34... సెప్టెంబర్ నెల 2023 కవితలు

 34...సెప్టెంబర్ నెల 2023 
        కవితల ఇండెక్స్ 

1.  విడాకులా..?మామిడాకులా..? 
2. ఆ ముగ్గురిలో మీరెవ్వరు..?
3. ఏకాంతం వద్దు..!
     మందహాసమే ముద్దు..!!
4. శత్రువు...ఒక్కరు చాలు..!
5. రామబాణంలా...
    దూసుకుపోవాలి..!
6. ఆ రెండడుగులు..?
7. నిజమైన ఆత్మీయులు...ఎవరు?
8. ఆ దేవదేవుడు 
9. ఏమిటీ రక్తపాతం..?
    ఎందుకీ రాక్షసత్వం..?
10. అందరికీ "శుభ "శుభోదయం..!
11. బడా భక్తులు...? కార్పోరేట్ శక్తులు..??
12. నోటి మాట...కన్నీటి విలువ 
13. మీరు రెక్కలులేని పక్షులు కాదు 
14. ప్రేమను కొనుక్కోండి ?
15. ఔను ఇది నిజమేనులే..!
16. ఊ అంటారా..?
      ఊహూ అంటారా..?
17. బంగారు బైబిల్ గనిలో...
18. ఇదే ఇదే సుఖజీవన సూత్రం...?
19. ఓ నరరూప రాక్షసుల్లారా..!
      ఆపండి...మీ నరమేధం....!
20. మనసులో... మలినం..?
       కడుపులో... కల్మషం....?
21. అంతరంగం... 
      ఆలోచనా తరంగం...
22. అరిషడ్వర్గాలు...
23. ఓ సనాతనమా..?
      కాసింత సమాధానం చెప్పుమా..!
24. పోలన్న కవి సుభాషితం..!
25. నిజజీవిత నిత్యసత్యాలు..!
       అనుభవాల ఆణిముత్యాలు..!! 
       (మినీ కవితలు)
26. మద్యం మత్తుకు 
       బానిసలైతే మరణమే? 
27. చిరకాలం 
      జీవించడానికి చిరుచిట్కాలు... 
28. ఇక మీరే తేల్చుకోండి మీరెవరో..?
29. సుఖజీవన సూత్రాలు 
      (మినీ కవితలు)
30. మీరే మట్టికరిపించే మాంత్రికులు..!
31.  పెద్దలమాట...సద్దిమూట
32. జీవిత మధురిమలు (మినీ కవితలు)
33. పరాజయం నుండి 
      పాఠాలు‌ నేర్చుకో..!!
34. మేరా భారత్ మహాన్... 



1. విడాకులా..?మామిడాకులా..? 

మనసు మనసు 
ఏకమైతే ఒక లోకమైతే... 
ఇక మ్రోగేది "మంగళ వాయిద్యాలే"...
ద్వారాల నిండా "మంగళ తోరణాలే"...
ఇంటినిండా..."పచ్చని మామిడాకులే"... 
  
కనువిందు కలిగించే
కల్యాణ వేదికలే... 
పెనవేసుకుపోయేది 
అనురాగబంధాలే... 
అంతులేని ఆనందాలే... 
అంబరాన్ని అంటే సంబరాలే... 
అతిథుల అక్షింతలే...ఆశీస్సులే... 
మనసారా మమతల పెళ్లి పందిళ్ళే...
కడుపారా కమ్మని విందుభోజనాలే.... 

కానీ 
నిన్న ప్రేమల 
వానలు కురిసి...
మనసులు మురిసి...
నేడు విరిగిన ఆ మనసుల్లో 
అనుమానాల మేఘాలు ముసిరి...
అపార్థాల అల్పపీడనాలు ఏర్పడి...
విభేదాల విషాదాల హోరుగాలులు వీచి...
అసూయద్వేషాల తుఫానులు చెలరేగి... 
సమస్యల సునామీలు చుట్టుముడితే...
తప్పునా తీసుకోక " కోర్టులో విడాకులు...

ఔరా ఇది విధి వికృత చర్యనా..?
భార్యా భర్తల స్వయంకృతాపరాధమా..?
అహంకారమా..? ఆధిపత్యపోరునా..?
ఆ ఇద్దరిలో సహనం సంయమనం
సమయస్ఫూర్తి శూన్యమా..?
సుఖజీవన సూత్రాన్ని... 
పవిత్ర మంగళసూత్రాన్ని... 
ముడివేయకపోవడమా...?
ఏమై ఉండునోఎవరికి ఎరుక
పైనున్న ఆ పరమాత్మకు తప్ప...

2. ఆ ముగ్గురిలో మీరెవ్వరు..?
 
ఆ ముగ్గురు
ప్రేమమూర్తులు...
ఆదర్శప్రాయులు... 
దయార్ద్రహృదయులు...
ముగ్గురు ఒక్కరైతే
వారే సంఘసంస్కర్తలు...

ఒకరు...
ఎవరికెట్టి ఇబ్బంది 
వచ్చినా స్పందిస్తారు... 
స్వచ్చందంగా 
సహాయాన్ని  అందిస్తారు...
వారే ఉత్తమోత్తములు...

కొందరు...
కోటీశ్వరులైనా
పిల్లికి కూడా బిక్షం పెట్టరు
తాలి కట్టిన ఆలికి 
పుట్టిన బిడ్డలకు 
తోబుట్టువులకు 
ప్రేమ కురిపించిపెట్టి 
రహస్యంగా లెక్కలు వ్రాస్తారు 
వారే అధములు...
వారు పరమ పిసనారులు...

మరికొందరు...
తమ హస్తాలకు 
జతగా ఆదుకునే
కొన్నివేల ...ఆపన్న 
అమృత...అభయహస్తాలతో
ప్రజాహిత సామాజిక 
కార్యక్రమాలను నిర్వహిస్తారు

నిరుపేదల...
ఆశలను...ఆకలిని...
అవసరాలను తీర్చేస్తారు... 
వారే మహాత్ములు...
మహనీయులు...
వారే ధన్యజీవులు...
పుణ్యమూర్తులు...
వారే సహృదయులు...
సంస్కారవంతులు...
వారే సంఘసంస్కర్తలు...
అమరజీవులు...ఆదర్శప్రాయులు...

3. ఏకాంతం వద్దు..!
    మందహాసమే ముద్దు..!!

జరగని
వాటిగురించి 
ఎక్కువ సేపు 
అనవసరంగా 
ఆలోచించవద్దు...
నీవు "కాలజ్ఞానివి" కాదు...

ఆవేశపడవద్దు...
హద్దులు దాటవద్దు...
మాటమాటకు మధ్య 
మౌనముద్రయే ముద్దు... 
మౌనం ఒక "మంత్రదండం"...

కోపంతో పిచ్చిపట్టినట్లుగా...
అరిచినట్లుగా కరిచినట్లుగా...
ఎక్కువసేపు మాట్లాడవద్దు... 
ఎవరితోనూ పోట్లాడవద్దు... 
నీ "కోపాగ్నికి" నీవే బలికావొద్దు...

దేన్ని గురించి ఎవరితోనూ
ఎక్కువసేపు చర్చించవద్దు... 
ఎక్కువసేపు వాదించవద్దు...
"వాదోపవాదాలు" వెర్రివేదాలు...

