45...జూన్ నెల 2023 కవితల ఇండెక్స్
1. కీచకులు...క్రీడాకారులు...
2. కీచకులకు కిరీటాలు..?
క్రీడాకారుల పతకాలు గంగపాలు...?
3. అగ్ని పరీక్షలు...?
4. మృత్యువు
ప్రయాణించిన మూడురైళ్ళు..
5. మూడు రైళ్లు...మృత్యఘోష..?
6. మీ బంగారుజీవితం...
శృంగారమయమైతే...?
7. తప్పదు తప్పదు...
8. చెప్పకు ! చెప్పకు !
9. విశ్వవిజేత...విశ్వరూపం..?
10. కారు" చీకటిలో కలిసి పోకండి..?
(యువత కోసం ఈ కవిత)
11. మన రైతే రాజైతే...?
12. మోహపు చూపే
మోసకరం...నాశనకరం..?
13. ఆ ముగ్గురిలో మీరెవ్వరు..?
14. అయ్యో ఓ దైవమా?
ఏమాయె...మా ప్రార్ధనలు..?
15. రక్తం త్రాగిన రైళ్ళు...?
16. నచ్చని...నల్లని రంగు...!
17. మీరే పులులైతే..?
చిరుతపులులైతే...?
18. ఏరులై పారిన నల్లధనం...?
19. కవిపోలన్న నోట..! ఓ కమ్మని మాట..!
20. ఖచ్చితంగా ఇచ్చి
తీరాలి "కరెంట్ షాక్"..?
21. ఆదర్శ దాంపత్యం..? (చిత్రకవిత)
22. ఓ పరిశుద్ద పావురమా !
నీకు పాదాభివంనం...
23. గొడవ...పడవ...?
24. శత్రువును ద్వేషించకు...ప్రేమించు...
25. పాదాభివందనం...ఎందుకు..?
26. కవి పోలన్న నోట..!
ఓ కమ్మని మాట..!
27. ఇది నిజం నమ్మలేని పచ్చినిజం...?
28. శిలువ శిక్ష ...ఎవరికి...? (పార్టు...1)
29. ప్రేమా గీమా...? పెళ్లీ గిళ్ళీ...అంటే..?
30. తులసి అక్కతో...కలిసి నడుద్దాం...
31. మీ ఈ సేవా యజ్ఞం...?
32. ఒక దీపం..! ఒక జీవితం..!!
33. అదే కాలచక్రం...
అదే అనుభవచక్రం...
34. క్షణికమే ఈ జీవితం...
35. నీవు వీరుడివా..?
ఉత్తర కుమారుడివా..?
36. ఓ యువతా మేలుకో...!
నీ దేశాన్ని ఏలుకో...!
37. రాజకీయం...ఒక రావణకాష్టం...?
38. పెద్దలు...కార్పోరేట్ గ్రద్దలు..?
39. మూర్ఖులు - మూగజీవులు
40 . ఇదే ఇదే "మీ నాన్న" చివరి కోరిక...?
41. పిచ్చి కోపం వద్దు..!
చల్లని చిరునవ్వే ముద్దు..!
42. ధన్యమే ధన్యమే..!
నీజన్మ ధన్యమే..!!
43. మీరే విజ్ఞానజ్యోతులు..!
విశ్వవిజేతలు..!!
44. కలలు కలతనిద్ర....
45. చీకటిలో వెలిగే చిరుదివ్వెలు..?
1. కీచకులు...క్రీడాకారులు...
అయ్యో కళ్ళముందే...
ధర్మం ధగ్దమైపోతుందే...
నడిరోడ్డులోనే...న్యాయం...
నవ్వులపాలైపోతుందే...
దిక్కులేని శవమై పడివుందే...
ఇదేమి రాజ్యం..? ఇదేమి చోద్యం..?
ఇదేమి ధర్మం..? ఇదేమి న్యాయం..?
మహిళలంటే మహారాణులే...
మహిళలంటే ఇంటికి దీపాలే...
మహిళలంటే మాతృమూర్తులే...
అట్టివారిపై ఏలారా ..?
ఈ లైంగిక వేధింపులు...?
మతిలేని ఈ మానభంగాలు..?
ఇదెక్కడి ప్రజాస్వామ్యం..?
నీచ...నికృష్ట...దుష్ట...దుర్మార్గ
ధూర్తులపై...మూర్ఖపుమూకలపై...
రహస్యంగా...లైంగికంగా వేధించే
రాక్షసులపై...కఠినచర్యలు తీసుకోవాలని...
సిగ్గిడిచి ఇండియా గేట్ ముందు
ధర్నాచేసే ధర్మపోరాటం చేసే మహిళలపై
మానవత్వం లేకుండా లాఠీచార్జీలా..?
ఇదేమి ధర్మం..? ఇదేమి న్యాయం..?
ఇదేమి రాజ్యం..?ఇదేమి ప్రజాస్వామ్యం..?
మానవత్వంలేని
ఓ మనుషుల్లారా..!
మీరు పశువులుగా..!
కామాంధులుగా మారకండి..!
మహిళామణులను గౌరవించండి..!
స్త్రీలు ఆదిపరాశక్తులని మరువకండి..!
కలికి కన్నీరును తుడవని
ఏ ప్రభుత్వమైనా..?ఎంతటి నేతలైనా..? కాలగర్భంలో కలిసి పోవాల్సిందే...
క్షణంలో కనుమరుగై పోవలసిందే...
ఇది చరిత్ర చెబుతున్న అక్షరసత్యం
ఔను ప్రభుత్వఅధికారులు స్పందించాలి
నిప్పులాంటి ఒక నిర్ణయం తీసుకోవాలి
తప్పు చేసిన వారిని తక్షణమే శిక్షించాలి
న్యాయపోరాటం చేస్తున్న రెజ్లర్ల సమస్యను
సానుకూలంగా శాశ్వతంగా పరిష్కరించాలి
2. కీచకులకు కిరీటాలు..?
క్రీడాకారుల పతకాలు గంగపాలు...?
ఎన్నో ఏళ్లుగా...
ఎంతో కఠోర పరిశ్రమ చేసి...
కఠినమైన శిక్షణతో...గట్టి ప్రణాళికతో
అకుంఠితదీక్షతో...అంకితభావంతో
సాధన చేసి...సరిహద్దులను చెరిపేసి... విదేశాలలో రెజ్లింగ్ పోటీలలో
ప్రత్యర్థులను...మట్టి కరిపించి...
విజయకేతనం...ఎగురవేసి...
ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ లో
బంగారు పతకాలపంట...పండించిన
మహావీరులు...మన రెజ్లింగ్ క్రీడాకారులు
మేరా భారత్ మహానంటూ....
దిక్కులు పిక్కటిల్లేల నినాదాలు చేస్తూ...
నిండుగా త్రివర్ణపతాకాన్ని కప్పుకొని...
మరో త్రివర్ణపతాకం అనంత ఆకాశంలో
గర్వంగా రెపరెపలాడగా...భరతజాతి
ఘనకీర్తిని ఖండఖండాంతరాలకు
విస్తరింప జేసిన...విశ్వవిజేతలు...
జాతిరత్నాలు...మన రెజ్లింగ్ క్రీడాకారులు
తమ రక్తాన్ని స్వేదంగా మార్చి
అద్వితీయమైన...అసాధారణ ప్రతిభతో
సాధించిన ఆ బంగారు పతకాలు
అయ్యో ! అయ్యో ! గంగ పాలా...?
మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులా?
దోషిని శిక్షించేందుకు దోబూచులాటలా..?
ఇదెక్కడి ధర్మం..? ఇదేమి న్యాయం..?
ఇదేమి ప్రభుత్వం.? ఇదేమి ప్రజాస్వామ్యం.?
అహంకారంతో...
అధికార దాహంతో...విర్రవీగుతూ...
కామంతో...కళ్ళు పొరలుకమ్మి...
తల్లి భరతమాత...తలదించుకునేలా...
మహిళా క్రీడాకారులను
మానభంగాలకు గురిచేసే...
మానసికంగా కృంగ దీసే...
రహస్యంగా లైంగికంగా వేధించే
రాక్షసుల్ని...కోయాలి...రంపాలతో...
కీచకుల్ని...పంపాలి...కారాగారానికైనా...
కామాంధులను...కాల్చాలి...కాటిలోనైనా...
మద్దతు పలకాలి...మానవతావాదులంతా
అప్పుడే మనశ్శాంతి...రెజ్లింగ్ క్రీడాకారులకు
అప్పుడే ఆత్మశాంతి....తల్లి భారత మాతకు
3. అగ్ని పరీక్షలు...?
కుదురుతుంది
కుదురుతుంది
ఓ పిచ్చి సంబందం
అరిగిపోగా అరిగిపోగ
పది జతల..."పాదరక్షలు"
పెద్ద చదువులు
చదివిన పెళ్ళి కొడుకు
కన్న కూతురు మెళ్ళోవేసె
మూడుముళ్ళ ఖరీదు..."ముప్పైలక్షలు"
అత్తారింట అడుగు
పెట్టిన నాటి నుండి తన
కన్నకూతురనుభవించేది
కారుచీకటిలో కఠిన..."కారాగార శిక్షలు"
అయ్యో
ఓ శ్రీరామచంద్రా !ఆడపిల్లల తండ్రులకే
ఎందుకయ్యా ఇన్ని ......"అగ్ని పరీక్షలు".
4. మృత్యువు
ప్రయాణించిన మూడురైళ్ళు..
ఉన్నావా..? అసలున్నావా..?
ఉంటే ఈ లోకం
"కుళ్లు" చూడకున్నావా..? ఉన్నావని...కనుగొన్నామని...
ఎందరెందరో అన్నారు...
ఉన్నావని...చూస్తున్నావని...
"నమ్మి" ఎందరో ఉన్నారు...
ఉన్నావా..? అసలున్నావా..?
ఔను ఈ నేలమీద
తన కళ్ళముందే...తన గుడిముందే...
ఎన్నో ఘోరాలు నేరాలు దారుణాలు
కలనైనా ఊహించని
ఎన్నో "ఘోరమైన రైలు రోడ్డు
ప్రమాదాలు" జరుగుతూవుంటే...
గుడిలోని..."ఆ దైవం"...గ్రుడ్డివానిలా
ఎందుకు..."మౌనవ్రతం" దాల్చినట్లు..
ఎందుకు? ఎందుకు? ఘాటుగా
ప్రశ్నించాడో...ఓ పరమభక్తుడు
ఆ పరమాత్మను ఏనాడో...మరి
ఆ దైవాన్నే అడగాలి ఈనాడే...
ఎందుకు..? ఎందుకు..?
శుక్రవారం రాత్రి 20 నిముషాల
వ్యవధిలో అత్యంత వేగంగా
ప్రయాణించే..."మూడు రైళ్లు"
"ఢీ ఢీ" అంటూ "ఢీ" కొట్టుకున్నాయి..?
ఎందుకు..?ఎందుకు..?
300 మందికి పైగా నాలుగు రాష్ట్రాల
అమాయకపు ప్రయాణికులు...క్షణాల్లో
"మృత్యుకుహరంలో "చిక్కుకుపోయారు..?
నిజంగా ఇది సిగ్నలింగ్ వైఫల్యమా..?
మానవ తప్పిదమా..? ఎవరి పాపం..?
బాధ్యులెవరు...? కఠినమైన శిక్ష ఎవరికి..?ప్రైవేటు వ్యక్తులకా..?కార్పోరేట్ శక్తులకా..?
