45... డిసెంబర్ నెల 2023 కవితలు

 45...డిసెంబర్ నెల 2023
       కవితల ఇండెక్స్

1. జయహో..! జయహో..! తెలంగాణ 
   ముఖ్యమంత్రి రేవంతన్నా ! జయహో 
2. కష్టజీవులకు కనకాభిషేకం..! 
    పోరాటయోధులకు పట్టాభిషేకం..!!
3. అతి విశ్వాసం..? అహంకారం..?
4. డిసెంబర్ 3...నాడు...నేడు 
    డిసెంబర్ 4...నాడు...నేడు 
5. ఉత్తములు ఉన్నత శిఖరాలకే...
    అహంకారులు అధఃపాతాళానికే...
6. ఓటరు విసిరిన "వజ్రాయుధం" 
7. నిన్న రతనాల వీణ నేడు నిప్పుల వాన 
8. గుంటనక్కలకు గుణపాఠం..?
9. కన్నీరు కార్చిన...కలాలు...కులాలు..?
10. రెండు కాళ్ళతో
      రెండు బంగారు పతకాలు..!!
11. ఆమె అబల కాదు ఆదిపరాశక్తి 
12. మనకు మంచి మనసిచ్చినోడు..?
13. సర్వ కర్మ ఫల మోక్షప్రదాత..?
14. ఇది శాంతి వనం...? అది రణక్షేత్రం..?
15. శుభోదయం ఒక మధుర ధ్వని... 
16. అంతకాలం మీ జీవితం ధన్యమే...? 
17. చిగురించే స్నేహానికి చిరునామా..!
18. శుభోదయం అంటే..?
19. శుభోదయం..! ఒక ఉషోదయం..!!
20. అత్యాశ అనర్థమే...?
21. ధనమే...దైవం !
22. ఏడడుగుల బంధం...
      ఎన్నెన్నో జన్మల బంధం...
23. నేడిద్దరు రేపు ముగ్గురు..?
24. చింతించకు..! చింతించకు..!!
25. ప్రేమించు...ప్రాణాలర్పించేలా..?
26. పోరాటాల గడ్డ..! తెలంగాణ 
      తొలి శాసన సభాపతిగా దళిత బిడ్డ..!
27. ఈ లోకంలో...అరుదు...అరుదు...
28. ఆడవాళ్ళు...మీకు జోహార్లు 
29. వలపు వంట...ప్రేమ పంట 
30. ఏకత్వంలో భిన్నత్వం..?
31. ఇందులో మీరెవరో తేల్చుకోండి..!
32. నా ప్రశ్నకు బదులేది...?
33. ఆడవారు గుభాళించే 
       గులాబీ పువ్వులు....? 
34. స్వచ్చమైన వ్యక్తిత్వం 
      వికసించిన తామర పుష్పం..!
35. మచ్చలేని మన వ్యక్తిత్వం..! 
36. ప్రేమించే ప్రేమామయుడు..! 
37. అన్న పోలన్న సుభాషితం
      విన్న మీకు....శుభోదయం 
38. అందాల ఓ చిలుకా..! 
       అందుకో నా లేఖ.....!
39. గుట్టు చప్పుడు కాకుండా 
       వచ్చే గుండె జబ్బు..! (చిత్ర కవిత) 
40. మనసే మలినమైతే...?
41.  అక్షరాలే శిక్షగా...అక్షరాలే రక్షగా...
42. పట్టిందంతా బంగారంగా...
       ముట్టిందంతా ముత్యంగా...
43. వరమొక్కటే..! ఆయుధమొక్కటే..!
44. గురువులు కాదు గుంటనక్కలు...
45. గజగజ వణుకుతున్న గాజా..!



1. జయహో..! జయహో..! తెలంగాణ 
   ముఖ్యమంత్రి రేవంతన్నా ! జయహో 
 
ఓపిక ఉన్నంతవరకు కాదు కాదు 
ఊపిరి ఉన్నంతవరకూ పోరాడాలి
పోరాడితే పోయేదేముంది చెప్పండి 
మన బానిసత్వపు సంకెళ్ళు తప్పవన్న నివురుగప్పిన నిప్పులాంటి...నినాదంతో...

సాహసమే ఊపిరిగా...ఆశయాలే ఆకలిగా 
గడ్డి కరిచే దొరలను దోచుకునే దొంగలను
ఫామ్ హౌస్ కే పరిమిత చేయాలన్న 
గడీల గద్దలను గద్దె దించాలన్న లక్ష్యంతో
వ్యూహకర్త సునీల్ కనుగోలు అందించిన  ఆరుగ్యారెంటీల అస్త్రాలతో ముందుకురికిన
ఓ ఉయ్యాలవాడ ఉగ్రనరసింహుడా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..! 

కన్న కూతురు పెళ్ళికి హాజరై
అక్షింతలు జల్లి ఆశీర్వదించేందుకు
అడ్డు పడిన బద్దశత్రువులను
ఒటు హక్కునే గండ్రగొడ్డలితో నరికి 
కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేసిన 
"వేయ్యేనుగుల బలమున్న ఓ వేటగాడా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..! 
 
ఓటుకు నోటు కేసుతో 
రాటుదేలి మదపుటేనుగై
గులాబీ కొండనే డీకొట్టిన...
ఓ కొండారెడ్డిపల్లి కొదమసింహమా..! 
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!

ప్రత్యర్థుల కంచుకోటలను బద్దలు కొట్టి
అమ్మపాలు త్రాగి అమ్మ రొమ్మును గుద్దిన
మోసకారిని అధికార దురహంకారిని 
ఎన్నికల సమరంలో మట్టి కరిపించిన
ఓ సాహస వీరుడా! ఓ విక్రమార్కుడా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!

ముఖ్యమంత్రికే సవాల్ విసిరి పోటీకి దిగి
రాహుల్ ప్రియాంకా గాంధీలతో కలిసి  
85 సభల్లో సుడిగాలి పర్యటనలు చేసి
ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ఓటర్లను
ఆకట్టుకొని ...సభావేదికలు దద్ధరిల్లేలా
ఉద్వేగ పూరితమైన ప్రసంగాలతో 
తెలంగాణ ప్రజల్ని ఉత్తేజితులను చేసిన 
ఉర్రూతలూగించిన ఓ ఉద్యమ సూర్యుడా..!
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!
 
మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం... మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నినాదంతో
కర్నాటక తరహాలో తెలంగాణలో సైతం 
64 సీట్లతో సంపూర్ణమైన మెజారిటీతో
కాంగ్రెస్ జెండాను తెలంగాణాలోఎగరేసిన...
విజయభేరీ మ్రోగించిన ఓ విప్లవ వీరుడా..!
ఓ బాహుబలీ..! ఓ రేసుగుర్రమా..! 
ఓ రేవంతన్నా ! మీకు జయహో జయహో..!

(యువనేత డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి 
తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా
అందిస్తున్న అక్షర కుసుమాంజలి....)

2. కష్టజీవులకు కనకాభిషేకం..! 
   పోరాటయోధులకు పట్టాభిషేకం..!!

కష్టేఫలి..! 
శ్రమయేవ 
జయతే..!
కొడంగల్ 
కోడెనాగు...
కొండారెడ్డి పల్లి 
కొదమసింహం...

బిఆర్ యస్ 
బిగ్ బాస్ 
సింహాసనాన్ని
ఆక్రమించి...
గులాబీ ముఠాకు 
గుండెల్లో
గుబులు రేపి...
 
గులాబీ కోటపై
కాంగ్రెస్ జెండాను 
ఎగురవేసిన
పోరాట యోధుడు... 
నిన్నటి పార్టీ వారథి... 
నేటి ఎ సారథి...

యంగ్ అండ్ ఎనర్జిటిక్...
డాషింగ్ అండ్ డేరింగ్...
డైనమిక్ లీడర్...
రేవంత్ రెడ్డి గారు 
తెలంగాణ రెండవ
ముఖ్యమంత్రిగా 
నేడు 7 డిసెంబర్ 23న
ఎల్ బి స్టేడియంలో 
మధ్యాహ్నం 1.04 గం.లకు
ప్రమాణస్వీకారం చేయు శుభవేళ

తెలుగు తల్లి మురిసే వేళ...
తెలుగు జాతి మొత్తం గర్వపడేవేళ...
అందరి‌ హృదయాలలో 
ఆనందం కుంభవర్షమై కురిసేవేళ....

పోరాటాల పోరుగడ్డ తెలంగాణా
ముఖ్యమంత్రిగా యువనేత ‌
యంగ్ టైగర్ మన ప్రియతమ రేవంత్ రెడ్డి 
గారికి అర్పిస్తున్న అక్షర కుసుమాంజలి...

3. అతి విశ్వాసం..? అహంకారం..?

ఏ గ్రహదోషమో...
ఏమి అపచారమో...
ఏ పూర్వజన్మ పాపఫలమో...
ఎన్నికల వేళ మేడిగడ్డ...క్రుంగిపోయె...

ఓర్పు నశించిన 
ఓటరు మాంత్రికులు
ఇచ్చిన తిరుగులేని తీర్పుతో 
రాటుదేలిన రాజకీయ నాయకుల 
జాతకాలన్నీ రాత్రికిరాత్రే మారిపోయె...

ఒకనాడు చీమలు పెట్టిన
పుట్టలో పాములు దూరినట్టు...

అజ్ఞాని ఒకడు ఇష్టపడి కష్టపడి
అందమైన ఇంద్ర భవనం కడితే
అద్దెకు చేరి అదృష్టవంతుడొకడు
దాన్నిహాయిగా అనుభవించినట్టు...

వాస్తు శాస్త్రానికి విరుద్దమని...
పాత భవనాలను కూల్చి కేసీఆర్
కోట్లుపెట్టి కట్టిన కొత్త సెక్రటేరియట్ లో 
తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి కొలువైన తీరు తరచిచూస్తే..

ఒకడు తంతే గారెల బుట్టలో పడినట్టు..
ఒకడు అవినీతి...అహంకారం 
అధికారదాహం...అతివిశ్వాసం 
తలకెక్కితే అథఃపాతాళానికి జారినట్టు...

4. డిసెంబర్ 3...నాడు...నేడు 
    డిసెంబర్ 4...నాడు...నేడు 

తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో...
సాగించిన ఉద్యమంలో... 
నాడు డిసెంబర్ 3 న...
శ్రీకాంత్ ఆచారి అమరుడాయె...
సెంటుమెంట్ పేరుతో తెలంగాణ ఏర్పడె... 

నేడు డిసెంబర్ 3 న...కేసీఆర్ ప్రభుత్వం
కరెంట్ షాక్ కొట్టి కనుమరుగైపోయె...