జరగనివి లేనిపోనివి ఊహించవద్దు...
భయానికి పిరికితనానికి బలికావొద్దు...
బానిసత్వంలో బ్రతుకును ఈడ్చవద్దు...
జీవితాన్ని"నిప్పులకుంపటిగా"మార్చకోవద్దు

తెలుసుకో మిత్రమా ఏడ్పు ఏకాంతం... 
నరకూపానికి...ఒక రహస్య మార్గమని...
మదిలో మందహాసం...వెలిగే దీపమైతే... 
ప్రతిమనిషి జీవితం ఓ భూతలస్వర్గమని.. 

4. ఆ పరమాత్మ ఒక్కరు చాలు..!

ఆ పరమాత్మ... 
ఒక్కరు చాలు... 
నీ బొందిలో 
ప్రాణం...పోసేందుకు...

అమ్మా...
నాన్నలిద్దరు చాలు... 
ఈ జగతిలో...
నీకు...జన్మనిచ్చేందుకు

శత్రువు... 
ఒక్కడు చాలు... 
నీ పాపాలను 
నీలోని లోపాలను...
ఎత్తిచూపేందుకు...

స్నేహితులు... 
నలుగురు చాలు... 
నీ పార్థివదేహాన్ని...
మోసేందుకు...

కొడుకు... 
ఒక్కడు చాలు...
నీ చితికి...కొరివి పెట్టేందుకు...

ఎన్ని సంబంధాలొచ్చినా...
నచ్చారని ఎందర్ని ప్రేమించినా...
కడకు కళ్యాణానికి ఒక్కరు చాలు...
మూడుముళ్లు...వేసేందుకు...
కలిసి...ఏడడుగులు నడిచేందుకు...
జీవితాంతం జతగా... బ్రతికేందుకు...

5. రామబాణంలా...
    దూసుకుపోవాలి..!

రామబాణంలా...
దూసుకు పోవాలి...ఎక్కడికి..? 
అగాధంలోకి...కాదుకాదు 
అభివృద్ధి శిఖరం వైపుకు...

రామబాణంలా...
దూసుకు పోవాలి...ఎక్కడికి..? 
రామరాజ్యమంటూ...
రావణరాజ్యమేలే రాక్షసుల వైపుకు...
పదితలల రావణాసురుల వైపుకు...

రామబాణంలా...
దూసుకు పోవాలి...ఎక్కడికి..? 
పరమటి కొండల్లోకి...కాదుకాదు..!
సూర్యుడు కనిపించే వైపుకు...
సుప్రభాతం వినిపించే వైపుకు... 
వెన్నెల వెలుగులు విరజిమ్మే వైపుకు...
అభ్యుదయపు ఆకాశపు అంచులదాకా...

6. ఆ రెండడుగులు..?

ఓ ప్రియమిత్రమా !
చెప్పనా ఓ పచ్చినిజం 
నీకర్థం కాని ఓ నిండునిజం

నిన్న నీవు 
"ఒంటరిగా" నడిచావు
నడుస్తూ కింద పడిపోయావు
తిరిగి నీవు పైకి లేవలేకపోయావు 

నేడు పైకి లేచావు...నడిచావు 
ఓ"అదృశ్యశక్తి" తన "అభయహస్తం" 
అందించి నిన్ను లేపిందని నీకు తెలియదు

నిన్న నీవు ఇసుక ఎడారిలో నడిచేవేళ  
నీకు ముందుగా ఓ"అదృశ్యశక్తి"నడిచింది  
నీవు నిన్న"నాలుగు కాలిముద్రలు"చూశావు 
కానీ నేడు నీకు "రెండే " కనిపిస్తున్నాయి 

"మరో రెండుముద్రలు
"మాయమైపోయాయని... 
నీకెవరు తోడులేరని...
నీవు ఒంటరివాడవని... 
నిరాశతో కృంగిపోతున్నావు... 

నిజానికి నీ కళ్ళకు కనిపించే 
"ఆ రెండు కాలిముద్రలు" నీవికావని... 
నిన్న నిన్ను భుజాలపైకెత్తుకొని నడిచిన 
ఓ "అదృశ్యశక్తివని" నీకు తెలియదు...
ఆ అదృశ్యశక్తియే నీసృష్టికర్త నీప్రాణదాత...

7. నిజమైన ఆత్మీయులు...ఎవరు?

ఎవరు...?ఎవరు..?
ఆకలేస్తే...కేకలేస్తే వచ్చి 
ఆకలి తీర్చినవారా..? 
ఔను...వారే మన మిత్రులు... 

ఎవరు...?ఎవరు..?
అవసరమొస్తే...ఆపదవస్తే
ఆర్థికంగా ఆదుకున్నవారా..?
ఔను...వారే మన అభిమానులు...

ఎవరు..?ఎవరు..?
బరువు బాధ్యతల భారం మోయలేక
సమస్యల సుడిగుండంలో చిక్కినవేళ 
చెంతకుచేరి చింతలు తీర్చినవారా...? ఔను...వారే మనకు ఆత్మీయులు...
 
కాని... 
మన నిజమైన ప్రాణమిత్రులు...
మన నిజమైన వీరాభిమానులు...
మన నిజమైన ఆత్మీయులు ఎవరు..? 

ఎవరంటే... 
కందిపోయి బొబ్బలెక్కిన
మన అరచేతిలో దాగిన కష్టాన్ని...
ఆ కష్టం వెనుక...ఎరుపెక్కిన కళ్ళ 
కనురెప్పల మాటున కనిపించక 
జలజలజారే ఆ కన్నీటి ధారల్ని... 
మన మనసు పొరల్లో...గంగలా 
పొంగేటి ఆ పుట్టెడు దుఃఖాన్ని ...

మన చిరునవ్వుల వెలుగుల...
వెనుక దాగిఉన్న ఆ చిమ్మచీకటిని... 
మన మాటల్లో దాగిన మర్మాన్ని...
ఆరని ఆవేదనా చితిమంటల్ని...

మన గుప్పెడు గుండెల్లో... 
గూడుకట్టుకున్న ఆ క్షోభను ఆ బాధను 
ఆ వ్యధను ఆ ఆవేదనను గుర్తించినవారే...
మన గుండెలోతుల్లోకి తొంగి చూసినవారే...

వారే మనకు నిజమైన ఆత్మీయులు ...
వారే మనకు నిజమైన ఆత్మ బంధువులు... 
వారే వారే ఆ పరమాత్మకు ప్రతిరూపాలు...
అట్టివారికిచేద్దాం వందనం పాదాభివందనం.

8. ఆ దేవదేవుడు 

నిన్ను 
ఆటలో 
ఓడిపోనివ్వడు
 
నీటిలో 
మునిగి పోనివ్వడు 
 
చెట్టులా 
ఒరిగి పోనివ్వడు 

భయపడకు 
నిన్ను క్రింద పడనివ్వడు 

పడినా పైకిలేచే 
శక్తిని నీకు ప్రసాదిస్తాడు 

అందుకే ఓ భక్తా
అవాంతరాలెన్ని వచ్చినా 
అగ్ని పరీక్షలు ఎన్ని పెట్టినా ఆ
భగవంతునిపై భక్తిని తరగనివ్వకు
నీలోని అఖండ శక్తిని కరగనివ్వకు

9. ఏమిటీ రక్తపాతం..?
    ఎందుకీ రాక్షసత్వం..?