అమాయకపు ప్రయాణీకులకా..?
అవినీతి అధికారులకా..? ఎవరికి..?
ఆలోచించండి విజ్ఞులారా...!!!
5. మూడు రైళ్లు...మృత్యఘోష..?
ఒడిశాలోని బాలాసోర్ లో
శుక్రవారం రాత్రి 6.50 నుండి 7.10
గం.ల మధ్య 20 నిముషాల వ్యవధిలో
అత్యంత వేగంగా..."మృత్యువులా"
దూసుకు వచ్చిన...."మూడు రైళ్లు"
లూపులైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు
128 కి.మీ.వేగంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్
116 కి.మీ.వేగంతో యశ్వంతపూర్
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు
ఒకదానితో ఒకటి "ఢీ" కొట్టుకోగా...
"యుద్దభూమిలో " వీరసైనికుల్లా...
"మరుక్షణంలో ఆ ప్రాంతమంతా
"మారిపోయెగా ...మరుభూమిగా"
ఎందుకు..? 300 మందికి పైగా
అమాయకపు ప్రయాణీకులు
మృత్యువుకోరల్లో చిక్కుకు పోయారు..?
ఎందుకు..? ప్రయాణీకుల రక్తం
పట్టాలపై ...ప్రవహించింది..?
పట్టాలపై చెల్లాచెదురైన శవాలగుట్టలే...
ఎందుకు..? ఎటుచూసినా
శిధిలాలలో చిక్కుకున్నవారే...
కాళ్ళు చేతులు తెగిపోయినవారే...
బోర్లా పడిన బోగీల్లో ఇరుక్కుపోయివారే...
హృదయ విధారక...భయానక దృశ్యాలే...
ఎందుకు..? మరుభూమిని తలపించేలా
ఆ "ఘటనాస్థలిలో " ఎటువిన్నా
రక్షించమని...ప్రాధేయపడేవారే...
ఆర్తనాదాలు...హాహాకారాలు చేసేవారే...
ఇనుప సువ్వలు
తగిలి...తలలు పగిలి...
ఒళ్ళంతా రక్తపు మరకలతో...
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నవారే...
తుక్కు తుక్కైన బోగీల్లో చిక్కుకున్న
కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో...
ఏమైపోయారో...బ్రతికున్నారో లేదో...
అర్ధంకాని అతి భయానక దుస్థితిలో...
ఆదుకునే..."ఆపన్నహస్తాల" కోసం
ఆశతో ఎదురుచూసే...క్షతగాత్రులే...
ఆసుపత్రిల్లో...స్వచ్చందంగా
రక్తదానం చేసే...మానవతామూర్తులే...
భారతదేశ రైల్వే చరిత్రలో
ఒక్కసారి మూడురైళ్లు ఢీకొనడం...
300 మందికి పైగా ప్రయాణీకులు
మృత్యువు కోరల్లో చిక్కుకుపోవడం...
కనీవినీ ఎరుగని ఈ ఘోర రైలుప్రమాదంలో
ఎక్కడ సాంకేతిక లోపం...ఇదెవరి శాపం..?
ఎందుకు...జరిగింది..?ఎలా...జరిగింది..?
దొంగలెవరు..?దోషులెవరు..?శిక్ష ఎవరికి..?
ప్రైవేటు వ్యక్తులకా..? కార్పోరేట్ శక్తులకా..?
అమాయకపు ప్రయాణీకులకా...ఎవరికి..?
ఈ విధివంచితులను...పాలకులు
అధికారులు...మానవతావాదులు
అక్కున చేర్చుకుని...ఆదుకోవాలని...
మృతుల"ఆత్మకు" శాంతి చేకూరాలని...
క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని...
ఆ పరమాత్మను అర్థిస్తూ ఆశతో ప్రార్థిస్తూ...
6. మీ బంగారుజీవితం...
శృంగారమయమైతే...?
అందిన"స్వర్గం"
సుందరమైన
ఓ "స్వప్నమౌతుంది
అందమైన
ఓ "అనుభవమౌతుంది
"శరీరస్పర్శ"
దంపతులకెన్నో
శుభసందేశాలనందిస్తుంది
శృంగారమంటే
స్త్రీ పురుషుల
తనువుకు..
మనసుకు...
హృదయానికి...
మధ్య సాగే భావోద్వేగాల
"ప్రేమప్రయాణం"...
ఒక్క ప్రేమపూర్వక
"ఆ స్పర్శ" చాలు
లవ్ హార్మోన్ "ఆక్సిటోసిన్"
విడుదల కావడానికి...
దంపతులిద్దరు
ప్రేమానురాగాలతో
పెనవేసుకుపోవడానికి...
రాత్రింబవళ్ళు
చుంబనాలు...
బిగికౌగిళ్ళు...
భార్యాభర్తల మధ్య
చక్కని ఆప్యాయతలను...
అంతులేని అనుబంధాలను...
చిక్కపరిచే రాయబారులు...
"దేహభాషే" దంపతుల్లో
అతిసాన్నిహిత్యానికి...
సరసంలో సంతృప్తికి...
ఇద్దరి మధ్య దగ్గరితనానికి...
ఒకరి కోసం మరొకరమన్న
"మధుర భావనకొక "రాజమార్గం...
ఒకరినొకరు
ప్రేమతో ఎత్తుకొని...
గాఢంగా హత్తుకుని...
గట్టిగా కౌగిలించుకొని...
"శరీరస్పర్శ" సుఖాన్ని
అనుభూతి చెందుతూ
హాయిగా"నిద్రిస్తే" చాలు...
శృతిమించని శృంగారంతో
వారి "బ్రతుకు బంగారమే"
ఆ సంతృప్తికర శృంగార జీవితం
"సుఖసంతోషాల...నవ జీవన సాగరమే"...
7. తప్పదు తప్పదు...
ఎగురుతుంది
ఎగురుతుంది
ఎగురుతుంది
ఒక గాలిపటం...
ఒక విమానం...
ఒక విహంగం...
ఎంత
ఎత్తుకెగిరినా...
ఎన్ని గంటలు
గగనాన
స్వేచ్ఛగా
విహరించినా...
తిరిగి రాక
తప్పదు నేలపైకి
ఏ గాలిపటమైనా...
దారం తెగగానే...
దూసుకు రాక
తప్పదు రన్ వే పైకి
ఏ విమానమైనా...
గమ్యం రాగానే...
గూటికి చేరక తప్పదు
ఏ విహంగమైనా...
చీకటి కమ్ముకోగానే...
అధికారంతో...
అహంకారంతో...
ధనదాహంతో...
విర్రవీగే వారంతా...
కన్నుమూసిన
మరుక్షణమే...
కలిసిపోక తప్పదు
కాలగర్భంలో...
నాదినాదని భ్రమపడి
అష్టకష్టాలు పడి
ఆర్జించి అనుభవించకున్నా
పరులపాలైపోక తప్పదు ...
ఆశపడి కూడబెట్టిన ఆస్థిఅంతా...
8. చెప్పకు ! చెప్పకు !
చెప్పకు
చెప్పకు
స్వాగతం..!
.....స్వార్థానికి...!
.....సోమరితనానికి..!
చెప్పకు
చెప్పకు
వీడ్కోలు...!
....వినోదానికి..!
....విజయానికి..!
వెళ్ళకు
వెళ్ళకు
దూరంగా...!
.....మంచితనానికి...!
.....మానవత్వానికి..!
పడకు
పడకు
తెలిసీ తెలిసి..!
....పాపంలో...!
....నరకకూపంలో...!
నమ్ము
నమ్ము
మదిలో గట్టిగా...!
....విధిని ఎదిరించవచ్చని...!
....విజయాన్ని సాధించవచ్చని..!
9. విశ్వవిజేత...విశ్వరూపం..?
నిన్ను విమర్శించే వానికి
నీ విశ్వరూపం చూపించు..!
నీవు విశ్వవిజేతవని నిరూపించు..!
నిన్ను తక్కువగా చూసేవాని
ముందే నీవు తల ఎత్తుకు తిరుగు..!
వాడి తలదన్నేలా దర్జాగా బ్రతుకు..!
నిన్ను బానిసగా భావించే వానికి
నీవొక యజమానివని గుర్తు చెయ్..!
బానిసత్వానికి ఎవరూ బంధీలు
కారాదని బలైపోరాదని సందేశమివ్వు..!
నిన్ను నిర్లక్ష్యం చేసే వానికి
నీ జీవిత లక్ష్యం వివరించు..!
నీవు పదిమందికి...ఒక వంతెనగా
ఒక "నిలువెత్తు నిచ్చెనగా" నిలబడు..!
నిన్ను శత్రువుగా చూసే వానికి
నీ అమృతహస్తాన్ని అందించు..!
వానిలోనే ద్వేషాన్ని...దయగా
పగను ప్రతీకారాన్ని...ప్రేమగా
కక్షను కాఠిన్యాన్ని....కరుణగా మార్చు..!
వాడి కడుపులో పేరుకున్న కుళ్ళును
కుట్రలను కుతంత్రాలను ప్రక్షాళన చెయ్..!
ఆపై నీ నిజజీవితంలో
నీకు బద్ధశత్రువులెవరూ ఉండరు...
అందరూ నీకు దగ్గరి బంధువులే...కానీ
తప్పులు చేసే నీ అనుకూల శత్రువులపై
నీ నిఘానేత్రాలతో నిప్పులు కురిపించు..!
వారు కన్నుమూసి
కాటికెళ్ళేలోగా...
కనుమరుగయ్యేలోగా...
వారికి కనువిప్పు కలిగించు..!
10. కారు" చీకటిలో కలిసి పోకండి..?
(యువత కోసం ఈ కవిత)
కొత్త సేద్యగాడు పొద్దెరగడు
కొత్త పెళ్లికొడుకు ముద్దెరగడు...అన్నట్లు
మొన్ననే నాన్న
కొనిచ్చే...కొత్త కారు...
పార్టీ జోష్ లో కుర్రకారు...
త్రాగిన మైకంలో రిటర్న్ జర్నీలో
జెట్ స్పీడ్ లో మెరుపు వేగంతో
ఓ ఆర్ ఆర్ లో కారులో షికారు...
నా సామిరంగా....ఆ త్రిల్లే వేరు...
ఆ ఖుషీ ఆ ఆనందం...ఏరులై పారు...
ఎన్ని హైదరాబాద్
దమ్ము బిర్యానీలు తిన్ననేమి..?
ఎన్ని కాస్ట్లిబీర్లు కొట్టిననేమి...?
ఎంత ఫారిన్ మందు త్రాగిననేమి..?
ప్రక్కనే ఓ చక్కనైన చుక్క ఉన్ననేమి..?
ఆ "కిక్కే"వేరు...మామ...ఆ"లక్కే"వేరు..!
అయ్యో...మామా...ఘోరం...ఘోరం
ఏమైంది మామా ? మందెక్కువైందా?
పిడుగు నెత్తినపడిన పిల్లిలా అరుస్తున్నావ్
లేదు మా...మా... అదిగో
ఎదురుగా...ఏనుగులా...
యముడిలా...లోడులారి వచ్చేసింది
మన కారును గుద్దేసింది
కారు డివైడర్ ను ఢీకొట్టి
ఎగిరి గాలిలో గిరికీలు కొట్టి
కరెంట్ స్తంభాన్ని గుద్దేసింది కారులో
ఉన్న మనమంతా నుజ్జునుజ్జైపోయాం
ఇప్పుడు మనమున్నది
హాస్పటల్లో ఐసీయూలో
చావు బ్రతుకుల్లో ఉన్నాం...
