సింహం
అడవిలో తిమింగలం ఆటలు సాగవు
కానీ కాలం కలిసి వస్తే తమ
సామ్రాజ్యాంలో తాము రాజులే...
వీరవిహారం చేసే వీరాధివీరులే...
7. కాలం ఖరీదైన వజ్రం...?
"కాలం"
"ఖరీదైన వజ్రమని"...
"శీలం" స్త్రీకి
"రక్షణ కవచమని"...
అంటారు అందరూ...
పదవీ
విరమణ
చేసినవారు...
కాటికి కాళ్ళు
చాచినవారు...
"కాలచక్రం" గిర్రున
తిరుగుతోంది...
"కాలం" శరవేగంతో
పరుగులు
పెడుతోందంటారు...
కానీ...
ఉరుకుల
పరుగుల
జీవితం నీది...
ఈ భూమి మీద
"భూచక్రంలా"
గిర్రున తిరిగేది నీవే...
కనిపించని
కాలప్రవాహం...
ఎంతవరకు..?
"యుగాంతం" వరకు...
నీటిబుడగలాంటి
నీ జీవితమెంతవరకు..?
" నీ బొందిలో "
" ప్రాణం" ఉన్నంత వరకు..
విలువైన నీ కాలాన్ని
"వృధా" చేయడమంటే...
నీవు "ఊబిలోకి" జారి
"ఉక్కిరిబిక్కిరై" పోవడమే...
ఔను తమ
"సమయాన్ని"
"సద్వినియోగం"
"చేసుకున్నవారే"...
"సమాజానికి...దీపస్తంభాలు"...
"ప్రతిభకు...ప్రగతికి ప్రతిబింబాలు"...
"విశ్వవిజేతలు...స్పూర్తి ప్రదాతలు"...
8. సమతా మమతల శాంతిశిఖరం
(శాంతిదూత ముహమ్మద్ ప్రవక్త...)
చిరు ప్రాయంలోనే
కన్నవారు దూరమైనా
పినతండ్రి పెంపకంలో పెరిగిన
శాంతిదూత ముహమ్మద్ ప్రవక్త...
ఖురేష్ తెగల బహుదేవతా
విగ్రహారాధనకు బద్దవ్యతిరేకి...
ఆధిపత్యంకోసం దాడులు
దండయాత్రలు చేసుకుంటూ
రక్తదాహంతో
పగాప్రతీకారాలతో
రగిలిపోయే తెగలతో
బద్ర్...ఉహద్...ఖందఖ్...
హునైనుల్లో యుద్ధభేరీలను
మ్రోగించి అరేబియా తెగల
తిరుగుబాటుదారుల్ని అణచివేసి
రక్తపాత రహిత ఆక్రమణతో
ఆథ్యాత్మిక ఇస్లామిక్
సామ్రాజ్య స్తాపనచేసి
"కాబా" గృహంలో మక్కావాసులు
భక్తి శ్రద్ధలతో ఆరాధించే
"360 విగ్రహాలను" తొలగించిన మహాయోధుడు ముహమ్మద్ ప్రవక్త...
ఇస్లాం...అంటే...
శత్రువులను ప్రేమించాలని...
ఓర్పువహించాలని దానధర్మాలు చేయాలని
చమటచుక్కలు ఆరకముందే కూలివ్వాలని
అవనిలో అల్లా ఒక్కడే అందరికీ దేవుడని...
విశ్వసించాలని...విధేయులుగా ఉండాలని..
అల్లా...అంటే.....
కరుణామయుడని...
అపార కృపాసాగరుడని...
సర్వలోకాల సృష్టికర్తయని
తీర్పుదినానికి అధిపతియని
మహాజ్ఞానియని...మహిమాన్వితుడని....
ఖురాన్...అంటే...
ఒక పవిత్రగ్రంథమని...
దాన్ని శ్రద్దా పఠించిన వారికి...
ప్రవచనాలన్నీ పాటించిన వారికి...
మరణాంతరం కూడా
సుఖజీవనముంటుందని...
అమృత సందేశాన్నందించిన...
ప్రపంచశాంతికై పరితపించిన...
ఓ ముహమ్మద్ ప్రవక్తా...,
ఓ విశ్వ కారుణ్యమూర్తి...
ఓ దైవాంశ సంభూతుడా...
ఓ సమతా మమతల శాంతి శిఖరమా...
మీకు ప్రణామం...ప్రణామం...ప్రణామం...
9. మూడు వరాలు"పొందాలంటే...?
(ఆరోగ్యం...ఆనందం...ఆయుష్షు)
ఓ నా ప్రాణమిత్రులారా..!
మీరు "ఆరోగ్యంగా" వుండాలంటే...
మీ "ఆయుస్సు" పెరగాలంటే...
నిత్యం నాలుకను
నియంత్రించుకోవాలి...
ఇది సత్యం...సంస్కారం
క్రమశిక్షణతో చేయాలి
వ్యాయామం...యోగ
ధ్యానం...సూర్యనమస్కారం
ఓ నా ప్రాణమిత్రులారా..!
మీరు "ఆస్తులు" ఆర్జించాలంటే...
మీరు "ఆనందంగా" జీవించాలంటే...
మీరు నడిచే దారిలో
"ఆ నలుగురిని"
నవ్వుతూ పలకరించాలి...
ఇన్ని చిరునవ్వుల్ని
వారి ముఖాన చిలకరించాలి...
ఓ నా ప్రాణమిత్రులారా..!
మీ "ఆందోళనలు" తొలగాలంటే...
మీరు "అందరి ఆశిస్సులు" పొందాలంటే...
ప్రాణమిత్రులతో ఏ వివాదం వద్దు
బద్దశతృవులతో ఏ విరోధం వద్దు
పంతాలు పట్టింపులు వద్దు
రాజీమార్గమే ముద్దు
విహారయాత్రలకెళ్ళాలి
పుణ్యక్షేత్రాలన్నీ చుట్టిరావాలి
ఆథ్యాత్మిక గ్రంథాలైన బైబిల్
భగవద్గీత ఖురాన్ భారత భాగవత
రామాయణాది బృహత్ గ్రంధాలను
భక్తిశ్రద్ధలతో పగలు రాత్రి పఠించాలి
ఓ నా ప్రాణమిత్రులారా..!
మీరు "సుఖశాంతులతో "
హాయిగా జీవించాలనుకుంటే...
మీరు "ప్రశాంతంగా"
ఆ పరమాత్మను చేరాలనుకుంటే...
ఆ పరమాత్మను
మీరు నిత్యం జపించాలి
వారి కరుణకోసం తపించాలి
భగవన్నామస్మరణలో
నిత్యం మునిగితేలాలి
ఆ అఖండ జ్యోతిని
ఆ దివ్య మంగళ స్వరూపాన్ని
కనులారా దర్శించుకోవాలి
సత్యాన్ని న్యాయాన్ని దయను
జాలిని ఆయుధాలుగా ధరించాలి
జన్మతరించేలా భాధల్ని భరించాలి
ఆశతో అర్థించాలి పేరాశతో ప్రార్థించాలి
సుఖంగా...సురక్షితంగా...సుభిక్షంగా
ధర్మార్థ కామమోక్ష మార్గాన పయనించాలి
అందుకే
ఓ నా ప్రాణమిత్రులారా..!
ఈ వేళ మీ అందరికిదే
నా అక్షర సందేశం..!!
"సూర్యుని కంటే"
ముందు లేచినవారే...
సుఖపడతారని"...
"పుష్టికరమైన ఆహారం"
పుచ్చుకున్నవారే...
షష్టిపూర్తి చేసుకుంటారని"...
ఆ భగవంతున్ని భక్తిశ్రద్ధలతో
ప్రార్థించినవారే ఆరాధించినవారే...
ఆరోగ్యం...ఆనందం...ఆయుష్షను...
"మూడు వరాలను" పొందుతారని...
10. ఒక్కటే ఒక్కటి...?
"భాషలు" వేరైనా
"భావం" ఒక్కటే...
"రంగులు" వేరైనా
"రక్తం" ఒక్కటే...
"భక్తులు" వేలైన
"భగవంతుడు" ఒక్కడే...
"పండేపంటలు" వేరైనా
"దున్నేపొలం" ఒక్కటే...
"వండేవంటలు" వేరైనా
"జిహ్వకి రుచి" ఒక్కటే...
"నగలు" వేరైనా
"బంగారం" ఒక్కటే...
"కుండలు" వేరైనా
"మట్టి ముద్ద" ఒక్కటే...
"ఎగిసే అలల"ఎన్నైనా
"కదలని కడలి" ఒక్కటే...
"ఎగిరే పక్షులు" ఎన్నైనా
"రెపరెపలాడే రెక్కలు రెండే"...
"కన్నీటి ధారలెన్నైనా"
"కంటిచూపు" ఒక్కటే...
"జంతువులు"ఎన్నైనా
"చిక్కనిపాలు" ఒక్కటే...
"దేహాలు" వేరైనా
"పరమాత్మ" ఒక్కడే...
కనిపించని "దేవతలు"
ఎందరున్నా కనిపించే
దేవత..."అమ్మ" ఒక్కతే...
"దారులెన్ని" ఉన్నా
"గమ్యం" ఒక్కటే...
"మతాలు"ఎన్ని ఉన్నా
"సందేశం" ఒక్కటే...
"సమస్యలెన్ని ఉన్నా"
"సంసార సాగరమొక్కటే"
తరతరాలకు తరగని
"ఆస్తులు" కోట్లు ఎన్ని ఉన్నా
"ఆరని ఆకలి" ఒక్కటే...
"అవయవాలు" ఎన్ని ఉన్నా
ఆగక కొట్టుకునే..."గుండె" ఒక్కటే...
కనిపించని..."వేర్లు" ఎన్నిఉన్నా
కనిపించే..."చెట్టు" మాత్రం ఒక్కటే...
"చిటపటమని"
"చినుకులు" ఎన్ని రాలినా
నింగిలో..."మేఘమొక్కటే"...
నింగిలో "చుక్కలెన్ని" వున్నా
చక్కని...ఆ చంద్రుడొక్కడే...
అంతరిక్షంలో "గ్రహాలెన్ని"ఉన్నా
ఆరక వెలుగునిచ్చే...సూర్యుడొక్కడే ...
11. నవజీవన వేదమే...నాదమే ..?
కళ్ళెందుకున్నాయి..?
అందమైన సుందరమైన
దృశ్యాలను తిలకించి..!
పులకించి పోయేటందుకు..!
హృదయమెందుకున్నది..?
తాను తెలిసి తెలియక
చేసిన తప్పుల్ని
సరిదిద్దుకునేందుకు..!
ఇరులు చేసిన ఘోరమైన
నేరాలను సైతం క్షమించేటందుకు..!
మనసెందుకున్నది..?
మౌనవ్రతం దాల్చేటందుకు..!
గతంలో ఈ గుండెకు తగిలిన
గాయాలను గుర్తుతెచ్చుకోకుండా
శాశ్వతంగా మరిచిపోయేటందుకు..
అప్పుడు ఈ జీవితం...
నయనానందకరమే..!
నవజీవన వేదమే...నాదమే..!
అప్పుడు ఈ జీవితం...
నవ్వుల నావే..! నవ వసంతమే..!
అప్పుడు ఈ జీవితం...
నందన వనమే..! నవరస భరితమే..!
12. ధనం చెబుతుంది...
ఆర్జించమని...
అనుభవించమని...
అంతకు మించి
ఏమీ ఆశించరాదని...
కాలం చెబుతుంది...
కష్టేఫలి అని...
కన్నీరు కార్చవద్దని...
ప్రతిఫలితం గురించి
ప్రశ్నించ రాదని...
భవిష్యత్తు చెబుతుంది...
పోరాడమని...పోరాడితే
నీ బానిసత్వమేనని...
విముక్తి గురించి
విజయం గురించి
విచారించవద్దని...
భగవంతుడు
చెబుతున్నాడు...
తననే నిత్యం స్మరించమని...
కోటి వరాలను పొందమని...
13. పంచభూతాలు"...
నిన్ను నన్ను
నడిపించే
"పంచభూతాలు"...
కాలికి తొడిగిన
"ఖరీదైన చెప్పులు"...
జీవితంలో
తెలిసీ తెలియక
"చేసిన తప్పులు"...
కళ్ళకు కనిపించే
తళతళ మిళమిళ
"మెరిసే కప్పులు"...
వాటికోసం ఆశతో
ఆరాటపడి
ఆటలాడి పోరాడి
గెలిచి నలుగురిలో
"పొందిన మెప్పులు"...
భగభగ మండే
"ఆరని నిప్పులు"...