అయ్యో...!  అయ్యో...!
చేతులకు సంకెళ్లు వేసి 
నిస్సహాయురాలిని చేసి 
పంటపొలాల్లోకి ఈడ్చుకెళ్ళి
సామూహికంగా మానభంగం చేసి
చిత్రహింసలుపెట్టి శీలాన్ని దోచుకొని

ఒంటరిని చేసి...అలా బండరాళ్లతో 
ఇనుప రాడ్లతో...తలపై మోదుతుంటే 
ఏడ్చిఏడ్చి రక్షించమని అరిచి అరిచి 
రక్తపుమడుగులో గిలాగిలా కొట్టుకొని 
ప్రాణాలు వదిలిన ఆ అమాయకపు 
అమ్మాయి ఏ నేరం చేసిందని ..?
ఎందుకంత కసి..?
ఎందుకంత ద్వేషం...? 
ఏమిటీ ఆ కౄరత్వం...? 
ఏమిటీ ఈ రాక్షసత్వం...? 
ఎవరి మద్దతుతో ..?
ఎవరి మెప్పుకోసం ..?
ఇంతటి దారుణానికి 
ఒడిగట్టాడు కరుణ దయ
జాలిలేని ఆ కసాయివాడు 
ఆ రాతిగుండెల రాక్షసుడు...

ఆ ఒంటరి అమ్మాయిని 
అంతగా అమాషంగా 
హింసించి హింసించి
చంపుతున్నప్పుడు... 
ఒక్కసారైన వాడి అమ్మ అక్క 
చెల్లి కూతురు భార్య గుర్తుకు రాలేదా..?

చూస్తుంటే రక్తం మరుగుతోందే... 
వాడు మనిషా..? మానవ మృగమా..?
ఎటు పోతోంది నా దేశం...
ఏమిటీ ఈ దుర్మార్గం...?
ఏమిటి నడిరోడ్ల పై ఈ నరమేధం..? 

అదిగో నా తల్లి భారతమాత
మణిపూర్ లో జరిగే ఆ ఘోరాలు 
ఆ నేరాలు ఆ దారుణాలు కళ్ళతో 
చూడలేక  వెక్కి వెక్కి ఏడుస్తోంది...

తనను కడుపు కోతకు గురిచేయవద్దని
ఈ రాక్షసత్వాన్ని ఈ రక్తపాతాన్ని
మణిపూర్ లో జరిగే ఈ మారణహోమానికి
తక్షణమే ఆపమని స్రీలను రక్షించమని...
మహిళల మాన ప్రాణాలను కాపాడమని
అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన
పాలకులను సుప్రీంకోర్టున్యాయమూర్తులను
మహిళాకమీషన్ సభ్యులనువేడుకుంటుంది

10. అందరికీ "శుభ "శుభోదయం..!

చెప్పుకుందాం...
చెప్పుకుందాం... 
శుభోదయం...
అందరికీ "శుభ" శుభోదయం 
"శుభోదయం" అనగా 
ఒక సుందర సూర్యోదయాన 
అందరికీ రోజంతా"శుభాలు"జరగాలని
శుభాకాంక్షలా...కాదు...కాదు 

పొడిచే‌...
ప్రతి పొద్దు...
నుదుటి కుంకుమలా 
అందరినీ మురిపించాలని... 

నడిచే...
ప్రతి నిమిషం... 
నవ్వే నక్షత్రమై అందరి
జీవితాలలో వెలుగులు విరజిమ్మాలని... 

గడిచే...
ప్రతి గంట...
గంగానది నిర్మలత్వాన్ని 
అందరి గుండెల్లో నింపాలని... 
కన్నకలల్ని కంచికి చేర్చాలని... 
ఆశల్ని అమృతంలో ముంచాలని... 

ప్రతిరోజు... 
రోజాలా విరబూయాలని... 
ప్రతి వారం...
పచ్చని హరితహారం కావాలని... 
ప్రతినెల... 
కరగని కమ్మని కలగా మిగిలిపోవాలని...

అందరికీ ఆపరమాత్మ సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలనందించాలని... 
చెప్పుకుందాం...చెప్పుకుందాం... 
శుభోదయం‌...అందరికీ శుభ శుభోదయం...

11. బడా భక్తులు...? కార్పోరేట్ శక్తులు..??

ఔరా ! బడా నాయకులే భక్తులైతే...?
కార్పోరేట్ దుష్టశక్తులకు బానిసలైతే..?
ఏమౌతుంది... ప్రతి రాష్ట్రం
రావణకాష్టంలా రగులుతుంది...
మణిపూర్ లా మతోన్మాద
మంటల్లో పడి కాలి బూడిదౌతుంది...

నిన్న విధి చెప్పింది.....ఓ విషాధ గాథ
నేడు కాలం పాడింది...ఓ కన్నీటి పాట

విధి చెప్పిన...ఆ విషాధగాథ
ఏడ్చే పాపలకు తెలుసు... 
ఎగిరే పక్షులకు తెలుసు...

కాలం పాడిన...ఆ కన్నీటి పాట
కడుపులో దూరిన కత్తులకి తెలుసు... 
నడివీధిలో నగ్నంగా 
ఊరేగింపబడిన కుకీమహిళలకు తెలుసు...

విధి చెప్పిన...ఆ విషాధ గాథ
చిరిగిన చీరలకు తెలుసు..‌ 
పగిలిన గాజులకు తెలుసు...

కాలం పాడిన...ఆ కన్నీటి పాట
నక్కినక్కి తిరిగె మైతీకుక్కలకు తెలుసు...
ముక్కలైన కుకీపూలమొక్కలకు తెలుసు...

విధిచెప్పిన...ఆ విషాధ గాథ
కళ్ళు మూసుకున్న ఏసుక్రీస్తుకు తెలుసు... 
గోడకు వ్రేలాడె శ్రీరామచంద్రుడికి తెలుసు...

కాలంపాడిన...ఆ కన్నీటి పాట
తెగిన తాలిబొట్లకు తెలుసు...
రాలిన రక్తపుచుక్కలకు తెలుసు...

పరిమళించే మంచితనం... 
మానవత్వం...అమాయకత్వం...
స్వచ్చమైన స్నేహం...సౌభ్రాతృత్వం...
"పాలుతేనెల్లా" ప్రవహించే మణిపూర్ లో
ఏ మతోన్మాదుల వికృత సృష్టియో ఇది..? ఔరా జాతుల మధ్య ఈ జగడాలేమిటి...?
ఘడియఘడియకు ఈ ఘర్షణ లేమిటి..? 
మతం పేర ఈ మారణ హోమమేమిటి..? 

సందేహమే లేదు ?
ఇది కార్పోరేట్ శక్తులు... 
భక్తులైన బడానాయకులు... 
ఏకమై సృష్టించిన భీభత్సమే నరమేధమే... 
భక్తి ముసుగులో జరుగుతున్న భాగోతమే...

12. నోటి మాట...కన్నీటి విలువ 

ఔను మిత్రమా..! 
అతిగా నీవు అరిస్తే...? 
కుక్కలా మొరిగితే..? 
ఆపైన జరిగేదేమిటి...? 

నీ "నోటి మాట"... 
చెల్లని ఒక కాసౌతుంది... 
మూగబోయిన ఒక రాగమౌతుంది...

ఔను మిత్రమా..!
అనవసరంగా...నీవు 
వెక్కివెక్కి ఏడిస్తే ఏమౌతుంది..?

నీ "కన్నీటి విలువ"... 
నేలన ఒలికిన వెన్నౌతుంది...
అడవిన కాసిన వెన్నెలౌతుంది...

ఔను అతిగా...
చేస్తే ఊరంతా అప్పులే  ... 
తిరిగి తిరిగి అరిగేది కాలిచెప్పులే...
కాళ్ళకింద కనపడని ఆరని నిప్పులే....