రేపు బ్రతికి బట్ట కడతామో లేదో
ఆ భగవంతుడికే ఎరుక...! నిజమే
కారు మనదే దాని ఓనర్లం మనమే
"కారులో షికారు" చేస్తున్నంత సేపు
ఆకాశపు అంచుల్లో ఊరేగుతాం...
ఒళ్ళు మరిచి గాలిలో తేలిపోతాం...
కానీ మన జాతకాలే తారుమారైతే...
ఆ క్రూరమైన విధి మనపై విషం గ్రక్కితే...
ఘోరమైన "కారు"ప్రమాదాలకు గురౌతాం
మృత్యువు "కోరల్లో" చిక్కుకుపోతాం...
క్షణాల్లో "కారు"చీకటిలో కలిసిపోతాం...
మన "కారే"
మన స్టేటస్ కు సింబల్
మన "కారే" మనల్ని
సంతోష సాగరంలో ముంచేది
మన "కారే" మన కొంప ముంచేది
మన "కారే" మనల్ని..."ప్రేమించే శత్రువు"
మన "కారే" మనకు"కనిపించని మృత్యువు"
అందుకే ఓ యువతా ! మీరు కారు ఎక్కేముందు...స్టీరింగ్ త్రిప్పేముందు
బ్రేకు త్రొక్కేముందు....
ఒక్క విషయం గుర్తుంచుకోండి...
కారులో మీ విహారయాత్ర...
కారాదు కాటికి చేరే శవయాత్ర...
11. మన రైతే రాజైతే...?
నిన్న...
నెర్రెలిచ్చిన బంజరు భూములే...
నేడు...
సిరులోలికే పచ్చని పంటపొలాలు...
నిన్న...
చుక్క నీరులేక ఎండిన బీళ్ళే...
నేడు...
పట్టుచీరలు కట్టిన పచ్చని పైర్లు...
నిన్న...
ఆకలికేకలు...
అప్పులు ఆత్మహత్యలే...
నేడు...
ఊహించనిదిగుబడి...
గుండెల్లో గుడిగంటలు...
నిన్న...
నిరసన సెగలే...
ధర్నాలే రోడ్డురోకోలే...
నిత్యం భారత్ బందులే...
నేడు...
ముఖాన చిరునవ్వుల చిరుదివ్వెలే...
జల్సాలు జాతర్లు చిందులు విందులే...
అవును మన "రైతే రాజైతే"...
ఇక చెవులకు వినిపించవులే...
అన్నదాతల ఆత్మహత్యలు...
అస్తిపంజరాల ఆకలి కేకలు...
ఇక నిత్యం కళ్ళకు కనిపించేవి..
చీకటి బ్రతుకుల్లో కాంతిరేఖలే...
అందరి ముందరి జీవితాలు
అందమైన సుందర నందనవనాలే...
అందుకే ఓ అన్నదాతలారా..!
మీకు వందనం...! పాదాభివందనం...!
12. మోహపు చూపే
మోసకరం...నాశనకరం..?
మత్తయి సువార్త...
5వ అధ్యాయం...
28వ వచనం...
ఒక స్త్రీని మోహపు చూపుతో
చూచు ప్రతివాడు అప్పుడే
తన హృదయమందు ఆమెతో
"వ్యభిచారం" చేసినవాడగును...
అంటూ చేసిన బైబిల్ "దివ్య ప్రబోధం"....
గుర్తుంచుకోవాలి
భార్యాభర్తలిద్దరూ "బ్రతికినంతకాలం"....
ఆరీతిగా...
ఒక పరపురుషున్ని
ఆనందపరచాలని...
ఆకర్షించాలని...చెడుభావనతో
కొత్త పెళ్ళికూతురులా...
అందంగా అలంకరించుకొని...
మదిలో దూరిన చెడు ఆలోచనలతో...
తలలో దూరిన తప్పుడు తలంపులతో...
వక్రబుద్ధితో చాటుమాటుగా
దొంగ చూపులు చూచు ప్రతిఆడది
అప్పుడే తన హృదయమునందు ఆమె
ప్రాణానికి ప్రాణమైన తన భర్తను తానే
అతి దారుణంగా"దగా"...చేసినదగును...
అప్పుడే తన "భర్త గౌరవానికి"
తానే "మాయని మచ్చ"తెచ్చినదగును...
అప్పుడే తన పచ్చని కాపురంలో
తానే "ఆరని చిచ్చు" పెట్టుకొన్నదగును...
అంటూ "విడాకుల విషం" పుచ్చుకున్న
"విధివంచితులు" విలపిస్తూ
ఆలపించిన.....ఆ "విషాదగీతం"...
గుర్తుంచుకోవాలి
భార్యాభర్తలిద్దరూ "జీవితాంతం"...
13. ఆ ముగ్గురిలో మీరెవ్వరు..?
నిత్యం ఈ సమాజంలో
ముగ్గురు మనుషులు
మనకు తారసపడతారు
ఒకరు...
ఎవరికే ఇబ్బంది వచ్చినా
స్పందించేవారు
స్వచ్చందంగా తమ వంతు
సహాయాన్ని తక్షణమే
అందించేవారు...వారే ఉత్తములు...
కొందరు...
కోటీశ్వరులైనా
పిల్లికి కూడా బిక్షం పెట్టక
తాలి కట్టిన ఆలికి
కడుపున పుట్టిన బిడ్డలకు
బుట్టువులకు పెట్టి
రహస్యంగా లెక్కలు వ్రాసుకునే
పరమ పిసనారులు...వారే అధములు
మరికొందరు...
తమ రెండు హస్తాలకు తోడుగా
ఆదుకునే తత్వమున్న కొన్ని వందల అమృత...ఆపన్న...అభయ...హస్తాలను
జతచేసి ఎన్నో ప్రజాహిత సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ...
నిరుపేదల...ఆశలను...
ఆకలిని...అవసరాలను తీర్చే...
సహృదయులు...సంస్కారవంతులు...
వారే ధన్యజీవులు...పుణ్యమూర్తులు...
వారే మహనీయులు...మహాత్ములు.....
14. అయ్యో ఓ దైవమా?
ఏమాయె...మా ప్రార్ధనలు..?
అయ్యో !
అయ్యో ఓ దైవమా !
ఎక్కడ దాగి ఉన్నావయ్యా !!
నీవున్నావని చూస్తున్నావని...
ఆపదలో మమ్ము ఆదుకుంటావని...
నీవే అనాధరక్షకుడవని...
నీవే నిజమైన దేవుడవని...
ఆపద్బాంధవుడవని ఆశపడితిమే...
అది
జననమైనా...
జీవనమైనా...
కడకు మరణమైనా...
ఈ సృష్టిలో సకలచరాచర
జీవకోటికి నీవే ఆధారమని...
పంచభూతాల సాక్షిగ మేము నమ్మితిమే...
సృష్టి స్థితి లయలకు
కారకుడవు నీవేనని...
నిన్నే భక్తితో కొలిచి..
ఏడుకొండలు ఎక్కి...
నీవే దిక్కని నీ పాదాలకు మ్రొక్కితిమే..
మడికట్టుకొని గుడిచుట్టు
108 ప్రదక్షిణలు చేసి...
మొక్కుబడులు చెల్లించి...
సాష్టాంగపడి పొర్లుదండాలు పెడితిమే...
నీ గుడిగంటలు మ్రోగించి...
నిత్యం నీ సన్నిధిలో నిలబడి
మా చిరు కోరికలన్నీ తీర్చమని...
మా సమస్యలన్నీ పరిష్కరించమని...
ప్రశాంతమైన ఉన్నతమైన జీవితాన్ని...
ప్రసాదించమని...ఘోరప్రమాదాలనుండి...
తప్పించమని....కన్నీటితో...ప్రార్ధించితిమే...
అయ్యో దైవమా? ఏమాయె మా ప్రార్ధనలు?
అడుగడుగున గండాలే...
సుఖదుఃఖాల సుడిగుండాలే...
ఆరని ఆకలి బాధల అగ్నిగుండాలే...
ఎప్పుడందేను మాకు అమృతభాండాలే...
15. రక్తం త్రాగిన రైళ్ళు...?
అయ్యో ఓ దైవమా..?
నిత్యం నీ సన్నిధిలో నిలబడి
నీ గుడిగంటలు మ్రోగించి...
మా చిరుకోర్కెలు తీర్చమని...
మా సమస్యలు పరిష్కరించమని...
ప్రశాంతమైన సుఖజీవనాన్ని మాకు
ప్రసాదించమని...ఘోర ప్రమాదాలనుండి
తప్పించమని...కన్నీటితో...ప్రార్ధించితిమే...
మరి మా విన్నపాలు...మా నివేదనలు
మా వ్రతాలు...నోచిన నోములు మేము
చేసిన పూజలు ప్రార్థనలు ఏమాయె...?
మూడు రైళ్ళలో మృత్యువు
మమ్ము కర్కశంగా కబలించివేసే...
చిమ్మ చీకటిలో చిరుతపులులు
జింకల గుంపును చీల్చి చెండాడినట్లు
మమ్ము ముక్కలుముక్కలు చేసి విసిరేసె...
మా కుటుంబాలలో కసితో
ఆవిధి విషాన్ని విషాదాన్ని నింపే...
బంగారు బ్రతుకులెన్నో చిధ్రమైపోయె...
రైలుబోగీలలో ఇరుక్కొని నలిగిపోతిమి...
రైలు పట్టాలపై మారక్తం ఏరులై పారే...
మా శరీర భాగాలు చెల్లాచెదురై పోయె...
ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా...మా
మృతదేహాలే...హాహాకారాలే ఆర్తనాదాలే...
అయ్యో ! అయ్యో ఓ దైవమా !
ఎక్కడ దాగి ఉన్నావయ్యా !!
ఏమి చేస్తున్నావయ్యా..?ఎందరినో బలిగొన్న ఈ బాలాసోర్ రైలు ప్రమాదానికి...
బాధ్యులెవరయ్యా ఈ మారణహోమానికి?
ఇది ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వైఫల్యమా..?
ఇది విధి లిఖితమా?...మానవ తప్పిదమా?
ఇందరి జీవితాలను బలిగొన్న
ఆ దుష్టులకు...ఆ దుర్మార్గులకు
ఆ రాబందులకు...ఆ రక్తపిశాచులకు
నీవే కఠినమైన శిక్షను విధించి మా
న్యాయదేవత కళ్ళు తెరిపించండి తండ్రీ!
మృతుల ఆత్మలకు శాంతి కలుగునుగాక!
చిధ్రమైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యము
అందునుగాక ! త్వరగా కోలుకొందురు గాక
16. నచ్చని...నల్లని రంగు...!
ఎందుకో..."నల్లని"రంగు
ఎవరికీ ..,...నచ్చదు...కానీ
నలుపు వెనుక తెలుపు
ఓటమి వెనుక గెలుపు ఉంటుంది
"నల్లని" కాకి నచ్చదెవరికీ...
కారణం దాని అరుపు కర్ణకఠోరం...
తెల్లవన్నీ పాలు..."కావు కావు"
నల్లవన్నీ నీళ్ళు...."కావు కావు"
కష్టపడి ఆశపడి ఆర్జించిన
కోట్లేవీ నీవు..."కావు కావు"
కూడబెట్టిన ఆ ఆస్తులు
అంతస్తులు సిరిసంపదలేవీ
శాశ్వతం..."కావు కావు" అన్నదే
కాకి అందించే నిత్యసత్య సందేశం
కానీ కాటిలో ఆ నల్లని కాకే
కేక పెట్టగానే...వచ్చి వాలాలి
పెట్టిన పిండాన్ని ముట్టుకునేందుకు...
