41...జూలై నెల 2023 కవితల ఇండెక్స్
1. అస్తమించిన అమర
గాయకుడు సాయిచందు ...
2. మరువలేని...మరణంలేని మహా
గాయకుడు మన సాయిచందు..!
3. పాటే ప్రాణంగా..!
ఉద్యమమే ఊపిరిగా..!
4. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
రక్తసంబంధం విలువ
నీకు తెలియదురా
5. సాహస వీరుడా ! ఓ సాయిచందు..!
6. నిప్పులు చెరిగే నీ పాట మాకు కావాలి
7. కంచు కంఠం మూగబోయింది
మంచు పర్వతం కరిగిపోయింది
8. మరణం లేని సాయిచందు(పాట)
9. చెట్టంత...సాయి చందు..!
10. అందరి"బంధువు"అంబేద్కర్
11. ఎక్కడ..? ఎక్కడ..?
12. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్...
13. విశ్వంలో విశిష్ట వ్యక్తులు..?
14. బలహీనులు కాదు బాహుబలులు..!
15. మీకు ఎప్పుడైనా వృద్ధులు ఎదురైతే ?
16. సమాధానంలేని చిక్కుప్రశ్నలు..?
17. చీకటిలో వెలిగే చిరుదివ్వెలు..?
18. యోగ " ఒక దివ్యఔషధమే..!
19. అది ఏదైనా సరే....?
20. అన్నదాతా..! సుఖీభవా...!
21. కన్నీటి ప్రార్థన..!
22. ఒకటే...ఆశ..! ఒకటే...కల..!
23. అజాత శత్రువుగా అస్తమించు..!
24. దైవస్వరూపులు..!ధన్యజీవులు..!
25. మోహపు చూపే
మోసకరం...నాశనకరం..?
26. పరమాత్మ పాడిన పాటే..!
27. నది నవ్వుతుంది
28. నీ కవిత్వం "రక్షణ కవచం" కావాలి...
29. దైవాన్ని నిందించకు...
ధైర్యాన్ని బంధించకు...
30. ఉడతలకేల ఉచిత సలహాలు..!
31. కొండెక్కిన టమాటా కోతి...?
32. నిప్పులు చెరుగుతూ...
టమోటాయాన్ 300 "నింగికెగిరే
33. మణిపూర్ లో...
ఆరని చితిమంటలు..?
34. మణిపూర్ లో మారణహోమం..?
35. లక్...&...కిక్...
36. క్షమాభిక్షా..? మరణశిక్షా..?
37. ఏనుగు..?ఎగిరి పడింది..?
(...హాస్య కవిత...)
38. కాస్త గమనించాలి..!
గట్టిగా నిఘా పెట్టాలి..!
39. చదువులతల్లి...
డాక్టర్ సాకే భారతికి...అక్షర హారతి..!
41. ఇంట పన్నీరు...కంట కన్నీరు..?
1. అస్తమించిన అమర
గాయకుడు సాయిచందు ...
నాడు తెలంగాణ సాధనలో
అమరుడైన శ్రీకాంత్ ఆచారి
"సంస్మరణ సభలో "...
"రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
రక్తసంబంధం విలువ నీకు తెలియదురా
నుదుటి వ్రాతలు వ్రాసే ఓ దేవదేవా..!
అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా...
తెలిసుంటే...చెట్టంత మా బిడ్డలా
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలూ"
ఈశ్వరా...
ఆఆఆఆఆఆఆఆఆఆ...అంటూ
గంభీరమైన కంఠంతో గుక్కతిప్పుకోకుండా
అందరి గుండెల్ని పిండేసేలా...
అందరి కళ్ళలో పాతాళగంగఉప్పొంగేలా...
సుదీర్ఘంగా రాగం తీసి ఆలపించిన
ఆగీతం విన్న శ్రీకాంత్ ఆచారితల్లి కన్నీటి
పర్యంతమై విలవిలలాడిపోయిందే...
సీఎం కేసీఆర్ సైతం కంటతడి పెట్టారే...
ఓ మా బంగారు బిడ్డ ! ఓ సాయి చందు! ఎవరయ్యా..! ఎవరయ్యా..!
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!
కేసీఆర్ ప్రతిసభ
నీపాటతోనే ప్రారంభమే...
నీవు వేదికనెక్కి దిక్కులు పిక్కటిల్లేల
ధూం...ధాం...గా పాటలు పాడుతుంటే యువకులంతా
ఉత్తేజితులయ్యారే...
ఉర్రూతలూగిపోయారే...
ఉద్యమానికి ఊపిరిలూదారే...
ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయే...
ఓ మా బంగారు బిడ్డ ! ఓ సాయి చందు!
ఎవరయ్యా..! ఎవరయ్యా..!
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!
పాటకు ప్రాణంగా...
ఉద్యమాలకు ఊపిరిగా...
ఓ విప్లవ వీరుడిగా ...
ఓ ఉద్యమ సూర్యుడిగా...
ఓ బహుజన బాటసారిగా...
ఓ అరుణోదయ కిరణంగా...
ఓ ప్రగతిశీల ప్రభంజనంగా...
అణగారిని ప్రజల ఆశాజ్యోతిగా...
అంబేద్కర్ ఆశయాల దివిటీగా...
ఒక కవిగా...ఒక కళాకారుడిగా...
ఒక గాయకుడిగా...ఒక నాయకుడిగా...
ఎదుగుతున్న తరుణంలో
ఎవరి కన్ను కుట్టిందో ఏమో
అనకొండలా...
మృత్యువు...చుట్టేసింది
39 ఏళ్ళకే
మృత్యుకుహరంలోకి నెట్టేసింది
నీ ఆటపాటలతో
నీ మధుర కంఠంతో
మమ్మల్ని మంత్రముగ్ధుల్ని
చేసిన ఓ గాన గంధర్వా...!
కులదురహంకారులపై
అక్షరమే ఆయుధంగా పోరాడిన
ఓ విప్లవ వీరుడా...ఓ శూరుడా !
ఓ మా బంగారు బిడ్డ ! ఓ సాయి చందు!
ఎవరయ్యా..! ఎవరయ్యా..!
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!
(అమర గాయకుడు సాయిచంద్
ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ...)
2. మరువలేని...మరణం లేని మహా
గాయకుడు మన సాయిచందు..!
ఓ ప్రతిశీల ప్రభంజనమా..!
ఓ అరుణోదయ కిరణమా..!
ఓ పాలమూరు పాటగాడా..!
ఓ బహుజన బాటసారి..!
నీ కన్నీటి పాటతో చూపావే
ఎందరికో బంగారు బ్రతుకు దారి..!
ఓమా బంగారుబిడ్డా ! ఓ సాయిచందు..!
అణగారిన బడుగు బలహీన వర్గాల
గొంతుకవై ఎందరికో అండగా నిలిచావే..!
సింగరేణి కార్మికుల కన్నీటి గాథలను
పాలమూరు ప్రజల వలస జీవితాలను
కమ్మని పాటల రూపంలో కళ్లకు కట్టిన
నీ కంఠస్వరం నేడు...మూగబోయిందే...
నీ పాట ఒక తూటై...
నీ ఆట ఒక పూలబాటై...
నీ మాట ఒక తేనెలఊటై...
నీ ప్రతి పాట మా గుండెల్లో...
నిత్యం మారుమ్రోగుతూనే ఉంటుంది
నిత్యం నీ పేరు వినిపిస్తూనే ఉంటుంది
నిత్యం నీ రూపం కనిపిస్తూనే ఉంటుంది
ఓ మా బంగరు బిడ్డా..! సాయిచందు..!
లేదయ్యా లేదు..! నీకు మరణం లేదు..!
ఆ సూర్య చంద్రులు
ఆ నక్షత్రాలున్నంతకాలం..!
నీవు భౌతికంగా దూరమైనా
నీ పాటలే నీకు ప్రాణం పోస్తాయి...
ఓ సాయిచందు నీవు బ్రతికే ఉంటావు..!
నీవు తెలంగాణ ప్రజల గుండెల్లో...
ఆరనిజ్యోతిలా వెలుగుతూనే ఉంటావు..!
నీ అకాలమరణవార్త...
మన తెలంగాణాతల్లికి ఓ గుండెకోతే..!
ఓ బిడ్డా ! నీ ఆత్మకు
శాంతి కలుగును గాక !
జోహార్ జోహార్..!
సాయీ చందు జోహార్..!
అమర్ రహే..!అమర్ రహే ..!
సాయీ చందు అమర్ రహే..!
3. పాటే ప్రాణంగా..!
ఉద్యమమే ఊపిరిగా..!
అయ్యో ఓ దైవమా..!
అమర గాయకుడు
తెలంగాణ ఉద్యమానికి ఉపిరైన
సాయిచందు హఠాన్మరణమా..!
తన మధురగాత్రంతో
ఎన్ని హృదయాలనో దోచిన
ఆ గుండెఅర్ధాంతరంగా ఆగిపోయిందే
తన పాటను విను ప్రతివారిని
కదిలించే...కరిగించే మదిని మురిపించే...
ఆ మధుర స్వరం మాయమై పోయిందే...
యువతలో స్ఫూర్తి జ్వాలలు రేపుతూ
బహుజనులకి కొండంత అండగా నిలిచిన
ఆ కమ్మని కంచుకంఠం మూగబోయిందే...
ఇంత దయలేనివాడా...ఆ దైవము...?
రాజకీయాలలో రాణిస్తున్న
ఎవరెస్టు శిఖరంలా ఎదుగుతున్న
మన సాయి చందును ఎత్తుకెళ్లిందే...
ఇంత క్రూరమైనదా...ఆ మృత్యువు..?
ముద్దుబిడ్డల్నిద్దర్ని అనాధలను చేసి...
ముచ్చటైన పచ్చనికాపురాన చిచ్చురేపి
నిత్యం చిరునవ్వులు చిందించే...
చిలుకా గోరింకలైన అమర ప్రేమికులైన
ఆ సాయి రజనీని విడదీసి
విషపునవ్వు నవ్విందే ! ఆవిధి
ఎంతటి కసాయిదో కదా..!
ఓ దైవమా..!
ఈ జీవితం ఇంత క్షణికమా..!
నిముషంలో పుట్టి నిముషంలో
మాయమయ్యే నీటిబుడగేనా !
ఆ వింతవిధి చాటుమాటుగా
కాటువేసే పాము పడగేనా!
ఒక క్షణం చిరునవ్వులా..!
మరుక్షణం చితిమంటలా..!
ఎంతగా శోధించినా అర్థం కాకున్నదే...!
ఈ ప్రకృతి ధర్మం..! నీ సృష్టి మర్మం..!
4. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
రక్తసంబంధం విలువ
నీకు తెలియదురా
సినీగేయ రచయిత
శ్రీ మిట్టపల్లి సురేందర్ వ్రాసిన
అమరవీరులను కన్నతల్లుల
"పురిటి నొప్పుల పాటను"
కూసింత మార్పులు చేసి...
"రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
రక్తసంబంధం విలువ నీకు తెలియదురా..!
నుదుటి వ్రాతలు వ్రాసే ఓ బ్రహ్మ దేవా..!
అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా...
తెలిసుంటే...చెట్టంత మా బిడ్డలా
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలూ"...
ఈశ్వరా...శంకరా...అంటూ సాయిచందు
సుదీర్ఘంగా గుక్కతిప్పుకోకుండా రాగంతీసి
పాటలో లీనమైపోయి పాడుతూవుంటే...
ఒళ్ళు పులకరిస్తుంది..!
గుండె బరువెక్కుతుంది..!
కళ్ళవెంట కన్నీటి వర్షమే..!
ప్రత్యేక తెలంగాణా సాధనకై...
కిరోసిన్ మంటల్లో చిక్కుకుపోయి...
కళ్ళముందే కాలిపోయి అమరవీరుడైన
కన్నకొడుకు శ్రీకాంత్ ఆచారి గుర్తొచ్చి
ఆ కన్నతల్లి తల్లడిల్లి పోతుంటే...
విలవిలలాడిపోతుంటే...
విలపిస్తూవుంటే...
కుర్చీలో కూర్చొని
కుమిలి కుమిలి ఏడుస్తూవుంటే...
కన్న...ఎవరి కంటనైనా
కన్నీటి వరదలే...
విన్న...ఎవరి గుండెలైనా
పొంగిపొరలే చెరువులే...
సియం కేసీఆర్ నే కంటతడి
పెట్టించిన తెలంగాణా సాధనకు
ఊపిరైన ఈ పాటను ఎన్నిసార్లు
విన్నా తనివి తీరదు...కన్నీరు ఆగదు...
5. సాహస వీరుడా ! ఓ సాయిచందు..!
ఓ సాహస వీరుడా !
ఓ సాయిచందు..!
జలజల దూకే ఓ జలపాతమా..!
చీకటిలో వెలిగే ఓ చిరుదీపమా..!
గలగల పారే ఓ గంగా ప్రవాహమా..!
భగ భగ మండే ఓ అగ్నిపర్వతమా..!
అణగారిన ప్రజల ఓ ఆశాకిరణమా..!
ఓ విప్లవ వీరుడా..!
ఓ ఉద్యమ సూర్యుడా..!
నీ "అకాలమరణవార్త "
కోట్లాదిమంది అభిమానుల
గుండెల్లో పేలిన"అణుబాంబు"..!
ఓ గాన గంధర్వా..!
ఓ అమర గాయకుడా..!
నీ పాటతో చైతన్యం పుట్టాలని...
నీవు చట్టసభల్లో అడుగు పెట్టాలని...
కమ్మని కలలు కంటూ కన్నుమూశావా..?
ఓ సాయిచందు..!
ఓ సాహస వీరుడా !
పుట్టాలయ్యా..! పుట్టాలి..!
నీవు మళ్ళీ మళ్ళీ పుట్టాలి..!
ఎగిరే తారాజువ్వవై..!
రగిలే నిప్పురవ్వవై...!
రణభేరి మ్రోగిస్తూ రణసూర్యుడవై..!
రావాలయ్యా..! రావాలి..!
దివినుండి భువికి నీవు దిగి రావాలి..!
కావాలయ్యా..! కావాలి..!
"నిప్పులు చెరిగే నీ పాట" మాకు కావాలి..!
6. నిప్పులు చెరిగే నీ పాట మాకు కావాలి
బాబా అంబేద్కరా..!
భారత్ కే భాస్కరా..!
మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో..!
మీరే రాకుంటే మా బ్రతుకులెట్లుఉండెనో..!
మీరే ఆ రాజ్యాంగం రాయకుంటే..!
ఈ భరత భూమిలో మేము
బుగ్గైపోతుంటిమో..!
మసిబొగ్గై పోతుంటిమో..!
బాబా అంబేద్కరా..!
బడుగులకే భాస్కరా..!
మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో
అంటూ...ఏదో భూకంపం పుట్టినట్లు...
ఎక్కిన ప్రతి సభావేదిక
దద్దరిల్లేటట్లు...గొంతెత్తి
కంచుకంఠంతో మీరు పాడుతువుంటే...
ఎదురుగా మొద్దు నిద్రలో ఉన్న
అణచబడిన...అణగారిన
అమాయకపు జనంలో చైతన్య
జ్వాలల్ని మీరు రగిలిస్తుంటే...
బోధించు...సమీకరించు...పోరాడు...
సింహాలనెవ్వరూ బలివ్వరు...
మేకలను తప్ప...
పోరాడితే పోయేదేముంది..?
మీ బానిసత్వపు సంకెళ్ళు తప్ప...
రాజ్యాధికారం కోసమై మీరంతా
రక్తతర్పణకైనా సిద్దం కావాలి...అన్న
అంబేద్కర్ ఆశయాలకు జీవంపోసి..
అంబేద్కర్ సిద్ధాంతాలను
బడుగు బలహీన వర్గాలకు
పాటల రూపంలో వినిపిస్తూ...
కోట్లాదిమందిని చైతన్యవంతుల్ని చేస్తూ...
ఎవరెస్టు శిఖరమంత
ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే
ఓ సాయిచందు...ఓ సాహస వీరుడా !
నీ "అకాలమరణవార్త "
కోట్లాది మంది వీరాభిమానుల
గుండెల్లో పేలిన ఒక "అణుబాంబు"..!
ఓ గాన గంధర్వా !
ఓ అమర గాయకుడా !
చీకటిలో వెలిగే ఓ చిరుదీపమా..!
జలజల దూకే ఓ జలపాతమా..!
గలగల పారే ఓ గంగా ప్రవాహమా..!
భగభగ మండే ఓ అగ్నిపర్వతమా..!
అణగారిన ప్రజల ఓ ఆశాకిరణమా..!
ఓ విప్లవ వీరుడా !
ఓ ఉద్యమ సూర్యుడా !
నీవు మళ్ళీ మళ్ళీ పుట్టాలి...
నీవు దివినుండి భువికి దిగి రావాలి...
"నిప్పులు చెరిగే నీ పాట" మాకు కావాలి.
7. కంచు కంఠం మూగబోయింది
మంచు పర్వతం కరిగిపోయింది
ఎవ్వడు చెప్పిండురా..!
మీరెక్కువజాతోళ్ళని..?
ఏడా రాసుందిరా..!
మేం తక్కువ జాతోళ్ళని..?
నిన్ను నన్ను కన్నతల్లి
భరతమాత ఒక్కటే..!
నీవు నేను బ్రతుకుతున్న
భరత భూమి ఒక్కటే..!
నీకు నాకు నడుమ
ఈకులం అఢ్డుగోడ ఏందిరా..?
ఈ కులం కుళ్ళును
సృష్టించింది ఎవ్వడురా..?
ఎవడు...ఎవడు...?
ఎవ్వడు వాడెవ్వడురా..?
అంటూ సాయిచందు
కులనిర్మూలనకు...కృషి చేస్తూ...
తరతరాలుగా ఆరని అంటరానితనాన్ని...
మంట కలిపేందుకు...కంకణబద్దుడై...
గొంతెత్తి వేదికలమీద
అభ్యుదయ గీతాలనాలపిస్తూ...
కుర్రకారును ఉర్రూతలూగిస్తూ...
బహుజనులను ఉత్తేజపరుస్తూ...
అసెంబ్లీలో అడుగు పెట్టాలని...
అణగారిన బడుగు బలహీన
మైనారిటీ వర్గాలకూ అండగా
నిలవాలని కమ్మని కలలెన్నోకంటూ...
అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా...
రాజకీయాలలో రాణిస్తున్న తరుణంలో
క్రూరమైన విధి ఓ విషపు నవ్వు నవ్వింది
సాయిని 39ఏళ్ళకే మృత్యువు ముద్దాడింది
ఔరా విధి ఎంతటి బలీయమైందో కదా...
మనిషొకటి తలంచిన దైవం మరొకటి
తలంచునే సృష్టి స్థితి లయలు దైవాధీనాలే
కానీ ఎందుకంత తొందరో ఏమో...
ఓ చైతన్య శిఖరం కుప్పకూలిపోయింది
ఓ చల్లని మాటలమంచు కరిగిపోయింది
ఓ పాటల పర్వతం క్షణాల్లో ఒరిగిపోయింది
సాయిచందు"కంచు కంఠం"మూగబోయింది
8. మరణం లేని సాయిచందు(పాట)
ఒక శిధిలమైపోయే శిలను
సుందర దేవతా శిల్పంగా చెక్కితే
ఆపై ఇక ఆ శిల్పానికి నిత్యం పూజలే
పునస్కారాలే...అర్చనలే...అభిషేకాలే
గుళ్ళో శిల్పాన్ని దర్శించిన భక్తులు
ఆశిలలో దాగిన దైవానికే మ్రొక్కుతారు
కానీ కళాకారులు గతంలో కెళ్తారు
శిల్పి రూపాన్ని గుర్తు చేసుకుంటారు...
ప్రత్యక్షంగా....శిల్పికళా నైపుణ్యాన్ని
అదృశ్యంగా...శిల్పాన్ని చెక్కిన
శిల్పాన్ని వీక్షిస్తారు...స్మరించుకుంటారు...
ఆపై శివున్ని దర్శించుకుంటారు...
ఆ "శిల్పం" గుళ్ళో ఉన్నంతకాలం
ఆ "శిల్పి" కూడా చిరంజీవియే...
గాయకుడు...
యువ నాయకుడు...
అంబేద్కర్ అభిమాని...
అణగారిన ప్రజల ఆశాకిరణం...
కంచుకంఠం"వరంగా" పొందిన
గానగంధర్వుడు సాయిచందు...
ఎన్నో రాత్రులు...
నిద్రాహారాలు మాని...
ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి...
ఎక్కిన ప్రతివేదిక దద్దరిల్లేలా...
దిక్కులు పిక్కటిల్లేలా...గొంతెత్తి...
సింహంలా గర్జిస్తూ ఎగిరి గంతులేస్తూ...
ఉద్రేకంతో ఊగిపోతూ గాలిలోతేలిపోతూ...
కేసీఆర్ పార్టీసభల్లో
ధూంధాంగా ఆడిపాడి..