నాడు డిసెంబర్ 4 న...
బెడ్ రూమ్ తలుపులు
పగులగొట్టి రేవంత్ రెడ్డిని 
అక్రమంగా అరెస్టు చేసిన ఆ పోలీసులే...

నేడు డిసెంబర్ 4 న...
తెలంగాణా ఎన్నికల్లో 
కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాల్లో 
పూర్తి మెజారిటీ రాగా ప్రభుత్వ 
ఏర్పాటుకు ఎస్కార్ట్ వాహనంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి 
రేవంత్ రెడ్డిని రాజ్ భవన్ తీసుకెళ్ళారు
ఔరా విధి ఎంతటి విచిత్రమైనదో కదా...

ప్రతి మనిషికి కాలం 
నేర్పే గుణపాఠమొక్కటే..!

రేపేమి జరుగునో 
మీకు  తెలియదని...
అధికారంతో అహంకారంతో
ఎవ్వరూ విర్రవీగరాదని...
ఈ రోజే మీదని రేపు మీదికాదని...
రాజులు రాజ్యాలు సింహాసనాలు
రాజభోగాలు ఏవీ శాశ్వతం కావని...

5. ఉత్తములు ఉన్నత శిఖరాలకే...
    అహంకారులు అధఃపాతాళానికే...

"నేనే రాజును 
"రారాజును"
"మకుటంలేని మహారాజును" 

"ఇది నా అడ్డా" 
"నా ఎకెదురు లేదు"
"నన్నోడించేవాడింకా పుట్టలేదు"
అంటూ మురిసిపోతారు మూర్ఖులు..

కాదు "బిడ్డా" 
ఇది "ప్రజల ఆస్తి"
ఇది "ప్రజాస్వామ్యం" 
ఇది "ప్రజాప్రభుత్వం" 
ప్రజలే "రాజులు"అంటే 
విరగబడి నవ్వి... 
వికటాట్టహాసం చేస్తూ...

"ఇది నా బంగారు సింహాసనం"
"దీన్నెవరూ ఆక్రమించుకోలేరు"

"ఇది నా కంచుకోట"
"ఇది నా రాజమందిరం"
"దీనిలోకెవరూ ప్రవేశించలేరు"

అంటూ అధికారగర్వంతో విర్రవీగే
ప్రజానాయకుల..."రాక్షస పాలన"
పాపం పండి పదేళ్లకే పతనమైపోయె...

అనుభవం పండితేనేమి ?
అహం తలకెక్కిన ప్రజానాయకులు 
"అహంకారులందరూ అధఃపాతాళానికే"...

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే...
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా....
సకలజనులు సుఖశాంతులతో 
సుభిక్షంగా సురక్షితంగా ఉండేలా 
సుపరిపాలన అందించే...నిస్వార్థపరులైన 
"ఉత్తములందరూ ఉన్నత శిఖరాలకే"...
అట్టి ఘనులు త్యాగధనులు చరిత్రలో 
చిరంజీవులే...నిత్యం చిరస్మరణీయులే...

6. ఓటరు విసిరిన "వజ్రాయుధం" 

ఎంతకాలం..? ఇంకెంత కాలం..?
ఈ దోపిడి రాజ్యం...ఈ పాపిష్టి ఈ
నీచ నికృష్ట "నిజాం నిరంకుశ "పాలన... 

ఎంత కాలం..? ఇంకెంత కాలం..?
హీనమైన ఈ "హిట్లర్ " పాలన...
తూతూ మంత్రమైన
పథకాలతో ఈ "తుగ్లక్ " పరిపాలన...
 
కోట్లుకోట్లు ఖర్చు చేసి
యాదాద్రి రామానుజాచార్యుల 
గుళ్ళు గోపురాలు కట్టించినా...

ఎంతోమంది పూజారులతో
ఋత్విక్కులతో పండితులతో
భారీగా ఎన్నో చండీహోమాలు 
యజ్ఞాలు యాగాలు చేయించినా...

దైవాంశ సంభూతులంటూ
మఠాధిపతులను సత్కరించి 
వొంగి వొంగి పాదాలకు మ్రొక్కినా...

"హ్యాట్రిక్" కొట్టడం
ఖాయమంటూ తలలు పండిన 
జ్యోతిషశాస్త్ర పండితులెందరో
టీవి ఛానెల్స్ లో ఘోషించినా...
అన్ని అంచనాలు తారుమారాయే...
ఓటరు విసిరిన "వజ్రాయుధం"దెబ్బకు...

తమకిక ఎదురే లేదని...మరో
పాతికేళ్ళదాక తమదే రాజ్యమని...
అధికా రగర్వంతో విర్రవీగిన
అనుభవగ్నులైన అహంకారులైన
కేసీఆర్ కుటుంబ పాలన
కాంగ్రెస్ దెబ్బకు కుప్పకూలిపోయే...
పాపం పండి...పాపం 
పదేళ్ళకే రాజ్యం పతనమైపోయే...

కాంగ్రెస్ కావాలని మార్పు రావాలని
64 సీట్లతో పూర్తి మెజారిటీతో
కాంగ్రెస్ కు పట్టం కట్టిన...
బి ఆర్ యస్ గా మారిన
టీ ఆర్ ఎస్ కు దిమ్మతిరిగేలా
విప్లవాత్మకమైన తీర్పునిచ్చిన...
"గద్దలను గద్దె దించిన"...
ఎంతో విజ్ఞతతో ఓటేసిన...
ఓ తెలంగాణ ఓటరులారా..!
మీకు వందనం..! 
అభివందనం..! పాదాభివందనం..! 

7. నాడు రతనాలవీణ...నేడు నిప్పులవాన..?

నాడు రతనాలవీణ...నేడు నిప్పులవాన..?

నాడు నా తెలంగాణ కోటి రతనాల వీణ
నిజమే నేడు నిర్భంధ నిరంకుశ పాలనలో
ప్రతిగుండెలో కురిసేనట...ఓ నిప్పులవాన

తెలంగాణ 
రాష్ట్ర సాధనలో
12000 మంది యువతీ
యువకులు అమరులయ్యారంట...

తేనెలమాటల తెల్లదొర గద్దెనెక్కగానే
కుటుంబమంతా ఖుషీ ఆయెనంట...
కట్టిన భారీప్రాజెక్టులతో ఎండిన బీడు
భూములు సస్యశ్యామలమాయెనంట...
నిన్న కష్టేఫలి అంట నేడు కలలు పండేనంట
ఆ ఇంట గలగలమంటూ కాసుల పంటేనంట

32 లక్షల నిరుద్యోగుల ఆవేదనలు 
ఆక్రందనలు అరణ్య రోదనలాయెనంట...

కోట్లు ఖర్చుచేసి భారీ సభలు పెట్టెనంట...
గోడదూకిన గొర్రెలకు గొప్ప సన్మానాలంట...
బిగ్ బాస్  ‌బిజినెస్ మ్యాన్ గా మారెనంట...
కులానికో సంక్షేమభవన్ శాంక్షన్ ఆయెనంట

సంక్షేమ పథకాలెన్నో ...పెట్టెనంట
డబుల్ బెడ్ రూంల ఇళ్ళెన్నో...కట్టెనంట
స్వామి కార్యం స్వకార్యం...జరిగెనంట 

ప్రతిఘటించే ప్రత్యర్థులపై కేసులంట...
ప్రశ్నించే గొంతుకలపై కలం కత్తి పోటంట...
బంగారు తెలంగాణ కల భగ్నమాయెనంట
ఉద్యోగుల్ని...ఉద్యమకారుల్ని... 
నిరుద్యోగుల నిట్టూర్పుల్ని... 
పట్టించుకోని ప్రజాప్రతినిధులు 
రెప్పపాటున కుప్పకూలిపోయిరంట...

ఏ‌ ప్రలోభాలకు లొంగని...
తెలివిగల ఓటర్ దేవుళ్ళు...
తిరుగులేని తీర్పునిచ్చిరంట...
కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిరంట...
తెలంగాణాను మరో కర్ణాటకగా మార్చిరంట.

8. గుంటనక్కలకు గుణపాఠం..?

అవినీతి... 
బంధుప్రీతి... 
అధికారం.... 
అహంకారం...
అరాచకత్వం...
ఎంతకాలం...? ఎంతకాలం...?
ఇంకెంత కాలం..! కొంతకాలమేలే...?

అంతా అశాశ్వతమేలే..!
నాది నాది అనుకున్నదేదీ
నీది కాదన్నది నగ్నసత్యమేలే..!
గెలుపు ఓటములు దైవాధీనములే..!

బండ్లు ఓడలు 
ఓడలు బండ్లౌనులే...!
పదేళ్ళకే పాపం పండేనులే..!
గుంటనక్కలకిదొక గొప్ప గుణపాఠమేలే..!

అహం తలకెక్కిన 
అహంకారులు...అధఃపాతాళానికే..!

సుపరిపాలనను జపించే... 
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే...
ప్రజాసంక్షేమం కోసం తపించే...
ఉత్తములైన నిస్వార్థపరులైన...
ప్రజానాయకులు ఉన్నత శిఖరాలకే...!

9. నిన్న కన్నీరు కార్చిన... 
    కలాలు...కులాలు..?

వినుడి వినుడి మిత్రులారా... 
విప్లవ జ్వాలలు రగిలినప్పుడే... 
మెరుగైన సమాజస్థాపన జరిగేనట....

ఇనుప సంకెళ్ళు ఉక్కుపాదాలు 
ఫాంహౌస్ వైపుకు మళ్ళాయట... 
శాంతికపోతాలు ఎగురుతున్నాయట... 

అహంకారంతో అధికార ధాహంతో
అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన
ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేసే
నిజాలను లిఖించే కలాలకు కళ్ళెం వేసే
నిజాం వారసుల జాతకాలు మారెనట... 

వినుడి వినుడి మిత్రులారా ఇక
స్వేచ్చా వాయువుల్ని పీల్చండి...
స్వేచ్ఛగా పక్షుల్లా విహరించండి...

నిర్భంధంలో కన్నీరు కార్చిన 
ఎన్నో కలాలకు కులాలకు... 
నిట్టూర్చిన నిరుద్యోగులకు... 
బంగారు తెలంగాణ కోసం...
కడలి కెరటాల్లా ఉవ్వెత్తున...
ఎగసిపడిన ఉద్యమకారులకు ...
నేడు మంచి రోజులొచ్చాయట.. 

ఫైర్ బ్రాండ్ డైనమిక్ యంగ్ లీడర్ 
రేవంత్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిరట... 
కొత్త ప్రజా ప్రభుత్వం నేడు...
తెలంగాణాలో కొలువు తీరేనట...