పెద్దల ఆత్మకుశాంతి కలిగించేందుకు...
దాచి ఉంటేనేమి..."నల్లధనం"
ఎక్కడో బ్యాంకు లాకర్లలో
చిమ్మచీకట్లలో స్విస్ బ్యాంకుల్లో
"తెల్లధనంగా" మారిపోవాలంటే...
కొన్ని "పెద్దనోట్లు" కళ్ళుమూసి
కలిసి పోకతప్పదు కాలగర్భంలో...
ఉంటేనేమి..."నల్లగా"..
క్లాసులో బోర్డు...ఆ "నల్లని" బోర్డు మీది
"తెల్లని" అక్షరాలే విద్యార్థుల జీవితాల్లో
రేపు నవ్యకాంతులు విరజిమ్మే నక్షత్రాలు
ఉంటేనేమి.."నల్లగా"..?
కొమ్మల్లో కోయిలమ్మ...
కుహూ కుహూ అంటూ
కూసిందంటే మనసున
విరిసేది... నవవసంతమే...
హృదయంలో ఉప్పొంగేది
ఉల్లాసమే...రోజంతా ఉత్సాహమే...
"నల్లని"...రాముని
"అల్లరి"...కృష్ణుని
"చల్లని"...దీవెనలుంటేనే కదా
ఈ మనిషి జీవితం ఓ
"తెల్లని"...మంచుపర్వతమయ్యేది...
అగాధమౌ జలనిధిలోన
ఆణిముత్యం ఉన్నట్లే...
శోకాల మరుగున దాగి
సుఖమున్నదిలే...అంటూ
ఓ కవి కమ్మగా పలికినట్లుగా...
ఒక సూర్యాస్తమయం వెనుక
ఒక సూర్యోదయముంటుంది...
"నల్లని" కారుచీకట్ల తెరల వెనుక
"చల్లని" వెన్నెల వెలుగు దాగి ఉంటుంది
17. మీరే పులులైతే..?
చిరుతపులులైతే...?
మీరు...జింకలైతే...
మీపై బాణాలు విసిరేందుకు...
మిమ్మల్ని గాయపరిచేందుకు...
వృక్షాల మాటున పొంచి ఉంటారు
రాక్షసులైన వేటగాళ్లు కొందరు
మీరు...జింకలైతే...
మమ్మల్ని వేటాడి
చిక్కితే చీల్చి చెండాడి
మీ రక్తాన్ని జుర్రుకునేందుకు...
తమ ఆకలిని తీర్చుకునేందుకు...
సిద్దంగా ఉంటాయి
చిరునవ్వులు చిందిస్తూ
చిరుత పులులు సింహాలు కొన్ని
కానీ మీరు
పులులైతే...
చిరుత పులులైతే
అందరూ మీకు గులాంలే...
చేస్తారు అందరూ మీకు సలాంలే...
మీరు పులులైతే...
చిరుత పులులైతే
"అడవికి రాజులు" మీరే
"మీకు ఎవరూ పోటి లేరే
నిజానికి పూజకెవ్వరు
పులులను సింహాలను
బలివ్వరు ఆకులను మేసే
అమాయకపు మేకల్ని తప్ప
అన్న "అమరజీవి అంబేద్కర్
"సందేశాన్ని" కలనైనా మరువరాదు
అందుకే...
బావిలో కప్పల్లా
చెరువులో చేపల్లా...
గూటిలో గువ్వల్లా...
కలుగులో ఎలుకల్లా...
పంజరంలో పక్షుల్లా...బ్రతకరాదు
సమస్యలెన్ని ఎదురైనా సరే
సముద్రంలో...స్వేచ్ఛగా
తిరిగే తిమింగలాల్లా....
అడవిలో...
గర్జించే సింహాల్లా...
గాండ్రించే పులుల్లా...
ఘీంకరించే గజరాజుల్లా...బ్రతకాలి...
18. ఏరులై పారిన నల్లధనం...?
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
మనువాదుల కలల్ని కల్లలు చేస్తు
కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది...కర్ణాటక
రహస్యంగా ఏరులై ప్రవహించెనట
ఓట్లకోసం కోట్లకోట్ల పెద్దనోట్ల కట్టలు
అందుకే ఒక్కసారి ఉలిక్కిపడ్డ
ఆర్.బి.ఐ హటాత్తుగా పెట్టిన
"2000 నోటు ఉపసంహరణ నిప్పుకు"
"బ్యాంకు లాకర్ల కలుగుల్లో " దాక్కున్న
"2000 నోట్లకట్టల చిట్టెలుకలు"
భయంతో బయటి కొచ్చేస్తున్నాయట...
ఊపిరాడక...ఉక్కిరిబిక్కిరైపోతూ...
ఔనీ కర్ణాటక ఎన్నికల ఫలితమే
"2000 రూపాయల నోటును"
కనుమరుగై పోయేలా చేసింది
కాకలు తీరిన కమ్మని పగటి కలలు కనే
రాజకీయనేతల గుండెల్లో గుబులురేపింది
19. కవిపోలన్న నోట..! ఓ కమ్మని మాట..!
ఓ ప్రియ నేస్తమా..!
నీ కష్టాలను ఇబ్బందుల్ని చెప్పి
ఎవరి కంట కన్నీరు తెప్పించకు...
నీ విజయ గాథలు వినిపించు...
యువతలో విజ్ఞానజ్యోతులు వెలిగించు...
ఓ ప్రియ నేస్తమా..!
నీ మొండివ్యాధుల్ని...నీ
కనిపించని రోగాల్ని ఎవరికి వినిపించకు... నీవు ఆనందంగా...ఆరోగ్యంగా సుఖంగా... సంతోషంగా...ఉన్న రోజుల్ని గుర్తుచేయ్...
ఓ ప్రియ నేస్తమా..!
అమృతాన్ని పంచు...విషాన్ని కాదు...
వినోదాన్ని పంచు.....విషాదాన్ని కాదు...
ఆనందాన్ని పంచు...దుఃఖాన్ని కాదు...
సంతోషాన్ని పంచు...సమస్యల్ని కాదు...
ఓ ప్రియ నేస్తమా..!
అనురాగాన్ని ఆత్మీయతను పంచు...
అహంకారాన్ని...అసూయను కాదు...
కరుణను ప్రేమను...త్యాగాన్ని పంచు...
కసిని ద్వేషాన్ని పగను ప్రతీకారాన్ని కాదు...
ఓ ప్రియ నేస్తమా..!
నిజాన్ని...నీతిని నిజాయితీని దాచకు...
నిరాశ పరచకు.....ఎవరినీ నిందించకు...
అబద్ధం చెప్పి ఎవరిని ఆనందపరచకు...
నిప్పులాంటి నిరాశ నిట్టూర్పుల్ని పంచకు...
ఉప్పొంగే ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచు...
20. ఖచ్చితంగా ఇచ్చి
తీరాలి "కరెంట్ షాక్"..?
ఎదుటి వారి
బ్యాడ్ బిహేవియర్ గురించి
ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా
ఎన్ని పచ్చి నిజాలు చెప్పినా
"అవేమీ తప్పులు కాదే" అంటూ
అన్నింటిని కొట్టి పారేస్తున్నారంటే అర్థం
అది వారి అజ్ఞానం కాదు
అది వారి అహంకారం కాదు
అది వారి అమాయకత్వం కాదు
అది ఒళ్ళంతా ప్రాకిన
పరుల విష ప్రభావమే...
వీరి మంచితనంపై
వారు చల్లిన మత్తుమందే...
వీరి అమాయకత్వంపై
వారు విసిరిన ఒక వలే...
వీరి మనసుకు తెలుసు
అవన్నీ నిజాలేనని కానీ ఒప్పుకోరే
కారణం వీరు వారిమీద
తమకు తెలియకుండానే పెంచుకున్న
అతి చనువు... అర్థంలేని అభిమానం...
వళ్ళంతా ప్రాకిన వారి
విషప్రభావం వీరి మీద ఉన్నంతకాలం
ఎవరు ఎన్ని మంచిమాటలు చెప్పినా
వీరు వినరు...వీరు మారరు
ముదిరిన వీరి
విచిత్రమైన
వింత ప్రవర్తనలో
మార్పు రావాలీ...అంటే
వీరి మత్తు పూర్తిగా దిగిపోవాలీ...అంటే
ఒక్కటే మార్గం...వీరికి
దిమ్మ తిరిగేలా...
మైండ్ బ్లాకయ్యేలా...
కళ్ళు బైర్లు కమ్మేలా...
కాళ్ళకింద భూమి కదిలేలా...
బుద్ధొచ్చేలా తప్పు తెలిసేలా...
జ్ఞానోదయమయ్యేలా గట్టిగా...
ఖచ్చితంగా ఇచ్చితీరాలి..."కరెంట్ షాక్"...
21. ఆదర్శ దాంపత్యం..? (చిత్రకవిత)
ఓ బుద్ధి లేని
ఓ వృద్ద దంపతులారా..!
అదిగో...ఆ జంటను చూడండి..!
ఒకరిని ఒకరు...ఎత్తుకుని
హృదయానికి...హత్తుకొని
మత్తుగా...గమ్మత్తుగా
ఆనందంగా...పరమానందంగా
తృప్తిగా...ఆత్మ తృప్తిగా
హాయిగా...ప్రశాంతంగా
సంతోషంగా ఒకరికి ఒకరు
తోడుగా ఒక నీడగా ఉంటూ...
సహనంతో...
సమానత్వంతో...
సర్దుబాటుగుణంతో...
మంచితనంతో మానవత్వంతో...
కడుపులోని కక్షలను
కడిగేసుకుంటూ...
ఆదర్శ దాంపత్యం వైపు
అడుగులేసుకుంటూ...
వున్న ఆ వృద్ద జంటను...
ఆదర్శంగా తీసుకుంటే తప్పేముంది?
ఆత్మతృప్తితో రేపు అస్తమించడం తప్ప...
22. ఓ పరిశుద్ద పావురమా !
నీకు పాదాభివంనం...
ఓ ప్రభువా !
ఓ ప్రేమగల మా తండ్రీ !
ఓ దైవకుమారా !
ఓ శాంతి స్వరూపా !
ఓ దయగల దైవమా !
ఓ కరుణామయుడా !
ఓ పరిశుద్ద పావురమా !
గొర్రెలమైన మాకు నీవే...గొప్ప కాపరివి
కుండలమైన మాకు నీవే...గొప్ప కుమ్మరివి
పాపులమైన మాకు నీవే...గొప్ప రక్షకుడివి
రోగులమైన మాకు నీవే...గొప్ప వైద్యుడివి
శత్రువుల చేజిక్కిన
మాకు...గొప్ప రక్షణదుర్గానివి
మా ఆకలి తీర్చిన...గొప్ప అమ్మవు
మా తప్పులు సరిదిద్దిన...గొప్ప తండ్రివి
బోధనలెన్నో చేసిన...గొప్ప బోధకుడివి
మా కష్టాలను కడతేర్చిన...
మా కన్నీళ్ళను తుడిచిన...