అదృశ్యంగా... 
అంతటా..."అవమానాలే "... 
తీసుకున్న అప్పులు తీర్చకున్న  
ఇక మిగిలేది..."ఆత్మహత్యలే "...

13. మీరే మట్టికరిపించే మాంత్రికులు..!

ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..! 
ఒక పచ్చినిజం..! తెలుసుకోండి..! 
పకృతిలో పంచభూతాలలో 
స్వేచ్ఛగా విహరించే పక్షులు
చెట్ల మాటున దాగిన వేటగాళ్లు 
విసిరే మత్తుగింజలకాశపడితే...
ఆపై ఆ పక్షులు వలలో చిక్కుకుని
గిలగిలలాడుట నమ్మలేని నగ్నసత్యమని...

ఈ ప్రజాస్వామ్యంలో
ఈ ఎన్నికల జాతరలో
ఓటు హక్కున్న
ఓ ఓటరు పక్షుల్లారా..!
ఏ మత్తు మందుకో...
ఏ మటన్ బిర్యానీకో...
ఏ పచ్చనోటుకో మీరు ఆశపడి...

అతిశక్తివంతమైన... 
అత్యంత విలువైన...మీ ఓటును... 
పోలింగ్ బూతులకెళ్ళి 
ఏ దుష్టులకో...
ఏ దుర్మార్గులకో... 
ఏ దగాకోరులకో...
ఏ దోపిడీదారులకో...
ఏ మోసగాళ్ళకో...
ఏ మాయగాళ్ళకో...
ఏ రాజకీయ రాబందులకో.... 
ఏ మత్తులోనో...
ఏ మైకంలోనో...మీరు అమ్ముకుంటే...

ఆపై అందలమెక్కేది వారే.
అధికారం దక్కేది వారికే.
అంధకారంలోకి జారిపోయేది ...
అస్థిపంజరాలుగా మారిపోయేది మీరే.. 
అధఃపాతాళానికి అణగద్రొక్కేది మిమ్మే...

మరో ఐదేళ్ళు మీరంతా 
రెక్కలున్నా ఎగరలేని పక్షులని...
మీ కళ్ళకు గంతలు కట్టినట్లేనని...
మీ గొంతులు మూగబోయినట్లేనని...
మీరు ప్రశ్నించేహక్కును కోల్పోయినట్లేనని..

అందుకే ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..! 
ఒక పచ్చినిజం..! తెలుసుకోండి..! 
అమరజీవి అంబేద్కర్ అందించిన
ఓటే మీ చేతిలో దాగిన అణుబాంబని..! 
అదే మీ రుగ్మతలకు ఓ దివ్యఔషధమని..!
ఐదేళ్ల కోసారి దర్శనమిచ్చే...
వాగ్దానాల వర్షం కురిపించే...
అరచేతిలో స్వర్గం చూపించే... 
నేతల తలరాతల్ని తారుమారు చేసి...
వారిని మట్టికరిపించే మాంత్రికులు మీరేనని

14. ప్రేమను కొనుక్కోండి ?

ఆకలేసి కేకలేస్తేనే 
ఏ తల్లైనా ఏ బిడ్డకైనా 
పాలిస్తుంది లాలిస్తుంది 

తీరని దాహమేస్తేనే 
ఏ గుర్రమైనా ఏతొట్టిలోనైనా
మురికినీళ్లనైనా త్రాగుతుంది 

భగభగమండే 
నిప్పుల్లో వేసి కాలిస్తేనే 
ఏ బంగారమైనా ధగధగ 
మెరిసే నగగా మారుతుంది 

ముందుచూపు వుంటేనే
పిల్లలంటే 
అమితమైన ప్రేమ ఉంటేనే
ఏ తల్లిదండ్రులైనా
బృహత్ ప్రణాళికలు వేస్తేనే
వారి బ్రతుకు బాటలు
బంగారుమయమౌతాయి

అట్టి అమ్మానాన్నలనే
పిల్లలు ఇష్టపడి
ప్రేమతో పలకరించి 
అభిమానించి గౌరవించి
వేస్తారు పెద్దపీట పెద్దరికానికి
చూస్తారు కన్నవారిని కంటిపాపలఓలె

అందుకే తల్లితండ్రులూ తస్మాత్ జాగ్రత్త..!
ఆస్తులు పుష్కలంగా ఆర్జించండి..!
ఆర్థికంగా పిల్లలను ఆదుకోండి..!
ఆ ధనంతోనే వృద్దాప్యంలో అనురాగం 
ఆప్యాయతా ఆదరణలను కొనుక్కోండి..!

15. ఔను ఇది నిజమేనులే..!

వెలిగినంత 
సేపు చిరుదీపం...
వెలుగులు విరజిమ్మేనులే..!
చిమ్మచీకటిని తరిమేనులే..!
ఆపై ఆరిపోయి తిరిగి 
ఆ చీకటి ఒడిలోనె చేరేనులే..!
ఔను ఇది నిజమేనులే..!

లేవయసులో... 
ఒళ్ళంతా కులుకేనులే..!
వయసు కరిగిన అందం తరిగిన
విధి జీవితాన విషాదం చిలికేనులే..!
ఔను ఇది నిజమేనులే..!

జీవితమంటే...
చీకటి వెలుగేనులే..!
ఓటమి గెలుపేనులే..!
తెలుపు నలుపేనులే..!
ఔను ఇది నిజమేనులే..!

మిడిమిడిఙ్ఞానంతో పడిలేస్తూ... 
ప్రతిరోజు పరుగేనులే..!
మిడిసిమిడిసి పడేది 
మిణుగురు పురుగేనులే..!
ఆపై మిగిలేది ఆపరమాత్మ 
ఆఖరి పిలుపేనులే..!
ఔను ఇది నిజమేనులే..!

16. ఊ అంటారా..?
     ఊహూ అంటారా..?

ప్రతి చెట్టుకు 
..."వేరు" వుంటుంది 

ప్రతి మనిషికి 
..."పేరు" వుంటుంది 

ప్రతి ఊరికి 
..."దారి" వుంటుంది  

ప్రతి సమస్యకు 
..."పరిష్కారం"ఉంటుంది

మిత్రులారా..! మరి
ఊ అంటారా...ఊహూ అంటారా?

17. బంగారు బైబిల్ గనిలో...

బైబిల్ ...
ఒక మహావృక్షమైతే  
ప్రతి వాక్యం... 
ఒక పచ్చని ఆకైతే...
 
ప్రతి వచనం... 
ఒక తియ్యని పండైతే...

ప్రతి అధ్యాయం
ఒక అమృత భాండమైతే...

ఆ పచ్చని ఆకులనిండా... 
ఆ తియ్యని పళ్ళనిండా...
ఆ అమృతభాండంనిండా...

వెండికన్నా 
బంగారు కన్నా 
వజ్ర వైడూర్యాలకన్న 
విలువైన శాంతిసమాధానాలు 
పవిత్రమైన జీవన సూత్రాలెన్నో
అగాధ జలనిధిలో ఆణిముత్యాల్లా
అంతులేని అంతుచిక్కని రహస్యనిధుల్లా 
బంగారు బైబిల్ గనిలో నిక్షిప్తమైఉన్నాయి

18. ఇదే ఇదే సుఖజీవన సూత్రం...?

లక్ + హార్డ్ వర్క్= సక్సెస్
(అదృష్టం + శ్రమ = విజయం) 
ఇదే సూపర్ సక్సెస్ ఫార్ములా...