10. రెండు కాళ్ళతో
      రెండు బంగారు పతకాలు..!!

చేతితో చక్కని చిత్రాలు 
గీయడం కాదు వైరల్ న్యూస్
చేతులు రెండు కోల్పోయినా 
నోటితో అపురూపమైన 
చిత్రాలను గీయడమే... 
షేకింగ్ షాకింగ్ & హార్ట్ బ్రేకింగ్ న్యూస్ 

చైనాలో జరిగిన ప్రపంచ
(వికలాంగుల)పారా ఒలింపిక్స్ 
2023 పోటీల్లో పాల్గొని...
జన్మనిచ్చిన.....అమ్మానాన్నలకు...
శిక్షణ నిచ్చిన...గురువులకు...
ప్రాణం పోసిన...ఆ పరమాత్మకు
ఒంగి పాదాభివందనం చేసేందుకు  
రెండు చేతులులేని క్రీడాకారిణి... 

16 సం.రాల కాశ్మీర్ ఆర్చరీ 
శీతల్ దేవి తన రెండు కాళ్ళతో 
27 కేజీల విల్లును ఎక్కుపెట్టి...
భుజంతో బాణాలను సంధించి...
స్వేదం చిందించి...లక్ష్యాన్ని ఛేదించి...
ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించి... 
రెండు బంగారు పతకాలను సాధించి... 

భరతమాత ముద్దు బిడ్డగా...
భారతీయులందరూ గర్వపడేలా...
విశ్వమంతా విస్మయం చెందేలా....
విలువిద్యలో విశ్వ విజేతగా నిలిచి  
త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడమే...
షాకింగ్ & వరల్డ్ షేకింగ్ వైరల్ న్యూస్

జయహో..!‌ జయహో..! 
మా బంగారుతల్లి శీతల్ దేవి 
నీ అంగవైకల్యమే నీకు కీర్తి కిరీటం..!
నీ విజయం యువతకు స్ఫూర్తి మంత్రం..! 
నీవార్జించిన అఖండ ఖ్యాతి అజరామరం..!

యువతా ! ఓ యువతా !! ఇదిగో ఇదిగో 
శీతల్ దేవి అందించే స్పూర్తి సందేశం..!
ఏకాగ్రత...శిక్షణ...నిరంతర సాధన... 
కసి...కృషి...గట్టి పట్టుదలలే వుంటే..!

విజయ శంఖారావం...
విశ్వమంతా వినిపించేలా... 
ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా...
విశ్వవిజేతలుగా అవతరించవచ్చని...

అంగవైకల్యాన్ని తుంగలో త్రొక్కవచ్చని..!
అందని ఆకాశపు అంచుల్ని తాకవచ్చని..!
విజయ శిఖరాలను చేరవచ్చని..!
అంగవైకల్యం ఒక శాపం కాదని..!
అది అమ్మానాన్నలు చేసిన పాపం కాదని..!
అది ఆ అదృశ్యదైవం పెట్టే ఓ అగ్నిపరీక్షని..!

11. ఆమె అబల కాదు ఆదిపరాశక్తి 

ఆమె సకల సమస్యలు 
సృష్టించగలదు
చిటికెలో శతకోటి
సమస్యల్ని పరిష్కరించగలదు...

ఆమె కంటి చూపుతో 
చంపగలదు
కొంటె చూపులతో
మణ్మధబాణాలు విసరగలదు...

ఆమె చిన్న చిరునవ్వు నవ్వి 
కొండలు పిండి చేయగలదు
కొంపలు ఆర్పగలదు...
మగాడికి సారి చెప్పగలదు
మొగుడిపై స్వారీ చేయగలదు... 

ఆమె అబద్ధాలు ఆడి అతకగలదు...
అవసరమైతే భర్తను బట్టలు
ఉతికినట్టు ఉతికి ఆరేయగలదు...
ఆమె అష్టావధానం చేయగల దిట్ట... 

ఆమె మాటలతో 
కోటలు కట్టగలదు...
రాజులను రాజ్యాలను 
రాజసింహాసనాలను
రెప్పపాటున కుప్పకూల్చగలదు... 
ఆమె తలచుకుంటే ఏదైనా చేయగలదు...

నిజానికి నీకు జన్మనిచ్చిన 
ఆ అమ్మ సైతం ఒక ఆడదే...ఔను 
ఆమె అబల కాదు ఆమె ఒక ఆదిపరాశక్తి...

12. మనకు మంచి మనసిచ్చినోడు..?

మనకో మంచి మనసిచ్చినోడు... 
ఆ మనసును కోర్కెలపుట్టగా మార్చేశాడు

మనకో సుతిమెత్తని మనసిచ్చినోడు...
ఆ మనసుకు చిరుగాయమైనా
మంచి మందివ్వక మౌనంగా ఉన్నాడు

మనకో స్వచ్చమైన 
పాలనురగలాంటి మనసిచ్చినోడు...
ఆ మనసు విరిగితే అతికించకున్నాడు 

మనకు అందమైన మనసిచ్చినోడు... 
ఆ మనసులోని ఊహలకు 
అందనంత ఎత్తులో ఉన్నాడు 

మనకు రెండు నేత్రాలిచ్చినోడు...
మన నేత్రాలకు దర్శనమివ్వక
రహస్యంగాఎక్కడో దాగి ఉన్నాడు

మన నాలుకకు మాటలు నేర్పినోడు...
మంచిమాటలతో పసందైన పాటలతో
ఎంతగా ప్రార్ధించినా అర్ధించినా 
స్పందించక సైలెంట్ గా ఉన్నాడు

మనకు రెండు చేతులనిచ్చినోడు...
ఆ చేతులకు చిక్కక దొరకున్నాడు 

మనకు రెండు పాదాలనిచ్చినోడు...
ఆ పాదాలతో మనం చేరలేనంత
దూరంలో సుదూరంలో ఉన్నాడు

ఎందుకో అర్థంకాక కలత చెందిన
మనిషికి కలలో దర్శనమిచ్చిన 
ఆ దైవం...ఇచ్చిన సందేశమిదే...?

ఓ మనిషీ ! నిందలేయక నిజం తెలుసుకో..!
నీవీ ప్రాపంచిక సుఖాల్లో మునిగి తేలుతూ  
ఏనాడు "నోరారా" నన్ను...పిలవలేదు..
ఏనాడు "మనసారా" నన్ను...తలవలేదు...
భక్తిశ్రద్ధలతో...నియమనిష్టలతో కోవెలలో 
కొలువైవున్న నన్ను...ఏనాడు కొలవలేదు...

తన తప్పును తెలుసుకున్న ఆ మనిషి...
పరమాత్మ పాదాలకు పాలాభిషేకం చేసి 
క్షమించమంటూ...కన్నీటితో ప్రార్థించాడు...

13. సర్వ కర్మ ఫల మోక్షప్రదాత..?

మనకు జన్మనిచ్చినోడే
సుఖదుఃఖాలనిచ్చాడు 
మనల్ని సంసారబంధాల
సంకెళ్లలో బంధించినోడే
మన శరీరాన్ని......ఇంద్రియాలకు 
మన మనసును...కర్మలకంటగట్టాడు 

మనం మనసా...వాచా...కర్మణా 
ఆచరించే కర్మలకు...మనమే కర్తలం
ఆ కర్మ ఫలాలకు.....మనమే భోక్తలం 
ఈ సంసారవృక్షానికి కాసే ఫలం మోక్షం 

ఆ ఫలాన్ని ప్రేమతో ప్రసాదించే...
అదృశ్యంగా అన్నింటిని శాసించే...
సర్వ కర్మ ఫల మోక్షప్రదాత ఎవరు?
సర్వాంతర్యామియైన ఆ పరమేశ్వరుడే

ఇంతటి గొప్ప 
ప్రపంచాన్ని నిర్మించి... 
ప్రకృతి శక్తులన్నిటిని శాసించి... 
జీవకోటికి పంచభూతాలనందించి... 
మన కర్మలకు సాక్షిభూతుడుగా 
ఆ కర్మల ఆచరణకు మనల్ని 
స్వతంత్రుల్ని చేసినందుకు సదా మనం 
ఆ పరమేశ్వరునికి కృతజ్ఞులమౌదాం..!

14. ఇది శాంతి వనం...? అది రణక్షేత్రం..?

ఇక్కడ... 
ఇళ్ళల్లో ఇనుప బీరువాల్లో
మిళ మిళ మెరిసే కరెన్సీ కట్టలే... 

అక్కడ... 
ఇజ్రాయెల్ గాజా 
వీధుల్లో ఎక్కడ 
చూసినా అనాధ శవాల గుట్టలే...

ఇక్కడ...
గుళ్ళు గోపురాల్లో దేవుళ్ళకు 
పాలబిందెలతో పాలాభిషేకమే...

అక్కడ... ఎక్కడ విన్నా 
శరణార్ధుల శిభిరాలలో
పాలులేక ఆకలితో గుక్కపెట్టి ఏడ్చే 
పాలస్తీనా పసికందుల ఆక్రందనలే...

ఇక్కడ... 
ఏసీ గదుల్లో... 
విలాసవంతమైన 
విల్లాలలో.‌..హాయిగా 
నిద్రించే అదృష్టవంతులే...

అక్కడ... 
భయంకరమైన బాంబు 
దాడుల్లో...కుప్పకూలిన 
భారీ భవన శిధిలాలలో... 
చిక్కుకున్న క్షతగాత్రులే... 
ఆకలికి అలమటించే అస్థిపంజరాలే...

ఇక్కడ... 
రుచికరమైన 
విందులు వినోదాలే... 
చిరునవ్వులతో చిందులే...

అక్కడ...  
ఇజ్రాయెల్ సైనికుల భయంకరమైన 
బాంబుదాడులకు ప్రాణభయంతో
గజగజ వణుకుతున్న గాజా ప్రజలు 
రక్తపుమడుగులో గిలగిలలాడతూ...
కొన ఊపిరితో కొట్టుకులాడుతూ...
అల్లాఅల్లా అంటూ గుండెలు పగిలేలా రోదించే...బంధువులే...ఆపద్బాంధవులే...

ఇది ప్రేమ కరుణ త్యాగం
పాలూ తేనెలై ప్రవహించే... 
శాంతి కపోతాలు ఎగిరే...రామరాజ్యం
స్వేచ్ఛా స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం దీని జీవన వేదం... 

అది రాక్షసులు తిరిగే...
రాబందులు ఎగిరే...రావణరాజ్యం
సమరం సామ్రాజ్యవాదం
శత్రృనాశనం రక్తపాతం దాని నినాదం...