ఒక గొప్ప ప్రాణస్నేహితుడివి
తప్పులెన్నో తెలిసి చేసినా క్షమించి
కప్పలను...క్రూర విషసర్పాల నుండి
కోడి పిల్లలను...ఎగిరే గ్రద్దలు నుండి
మేకలను గొర్రెలను...తోడేళ్ళ నుండి
జింకలను...పులులు సింహాల నుండి
నీ భక్తులను...సైతాను శోధనల నుండి
నీ బిడ్డలను...ఆమృత్యువు కోరల నుండి
కాపాడినట్లు...
నీ ప్రాణాలను శిలువపై ఫణంగా పెట్టి...
నీ పవిత్ర రక్తాన్ని కలువరిగిరిపై చిందించి...
రోమన్ సైనికులు పెట్టిన చిత్రహింసలను...
చేసిన అవమానాలను...అవహేళనలను ...
చిరునవ్వులతో సహించి...
అనేక బాధలను భరించి...
శరీరం చిట్లి రక్తం చిందేల
కొరడా దెబ్బలెన్నో తిని...
కన్నీరు కార్చి...మమ్ము కాపాడిన
ప్రేమామయుడివి...త్యాగధనుడివి తండ్రీ!
అందుకే మీకు వందనాలు...
అభివందనాలు పాదాభివందనాలు...
23. గొడవ...పడవ...?
తెలిసి చేసినా...
తెలియక చేసినా
"తప్పు తప్పే...
అది..."ఆరని నిప్పే"
కుటుంబాలలో..."గొడవ"
ముఖాముఖి చర్చలతో
చిటికెలో మటుమాయం...
కానీ చెప్పిన మాటలు
చెవికెక్కపోతే...
అది చిలికి చిలికి...
గాలివాన...ఔతుంది
అపార్ధాలు ఏర్పడి
తేదిఅనుమానాలు ఎక్కువై
గోటితో పొయేదానికి గొడ్డలి
ఉపయోగించ వలసివస్తుంది...
చర్చలతో సరిదిద్దుకో కాకపోతే....
చిన్న చిల్లిపడిన
పెద్ద..."పడవ"
నీటిలో మునిగిపోయినట్లు...
పచ్చని కాపురంలో
"ఆరని చిచ్చు"రగులుతుంది...
"కుటుంబ పరువు"
నిలువునా కుప్పకూలిపోతుంది...
చేతులు కాలాక
ఆకులు పట్టుకోవలసి వస్తుంది...
24. శత్రువును ద్వేషించకు...ప్రేమించు...
నీ తలపైకెక్కి..వాడు
తైతక్కలాడుతున్నాడే...
శివతాండవం చేస్తున్నాడే...
అదును చూసి నిన్ను
అధఃపాతాళానికి తొక్కేస్తున్నాడే...
నిన్ను లెక్కచేయకున్నాడే
తిక్కశంకరుడంటూ గేళి చేస్తున్నాడే...
వాడు నీకు బద్దశత్రువు కాదా..?
వాని తప్పులు వాడు తెలుసుకునేదెప్పుడు? వానికి
జ్ఞానోదయం కలిగించేదెప్పుడు..?
కనువిప్పు కలిగించక
వాడినెందుకు క్షమిస్తున్నావ్..?
అది నీ మంచితనమా నీ పిరికితనమా..?
వాడు కఠినమైన శిక్షకు అర్హుడు మరి
వాన్నెందుకు నిర్దోషిగా వదిలేస్తున్నావ్..?
వానికెందుకు గుణపాఠం నేర్పకున్నావ్..?
ఔను మిత్రమా..!
నీ నిందలో నిజమున్నది కానీ
ఒక బాంబుపెట్టిన పార్సల్ ని
"స్వీకరిస్తే"... నీవు బలి కావచ్చు
కానీ తిరిగి దాన్ని..."రిటర్న్ పంపిస్తే"
పంపినవాన్నే అది బలి తీసుకోవచ్చు
ఇదే స్థితప్రజ్ఞుడైన సిధ్ధార్ధుని సత్యసందేశం...
ఒకని అజ్ఞానమే...
ఒకని అహంకారమే...
వాన్ని దహించే అగ్నిగుండాలు...
ఒకని "పాపానికి జీతం" మరణమే...
ఇదే పవిత్రగ్రంథం ప్రవచించే దివ్యప్రబోధం...
అందుకే ఓ నా ప్రియమిత్రమా..!
నీవు కన్నుమూసి కాటికెళ్ళేలోగా
నీ శత్రువుల్ని మిత్రులుగా మార్చుకుని
ప్రశాంతంగా సమాధికి చేరు...
బద్దశత్రువులు సైతం
స్మరించాలి నిత్యం నీ పేరు....
25. పాదాభివందనం...ఎందుకు..?
గౌరవనీయులైన
సంపాదక శిఖామణులకు
శిరసు వంచి నమస్కరిస్తూ...
మా కవితలకు చెబుతున్నాం
మీకు..."పాదాభివందనం" చేయమని...
ఎందుకు..? నిస్వార్థంగా
మీరు"అక్షరయజ్ఞం" నిర్వహిస్తున్నందుకు
స్వచ్చందంగా"సాహితీసేవ" చేస్తున్నందుకు
మా కవితలకు...
జన్మనిచ్చినందుకు...
చక్కగా...తీర్చిదిద్దినందుకు...
వెలుగులోనికి...తెచ్చినందుకు...
అందంగా...ఆకర్షణీయంగా...
చూడగానే చదవాలపించేలా...
అద్భుతంగా డీసెంట్ గా డిజైన్ చేసి
"అక్షరాలకు ఆయువు"...పోసినందుకు...
సహృదయంతో....స్పందించినందుకు...
సందేశాత్మకమైన చక్కని కవితలను
పాఠక దేవుళ్ళకు...అందించినందుకు...
మా కలాలకు బలాన్ని...
మా కవితలకు ఆదరణను...
మా ఔత్సాహిక కవులందరికి
మంచి...ప్రోత్సాహాన్నిచ్చినందుకు...
కవులను ఆదరించిన పత్రికలే
కలకాలం బ్రతుకుతాయన్న నమ్మకంతో
దివ్యమైన శతకోటి దీవెనలు మీపై మీ
సిబ్బందిపై కుంభవర్షమై కురవాలని మీకు
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలనందించాలని
ఆ పరమాత్మను ఆశతో అర్థిస్తూ...ప్రార్థిస్తూ
26. కవి పోలన్న నోట..!
ఓ కమ్మని మాట..!
జాలికి...సానుభూతికి
జోలెపట్టకు...గోలపెట్టకు..!
ప్రేమలేని పలకరింపులకు
ఎన్నడూ పులకరించిపోకు..!
బ్రతుకు భారమనే చోటుకు
వీలైనంత దూరంగా ఉండు..!
నిన్ను దూరంగా నెట్టే వారిని
అతుక్కు పోవాలని ఆశించకు..!
నీ నీతికి నిజాయితీకి విలువలేని
చోట ఒక్క నిముషమైనా నిలవకు..!
నీ ఆత్మాభిమానమే నీకు ధనం గొప్ప
ఇంధనం అని అనుదినం గుర్తుంచుకో..!
నీకై ఎదురు చూడని...గౌరవించని ఇంటికి ముఖ్యఅతిథిగా వెళ్ళడం నీ మూర్ఖత్వమే!
నీది...కానిదేదీ...నీకు దక్కదని తెలిసీ
ముక్కోటిదేవతలకు మ్రొక్కడం వెర్రితనమే!
అన్నపోలన్న నోట ! పలికే ఓ మంచిమాట !
అది నిత్యసత్యాల ఆణిముత్యాల మూట !
27. ఇది నిజం నమ్మలేని పచ్చినిజం...?
మడిలో...ఉంటారు
మండుటెండల్లో
చెమటలు కార్చి కార్చి
మట్టిని మెతుకుగా మార్చి మార్చి
ఆకలిమంటలు తీర్చేటి అన్నదాతలు
బడిలో...ఉంటారు
నేటి బాలలను రేపటి డాక్టర్లుగా...
లాయర్లుగా...లక్షాధికారులుగా...
కలెక్టర్లుగా... సినీయాక్టర్లుగా
కంప్యూటర్ ఇంజనీర్లుగా...
సైనికులుగా... సైంటిస్టులుగా...
భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది
బంగారు భవిష్యత్తును ప్రసాదించే
గురువులనే...జ్ఞానసూర్యులు
గుడి...ముందు ఉంటారు
గుంపులు గుంపులుగా
కళ్ళు కాళ్ళు లేని అనాధలు
ఏ ఆధారం లేని
ఎగరలేని గాలిపటాలు
రెక్కలు విరిగిన పక్షులు
ఆకలికి అలమటించే బిక్షగాళ్ళు
గుడికెళ్ళే...వచ్చే...
భక్తులను ప్రాధేయపడతారు
ఇంత "చిల్లర" వేయమని...
కానీ గర్భగుడిలో కొలువైవున్న
ఆ "భగవంతున్ని" వేడుకోరు
తమ "బ్రతుకుల్ని" బాగుచేయమని...
ఇదేమి వింతో ఎంతకూ అర్థం కాదు...
కానీ బిక్షగాళ్ళు బిల్ గేట్స్ గా మారేది
దశ తిరిగితేనే ఏదైనా లాటరి తగిలితేనే
28. శిలువ శిక్ష ...ఎవరికి...? (పార్టు...1)
మత్తయి సువార్త...
5వ అధ్యాయం...
28వ వచనం...
ఒక స్త్రీని మోహపు చూపుతో
చూచు ప్రతివాడు అప్పుడే
తన హృదయమునందు ఆ స్త్రీతో
"వ్యభిచారం" చేసినవాడగును
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర
పరచిన యెడల దానిని
వెంటనే పెరికి వేయుము
నీ దేహమంతయు
నరకంలో పడుటకంటే
నీ అవయవాలలో ఒకటి నశించుట
నీకు ప్రయోజనకరమే కదా ...
ఔను గీతదాటిన జంటలకు...
దారితప్పిన భార్యాభర్తలకు...
బైబిల్ ఇచ్చే బంగారు సందేశమిదే
అలాగే...ఒక పరపురుషున్ని
ఆనందపరచాలన్న
ఆకర్షించాలన్న చెడుభావనతో
అందాలు ఆరబోసేందుకు
కొత్త పెళ్ళికూతురులా
అందంగా అలంకరించుకొని
మాటలులేవని
మదనపడుతూ...
కనిపించకపోతే
కలవరపడుతూ...
ఎక్కడైనా
ఎప్పుడైనా
ఎదురుపడితే
ఎగిరి గంతేస్తూ...
పరులకంట పడాలని
తపనపడుతూ...
దూరం నుండే
సిగ్గూ లజ్జా లేకుండా
దొంగచూపులు చూస్తూ
ముసిముసి నవ్వులు నవ్వుతూ
తాను మానసికానందం పొందుతూ
ఇతరులు సైతం పొందాలని
ఆశపడే...ఆరాటపడే మెట్లమీద
అటు ఇటు తచ్చట్లాడే...ప్రతిఆడది
అప్పుడే తన హృదయమునందు
భర్తను "దగా"... చేసినదగును
అప్పుడే తన సంసారాన్ని తానే
"తగలబెట్టు"...కున్నదగును
అప్పుడే తన కాపురంలో తానే
"నిప్పులు"...పోసుకున్నదగును
ఇది 1000% నిజం పచ్చినిజం...
నక్కినక్కి నిక్కినిక్కి
చూసే ఆ మోహపు చూపులే
ఆ దొంగ చూపులే
ఆ వక్ర బుద్ధే ఆ వంకర చూపులే
మదిలో దూరిన ఆ చెడు ఆలోచనలే
తలలో దూరిన ఆ తప్పుడు తలంపులే
నాశనానికి నరకానికి నిలువెత్తు నిచ్చెనలు
తెలిసీతెలిసీ తప్పులు చేస్తూ...