ఆదాయం - ఖర్చు= పొదుపు
ఈ సూత్రం వద్దు...

ఆదాయం - పొదుపు = ఖర్చు 
ఈ మంత్రం ముద్దు...

ఆపై ఆ పొదుపునే 
మదుపుగా మార్చి
తెలివిగా...
ధైర్యంగా...
నమ్మకంగా...
కొంచెం కొంచెం....
స్థిరాస్తుల్లో...ప్లాట్లల్లో 
పెట్టుబడి పెడితే చాలు...

లక్షలు కోట్లు మీ వెంటే...
ఊహించని సిరిసంపదలు... 
లక్ష్మీదేవి గజ్జెల గలగలలు మీ ఇంటే...
ఆపై ఖరీదైన కార్లలో తిరగవచ్చు
విశాలమైన విల్లాలలో శయనించవచ్చు
తలెత్తుకు గర్వంగా గౌరవంగా బ్రతకొచ్చు

ఏమంటారు మిత్రులారా..?
ఊ అంటారా..? ఊహూ ‌అంటారా..?

19. ఓ నరరూప రాక్షసుల్లారా..!
     ఆపండి...మీ నరమేధం....!

మణిపూర్ లో 
అమాయకుల రక్తం 
ఏరులై పారుతుంది... 

ఇంటర్ నెట్ బంద్ చేసి
నోటితో చెప్పలేని...
కళ్ళతో చూడలేని...
చెవులతో వినలేని...
ఘోరాతి ఘోరమైన
అతి నీచ...నికృష్ట 
అమానవీయమైన 
అకృత్యాలకు పాల్పడ్డారు... 

నేరం చేసిన వారికన్న
"ప్రోత్సహించినవారే"...
"మౌనంగా మద్దతిచ్చినవారే"... 
"నిప్పుకు ఆజ్యం పోసిన వారే"...
"నిజమైన దోషులు"...దేశద్రోహులు"...
మణిపూర్ లో జరిగింది ఎంతటి 
"నరమేధమో" మన ఊహలకందదు...

ఎన్ని కుకీ కుటుంబాలు
భయంతో గడగడవణికాయో..?
కాకుల్లా చెల్లాచెదురై ఎన్ని
కారడవుల్లోకి పారిపోయాయో..? 
లెక్కింప శక్యమా ఎవరికైనా..? కాదే... 

బ్రతికిన వారివి చితికిన బ్రతుకులే ...
అందరూ రెక్కలు విరిగిన పక్షులే....
ఏగుండెను కదిపినా మానని గాయాలే... 

ఎవరినీ ఏమీ అనలేని ఏమీ చేయలేని 
నిస్సహాయ స్థితే...నిలువెల్లా నిట్టూర్పులే... 
కదిలిస్తే ఎవరినైనా కన్నీటి వరదలే... 
ఆపన్నహస్తాలకై ఆశతో ఎదురుచూపులే... 

వారి ఈదారుణ దుస్థితికి 
కారకులైన వారంతా 
"కఠిన కారాగార శిక్షకు" 
"బహిరంగ ఉరికి అర్హులే "... 
మీరేమంటారు మిత్రులారా...

20. మనసులో... మలినం..?
       కడుపులో... కల్మషం....?

నీ కడుపులో 
కసి...కల్మషమే ఉంటే 
అది "నీ కళ్ళల్లో " కనిపిస్తుంది 

నీ మనసులో...
మసి...మలినమే ఉంటే 
అది "నీ మాటల్లో " వినిపిస్తుంది 

నీ హృదయంలో...
పగా...ప్రతీకారం...
అసూయ...ద్వేషమే ఉంటే
అది "నీ పెదవులపై" ప్రవహిస్తుంది

నీ అంతరంగంలో...
ప్రేమ దయ జాలి కరుణే ఉంటే 
అది స్వచ్చమైన 
"నీ చిరునవ్వులో " ప్రతిఫలిస్తుంది
 
నీ ఆలోచనల్లో...
మంచితనం మానవత్వమే ఉంటే
అది "నీ ప్రేమపూర్వకమైన"  
"పలకరింపులో " ప్రతిధ్వనిస్తుంది 

21. అంతరంగం... 
     ఆలోచనా తరంగం...

వేలమైళ్ళ 
మార్గానికి 
వేగమే హద్దు...

ప్రతిష్టాత్మకమైన 
ఒక ద్రవ్య సంస్థకు 
కోట్లధనమే హద్దు... 

నిరుద్యోగుల
పోటీ పరీక్షలకు 
సరైన సమయమే హద్దు... 

కానీ అనంతమైన 
అంతరంగాన పడిలేచే 
ఆలోచనా తరంగాలకు లేదు హద్దు...

మిత్రమా అందుకే...
పులిలా దూకు ముందుకే...
విభిన్నంగా వినూత్నంగా... 
అత్యున్నతంగా ఆలోచించు... 
ఎవరూ కలలో సైతం ఊహించని
విశ్వమే విస్తుపోయే అద్భుతాలు సృష్టించు.

22. అరిషడ్వర్గాలు...

కామ
క్రోధ 
లోభ
మోహ 
మద
మాత్సర్యాలే
అరిషడ్వర్గాలు

అవి 
అంతరంగాన
ఆరక రగిలే 
అగ్నిగుండాలు

వాటి 
ప్రతిరూపాలే
కోపం...భయం 
పగ...ప్రతీకారం 
ఉద్వేగం...ఉక్రోషం
ఉన్మాదం...ఉద్రేకం 
ఆవేశం...ఆందోళన 
అసూయ...ద్వేషాలు 
అనుమానం...అసహనం
అవే మనకు అంతర్గత శతృవులు

కానీ అంతరంగమే...కారడవైతే...
అరిషడ్వర్గాలు...ఆరనిచిచ్చవుతాయి

ఆ అరిషడ్వర్గాలే 
బుసలు కొట్టే విషనాగులైతే... 
మాటువేసి మనల్ని కాటువేస్తాయి మన 
బంగారు బ్రతుకుల్ని బుగ్గిపాలుచేస్తాయి

అందుకే
కరుణ‌ త్యాగం
శాంతి సహనం 
ప్రేమ దయ జాలి 
సర్దుబాటుగుణమను
ఆయుధాలతో పోరాడితే చాలు
క్రీస్తులా క్షమాగుణం కలిగివున్న చాలు
బుద్దునిలా ధర్మబద్ధంగా జీవిస్తే చాలు
పూరిగుడిసెలో వున్నవాని బ్రతుకైనా 
పున్నమి వెన్నెలై వెలుగుల్ని విరజిమ్ము

23. ఓ సనాతనమా..?
      కాసింత సమాధానం చెప్పుమా..!

కొందరు... 
జోగినీవారసులు...
సమతా వాదులు... 
సనాతన విరోధులు... 

పురుష ఆధిక్యంతో 
అణగద్రొక్కబడి 
గృహహింసకు గురై 
"గృహనిర్బంధంలో " 
పంజరంలో పక్షుల్లా చిక్కుకొని 
"నలిగిపోయిన నారీమణులు"...

తరతరాలుగా 
"కులవివక్షకు"గురై 
బ్రాహ్మణ ఆధిపత్యంతో 
"చతుర్వర్ణ వ్యవస్థకు" బలై 
"అంటరానితనం" మంటల్లో పడి మలమలమాడి మసైపోయిన 
గుడికి...బడికి...సంపదకు.. 
సభ్యసమాజానికి దూరంగా
"ఎంగిలాకుల్లా" విసిరి వేయబడిన 
"నిరుపేద నిమ్నజాతీయులు"...