వేదిక ముందున్న లక్షలాదిమంది
అభిమానులను...కార్యకర్తలను
కుర్రకారును...ఉర్రూతలూగించిన
అమర గాయకుడు సాయి చందు
పాడిన "ప్రతిపాటకు ప్రాణం"పోసె ఆపై
గుండెపోటుకుగురై...రక్షించేవారు లేక
సకాలంలో సరైన వైద్యసహాయమందక...
ఆసుపత్రిలో దిక్కులేని ఒక "అనాధగా"...
కట్టుకున్న భార్యచేతిలోనే కన్ను మూసె...
నిత్యం తెలంగాణ ప్రజల
గుండెల్లో పల్లెపల్లెలో వాడవాడలా
మారుమ్రోగే పాటలే సాయి చందుకు
''ప్రాణం పోస్తాయి" తిరిగి బ్రతికిస్తాయి...
అందుకే భౌతికంగా దూరమైన "సాయికి"
ప్రవహించే "ఆయన పాటకు"మరణం లేదు
9. చెట్టంత...సాయి చందు..!
అయ్యో..! కళ్ళముందే
కట్టుకున్న భార్య చేతిలో ...
చెట్టంత...సాయి చందు...
మట్టిముద్దగా మారిపోయెనే...
ఆ విధి ఎంతటి కసాయిదో కదా..!
అయ్యో! మా "పాలమూరు
"పాలపిట్ట" పారిపోయెనే..!
ఎక్కడికో ఎగిరి పోయెనో..!
ఆ "కోయిలకంఠం" మూగబోయెనే..!
కేసిఆర్...కేటీఆర్...హరీష్ రావ్ లకు
బిఆరెస్ పార్టీకి సాయిపాట పల్లకి మోత...
సాయి మరణవార్త ఎందరో అభిమానుల
తోటి కళాకారుల గుండెల్లో రంపపు కోత...
రేయింబవళ్ళు ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
తెలంగాణా పల్లెపల్లెను సుడిగాలై చుట్టి
వేల వేదికలపై ఉద్యమ పాటలు పాడి
కుర్రకారును ఉర్రూతలూగించి...
కోట్లాదిమంది తెలంగాణ ప్రజల్ని
జాగృతం చేసిన చైతన్య శిఖరం...
అందరి గుండెల్లో ప్రజ్వరిల్లుతున్న...
ఆరని జ్యోతి...మా సాయిచందు...
ఎక్కిన ప్రతివేదిక దద్దరిల్లేలా...
కంచుకంఠంతో చైతన్య గీతాలు
ఆలపించి...శ్రోతలను అలరించి...
కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి...
పార్టీనాయకుల మదినిదోచిన గాయకుడు
సాయి మరణం పార్టీకి పూడ్చలేని అగాధం
కుటుంబానికి ఎన్నటికీ
మాయని ఓ గాయం
సాయి చందు పాల్గొన్న ప్రతిసభను
తన కంచుకంఠంతో విజయవంతం చేసి
తనకు...పార్టీ...పాటే...ప్రాణంగా...
ఉద్యమం...ఉద్యోగం...
అంబేద్కర్ ఆశయాలే..ఊపిరిగా...
అంకితభావంతో...అకుంఠితదీక్షతో...
పార్టీకి వెన్నెముకగా...
ఒక మూలస్తంభంగా...
ఒక పునాది రాయిగా...
ఒక సైనికుడిగా...
ఒక గాయకుడిగా...
ఒక ప్రజానాయకుడిగా...
ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు
ఎదిగే వేళ మాయమైపోయిన
"చెట్టంత మా సాయి చందును"
రాతిబొమ్మల్లో కొలువైన శివుడా...
నుదుటి వ్రాతలు వ్రాసే ఓ బ్రహ్మదేవా..! తెచ్చివ్వగలవా...మీ మహిమలూ..?
తెచ్చివ్వగలవా...మీ మహిమలూ..?
అంటూ
గుండెలుపగిలేలా రోదిస్తున్నారు...
భవిష్యత్తు అంధకారమైన భార్యాబిడ్డలు...
మొన్న కరెంట్ షాక్ తో...
కట్టుకున్న భార్య
నిన్న పెద్దకొడుకు
నేడు చిన్నకొడుకు సాయి
దూరమై కన్నీరుమున్నీరౌతున్న కన్నతండ్రి...
విధి విషనాగై కుటుంబాన్ని కాటేసినందుకు..
10. అందరి"బంధువు"అంబేద్కర్
"భారత రత్నగా"
విశిష్ట పురస్కారంతో
భారత ప్రభుత్వం గౌరవించిన...
"భారత రాజ్యాంగ నిర్మాతగా"...
"భావి భారత స్పూర్తి ప్రదాతగా"...
భారతీయులందరూ కీర్తించిన...
"మహామేధావిగా"...
"జ్ఞాన సూర్యుడిగా"...
"బహుముఖ ప్రజ్ఞాశాలిగా"...
ప్రపంచమే గుర్తించిన...
"అందరివాడు"...
"అజాత శతృవు"...
"అందరికి ఆత్మ బంధువువైన"...
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
ఆశయాలను నిత్యం గుర్తుచేసుకుందాం...
గుండెల్లో దాచుకుందాం...ఇష్టదైవంగా...
ఇలనైనా...
కలనైనా మరువక...
ఆ ప్రేమమూర్తి నుండి...
ఆ గాయాల గని నుండి...
ఆ త్యాగాల ధ్వని నుండి ...
ఆ చైతన్య శిఖరం నుండి...
ఆ సమతామూర్తి నుండి ...
స్పూర్తిని పొందుదాం...
సుఖశాంతులతో...హాయిగా...
ప్రశాంతంగా...గౌరవంగా జీవిద్దాం...
11. ఎక్కడ..? ఎక్కడ..?
ఎక్కడ...
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు...
రెక్కలు కట్టుకుని
"విహంగాలై" విహరిస్తున్నాయో...
ఎక్కడ...
సమన్యాయం ...
"చల్లని వెన్నెలై" కురుస్తున్నదో...
ఎక్కడ...
సమానత్వం...సౌభ్రాతృత్వం "
మలయమారుతాలై" వీస్తున్నాయో...
ఎక్కడ...
మనిషి మనిషిలో
మంచితనం...మానవత్వం "
సుగంధ పరిమళాలై"
వెదజల్లబడుతున్నాయో...
అక్కడికి "సమతా భావాలతో"
అందరం ముందుకు సాగిపోదాం...
అక్కడే వెలసిన "మమతల కోవెలలో"
సమిష్టిగా"మధుర గీతాలను" ఆలపిద్దాం...
12. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్...
జీవితం "ఒక నాటకం"...
నటుడిగా నటించు...
కీర్తి కిరీటాలు ధరించు...
కాని...మనిషిగా జీవించు...
జీవితం "ఒక ఆటల పోటీ"...
నేడు పోరాడి ఓడిపోతే...కృంగిపోకు
గుర్తుంచుకో ఓటమి నేర్పే గుణపాఠాలు...
అవే రేపటి నీ విజయానికి రాచబాటలు...
జీవితం "ఒక యుద్దం"...
రాజ్యకాంక్షతో జరిగే రణక్షత్రంలో
సృష్టించిననేమి ఎన్ని రక్తపాతాలు...
ఎగురవేయాలి కొన్ని శాంతికపోతాలు...
జీవితం...ఒక ఆశల పల్లకి
జీవితం...ఒక ప్రేమ పందిరి
జీవితం...ఒక రంగుల హరివిల్లు
జీవితం...ఒక వినోదాల విరిజల్లు
ఇఫ్ లైఫ్ ఈజ్ ఛీర్ ఫుల్...పీస్ ఫుల్...
పవర్ ఫుల్...అండ్...సక్సెస్ ఫుల్...
దెన్...లైఫ్ ఈజ్ సో...బ్యూటీ ఫుల్....
సో మైడియర్ ఫ్రెండ్స్...బీకేర్ ఫుల్...
ఎబౌట్ అవర్ లవ్లీ అండ్ లక్కీ లైఫ్...
బట్ డోంట్ ఫర్గెట్ అండ్
కీప్ దిస్ సీక్రెట్ ఇన్ యువర్ హార్ట్
అవర్ లైఫ్ ఈజ్...సో స్వీట్ అండ్ సో షార్ట్
13. విశ్వంలో విశిష్ట వ్యక్తులు..?
నీవొక విద్యార్థి వైతే...
నీకు పుస్తకాలు
బట్టలు కొనిచ్చేదెవరు..?
పాఠశాలలో కాలేజీలో చేర్చేదెవరు..?
నీ ఫీజులు కట్టేదెవరు..?
నీకు పాఠాలు చెప్పేదెవరు..?
పరీక్షలు పెట్టేదెవరు..?
పట్టాలు ప్రధానం చేసేదెవరు..?
నీ చదువు పూర్తికాగానే
ఇంటర్వ్యూలు చేసేదెవరు...?
నీకు ఉద్యోగమిచ్చేదెవరు..?
ఉద్యోగివైతే నీకు జీతమిచ్చేదెవరు?
ఏది నీకు నీవు చేసులేవు
ఆశించిన ఫలితాల్ని పొందలేవు
ఎవరో ఒకరు ప్రత్యక్షంగా
సహాయం చేయవలసిందే...
అవసరానికి ఆదుకోవాల్సిందే...
అదే నీ విద్యకు
నీ విజ్ఞానానికున్న శక్తి
అదే నీలో అదృశ్యంగా
ప్రవహించే "విద్యుత్" శక్తి...
నీవొక భక్తుడివైతే...
నీకు నీవు ముక్తిని
ప్రసాదించుకోలేవు
ఆ భగవంతుడే
నీ భక్తికి మెచ్చి...
నీ ప్రార్థనలకు నచ్చి...
నీకు ముక్తిని ప్రసాదించాలి
అదే నీ "ప్రార్థన"కున్న
అఖండమైన...
అనంతమైన "అతీంద్రియ" శక్తి
ఆర్జించిన చాలు ఈ రెండు శక్తులు...
వారే ఈ విశ్వంలో విశిష్టమైన వ్యక్తులు...
14. బలహీనులు కాదు బాహుబలులు..!
ఒకనాడు వారు
అగ్రవర్ణాల "వంచనకు"
మనువాదపు "మంటలకు"
బానిసత్వానికి బలైనవారు...
తరతరాలుగా అంటరానివారుగా
ఊరికి బహుదూరంగా ఉంచబడినవారు
అణచబడినవారు అణగద్రొక్కబడినవారు
ఐనా ఆ బహుజనులు
వినయ విధేయతలకు...