అవసరాలకు చేసి
"ఆపై తీర్చలేని అప్పులు"...
14. అబద్ధాలు ఆడిచూడు..!
నేడు
ఒక్కసారి
"అబద్ధాలు
ఆడిచూడు"
అందరూ నీకు
"దగ్గరి బంధువులే"...
నేడు
ఒక్కసారి
"నిండు నిజాలు
చెప్పి చూడు" నీపై
"నీలాప నిందల నిప్పులే"...
కానీ నీ అబద్ధాలు
"నిజమైన వేళ"...
అందరూ నీకు
"దూరపు బంధువులే"...
నీ నిజాలు నిప్పని
"నిగ్గు తేలిననాడు"
నిన్ను నిందించినవారు
" సిగ్గుతో చితికి పోతారు"...
ఇది నిజం...ఇది నిజం...
ఎవరూ కాదనలేని పచ్చినిజం...
15. విశ్వవిజేతలు
ఏ క్లిష్ట పరిస్థితుల మాయో కానీ
ఏ దుష్టశక్తుల ప్రభావమో కానీ
ఏ ప్రకృతి వైపరీత్యమో కానీ
ఏ వీధి వికృత విషప్రయోగమో కానీ
అనుకోకుండా ఆకస్మికంగా
కలలో కూడా ఊహించని రీతిలో
ఏదో ఒక దుస్సంఘటన
కనురెప్పపాటులో జరిగి
అప్పటివరకు
ఎంతో అభిమానంగా
ప్రాణానికి ప్రాణంగా
ఎంతో అన్యోన్యంగా ఉన్న
అమ్మానాన్నలు, అన్నాతమ్ముళ్ళు
అక్కాచెల్లెళ్ళు, ప్రాణమిత్రులు
దూరపు బంధువులు
ఒక్కసారిగా దూరమైపోతారు కానీ
ఎవరైతే దూరంగా వెళ్లినా
తిరిగి దగ్గరకు రావడానికి
పడిపోయినా పైకి లేవడానికి
చెడిపోయినా బాగుపడడానికి
విడిపోయినా కలిసి బ్రతకడానికి
గట్టిగా మనస్ఫూర్తిగా
ప్రయత్నిస్తారో వారే
విధిని ఎదిరించే...విజయాన్ని సాధించే
వీరాధివీరులు...శూరులు...విశ్వవిజేతలు
16. కాళ్ళు కడగాలా...?
కట్నమడగాలా.....? (హాస్య కవిత)...
కొత్త వధువు...కొంటె ప్రశ్న..?
కొంటె వధువు
కొత్త మొగుడితో...
ఏమండీ...
మా నాన్న గారు
మీకు కాళ్ళుకడిగి
"కన్యాదానం" చేశారు కదా...
మరి మీ అమ్మగారు
అదే మా అత్తగారు
నా కాళ్ళు కడిగి నాకు
"భర్తాదానం" చేస్తే
బావుంటుంది కదా...
ఆ...కాళ్ళు కడగాలా...?
కొత్త మొగుడి...కొంటె ప్రశ్న..?
కొత్త పెళ్ళాం...
కొంటె మొగుడితో..
ఏమండీ మనం కూడా
ఆ సీతమ్మతల్లి రామయ్యలా
ప్రతి సంవత్సరం ఇలాగే
కళ్యాణం చేసుకుందామండీ...
అలాగా కాదన్నదెవరు? కానీ
మీ నాన్నగారు ప్రతిసంవత్సరం ఎంత
కట్నం ఇస్తాడేమో కాస్త అడిగి చూడు...
ఆ... కట్నమడగాలా...?
17. గుబులు రేపే గులాబి(ముల్లు)
విరితోటలో
విరబూచి
మనసును దోచే
మరులు గొలిపే
రంగు రంగుల
కుసుమాలెన్ని ఉన్నా
గుభాళించే ఆ గులాబి
అందచందాలే వేరయా...
తన తలను త్రుంచి
తలలో తురుముకొనేవారి
కాళ్ళళ్ళో వణుకు పుట్టిస్తుంది...
గుండెల్లో గుబులు రేపుతుంది...
కళ్ళలో కన్నీరును తెప్పిస్తుంది...
ఆకు మాటున...
పువ్వు చాటున...
దాగిన ఆ గులాబి ముల్లు
గుచ్చుకున్న చాలు
చిందుతుంది...రక్తం...అందుకే
...అందమైన ఆ గులాబీకి...
...ఆకు చాటున దాగిన ఆ "ముల్లే" ధైర్యం...
ఔను కొందరు
తన కోపమే తన శత్రువంటారు
కోపిష్టులకు "ప్రేమ" సైతం ఎక్కువంటారు
కొందరు కళ్ళెర్రజేసి కస్సుబుస్సుమంటారు
కళ్ళముందే మంచుముక్కలా కరిగిపోయే
...ముక్కుమీది కోపం ఆముఖానికే అందం...
18. అతీంద్రియ శక్తులు రెండు..?
ప్రతిభాపాటవాలుండి
ప్రయోజనమేమి..?
ప్రణాళికలు లేకపోతే...
ప్రయత్నం చేయకపోతే...
శక్తిసామర్థ్యాలుండి
ప్రయోజనమేమి..?
సాహసం చేయకపోతే...
సమరానికి సై అనకపోతే...
అసాధ్యాలను
సుసాధ్యం చేసే
అనంతమైన...
అదృశ్యమైన...
అద్భుతమైన...
అంతర్గత...
అతీంద్రియ...
శక్తులు రెండే రెండు...
ఒకటి...
నిష్టతో
నిబద్ధతతో
నిర్మలమైన
నిశ్చలమైన చిత్తంతో
"నిరంతర చేసే ప్రార్థన"...
రెండు...
అఖండజ్యోతి
స్వరూపమైన...
ఆ పరమాత్మపై
అచంచలమైన...
అపురూపమైన...
"తరగని భక్తి విశ్వాసం"...
19. అగ్ని గుండాలా..?
అమృత భాండాలా..?
నీ ఓటే నీ
ఆయుధంగా...
అనుక్షణం
అప్రమత్తంగా...
ప్రలోభాలకు
బలికాకుండా...
ఆశతో దాటాలి
అక్రమార్కుల అవినీతి
..."అగ్ని గుండాలు"...
అందుకోవాలి
సురక్ష సుభిక్ష
సుపరిపాలనా
..."అమృత భాండాలు"...
నెరవేరని వాగ్దానాలతో
అరచేతిలో స్వర్గం చూపించే
ధనార్జనే ధ్యేయంగా...
ఎన్నికల్లో గెలిచేందుకు...
అధికారం దక్కించుకునేందుకు...
చట్టసభల మెట్లెక్కకుండా చూడాలి
...ఈ గుడ్లగూబలు..."ఈ గూండాలు"...
కుట్రలు
కుతంత్రాలు పన్నుతూ
ఎత్తుకు పైఎత్తులు వేస్తూ
ప్రత్యర్ధులను మట్టి కరిపించాలనుకునే...
రాజకీయంగా సమాధులు కట్టాలనుకునే...
దగుల్బాజీ దగాకోరులకు...
మాయదారి మల్లిగాళ్ళకు...
మళ్ళీమళ్ళీ మోసంచేసే ఈ మోసగాళ్ళకు
...బూతులో పెట్టాలి..."ఓటుతో పిండాలు"...
20. నేనొక గొర్రెల కాపరిని..!
తప్పిపోయిన గొర్రె పిల్లల్ని
వెతికి పట్టుకొస్తాను..!
గుంటలో పడిన గొర్రెపిల్లల్ని
పైకి తీసుకొస్తాను..!
దెబ్బలు తగిలిన గొర్రెపిల్లల
గాయాల్ని నయం చేస్తాను..!
అనారోగ్యంతో ఉన్న
గొర్రె పిల్లల్ని స్వస్థత పరుస్తాను..!
అమాయకపు గొర్రె పిల్లల్ని
అక్కున చేర్చుకుంటాను..!
నేను కరుణా జాలి
దయ ప్రేమగల కాపరిని
మంచి చేయడం నా ధర్మం..!
కానీ...పొగరుబోతు సోమరిపోతు
గొర్రె పిల్లల తోకలు కత్తిరిస్తాను..!
నా మాట వినని నన్ను లెక్కచేయని
కొవ్విన గొర్రె పిల్లల పీకలు కోసేస్తాను..!
కాపరి కళ్ళు గప్పి తిరిగే గొర్రె పిల్లల
గొంతు పిసికేస్తాను గొడ్డలితో నరకేస్తాను..!
నేను కాపరినే కాస్త కఠినంగా ఉంటాను...!!
21. కవిని నేను... కాస్త జాగ్రత్త..!
కవిని నేను...కలం పట్టానంటే...
కస్సుబుస్సు మనను...
కాటువేయను కడుపుమీద కొట్టను
కానీ...పంతానికి వస్తే మాత్రం
అక్షరాలతో అంతంచేస్తా..!
కవిని నేను...కలం పట్టానంటే...
పట్టుబట్టి గుట్టంతా రట్టు చేస్తా..!
కవిని నేను...కలం పట్టానంటే...
కడుపులో పేగుల్ని లెక్కపెడతా.!
కవిని నేను...కలం పట్టానంటే...
మానవత్వాన్ని మరచినవారికి...
మౌనంగా మరణశాసనం లిఖిస్తా..!
కవిని నేను...కలం పట్టానంటే...
కంటిచూపుతో శతృవుల్ని ఖతం చేస్తా..!
కవిని నేను...కలం పట్టానంటే...
సమాజంలో రుగ్మతలను సమాధి చేస్తా..!
కవిని నేను...కలం పట్టానంటే...
కమ్మనికలలు కంటాను...
పచ్చదనాన్ని ప్రేమిస్తాను...
మోడువారిన బ్రతుకుల్ని చిగురింప జేస్తా..!
22. పిచ్చి... పిచ్చి... పిచ్చి
ఆన్లైన్ లో గేములు ఆడడం
....ఓ పిచ్చి...ఆపండి...
యూట్యూబ్ లో వీడియోలు చూడడం
....ఓ వ్యసనం...ఆపండి...
సెల్లులో మిత్రులతో 24/7 మాట్లాడడం
....ఓ బలహీనత...ఆపండి...
కష్టాలలో ఉన్నాం కాస్త కరుణించమని..
చితికిపోయిన మా బ్రతుకుల్ని
....చిగురింపచేయమని...
సమస్యల సుడిగుండం నుండి
....మమ్ము తప్పించమని...
చీకటిలో చిక్కుకుపోయాం
....మా జీవితాలను వెలిగించమని...
రోగాలు లేని...కలతలు కన్నీళ్ళు రాని..
....రోజులను మాకు ప్రసాదించమని...
నిత్యం కోవెలలో ఆ
పరమాత్ముని దర్శించి...ఆపదలో ఉన్నాం
....తక్షణమే ఆదుకోమని...
శిరసు వంచి...చేతులు జోడించి...
ఆశతో అర్థించడం...కన్నీటితో ప్రార్థించడం
...వేదనతో....వేడుకోవడం... సైతం
...ఒక పిచ్చే...అది మాత్రం ఆపకండి...
23. నవ్వకు నవ్వకు...!
నమ్మకు నమ్మకు..!!
ఓ చెల్లీ..! నా బంగారు తల్లీ..!!
నీ చుట్టూ కోతులుంటాయి
కొండముచ్చులుంటాయి
గజ్జికుక్కలుంటాయి
గుంటనక్కలుంటాయి...జాగ్రత్త...
నల్లవన్నీ నీళ్ళని తెల్లవన్నీ పాలని
తొందరపడి...అందరినీ నమ్మకు...
నవ్వుతూ నట్టేటముంచే
నయవంచకులుంటారు
జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త..!
నిన్ను పొగిడి పొగిడి
నీకు మత్తెక్కిస్తారు నిన్ను
మైకంలో ముంచేస్తారు
కీలుబొమ్మను చేసి
ఆటలాడిస్తారు జాగ్రత్త..!
నీ మంచితనానికి ...
నీ అమాయకత్వానికి
నీ బలహీనతలకు నిన్ను
బలిచేస్తారు తస్మాత్ జాగ్రత్త..!
అందుకే ఓ చెల్లీ..! నా బంగారు తల్లీ..!
మారకు మారకు..!
నిన్ను అవసరాలకు వాడుకునే
ఆ టక్కరి నక్కల చేతిలో
ఒక ఆటబొమ్మగా మారకు..!