ఔను ఇది ఒక శాంతివనం...! 
అది ఒక రణక్షేత్రం...!!
ఇది నా భారతదేశం 
ఇది నా జన్మ భూమి 
ఇది నా పుణ్యభూమి...
అది రక్తపుటేరులు ప్రవహించే 
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్దభూమి...
జై హింద్... జై భారత్...

15. శుభోదయం ఒక మధుర ధ్వని... 

శుభోదయం...?
అది ఒక టెక్నిక్... 
అది ఒక పిక్నిక్... 
అది ఒక టానిక్... 

శుభోదయం...?
అది ఒక ఆసరా... 
అది ఒక చేతికర్ర... 
అది చెవిలో చెక్కెర... 
అది ఒక మధుర ధ్వని... 
అది ఒక మధురానుభూతి... 

శుభోదయం...?
నాకెవరూ లేరన్న
భావనే దరిచేరకుండా 
నేనున్నా అంటూ 
వినిపించే ఒక ఆకాశవాణి...

శుభోదయం...?
ఒంటరితనాన్ని 
ఓడించే ఒక తుంటరితనం... 

16. అంతకాలం మీ జీవితం ధన్యమే...? 

మీకు ఇష్టమైన... 
వస్తువులను వ్యక్తులను 
అందమైన దృశ్యాలను 
సుందరమైన ప్రదేశాలను 
కనులారా...చూడగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యమే..!

మీకు ఇష్టమైన... 
రుచికరమైన పదార్థాలను 
తృప్తిగా...తినగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యమే..!

మీకు ఇష్టమైన... 
పవిత్రమైన బృహత్ గ్రంథాలను 
విలువైన పుస్తకాలను 
ఏకాగ్రతతో...చదవగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యమే..!

మీకు ఇష్టమైన... 
రేడియోలో టీవీలలో 
వినిపించే మధురమైన 
సంగీతాన్ని...వినగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యం..!

మీకు ఇష్టమైన... 
పుణ్యక్షేత్రాలను 
గుళ్ళు గోపురాలను 
పురాతన దేవాలయాలను 
మందిరాలను చూడాలని 
కాలినడకన మైళ్ళుమైళ్ళు
...నడవగలిగినంతకాలం
ఎన్నో వందల ఎత్తైన మెట్లు
...ఎక్కగలిగినంతకాలం
గర్భగుడిలోని ఆ దైవాన్ని ...
...దర్శించుకోగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యమే..!
అది ఒక అదృష్టమే...అది ఒక వరమే..!

మీకీ శక్తిసామర్థ్యాలను 
ప్రసాదించువాడు మాత్రం 
నిత్యం మీరు "భక్తిశ్రద్ధలతో  
ఆరాధించే ఆ భగవంతుడే" సుమా..!

17. చిగురించే స్నేహానికి చిరునామ..!

శుభోదయం అంటే..?
అది ఒక ఉషోదయం..!
 
అది ఒక 
అంతులేని 
అనుభూతి...
అది తరగని 
అభిమానానికి...
కరగని ఆప్యాయతకు... 
ఒక సందర్భోచిత సంకేతం..!

మనపై ప్రేమ...
మనకో గౌరవం...
మనతో స్నేహం...
మనకున్న విలువ...
మన మధుర జ్ఞాపకం...
మనతో పెనవేసుకున్న బంధం... 

ఇంకా చెక్కు
చెదరలేదని...
కరిగి పోలేదని...
విరిగి పోలేదని...
తరిగి పోలేదని... 

అమ్మ పాలలా స్వచ్చంగా 
చెట్టులా పచ్చగా ఉన్నాయనడానికి...

పాలనురగలా...
పొయ్యిమీది పాలలా 
పాతాళ గంగలా పొంగి 
పొర్లుతుందనడానికి నిలువెత్తు నిదర్శనం...
చిగురించే స్నేహానికి చిరునామే శుభోదయం 

18. శుభోదయం అంటే..?

శుభోదయం అంటే..?
ఒక ప్రేమపూరిత 
పలకరింపు... 

శుభోదయం అంటే..?
ఒక చిరునవ్వుల 
చిలకరింపు... 

శుభోదయం అంటే..?
చెదరని స్నేహానికి 
ఒక కొనసాగింపు 
ఒక కొసమెరుపు 

శుభోదయం అంటే..?
నీ స్నేహానికి ఒక విలువ
నీగురించి ఓ తియ్యని తలంపు 

శుభోదయం అంటే..?
నీతో నా ప్రయాణం 
ఎంతో సుఖవంతమనే 
ఊహకు ఒక ఊపిరి... 
శుభోదయం ఆనందతీరం 
చేర్చే ఒక నవ్వుల నావ... 
శుభోదయం సంతోషామృతాన్ని 
అందించే ఒక అక్షయ పాత్ర...

19. శుభోదయం..! ఒక ఉషోదయం..!!

శుభోదయం... 
ఒక ఆత్మీయ పలకరింపు... 
ఒక చిరునవ్వుల చిలకరింపు...
అది ఒక అంతరంగ ఆవిష్కరణ... 
అది నీ మిత్రబృందంచే...
ఆ అదృశ్యదైవం అందించే... 
అపురూపమైన ప్రేమపూర్వక కానుక...

శుభోదయం...
అది నిష్కల్మషమైన
మంచికి ప్రతిరూపమైన నీ మిత్రుల
మదిమందిరం నుండి వచ్చే
మందార మకరంద స్నేహపరిమళం..! 

మిత్రమా..! ఆస్వాదించు..! 
అనిర్వచనీయమైన 
అనుభూతి నీకు ప్రాప్తిరస్తు..!
అంతులేని ఆనందం నీకు సిద్ధిరస్తు..! 

ఆ రోజంతా... 
ఉల్లాసంగా...ఉత్సాహంగా... 
సంతోష సాగరాన్ని నీవు 
ఈదులాడుతూనే వుంటావు... 

ఇంతకంటే ఇంకేం కావాలి...
ఆ చిరునవ్వులు చిందించే 
ఈ శుభశుభోదయాన్ని అందించే
నీ ప్రాణమిత్రులంతా 
పదికాలాలపాటు పచ్చగుండాలని 
ఆ పరమాత్మను ప్రార్థించు... 
వేకువనే వేడుకో...వేడుక చేసుకో... 

ఇక ఆ దినమంతా ప్రతిక్షణం 
నీ మనసునిండా 
కోట్లు పోసి కొనలేని ప్రశాంతతే...
నీ జీవితం 
కోటి సూర్యప్రభల ప్రకాశవంతమే...

20. అత్యాశ అనర్థమే...?

నేడు... 
ఉన్నదంతా తినేస్తే..! 
రేపు తిన్నదంతా 
కక్కేయాల్సి వస్తుంది 

నేడు... 
చూసిందంతా కావాలని 
పేదోళ్లను అమాయకులను 
దోచేస్తే...నేలమాళిగల్లో దాచేస్తే..!
రేపు చీమలు పెట్టిన పుట్టలు 
పాముల పాలైనట్లు ఆశతో
అత్యాశతో ఆర్జించిన ధనమంతా 
పరులపాలైపోవుట పచ్చినిజం...!

నాదినాది అంటూ 
కోట్ల ఖరీదు చేసే
వేల ఎకరాల భూమిని 
అక్రమంగా ఆక్రమించుకుంటే..? 
భూదేవి పక్కుమని నవ్వుతుంది..

ఎంత ఆర్జించినా ఏదీనీది కాదని... 
ఒక్క"ఆరడుగుల స్థలమే" నీదని... 
పోయేప్రాణం ఎలాగూ పోతుంది 
ఎందుకీ భూ పోరాటం..?
ఎందుకీ ఆస్తుల ఆరాటం..? 

చిరంజీవిగా చిరకాలం జీవించాలని...
ఎందుకీ కాకి గోల ? అంటుంది నేల..!
గుండెలనిండా ఆశ ఉండాలి... 
"ఆశే మనిషికి శ్వాస" కావాలి... 
కానీ "అత్యాశ" ఉండరాదు అది 
మన జీవితాల్ని "అంతం" చేయరాదు...

ఆశతో సాగే నీ 
జీవితం ఒక స్వర్గమే..!
అత్యాశకు ప్రతిఫలం నరకమే..!
అత్యాశతో జీవితం అంధకారబంధురమే..!
అర్థంలేని జీవితం వ్యర్థమే అత్యాశ అనర్థమే

21. ధనమే...దైవం !

డబ్బును...
వెక్కిరించేవారు
డబ్బుంటే లెక్కలేనివారు
అప్పులపాలౌతారు 
ఆకలికి అలమటిస్తారు
ఆత్మహత్యలకు గురౌతారు
చివరికి కుక్కచావు ఛస్తారు

డబ్బుంటే... 
భయం లేనివారు
చిన్నచూపు చూసేవారు
భారీగా నష్టపోతారు 
బంధువులకు దూరమౌతారు
నలుగురిలో నవ్వులపాలౌతారు 
పదిమందిలో పరువుగా బ్రతకలేరు 

డబ్బును...
నిర్లక్ష్యం చేసేవారు
నీళ్ళలా ఖర్చుచేసేవారు
అభివృద్ధి చెందలేరు
ఆస్తులు ఆర్జించలేరు
గౌరవములేని గడ్డి పోచలౌతారు
గుడిశలో వెలిగే గుడ్డి దీపాలౌతారు

ఈ ధనమే... 
మా ప్రాణం అనుకునేవారు
దైవంలా నిత్యం పూజించేవారు
నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు
నలుగురిని ఆపదలో ఆదుకుంటారు
నవ్వుతూ నాలుగు రోజులు హాయిగా
ప్రశాంతంగా  ఆనందంగా బ్రతుకుతారు 

22. ఏడడుగుల బంధం...
      ఎన్నెన్నో జన్మల బంధం...

మొన్న పరిచయం 
నిన్న ప్రేమ నేడు వివాహం

మూడుముళ్లతో నూరేళ్ళకే కాదు
జన్మజన్మలకు జతచేయబడ్డారు మీరు

భార్యా భర్తలు భగవంతుడు ప్రేమతో
అందించిన బంగారు బహుమతులు

ఒకరినొకరు గౌరవించుకోవాలి
ప్రతినిత్యం ప్రేమించుకోవాలి
 
చిన్నచిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ లు 
అప్పుడప్పుడిచ్చిపుచ్చుకోవాలి

ఒకరిపై ఒకరు గట్టి నమ్మకం
సంపూర్ణ విశ్వాసం కలిగి వుండాలి

ఇద్దరి మనసులు హృదయాలు
పాన్పులు పరిశుద్ధమైనవై వుండాలి

చెప్పడుమాటలు వినరాదు
తప్పటడుగులు వేయరాదు

పుట్టింటివారిని మెట్టింటివారిని అభిమానంతో సమదృష్టితో చూడాలి

ఎక్కువ తక్కువ తేడాలుండరాదు
ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలి

తిట్టుకోరాదు పోట్లాడుకోరాదు
కోపంతో పిల్లల ముందు కొట్లాడుకోరాదు

మనసులో ఏమీ దాచుకోరాదు
ముఖాముఖి చర్చలు 
మనస్పర్ధలకు మందులు... 