ప్రతిబింబాలు...
సకలజనుల హితం కోరే
విశాల హృదయమున్నవారు...
రెక్కలు ముక్కలుచేసే శ్రమజీవులు...
వారు
అక్రమాలను
అన్యాయాలను
ఎదురించే...వీరులు...
తల ఎత్తుకు తిరిగే...శూరులు...
నమ్మినవారికి వారు రక్షణ కవచాలు...
కానీ నయవంచకులకు...
కులం పేర దూషించే వారికి...
కులం కుంపట్లు రాజేసేవారికి...
కుట్రలు కుతంత్రాలు పన్నే వారికి...
కులం పేరుతో అవమాన పరిచేవారికి...
ముందు నవ్వుతూ వెనుక లోతుగా
గోతులు త్రవ్వే అనుకూల శత్రువులకు...
ప్రక్కలో బల్లేలు...గుండెల్లో గునపాలు
తలలు తెగనరికే...గండ్రగొడ్డళ్ళు
పూరి గుడిసెల్లో...పుట్టిన ఆ పులిబిడ్డలు
వారివి...ప్రశ్నించే గొంతులు
అసమానతల్ని పిడికిలి బిగించి...
ప్రతిఘటించే...విప్లవ వీరులు వారు
వారు బలహీనులు కాదు బాహుబలులు
వారందరూ కోరేది ఒక్కటే రాజ్యాధికారం
15. మీకు ఎప్పుడైనా
వృద్ధులు ఎదురైతే...?
హద్దులు దాటకండి
అమర్యాదగా చూడకండి
సానుభూతి చూపకండి
తక్షణ సహాయం చేయండి...
వారి ఆకలిని తీర్చండి...
వారి అవసరాలు తీర్చండి...
మీకు మేమున్నామన్న
ఓ భరోసా నివ్వండి...
చిరునవ్వుల
గంధం వారిమీద
చిలకరించండి
ప్రేమను పంచండి
ప్రేమతో పలకరించండి...
వీలైతే ఆలింగనం చేసుకోండి
గుండెకు గట్టిగా హత్తుకోండి
మీ మదిలో చిత్రించుకోండి
రేపటి మీ వృద్ధాప్యచిత్రాన్ని...
వారి చిట్టచివరి
కోరిక ఒక్కటే ఒక్కటే...
చిరునవ్వులు చిందిస్తూ...
కన్నుమూసి కాటికెళ్ళాలని...
చింతలేకయే చితికి చేరాలని...
ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా
ఆ పరమాత్మలో ఐక్యమైపోవాలని...
16. సమాధానంలేని చిక్కుప్రశ్నలు..?
ఈ లోకానికి
ఎందుకొచ్చామో..?
ఏమి తెచ్చామో మీకు తెలుసా..?
...తెలియదండి
ఈ లోకానికి...
ఏమి ఇచ్చామో..?
ఎంత కాలముంటామో..?
మీకు తెలుసా?
...తెలియదండి
చివరికి ఎప్పుడు ఛస్తామో..?
ఎలా ఛస్తామో..?
ఎందుకు చస్తామో తెలుసా..?
...తెలియదండి
చచ్చాక నరకమా..?..స్వర్గమా.?
...ఎక్కడికెళ్తామో..?
అవెక్కడుంటాయో..?
ఏలాగుంటాయో తెలుసా..?
...తెలియదండి...
మరణం తర్వాత తిరిగి
మనకు జననముందా..?ఉంటే
మళ్ళీ మనుష్యులుగానే పుడతామా..?
...తెలియదండి...
పక్షిగా...పాముగా...పశువుగా...
ఏదైనా మరో జన్మ ఎత్తుతామేమో..?
...తెలియదండి...
మరి మీకేం...తెలుసు
నిమ్మకాయ పులుసు..?
ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానం...
జన్మనిచ్చిన అమ్మానాన్నలకే తెలియదు..
ప్రాణం పోసిన ఒక్క ఆపరమాత్మ తప్ప...
17. చీకటిలో వెలిగే చిరుదివ్వెలు..?
ఎంతో చల్లగా...
ఎంతో తృప్తిగా...
ఎంతో సుఖంగా...
ఎంతో హాయిగా...
ఎంతో ప్రశాంతంగా...
ఎంతో ఆనందంగా...
ఎంతో అద్భుతంగా...
ఎంతో ఆరోగ్యకరంగా...
ఎంతో ఆహ్లాదకరంగా...
ఎంతో సుందరంగా...
ఎంతో శుభకరంగా...
ఎంతో మనోజ్ఞంగా...
ఎంతో మనోహరంగా...
ఎంతో మంగళకరంగా...
ఎంతో నిర్మలంగా...
ఎంతో నిశ్చలంగా...
ఎంతో నిశ్శబ్దంగా...
ఎంతో నిర్మానుష్యంగా...
ఎంతో ఉల్లాసంగా...
ఎంతో ఉత్సాహంగా...
వుంటుందా సుప్రభాత వేళ...
గుడిగోపురాల్లో వినిపించు భక్తి గీతాలు
పచ్చని చెట్లపై పక్షుల కిలకిలా రావాలు
ఊపిరులూదే ఉషాదయ లేతకిరణాలు
ఆవేళలో బద్దకం వీడి క్రమశిక్షణతో
పడక దిగి నడక ప్రారంభించేవారు
ప్రతినిత్యం పార్కుల్లో తిరుగువారు
సంతోషంగా ప్రశాంతంగా బ్రతుకుతారు
వ్యాయామం యోగా ధ్యానం చేయువారు
ఎల్లవేళలా హాయిగా ఆనందంగా ఉంటారు
వారు నిండునూరేళ్ళు...
"సంపూర్ణమైన ఆరోగ్యంతో " జీవిస్తారు
వారే కదా "అందరికి ఆదర్శం"...
వారే కదా "చీకటిలో వెలిగే చిరుదివ్వెలు"...
18. యోగ " ఒక దివ్యఔషధమే..!
తరతరాల భారతీయ
వారసత్వ సంపదను
"పంచామృతంలా" ప్రపంచానికి
పంచాలన్న సత్సంకల్పంతో
2014లో ఐక్యరాజ్యసమితిలో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ప్రవేశ పెట్టిన తీర్మానం
193 దేశాధినేతలలో
175 మంది అంగీకారంతో
2015 జూన్ 21 నుండి
"అంతర్జాతీయ యోగా దినోత్సవంగా" విశ్వవ్యాప్తమాయె...నేడు
భారత్ "విశ్వయోగ గురువాయె"...
అత్యంత పొడవైన జనవరి 21వ తేదీన
ప్రతిఏటా చేసే"యోగ"ఓ దివ్యఔషధమాయె
తల్లి జన్మనిస్తే...
"యోగ" పునర్జన్మనిస్తుంది...
అది "ఒత్తిడిని" చిత్తు చేస్తుంది...
"ఆందోళనను జయించేలా చేస్తుంది...
"యోగ" అమోఘమైన "మేధాశక్తిని"...
అనంతమైన "ఆత్మశక్తిని"అందిస్తుంది...
అనునిత్యం శ్రద్ధతో...
వేసే యోగాసనాలు...చేసే ప్రాణాయామం...
ధ్యానం...సూర్య నమస్కారాలు...
మానని "మొండిరోగాలకు"మందులే...
"యోగాతో" శరీరం "సేద"తీరుతుంది...
"మదిలో "ప్రశాంతత నది" ప్రవహిస్తుంది "అష్టైశ్వర్యాలున్ననేమి" ?
"ఆరోగ్యం" లేకున్న అన్నీ సున్నే...
మనిషిని అత్యున్నత స్థితికి చేర్చి
"ఆయుషును" పెంచేది "యోగాసనమే"
అందని ఆనందానికి "యోగ"ఓ ఆయుధమే
అందరి సంపూర్ణ ఆరోగ్యానికిది ఓ ఔషధమే
నిత్యం క్రమశిక్షణతో
"యోగగురువు" పర్యవేక్షణలో
"యోగాసనాలు" వేసేవారంతా....
ఆరోగ్యవంతులే...అదృష్టవంతులే...
ఆదర్శవంతులే....అపర శ్రీమంతులే...
చిరంజీవులే........చిరస్మరణీయున్తలే...
వారంతా............ధీర్ఘాయుష్మంతులే...
"స్వర్గానికి మార్గం" తెలిసినవారే...
19. అది ఏదైనా సరే....?
పిలుపేదైనా... సరే
అది...ప్రేమగా...ఉండాలి
తలంపేదైనా... సరే అది
తేనెలా...తియ్యగా...ఉండాలి
అనురాగమేదైనా... సరే
అది అమ్మ పాలలా...స్వచ్ఛంగా...ఉండాలి
లక్ష్యమేదైనా...సరే
అది శోధించి...సాధించి...తీరాలి
ఆశ ఏదైనా...సరే
దానికి ఒక...హద్దంటూ...ఉండాలి
కోరిక ఏదైనా... సరే
అది...కొంపముంచకుండా...ఉండాలి
ఆవేశమేదైనా...సరే
దానికి ఒక...అర్థముండాలి
కోపమేదైనా...సరే
దానికి ఖచ్చితమైన...కారణముండాలి
ఆశయమేదైనా... సరే
అది అందరికీ ఒక...ఆదర్శంగా...ఉండాలి
బంధమేదైనా...సరే అది
విడిపోని ఒక...పవిత్రబంధమై...ఉండాలి
20. అన్నదాతా..! సుఖీభవా...!
ఈ విశ్వంలో
కొందరి
జననం...
జీవనం...
వింతగా...
విచిత్రంగా...
వికృతంగా...ఉంటుంది
కారణం వారికేదీ...పట్టదు
జీవితంలో వారికేదీ...పుట్టదు
వారి జీవితం ఎడారిలో ఒంటె జీవితం
కొందరి
జననం...
జీవనం...
వినూత్నంగా...
వినోదభరితంగా...
విలాసవంతంగా...ఉంటుంది
వారికందరూ మిత్రులే...
వారు అజాత శత్రువులే...
ఔరా శతృశేషం లేని వారి శేష జీవితం
భగవంతుడు ప్రసాదించే బంగారు వరమే...
అట్టివారి జీవితం సువర్ణశోభితమే...
సుందర నందన వనమే...
సుఖమయమే...స్నేహమయమే...
ప్రేమమయమే...ఆదర్శమయమే...
అట్టివారి జీవితం ఎంతో ధన్యమే...
దక్కును వారికి వేయిజన్మల పుణ్యఫలమే.
ఓ స్నేహశీలి..!
ఓ ప్రతిభాశాలి..!
ఓ విజ్ఞాన ఖని..!