ఎవరెంతగా ప్రలోభపెట్టినా
ఎవరెన్ని ఊరించి ఊరించి
మాయమాటలు చెప్పినా
ఎన్ని కుళ్ళు జోకులు వేసినా
పళ్లు ఇకిలించి పకపకమని
నడిరోడ్డులో...నవ్వకు... నవ్వకు
నలుగురిలో చులకనైపోకు..!
ఎవరినీ నమ్మకు నమ్మకు...
నమ్మినా కాసింత నిఘా పెట్టివుండు
ఎవడు దొంగో ఎవడు దొరో
అది నీవిచ్చిన "అతిచనువుకే "ఎరుక..!
ఎవడు పచ్చి మోసగాడో..?
ఎవడిలో ఏ దుర్బుద్ది ఉందో..?
ఎవడి మనసులో ఏ కల్మషముందో..?
ఎవడు ఏ దారుణానికొడిగడతాడో..?
ఏపుట్టలో ఏ పాముంటుందో ఎవరికెవరు..?
అది నీవిచ్చిన "అతి చనువుకే "ఎరుక..!
అందుకే ఓ చెల్లీ..!నా బంగారు తల్లీ..!
గుర్తుంచుకో...జీవితాంతం
"అతిచనువు"...ఒక మానసిక శిక్షయని"...
"అది నీ శీలానికి...ఒక అగ్ని పరీక్షయని"...
24. ఆత్మకు ప్రతిబింబం...
ఎదుటివారి
వేదన తొలగించే...
ముఖాన్ని వెలిగించే...
...ఒక చిరునవ్వు...
ప్రేమతో పలికే
వెన్నెల కన్నా చల్లనైన...
తేనె కన్నా తీయనైన....
...ఒక చిలక పలుకు...
హృదయపూర్వకంగా
చిత్తశుద్ధితో ఏకాగ్రతతో
మనసారా చేసే...
...ఒక మంచి కార్యం...
అందమైన
అతిపవిత్రమైన
అఖండ జ్యోతి
స్వరూపమైన మీ
...ఆత్మకు ప్రతిబింబం...
25. చేతివేళ్ల సందేశం..?
ఒక వ్యక్తిని నీవు
నీ చూపుడు వేలుతో
కోపంతో ఘాటుగా
ప్రశ్నిస్తున్నావంటే...
నిప్పులు చెరుగుతూ
నిందిస్తున్నావంటే...
ఓ 3 వేళ్ళు నీ వైపు చూస్తున్నాయని...
నిన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నాయని...
తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!
నీ చేతివేలి మీద
ముద్రించే సిరాచుక్క
నేతల తలరాతల్ని మార్చివేస్తుందని...
ప్రజానాయకులకు ప్రాణం పోస్తుందని... తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!
మన చేతి 5 వేళ్ళు
సమంగా లేకున్నా
పిడికిలి బిగించినప్పుడు
అన్ని వేళ్ళు సమంగా ఉంటాయని...
మనలో రక్తాన్ని ఉరకలు వేయిస్తాయని... పాలకుల్ని ప్రశ్నిస్తాయని ప్రతిఘటిస్తాయని
తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!
మనం జీవితంలో
పంతాలకు పట్టింపులకు పోక
ఓ మెట్టుదిగితే...రాజీమార్గంలో
పయనిస్తే పోయేదేమీ లేదని...అప్పుడు
అందరి జీవితం ఒక ఆనందసాగరమేనని..!
తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!
తాళంచెవి లేకుండా తాళం లేదన్న... పరిష్కారం లేకుండా సమస్య లేదన్న... గొప్ప పరమ సత్యాన్ని తెలుసుకొని...
ప్రతిమనిషి ప్రశాంతంగా జీవించాలని...
తెలుసుకో నేస్తమా..! నిజం తెలుసుకో..!!
26. అంబేద్కర్ చూపుడు
వేలికి అర్థమేమిటి..?
వీధిలో విగ్రహమై నిలిచిన
అంబేద్కర్ చూపుడు వేలిచ్చే
శుభసందేశం ఒక్కటే...
చీకటి నుండి వెలుగువైపుకు
పయణించాలని...
కష్టించి పనిచేయాలని...
అభివృద్ధిని ఆకాంక్షించాలని...
ఆత్మగౌరవంతో బ్రతకాలని...
చైతన్యంతోనే జీవించాలని...
బానిసత్వానికి బలికారాదని...
అణచివేతకు...అంటరానితనానికి...
కులనిర్మూలనకు వ్యతిరేకంగా... మనువాదులతో కులపిశాచులతో
భీకర పోరాటం సాగించాలని...
బహుజనులకదే ఊపిరి కావాలని... రాజ్యాధికారం కోసం
ఆరాటపడుతూ ఆశతో బ్రతకాలని...
జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని...
దైర్యసాహసాలతో ముందుకు సాగాలని...
ఆవేశం కన్నా ఆలోచన మిన్నని...
అజ్ఞానం కన్నా విజ్ఞానం మిన్నని...
ఆ చూపుడు వేలుకు అంతరార్థమని.....
తెలుసుకోండి..! బహుజనులారా..!
తెలుసుకోండి! నిండునిజాలు తెలుసుకోండి!
27. కాకి బ్రతుకా వద్దు?
హంస బ్రతుకే ముద్దు?
ఓ ప్రియమిత్రమా..!
నా బహుజన నేస్తమా..!!
ఎంతకాలమిలా నీవిలా
అజ్ఞానంలో అంధకారంలో
అమాయకత్వంలో దగ్దమైపోతావ్.....
ఇకనైనా
ఈ కంప్యూటర్
యుగంలోనైనా
ఊపిరాడని నీ బలహీనతల
ఊబినుండి బయట పడాలనుకో...
నీ తరతరాల బానిసత్వపు
ఉక్కుసంకెళ్ళను త్రెంచాలనుకో...
శిలను శిల్పాంగా చెక్కాలనుకో...
ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలనుకో ...
నీ కులదైవానికి మ్రొక్కాలనుకో...
"పక్షిలా" నిన్ను
పైకి ఎగరనీయకుండా...
"పచ్చని మొక్కలా" నిన్ను
పైకి ఎదగనీయకుండా...
అడుగడుగునా అడ్డుపడి నిన్ను
అణగద్రొక్కే...కులపిశాచులకు
మనువాదులకు...మతోన్మాదులకు
నీవు సింహస్వప్నమవ్వాలనుకో...ఆ
చీడపురుగుల్ని చీల్చిచెండాడాలనుకో...
ఆకులు మేసే
అమాయకపు మేకవైపోకు...
గజరాజులా ఘీంకరించాలనుకో...
గర్జించే సింహంలా బ్రతకాలనుకో...
ఆరక రగిలే
అగ్నిజ్వాలలా దహించాలనుకో...
కామందుల కాలిక్రింది
చెప్పులా మిగలాలనుకోకు...
కాల్చే నిప్పురవ్వలా రగలాలనుకో...
వారి మెడమీద వ్రేలాడే పదునైన కత్తిలా
వారికి ప్రక్కలో బల్లెంలా బ్రతకాలనుకో...
ఓ ప్రియమిత్రమా..!
నా బహుజన నేస్తమా..!!
కాకిలా కలకాలం నీవు
బ్రతికినా కడకు నీకు దొరికేది
కాటిలో పెట్టిన..."పిండమే"...
అందుకే హంసలా
కొద్దికాలం బ్రతికినా
భారత రాజ్యాంగ నిర్మాత
అమరజీవి డాక్టర్ బిఆర్
అంబేద్కర్ అందించిన
నీ ఓటు హక్కనువజ్రాయుధంతో
పోరాడి పోరాడి సాధించుకోవచ్చు
నీ హక్కుల..."అమృత భాండమే"...
28. ఆ దేవదేవుడు
నిన్ను
ఆటలో
ఓడిపోనివ్వడు
నీటిలో
మునిగి పోనివ్వడు
చెట్టులా
ఒరిగి పోనివ్వడు
భయపడకు
నిన్ను క్రింద పడనివ్వడు
పడినా పైకిలేచే
శక్తిని నీకు ప్రసాదిస్తాడు
అందుకే ఓ భక్తా
అవాంతరాలెన్ని వచ్చినా
అగ్ని పరీక్షలు ఎన్ని పెట్టినా ఆ
భగవంతునిపై భక్తిని తరగనివ్వకు
నీలోని అఖండ శక్తిని కరగనివ్వకు
29. ఆలోచనాతరంగాల తాండవం..?
1 మంచి ఆలోచన
10 చెడు ఆలోచనల్ని
మంచి వైపునకు నడిపిస్తుంది..!
1 చెడు ఆలోచన
1000 మంచి ఆలోచనల్ని
కలుషితం చేస్తుంది...
గంగలో కలిపేస్తుంది...
కాల్చి బూడిద చేస్తుంది...
పాతాళంలో పాతిపెడుతుంది..!
ఔను మన మనసే కదా
మన మంచి చెడు
ఆలోచనల జలపాతం...
మన మనసే కదా
మంచి చెడుల ఊహాల ఊట..!
మన మనసే
మంచికి పందిరైతే...
అది ఒక దైవ మందిరమే..!
మన మనసే
చెడుకు నీడైతే...
తోడైతే ఒక గూడైతే..!
అది దుర్గంధాన్ని
వెదజల్లే ఒక మురికి గుంటే..!
అది వీధిలో
ఎంగిలి విస్తరాకులు
నిండిన ఒక చెత్త కుండే..!
అది నిన్ను నన్ను
ఉక్కిరిబిక్కిరి చేసి
ఊపిరి తీసే ఒక ఊబే..!
అందుకే ఓ మిత్రమా..!
తెలుసుకో ఓ నగ్నసత్యం
నీవు చేసే సత్సంకల్పాలే
నీ పురోభివృద్ధికి పునాదులని..!
నీవు చేసే దుష్ట తలంపులే
నీ సంక్షేమానికి సమాధులని....!
ఔను ఓ మిత్రమా..!
చెప్పాలి నీవు సత్సంకల్పాలకు
స్వాగతం...సుస్వాగతం ఘనస్వాగతం..!
ఉండాలి నీవు దుష్టతలంపులకు
దూరంగా...లక్ష అడుగుల సుదూరంగా..!
30. కవిరాజపోషకులకు
కళాభివందనాలు...!!!
ప్రోత్సాహించేవారు కరువై...
వెన్నుతట్టేవారు దూరమై...
బ్రతుకు భారమై...
అంధకారమై...
అగమ్యగోచరమై...
ఆశలు ఆశయాలు ఆవిరై...
కన్న కలలన్నీ కన్నీటి ధారలై...
తీరందాటని అలలై...
కనుమరుగైపోతున్న కవులను...
ఆదరించేవారు లేక కాలగర్భంలో
కలిసిపోతున్న కవిత్వాన్ని...
పాతాళంలోకి జారిపోతున్న
పాశుపతాస్త్రమంటి కలాలను...
మోడువారిపోతున్న
సాహితీ వృక్షాలను...
నీరు పోసి పెంచే
కరుణామయులకు...
దయార్ద్రహృదయులకు...
తెరమరుగై పోతున్న
తెలుగు భాష వెలుగును
పదిమందికి పంచే...
కళాపిపాసులకు పోషకులకు...
తమ శక్తియుక్తులను ధారబోసి
విలువైన సమయాన్ని వెచ్చించి
వెలకట్టలేని ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
కుటుంబాన్ని ప్రక్కకు నెట్టి
రేయింబవళ్ళు కళాసేవకే అంకితమై
ఎంతో శ్రమకోర్చి ఓపికతో సహనంతో
భారీగా నిరంతరం సాహితీ సభలు
సమావేశాలు ఏర్పాటు చేసి...
ఔత్సాహిక కవులను ఆహ్వానించి...
వేదికలపై కవితగానం చేసే
బంగారు అవకాశాలను కల్పించి
ముఖ్య గౌరవ విశిష్ట ప్రత్యేక అతిథుల
విలువైన విజ్ఞానదాయకమైన
సంక్షిప్త క్లుప్త సౌందర్య సందేశాలతో
సాహితీమూర్తుల అమృతహస్తాలతో
సహనంతో చప్పట్లు కొడుతూ
సన్మాలకోసం ఆశతో
నిరీక్షించే కవులందరికీ
విలువైన శాలువాలు కప్పి
మెరిసే మొమోంటోలిచ్చి
అందమైన ప్రశంసా పత్రాలందజేసి
అక్కున చేర్చుకుని ఆశీర్వదించి
కవులుగా గొప్ప గుర్తింపు నిచ్చి
సగౌరవంగా సత్కరించి...
ఫోటోలకు ఫోజులిచ్చి...
జీవితంలో...
మరిచి పోలేని ...