మూడో వ్యక్తికి అవకాశమివ్వరాదు
ఆ వ్యక్తి సలహాలు సహాయం కోరరాదు

కలకాలం కలిసివుందాం అనుకోవాలి
విడిపోదాం అని కలనైనా అనుకోరాదు

23. నేడిద్దరు రేపు ముగ్గురు..?

ఎక్కడో...
ఎందుకో...  
నిన్న కలిశారు...
కలలెన్నో కన్నారు...
కన్ను కన్ను కలిపారు...
సెల్లో కబుర్లాడుకున్నారు...

ఇష్టమైనవి...కోరుకున్నవి
ఇచ్చుకున్నారు పుచ్చుకున్నారు...
పిచ్చిపిచ్చిగా ప్రేమించుకున్నారు...

ప్రాణానికి 
ప్రాణమై పోయారు...
జన్మ జన్మలకు జతగా 
వుండాలనుకున్నారు...

అందుకే నేడు 
పెళ్ళిచూపులు...
రేపు నిశ్చితార్థం...
ఎల్లుండి అందరిలో...
కళకళలాడే పెళ్ళిపందిరిలో...
తళతళలాడే...
తాళితో భార్యభర్తల బంధం...

ఆపై తహతహలాడే
తనువులు రెండు 
తగవులాడేను శోభనం గదిలో...
నిదురరాని వెన్నెలరాత్రులు...
చిలిపి చూపులు...
చిరునవ్వులు...
చిలక పలుకులు...
చిందులు...పొందులు...
చీకటిలో పసందైన విందులు...
ఇక నిశ్శబ్దయుద్దానికి సిద్దం...ఆ
యుద్ధంలో ఇద్దరూ"గెలుపుగుర్రాలే"...

ఇద్దరూ కలలు కంటారు... కలుసుకుంటారు...ఒక్కటౌతారు...
మున్ముందు ఆ ఇద్దరే ముగ్గురౌతారు...

24. చింతించకు..! చింతించకు..!!

చింత...చితికి చిహ్నం...
చిమ్మ చీకటికి చిరునామా... 

రేపేమి జరుగునో నీకు తెలియదు... 
రేపటి గురించి చింతించకు... 
అంటుంది పవిత్ర బైబిల్ గ్రంధం...

చింత ఉంటే నీ వెంట అది 
నీ మనశ్శాంతికి ఆరని మంట...
రేపన్నది నీది కాదు... 
నీ భవిష్యత్తుకు పునాది లేదు 
"వర్తమానం" ఆ భగవంతుడు...
నీకు ప్రసాదించిన ఓ "బంగారు వరం"... 

Worry is an interest 
paying before it becomes due ...

Don't carry your worry 
till to your door steps...

If you carry please keep it 
outside as your chappals... 

If worry is your weakness...
It will throw you into darkness...

Don't worry be brave like a lion...
Worry will break your...brain...
Don't take it daily as...wine... 

చీకటిలో కూర్చుని చింతించి లాభమేమి..? 
చీకటిని తొలిగించేది వెలిగించే చిరుదివ్వేగా              
చింతను చితికిచేర్చేఆయుధం చిరునవ్వేగా 
 
25. ప్రేమించు...ప్రాణాలర్పించేలా..?

పిచ్చిపిచ్చిగా ప్రేమించకు 
పిచ్చివాడనుకుంటారు...
బెదిరింపులకు భయపడక 
ప్రాణాలర్పించేలా ప్రేమించు
భగ్న ప్రేమికుడనుకుంటారు...

తక్కువగా మాట్లాడకు 
ముద్రపడుతుంది మూర్కుడిగా... 
ఎక్కువగా మాట్లాడు
పట్టాభిషేకం జరుగుతుంది పండితుడిగా...

దూరిదూరిపోకు...అతిదగ్గరగా 
కరోనా పేషెంటని కసురుకుంటారు. 
సత్సాంగత్యం చెయ్...సత్పురుషులతో 
దూరంగా ఉండు దుష్టులకు దుర్మార్గులకు 

హద్దులు దాటినోడు పరమమూర్ఖుడు...
సరిహద్దుల్లో ఉన్నోడు మర్యాదరామన్న... 
అతిగా ఆశించేవాడు బికారి బిక్షగాడు... 
ఏమీ ఆశించనివాడు ప్రశాంతచిత్తుడు... 

నిగ్రహంతో‌ దక్కు నీకు...అగ్రస్థానమే....
అదే కోల్పోతే నీ బ్రతుకు అంధకారమే...

26. పోరాటాల గడ్డ..! తెలంగాణ 
      తొలి శాసన సభాపతిగా దళిత బిడ్డ..!

ఆనాడు ఆజాతికి 
దేవాలయాలలోకి 
ప్రవేశమే లేకుండే...
నేడు రాజ్యాంగ నిర్మాత...
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రిజర్వుడు స్థానాలతో దేవాలయాల వంటి 
అసెంబ్లీలో అడుగుపెట్టే శాసనసభ సభ్యులై
పార్లమెంట్లో పాదంమోపే లోక్ సభ సభ్యులై

రాష్ట్రపతిగా శాసన సభాపతిగా...
అత్యున్నత పీఠాలనధిరోహించే...
దళితమేధావులు...విజ్ఞానజ్యోతులై...
 
మొన్న ఉమ్మడిరాష్ట్రంలో ప్రతిభాభారతి 
నేడు "పోరాటాల గడ్డ" తెలంగాణ 
శాసనసభకు మూడో స్పీకర్‌గా... తెలంగాణాకు తొలిదళిత సభాపతిగా... 

వికారాబాద్ నుండి విజయం సాధించిన 
"దళిత బిడ్డ" గడ్డం ప్రసాద్‌ కుమార్ 111
మంది సభ్యుల మద్దతుతో ఏకగ్రీవ ఎన్నిక
ఇది "పేదలకు పెద్దపీట" వేసే కాంగ్రెస్ 
అధిష్టానం తీసుకున్న అనూహ్య నిర్ణయం...

వికారాబాద్ జిల్లా... 
తాండూరు మండలం... 
బెల్కటూరు గ్రామంలో...
అతి సామాన్య నిరుపేద 
దళిత కుటుంబంలో పాలమ్ముకునే 
పాల ఎల్లమ్మ ఎల్లయ్యలకు జన్మించి... 
చిన్న వయసులో తండ్రిని కోల్పోయి... 

8 మంది సోదరీమణులున్న 
పెద్ద కుటుంబానికి పెద్దదిక్కుగా...
9 సంవత్సరాలు ఏ పదవి లేకున్నా
ప్రజా సమస్యలకై నిరంతరం పోరాడిన 
"ప్రజాప్రతినిధి...దళితబంధు"...
గడ్డం ప్రసాద్ కుమార్...జయహో జయహో 
 
వైయస్సార్ రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి
మంత్రివర్గంలో మంత్రిగా అనుభవమున్న 
"స్నేహశీలి...ప్రతిభాశాలి...దళితబిడ్డ"...
గడ్డం ప్రసాద్ కుమార్...జయహో జయహో

సభను నిష్పక్షపాతంగా నిర్వహించగల దిట్ట 
సభ్యుల హక్కులను కాపాడగల సత్తా వున్న 
"బహుజన నేత...దళిత జ్యోతి...
గడ్డం ప్రసాద్ కుమార్...జయహో జయహో

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 
తెలంగాణ సచివాలయంలో...
కొత్తగా కొలువుదీరిన
కాంగ్రెస్ నూతన శాసనసభలో...
ప్రతి సభ్యునికి తమ గళం వినిపించేందుకు...అవకాశమిస్తారని... 

పార్టీల కతీతంగా ప్రతి ఒక్కరి గౌరవ 
మర్యాదల్ని...సభా సంప్రదాయాలను
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతారని...

నిష్పక్షపాతంగా సభను నిర్వహిస్తారని...
మొన్న ఎంపీటీసీగా...
నిన్న యం.ఎల్యేగా...
నేడు శాసన సభాపతిగా... 
ఎన్నికైన మితభాషి...స్నేహశీలి...
ప్రతిభాశాలి...అజాతశతృవు...
దళితబిడ్డ" గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పై... 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
భట్టి..కేటీఆర్...సీతక్క...ఉత్తమ్ లాంటి ప్రముఖుల ప్రసంగాలతో...సభలో
"ప్రశంసల కుంభ వర్షం" కురిసింది...
"దళిత బిడ్డ" గడ్డం ప్రసాద్ కుమార్ కు
"శాసన సభాపతిగా పట్టాభిషేకం" జరిగింది
జ్ఞానజ్యోతి వెలిగింది దళితజాతి మురిసింది

(నూతన సభాపతికి శుభాకాంక్షల 
సుమమాలతో ఇదేనా అక్షర హారతి)...

27. ఈ లోకంలో...అరుదు...అరుదు...

తాము పయణించే పడవ
నీటిలో మునిగి తాము 
పెనుప్రమాదంలో చిక్కుకున్నా 
పరులప్రాణలను కాపాడాలని 
వారిని రక్షించాలని తపనపడే వారు
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు 

తమ ఇల్లు తగలబడుతున్నా
ఇరుగుపొరుగువారి ఇళ్ళు తగలబడిపోకుండా 
నీళ్లు చల్లేవారు 
నిప్పురవ్వలు ఆర్పేవారు
ప్రాణాలకు తెగించి మంటల్లో 
చిక్కుకున్న వారిని రక్షించేవారు
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు

తాము ఎంతకూ నయం కాని
దీర్ఘకాలిక మొండి వ్యాధులతో
కదలలేక మంచానికే పరిమితమైనా
ఆసుపత్రిలో అభాగ్యుల
ఆపరేషన్ కి ఆర్థిక సాయం చేసేవారు 
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు

తమ ఇంట్లో జాగా లేకున్నా తాము 
వరండాలో పడుకొని చలికి వణుకుతూ 
అతిథులకింట్లో చక్కని ఆతిథ్యమిచ్చేవాళ్ళు 
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు

తాము తిన్నా తినకపోయినా 
పరులకు పెట్టాలనుకునే వారు...
తమకు ఉన్నా లేకపోయినా 
ఇతరులను గురించి ఆలోచించేవారు... 
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు

అరుదైన...
అట్టివారే... 
మహాత్ములు..!
మహనీయులు..!
దయార్ద్రహృదయులు..!
దానకర్ణులు...దైవస్వరూపులు..!
సమతావాదులు...సంఘ సంస్కర్తలు..!
మిత్రులారా ఇందులో మీరెవరో...తక్షణమే 
తేల్చుకోండి...త్యాగధనులుగా మారండి..!