ఓ మరియ కుమారా..!
ఓ అన్నదాతా..! సుఖీభవా..!
మా అందరి ఆశీస్సులు...
సిరి సంపదలు మీకు సిద్దిరస్తు..!
సుఖశాంతులు మీకు ప్రాప్తిరస్తు..!
21. కన్నీటి ప్రార్థన..!
మహిమగల ఓ దైవమా..!
మాతో మాట్లాడుమా..!
మా తప్పులు మన్నించుమా..!
ప్రేమగల ఓ దైవమా..!
మా కన్నీటి ప్రార్థన ఆలకించుమా..!
మా కష్టాలను కన్నీళ్లను కడతేర్చుమా...
దాగి ఉన్న ఓ దైవమా..!
మాపై దయ చూపుమా..!
మాకు దారి చూపుమా...!
మా దారిద్ర్యాన్ని దహించివేయుమా..!
కనిపించని ఓ దైవమా..!
మమ్ము కాస్త కరుణించుమా..!
చాటు మాటుగా కసితో
కాటువేసే సమస్యల
సర్పాల నుండి కాపాడుమా..!
నీతి గల ఓ దైవమా..!
మాకు నిత్యజీవము నివ్వుమా..!
22. ఒకటే...ఆశ..! ఒకటే...కల..!
పుట్టే...
ప్రతి "జీవికి" ఒకటే...కల
తిరిగి మరణించరాదని...
తట్టే...
ప్రతి "మనిషికి" ఒకటే...ఆశ
తలుపులు తెరుచుకోవాలని...
నవ్వే...
ప్రతి "మనిషికి" ఒకటే...కల
ఆరోగ్యంగా జీవించాలని...
త్రవ్వే...
ప్రతి "మనిషికి" ఒకటే...ఆశ
తీరని దాహం తీరాలని...
వెతికే...
ప్రతి "మనిషికి" ఒకటే...కల
నిధి నిక్షేపాలు దొరకాలని...
శ్రమించే...
ప్రతి "మనిషికి" ఒకటే...ఆశ
విజయం సాధించాలని...
విశ్వ విజేత కావాలని...
పోరాడే...
ప్రతి "మనిషికి" ఒకటే...కల
అఖండ విజయం సాధించాలని...
పరిగెత్తే...
ప్రతి "నదికి" ఒకటే...ఆశ
త్వరగా కడలి ఒడిని చేరాలని...
ఎగిసిపడే...
ప్రతి"అలకి" ఒకటే...కల
త్వరగా ఆవలితీరం చేరాలని...
మరణించే...
ప్రతి"మనిషికి" ఒకటే...ఆశ
మళ్ళీ తిరిగి మనిషిగా జన్మించాలని...
23. అజాత శత్రువుగా అస్తమించు..!
ఓ నా ప్రియమిత్రమా..!
నీవు కన్నుమూసి కాటికెళ్ళేలోగా
పగా ప్రతీకారాలకి స్వస్తిపలికి...
నీ శత్రువులందరినీ...
ఓ ప్రేమపూర్వకపు పలకరింపుతో
ఒక ఆత్మీయమైన ఆలింగనంతో
ప్రాణమిత్రులుగా మార్చుకుని
ఆపై ప్రశాంతంగా సమాధికి చేరుకో...
నీ ప్రాణమిత్రులే కాదు
నీ బద్దశత్రువులు సైతం
నీవు ప్రేమకు ప్రతిరూపమని...
ప్రతిభాశాలివని...స్నేహశీలివని...
ధర్మదాతవని...
దయాసముద్రుడవని...
నీతిమంతుడవని...
నిప్పులాంటివాడవని...
మంచివాడివని...
మానవత్వమున్నవాడివని...
మచ్చలేని స్వచ్చమైన
వ్యక్తిత్వంగల వ్యక్తివని ఒక శక్తివని...
నిన్ను నీ నామాన్ని
ప్రతినిత్యం స్మరించిన చాలు...
నీ ఈ నరజన్మధన్యమే...నీకు
దక్కును వేయిజన్మల పుణ్యఫలమే...
24. దైవస్వరూపులు..! ధన్యజీవులు..!
కొందరు
కవులను
ఆదరిస్తారు...
కొందరు
కవిత్వాన్ని
ప్రోత్సహిస్తారు...
కొందరు కవులను
కవిత్వాన్ని గౌరవిస్తారు...
కొందరు కవి కలాన్ని
కవిత్వాన్ని ప్రేమిస్తారు
ప్రాణం కన్నా ఎంతో మిన్నగా
ఆరోగ్యాన్ని
ఫణంగా పెట్టి...
కష్టపడి ఇష్టపడి
సమాజంలో ఒక
మంచిమార్పు కోసం...
తపించే...
నిరంతరం శ్రమించే...
కనువిప్పు కలిగించే ...
చైతన్య జ్వాలలు రగిలించే...
కవిత్వాన్ని వ్రాసే కవులను
మనస్పూర్తిగా...దీవిస్తారు...
వారే...స్పూర్తి ప్రదాతలు.....
కవులు నిండు నూరేళ్లు...
వర్ధిల్లాలని...చల్లగా...ఉండాలని...
ఆపరమాత్మను ప్రేమతో ప్రార్థిస్తారు...
వారే...అభినవ రాయల వారసులు...
వారే...మార్గదర్శులు...మహాత్ములు...
వారే...నలుగురి మేలు కోరే నక్షత్రాలు...
వారే...దైవస్వరూపులు...ధన్యజీవులు ...
25. మోహపు చూపే
మోసకరం...నాశనకరం..?
మత్తయి సువార్త...
5వ అధ్యాయం...
28వ వచనం...
ఒక స్త్రీని మోహపు చూపుతో
చూచు ప్రతివాడు అప్పుడే
తన హృదయమందు ఆమెతో
"వ్యభిచారం" చేసినవాడగును...
అంటూ చేసిన బైబిల్ "దివ్య ప్రబోధం"....
గుర్తుంచుకోవాలి
భార్యాభర్తలిద్దరూ "బ్రతికినంతకాలం"....
ఆరీతిగా...
ఒక పరపురుషున్ని
ఆనందపరచాలని...
ఆకర్షించాలని...చెడుభావనతో
కొత్త పెళ్ళికూతురులా...
అందంగా అలంకరించుకొని...
మదిలో దూరిన చెడు ఆలోచనలతో...
తలలో దూరిన తప్పుడు తలంపులతో...
వక్రబుద్ధితో చాటుమాటుగా
దొంగ చూపులు చూచు ప్రతిఆడది
అప్పుడే తన హృదయమునందు ఆమె
ప్రాణానికి ప్రాణమైన తన భర్తను తానే
అతి దారుణంగా"దగా"...చేసినదగును...
అప్పుడే తన "భర్త గౌరవానికి"
తానే "మాయని మచ్చ"తెచ్చినదగును...
అప్పుడే తన పచ్చని కాపురంలో
తానే "ఆరని చిచ్చు" పెట్టుకొనినదగును...
అంటూ...
"విడాకుల విషం" పుచ్చుకున్న
"విధివంచితులు" విలపిస్తూ
ఆలపించిన.....ఆ "విషాదగీతం"...
గుర్తుంచుకోవాలి...
భార్యాభర్తలిద్దరూ "జీవితాంతం"...
26. పరమాత్మ పాడిన పాటే..!
ఓ నా ప్రియనేస్తమా..!
నా అభయ హస్తమా..!
ఓ మంచిమాట చెబుతా వినుమా..!
నీ వయస్సును...
నీ ప్రాణమిత్రులతో లెక్కించు..!
గతించిపోయిన
గాడాంధకారంతో నిండిన
సంవత్సరాలతో కాదు..!
సమస్యల సునామీలతో కాదు..!
నీ జీవితాన్ని...
చెరగని చిరునవ్వులతో లెక్కించు..!
కన్నీళ్ళతో కాదు కష్టాలతో కాదు..!
విధివ్రాతతో కాదు..!గుండెకోతతో కాదు..!
మీ హృదయాన్ని...
ప్రేమ...దయా... జాలి...
కరుణామృతధారలతో నింపుకో..!
కసి...అసూయాద్వేషాలతో
పగా...ప్రతీకారాల మురికితో కాదు..!
నీ పెదవులను...
చిరునవ్వుల మధువులతో..!
మీ నాలుకను...
మృధు మధురమైన మాటలతో..!
నీ రెండు కళ్ళను...
ప్రేమ ఉప్పొంగే చూపులతో నింపుకో..!
నీ జీవితం...సస్యశ్యామలమే..!
నీ జీవితం...సుందర నందనవనమే...!
నీ జీవితం...పురివిప్పిన మయూరమే..!
నీ జీవితం...ఏడురంగుల ఇంద్రధనుస్సే..!
నీ జీవితం...పంచ రంగుల రామచిలుకే..!
నీ జీవితం...పున్నమి నాటి పండువెన్నెలే..!
నీ జీవితం...స్వర్ణశోభితమే స్వర్గతుల్యమే..!
అది వరాలమూటే ! పరమాత్మ పాడినపాటే!
27. నది నవ్వుతుంది...
మెల్లగా నడుస్తుంది
చకచకా పరుగులు
పెడుతుంది ఆపై
నురగలు గ్రక్కుతూ...
కొంత దూరం
నిర్మలంగా...నిశ్చలంగా...
ప్రశాంతంగా ప్రయాణిస్తుంది...
కడలి ఒడిని చేరేవరకు
బాటసారులెందరికో
తీరని దాహాన్ని తీరుస్తుంది...
ఎన్నో బీడు భూములను
సస్యశ్యామలం చేస్తుంది...
పచ్చని పంటలనిచ్చి రైతుల
బ్రతుకుల్లో వెలుగులు నింపుతుంది...
ఎందరికో ఆకలిమంటలు తీర్చి...
కడకు కడలిలో కలిసి పోతుంది..
ఉప్పగా మారిపోతుంది...
నది తన ఉనికినే కోల్పోతుంది...
కన్నుమూసిన జీవాత్మ
పరమాత్మలో కలిసిపోయినట్లు...
28. నీ కవిత్వం "రక్షణ కవచం" కావాలి...
కవీ..! ఓ కవీ..!
కలం కత్తిని ధరించిన ఓ రవీ..!
నీ పేరు వినపడగానే
నీ కవిత మదిలో మెదలాలంటే...
నలుగురి నాలుకలపై
నీ కవిత నాట్యమాడాలంటే...
చిక్కని మజ్జిగలా ఉండాలంటే...
నిత్య నూతనంగా ఉండాలంటే...
నీ కవిత కమ్మగా కడుపు నింపేలా...