మధుర జ్ఞాపకాలతో...
చెరగని చిరునవ్వులతో...
తరగని తృప్తిని సంతృప్తిని
గుండెలనిండా నింపే...
సగర్వంగా ఇంటికి పంపే...
ఎందరో మహానుభావులు...
అందరికీ వందనాలు...
ఎందరో
కళాపోషకులు...
సహృదయులు...
సాహితీమూర్తులు...
నిరాడంబర జీవులు...
నిస్వార్థ పరులు...
అందరికీ అభివందనాలు...
ఎందరో
అభినవ కృష్ణదేవరాయలు...
ఘనులు మునులు త్యాగధనులు...
వారందరికీ పాదాభివందనాలు...
నా అక్షర లక్షల కుసుమాంజలులు...
31. ఓ వాల్మీకి వారసులారా
మీరు ధన్యులు...?
అటు నిత్యం రామజపం చేసే
రామభక్తులందరూ ధన్యులే...
ఇటు శ్రీ రామకథను శ్రమించి లిఖించిన
కవిపండితులంతా అదృష్టవంతులే...
ఒక్క వాల్మీకి వారసులు తప్ప...
కారణం
ఎన్నో ఏళ్లు తపస్సు చేసి
రేయింబవళ్ళు ఎంతో శ్రమకోర్చి
24000 శ్లోకాలతో 7 కాండలుగా
వాల్మీకి మహర్షి సంస్కృతంలో ఎంతో
రసరమ్యంగా రచించిన రామాయణం
కలియుగంలో రెండు ముక్కలాయె...
విశ్వనాధ వారి చేతిలో
రామాయణ కల్పవృక్షంగా...
ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ
చేతిలో రామాయణ విషవృక్షంగా...
కానీ ఇంతటి విశిష్టమైనమహత్తరమైన
ఆదికావ్యాన్ని ప్రపంచానికి అందించిన
వాల్మీకిజాతిని మాత్రం ప్రభుత్వ పాలకులు
తమ ఓటు బ్యాంకు కోసం...
తమిళనాడులో బీసీలుగా...
ఆంధ్ర తెలంగాణల్లో ఎస్టీలుగా...
భారతమంతా ఎస్సీలుగా...విభజించి
దక్కవలసిన రాజ్యాంగ హక్కుల్ని
మూడు ముక్కలు చేశారు...
ఐనా ఓ వాల్మీకి వారసులారా...!
మీరు ధన్యులే సుమా...కారణం
ఆ సూర్య చంద్రులు చుక్కలున్నంతకాలం
ఈ రామాయణ కావ్యం ఓ సజీవనదియే..
ఆ రామాయణాన్ని
గుళ్ళు గోపురాల్లో రామభక్తులు
పారాయణం చేసినంతకాలం ఈ
లోకానికి శ్రీరామచంద్రుడే ప్రత్యక్ష దైవం
ఆ కోదండరామయ్యను ప్రపంచమంతా
ప్రత్యక్ష దైవంగా పూజించినంతకాలం
రామాయణం వ్రాసిన వాల్మీకి మహర్షి చిరంజీవియే...సదా చిరస్మరణీయుడే...
అందుకే ఓ వాల్మీకి వారసులారా...!
మీరంతా ధన్యులే...కానీ మీరు ప్రశ్నించాలి
హక్కులకోసం...సమిష్టిగా ప్రతిఘటించాలి
మీకు దక్కవలసిన
రాజ్యాంగ రక్షణలు మీకు దక్కేలా...
ఆ శ్రీరామచంద్రుడే ప్రభుత్వ
పాలకులకు కనువిప్పు కలిగించునుగాక...
32. నగ్నసత్యాలు...ఆణిముత్యాలు
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
తెలుసుకో నిజాలు తెలుసుకో
నీ జ్ఞానం తులం విలువ చేయదని...
విజ్ఞానినని విర్రవీగడం అజ్ఞానమని...
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
నీ మీద నీవే నిందల
నిప్పులు విసురుకోకు...
నిన్ను నీవే తూలనాడుకోకు...
నేడు కనిపించి
రేపు మాయమయ్యే
నీటిబిందువులవంటి
ఆ సిరిసంపదలను చూసి
చిరునవ్వులు చిందించకు...
చిందులువేయకు విందులుచేసుకోకు...
నీ జీవితమెంతటి ఘనమైనదో..?
నీవు ప్రేమను పంచిన నింపిన
నీ నిండుహృదయానికి తెలుసు...
నీ జీవితమెంతటి
విలువైనదో..? విశిష్టమైనదో..?
నీవు చిరునవ్వుల దీపాలు వెలిగించిన ముసిముసి నవ్వులతో
మురిసిపోయే నీ ముఖానికి తెలుసు...
నీ జీవితమెంతటి
ఆత్మీయమైనదో...?
ఆదర్శప్రాయమైనదో...?
ప్రేమ దయ నిండి
కరుణ జాలి ప్రవహించే...
కళకళలాడే నీ కనులకు తెలుసు...
నీ జీవితమెంతటి
అనురాగ మధువో..?
అక్షయ పాత్రయో..? తేనేలూరే
నీ తియ్యని మనసుకు తెలుసు...
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
గుర్తుంచుకో...గుర్తుంచుకో...
నిజాలెప్పుడు ఆరని నిప్పులని...
సత్యాలెప్పుడూ
నగ్నసత్యాలని ఆణిముత్యాలని...
33. కవిరాజపోషకులకు కనకాభిషేకం
నాడు చిరు
కుటుంబాలను
పోషించుకోలేక
కడు పేదరికంలో
మ్రగ్గిపోయే కవీశ్వరులకు
ఆత్మీయ ఆహ్వానం పలికి
ఆప్యాయంగా అక్కున చేర్చుకుని
ఆస్థానకవులుగా గొప్ప గుర్తింపునిచ్చి
రాజులు పోయినా
రాజ్యాలు పోయినా
శిలాశాసనాల్లా తరతరాలకైనా
చెక్కుచెదరని ఖండకావ్యాలను
ప్రబంధాలను బృహత్ గ్రంథాలను
తమ జీవిత గాథల్ని వ్రాయించుకొని
రాజమందిరాలలో
రాజభోగాలననుభవించే
అదృష్టాన్ని కల్పించి
అందమైన బిరుదులనిచ్చి
అగ్రహారాలనిచ్చి
బంగారు వెండినాణేలను
బహుమతిగా నొసగి
సన్మానాలు సత్కారాలు చేసి
గండపెండేరాలు కీర్తి కిరీటాలు తొడిగి
గజరాజులపై ఘనంగా ఉరేగించిన ...
ఆ కళాపోషకులకు...
ఆ ధర్మప్రభువులకు...
ఆ సాహితీ పిపాసులకు...
ఆ ఉదారహృదయులకు...
కవి పండితప్రకాండులు
కలాలకు పదును పెట్టి
రాజులను రక్షకులుగా...
ఆపద్భాంధవులుగా...
నిజ దైవాలుగా శ్లాఘించి...
వారి
ఉన్నతమైన ఆశయాలను
ఉత్కృష్టమైన చరిత్రలను
చూపిన పౌరుషాన్ని
ప్రదర్శించిన వీరత్వాన్ని
చేసిన పుణ్యకార్యాలను
సాధించిన ఘనవిజయాలను
అనుభవించిన రాజవైభోగాలను
అద్భుతంగా
లిఖించి కవివరేణ్యులు
తాళపత్ర గ్రంథాలుగా భద్రపరచి
తీర్చుకున్నారు....రాజుల ఋణాన్ని
వెయ్యితరాలకైనా వారి నామధేయంబు
విశ్వమంతా మారుమ్రోగేలా గుర్తుండిపోయేలా ప్రసాదించారు...
ఆ పుణ్యమూర్తులకు పునర్జన్మను
జరగాలి జరగాలి
ప్రతిభామూర్తులకు పట్టాభిషేకం !
చేయాలి చేయాలి
కవిరాజపోషకులకు కనకాభిషేకం!!
34. ఓ నాన్నా ! మీకు వందనం !
అభివందనం ! పాదాభివందనం !!
మేము క్రింద పడిన ప్రతిసారి లేపి
పైకి లేపి పరుగులు తీయించి
మేము పోటీలో ఓడిన ప్రతిసారి
Don't Worry
Failures are
Stepping Stones
for Success
Try and try till
you fly into the Sky &
Try and try till
you reach your Goal
అంటూ భుజం తట్టి
ముందుకు నెట్టి ఓదార్చిన
ఓ నాన్న ! మీకు వందనం !
అభివందనం ! పాదాభివందనం !!
మా కాళ్ళల్లో ముళ్ళు
గుచ్చుకుంటుంటే మీ
కంటిలో గుచ్చుకున్నంతగా
కన్నీరు కార్చి కార్చి
మాకు కమ్మని తిండిపెట్టి
మా అందరి కడుపులు నింపి
మీ కడుపు నిండినంతగా
తృప్తి చెంది ఆనందంగా
అర్థాకలితో నిద్రపోయిన
ఓ నాన్న ! మీకు వందనం !
అభివందనం ! పాదాభివందనం !!
మాకు జబ్బులు చేస్తే
డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టి
చేతిలో డబ్బు లేకపోతే
తలను తాకట్టు పెట్టి
కళ్ళు తిరిగే ఆ బిల్లులు
కట్టలేక అప్పులు తెచ్చి
ఆపై ఆప్పులు తీర్చలేనక
ముప్పుతిప్పలు పడిన
ఓ నాన్న ! మీకు వందనం !
అభివందనం ! పాదాభివందనం !!
మాకు బ్రాండెడ్
బట్టలు కొనిపెట్టి
మీరు మాత్రం
చిరునవ్వుతో చిరిగిన
బట్టలతో సరిపెట్టుకుని
మాకు నచ్చిన కొత్తబూట్లు
కొనిపెట్టి మీరు మాత్రం
అరిగిపోయిన తెగిపోయిన
పాత చెప్పులతో తిరిగి
మాకు ఖరీదైన బైకులు
కార్లు కొనిపెట్టి మీరు
మైళ్ళ దూరం కాలి బాటన
నవ్వుతూ నడిచి వెళ్ళిన
ఓ నాన్న ! మీకు వందనం !
అభివందనం ! పాదాభివందనం !!
నాడు అవకాశం లేక మీరు
అరకొర చదువులు చదివి
మమ్ము మాత్రం విదేశాలకు
పంపి కలనైనా ఊహించని
ఖరీదైన ఉన్నత విద్యను
అభ్యసించే అదృష్టాన్ని కల్పించిన
ఓ నాన్న ! మీకు వందనం !
అభివందనం ! పాదాభివందనం !!
ఇంతటి మంచి మనసు
మంచితనం గల తండ్రిని
ఇంతటి ప్రేమ దయ కరుణ
జాలి గుండె గల తండ్రిని
ఇంతగా నిస్వార్థంగా
శ్రమించే తత్వం గల తండ్రిని
చేసిన తప్పుల్ని క్షమించే
క్షమాగుణం గల గొప్ప తండ్రిని
కుటుంబ క్షేమం కోసం
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం
నిరంతరం నిద్రాహారాలు
మాని తపించే తండ్రిని
ఒక అపురూపమైన
ఒక బంగారు బహుమతిగా
మాకు ప్రసాదించిన
ఆ పరమాత్మకు శతకోటి దండాలు
నాన్నా ! ఓ నాన్నా!!
మీకు రెండుచేతులు జోడించి
శిరస్సును వంచి నమస్కరించి
కన్నీటితో మీ పాదాలను కడిగి
కంటికి రెప్పలా కాపాడు కుంటామని
మా గుండెలో మీకు గుడి కట్టి
రోజు మిమ్మల్ని ప్రత్యక్ష దైవంగా
పువ్వుల్లో పెట్టి పూజిస్తామని
పంచభూతాల సాక్షిగా
నేడు ప్రమాణం చేస్తున్నాం...
35. ఉక్కుమహిళ శ్రీమతి ఇందిరాగాంధీ
(వర్థంతి సందర్భంగా ఓ కన్నీటి కవిత)
1984 అక్టోబర్ 31 తేది
ఉదయం 9.20 ని.లకు...
ఔరా ఏం జరిగిందిరా ?
దేశచరిత్ర రక్తసిక్తమైపోయిందిరా...
కన్నతల్లి ఇందిర కన్నుమూసిందిరా...
చింతిస్తూ ఇందిరా చితికి చేరిందిరా...
శాంతి కపోతమై
శాంతిసందేశాన్ని అందించిన ఇందిర
రక్తాన్ని చిందించిందిరా...