తెలియనట్లు పైకి నటిస్తూ...
భర్తలను దారుణంగా...దగా చేస్తూ...
ఘోరంగా...మోసం చేస్తూ...
భర్తలను...భారంగా భావిస్తూ...
మానసికంగా...భర్తలకు
బహుదూరంగా...ఉంటూ...
కళ్ళు పొరలు కమ్మి
ఏదో మత్తులో మునిగి
నీతితప్పి అతినీచంగా ప్రవర్తించే
ప్రతిఆడదాని బ్రతుకులో
కురిసేది..."నిప్పులవానే"...
"ఆ వగలాడి"...
"ఆ నంగనాచి"...
"ఆ కీలుబొమ్మ"...
"ఆ బలహీనురాలు"...
తన...పచ్చని కాపురంలో తానే
ఆరని చిచ్చు...పెట్టుకుంటూ...
తాను...కూర్చున్నకొమ్మను తానే
నవ్వుతూ...నరుక్కుంటూ ...
నలుగురిలో...నవ్వుల పాలౌతూ...
తన...కంటిని తానే పొడుచుకుంటూ...
తన...అందమైన జీవితాన్ని తానే
అంధకారంలో...ముంచుకుంటూ...
అందరితో ఛీఛీ...అనిపించుకుంటూ...
ఆపై చేతులు కాలాక
ఆకులు పట్టుకుంటుంది
ఆవేదన చెందుతుంది
మంచి చెప్పిన భర్తను
మానసికంగా బాధ
పెట్టినందుకు
కుమిలి పోతుంది
కృంగి పోతుంది
చేసిన హెచ్చరికలన్నీ
నిజమేనని తెలియగానే
కుళ్ళికుళ్ళి ఏడుస్తుంది
చీకటి పడగానే చింతించి
చింతించి చితికి చేరుతుంది
ఇదే ఇదే...
భర్తలను మోసంచేసే భార్యలకు
ఆ భగవంతుడు బహిరంగంగా
విధించే భయంకరమైన "శిలువశిక్ష"...
29. ప్రేమా గీమా...? పెళ్లీ గిళ్ళీ...అంటే..?
పొంగి పొంగిపోయింది
...ప్రేమ ప్రేమ అనగానే...
తుళ్ళి తుళ్ళి పడింది
...పెళ్లి పెళ్లి అనగానే...
చెంగు చెంగున దూకింది
...చేయి చేయి కలపగానే...
మురిసి మురిసి పోయింది
...ముద్దు ముద్దు అనగానే...
దూరి దూరి పోయింది దుప్పట్లో
...సారీ సారీ అంటూనే...
కరిగి కరిగి పోయింది కౌగిట్లో
...కస్సు బుస్సు మంటూనే...
కళ్ళు తెరిచి చూసింది
...మెల్లగ మెలకువ రాగానే...
ఒళ్ళు విరిచి లేచింది
...తెల్లగ తెలవారగానే...
క్రుంగి క్రుంగిపోయింది
...ప్రేమా గీమా అనగానే...
కుళ్ళి కుళ్ళి ఏడ్చింది
...పెళ్లీ గిళ్ళీ అనగానే...
అయ్యో ఓ దైవమా !
ఏమిటి ఈ అగ్నిపరీక్ష...
నాకే ఎందుకీ శిలువశిక్ష...
నిన్న నేను దేవతనట...
నేడొనొక దయ్యాన్నట...
నిన్న నా ప్రేమ
ఒక తేనెచుక్కట...
నేడది విషపుచుక్కట...
నిన్న...నా ప్రియుడు
ఒక రాముడు ఒక రక్షకుడు
కానీ నేడు...వాడొక రావణుడు
ప్రేయసి రక్తాన్ని త్రాగే రాక్షసుడు...ఔను
ఇది ఒక అమాయకపు ఆడపిల్ల ఆక్రందన
30. తులసి అక్కతో...కలిసి నడుద్దాం...
ఒక కిరణ్ బేడీలా...
ఒకే ఝాన్సీ రాణిలా...
ఒక పూలన్ దేవిలా....
ధైర్య సాహసాలే ఊపిరిగా...
స్వతంత్ర సీనియర్ జర్నలిస్టుగా...
మీడియారంగంలో ఒక ప్రభంజనమై...
నిప్పులాంటి నిజాలను...నిక్కచ్చిగా
నిర్భయంగా...వెలికితీస్తూ...
తప్పులు చేసిన వారికి
కనువిప్పు కలిగించేలా...
ఆత్మవిమర్శ చేసుకునేలా...
వీడియోలతో విరుచుకుపడుతూ...
సునామీలను సృష్టించే
తులసి చందు...అక్క
మీడియా జర్నలిజంలో
మొలిచిన తులసి...మొక్క...
ఐతే మొక్కే కదాని
పీకేస్తే పీకలు కోసేస్తాం అన్నది
ఒక సినిమా డైలాగ్ కావచ్చు
కానీ నేడు అక్క వారికి...
కాలిలో ముళ్ళైంది...
కంటిలో కారమైంది...
గుండెల్లో గునపమైంది...
ప్రక్కలో బల్లెమైంది...
మనువాదుల పాలిట
ఒక సింహస్వప్నమైంది...
అందుకే చాటు మాటుగా
ఈ వేధింపులు...ఈ బెదిరింపులు
ప్రశ్నించే కలాలను గళాలను
అన్యాయాలను అక్రమాలను
ప్రతిఘటించే వ్యక్తుల్ని
బెదిరించే అరాచకశక్తుల
గుండెల్లో నిదురించాలి...
యువతీ యువకులు...
మహిళా సంఘాలు...
మానవతావాదులంతా...
తులసి అక్కకు మద్దతునివ్వాలి...
తక్షణమే రక్షణ కవచమై నిలవాలి...
31. మీ ఈ సేవా యజ్ఞం...?
స్వార్థానికి అర్థం
తెలియని ఓ నా నేస్తమా !
మీకు వందనం!! అభివందనం!!!
మీ కనుల నిండా
కమ్మని కలలే పండాలని...
నీ హృదయం నిండా
ప్రేమ పొంగి పొర్లాలని...
మీ గుండెల నిండా
పచ్చని ఆప్యాయత
అనురాగాలు చిగురించాలని...
మీ నాలుక నవ్వాలని...
మీ హృదయం గంతులు వేయాలని...
మీ పెదవులు ప్రేమను చిలకరించాలని...
మీ ముఖంలో చిరునవ్వు ప్రకాశించాలని...
మీ అభయహస్తాలు భుజం తట్టాలని...
మీ పాదాలు నిరుపేదల ఆకలి
తీర్చేందుకు పరుగులు పెట్టాలని...
ఈ శుభకార్యక్రమాల
నిర్వహణకు మీకు
మంచి మనసును...
చక్కని శక్తిసామర్థ్యాలను...
సంపూర్ణమైన ఆరోగ్యాన్ని...
ఆ పరమాత్మ...ప్రసాదించాలని...
ప్రార్ధిస్తూ...ఒకే ఒక కోరిక కోరుతున్నా...
మీరు ...
ఈ సేవాయజ్ఞంలో...
ఆగిపోరాదని...
అలసిపోరాదని...
ఎన్ని ఎదురు
దెబ్బలు తగిలినా...
ఎన్ని ఆటంకాలు
అవాంతరాలెదురైనా...
నిర్విరామంగా...
నిరంతరాయంగా...
కడవరకు కడతేరే వరకు...
సాహసంతో సాగపోవాలని...
మనసారా కోరుకుంటూఉన్న...
32. ఒక దీపం..! ఒక జీవితం..!!
ఎక్కడ...
ఒక దీపం
స్థిరంగా...
నిర్మలంగా...
నిశ్చలంగా ...
నిర్విరామంగా...
జాజ్వల్యమానంగా...
వెలుగులు
విరజిమ్ముతుందో...
అక్కడ...
హోరుగాలి లేనట్లే...
ఇంధనమింకా ఉన్నట్లే...
చిమ్మచీకట్లు కమ్ముకోనట్లే...
ఎప్పుడు...
ఒక మనిషి మనసారా
నవ్వుతూ...త్రుళ్ళుతూ
ఉత్సాహంగా... ఉల్లాసంగా
అంతులేని సంతోష సాగరాన...
హాయిగా ఈదులాడుతూ ఉంటాడో...
అప్పుడు...ఆ మనిషి
హృదయం నిస్వార్థంతో...
నిష్కల్మషంతో...నిండి ఉన్నట్లే...
ప్రేమ వాత్సల్యం పొంగిపొర్లుతున్నట్లే...
అసూయ ద్వేషం పగా ప్రతీకారం లేనట్లే...
33. అదే కాలచక్రం...
అదే అనుభవచక్రం...
నిన్న
ఎవరో
అర్జించినది
నేడు నీదైనది
నీవు చట్టపరంగా
సంపూర్ణ క్రయ విక్రయ
సర్వహక్కులతో హాయిగా
దాన్ని అనుభవిస్తూఉన్నావు
కానీ
నేడు నీవు
మురిసిపోతూ...
ముచ్చటపడుతూ...
కమ్మని కలలు కంటూ...
కళ్ళతో చూసుకుంటూ...
నాది నాది అనుకుంటూ...
ఎంతగానో ఆశపడి శ్రమపడి...
భ్రమపడి కష్టపడి ఆర్జించింది...
ఆనందంగా అనుభవిస్తున్నది...
రేపు ఎవరికో సొంతమైపోతుంది...
వారు దాన్ని తృప్తిగా అనుభవిస్తారు...
వారే అదృష్టజాతకులు...స్వాములు...
వారే చీమలపుట్టలో దూరిన పాములు...
అదే కాలచక్రం...అదే అదే అనుభవచక్రం...
34. క్షణికమే ఈ జీవితం...
జీవితం...
ఒక "నీటి బుడగ"
క్షణంలో పుట్టి
మరుక్షణంలో మటుమాయం...
జీవితం...
ఒక "మంచు ముక్క"
మన కళ్ళముందే కరిగిపోతోంది...
జీవితం...
ఓ రంగుల "కల" కమనీయం...
రమణీయం...సప్తవర్ణ శోభితం...
జీవితం...
ఎగిసిపడే ఒక "అల"...
కడలితీరం చేయాలన్నదే...దాని"కల"...
జీవితం...
శిథిలం...కాని ఒక "శిల"
అది సుందర శిల్పమైతే...
పది కాలాలపాటు పదిలం...పదిలం...
జీవితం...
ఎంత మధురం సుమధురం...సుందరం...
నవనీతం...నవవసంతం...నందనవనం...
ఉంటే పచ్చపచ్చగా...పదిమంది మెచ్చగా ...
ఔను ఈ జీవితం...
క్షణికమే...క్షణికమే...క్షణికమే...
అది ఆ పరమాత్మ...వరప్రసాదితమే...
35. నీవు వీరుడివా..?
ఉత్తర కుమారుడివా..?
ఓ నేస్తమా ! చరిత్ర చెబుతున్న
ఓ నగ్నసత్యాన్ని వినిపిస్తున్న వినుమా !
నీవొక క్రీడాకారుడవైతే...