కాస్త బలంగా బరువుగా ఉండాలంటే...
నోరూరించే హైదరాబాద్ దమ్ము
బిర్యానీలా నీ కవితను వండాలంటే...
నలుగురికి ఆకర్షించేలా
నీ కవిత నవవధువులా ఉండాలంటే...
ఎన్నో ఏళ్లు గుర్తుండిపోయేలా...
గుండెలను తాకేలా కవిత వ్రాయాలంటే...
మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా
భద్రంగాదాచుకునేలా నీకవిత పండాలంటే...
కొత్త కొత్తపదాలు కదం తొక్కాలంటే...
పదికాలాలపాటు పచ్చగా ఉండాలంటే...
కొసమెరుపులు తళుక్కున మెరవాలంటే...
కాలగర్భంలో కలిసిపోక బ్రతికిబట్టకట్టాలంటే
కవీ..! ఓ కవీ..!
కలం కత్తిని ధరించిన ఓ రవీ..!
నీవు నిత్యవిద్యార్థివై ఉండాలి...
ప్రాచీన నవీన కవి పండితుల
బృహత్ గ్రంధాలను
లోతుగా అధ్యయనం చేయాలి...
కవిత్వమే ఊపిరిగా జీవించే
సాహితీమూర్తులతో
సంస్థలతో సత్సాంగత్యముండాలి...
ఆ సరస్వతి దేవి కరుణా కటాక్షం
నిండుగా మెండుగా నీకుండాలి...
నిత్యం నీ కలాన్ని
కత్తిలా పదునుపెడుతూ
సాహితీ తృష్ణతో సాధన చేయాలి...
మెరుగైన సమాజానికి
నీ కవిత్వం "రక్షణ కవచం" కావాలి...
29. దైవాన్ని నిందించకు...
ధైర్యాన్ని బంధించకు...
అప్పుడప్పుడు...
ఆశలు చిగురించినప్పుడు...
చిరునవ్వులు సిరిసంపదలు...
చిటపట చినుకుల్లా రాలతాయి...
అప్పుడు జీవితాలు కళ కళ లాడుతాయి... నింగిలోని తారల్లా మిళ మిళ మెరుస్తాయి...
సుఖ సంతోషాలొచ్చినప్పుడు ఆనందించు
కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఆలోచించు
నిన్నటి కంటే నేడు బాగుండాలని భావించు
అందంగా అద్భుతంగా ఉండాలని ఆశించు
పరిష్కారాలకై ప్రయత్నించు...
సమస్యల సంకెళ్లు తెంచుకునేందుకు...
ప్రతినిత్యం ఆ పరమాత్మను ప్రార్థించు కానీ
దైవాన్ని నిందించకు...ధైర్యాన్ని బంధించకు
కొన్ని కష్టాలు నష్టాలు...
ఇబ్బందులు ఈతి బాధలు ...
వాగులై...వంకలై...వరదలై...వస్తాయి
సునామీలై...నిన్ను చుట్టుముడతాయి
నీ ఆశలు ఆవిరైపోతాయి
నీవుకన్న కలలన్నీ కన్నీటి వరదలౌతాయి
ఇదే మరి చీకటివెలుగుల...జీవితమంటే...
అందుకే చింతించకు...అందరి జీవితాలింతే
30. ఉడతలకేల ఉచిత సలహాలు..!
మిత్రులారా !
మీకు చేతులు జోడించి
చేస్తున్న నా చిరువిన్నపమొక్కటే..!
అడగకనే ఆవేశపడి
తొందరపడి ఎవరికీ మీరు
ఉచిత సలహాలివ్వకండి..!
"మంచి జరిగితే" మరిచి పోతారు
"చెడు జరిగితే" జీవితాంతం
మిమ్మల్ని దూషిస్తూనే ఉంటారు
గుండెలు కలుక్కుమనేలా
నిందలు వేస్తూనే ఉంటారు
నిప్పులు చెరుగుతూనే ఉంటారు
కనిపిస్తే ఉరిమి చూస్తారు
ఉరివేస్తారు ఊపిరి తీస్తారు
నిజానికి ఎంతో శ్రమకోర్చి ...
ఎంతో విలువైన సమయం వెచ్చించి...
ఒక మంచి పెళ్లి సంబంధం కుదిర్చితే...
ఆ సంసారం సాఫీగా సాగినంతకాలం
ఆ జంట కనులపంటగా ఉన్నంతకాలం
ఆ సంబంధం కుదిర్చినవారు...దేవుళ్ళే...
ముక్కోటి దేవతలు దీవించి
మూడు ముళ్లు వేయించినా
విధి పగబడితే...పచ్చని కాపురాల్లో
అపార్ధాలు పెరిగి ఆరనిచిచ్చు రగిలితే...
వారి వక్రబుద్ది వంకర ఆలోచనలతో...
వారి మొండితనంతో అహంకారంతో...
కొత్తగా ఏర్పడిన అక్రమసంబంధాలతో...
ఆస్తులపై ఆశతో కట్నాల మీద మోజుతో...
తొలినాటి స్వచ్చమైన ప్రేమలు తరిగిపోయి
పగ ప్రతీకారాలు పెరిగిపోయి...
ఒకరంటే ఒకరికసహ్యం కలిగి...
ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటే...
నిజానికి
వారు ఇతరుల
మీద నిర్దాక్షిణ్యంగా
నిందలు మోపడం తప్ప...
తమ లోనికి తాము తొంగిచూడరు...
తమ తప్పులు తాము తెలుసుకోరు...
తమ అంతరాత్మను తాము అడగరు...
తమ లోపాలను తాము సరిదిద్దుకోరు...
తమ నోరును తాము అదుపులో పెట్టుకోరు
చక్కని కాపురాన్ని
ముక్కల్జేసే తమ ముక్కుమీది
కోపాన్ని తాము నియంత్రించుకోరు...
సమస్యను పరిష్కరించేందుకు...
చిత్తశుద్ధితో ప్రయత్నించరు...
తమ "మొండితనాన్ని"
తమ "అహంకారాన్ని" ఒప్పుకోరు...
"ముఖాముఖి చర్చలకు" సిద్ధంకారు...
కానీ అభిప్రాయాలు కుదరక...
సమస్యలు పరిష్కరించుకునే
సహనం...సమయస్పూర్తి లేక...
అనుమానాలు అపార్ధాలు పెరిగి...
ఇద్దరి మధ్య ఒక అగాధం ఏర్పడి...
జాతకాలే తారుమారై...
జగడాలమారి జంటలు విడిపోయి..
విడాకులు తీసుకుంటే...
బాధ్యులెవరు? భగవంతుడా..?...కాదు
సంబంధం కుదిర్చిన మీరా.....?...కాదు
అంతా స్వయంకృతాపరాధమే...
తమ మొండితనమే...తమ గర్వమే...
తమ అహంకారమే...తమ అవివేకమే...
తమ అజ్ఞానమే...తమ అమాయకత్వమే...
అందుకే అద్దం
ముందు నిల్చుంటే అర్థమౌపోతుంది ...
ఆ కార్చిచ్చుకు
అసలు కారకులెవరో తేలిపోతుంది...
ఇంట్లో ఎలుక దూరిందని
ఇల్లు తగలబెట్టుకున్నదెవరో...
తాము కూర్చున్నకొమ్మను నవ్వేస్తూ
నరికేసుకున్నదెవరో...తెలిసిపోతుంది...
మిత్రులారా..!తెలుసుకోండి..!
అడగని ఉడతలకు ఉచిత
సలహాలివ్వడం అజ్ఞానమని...
తలమీద తాటికాయ పడినట్లేనని...
మంచికోసం పోతే ఎదురయ్యేది చెడేనని...
తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డభేరమని
31. కొండెక్కిన టమాటా కోతి...?
నిన్న...నిగనిగ లాడింది...
...ఏమిటి..?
నేడు...భగభగ మండుతోంది...
...ఎందుకు..?
ఒకవైపు అతివృష్టితో...అనావృష్టితో
చేతి కందివచ్చిన పచ్చని పంటలపై
ప్రకృతి పట్టింది...పగా పగా...ఎందుకు..?
మరోవైపు మార్కెట్లో మాయాజాలం...
కమీషన్లకు కుక్కుర్తి దళారుల...దగా దగా...
తీర్చేదెవరు కర్షకుల కన్నీటి వ్యధా...బాధ..?
మధ్యతరగతి వంట గదిలో కమ్ముకుంది
నల్లనైన దట్టమైన...పొగా పొగా ఎందుకు..?
ఔను నేడు బంగారం కన్నా ఖరీదైనది
విలువైనది...ధగధగా...మెరిసిపోతున్నది
రెక్కలొచ్చి ఆకాశంలో పక్షిలా
అందనంత ఎత్తులో ఎగురుతున్నది..?
అందరికీ పట్టపగలే చుక్కల్ చూపిస్తున్నది
ఏమిటది...? ఏమిటది..? ఏమిటది..?
భయభ్రాంతులకు గురిచేసే...
"కొరివి దెయ్యమా"?...కాదు కాదు
కొనలేని తినలేని గుంటూరు...
"కొరివి కారమా"?...కాదుకాదు మరింకేటి..?
టాటా చెప్పేసి చెట్టు కొమ్మల్లో
దూరిన "ఎర్రమూతి టామోట కోతి"...
దిగి...రారమ్మంటూ భువికి ముక్కోటి
దేవతలకు మ్రొక్కుతుందీ..."నరజాతి"...
32. నిప్పులు చెరుగుతూ...
టమోటాయాన్ 300 "నింగికెగిరే....
వర్షాకాలంలో
కురిసే కుంభవర్షాలకు...
విసిరే హోరుగాలులకు... పండిన
"టమోటా"పంటలు ధ్వంసమాయె...
భగభగ మండే ఎండలకు
పెరిగిన భూతాపానికి
"టమోటాల" దిగుబడి తరిగిపోయె...
"టమోటా"...
నిల్వల గిడ్డంగుల
నిర్మాణంలో ప్రభుత్వం
ఘోరంగా విఫలమాయె...
కూలీలరేట్లు దళారీల కమీషన్లు...
రవాణా ఖర్చులు...పెరిగిపోయే...
గిట్టుబాటు
ధర లేకపోయె...
మార్కెట్లో..."టమోటా"
ధరలకు రెక్కలొచ్చి
ఆకాశంలో విహరించుడాయె...
"టమోటాలు"...
కొనలేని తినలేక...
వంటగదిలో మధ్యతరగతి
మహిళలకంట కన్నీటి వరదలాయె...
రెక్కలొచ్చి "టమోటాలు"
ఆకాశంలో చుక్కలాయె...