నిరుపేదల తలరాతల రాజ్యాంగాన్ని
సవరించ ఇందిర స్వర్గానికేగిందిరా...
కంచే చేను మేసినట్లుగా...
కూర్చున్న కొమ్మనే నరికినట్లుగా...
పాలు త్రాగి ఒకడు
తల్లిరొమ్మునే గుద్దినట్లుగా...
ఉగ్రవాదుల మిషన్ గన్నులనుండి
ప్రత్యర్థుల తూటాలనుండి
శత్రువుల నుండి మృత్యువునుండి
రాత్రింబవళ్ళు కన్నతల్లి ఇందిరను
రోజూ రక్షించే అంగరక్షకులే...
కసితీరా కక్షతో.....
పగతో రగిలి రగిలి...
30 బుల్లెట్లతో కాల్చికాల్చి...
ఆ తల్లి గుండెను చీల్చి చీల్చి...
ఆ దేవత రక్తపుమడుగులో
"గిలగిల" కొట్టుకుంటూవుంటే
"కిలకిల" నవ్వేరు ఆ కిరాతకులు
ఆ మూర్ఖులు ఆ ముష్కరులు
పగబట్టిన ఆ సిక్కుమతోన్మాదులు...
రెప్పపాటున ఆ తల్లి
కుప్పకూలిపోయింది
దేశమంతా కన్నీటి సంద్రమైంది...
ఎక్కడ మతగ్రంథాలు
మంచిని బోధిస్తాయో
అక్కడ మానవత్వం
ఫరిడవిల్లుతుంది... కానీ
ఎక్కడ ఉగ్రవాదం మతోన్మాదం
పడగవిప్పి బుసలు కొడుతుందో
అక్కడ మహాత్ములరక్తం
ఏరులై పారుతుంది...
"నా చిట్టచివరి రక్తపుబొట్టు" వరకు
"శాంతిసామరస్యం" కోసమే
దేశ "ప్రజలసంక్షేమం" కోసమే
పోరాడుతానని ప్రతినపూని
"గరీబి హటావో" అంటూ నినదించి
తన జీవితాన్ని త్యాగం చేసిన
మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి
"ఉక్కుమహిళ "మన
శ్రీమతి ఇందిరాగాంధీ
వర్థంతి సందర్భంగా అశృనయనాలతో
ఆ మహాతల్లికి ఇదే నా అక్షర నీరాజనం...
36. గుండెగుడిలో వెలిగే
విప్లవజ్యోతి గద్దరన్న..!
అదిగో అన్న అకాలమరణంతో
ఒక విప్లవ తార...నేలకొరిగే...
ఒక విప్లవ గీతం...ఆగిపోయే...
ఒక విప్లవ జ్యోతి...ఆరిపోయే...
ఒక విప్లవ గళం...మూగబోయే...
ఎందుకు? ఎందుకు? స్వర్గంలో
"విప్లవ శంఖాన్ని" పూరించేందుకు...
అది గొంతా....కాదు గండ్ర గొడ్డలి...
అది పాటా....కాదు పేలిన తూటా...
అది మాటా...కాదు మందుపాతర...
అది సభావేదికా...కాదు జన జాతర...
బండెనక బండి కట్టి"...
"పదహారు బండ్లు కట్టి"...
"ఏ బండ్లోవస్తవ్ కొడుకో నైజాం సర్కరోడా"... "నాజీల మించినవ్ రో నైజాం సర్కరోడా"...
"నీ ఘోరికడతం కొడుకో నైజాం సర్కరోడా"..
పాటతో "మాభూమి"చిత్రంలో వెండితెరపై
మెరిసిన "ప్రజా యుద్ధనౌక"మన గద్దరన్న...
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న
"కాలమా అమ్మ తెలంగాణమా"...అంటూ...
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది...
పల్లెపల్లెలో విప్లవ శంఖాన్ని పూరించి...
పూరిగుడిశెలో పుట్టిన బహుజనులను
పులులుగా మార్చిన ప్రజాగాయకుడు
విరుచుకుపడే"విప్లవ సింహం"మన గద్దరన్న
"నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
"నీ తోడబుట్టిన ఋణం
తీర్చుకుంటనే చెల్లెమ్మా" అంటూ ఆబాలగోపాలాన్ని అలరించి
కంటతడి పెట్టించిన...ఆపాటకు అందిన
"నంది అవార్డును" తిరస్కరించిన...
"విప్లవ వీరుడు"గర్జించే...మన గద్దరన్న...
పాటే శ్వాసగా.....
పాటే ప్రాణంగా...
పాటే తూటాగా...
ఆటే ఆయుధంగా...
మాటే మంత్రంగా...
అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా...
కులమత రహిత సమసమాజం కోసం...
బ్రతికిన "త్యాగధనుడు"...మన గద్దరన్న...
తాడిత...పీడిత...బహుజన...గిరిజన...
బడుగు బలహీనవర్గాల హక్కులకోసం... ధిక్కారస్వరంతో నినదించిన నిప్పులు
కురిపించిన"ఉద్యమ సూర్యుడు"గద్దరన్న...
అన్న గద్దరన్నా...
ఎక్కడే నువ్ అంటే...ఎవరైనా ...
నీ ప్రక్కనే ఉన్నరా భాయ్ ...
నీవు గొంతెత్తి పాట పాడితే...
ఫిరంగిమ్రోతనై"...నీకు వినిపిస్తా..!
నీవు గజ్జకట్టి ఆట ఆడితే...
చిరుతపులినై....నీకు కనిపిస్తా... !
అన్న...అన్నా గద్దరన్నా...
నీ పాటకు నీ ఆటకు నీ మాటకు
మరణం లేదు...నీకు మరణం లేదు
నేడు నీవు అస్తమించింది...
రేపు అరుణోదయ సూర్యుడవై
తూర్పుదిక్కున ఉదయించడానికే..!
అన్నా గద్దరన్నా..!
మీకివే మా జోహార్లు ..! విప్లవ జోహార్లు..!
మీ పవిత్రమైన
ఆత్మకు శాంతి కలుగును గాక !
బహుజనోద్ధరణ కోసం భగవంతుడు
మీకు మళ్ళీ పునర్జన్మ నిచ్చును గాక !
37. భార్య ఫోన్ ...భర్త వైర్...?
భార్య ఫోన్ గా...
భర్త వైర్ గా...
మారితే ఏమౌతుంది...?
ఫోన్...వైర్...
ఏకమైతే ఒక లోకమే...
ఒక మాయే ఒక మత్తే...
ఒక మైకమే ఒక స్వర్గమే...
పగలు రాత్రి పసందైన పొందే...
వీనుల విందే చీకటిలో చిందే...
ఫోన్ ...వైర్...
గూటిలో గువ్వల్లా
పెనవేసుకొనిపోతే...
పందిరికి తీగకుమల్లే
అల్లుకుపోతే...ఏమౌతుంది?
ఆ బంధం...మకరందం
ఆ ఆనందం...అనంతం...
ఆ అనురాగం...అపురూపం...
ఆ అనుభవం...అనిర్వచనీయం...
తెగిపోని ఆ ఆలుమగల అనుబంధం...
అమృతం చిలుకును కదా జీవితాంతం...
కానీ ఫోన్...వైర్ వేరైతే...
ఫోన్ కి అనంతమైన స్వేచ్ఛ...
విచ్చలవిడితనం...వీరవిహారం...
ఇద్దరూ ప్రక్కప్రక్కనే ఉన్నా
ఆ ఇద్దరూ ఒంటరివాళ్ళే...
మౌనం ఒక మరణ శిక్షే...
వారు ఖరీదైన కార్లలో
పయనించిన నేమి..?
విలాసవంతమైన
విల్లాలలో శయనించిననేమి..?
వారు నవాబులైనేమి..?
వారు బంధాలలో బంధీలైన
బికారులే...బిక్షగాళ్ళే...
శత్రువులు కాని శత్రువులే....
వారికి సుఖజీవనం శూన్యమే...
ఔరా ఇదెంతటి దౌర్భాగ్యమో..?
నరకయాతనో ఆ ఫోన్ కి ఆ వైర్ కే ఎరుక...
38. గదిలో గబ్బిలంలా...బ్రతక్కు...
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
బ్రతక్కు బ్రతక్కు
గదిలో
గబ్బిలంలా ..
గుడిసెలో
గుడ్లగూబలా...
ఎక్కాలి ఎక్కాలి
ఎక్కి మ్రొక్కాలి
భక్తితో ఏడుకొండలు...
మానవత్వంతో
నిండాలి నీ మండే గుండెలు...
కోరుకోకు...
కోరుకోకు...ఎప్పుడూ
కోపాన్ని ద్వేషాన్ని...
కోపం క్రోధం ఒక శాపం...
పగ ప్రతీకారం ఒక పాపం...
శాంతంగా బ్రతకాలి జీవితాంతం...
ఎందుకు అసూయా ద్వేషం...?
ఎందుకు నక్కలా పగటి వేషం...?
కక్కకు కక్కకు కాలకూట విషం...
మార్పు...నీ పేరు కావాలి
తూర్పు...నీ ఊరు కావాలి
తీర్పుకు..నీవు జడ్జివి కావాలి
ఓర్పు......నీ చిరునామా కావాలి
39. కోర్కెల కొలిమి...?
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
మన కోరికలు అనంతం
అవి తీరితీరగానే
తిరిగి మళ్ళీ మళ్ళీ
పుడుతూనే ఉంటాయి
గిడుతూనే ఉంటాయి
మనల్ని నిరాశ నిస్పృహల
నిప్పుల్లో వేసి కాల్చేస్తాయి...
సుడులు తిరిగే సమస్యల
సుడిగుండంలోకి నెట్టేస్తాయి...
అందుకే
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
కోరికలు లేని జీవితాన్ని
నీవు కోరుకున్న నాడు...
కష్టాలు కన్నీళ్లు రాని...
రోగాలు రోష్టులు లేని...
సంతోషాలు
సంబరాలు తప్ప
సమస్యలు లేని...
వెన్నెల వెలుగులే తప్ప
చిమ్మ చీకట్లు లేని...
వింతలు విశేషాలే తప్ప
చింతలు చికాకులు లేని...
శుభకరమైన...
సుందరమైన...
సుఖవంతమైన...
మనోహరమైన...
మంగళకరమైన...
చెరగని చిరునవ్వుల...
తరగని సిరిసంపదల...ఒక కొత్త
జీవితం నీ సొంతమవుతుంది..!!
40. ఆమెంటే నాకెంతో ఇష్టం..!
ఆమెంటే...
ఆమె చిరునవ్వంటే...
కొరడాలతో కొట్టే
ఆమె కోర చూపంటే...
మన్మధ బాణాలు విసిరే
ఆమె చురుకైన చూపంటే...
మత్తెక్కించే ఆమె
మధుర ధరహాసమంటే...
ఆమె కాటుక
కళ్ళంటే...వంకర్లు తిరిగే
ఆమె నాజూకైన నడుమంటే...
నెమలిలా నడిచే ఆమె నడకంటే...
నాకు గుండెల్లో గుబులే...ఔను
ఆమె ఎవరు..? ఆమె గుడిసెలో
ఆరిపోయే...ఓ గుడ్డి దీపం..!
ఆమె ఎవరు..?
ఆమె వీధిలో చెత్తకుండీలో
విసిరిన... ఓ విస్తరాకు..!
ఆమె ఎవరు..?
ఆమె కుక్కలు కుస్తీ బట్టి
తినే...ఓ ఎంగిలి మెతుకు..!
ఆమె ఎవరు..?ఆమె చీకటిలో
చిగురించే...ఒక చిరునామా..!
ఆమె ఎవరు..?
ఆమె ఆకలికి అలమటించే
అస్థిపంజరాలకు...ఓ అమ్మ..!
ఆమె ఎవరు..?
ఆమె మందుబాబుల ముందు
అందాలారబోసే...ఓ అంగడి బొమ్మ..!
ఆమె మసక మసక
చీకటిలో చిందులు వేస్తుంది..!
విటులకు విందులు చేస్తుంది..!
ఆమె తన, తనపిల్లల
పగటి ఆకలి తీరడం కోసం
రాత్రి ఎందరికో ఆకలి తీరుస్తుంది..!
అందుకే ఆ మెంటే...
నాకెంతో ఇష్టం...నాకే కాదు
ఇరుకైన ఇళ్ళల్లో ఇష్టమైనది
దొరకని ఇంకెందరికెందరికో ఇష్టం...!
41. 265 ఏళ్ళ పైడితల్లి మహా జాతర
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం...
పూసపాటి గజపతుల ఇలవేల్పు...
పెద్ద విజయరామరాజు ముద్దుల చెల్లి...