నాడు సనాతనమే ప్రోత్సహించిన "సతీసహగమనం" దురాచారానికి బలై
స్మశానంలో భర్తల చితిమంటల్లో దూకి 
దగ్ధమైపోయిన అమాయకపు అబలలు...

"సనాతనం" ఒక విషసర్పమన్నారు"
అది "మనుధర్మానికి మారుపేరన్నారు"... 
సనాతనం శాశ్వతంగా "కనుమరుగై పోవాలని కలలు కంటున్నారు"... 
"కత్తులు" దూస్తున్నారు... 
"కదనానికి" సిద్ధంగా ఉన్నారు... 

కానీ... 
మహా మేధావులు...
బ్రాహ్మణ పూజారులు... 
పీఠాధిపతులు...దేశభక్తులు...
వేదాలు పురాణాలు ఉపనిషత్తులు
సకల సనాతన బృహత్ గ్రంధాలను
ఔపాసన పట్టిన పండిత ప్రకాండులు...
సనాతనం సద్బ్రాహ్మణ సృష్టి కాదని... 

అది "హిందూధర్మంలో ఒక భాగమని"...
"భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబమని"...
భారతీయ ఔన్నత్యాన్ని చాటే "సంస్కృతి 
సాంప్రదాయాలకు అది మూలస్తంభమని"...
అది "ఒక కల్పతరువని"...వాదిస్తున్నారు...
అభ్యుదయవాదులతో...విభేదిస్తున్నారు...

ఔను ఓ సనాతనమా...?
కాసింత సమాధానం చెప్పుమా..!
ఏది సత్యం...? ఏది అసత్యం..?
ఏది అమృతం...? ఏది విషం...?
ఏది బెల్లం..? ఏది ప్రక్కలో బల్లెం..?
దేనికి పునాది...? దేనికి సమాధి...?

24. పోలన్న కవి సుభాషితం..!

సత్యం
పలుకు
... పెదవులు... 
చిరునవ్వులు 
చిగురించు
...ముఖం... 

కరుణను 
కురిపించు
... కళ్ళు... 
మానవత్వం 
పరిమళించు
.. మనసు... 

అనురాగం 
ఆత్మీయత 
ఉప్పొంగు
...హృదయం... 
ఆపదలో 
ఆదుకునే 
...అమృత హస్తం... 
ఉన్న చాలు... 

ఆ జీవితాలు..
సుందర 
నందన వనాలే...  
ఆ జీవితాలు...
ఆదర్శనీయమే...
ఆనందమయమే...
అభినందనీయమే...

అన్న...
ఈ పోలన్న సుభాషితం..! 
విన్న...
మీ జీవితం సువర్ణశోభితం..!! 

25. నిజజీవిత నిత్యసత్యాలు..!
       అనుభవాల ఆణిముత్యాలు..!! 
       (మినీ కవితలు)

ఒక్కటే తెలుసు... 

పందికొక్కుకు 
ఒక్కటే తెలుసు 
గాదెలుఎక్కడం..! 
గింజలు మెక్కడం..!
చాటున నక్కడం..! 

విడాకులు...

విడిపోండి...దూరంగా ఉండండి...
అన్న వారి...మాటలు వినకండి... 
కలిసి ఉంటే కలదు సుఖం
చిలకా గోరింకల్లా 
కలిసి కలకాలం కాపురం 
చేయండనే వారికాళ్లకు మ్రొక్కండి... 

బ్రతుకు బంగారం...

చదివి అర్థం చేసుకుంటే... 
ఏ విద్యార్థికైనా దక్కు అఖండవిజయమే...
ఉద్యోగమే ఊపిరిగా ఏకాగ్రతతో పనిచేస్తే...
ఏ ఉద్యోగికైనా ఉండు ఉజ్వల భవిష్యత్తే... 
చెప్పాగా విని వినయంతో మసలుకుంటే... 
ఏ మనిషి జీవితమైనా సువర్ణ శోభితమే...

ఆత్మ...అద్దె కొంప...

దేవుడు నీకీ శరీరాన్ని 
ఈ లోకాన్ని అద్దెకిచ్చాడు 
నీవు ఏదో ఓ విషఘడియలో
కన్ను మూయక తప్పదు
ఈ"అద్దె కొంపను"ఖాళీ చేయక తప్పదు 
ఆపై నీ "ఆత్మను"
ఆ పరమాత్మకు"అద్దెగా"చెల్లించక తప్పదు 

విశ్వాసం...కృతజ్ఞత...

కర్రతో కొడితే కుక్క"కరుస్తుంది"
కాస్త"తిండి పెడితే "కాపలా కాస్తుంది"
తన ప్రాణాలను ఫణంగా పెడుతుంది
విశ్వాసమంటే అదే మరి...చేసిన మేలు 
మరవకపోవడమే"కృతజ్ఞత "చూపడమే

26. మద్యం మత్తుకు 
       బానిసలైతే మరణమే? 

నిత్యం 
నిషాలో ఉండువాడు 
నీచుడే...నికృష్టుడే...నిత్యదరిద్రుడే
 
కన్నబిడ్డల్ని కట్టుకున్న 
భార్యను కాల్చుకు తినేవాడు ఆకలికి 
మాడ్చేవాడు...అవివేకియే...అజ్ఞానియే

కష్టపడి ఆర్జించిన సొమ్మునంతా 
కల్లు దుకాణాల్లో వైన్ షాపుల్లో 
ఖర్చుచేసి నిత్యం మందు త్రాగడమంటే...
వాడు కట్టుకున్న భార్య...కన్నబిడ్డల 
రక్తాన్ని త్రాగడమే...రాక్షసుడిగా మారడమే

పుస్తెలు తాకట్టు పెట్టి...
పీకలదాకా మందుకొట్టి...
బూతుపురాణం మొదలు పెట్టి... 

తల్లీ బిడ్డల్ని రాక్షసుడిలా
హింసిస్తున్నాడంటే ఖచ్చితంగా 
రేపు వాడి పాపం పండుతుందని అర్థం 

అందరూ వాన్ని ఒక పురుగులాగా 
సమాజానికి ఒక చీడపురుగులాగా 
ఛీకొడతారని వాడికి తెలీదు 
వాడు ఏ సిగ్గులజ్జా మానంలేని
కళ్ళముందు కదిలే ఓ జీవచ్ఛవమే...

నిజానికి
త్రాగుబోతు 
జీవితం నిరర్థకం... 
వాన్ని కట్టుకున్న భార్య... 
కన్నబిడ్డలు శాపగ్రస్తులే... 

వాడు వారికి నరకం చూపిస్తాడు 
నిత్యం భరించలేని బాధలు పెడతాడు 
నలుగురిలో అందరు నవ్వులపాలౌతారు

నాలుగు రోజుల ఆ 
వెర్రిసుఖంకోసం విర్రవీగుతాడు 
విచ్చలవిడిగా విషపురుగులా ప్రవర్తిస్తాడు
ఆపై ఆరోగ్యం చెడి ఆసుపత్రి పాలౌతాడు
 
నిజానికి చచ్చినోళ్ళకు 
పచ్చిత్రాగుబోతులకు తేడా ఒక్కటే 
ఒకరు సమాధిలో...నిర్జీవంగా 
మరొకరు భూమిమీద...సజీవంగా అంతే

అందుకే మద్యానికి...
బానిసలైన ఓ త్రాగుబోతుల్లారా..! 
మీరు పశువుల్లా ఎందుకు ప్రవర్తిస్తారు...?
పరమాత్మ సహనాన్నెందుకు పరీక్షిస్తారు..?