అంకిత భావంతో అకుంఠితదీక్షతో
కఠోర సాధనతో గెలుపే ఏకైక లక్ష్యంగా
బరిలోకి దిగి ప్రత్యర్థులను మట్టి కరిపించి
వీరుడులా...శూరుడిలా...విక్రమార్కుడిలా పోరాడి...పోరాడి...ఓడిపోతే
నీవు కార్చే "కన్నీటి చుక్కలే "
నీ కాళ్లకు మ్రొక్కుతాయి...
తమను క్షమించమని...
ఊటలా ఉప్పొంగి నేల రాలినందుకు...
ఒక్క "కన్నీటి సందేశాన్ని" అందిస్తాయి
రేపు బంగారు పతకాలు...
సన్మానాలు సత్కారాలు...
కీర్తి కిరీటాలు నీకే దక్కుతాయని...
అది "ఓటమే" కాదు రేపటి
నీ "ఘనవిజయానికి" ఒక రాచబాటని...
కానీ
నీ ప్రత్యర్థి కంటి
చూపులకే భయపడి
ఒక "పిరికిపందలా"
ఒక "ఉత్తర కుమారుడిలా"
నీవు పోటీ నుండి పారిపోతే
నీవు చేసిన సాధనలే...నీ శిక్షణలే
నీ చిరునవ్వులే నిన్ను "ఛీ"కొడతాయి
నీ పరువుప్రతిష్ట గంగలో కలుస్తుంది
ఏ పతకాలు నీవు సాధించలేవు
క్రీడాకారుడిగా నీవు కీర్తిని గడించలేవు
అపకీర్తి అవమానమే చివరికి నీకు దక్కేది
అందుకే ఓ నేస్తమా !
ఎన్ని అవాంతరాలు ఎదురైనా
కష్టాలను కన్నీళ్లను తట్టుకొని...
ఎదురీదేవాడే ఆవలి తీరం చేరేది...
ప్రాణాలకు తెగించి కూరుకుపోయే
మంచుతుఫాన్లను సైతం లెక్కచేయక
సాహసంతో ముందుకు సాగిపోయేవాడే
ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేది...
36. ఓ యువతా మేలుకో...!
నీ దేశాన్ని ఏలుకో...!
ఈ భారాతదేశ ప్రగతికి...
"పట్టుగొమ్మలు"...యువత...
ఈ దేశప్రతిష్టకు..."ఊపిరి" యువత...
అందుకే పాశ్చాత్య ఫ్యాషన్
డిజైనింగ్ కు బానిసలైపోయిన
ఓ భారతీయ యువతీయువకుల్లారా..!
మీ ఈ ఆసక్తి...
మీ ఈ శ్రద్ద చదువు మీదుంటే...
మీ ఈ అంకిత భావం...
భారతీయ సంస్కారంపై ఉంటే...
మీ భవిష్యత్తు బంగారుమయమే కదా...
వెయ్యి కాకడాలెట్టి విశ్వమంతా వెతికినా...
మన సంస్కృతి సంప్రదాయాల కన్న...
మన భారతీయ సనాతనధర్మం కన్న...
ఆమోదయోగ్యమైనవి...
విలువైనవి...విశిష్టమైనవి...
పవిత్రమైనవి...స్వచ్చమైనవి...
అందమైనవి...సుందరమైనవి...
మధురమైనవి...మనోహరమైనవి...
లేవు లేవని...గొంతెత్తి అరిచి అరిచి
చెప్పేది ఎవరు ? చెబితే వినేదెవరు ?
ఈ నాగరిక సమాజం మారేదెన్నడు ?
పాశ్చాత్య దేశాల ఆధునిక
ఫ్యాషన్ డిజైన్లంటే పడిచచ్చే...
ఓ భారతీయ యువతీయువకుల్లారా...
మీ అంతరాత్మలో...మీ ఆలోచనల్లో...
ఆశించినంత మార్పు...రానంతకాలం...
ఎన్ని చట్టాలు శాసనాలు చేసి లాభమేమి?
ఓ భారతీయ యువతీయువకుల్లారా..!
తల్లి భారతమాతకు ముద్దు బిడ్డలు మీరే
మెళ్ళో హారాలు తలపై కీర్తి కిరీటాలు మీరే
ఆ తల్లి నుదుట రక్త తిలకం దిద్దాలి మీరే
అందుకే...కాస్త మనుషులుగా మారండి..!
37. రాజకీయం...
ఒక రావణకాష్టం...? అదే
రాజకీయం...ఒక ఊబి...
రాజకీయం...ఒక ఇంద్రజాలం...
రాజకీయం...ఒక లక్కీ ఛాన్స్...
రాజకీయం...ఒక లక్కీ లాటరీ...
రాజకీయం...ఒక ఎండమావి...
రాజకీయం...ఒక రావణకాష్టం...
రాజకీయం...ఒక ఇంద్రధనుస్సు...
నేడు వాళ్ళు శత్రువులై...
చెప్పులూపుకుంటారు...
వీలైతే విసురుకుంటారు...
వేదికలెక్కి తిట్టుకుంటారు...
కార్యకర్తలు కొట్టుకుంటారు...
నేడు వాళ్ళు
ఒకరి మీద ఒకరు
నూరుకుంటారు కత్తులు...
వేస్తారు ఎత్తులకు పైఎత్తులు...
కొందరు తొత్తులు చపలచిత్తులు...
నిన్నటి బద్దశత్రువులే...
రేపటి ప్రాణమిత్రులై...
పెట్టుకుంటారు పొత్తులు...
ఇచ్చుకుంటారు పూలగుత్తులు...
కప్పుకుంటారు కాశ్మీర్ శాలువలు...
మద్దతిస్తారు...మాయగాళ్ళు...
అందిస్తారు...అభయహస్తాలు..
ఆపై పంచుకుంటారు...పదవుల్ని...
తీర్చుకుంటారు...అధికారదాహాన్ని...
అందుకే ఓ మిత్రమా !
నమ్మకు...నమ్మకు...
రాజకీయ రాబందులను...
కడుపులో కత్తులుంచుకొని ...
కౌగిలించుకునే కసాయిగుండాలను...
38. పెద్దలు...కార్పోరేట్ గ్రద్దలు..?
ఎందరెందరో...
దేశభక్తులు...త్యాగధనులు....
స్వాతంత్ర సమరయోధులు...
గాంధీజీ పిలుపునందుకొని....
త్రివర్ణ పతాకాన్ని చేబూని.....
జై భారత్ అంటూ జైళ్ళలో మ్రగ్గారే...
వందేమాతరమంటూ నేలకొరిగారే...
ఉప్పెనలై ఉద్యమాలకు ఊపిరి పోశారే...
ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారే....
బ్రిటిష్ సైన్యంతో భీకర పోరాటం చేశారే...
అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని అందించారే...
తెల్లదొరలను తరిమేశారే...ఆపై ఏమైంది ?
నల్లదొరలు గద్దెనెక్కారే...ఎటు చూసినా
మతం ముసుగులో మారణహోమాలే...
కులం కుంపట్లే కులంపేర కుమ్ములాటలే...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని... అంబేద్కర్ స్వేదం చిందించి అందించిన భారత రాజ్యాంగం ఒక రక్షణ కవచమని...
నాడు ప్రశంసల జల్లులు కురిపించారే...
నేడు బడుగు బలహీవర్గాలకు
అమరజీవి అంబేద్కర్ అందించిన
రిజర్వేషన్లనే రాజ్యాంగ రక్షణకవచాలను
సవరణల పేరుతో సమాధి చేస్తున్నారే...
ఇదేమి న్యాయం ?ఇదేమి ధర్మం ?
ఇదేమి ప్రభుత్వం?ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
బడా బాబులు స్విస్ బ్యాంకులో
దాచుకున్న లక్షల కోట్ల నల్లధనాన్ని
రప్పించి ప్రజలకు పంచేస్తామన్నారే...
ఆ వాగ్దానాలను నల్లదొరలు మరిచారే...
రాజ్యాంగాన్ని తమకనుకూలంగా మార్చుకుంటూ ప్రజాస్వామ్యం పేరుతో
నియంతృత్వ పాలన సాగిస్తున్నారే...
లాభాల బాటలో నడిచే ఎన్నో భారీ ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్ గద్దలు
తన్నుకు పోతూవుంటే ప్రభుత్వాధినేతలు
కళ్ళకు గంతలు కట్టుకున్నారే...
పన్నులరూపేన ప్రజలనడ్డి విరుస్తున్నారే...
ఇదేమి న్యాయం ? ఇదేమి ధర్మం ?
ఇదేమి ప్రభుత్వం?ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
అబ్రహం లింకనే
ఆశ్చర్యపోయేలా...
కార్పొరేట్ సంస్థల చేత
కార్పొరేట్ సంస్థల కొరకే
కార్పొరేట్ సంస్థలే కోరిన
ప్రభుత్వ పరిపాలన అంటూ
ప్రజాస్వామ్యం అర్థాన్నే మార్చేశారే...
ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారే...
ప్రతిఘటించే కలాలకు సంకెళ్లేస్తున్నారే...
ఇదేమి ధర్మం ? ఇదేమి న్యాయం ?
ఇదేమి ప్రభుత్వం? ఇదేమి ప్రజాస్వామ్యం?
విజ్ఞులారా ! వినండి !
మేధావులారా ! మేల్కొనండి !
యువకుల్లారా ! ఆలోచించండి !
ప్రజాస్వామ్యవాదులారా ! ప్రశ్నించండి !
39. మూర్కులు..? మూగజీవులు..?
(చిత్ర కవిత)
వావ్...వావ్...
ఆహా ఏమిఈ అద్భుతం..!
ఇది ఎంతటి వింత సృష్టి..!
ఎవరు నేర్పారు
ఆ మూగజీవులకు..?
అలా తమ కడుపున
పుట్టిన ఆ బిడ్డలకు
తిండి తెచ్చి పెట్టాలని..?
అలా కాళ్ళతో మట్టి కప్పి
వాటిని దాచి పెట్టాలని..?
శత్రువుల దాడి నుండి
పిల్లల్ని కాపాడుకోవాలని..?
ఆహారం ఎక్కడుందో వెతికి
పట్టుకోవాలని...తెచ్చుకోవాలని
పిల్లలకు...సమంగా పంచాలని..?
పిల్లలను...ప్రేమతో పెంచాలని..?
ఓ దైవమా !
నీ సృష్టి మర్మాలను...
ఈ ప్రకృతి ధర్మాలను...
తు.చ.తప్పక పుట్టిన ప్రతిజీవి
ఆచరిస్తున్నదే...మరెందుకు
ఈ మానవజాతి మరిచిపోతున్నది..?
ఓ దైవమా ! ఈ భూమిపై
ఒకడు త్రాగుడుకు బానిసై
కడుపుమాడ్చి కట్టుకున్న భార్యను...
కన్నబిడ్డలను కాటికి పంపేస్తున్నాడే..!
మాయలో మత్తులో బ్రతికేస్తున్నాడే..!
ఆ మూగజీవుల నుండి...ఈ మూర్ఖులు
ఎప్పుడు "గుణపాఠాలు" నేర్చుకుంటారు..?
ఎప్పుడు "జీవితాలు"....మార్చుకుంటారు..?
40. ఇదే ఇదే "మీ నాన్న" చివరి కోరిక...?
యాదికి తెచ్చుకో బిడ్డా !