బంగారుతల్లి చల్లని చూపుల మన పైడితల్లి
1758లో విజయనగరంలో మూడు
లాంతర్ల కూడలిలో నిర్మించిన అమ్మవారి దేవాలయంలో గత 265 సంవత్సరాలుగా
జరుగే మహాజాతరే మన పైడితల్లి జాతర...
లోకపావని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారే పైడితల్లి మూల విరాట్టును
విజయనగరం పెద్దచెరువు నుండి పైకి తీసి
గర్భగుడిలో ప్రతిష్టించిన తొలిపూజారి...
పతివాడ అప్పలస్వామినాయుడు...
ఏటేటా నిర్వహించే ఉత్సవాలలో
"సిరిమాను ఉత్సవం" సుప్రసిద్ధం
"సిరిమాను" అనగా చింతలుతీర్చే
చింతచెట్టు మ్రాను. పైడి తల్లికి
ప్రతిరూపంగా ఆలయ పూజారి
సిరిమాను పైకెక్కి భక్తులను దీవిస్తాడు
చూడముచ్చటగా అత్యంత మనోహరంగా శోభాయమానంగా బంగారు వర్ణంతో అలంకరించిన 33 మూరల విజయనగర పైడితల్లి "సిరిమాను రథం" ఊరేగింపు మహోత్సవమే పైడితల్లి అమ్మవారి జాతరలో...అత్యంత ప్రధానమైన ఆకర్షణ...
భక్తులకు కనువిందైన...పసందైన పండుగ...
సిరిమాను ఇరుసుపై ప్రధాన పూజారి
ఆసనుడై చేతిలో విసనకర్రతో భక్తులను
దీవించడం భక్తులు సిరిమానుపై అరటిపళ్లు
విసరడం ఆటపాటలతో కోలాటాలతో నృత్యాలతో ఆ సంబరం శోభాయమానం
సిరిమాను ముందు సాగే జాతరలో
తరతరాల సేవానిరతికి భక్తివిశ్వాసాలకు మారుపేరైన అంజలి రథం...బెస్తవారి వల... పాలధార...తెల్ల ఏనుగు...అంజలి రథం... ముందు నడుస్తుండగా చిత్రవిచిత్రంగా వేషదారులు పరవళ్ళుత్రొక్కుతూ...భక్తి పారవశ్యంతో పరిగెత్తేవేళ...లక్షలాదిమంది భక్తులు అమ్మవారి వైభవాన్ని మహిమను తనివితీరా...కనులారా...తిలకించి... తన్మయత్వంతో పులకించిపోయే భక్తుల
కోర్కెలు తీర్చి కోటి వరాలు ప్రసాదించే
కనకదుర్గ జాతరే మన పైడితల్లి జాతర...
నాడు గ్రామదేవతగా వెలిసిన పైడితల్లి కీర్తి
నేడు ఖండ ఖండాంతరాలు దాటిపోయింది
విశ్వవ్యాప్తమైపోయింది...అట్టి మహాతల్లిని
దర్శించిన...స్మరించిన...వారి జన్మధన్యమే.
42. బంగారు బ్రతుకులు...?
సంసారమంటే...?
సంతోషాల సాగరమా?
సమస్యల సరోవరమా?
ఈత నేర్చిన కొందరికి
సంసారమంటే...
సంతోష సాగరమే...
ఈత రాని కొందరికి
సంసారమంటే...
సమస్యల సరోవరమే...
సంసారమంటే...?
చీకటి వెలుగులమయం...
సుఖదుఖాలకు నిలయం...
మూగ ప్రేమంటే...?
ఆవలింతలు
ఆకలి చూపులు
మౌనరాగాలు
మౌన వ్రతాలు
మూగసైగలు
మాయలు మంత్రాలు...
సరస శృంగార భంగిమలు
ఆలుమగల
అనురాగ
బంధమంటే...?
గిల్లికజ్జాలు...
చిలిపి తగాదాలు...
తీపి జ్ఞాపకాలు...
ముద్దు మురిపాలు...
వెన్నెల్లో ముచ్చట్లు...
వేకువ జామున
ముంగురుల చాటున
ముచ్చెమటలు...
మనిషంటే...?
సహనం...సహకారం
మంచితనం...మానవత్వం
సంఘంలో సమానత్వం
విలువైన వ్యక్తిత్వం...
భిన్నత్వంలో ఏకత్వం...
పచ్చని కాపురమంటే...?
సరసాలు....సరదాలు
పరువాలు...ప్రేమపరదాలు
నవ్వులు.....నవరాగాలు
సొగసులు...సోయగాలు
ఓరచూపులు...కిలకిల నవ్వులు
విరుపులు.......వినోదాల మెరుపులు
సుఖజీవన సూత్రమంటే...?
అర్థం చేసుకోవడం...
అపార్థం చేసుకోకపోవడం...
సర్దుకు పోవడం...రాజీ పడడం...
అదే కదా "సుఖజీవన సూత్రమంటే "...
43. నడక...పడక...
ఉదయం నిద్ర లేచి...
కదలకుండా కుర్చీలో
కూర్చుంటే క్రుంగుబాటే...
అలా కాస్త ఆరుబయట నడిస్తే...
ఆ పచ్చని ప్రకృతితో...
ఆ చల్లని గాలితో...
నీరెండనిచ్చే
ఆ సూర్యభగవానితో...
ఆ వెచ్చని వెలుగుతో...
పార్కులో నీకు నచ్చిన
నీ ఆత్మీయ మిత్రులతో
కాసేపు సంభాషిస్తే ఎంత సంబరం...
కానీ నీవు ఇంట్లో ఉంటే
నిన్ను విసుక్కునే
నీ పడకతోనో...
పైన తిట్టుకుంటూ
తిరిగే ఫ్యానుతోనో...
నవ్వే నాలుగు గోడలతోనో
మాట్లాడవలసిందే మౌనంగా..!
లైటు లేకుండా గదిలో
ఒంటరిగా ఉంటే...
చీకట్లతో పిచ్చిగా ముచ్చట్లే!
లేదా నీలో దాగి ఉన్న
నీ అంతర్గత శత్రువులైన
ఆ అరిషడ్వర్గాలతో ఆడుకోవాల్సిందే..!
అందుకే మిత్రులారా..!
ఇక మనమే తేల్చుకోవాలి
గదిలో గబ్బిలాలుగా ఉందామా..?
అదిగో ఆరుబయట ఆకాశంలో
ఆ పక్షుల్లా స్వేచ్ఛగా విహరిద్దామా..?
ఓ నా ప్రియ మిత్రులారా..!
నా ఈ కవితను ఇంతసేపు ఓపికతో
చదివిన మీరే ఇక ఆలోచించి చెప్పాలి...!
44. శివతాండవం..?
(చిత్రకవిత)
సముద్రం
నవ్వుతుంది
నాట్యం చేస్తుంది
అంటారు నిజమే...
సముద్ర జలాలు
సైతం అప్పుడప్పుడు
తన్మయత్వంలో ఇలా శివునిలా
శివతాండవం చేస్తాయేమో మరి...
అధ్భుతం...
అద్భుతం...
మహా అధ్భుతం...
మనోహరం...
నయనానందకరం...
అందమైన అలల
దృశ్యాలను స్లోమోషన్లో
అధ్భుతంగా కెమెరా
కళ్ళతో బంధించడంలో...
ఫోటోగ్రాఫర్ చాకచక్యం అమోఘం...
ఏదేమైనా
అందమైన ఆ
సుందర దృశాలన్నీ...
కనులకు విందు...
మనసుకు పసందు...
అవి తిలకించి పులకించి
పోనివారంతా తిక్కశంకరులేమరి...?
45. ధన్యులెవరు..?
ఈ ప్రపంచంలో
శ్రీరామచంద్రుడే
అందరికీ ప్రియమైన
అందాలరాముడని...
ఆదర్శమానవుడని...
జానకి వల్లభుడని...
జగదభిరాముడని...
ఆకర్షణశక్తిలో సముద్రుడని...
స్థిరత్వంలో చల్లని హిమపర్వతమని...
దాతృత్వంలో నింగిలో నీలిమేఘమని...
విలువిద్యలో ఆరితేరిన
యుద్ధవీరుడంటూ ఆరాధించే రామభక్తులు... ధన్యులే..!
నిత్యం రామమందిరాల
మైకుల్లో మారుమ్రోగె
శ్రీరామచరిత గానామృతాన్ని
ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా
గానకోకిలలై ఆలపించే
ఓ గాయనీ గాయకులు
ధన్తఅదృష్టవంతులే..!
ఎవరో నాటిన ఒక విత్తనం
మొక్కై మ్రానై వేల ఎకరాల్లో
విశ్వమంతా విస్తరించినరీతిగా
ఎన్నో ఏళ్ళ క్రితం వాల్మీకి మహర్షి
రచించిన ఈ రామాయణగాధను
రామనామాన్ని వందలాది భాషల్లో
విశ్వమంతా విస్తరించేలా
కోట్లాది రామాయణ కల్పవృక్షాలను
లిఖించిన ఓ ప్రాచీన
ఆధునిక కవిసార్వభౌములు..!
ధన్యజీవులే...పుణ్యమూర్తులే..!
46. పెరుగు...పరుగు...?
47. అందాలు ఆరబోసే అంగడి బొమ్మ..!
ప్రతి మనిషి
కోరుకునేవి రెండు
ఆథ్యాత్మిక చింతన...
ఆరోగ్యకరమైన జీవన శైలి...
రోజు పెరుగు తిను...
ఒక కిలోమీటరైనా పరుగెత్తు...
పార్కులో ఇష్టమైనవారితో మాట్లాడు...
భక్తిశ్రద్ధలతో ఆ పరమాత్మను ధ్యానించు...
హాయిగా ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపో...
నీ అలసట...నీ ఆందోళన
నీ క్రుంగుబాటు నీకు దూరం...
నీ గుండెపోటు...నీ అధికరక్తపోటు
నీ ఒత్తిడి క్షణంలో మటుమాయం..!
ఒక వైపు
"ఎండార్ఫిన్ "హార్మోన్లు...
మరోవైపు "సెరటోనిన్ "హార్మోన్లు
విడుదలై నీకు రక్షణకవచాలౌతాయి..!
నీ శరీరానికి...నీ మనసుకు
నీ ఆత్మకు ఎనలేని శాంతి అందిస్తాయి..!
47. అందాలు ఆరబోసే అంగడి బొమ్మ..!
అందాలు ఆరబోసే
ఓ సుందరీ గుర్తుంచుకో ...
అందమైన నీ తనువు
"చక్కని అద్దమే"...
ప్రతిబింబం చూసుకొన
"ప్రతిఒక్కరు సిద్దమే"...
నేడు బాహుబంధాలలో
బంధించుకుంటారు రేపు
నిన్ను "బహుదూరం" నెట్టేస్తారు
నేడు నీచుట్టూ తిరిగే ఈమగవారే...
రేపు నీ మీద వాలేటి ఈగలౌతారు...
రేపు "పెనురోగం"
పట్టి పీడిస్తుంటే...
"అనురాగం" చూపి
నిన్ను ఆదరించేదెవరు..?
ఓ మగువా గుర్తుంచుకో..!
వీరు నిన్ను ఆదరించడం కల్ల..!
రేపు సర్వనాశనం నీబ్రతుకు వీరివల్ల..!
48. అయ్యో ఓ దైవమా?
ఏమాయె...మా ప్రార్ధనలు..?
అయ్యో !
అయ్యో ఓ దైవమా !
ఎక్కడ దాగి ఉన్నావయ్యా !!
నీవున్నావని చూస్తున్నావని...
ఆపదలో మమ్ము ఆదుకుంటావని...
నీవే అనాధరక్షకుడవని...
నీవే నిజమైన దేవుడవని...
ఆపద్బాంధవుడవని ఆశపడితిమే...
అది
జననమైనా...
జీవనమైనా...
కడకు మరణమైనా...
ఈ సృష్టిలో సకలచరాచర
జీవకోటికి నీవే ఆధారమని...
పంచభూతాల సాక్షిగ మేము నమ్మితిమే...
సృష్టి స్థితి లయలకు
కారకుడవు నీవేనని...
నిన్నే భక్తితో కొలిచి..
ఏడుకొండలు ఎక్కి...
నీవే దిక్కని నీ పాదాలకు మ్రొక్కితిమే..
మడికట్టుకొని గుడిచుట్టు
108 ప్రదక్షిణలు చేసి...
మొక్కుబడులు చెల్లించి...
సాష్టాంగపడి పొర్లుదండాలు పెడితిమే...