ఇకనైనా ఓ పచ్చినిజం తెలుసుకోండి....!  
సృష్టిలో ఉత్కృష్టమైనది మానవ జన్మని...
దుర్వసనాలకు బానిసలైతే దుఃఖమేనని...
మద్యం మత్తుకు బానిసలైతే మరణమేనని

27. చిరకాలం 
      జీవించడానికి చిరుచిట్కాలు... 

మీరు కలనైనా 
ఊహించని 
సుఖసంతోషాలతో... 
అంబరాన్నంటే 
సంబరాలతో...

పవిత్రంగా...
ప్రశాంతంగా... 
సంస్కారవంతంగా...

ఆరోగ్యంగా... 
ఆనందంగా... 
పరమానందంగా... 

చిరకాలం 
జీవించడానికి 
ఇవిగో చిరుచిట్కాలు... 

మీరు 
చిరునవ్వులు 
చిందిస్తూ
హద్దులు లేని 
పచ్చనైన స్వచ్చమైన 
ప్రేమను కురిపించాలి... 

మీరు
ఉదయం సాయంత్రం... 
రెట్టింపు ఉత్సాహంతో 
నలుగురితో కలిసి నవ్వుతూ 
పార్కుల్లో విహరించాలి... 

మీరు ఒక్కపూటే 
మితాహారం తీసుకోవాలి... 
ముందు మందు...
మటన్...మసాలా మానాలి... 

మీరు
ఉదయం పూట 
ఆ నీరెండలో... 
ఆ చల్లని గాలిలో...
ఆ చక్కని వాతావరణంలో...
విహంగాల్లా విహరించాలి...

బద్దకం సోమరితనం 
మీకు బద్దశత్రువులు కావాలి... 
వ్యాయామం ధ్యానం యోగ 
మీ ఆత్మీయ బంధువులు కావాలి...

మీరు బంధుత్వాలకు... రక్తసంబంధాలకతీతంగా... 
అందరికీ అభయహస్తం అందించాలి...
ఆ పరమాత్మను నిత్యం ధ్యానించాలి...

మీ నియమ నిష్టలే
కఠినమైన నిబంధనలే 
మీకు నీడలా మీ వెంటే నడవాలి... 
నిద్రలో సైతం మీరు కలవరించాలి...
అవి...మీ కమ్మని కలలై 
మీ కళ్ళను నిత్యం కౌగలించుకోవాలి...

28. ఇక మీరే తేల్చుకోండి మీరెవరో..?

నిన్న మీ
ఆకలి తీర్చిన
మీ అమ్మానాన్నలను 
నేడు ఆకలికి ఆలమటించే
"అస్థిపంజరాలుగా" మారుస్తారా? 
అనాధాశ్రమాలకు"అతిథులను"చేస్తారా ?

రెక్కలు విరిగిన 
ఆ "ముసలి పక్షుల్ని" 
"అనాధలుగా అభాగ్యులుగా" 
"ఎంగిలి విస్తరాకుల్లా"వీధుల్లో విసిరేస్తారా?

రక్తమాంసాలను పంచి
రక్తాన్ని స్వేదంలా చిందించి 
పెంచి పెద్ద చేసిన మీ అమ్మానాన్నల 
యెడల రక్తసంబంధాలను 
మరచి " రాక్షసుల్లా" ప్రవర్తిస్తారా?

ప్రేమ వాత్సల్యం మానవత్వం లేని 
ఓ "మాయదారి కొడుకుల్లారా"...! 
కరుణ జాలి దయా దాక్షిణ్యం లేని
ఓ"కఠినాత్ములైన కన్న కూతుళ్ళారా"...!

మీరు ఆకాశమంతా 
ఎత్తుకు ఎదగాలని
మీ బంగారు భవిష్యత్తు కోసం
కమ్మని కలలెన్నో కంటూ
" కొవ్వొత్తుల్లా " కరిగిపోయిన 
మీ అమ్మానాన్నలే కదా "ప్రత్యక్ష దైవాలు"

అట్టి అమ్మానాన్నలు ఆర్జించిన
ఆస్తుల్ని దోచుకొని దాచుకున్న 
"దోపిడీ దొంగలే " కదా మీరు...
అడ్డదారిలో గడ్డిమేస్తూ...
బ్రతికే "గుడ్డిగాడిదలే " కదా మీరు...

మీ కంటే కూడు తిని కుండలను సైతం 
పగులగొట్టే..."ఆ కుక్కలే " నయం గదా... 
అందుకే ఇక...మీరే తేల్చుకోండి మీరెవరో...

29. సుఖజీవన సూత్రాలు 
      (మినీ కవితలు)

ఓర్పు - నేర్పు...

మనిషికి 
కావలసింది.......నేర్పు 
ఉండవలసింది...ఓర్పు 
కోరవలసింది......మార్పు
చెప్పవలసింది....తీర్పు 

క్షమించండి...

సలహాలుంటే.......ఇవ్వండి 
లోపాలు ఉంటే.....చెప్పండి 
సందేహాలుంటే.....అడగండి 
తప్పులుంటే.......‌.క్షమించండి 

బ్రతుక్కి అర్థం తెలిసేదెలా..? 

చిలికితేనే.....వెన్న దొరికేది 
గతికితేనే......రుచి తెలిసేది 
మునిగితేనే...ముత్యం దొరికేది 
బ్రతికితేనే.....బ్రతుక్కు అర్థం తెలిసేది
 
దోపిడి...దొంగలు 

సంఘసేవకులు సమతావాదులు 
దండిగా ఉన్న ఈ భరతభూమిలో
భక్తి పేరుతో అమాయకపు జనాన్ని 
దోచుకునే దొంగ బాబాలను కట్టడి చేసేదెవరు..? కటకటాల్లోకి నెట్టేదెవరు..? 

శునకం...

సాటి మనిషిని మనిషిలా చూడక  
ముష్టివానిలా చూసేవాడు...మూర్ఖుడే
వాడు కుక్కకన్న...కుష్టిరోగికన్న...హీనుడే
నరుడే నారాయణుడని నమ్మినవాడు
ధన్యుడే...వాడు దైవాంశ సంభూతుడే...

30. మీరే మట్టికరిపించే మాంత్రికులు..!

ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..! 
ఒక పచ్చినిజం..! తెలుసుకోండి..! 
పకృతిలో పంచభూతాలలో 
స్వేచ్ఛగా విహరించే పక్షులు
చెట్ల మాటున దాగిన వేటగాళ్లు 
విసిరే మత్తుగింజలకాశపడితే...
ఆపై ఆ పక్షులు వలలో చిక్కుకుని
గిలగిలలాడుట నమ్మలేని నగ్నసత్యమని...

ఈ ప్రజాస్వామ్యంలో
ఈ ఎన్నికల జాతరలో
ఓటు హక్కున్న
ఓ ఓటరు పక్షుల్లారా..!
ఏ మత్తు మందుకో...
ఏ మటన్ బిర్యానీకో...
ఏ పచ్చనోటుకో మీరు ఆశపడి...

అతిశక్తివంతమైన... 
అత్యంత విలువైన...మీ ఓటును... 
పోలింగ్ బూతులకెళ్ళి 
ఏ దుష్టులకో...
ఏ దుర్మార్గులకో... 
ఏ దగాకోరులకో...
ఏ దోపిడీదారులకో...
ఏ మోసగాళ్ళకో...
ఏ మాయగాళ్ళకో...
ఏ రాజకీయ రాబందులకో.... 
ఏ మత్తులోనో...
ఏ మైకంలోనో...మీరు అమ్ముకుంటే...