అందనీ ద్రాక్ష లాయె...
కొనబోతే కొరివాయె...
అమ్మబోతె అడివాయె...
కడకు..."టమోటాలు"...
బర్త్ డే గిఫ్ట్ గా మారిపోయె...
వంటగదిలో నిట్టూర్పులాయె...
వంటావార్పూ కడుభారమాయె...
జంటలమధ్య జగడాలాయె...
ఆకలిమంటలు ఆరవాయె...
మొన్న కోట్లఖర్చుతో
మన చంద్రయాన్...3
నిప్పులు చెరుగుతూ
నింగిలోకి దూసుకుపోయింది...
కానీ రెక్కలొచ్చి చుక్కల్లోకంలోకి
శరవేగంగా దూసుకుపోతున్న
మన..."టమోటాయాన్ 300"
దివినుండి భువికి దిగివచ్చేదెప్పుడు..?
అధికారులు పాలకులు నిద్రలేచినప్పుడు...
మేధావులు నాయకులు మేల్కొన్నప్పుడు...
భగభగమని మండే ధరల నియంత్రణకు.....
ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినప్పుడు...
33. మణిపూర్ లో...
ఆరని చితిమంటలు..?
కంచే చేను మేసే వేళ...
పాలకులే ప్రేక్షకులైన వేళ...
తాడిత...పీడిత...
బహుజన...గిరిజన...
బడుగు బలహీన వర్గాలకు...
రాజ్యాంగ రక్షణ లేని వేళ...
చట్టాలే....చుట్టాలైన వేళ...
నిస్సహాయురాలై
న్యాయదేవత నిట్టూర్చే వేళ...
చిత్రగుప్తుని సూచనలమేర...
ఇదే యమధర్మరాజు ఆజ్ఞ...
యమ భటులారా...!
ఎక్కడ మీరు...?
తక్షణమే...
నరలోకంలో...
భరతఖండంలో...
మూర్ఖులు ముష్కరులు
మారణహోమం సృష్టించే
మణిపూర్ లో ప్రవేశించండి...
మదం...
మతమన్న...
"విషం" తలకెక్కి
మూత్రమెక్కడా పోయాలో
తెలియక మనుషుల మీద
విసర్జించే "విష పురుగులను"
మరుగు దొడ్లలో బంధించండి..!
అమాయకపు గిరిజన మహిళలను
"నగ్నంగా" నడివీధిలో ఊరేగించే
"ఉన్మాదుల" తలలు తెగనరికి
ఊరి పొలిమేరల్లో వ్రేలాడ తీయండి..!
నిస్సహాయులైన
"కుకీ" మహిళలను
మానవత్వం మరిచి...
మానభంగం చేసిన...
"మానవ మృగాల" "
మర్మాంగాలను" ఛేధించి...
నడివీధిలో వారిని ఉరితీయండి..!
నరమేధం...
గృహదహనం...
నిత్యకృత్యమైన
నరరూపరాక్షసుల్ని
నరికి కాకులకు గద్దలకు
ఆహారంగా విసిరివేయండి..!
"మతోన్మాదులను"...
గొడ్డళ్ళతో నరకండి...
బాకులతో పొడవండి...
మీ గదలతో మోది
వారి గుండెల్ని చీల్చండి...
"మానవ మృగాలను"...
చెట్లకు కట్టేసి
తలక్రిందులుగా
వ్రేలాడదీసి నిప్నుపెట్టి
కాల్చి బూడిద చేయండి...
ఔను ఇలాగే జరగాలి...
అప్పుడే మన కన్నతల్లి
భారతమాతకు మనశ్శాంతి...
అప్పుడే రావణకాష్టంలా రగిలే
మణిపూర్ లో జరిగే...ఆ దారుణ
"మారణహోమానికి" ముగింపు...
34. మణిపూర్ లో మారణహోమం..?
మొన్న చంద్రయాన్...3
నిప్పులు చెరుగుతూ
నింగికెగిరి చంద్రుడి
దక్షిణ ధృవం వైపు
విజయవంతంగా
దూసుకొని
పోతున్ననందుకు
గర్వంగా తలెత్తుకున్న
140 కోట్లమంది
భారతీయులను...సిగ్గుతో
తల దించుకునేలా చేసిన...
అతినీచమైన...
అమానుషమైన...
అమానవీయమైన...సంఘటన...
కొందరు
రాక్షసమూకలు
రక్షక భటుల కళ్ళెదుటే
అత్యాచారాలకు పాల్పడి ఇద్దరు
అమాయకపు "కుకీ మహిళలను"
నగ్నంగా నడివీధిలో ఊరేగించడం...
అది సోషిల్ మీడియాలో వైరల్ పోవడం...
అత్యున్నత
పీఠాన్ని
అధిరోహించిన
రాష్ట్రపతి ముర్మును...
ప్రధానమంత్రి మోడీని...
హోం శాఖా మంత్రి అమిత్ షాని...
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను...
మహిళా కమీషన్ సభ్యులను..
అఖండ భారతావనిని...
విశ్వనరులను విస్మయానికి...
"దిగ్ర్భాంతికి" గురిచేసిన...
అతినీచమైన...
అమానుషమైన...
అమానవీయమైన...సంఘటన...
పోయిన హక్కులకై పోరాడే...
గిరిజన "కుకీ వ్యక్తి"తలనునరికి...
వెదురు కర్రకు...వ్రేలాడదీయడం...
ఎందరినో కదిలించిన
ఈ దురాగతాలకు అంతమెప్పుడు..?
మణిపూర్ లో జరిగే ఈ
దారుణ మారణహోమం ఆగేదెప్పుడు..?
మేధావులు నాయకులు మేల్కొన్నప్పుడు...
ప్రభుత్వం శాంతి ప్రణాళికలు
సిద్ధం చేసినప్పుడు...అప్పుడే...అప్పుడే...
35. లక్...&...కిక్...
పక్షులన్నాక......ఈకలుంటాయి
కోతులన్నాక.....తోకలుంటాయి
కడలి అన్నాక...అలలుంటాయి
కనులన్నాక......కలలుంటాయి
కాపురమన్నాక...
కలతలుంటాయి...కన్నీళ్లుంటాయి
జీవితం అన్నాక....చిక్కులుంటాయి
గుడ్ లక్...బ్యాడ్ లక్...
అంటూ రెండు......లక్కులుంటాయి
గుడ్ లక్...
ఒక కిక్...ఇస్తే చాలు
మన జీవితం...మన జాతకం
పూర్తిగా మారిపోతుంది...
తంతే గారెల బుట్టలో పడ్డట్టు...
కోటీశ్వరుల ఇళ్ళల్లో పడతాం...
శ్రీమంతుల కడుపున పుడతాం...
కలలో సైతం ఊహించని రీతిలో
ఎంతో ఎత్తుకు ఎదుగుతాం...
విలాసవంతంగా...బ్రతుకుతాం...
కానీ బ్యాడ్ లక్...
ఒక కిక్...ఇస్తే చాలు
మన జీవితం...మన జాతకం
పూర్తిగా మారిపోతుంది...
ఏ గోతిలోనో......ఏ నూతిలోనో
ఏ లోయలోనో...ఏ ఊబిలోనో
కలలో సైతం ఊహించని
ఏ అథఃపాతాళంలోనో పడిపోతాం...
కారు చీకటిలో కలిసిపోతాం...
కనుమరుగై పోతాం...ఔను
గుడ్ లక్.......లవ్ చేస్తే....సక్సెస్
బ్యాడ్ లక్....లవ్ చేస్తే....ఫెయిల్యూర్
కానీ ఒక్కటి మాత్రం మరిచి పోరాదు
లక్ + హార్డ్ వర్క్= సక్సెస్...అంటే...
లక్ అమ్మైతే...హార్డ్ వర్క్ నాన్నైతే...
ఆ ఇద్దరి సంతానమే...సంపూర్ణ సక్సెస్...
36. క్షమాభిక్షా..? మరణశిక్షా..?
ఒక "అబద్ధం" ఆడి
వంద పెళ్లిళ్ళు చేసినా... .
అవసరాలు...
తీర్చుకునేందుకు...
ఊరంతా "అప్పులు" చేసినా...
ఆకలి తీరక...
ఒక "నేరం" చేసినా...
తెలిసీ తెలియక
కాలు జారి...
ఒక "తప్పు" చేసినా...
ఒక "తప్పటడుగు" వేసినా...
ఒక "చిన్న దొంగతనం" చేసినా...
క్షమించవచ్చు.....
కరుణించి...పెట్టవచ్చు
అట్టి వారికి..."క్షమాభిక్ష "...
కానీ...మాయా మర్మం
ఎరుగని...మగువలను...
అభం శుభం...
తెలియని...అబలలను...
కాలనాగులై...
కామపిశాచులై...
కళ్ళు పొరలుకమ్మి
కన్యపిల్లల్ని...కాటువేస్తే...
నమ్మించి....మోసం చేస్తే...
మత్తెక్కించి...మాయచేస్తే...
తెలిసీ తెలిసీ...అదే తప్పు ...
అదే నేరం.....పదేపదే చెస్తే....
మనిషికి తప్పదు..."మరణశిక్ష "...
37. ఏనుగు..? ఎగిరి పడింది..?
(...హాస్య కవిత...)
ఎవరైనా
ఏనుగునెక్కి
ఊరేగాలనుకుంటారు
విధి వక్రించి ఏనుగు
తొండంతో కొట్టినా..!
తలమీద పాదం పెట్టినా..!
ఎట్టి వారైనా సరే పచ్చడి పచ్చడే..!
అధఃపాతాళానికే..!అనంత లోకాలకే..!
అట్టి ఏనుగుతో ఆడుకోవాలని..!
తంతే ఏనుగు ఎగిరి పడాలని..!
ఒక బాలుని విచిత్రమైన వింత కోరిక..!
జై పాతాళ భైరవి..!
ఏరా బాలకా..! ఏమి నీ కోరిక..?
తల్లీ నాకొక వరం ఇవ్వాలి..!
నేను గట్టిగా ఓ కిక్ ఇస్తే..!
ఏనుగు గాలిలో కెగరాలి..!
ఆహా ఏమిరా ఈ వింత కోరిక..!
అలాగే బాలకా ..!
ఈ రాత్రే తీరుతుంది నీ కోరిక..!
చిత్తం తల్లి..!
బాలుడు ఇంటి కెళ్ళి..!
గాఢనిద్రలోకి జారిపోయె..!
ఇంతలో ఓ వింత కలవచ్చే..!
కలలో పెద్ద ఫుట్ బాల్ గ్రౌండ్..!