నీ గుడిగంటలు మ్రోగించి...
నిత్యం నీ సన్నిధిలో నిలబడి
మా చిరు కోర్కెలు తీర్చమని...
మా సమస్యలు పరిష్కరించమని...
ప్రశాంతమైన జీవితాన్ని
మాకు ప్రసాదించమని...
ఘోరప్రమాదాలనుండి... మమ్ము తప్పించమని....
కన్నీటితో...ప్రార్ధించితిమే...
అయ్యో ఓ దైవమా?
ఏమాయె మా ప్రార్ధనలు? మాకు
శ్రమలను భరించే శక్తిని ప్రసాదించేదెప్పుడు?
ఈ నిరాశనిస్పృహ నిట్టూర్పులింకెంతకాలం?
మా కన్నీటి ప్రార్థనలకు ప్రతిఫలమెప్పుడు..?
49. ఇజ్రాయెల్ హమాస్
యుద్దం కవితలు (12 )
1. యుద్ధం వద్దు...శాంతియే ముద్దు
2. యుద్దమంటే...ఎవరికిష్టం...?
3. ఏమన్నది
ఏమన్నది యుద్దభూమి..?
4. ఇజ్రాయెల్ భూతల దాడి..?
5. తీరని రాజుల రక్తదాహం ..?
6. రాకెట్ యుగం నుండి రాతియుగంలోకి
7. మూడులు ప్రతీకార దాడులు
8. ఇజ్రాయెల్...పాలు తేనెలు
ప్రవహించే పవిత్రదేశం..?
9. యూదులు గొప్ప యుద్దవీరులు...
10. కరెన్సీ కట్టలు...శవాల గుట్టలు
11. యుద్దాలు నాడు...నేడు?
12. గజగజవణుకుతున్న గాజా..?
1. యుద్ధం వద్దు...శాంతియే ముద్దు
యుద్దమంటే...
ఎటుచూసినా కళ్ళముందరే
కాలిబూడిదైన ఖరీదైన ఇళ్ళే
కుప్పకూలిన బహుళ
అంతస్తుల భవనాలే...శవాలే...
విధ్వంసమే...వీధుల్లో శిధిలాలే...
ఆ శిధిలాల క్రింద ఇరుక్కుపోయి
ఆదుకోమని అమాయకుల హాహాకారాలే...
ఆపన్నహస్తాలకోసం నిరీక్షించే అభాగ్యులే...
అరుపులే...కేకలే...ఆకలితో ఆక్రందనలే...
పగిలిన తలలే...రగిలిన గుండెలే...
శాడిస్టులైన శత్రువులకు శాపనార్థాలే...
శిధిలాల క్రింద వినిపించని సింహగర్జనలే...
కాపాడమని పరమాత్మకు కన్నీటి ప్రార్థనలే...
యుద్దమంటే...
ఎటుచూసినా అమాయకపు
ప్రజలరక్తం ఏరులైపారడమే...
గుర్తుపట్టలేని ఛిధ్రమైన శరీర భాగాలే...
వీధులనిండా అనాధ శవాలగుట్టలే...
ఆసుపత్రుల నిండా...రక్తపు మడుగులో
గిలగిల లాడుతూ బ్రతుకు మీద ఆశతో
కొనఊపిరితో కొట్టుమిట్టాడే క్షతగాత్రులే...
బంధువుల ఏడ్పులే...పెడబొబ్బలే...
యుద్దమంటే...
ఒక మారణహోమమే...
యుద్దోన్మాదుల తీరని రక్తదాహమే...
ఆరని ఘర్షణలే...ఆగని హింసాకాండే...
రగిలే పగలు ప్రతీకారాలే...
ప్రజల ప్రాణాలతో చెలగాటమే...
యుద్దమంటే...
ఎటుచూసినా ఆకలితో
అలమటించే అస్థిపంజరాలే...
ఆరని కన్నీటి గాథలే...చేదు జ్ఞాపకాలే...
తరతరాలకు మానని గాయాలే...పీడకలలే
ఇందుకు...నిన్నటి రష్యా...ఉక్రెయిన్
నేటి హమాస్...ఇజ్రాయెల్ భీకరయుద్దాలే
సజీవ సాక్ష్యాలు...అందుకే...వద్దు వద్దు
యుద్ధం వద్దు...శాంతి మంత్రమే ముద్దు
2. యుద్దమంటే...ఎవరికిష్టం...?
యుద్దమంటే ఎవరికిష్టం..?
మారణహోమం సృష్టించే
మతోన్మాదులకే...రక్తదాహం
తీరని రాజులకే రాక్షసులకే...
యుద్దమంటే ఎవరికిష్టం..?
ఎటుచూసినా కలనైనా ఊహించని
అతి భయంకరమైన ధన ప్రాణ నష్టం
యుద్దమంటే...రాకెట్ల దాడులే....
చెవులు చిల్లులుపడే మర ఫిరంగుల మ్రోతలే...యుద్దట్యాంకుల చప్పుళ్ళే...
యుద్దమంటే...దాడులు ప్రతిదాడులే...
అమాయకపు ప్రజల గుండెల్లో గుబులే...
బిక్కుబిక్కుమంటూ బంకర్లలో బ్రతుకులే..
యుద్దమంటే...ఎటుచూసినా
కుమిలిపోయే కుటుంబాలే...
చెల్లాచెదురైన కుటుంబ సభ్యులే...
ఉన్నఫళంగా ఇళ్ళన్నీ ఖాళీచేసి...
ఆర్జించిన ఆస్తులన్నీ వొదిలేసి...
మూటా ముళ్ళె సర్దుకొని...
కదలలేని వృద్ధులతో ఆకలేసి...
పాలకోసం అల్లాడే పసిపిల్లలతో
ప్రాణభయంతో ఉరుకులు పరుగులే...
ఔను ఇరుపక్షాలకు
అపారమైన ధనప్రాణ నష్టం..?
మరి యుద్దమంటే ఎవరికిష్టం..?
నరమేధం కోరుకునే నరరూప రాక్షసులకే...
మారణహోమం సృష్టించే మానవమృగాలకే
3. ఏమన్నది
ఏమన్నది యుద్దభూమి..?
(ఇజ్రాయెల్ పై హామాస్
మెరుపు దాడుల ఫలితం)...
ఏమన్నది
ఏమన్నది యుద్దభూమి..?
ఘోరం ఘోరం మహాఘోరమన్నది
దారుణం దారుణం మహాదారుణమన్నది
ఏమన్నాయి ? ఏమన్నాయి ?
20 నిముషాల్లో హమాస్ మిలిటెంట్లు
ఇజ్రాయెల్ పై విసిరిన 5000 రాకెట్లు..?
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
అంతటా విధ్వంసం విషాదమేనని...
ఎటు చూసినా...
వినలేని... నమ్మలేని...
చూడలేని...కంటతడి పెట్టించే
ఒళ్ళు జలదరించే విషాదకరమైన
హృదయ విదారకమైన దృశ్యాలేనని...
ఎటు చూసినా...
నిన్న కిటకిటలాడిన
వీధులన్నీ నేడు నిర్మానుష్యమేనని...
నిన్న పార్టీలలో కిలకిల నవ్వి
ఆటలాడి పాటలు పాడినృత్యాలు చేసి
సంతోష సంబరాలో మునిగి తేలినవారు
నేడు ప్రాణ భయంతో బంకర్లలో
బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని..
ఎటు చూసినా...
పిల్లా పాపలు చెల్లాచెదురై
కుటుంబ సభ్యులెక్కడున్నారో
తెలియక అసలు బ్రతికున్నారో లేదో
అర్థం కాక అయోమయ స్థితిలో
విలవిలలాడిపోతువున్న
కుమిలిపోతున్న కుటుంబాలేనని...
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటు చూసినా...
విరుచుకుపడే రాకెట్ల దాడికి
విద్వంసమైన విశాలమైన
బహుళ అంతస్తుల భవనాలేనని...
ఆ భవనాల శిధిలాల క్రింద
నలిగిపోయి చితికిపోయి
ఆకలికి అలమటించే
అమాయకపు అస్థిపంజరాలేనని...
4. ఇజ్రాయెల్ భూతల దాడి..?
ఏమన్నాయి ? ఏమన్నాయి ?
గాజా స్ట్రిప్ లో
స్కూల్ భవనాలను...
ఆసుపత్రులను కవచాలుగా...
మార్చుకుని రాకెట్లు ప్రయోగిస్తున్న
మారణహోమం సృష్టిస్తున్న
హమాస్ మిలిటెంట్లను మట్టుపెట్టాలని
వారు దాక్కున్న భూగర్భ సొరంగాలనే "ప్రపంచంలో అతిపెద్ద సమాధులుగా" మార్చాలని గాజాపై యుద్ధభేరి మ్రోగించి
రాత్రింబవళ్ళు ఇజ్రాయెల్ సైనికులు
కురిపించే...ఆ బాంబులమోతలు"...
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటుచూసినా...చీకటి
సొరంగాలలో చితికిన బ్రతుకులేనని...
రాత్రింబవళ్ళు...
రాకెట్ దాడులేనని బాంబుల మోతలేనని...
తిరగబడ్డ పాలస్తీనా ప్రజల తలరాతలేనని..
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటు చూసినా....
ఆసుపత్రుల నిండా...
రక్తపు మడుగులో గిలగిలలాడే
చిన్నపిల్లల...మహిళల...
వృద్దులైన క్షతగాత్రుల హాహాకారాలేనని...
దట్టమైన పొగకు
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతూ
మూటా ముళ్ళె సర్దుకొని...
దిక్కుతోచక ప్రాణభయంతో
పరుగులు తీసే పాలస్తీనా ప్రజలేనని...
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటు చూసినా....
ఆకలి కేకలేనని...ఆకాశాన్నంటే
ఆక్రందనలేనని...అరణ్య రోదనలేనని...
పగలు రాత్రి బాంబుల వర్షమేనని...
కటిక చీకటి...గాఢాంధకారమేనని...
క్షిపణి దాడులు...ప్రతిదాడులేనని...
కళ్ళముందరే ఏరులైపారేది
అమాయకపు ప్రజల రక్తమేనని..
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటు చూసినా...
శరీరాలు ఛిద్రమై గాలిలో
కలిసిపోయిన పౌరుల ప్రాణాలేనని..
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ
ఆపన్నుల కోసం ఆశతో
ఎదురు చూస్తున్న అభాగ్యులేనని...?
ఎటు చూసినా...
వేలాది మంది క్షతగాత్రులకు
ప్రాథమిక చికిత్సను
అందించలేక ఆదుకోలేక
శవాల గుట్టలతో నిండి
శ్మశానాలుగా మారిన ఆసుపత్రులేనని?
యుద్ధం యుద్దోన్మాదులకు ఓ పండుగని...
ప్రజలకు మాత్రం అదొక ప్రత్యక్ష నరకమని...
5. తీరని రాజుల రక్తదాహం ..?
ఒకనాడు
కీర్తి కిరీటాలకోసం...
అందమైన స్త్రీలకోసం...
నీళ్ల కోసం నిధినిక్షేపాలకోసం...
రాజ్యాల కోసం...
రాజ్య సింహాసనాలకోసం...
భూమికోసం భుక్తి కోసం...
బానిస బ్రతుకుల విముక్తికోసం...
దారుణమైన దండయాత్రలు
ఘోరమైన భయంకరమైన
యుద్ధాలు ఏళ్లతరబడి జరిగాయి
అమాయక ప్రజలను
ఊతకోచ కోయడం నిలబెట్టి
నిర్దాక్షిణ్యంగా కాల్చడం
యుద్ధాలతో ఏ సంబంధంలేని
అమాయకపు పిల్లలను
ఆడవారిని వృద్ధులను
బంధించడం హింసించడం
ప్రశ్నించే ప్రతిఘటించే
యువతీ యువకులను
బంధించడం వేదించడం
ఎదురు తిరిగితే వధించడం
విజయగర్వంతో విర్రవీగడం...
రాజులది రాజ్యకాంక్షే...
రాజులందరూ రాక్షసులే...
రాజుల చరిత్ర రక్త చరిత్రే...
రాజులందరికి రక్తదాహమే...
రాజులు సృష్టించేది రక్తపాతాలే...
రాజుల తలంపులు విషపూరితమే...
6. రాకెట్ యుగం నుండి రాతియుగంలోకి
అత్యాధునికమైన
మారణాయుధాలను ప్రయోగించి
వందలాదిమందిని పొట్టన పెట్టుకొని
వేలాది మందిని క్షతగాత్రులనుచేసి
రాకెట్ యుగం నుండి
రాతియుగంలోకి
రక్తపాతాలు సృష్టిస్తూ
రాజ్యకాంక్షతో దూసుకెళ్లే...
ఓ రాక్షసులారా..! ఓ రాబందులారా ..!
భీకరమైన
బాంబుదాడులతో ప్రతిదాడులతో
ఏ పాపం పుణ్యం ఎరుగని
వేలాదిమంది అమాయకపు
ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారే...
రేపు మీరేమి పట్టుకుపోదామని...
మీ వాళ్ళను మీరే కాల్చుకోవడం కాదా..?
మీ ఇళ్ళను మీరే పేల్చుకోవడం కాదా..?
మీజీవితాల్ని మీరే ఛిద్రం చేసుకోవడం కాదా
ఇందర్ని బంధీలను చేసి
ఎన్నోచిత్రహింసలకు గురిచేసి
రేపేమి పట్టుకుపోదామని
ఏం సాధిద్దామని...
మీరు కూర్చున్న కొమ్మని
మీరే నరుక్కోవడం కాదా..?
మీరు నివసించే భూమిని
మీరే నరక కూపంగా..
మరుభూమిగా...మార్చుకోవడం కాదా..?
మానవత్వంతో ఆలోచించండి...
అత్యాధునికమైన
మారణాయుధాలను
ప్రయోగించే ముందు...
మానవ మృగాలై
ప్రజల ప్రాణాలను హరించే ముందు...
7. మూడులు ప్రతీకార దాడులు
ఓపెన్ జైలుగా
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గాజా
మెరుపు దాడులు చేసింది
ఇజ్రాయెల్ పైకి
20 నిముషాల్లో 5000
రాకెట్లతో విరుచుపడింది
భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించింది వేలాదిమంది ప్రజల ప్రాణాలను బలిగొంది
222 మంది ఇజ్రాయెల్ పౌరులను
సైనికులను బంధీలను చేసింది
ఇజ్రాయెల్ ను చావుదెబ్బ తీశామని
విర్రవీగి సొరంగాలలో దాక్కున్న
హమాస్ మిలిటెంట్లను మట్టుపెట్టి
"ఆ సొరంగాలనే ప్రపంచంలో
అతిపెద్ద సమాధులుగా" మార్చేస్తామని
24 గంటల్లో 11 లక్షలమంది పాలస్తీనా ప్రజల్ని ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేసి ఉత్తరం నుండి దక్షిణం వెళ్ళమని
హుకుం జారీ చేసిన ఇజ్రాయెల్ సైన్యం
భారీప్రణాళికలతో యుద్దభేరీ మోగించింది
ప్రతీకారంగా అమాయకపు గాజా ప్రజలకు ఆహారం నీరు ఇంధనం విద్యుత్ మందులు
అందకుండా అడ్డుకుంటుంది...ఇవి కదా
మూఢులు చేసే ప్రతీకార దాడులు...
పిల్లాపాపలతో
చెల్లాచెదురై పోయిందెవరు ?
అల్లాడి ఆకులు మేస్తుందెవరు ?
అమాయకపు ప్రజలే కదా...
అయ్యో ఓ దైవమా అల్లా ఎక్కడున్నావయ్యా...
ఆపదలో చిక్కుకున్న
మమ్ము ఆదుకోండి మా తండ్రీ
తక్షణమే ఈ భీకర యుద్దాలనాపండి
ఈ యుద్ధోన్మాదుల బుద్దిని మార్చండి... లేదా...
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ
ఆసుపత్రిల్లో ఏ వైద్యసహాయమందక మృత్యువుతో పోరాడుతున్న
మా అందరి ప్రాణాలైనా తీసుకోండి...
8. ఇజ్రాయెల్...పాలు తేనెలు
ప్రవహించే పవిత్రదేశం..?
బైబిల్ గ్రంధం చెబుతోంది
ఇజ్రాయెల్ పాలు తేనెలు
ప్రవహించిన పవిత్ర దేశమని
నేడు అమాయకపు ప్రజల
రక్తం ఏరులై ప్రవహిస్తున్న
భద్రత కరువై భయంతో
ప్రజలు బంకర్లలో
బ్రతుకుతున్న ఓ చిన్న
దేశం ఇజ్రాయేల్ దేశం...
ఎన్నో ఏళ్ళతరబడి
ఇరుగు పొరుగు దేశాలతో
ఎన్నో యుద్ధాలు చేసింది
శత్రువులను హతమార్చింది
ఎందరినో పౌరులను
యుధ్దవీరులను కోల్పోయింది
ఇజ్రాయేల్ దేశం...ఐనా
నేడు ప్రపంచంలో అత్యాధునిక
రక్షణ వ్యవస్థ కలిగిన అత్యంత
శక్తివంతమైన దేశం ఇజ్రాయేల్ దేశం.
ఈ చిన్న
క్రిష్టియన్ కంట్రీకి
చుట్టూ ఉన్నది
అత్యాధునికమైన
మారణాయుధాలు...
ధరించిన శత్రుమూకలే...
గుంటనక్కలే గుడ్లగూబలే...
కయ్యానికి కాలు దువ్వే
కసితో బుసలు కొట్టే కాలనాగులే...
చుట్టూ ఆకలితో
అక్కసుతో ఉన్న అరబ్బుదేశాలే....
నిజమే ఇజ్రాయెల్
నేడు సింహాల బోనులో
చిక్కుకున్న దానియేలే...అది
కత్తుల బోనులో ఉన్న సింహమే
ఐనా సింహం సింగిల్ గా వస్తుంది
గొర్రెలు మేకలే గుంపులుగా వస్తాయి
అక్టోబర్ 7న
20 నిమిషాలలో
5000 రాకెట్లు విసిరిన
తనతోకను త్రొక్కిన...
భూగర్భ సొరంగాలలో నక్కిన...
222 ముందితన దేశ పౌరులను
సైనికులనుబంధీలుగా చేసినందుకు..
11 లక్షల మంది పాలస్తీనా ప్రజలను
దక్షిణ దిక్కుకు పంపి గాజాను గాలించి
హమాస్ మిలిటెంట్లను ఏరివేసేందుకు...
శత్రుమూకల్ని మట్టు పెట్టేంతవరకు...
ఆ భూగర్భ సొరంగాలనే అతిపెద్ద
సమాధులుగా మార్చేంతవరకు...
కునుకు తియ్యనని...వెనుతిరగనని...
ప్రతిన పూనిన దేశం ఇజ్రాయేల్ దేశం...
9. యూదులు గొప్ప యుద్దవీరులు...?
నిజానికి యూదులు...ఎవరు?
యూదులు అంటే ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ అంటే యూదులే...
మొదటి రెండవ
ప్రపంచయుద్ధాలలో
ఒట్టోమాన్ సామ్రాజ్యం
కూలిపోవడానికి...
హిట్లర్ ఓడిపోవడాని...
బ్రిటిష్ సేనలు గెలవడానికి...
ముఖ్య కారణం యూదులేనట...
ఇజ్రాయెల్ యుద్ధవీరులేనట...
హిట్లర్ చేతిలో
60 లక్షలమంది
ఊతకోచకు గురైంది
యూదులేనట ఆ
ఇజ్రాయెల్ యుద్దవీరులేనట...
ఆ కారణంగా
ప్రపంచ మంతా
చెల్లాచెదరైపోయింది
పాపం యూదులేనట...
ఇజ్రాయెల్ యుద్దవీరులేనట...
కానీ చారిత్రాకారులు
అంటారు యూదులు
యుద్ధంలోనే..పుడతారు...
యుద్ధంలోనే...జీవిస్తారు...
యుద్దంలోనే...మరణిస్తారని...
10. కరెన్సీ కట్టలు...శవాల గుట్టలు
తరతరాలకు
తరగని కోట్లకోట్ల
ఆస్తులు ఆర్జించిన
కొందరు శ్రీమంతులు
శయనించేది....
కరెన్సీ కట్టల మీద ...
రక్తదాహం తీరని
రాజ్యకాంక్ష గల
కొందరు
రాక్షస రాజులు
సామ్రాజ్యవాదులు
శయనించేది...
శవాల గుట్టల మీద...
11. యుద్దాలు నాడు...నేడు?
గతమంతా
నరమేధమే...
రక్తపాతమే...
రాజ్యాధికారమే...
గత చరిత్ర రక్త చరిత్రే...
కారణం అందరూ
ఇరుగు పొరుగు
చిరు దేశాలమీద
కత్తులు నూరేవారే...
యుద్దానికి కాలుదువ్వే వారే...
ఔను...నాడు...
భీకర యుధ్ధాలు
దాడులు
ప్రతి దాడులు
దండయాత్రలు
దారుణ మారణ హోమాలు
రక్తపాతాలు ఎందుకోసం..?
భూమి కోసం...
భుక్తి కోసం...
నీటి కోసం...
నిధినిక్షేపాల కోసం...
అతిలోక సుందరిమణులైన
అంతఃపుర అతివలకోసం...
అశాశ్వతమైన
సింహాసనాలకోసం...
కీర్తి కిరీటాలకోసం...
రాజ్యాల విస్తరణ కోసం...
కానీ...నేడు...
భీకర యుద్దాలు ఎందుకోసం..?
పశ్చిమాసియాలోని
ఆయిల్ నిధినిక్షేపాల కోసం...
అరబ్బులపై ఆధిపత్యం కోసం...
పవిత్రస్థలమైన జెరూసలేం కోసం...
విభజించు పాలించు
సిద్దాంతాన్ని పాటించే
నాటి బ్రిటీష్ ప్రభుత్వం
అరబ్బులు నివశించే
పాలస్తీనా భూభాగాన్ని
ఇజ్రాయెల్ పాలస్తీనాలుగా
రెండు ముక్కలు చేసి
మూడు మతాలకు చెందిన
పవిత్రమైన జెరూసలేం ను
ఐక్యరాజ్యసమితి
ఆధీనంలో ఉంచినందుకు...
అటు...అత్యాధునిక
మారణాయుధాలను సరఫరా చేస్తూ
ఇజ్రాయెల్ సైన్యానికి శిక్షణ నిస్తూ
అండగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా
తమకు ప్రక్కలో బల్లేలైన హమాస్
ఫతా హెజ్బుల్లా ఉగ్రవాదుల ఏరివేతకు
ఇజ్రాయెల్ ని ఉసిగొల్పుతున్నందుకు...
ఇటు...తమకు ప్రక్కలో బల్లెమైన
ఇజ్రాయెల్ ను ఆక్రమించుకోవాలని
పాలస్థీనాను స్వతంత్ర్య ఇస్లామిక్
రాజ్యంగా గుర్తించాలని
ఇరాన్ ఇతర అరబ్ నేతల
అండతో గాజా లోని హమాస్
వెస్ట్ బ్యాంక్ లోని ఫతా మిలిటెంట్లకు
అత్యాధునిక మారణాయుధాలను సరఫరాచేస్తూ ఇజ్రాయెల్ పైకి
అరబ్ దేశాలు ఉసిగొల్పుతున్నందుకు...
12. గజగజవణుకుతున్న గాజా..?
222 మంది ఇజ్రాయెల్
పౌరులను సైనికులను
యుద్దఖైదీలుగా బంధించామని...
మీసాలు మెలివేయకండి..!
విధ్వంసాలు...
సృష్టించామని విరవీగకండి..!
ఇందరి ప్రాణాలను గాలిలో
కలిపేసి ఏమిటి మీరు సాధించేది..?
నక్కల్లా ప్రక్కవారి ప్రాణాలను
లెక్కచేయని యుద్ధపిచ్చి
పట్టిన ఓ గజ్జకుక్కల్లారా..!
ఓ నరరూప రాక్షసులల్లారా..!
మానవత్వం లేని ఓ మృగాల్లారా..!
మీరు విసిరే నిప్పుకణిక
మిమ్మల్నే దహించి వేస్తుందని...
మీరు ఆకాశం పైకి విసిరిన...
రాళ్ళు నీతలపైనే పడి
పగలేది మీ తలలేనని...
ఎప్పుడు మీకు తెలిసేది..?
పగలు రాత్రి
పగా ప్రతీకారాలే తప్ప
ప్రేమ దయ జాలి కరుణ లేని
ఓ పాషాణహృదయుల్లారా..!
అల్లా కోరునా అల్లకల్లోలం..?
ఆ క్రీస్తు కోరునా కిరాతకం...?
జిహాద్ ఏమిటీ...?
జీహాద్ పేర
ఈ జీవహింస ఏమిటి..?
మతమేమిటీ...
మతం పేర ఈ
మారణహోమం ఏమిటి..?
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502
మ

Comments
Post a Comment