28. ఆడవాళ్ళు...మీకు జోహార్లు 

ఆడవారు...
గులాబీ పువ్వులై 
గుభాళిస్తారు...
గుట్టుచప్పుడు కాకుండా 
గుండెల్లో గునపాలు గుచ్చుతారు...

ఆడవారు...
ప్రేమ ప్రసాదం 
పెడతారు
తిట్లదండకంతో
తియ్యగా తిడతారు 
కొంటెచూపుల
కొరడాలతో కొడతారు ... 

ఆడవారు...
ముసిముసి నవ్వుల
పువ్వులు రువ్వుతారు 
వారు మసకచీకట్లో ముసుగు 
కప్పుకున్న ముత్యపు చిప్పలు...
తెరచాటున తిరిగే తేనెటీగలు...

ఆడవారు...
చీరల కోరలతో... 
చీల్చే చిరుతపులులు... 
పడకగదిలో బుసలుకొట్టే 
కొంగుచాటు కోడెనాగులు ... 

ఆడవారు... 
సారి చెబుతూనే 
మొగుడిపై స్వారీ చేస్తారు... 
బెల్లమల్లే కనిపిస్తారు 
ప్రక్కలో బల్లెమై పోతారు 
కళ్ళెం వేస్తారు... 
కంటిచూపుతో కంట్రోల్ చేస్తారు... 

ఆడవారు...
నంగనాచిలా నవ్వుల 
పువ్వులు రువ్వుతారు 
నక్కలకన్న మిన్నగా నటిస్తారు... 

వంటగదిలో 
వండేస్తారు వలపు వంట
పడక గదిలో మ్రోగిస్తారు 
జేగంట పండిస్తారు ప్రేమ పంట 

మగువలు... 
మాయచేస్తారు 
మాటలతో మత్తెక్కిస్తారు 
చిటికెలో చిత్తుచిత్తు చేస్తారు 

ఆడవారు...
కొవ్వొత్తులు వెలిగిస్తారు   
పూలగుత్తులు విసురుతారు    
చూపుల చురకత్తులు దూస్తారు 

29. వలపు వంట...ప్రేమ పంట 

ఆడవారు...
మాయచేస్తారు... 
మాటలతో మత్తెక్కిస్తారు... 
చిటికెలో చిత్తు చిత్తు చేస్తారు... 

ఆడవారు...
వెలిగిస్తారు కొవ్వొత్తులు... 
విసురుతారు పూలగుత్తులు...   
దూస్తారు చూపుల చురకత్తులు... 

ఆడవారు... 
వంటగదిలో... 
వండేస్తారు వలపు వంట...
పూజాగదిలో మ్రోగిస్తారు జేగంట...
పడకగదిలో పండిస్తారు ప్రేమపంట... 

30. ఏకత్వంలో భిన్నత్వం..?

కుక్క నక్క...
రెండూ జంతువులే...
కానీ వాటి
విశ్వాసాలే...వేరు వేరు 
ఒకటి నటనకు 
నమ్మక ద్రోహానికి
నిలువెత్తు నిదర్శనం... 
ఒకటి కృతజ్ఞతకు... 
ప్రాణత్యాగానికి ప్రతిరూపం...

కాకి కోకిల...
రెండూ పక్షులే ...
కానీ వాటి
స్వరాలే...వేరువేరు 
ఒకటి కర్ణకఠోరం... 
ఒకటి వీనులకు విందు... 

ఇద్దరూ... 
మధ్యతరగతి మనుషులే 
కాని వారి 
గుణగణాలే...వేరువేరు 
ఒకరు భయస్తులు... 
ఒకరు బద్దకస్తులు...

ఇద్దరూ... 
నవయువకులే
కాని వారి ఆలోచనా 
విధానమే...వేరువేరు 
ఒకరు పశుప్రాయులు.....
ఒకరు ఆదర్శప్రాయులు...

ఇద్దరూ... 
రాజకీయ నాయకులే 
కాని వారి 
సేవాభావమే...వేరువేరు 
ఒకరు ప్రజా పాలకులు...
ఒకరు ప్రజా కంఠకులు...

31. ఇందులో మీరెవరో తేల్చుకోండి..!

తాము ఆపదలో ఉన్నా 
అప్పుల్లో మునిగినా ఇతరులను 
ఆర్థికంగా ఆదుకోవాలనుకునేవారు 
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు

తాము ఆకలితో అలమటిస్తున్నా ఎండిన ఇతరుల కడుపులు నిండాలనుకునేవారు
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు

తమ గుండెల్లో
దిగులు రగులుతున్నా 
పరుల గుండెలనిండా
కొండంత ధైర్యాన్ని నింపేవారు 
ముఖాలను చిరునవ్వుల్తో వెలిగించేవారు 
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు

తాము కారుచీకటిలో కన్నీరు
కారుస్తూ ఉన్నా ఎదుటివారి 
కంటకన్నీటిని తుడవాలనుకునేవారు
ఈలోకంలో...అరుదు...అరుదు...అరుదు

అరుదైన 
అట్టివారే... 
కదా మట్టిలో
పుట్టిన మాణిక్యాలు 
అట్టివారే కదా 
మహాత్ములు..!
మహనీయులు..!
దయార్ద్రహృదయులు..!
దానకర్ణులు...దైవస్వరూపులు..!
సమతావాదులు...సంఘ సంస్కర్తలు..!
మిత్రులారా ఇందులో మీరెవరో తేల్చుకోండి
తక్షణమే...త్యాగధనులుగా మారిపొండి..!

32. నా ప్రశ్నకు బదులేది...?

పగటిపూట 
చంద్రుడు ప్రకాశించడు
నక్షత్రాలు కనిపించవు
రాత్రిపూట 
సూర్యుడు వెలుగునివ్వడు
 
సూర్యుడా..?చంద్రుడా..?
నక్షత్రాలా..? నవగ్రహాలా..? 
ఈ జగతిలో ఈ జీవకోటిపై 
అంత్యంత ప్రభావం చూపేదెవరు..? 

ప్రకృతికి 
ప్రతిరూపాలు 
పంచభూతాలు
భూమి...ఆకాశం 
అగ్ని...గాలి...నీరు 
ఈ పంచభూతాలలో
ఉన్న అతీంద్రియశక్తి ఏమిటి..?
అంత్యంతశక్తి వంతమైనదేది..?

ఈ ప్రకృతికి
ప్రకృతిలోని పంచభూతాలచే
సృష్టించబడిన సకలచరాచర
జీవకోటి సృష్టి స్థితి లయలకు 
కారకులైన త్రిమూర్తులు
బ్రహ్మ విష్ణు ఈశ్వరులలో
అంత్యంత మహిమాన్వితులెవరు..? 
ఔను నా ఈ ప్రశ్నకు బదులేది...?

33. ఆడవారు గుభాళించే 
       గులాబీ పువ్వులు....? 

ఆడవారు...గులాబీ 
పువ్వులై గుభాళిస్తారు...
గుట్టుచప్పుడు కాకుండా  
గుండెల్లో గునపాలు గుచ్చుతారు...
కోరచూపుల కొరడాలు ఝులిపిస్తారు...
కొంప ముంచుతారు దుంప తెంచుతారు...

ఆడవారు...
చేస్తారు...
ప్రేమ సంతంకం...
గుట్టుగా నడుపుతారు...
నచ్చిన వారితో ...ప్రేమాయణం... 
ఏలేస్తారు...ఎదలో ప్రేమసామ్రాజ్యం...
ప్రాణమిస్తే వేస్తారు ప్రేమకు పునాది....
మోసగిస్తే కడతారు ప్రేమకు సమాధి... 

ప్రేమ పండితే ప్రేమాభిషేకం...
ప్రేమికుల్ని చెరబడితే రక్తాభిషేకం...
కుదిరితే సంబంధం కుంభాభిషేకం...
కళ్యాణ మండపంలో కనకాభిషేకం... 
వేకువనే భూమికి చేరని రవికిరణం లేదు... 
ప్రేమికులకు తప్ప ప్రేమకు మరణం లేదు...

34. స్వచ్చమైన వ్యక్తిత్వం 
      వికసించిన తామర పుష్పం..!

వరాహం
తామర పుష్పం...
రెండు బురద ఒడిలోనే...
 
కానీ సరదాగా
ఆ బురదలో 
దొర్లే పొర్లే వరాహం
చూపులకు అసహ్యమే...
కారణం ఒక్కటే...
ఒంటినిండా దుర్గంధమే...
 
అదే బురదలో పుట్టి 
అదే బురదలో పెరిగినా 
బురద దుర్గంధం అంటకుండా 
వికసించే ఆ లేత తామర పుష్పం 
ఎంత అందమైనదో సుందరమైనదో...
కనులకెంత ఆనందమో వర్ణనాతీతం...

పైకి మంచివారిగా 
కనిపిస్తూ లోలోపల 
అసూయ ద్వేషాలతో...
కుట్రలతో కుతంత్రాలతో...
పగా ప్రతీకారాలతో రగిలిపోయే...
దుర్మార్గులతో దుష్టులతో దోస్తిచేసినా... 
కప్పలతో పాములతో కాపురం చేసినా... 
ఏ మచ్చలేని స్వచ్చమైన వ్యక్తిత్వమున్న
వ్యక్తి జీవితం వికసించిన తామర పుష్పమే.

35. మచ్చలేని మన వ్యక్తిత్వం..! 

మన వ్యక్తిత్వం 
ఎంత మంచిదైనా... 
ఎంత మచ్చలేనిదైనా... 
ఎంత స్వచ్ఛమైనదైనా...
 
ఒక్కోసారి...
"గెలుపుగుర్రం" 
మనం ఎక్కలేకపోవచ్చు 
"విజయలక్ష్మి" 
మనల్ని వరించకపోవచ్చు
"ఓటమి" మనకు 
ఒక గొప్ప అగ్నిపరీక్ష కావొచ్చు

దానికి లేరు ప్రత్యక్ష సాక్షులు 
ఉన్నారు ముగ్గురు అదృశ్యసాక్షులు 
ఒకరు....కరిగిపోయే కాలం...
రెండు.....కనిపించని ఆ పరమాత్మ...
మూడు...మనం నమ్మిన మనుషులు...