కిక్కిరిసిన ప్రేక్షకులు..! కేరింతలు..!
ఫుట్ బాల్ ఆటలో బాలుడు..!
బలంగా షాట్లు..! ప్రేక్షకుల చప్పట్లు..!
గాలిలో తేలిపోతున్న ఫుట్ బాల్..!
బాలుడు నవ్వుతున్నాడు కిలకిల..!
గాలిలో ఏనుగు ఎగురుతున్నట్టు కల..!
మెలుకువ రాగానే..!
బాలుడు ఎగిరి గంతులేశాడు..!
ఎందుకు..! కోరిక తీరినందుకు..!
తంతే ఏనుగు ఎగిరి పడినందుకు ఎలా..!
ఆ ఫుట్ బాల్ మీదుంది ఓ"ఏనుగు బొమ్మ"
జై పాతాళ భైరవి ..!
ఏరా బాలకా తీరెనా..! నీ కోరిక..!
తీరింది తల్లీ..! తీరింది రాత్రి కలలో ..!
తంతే ఏనుగు ఎగిరింది గాలిలో..!
"ఫుట్ బాల్ " రూపంలో..!...
38. కాస్త గమనించాలి..!
గట్టిగా నిఘా పెట్టాలి..!
ఓ మిత్రమా..!
జీవితంలో మనకు నలుగురు కావాలి
నాలుగు విషయాలపై మనం దృష్టి పెట్టాలి
ఒకటి...మన "ముందు"...
ఎవరున్నారని..! ఉంటే..?
వారు నిరంతరం
మనకు తోడు నీడగా
కొండంత అండగా ఉన్నారా..?
మన ఎదుగుదలకు
అడ్డుగోడలుగా ఉన్నారా..?
కాస్త గమనించాలి..!గట్టిగా నిఘా పెట్టాలి..!
రెండు...మన " వెనుక "...
ఎవరున్నారని..! ఉంటే..?
వారు లోతుగా
గోతులు త్రవ్వుతున్నారా..!
కాస్త గమనించాలి..!గట్టిగా నిఘా పెట్టాలి..!
మూడు...మన "ప్రక్కన"...
ఎవరున్నారని..! ఉంటే..?
వారు ప్రక్కలో బల్లెంలా ఉన్నారా..?
కాస్త గమనించాలి..!గట్టిగా నిఘా పెట్టాలి..!
నాలుగు...మన "తలపై"...
ఎవరున్నారని..! ఉంటే..?
వారు ఎక్కి తైతక్కలాడుతున్నారా..?
మనల్ని పాతాళానికి తొక్కి వేయడానికి
కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారా..?
కాస్త గమనించాలి..! గట్టిగా నిఘా పెట్టాలి..!
39. చదువులతల్లి...
డాక్టర్ సాకే భారతికి...అక్షర హారతి..!
ప్రతిమగాడి...విజయం వెనుక
ఒక మహిళ ఉంటుందన్నది
...ఒకనాటి పెద్దల మాట...
భార్య...సాకే భారతి
పీహెచ్ డీ పట్టా వెనుక
తాత...సుంకన్న
భర్త...శివప్రసాద్ ఉన్నారన్నది...
...నేడు వైరలౌతున్న వార్త...
బస్...ఆటో ఏ సౌకర్యాలు లేని
ఒక మారుమూల గ్రామంలో...
పచ్చడి మెతుకులతో...
ఆ మెతుకులే లేకుంటే...
కన్నీళ్ళతో...మంచినీళ్ళతో...
కడుపులు...నింపుకొని
పస్తులు పడుకునే...
ఒక నిరుపేద కుటుంబంలో...
ఒకే కిడ్నీతో ఒక పూరిగుడిశెలో పుట్టి...
భూదేవంత సహనంతో...
ఆకాశమంతా ఆశయంతో...
నిరంతరం కసితో కృషితో...
ఎవరినుండి ఏదీ ఆశించని...
చదువేతప్ప మరేలోకం ఎరుగని...
అతి భారమైన...
అంధకార భరితమైన...
మెతుకులేని...అతుకుల...
గతుకుల...బ్రతుకు బాటలో...
కులంపేర అణచివేతలను...
ఆర్ధికపరమైన ఆక్రందనలను...
కష్టాలను...కన్నీళ్లను దిగమింగి...
ఎన్నో అవమానాలను...
మరెన్నో అవహేళనలను...
ఎదురు దెబ్బలను తట్టుకొని...
ఎదుగు బొదుగులేని బడుగు
జీవితంలో అడుగడుగునా
గండాలను...సుఖదుఃఖాల
సుడిగుండాలను దాటుకుని...
విషం చిమ్మే విధిని ఎదిరించి...
ఆకలిని పేదరికాన్ని జయించి...
నిరుపేద కూలిగా ఒక బిడ్డకు తల్లిగా...
ఎర్రని ఎండలో 8 కి.మీ కాలి నడకన
కాలేజీకెళ్ళి ఏడేళ్లు పట్టుదలతో చదివి...
తన భర్త కూతురు తోడు రాగా...
ఒక ముతక చేనేత చీరకట్టుకుని ...
కాళ్ళకు పారగాన్ చెప్పులు తొడుక్కుని...
శ్రీకృష్ణ దేవరాయల
విశ్వవిద్యాలయం
21వ స్నాతకోత్సవంలో...
రాళ్ళలో రత్నంలా...
మట్టిలో మాణిక్యంలా...
ఖరీదైన కోహినూర్ వజ్రంలా...
తళుక్కున ఒక "మెరుపై" మెరిసి...
"ఎవరెస్టు శిఖరం "ఎక్కినంతగా
ఆత్మతృప్తితో సగర్వంగా వేదిక నెక్కి...
గవర్నర్ గారి చేతులమీదుగా...
తన ఏడేళ్ళ కృషికి ప్రతిఫలంగా...
అతిక్లిష్టమైన రసాయన శాస్త్రంలో...
గైడ్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ పర్యవేక్షణలో...
"ఎ స్టడీ ఆఫ్ బైనరీ లిక్విడ్ మిక్చర్స్"అన్న
అంశంపై పరిశోధనా పత్రాలు సమర్పించి...
"డాక్టరేట్ పట్టా" దక్కించుకొని...
ఎందరో "ఆడపిల్లలకు ఆశాకిరణంగా"...
ఆధునిక యువతకు ఆదర్శంగా నిలిచిన...
స్పూర్తి ప్రదాత...
జ్ఞాన దేవత...
అక్షర జ్యోతి...
చదువులతల్లి...
సావిత్రి భాయి
పూలేె వారసురాలు...
చదువులతల్లి డాక్టర్ సాకే భారతి...
ఘన విజయానికి...వెనుకనున్నది
తాత...సుంకన్న...భర్త...శివప్రసాద్ ల
రెండుఆత్మలని నాలుగు అభయహస్తాలని..
వారి ప్రేరణ...ప్రోత్సాహం...త్యాగమేనని...
సోషియల్ మీడియాలో వైరల్ ఔతున్న
ఒక సంతోషకరమైన...సంచలన వార్త...
"కృషివుంటే మనుషులు ఋషులౌవుతారు...
మహాపురుషులౌతారు"...
అన్నది ఒకనాటి సినీ చైతన్యగీతం...
అదే కసి...కృషి...పట్టుదలతో...
ఒక ఆశయంతో అంకితభావంతో
శ్రద్ధతో ఉన్నతవిద్యను అభ్యసిస్తే...
గౌరవప్రదమైన డాక్టరేట్ పట్టాను...
సాధించుట సాధ్యమేనని నిరూపించింది...
"కష్టే ఫలి"...
"శ్రమయేవ జయతే "...
అన్న నినాదాలకు...నేడు
నిలువెత్తు ప్రతిరూపంగా...
నిలిచింది...పేదరికాన్ని గెలిచింది...
జయహో జయహో...ఓ చదువుల తల్లి...
డాక్టర్ సాకే భారతి...నీకిదే నా అక్షరహారతి.
40. నిన్ను నీవు అర్పించుకో..!
అమృతం త్రాగినా...
ఆకలి తీరునా?.....లేదే...
దాహం తీరునా?...లేదే...
మంచినీరు దొరకలేదని...
మురికి నీటిని త్రాగగలమా...? లేదే...
ఉప్పు నీటిని త్రాగగలమా ....? లేదే...
అందుకే ముందుగా
నిన్ను నీవు పరీక్షించుకో..!
నిన్ను నీవు జయించుకో..!
నిన్ను నీవు ప్రశంసించుకో..!
నిన్ను నీవు భుజం తట్టుకో..!
నిన్ను నీవు ముందుకు నెట్టుకో..!
నిన్ను నీవు పూర్తిగా తెలుసుకో..!
నిన్ను నీవు సరిదిద్దుకో..!
నిన్ను నీవు ప్రశ్నించుకో..!
నిన్ను నీవు ప్రేమించుకో..!
నిన్ను నీవు శుద్ధి చేసుకో..!
నిన్ను నీవు నియంత్రించుకో..!
నిన్ను నీవు ఆ దైవానికి అర్పించుకో..!
41. ఇంట పన్నీరు...కంట కన్నీరు..?
నిన్న...
టమోటాను..."నమ్మిన"
అన్నదాతల
బ్రతుకులు
అంధకారమాయే..!
గాడాంధకారమాయె..!
నేడు...
టమోటాను..."అమ్మిన"
అన్నదాతల
బ్రతుకులు
బంగారమాయె..!
పెట్టుబడి గిట్టుబాటాయె..!
నిన్న...
టమోటాను..."నమ్మిన"
అమాయకపు
అన్నదాతలలెందరో...
గిట్టుబాటు ధర లేక...
పెట్టుబడి ఖర్చులు రాక...
బ్యాంకు అప్పులు తీర్చలేక...
తాకట్టు పెట్టిన పుస్తెలు తేలేక...
ఆవేశంలో పురుగు మందు త్రాగి...
"ఆత్మహత్యలు"...చేసుకున్నారాయె..!
నేడు...
టమోటాను..."అమ్మిన"
అదృష్టవంతులైన
అన్నదాతలెందరో
కలలుపండి..! కడుపునిండి..!
ఏ నక్కను తోక్కారో ఏమో...
ఒక్క నెలలో...ఒక్క రోజులో...
ఒక్క రాత్రిలో..."కోటీశ్వరులైపోయే"..!
కాలం కరుణిస్తే ప్రతి ఇంటా పన్నీరే..!
కరుణించకుంటే ప్రతి కంటా కన్నీరే..!
రచన:
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ ....హైదరాబాద్ చరవాణి...9110784502

Comments
Post a Comment