ఆపై అందలమెక్కేది వారే.
అధికారం దక్కేది వారికే.
అంధకారంలోకి జారిపోయేది ...
అస్థిపంజరాలుగా మారిపోయేది మీరే.. 
అధఃపాతాళానికి అణగద్రొక్కేది మిమ్మే...

మరో ఐదేళ్ళు మీరంతా 
రెక్కలున్నా ఎగరలేని పక్షులని...
మీ కళ్ళకు గంతలు కట్టినట్లేనని...
మీ గొంతులు మూగబోయినట్లేనని...
మీరు ప్రశ్నించేహక్కును కోల్పోయినట్లేనని..

అందుకే ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..! 
ఒక పచ్చినిజం..! తెలుసుకోండి..! 
అమరజీవి అంబేద్కర్ అందించిన
ఓటే మీ చేతిలో దాగిన అణుబాంబని..! 
అదే మీ రుగ్మతలకు ఓ దివ్యఔషధమని..!
ఐదేళ్ల కోసారి దర్శనమిచ్చే...
వాగ్దానాల వర్షం కురిపించే...
అరచేతిలో స్వర్గం చూపించే... 
నేతల తలరాతల్ని తారుమారు చేసి...
వారిని మట్టికరిపించే మాంత్రికులు మీరేనని

31. పెద్దలమాట...సద్దిమూట

ఔను 
మన మతాన్ని 
పూజాగదిలోనే బంధించాలని
అది గర్భగుడిలోనే
సుందర దేవతాశిల్పమై పోవాలని
అది వేసే ధూపంలో కలిసి పోవాలని
చేసే‌ అర్చనలకే అర్పణమైపోవాలని

ఔను 
మన కులాన్ని 
నాలుగుగోడలకు
పరిమితం చేయాలని
గడపదాటి బయటకు రానివ్వరాదని
కులంగొప్పదంటూ కులకరాదని
కులంపేర మతంపేర కుమ్ములాటలొద్దని

బయట 
మనందరం 
భారతీయులమని
భరతమాత ముద్దుబిడ్డలమని
అరమరికలులేని అన్నాతమ్ముళ్ళమని
కలతలన్నవి లేక కలిసి మెలిసి వుండాలని
భిన్నత్వంలో ఏకత్వమే మన నినాదామని
కదా మన పెద్దలమాట 
అదే కదా సదా మన ఆకలితీర్చే సద్దిమూట

32. జీవిత మధురిమలు 
       (మినీ కవితలు)

పూలరంగడు...

ఎవడైతే... 
పొగడ్తలకు.....పొంగడో
విమర్శలకు....లొంగడో
సమస్యలకు...కృంగడో
వాడే కదా...పూలరంగడు... 

ముందు జాగ్రత్త...

బెండకాయ...ముదిరిందని...  
బెంగ...పడిలాభం లేదు... 
ముదరక ముందే... 
ఉండాలిగా...ముందు జాగ్రత్త... 

కొంగ - దొంగ...

కొంగ దృష్టి.....చేపల మీద 
పాము దృష్టి...కప్పల మీద 
కుక్క దృష్టి.....చెప్పుల మీద 
దొంగ దృష్టి.....వస్తువుల మీద 

పుట్టిన మనిషి...

పండిన కాయ...ఎండక తప్పదు 
ఎండిన కాయ....రాలక తప్పదు
నిండిన కుండ....తొణకక తప్పదు
పుట్టిన మనిషి...గిట్టక తప్పదు

పరిష్కారం...

ప్రతి మనిషికి.....పేరు ఉంటుంది 
ప్రతి చెట్టుకు......వేరు ఉంటుంది 
ప్రతి ఊరికి........దారి ఉంటుంది 
ప్రతి సమస్యకు...పరిష్కారముంటుంది

33. పరాజయం నుండి 
       పాఠాలు‌ నేర్చుకో..!!

ఓ మనిషీ ! నీవు 
అవివేకంతో 
అజ్ఞానంతో 
అహంకారంతో 
అంధకారంలో 
అయోమయంలో 
అమాయకత్వంలో  
అటూ ఇటూ కాని సిగ్గూ లజ్జా
"రోషం పౌరుషంలేని జీవితం" జీవించకు... 

ఓ మనిషీ ! నీవు 
క్రిందపడిన ప్రతిసారి 
నీవు పైకిలేచి నిలబడు... 
"గెలుపు" నీకే సిద్ధిస్తుంది...
"విజయలక్ష్మి" నిన్నే వరిస్తుంది...
నీలో "అనంతమైన శక్తి" వుందని 
అదే నిన్ను నడిపిస్తుందని నమ్ము...  
ముందుకే చూడు ముందుకే అడుగెయ్  "పరాజయం నుండి పాఠాలు" నేర్చుకో...

ఓ మనిషీ ! నీవు 
ఉన్నదాంతో తృప్తిచెందక  
"గాడిదలా" గడ్డి...తినీ తినీ  
"జలగలా"...జనాన్నిపీడించి పీడించి  "అడ్డదారిలో కోట్లు"...ఆర్జించి ఆర్జించి "కుబేరుడవై" పోయానని కులకకు... 
"పూలపాన్పుపై" కునుకు తియ్యకు...  

ఓ మనిషీ ! 
రేపటి ఉదయమే
"నీ కనురెప్పలు" తెరవపోతే... 
"శుభసూర్యోదయం కాంచే 
భాగ్యమే" నీకు కలగకపోతే... 
కళ్ళు మూసి...
"కదలలేని కట్టెగా" మారిపోతే... 
"మళ్ళీ మట్టిలో" నీవు కలిసిపోతే... 
నీ "ఆత్మ పరమాత్మను" చేరిపోతే... 
నీ "ఆస్తులన్నీ పరులకే" చెందునన్నది 
"నమ్మలేని ఓ నగ్నసత్యమని" తెలుసుకో...

34. మేరా భారత్ మహాన్... 

మేరా భారత్ మహాన్...
వందేమాతరం...జనగణమన...
జైజవాన్ జైకిసాన్...సారే జహాసె అచ్చా ...
ఇంక్విలాబ్ జిందాబాద్...నినాదాలు 
నిత్యం మీ గుండెచప్పుళ్ళైతే...

ఈ దేశం మాకేమిచ్చిందని 
చీకటిలో కూర్చొని చింతించక 
ఈ సమాజానికి ఈ దేశానికి
మేమేమిచ్చామని క్షణం ఆలోచించమన్న 
నిస్వార్థపరులైన స్వాతంత్ర్య సమరయోధుల సంఘసంస్కర్తల శుభసందేశాల్ని కలనైనా మరువకపోతే...

ఆరని జ్యోతులైన...అమరవీరులైన 
ఆ దేశభక్తులను....ఆ జాతినేతలను...
ఆ స్పూర్తి ప్రదాతలను...నిత్యం స్మరిస్తూ...
వారి ఆశలకు ఆశయాలకంకితమైపోతే...
మీలో జాతీయత...ఆత్మీయత...
సమతా...మమతలు నీతి...నిజాయితీ...
నిజమైన దేశభక్తి...సద్భావన స్ఫూర్తి...
నిండైన గంగానదిలా ప్రవహిస్తున్నట్లే లెక్క


రచన:
"కవిరత్న"
"సహస్రకవి" 
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502







Comments