36. ప్రేమించే ప్రేమామయుడు..! 

ప్రేమించే 
ప్రేమామయుడు... 
కలువరి గిరిపై రక్తం 
చిందించిన లోకరక్షకుడు...
మన ఘోరమైన పాపాలను 
తన పరిశుద్ధ రక్తంతో కడిగి 
మనలను పాపవిముక్తులను
చేసిన ఆ విమోచన కర్త...
మేఘారూఢుడై వచ్చువేళ
ప్రతినేత్రము ఆయనను చూచును

అల్ఫాయు 
ఓమెగయు ఆయనే...
భూత భవిష్యత్ 
వర్తమాన కాలాలలో ఉండేది సర్వాధికారియైన ఆ ప్రభువే...
మహా తేజస్సుతో 
ప్రకాశించేది ఆ నీతిసూర్యుడే...

మరణము మరియు 
పాతాళలోకపు తాళపు చెవులు 
ఆయన స్వాధీనములోనే ఉన్నవి...

మొదటివాడు...కడపటి వాడు... 
నిత్యం జీవించువాడు ఆయనే... 

మృతుడైననేమి 
మూడవ దినమున 
మృత్యుంజయుడై లేచి
యుగయుగములు 
సజీవుడై యున్నాడు... 

మృతులలోనుండి ఆది 
సంభూతుడుగా లేచినవాడు...
భూపతులకు అధిపతియైన ప్రభువైన 
యేసుక్రీస్తు నుండి కృపా కరుణ కనికరం 
శాంతిసమాధానముల్ మీకు కలుగునుగాక

37. అన్న పోలన్న సుభాషితం
     విన్న మీకు....శుభోదయం 

కోపిష్టి మనిషి 
బలహీనమైన ఇనుమే... 
 
వేడి వేడి టీ 
ఉల్లాసాన్ని 
ఉత్సాహాన్ని నింపు... 

శాంత చిత్తమే 
ఒక దైవమందిరం 
ప్రశాంతతకది ప్రతిబింబం...

ఉలిదెబ్బలు 
తింటేనే శిలనుండి 
సుందర శిల్పం ఆవిష్కృతం...

సముద్రంలో
మునిగితే దొరుకు...
ఆణిముత్యాలు...
కష్టేఫలి శ్రమయేవ జయతే...

రేయింబవళ్ళు రైతులు 
రెక్కలు ముక్కలు చేస్తేనే
పండేను పచ్చని పంటలు...
ఆరేను మన ఆకలి మంటలు......

హోరు గాలులు వీస్తే... 
జోరు వానలు కురిస్తే... 
వరద భీభత్సమే అంతా విధ్వమే...

పండిన పంటే కోతకొస్తుంది... 
పండిన చెట్టుకే రాళ్ళదెబ్బలు...
నవమాసాలు నిండితేనే పండంటి బిడ్డ...

38. అందాల ఓ చిలుకా..! 
       అందుకో నా లేఖ.....!

విరహం ఒక వీణానాదం
మన్మధుడు 
ఆలపించే ఒక మధుర గానం

నీ వలపు పిలుపు కోసం 
తలుపు దగ్గర తపించాను
నిశ్శబ్దంగా నీ నామాన్ని
గాయత్రీమంత్రంలా జపించాను 
గంగా జలంలా స్వీకరించాను

నీకై వేచి వేచి నిదుర కాచి
నిరాశ దుప్పటిలో దూరిన
నాకు తెలతెలవారేనే 
నీ తియ్యని తలపులతోనే ...

ప్రియా ఎక్కడున్నావు ..?నీవు 
ఏ మూగ మేఘమాలికలో దాగి ఉన్నావు..?
నీవు నా చెంత లేకుంటే ఎంతచింత నాకు...

నీ తలపుసెగ తాకగానే నా తనువంతా
అణువణువున ఎంతటి పులకింత...
రాత్రంతా ఎంతటి కలవరింత...
ఈ విరహవేదన భరించడం నా తరమా..?

విలపించుటే నాకు నీవిచ్చే 
ఒంటరి తుంటరి వరమా..?
అందని ఆశల నిండా అంధకారమా..?

ఇంత ఘోరమా..?
నన్ను నేను మరచి నిన్ను
చేరాలనుకోవడం నేను చేసిన నేరమా..!

నీవు లేవన్న 
నీవు రావన్న ఊహలే 
నా మనసుకు పెను భారమా..?
నీవు నాకు చేరలేనంత దూరమా..?
వన్ సైడ్ లవ్ నేను చేసిన నేరమా..?

అందుకే గుర్తుచేస్తున్న 
నా నిశ్శబ్ద చిన్నవిన్నపాన్ని...
నిన్న నేను ఎఫ్ఎంలో 
విన్న ఒక‌ విరహగీతాన్ని... 
"అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ...
"నామదిలోని వ్యధలన్నీ ఇక చేరాలి నీదాక.

39. గుట్టు 
       చప్పుడు కాకుండా 
       వచ్చే గుండె జబ్బు..! (చిత్ర కవిత) 

అయ్యో..! అయ్యో..! 
ఎంత ఘోరం..! ఎంత ఘోరం..!

గుట్టు చప్పుడు కాకుండా 
వచ్చే ఆ మాయదారి గుండెజబ్బు 
మృత్యువును వెంటబెట్టుకొనివస్తుంది

క్షణంలో అరక్షణంలో కళ్ళముందరే మనుషులను మాయం చేస్తుంది... మటుమాయమైపోయేలా చేస్తుంది... 
తెగని బంధాలన్నీ తెంచేస్తుంది
గుండెల్లో గునపాలు గుచ్చేస్తుంది
రక్తసంబంధాలను రంపంతో కోసేస్తుంది

క్షణం వరకు సజీవంగా తిరిగే 
తినే మాట్లాడే నవ్వే మనిషిని 
నిలువునా నేలమీద విసిరేస్తుంది 
నిర్జీవంగా మార్చేస్తుంది... 

నీవు ఆర్జించి నీ కోట్లు 
నివ్వెర పోయి చూస్తాయి... 
తమ యజమాని ప్రాణాలను 
కాపాడలేక పోయామేనని 
కుళ్ళి కుళ్ళి ఏడుస్తాయి... 

నీ కళ్ళ ముందరే
నీ బంధువులు...
నీ భార్య పిల్లలు... 
నీ శ్రేయోభిలాషులు...
నీ ప్రాణ స్నేహితులు... 
ఎందరున్నా ఏమీ చేయలేని 
నిస్సహాయస్థితిలో ఉండిపోతారు... 
దిక్కుతోచక బిక్కచచ్చి పోతారు...

గుండెలు బాదుకొని 
దిక్కులు పిక్కటిల్లేలా... 
వెక్కి వెక్కి ఏడవడం తప్ప...
ఏమీ చేయలేని దీనస్థితిలో
దిక్కులు చూస్తూ ఉండిపోతారు... 

అందుకే ఎప్పుడైనా...
రోజుకు ఒక్కసారైనా... 
మనకు జన్మనిచ్చిన 
ఆ అమ్మానాన్నలను...
మనకు ప్రాణం పోసిన 
కనిపించని ఆ బ్రహ్మను...  
ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి... 
సదా మనసులో స్మరించుకోవాలి... 

వచ్చే 
ఊహించని
కష్టాలను నుండి... 
ముందున్న
పెను ప్రమాదాలనుండి...
తప్పించమని...రక్షించమని
కరుణించమని .... 
కంటికి రెప్పలా కాపాడమని... 

అడుగడుగునా 
గండాల నుండి...
సుడిగుండాల నుండి...
చుట్టుముట్టి మట్టుపెట్టే...
భయంకరమైన సునామీల నుండి... 
సురక్షితంగా బయట పడవేయమని... 

పదికాలాల పాటు పిల్లాజల్లతో 
కలిసి చల్లగా హాయిగా ఆనందంగా 
సంతోషంగా ఉండేలా చూడమని...
ఆశతో అర్థించాలి...పేరాశతో ప్రార్థించాలి... 

40. మనసే మలినమైతే...?

మనసు కరుకుగా...
మురికిగా ఉంటే...
ఎన్ని కోట్లు ఖర్చుచేసి...
ఎంత వాస్తుప్రకారం... 
ఎన్ని అంతస్తులు...
కట్టిన విల్లానైనా... 
ఇష్టములేని వారికి అది 
ఇరుకుగా ఉండే ఇంద్రభవనమే...
అది ఇష్టంలేని ఓ ఇంద్రధనుస్సే... 
ఒయాసిస్ కాదిది ఎడారిలో ఎండమావే...

మనసు పడి కట్టిన మట్టిల్లు 
అందమైన ఒక తాజ్ మహలే... 
అపురూపమైన ఒక మైసూర్ ప్యాలెసే...

తాముపట్టిన కుందేటికైనా...
కోడిపెట్టకైనా కాళ్ళు మూడేననే 
మూర్కుల సిద్దాంతం రాద్దాంతమొక్కటే... 

తాము మెచ్చిందే రంభట.‌‌..
తాము మునిగిందే గంగట...
తాము చెప్పిందే వేదమట...
తాము చేసిందే శాసనమట...
తాము గీసీందే లక్మణ రేఖట...

41. అక్షరాలే శిక్షగా...అక్షరాలే రక్షగా...

అవినీతి పరులకు 
అక్షరాలతో శిక్ష వేస్తూ 
ఆ అక్షరాలనే రక్షగా...
రక్షణ కవచంగా మార్చుకునే...

కవులను ఆదరించిన
పత్రికలే కలకాలం బ్రతికి 
బట్టకడతాయని గట్టిగా నమ్మే
గౌరవనీయులైన ఎడిటర్లందరికి...
వందనం అభివందనం 
అక్షరాభి వందన చందనం

ఈ కొత్త సంవత్సరంలో  
మీ సంకల్పాలన్ని సిద్ధించాలని...
మీకు అంతా మంచే జరగాలని...

కమ్మనైన కలల అలలపై... 
మీరు హాయిగా పయణించాలని... 
సంతోష సాగరంలో ఈదులాడాలని...
ఆనందతీరాలను చేరుకోవాలని ఆశిస్తూ....

ఆనందం ఆరోగ్యం సిద్ధిరస్తు...
ప్రశాంత జీవితం మీకు ప్రాప్తిరస్తు... 
అంటూ మనస్పూర్తిగా దీవిస్తూ...

ముందుగా మీకు...
మీ కుటుంబసభ్యులకు 
మీ సిబ్బందికి...2024 
నూతన సంవత్సర శుభాకాంక్షలు... 

42. పట్టిందంతా బంగారంగా...
       ముట్టిందంతా ముత్యంగా...
1...
ఓ నా ప్రియమిత్రులారా ! 
మీ కోసం నేనీ 
కొత్త సంవత్సరాన్ని కోరేదొక్కటే...
ఆ పరమాత్మ పాదారవిందాలకు
మ్రొక్కి ప్రార్థించి వేడుకునేదొక్కటే...

ఈ కొత్త సంవత్సరంలో... 
మీ కష్టాలు కన్నీళ్ళు
మీ చింతలు చీకాకులు
కారుచీకటిలో...కలిసిపోవాలని...

ఈ కొత్త సంవత్సరంలో... 
మీలోని నిరాశ నిస్రృహలు
ఇరుగుపొరుగు వారిపై మీకున్న 
అసూయా ద్వేషాలు 
పగా ప్రతీకారాలు మనస్పర్థలు 
మంచు ముక్కల్లా...కరిగిపోవాలని...

2...
ఈ కొత్త సంవత్సరంలో... 
మీ క్రొత్త ఆశలు... 
మీ కొత్త ఆకాంక్షలు... 
మీ కొత్త ఆలోచనలు...
మీ కొత్త ఆశయాలు...
మీ కొత్త ప్రణాళికలు...
మీ ధైర్యసాహసాలు... 
మీ ఉన్నతమైన లక్ష్యాలు  
ఉజ్వలంగా ఉండిపోవాలని...
అఖండ విజయాలు మీసొంతం కావాలని... 

ఈ కొత్త సంవత్సరంలో...మీరు 
పట్టిందంతా బంగారం కావాలని...
ముట్టిందంతా ముత్యం కావాలని...
మీ ఆశలు తీరాలని...
మీ కోరికలు నెరవేరాలని...
మీ కమ్మని కలలు పండాలని... 
మీకు ఆఖండ విజయాలు చేకూరాలని...

3...
ఈ నూతన సంవత్సరంలో...
మీ హృదయాలు సంతోషంతో... 
నిండుకుండలా...నిండిపోవాలని...
మీ ముఖాలు.....చిరునవ్వులతో... 
కార్తీక దీపాల్లా....వెలిగి పోవాలని....

ఈ నూతన సంవత్సరంలో... 
మీలో తరగని ఉల్లాసం ఉత్సాహం 
మీ మనసుల్లో అనంతమైన ప్రేమ 
కృప కరుణ కనికరం దయ జాలి త్యాగం
పొయ్యిమీది పాలలా...పొంగిపొర్లాలని...

4...
ఈ నూతన సంవత్సరంలో... 
మీరు సాధించే "ఘనవిజయాలు"
కలనైనా మరువలేని 
తీపిజ్ఞాపకాలుగా...
చెక్కు చెదరని 
శిలాశాసనాలుగా...
భావితరాలకు 
బంగారు బాటలుగా...
స్పూర్తి మంత్రాలుగా... 
మార్గదర్శకాలుగా...మిగిలిపోవాలని...

5...
ఓ నా ప్రియమిత్రులారా..! 
మీ కోసం నేనీ 
కొత్త సంవత్సరాన్ని కోరేదొక్కటే...
ఆ పరమాత్మ పాదారవిందాలకు
మ్రొక్కి ప్రార్థించి వేడుకునేదొక్కటే...
ఈ కొత్త సంవత్సరంలో...
మీరు చిరునవ్వులతో... 
సిరిసంపదలతో... 
భోగభాగ్యాలతో... 
ఆయురారోగ్య... 
అష్టైశ్వర్యాలతో...
సుఖశాంతులతో...
ప్రశాంతంగా జీవించాలని...
నిండూనూరేళ్లు వర్ధిల్లాలని... 
మనసారా కోరుకుంటూ... 
ఆపరమాత్మను అర్థిస్తూ...ఆశతో ప్రార్థిస్తూ...

43. వరమొక్కటే..! ఆయుధమొక్కటే..!

మనిషికి 
వివేకం విచక్షణ  
సమయం సంపద
వినయం విధేయత 
స్వేచ్చ స్వాతంత్ర్యం 
శక్తి యుక్తి...అన్నీ ఉన్నా 

బాల్యంలో... కొంతకాలం
అమాయకత్వంతో... 
ఆధారపడేతత్వంతో...
అమ్మానాన్నల చేతుల్లో మనం
బంధీలమే...ఆటబొమ్మలమే..!

"యవ్వనంలో"... 
సమయం సంపద
స్వేచ్ఛ స్వాతంత్ర్యం 
శక్తి యుక్తి పుష్కలంగా ఉన్నా 
చేతిలో "సంపద" శూన్యమే..!

"మధ్య వయసులో"....
ఉరుకు పరుగుల జీవితంలో 
అన్నీ పుష్కలంగా ఉన్నా... 
"సమయం" శూన్యం.! 

"వృద్ధాప్యంలో".... 
సర్వం మన పాదాక్రాంతమైనా
అన్నీ పుష్కలంగా ఏ కొరతలేకున్నా
యుక్తి ఉన్నా "శక్తి" శూన్యం..!

ఇది కదా జీవితమంటే... 
ఇది కదా అర్థం కాని 
ఆ జీవిత పరమార్థమంటే...
ఇది కదా దైవశాసనమంటే...

ఆ దైవం వరాలెన్ని ఇచ్చిన 
అనుభవించేది ఒకే...వరం...
ఆయుధాలెన్ని ధరించినా 
సమయానికి సమయస్ఫూర్తితో 
సంధించేది ఒకే...ఆయుధం...

44. గురువులు కాదు గుంటనక్కలు...

అయ్యో..! అయ్యో..!
ఇదేమి ఘోరం..? 
ఇదేమి దారుణం...? 
ఇదేమి అన్యాయం..? 

అన్న కన్న‌ మిన్నగా 
కన్నతండ్రిగా భావించి
ఉపాధ్యాయులు ఉత్తములని... 
కనిపించే దేవుళ్ళని తలచి
కొలిచి చెంతకు చేరిన
అన్యం పుణ్యం ఎరుగని 
ఆ పసిపిల్లలను నవ్వుతూ 
పువ్వుల్లా నలిపేస్తారా ..? మీరు
మనుషులా..? నరరూపరాక్షసులా..?

ఎందుకు పుట్టారురా..?మీరు 
తిట్టవలసిందిగా మిమ్ము కాదురా 
మీ అమ్మానాన్నలను...
ఎందుకు కన్నారని 
ఇంతటి పాషాణహృదయుల్ని..?
కామంతో కళ్ళు పొరలు 
కమ్మిన కామాంధులను...
కనికరంలేని కసాయివాళ్ళను...
మూర్ఖులను...మూఢులను...
మానవత్వంలేని మానవమృగాలను... 

చెప్పుతో కొట్టవలసింది 
మీ క్రూరత్వాన్ని... 
మీ మోసకారితనాన్ని... 
మీ దుష్టతలంపులను...
 
మీ కన్నా శిశువులకు హాని
తలపెట్టని ఆ పశువులే నయం కదరా... 
ఓరి గడ్డిమేసే గుడ్డి గాడిదల్లారా..!
ఓరి గజ్జి కుక్కల్లారా..! గుంటనక్కల్లారా..!
ఓరి శాడిస్టులారా...!‌ ఓ రోగిష్టులారా..!
ఓరి మూర్ఖులారా...! ఓ ముష్టివాళ్ళారా..

మీరూ...కన్నారు 
మీకు ఇంట్లో ఉన్నారు కన్నబిడ్డలు
ఎందుకురా చవట సన్యాసుల్లారా..?
ఆ వెధవ ఆ వెకిలి ఆపోకిరి చేష్టలు..?
ఎందుకురా..! పాపం ఆ పసివారి లేత
లేత అవయవాలను తడిమి ఆనందిస్తారు 
అంగాంగాలను గాంచి సొంగకార్చుకుంటారు

ఓరి భ్రష్టులారా..! దుష్టులారా..!  
ఓరి నీచులారా..! నికృష్టులారా ..!
ఈ నీచ నికృష్ట వికృత కృత్యాలకు 
పాల్పడే మీ తలలు తెగనరకాలిరా..!
మిమ్మల్ని చితిమంటల్లో తగలబెట్టాలిరా..!
మీరు గురువులు కాదురా గుంటనక్కలు

45. గజగజ వణుకుతున్న గాజా..!  
       (జీహాద్ ముద్దు జీవహింస వద్దు)  

గాఢనిద్రలో ఉన్న వేళ కలలు చెదిరి...
తలలు పగిలి...కాళ్లు చేతులు విరిగి... 
ఒళ్లంతా గాయాలతో...ముఖమంతా 
రక్తపుధారలతో భవన శిధిలాల మధ్య చిక్కి
ఆకలికి అలమటిస్తూ సజీవసమాధైపోతున్న పాలస్తీనా...ఇజ్రాయెల్ ప్రజలకు దిక్కెవరు?

ఎవరి ఆధిపత్యం కోసం...?
ఎవరి రాజ్య విస్తరణ కోసం..?
ఎవరి రక్తదాహం తీరడం కోసం..?
ఈ రక్తపాత రాక్షస యుద్ధాలు...?
ఈ దారుణ మారణహోమాలు..?
ఈ ఘర్షణలు పగలు ప్రతీకారాలు..?
ఎవరికోసం హమాస్...ఇజ్రాయెల్ దళాల
మధ్య భయంకరమైన ఈ బాంబుదాడులు?

దొంగల పైకి కుక్కలను... 
మేకల మీదికి తోడేళ్లను... 
జింకల మీదికి పులులను... 
శత్రుదేశాలపైకి మిత్రదేశాలను... 
ఉసిగొల్పుతున్న యుద్దోన్మాదులెవరు..?

ఈ భీకర యుద్ధాలకు ఆజ్యం పోసేదెవరు ?
ఈమారణాయుధాలు సరఫరాచేసేదెవరు ?
ఈ హమాస్ ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టేదెవరు ? 

ఎటుచూసినా రక్తపుటేరులే...శవాల గుట్టలే
ఆగనిబాంబుదాడులే...అంతుచిక్కని ప్రశ్నలే
రక్తదాహం తీరని...రాజ్యకాంక్షతో రగిలేటి 
ఈ రాక్షసమూకలు యుద్ధాలనాపేదెప్పుడు? 
ఈ మతఘర్షణలు అంతమయ్యేదెప్పుడు ? 

మనిషిలో మానవత్వం వికసించినప్పుడే..!
యుద్దోన్మాదులు అల్లాసాక్షిగా ప్రమాణంచేసి 
జీహాద్ ముద్దు...జీవహింస వద్దు...ఈ 
ఘోర నరమేధమొక నేరమనుకున్నప్పుడే.


రచన:
కవిరత్న
సహస్రకవి
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502



Comments