ఒక్కతూరి నీ బాల్యంలో
నీవు "నా ఈ గుండెల"
మీదనే...ఆడుకున్నావు
అల్లరి చేష్టలు చేసి చేసి
అలిసిపోయి...పడుకున్నావు
నీ నునులేతపాదాలతో
నా ఈ గుండెల మీదనే…తన్నావు
ఆ "తీపిజ్ఞాపకాలింకా " చెరిగిలేదు
నిన్ను నా భుజాల మీద
ఎత్తుకొని నీవు
"ఎవరెస్టు" శిఖరమంత
ఎత్తుకు ఎదగాలని నీవు
"తండ్రికి తగ్గ తనయుడుగా"
"బాధ్యతగల పౌరుడిగా" బ్రతకాలని ఎన్ని
"కమ్మని కలలు" కన్నానో...నీకు తెలియదు
ఈ గుండెల్లో ఎన్ని "అగ్నిపర్వతాలు"
బ్రద్దలయ్యాయో...నీకు తెలియదు
ఈ గుప్పెడు గుండెలో ఎన్ని
"ఆశలు" దాగున్నాయో...నీకు తెలియదు
ఒక్కసారి విను బిడ్డా !
నా గుండెలోని "లబ్ డబ్ శబ్దం"
నీ కోసం నీ "బంగారు
భవిష్యత్ భవననిర్మాణం" కోసం
నేనెంతగా "తపించానో "...ఎంతగా
"తల్లడిల్లి పోయానో " తెలుస్తుంది...
ఓ నా బంగారు బిడ్డా !
నా "ఆశ" ఒక్కటే...
నన్ను ఏ ఆనాధాశ్రమంలో
ఒక "అనాధగా" చేర్చకు...
నా గుండెల్లో "గునపాలు"
గుచ్చకు నేను భరించలేను...
ఓ నా బంగారు బిడ్డా ! నీవెప్పుడూ
"తప్పుడు పనులు" చేయకు...
నాకు..."తలవంపులేవీ"...తేకు...
నా "పరువును" నిలువునా చెట్టులా
నరికి వేయకు...నేను తట్టుకోలేను.
ఓ నా బంగారు బిడ్డా !
మీ నాన్న చిట్టచివరి " కోరిక "ఒక్కటే...
నా ఈ గుప్పెడు గుండెను " పిండిచేయకు"
నిజానికి "నలిగి పోయేది" నేను కానేదు
నా గుండె నిండా వున్న " నీ ప్రతిరూపమే "
41. పిచ్చి కోపం వద్దు..!
చల్లని చిరునవ్వే ముద్దు..!
ఎక్కడుంటుంది
పిచ్చి కోపం..?
ఎరుపెక్కిన నీ కళ్ళలోనా..?
బిగుసుకున్న నీ పిడికిలిలోనా..?
అయితే
నీ కళ్ళకో దండం..!
నీ పిడికిలికో దండం..!
ఎక్కడుంటుంది
చల్లని చిరునవ్వు..?
కదిలే పెదవులలోనా..?
వెలిగే నీ ముఖంలోనా..?
నీ పెదవులకు వందనం..!
నీ ముఖానికి అభివందనం..!
నిజానికి మన
కళ్ళలో...పిడికిలిలో...
రగిలే...కోపానికైనా..!
పెదాలపైన...ముఖాన...
వెలిగే...చిరునవ్వుకైనా..!
మూలకారణం
మన హృదయంలో
రేగిన పగా ప్రతీకారమే..!
దాగిన ప్రేమ మమకారమే..!
అందుకే...
పగను తృంచే...
ప్రేమను పంచే...
ఆ "హృదయ దేవతకు"...
వందనం..! వందనం..!! అభివందనం..!!!
42. ధన్యమే ధన్యమే..!
నీజన్మ ధన్యమే..!!
ఓ నా ప్రియమిత్రమా..!
ఓ మంచిమాట చెబుతా వినవా..!
నీ ప్రాణమిత్రులే కాదు
నీ బద్దశత్రువులు సైతం
నీవు ప్రేమకు ప్రతిరూపమని...
స్నేహశీలివని...ప్రతిభాశాలివని ...
ధర్మదాతవని...దయాసముద్రుడవని నీతిమంతుడవని...నిప్పులాంటివాడివని మంచివాడవని మానవత్వమున్నవాడివని
మచ్చలేని స్వచ్చమైన
వ్యక్తిత్వం గల వాడివని...నిజానికీ
నీవు అందరికీ దేవుడవని...అందరి
గుండెల్లో దాగివున్న ఆరనిజ్యోతివని...
నీ ఈ అకాలమరణవార్త జీర్ణించుకోలేనిదని...
కొందరికి అదిగుండె కోతేనని...
నీవులేని లోటు తీర్చలేనిదని...
నీవు భౌతికంగా దూరమైనా
నిత్యం నీవు అందరి నాలుకలపై
అదృశ్యంగా ఉంటానని
నీవు ఆపద్భాంధవుడవని...
నీవున్నా లేకున్నా నీ తీపి జ్ఞాపకాలు
నీ మంచితనం కీర్తి నీకు దక్కినగౌరవం
నీవు పదిమందికి పంచిన ప్రేమ మరో
వెయ్యేళ్ళు సజీవంగానే వుంటాయని...
నీవు కన్నుమూసి
కాటికెళ్ళేలోగా
నీ శత్రువులందరినీ
నీ మిత్రులుగా మార్చుకుని
ప్రశాంతంగా నీవు సమాధికి చేరుకో..!
ఎందుకు ఎందుకు అందరితో శత్రుత్వం
ఒక స్నేహజ్యోతిగా శాశ్వతంగా వెలిగిపో..!
ఒక ప్రేమమూర్తిగా ఈ ధరణిలో మిగిలిపో..!
ఓ నా ప్రియనేస్తమా..!
నిన్ను నీ పవిత్రనామాన్ని
నీ బద్ధశత్రువులు సైతం
ప్రతినిత్యం స్మరించిన చాలు..!
ధన్యమే ధన్యమే నీ జన్మ ధన్యమే..!
నీకు దక్కు ఏడుజన్మల పుణ్యఫలమే..!
43. మీరే విజ్ఞానజ్యోతులు..!
విశ్వవిజేతలు..!!
మీరు మీ...
కన్నీళ్ళని నమ్ముకోకండి..!
వాటికి "మీ కంటిచూపు"
విలువ తెలియదు
మీరు మీ...
భయాలను నమ్ముకోకండి..!
వాటికి "మీ బలం సామర్థ్యం" తెలియదు
మీరు మీ బలహీనతలకు...
మీ పిరికితనానికి...మీ గుండె ధైర్యాన్ని
అమ్ముకోకండి..! ...
దానికి మీ "పోరాటపటిమ" తెలుసు...
ఆ పోరాటంలో...
మీకు విజయమో వీరస్వర్గమో తెలుసు....
విజయలక్ష్మిని మీరు వరించడం తెలుసు...
కీర్తికిరీటాలను మీరు ధరించడం తెలుసు...
మీరు మీ...
"విజ్ఞానాన్ని" నమ్ముకోండి..!
అది మీ జీవితంలో
"విజ్ఞాన జ్యోతులను" వెలిగిస్తుంది..!
అది మిమ్మల్ని "విశ్వవిజేతలను"చేస్తుంది..!
అందుకే
ఓ నా ప్రియమిత్రులారా..!
మీరు దేన్నీ నమ్ముకోవాలో..!
దేన్నీ అమ్ముకోవాలో ముందు తేల్చుకోండి..!
44. కలలు కలతనిద్ర....
కడలన్నాక......అలలు
కనులున్నాక...పీడకలలు
తప్పవంటారు ఆశాజీవులు
ఔను మనం గాఢనిద్రలో
కమ్మని కలలెన్నోకంటాం
కొన్ని పిచ్చి...పీడకలలు
కొన్ని వెర్రి...వేధించే కలలు
కొన్ని భయానకమైనవి
పిశాచుల్లా పీడించే కలలు
ఎవరో ఎదపైకి ఎక్కితొక్కి
పీకను పిసికినట్లు ఊపిరాడక
ఉక్కిరిబిక్కిరయ్యే కలలు...
కొన్ని పగపట్టిన పాముల్లా
వెంటపడి కాటువేసే కలలు...
కొన్ని తలాతోకాలేని తలతిక్కకలలు
కొన్ని తల కాళ్లు చేతులు నరికేసినట్లు
భయంతో గజగజ వణికించే కలలు...
కొన్ని తాళ్లతో గట్టిగా కట్టినట్లు
రాళ్లతో కొట్టినట్లు గన్నుతో కాల్చినట్లు
ఎత్తైనప్రదేశం నుండి
ఏ లోయలోకో ఏ నీళ్ళలోకో
నిప్పుల్లోకో నెట్టేసినట్లు కలలు...
కొన్ని రాత్రాంతాఎవరో
కత్తులతో పొడిచినట్లు...
గండ్రగొడ్డళ్లతో నరికినట్లు...
రక్తం ఏరులైపారుతున్నట్లు...
రాసి రంపానపెట్టే రాక్షసకలలు...
కొన్ని మనల్ని ఒక ఆట
ఆడించే ఓడించే పీడించే కలలు...
కొన్ని మనకు సంబంధంలేని
వారితో క్రీడించినట్లు కనే
బంగారపు శృంగారపు కలలు...
ఒక్కసారి మనం ఉలిక్కిపడి
కళ్ళురెండు తెరిచి చూస్తే చాలు
మళ్ళీ ఆ పాత ప్రపంచమే...
కళ్ళకు గోచరించేది ఆ పాడులోకమే...
కానీ రాత్రంతా చిత్రమైన విచిత్రమైన
ఓ వింతలోకంలో విహరించి వుంటాం
ఇలా వింత వింతగా కలలుగని నిద్ర లేస్తే...
ఇక ఆరోజు బుర్రనిండా భూతాలే
45. చీకటిలో వెలిగే చిరుదివ్వెలు..?
ఎంతో చల్లగా...
ఎంతో తృప్తిగా...
ఎంతో సుఖంగా...
ఎంతో హాయిగా...
ఎంతో ప్రశాంతంగా...
ఎంతో ఆనందంగా...
ఎంతో అద్భుతంగా...
ఎంతో ఆరోగ్యకరంగా...
ఎంతో ఆహ్లాదకరంగా...
ఎంతో సుందరంగా...
ఎంతో శుభకరంగా...
ఎంతో మనోజ్ఞంగా...
ఎంతో మనోహరంగా...
ఎంతో మంగళకరంగా...
ఎంతో నిర్మలంగా...
ఎంతో నిశ్చలంగా...
ఎంతో నిశ్శబ్దంగా...
ఎంతో నిర్మానుష్యంగా...
ఎంతో ఉల్లాసంగా...
ఎంతో ఉత్సాహంగా...
వుంటుందా సుప్రభాత వేళ...
గుడిగోపురాల్లో వినిపించు భక్తి గీతాలు
పచ్చని చెట్లపై పక్షుల కిలకిలా రావాలు
ఊపిరులూదే ఉషాదయ లేతకిరణాలు
ఆవేళలో బద్దకం వీడి క్రమశిక్షణతో
పడక దిగి నడక ప్రారంభించేవారు
ప్రతినిత్యం పార్కుల్లో తిరుగువారు
సంతోషంగా ప్రశాంతంగా బ్రతుకుతారు
వ్యాయామం యోగా ధ్యానం చేయువారు
ఎల్లవేళలా హాయిగా ఆనందంగా ఉంటారు
వారు నిండునూరేళ్ళు...
"సంపూర్ణమైన ఆరోగ్యంతో " జీవిస్తారు
వారే కదా "అందరికి ఆదర్శం"...
వారే కదా "చీకటిలో వెలిగే చిరుదివ్వెలు"...
రచన:
కవిరత్న
సహస్రకవి
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment