12...ఏప్రిల్ నెల 2023 కవితల ఇండెక్స్
1. అందరివాడు అంబేద్కర్...
2. తల్లిదండ్రులూ జాగ్రత్త..!
తస్మాత్ జాగ్రత్త..!!
3. దైవాంశ సంభూతుడు...?
4. అరిషడ్వర్గాలు...
అతీంద్రియ శక్తి..?
5. అలౌకికానందమే....
ఆధ్యాత్మికత అంటే...?
6. నీ రూపం ? నీ నామం ? ఏది గొప్ప?
7. యువకులెవరు..? వృద్ధులెవరు...?
8. ఎవరు ? ఎవరు ?
ఇంకెవరు ఆ పరమాత్మే..?
9. ఓ మానవా...
ఇకనైనా నీవు మారవా?
10. మన బంధాలే సుమగంధాలైతే..?
11. చేదు...తీపి గుర్తులు...?
12. కార్మికుల హక్కులను కాలరాస్తే?
1. అందరివాడు అంబేద్కర్...
తన జాతికి దాహమేస్తే
చెరువులోని మంచినీరు
తోడుకో నివ్వక పోయినా...
తనకు దాహమేస్తే కాలేజీ కూజాలో
మంచి నీళ్ళు త్రాగనివ్వకపోయినా...
అంటరాని వాడంటూ
ఊరికి దూరంగా ఉంచినా...
బడిలో బయటనే కూర్చోబెట్టినా...
వెనుక ఉన్న తమ టిఫిన్ బాక్సులు
మైలపడతాయని లెక్కలు వ్రాసే
బ్లాక్ బోర్డును తాకనివ్వక పోయినా...
14 మంది పిల్లలను కని
పోషించలేక నిరుపేదలైన ఆ
తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నా...
ఏ ఆర్థిక స్తోమత లేక
దుర్గంధభరితమైన చేపలమార్కట్ లో
రాత్రిలో చిన్నవయసులోనే పెళ్లి జరిగినా...
బిఎ ఫస్ట్ క్లాస్ లో పాసై
మంచితనం మానవత్వమున్న
బరోడా మహారాజు
ఉదారహృదయంతో
అమృతహస్తాలతో ఆశీర్వదించి
అందించిన స్కాలర్ షిప్ తో
భార్యా పిల్లలను ఊరిలోనే వదిలేసి
ఎంతో దూరం విదేశాలకు
ఓడల్లో ప్రయాణించి...
కసితో కృషితో
ఒక ఆశయంతో
గట్టి పట్టుదలతో
తెల్లదొరల మధ్య సూటు బూటు
వేసుకొని "తెల్లనికొంగలా"తిరుగుతూ
భారతదేశంతో తనను
సంస్కృతం చదవనివ్వకపోయినా...
ఇంగ్లీష్ విద్యలో పట్టును సాధించి
విదేశాలలోని విశ్వవిద్యాలయాలలో
అన్ని ఆర్థిక, రాజకీయ, గ్రంధాలను
న్యాయ, తత్త్వ, శాస్త్రాలను
రాత్రింబవళ్ళు ఔపాసన బట్టి
ఉన్నత విద్యను ఆర్జించి...
అటు భారత దేశంలోను
ఇటు ప్రపంచంలోను
సకల సౌకర్యాలున్న
ధనవంతుల శ్రీమంతుల
అగ్రవర్ణాల విద్యార్థులెవరూ
కలలోనైనా ఊహించని
తమ జీవితంలో సాధించలేని
డిగ్రీలెన్నిటినో సాధించి...
నిద్రాహారాలు మాని ఏళ్ళతరబడి
పురాతన గ్రంధాలను పరిశోధించి
ఏ బహుభాషా పండితులు సైతం
వ్రాయలేనన్ని అతివిలువైన విజ్ఞాన
దాయకమైన బృహత్ గ్రంథాలను తన
రక్తాన్ని ధారబోసి భావితరాలకోసం వ్రాసి
చరిత్రగదిలో రహస్యనిధిలా దాచిఉంచి...
మహిళల హక్కులకోసం వ్రాసిన
హిందూ కోడ్ బిల్లు ఆమోదంలో
"నా నూతన కేబినెట్ లో
ఆణిముత్యం అంబేద్కర్" అన్న
ప్రధాని నెహ్రూతోనే విభేదించి
న్యాయశాఖమంత్రిగా రాజీనామా చేసి
గాంధీజీ కుట్రలు కుతంత్రాలు నచ్చక
జాతీయ కాంగ్రెస్ లో ఇమడలేక...
అడుగునున్న
బడుగులందరి
అభివృద్ధి కోసం ...
ఆత్మ గౌరవం కోసం...
కులనిర్మూలన కోసం ...
మనిషి మనిషి
మధ్య మంటలు రేపే
మనుధర్మ శాస్త్రాన్ని కాల్చివేసి...
అంటరానితనం కోసం...
అంటరానివారి
ఆలయ ప్రవేశం కోసం
మహద్ చెరువులో నీళ్ళకోసం
రిపబ్లికన్ పార్టీని స్థాపించి...
ఒక్కడే ఒక సైన్యమై
రాజకీయంగా పోరాటాలెన్నో చేస్తూ
ఎన్నో సభలలో సమావేశాలలో
వందల వేల ప్రసంగాలు చేసి ...
బడుగు బలహీన వర్గాల
అభ్యున్నతికి విశేషమైన కృషి చేసి...
ఆరోగ్యం సహకరించకపోయినా
ప్రపంచంలోని ప్రజాస్వామ్య
దేశాధినేతలే నివ్వెరపోయేలా
తన రక్తాన్ని స్వేదంగా మార్చి
రాజ్యాంగ రచనచేసి...
బహుజనుల బ్రతుకుల్లో
వెన్నెల వెలుగులు నింపిన...
జాతినేత...
అందరివాడు...
అపరమేధావి...
ఆత్మబంధువు...
జ్ఞానసూర్యుడు...
విశ్వమానవుడు...
పోరాటయోధుడు ...
ఉద్యమాల యుద్ధనౌక...
బహుముఖ ప్రజ్ఞాశాలి...
భారత రాజ్యాంగ నిర్మాత...
భావిభారత స్పూర్తి ప్రదాత...
అణగారిన వర్గాల ఆశాజ్యోతి...
అమరజీవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్...కి
వందనం...
అభివందనం...
పాదాభివందనం...
2. తల్లిదండ్రులూ జాగ్రత్త..!
తస్మాత్ జాగ్రత్త..!!
హాస్టల్ విద్యార్థులు
జైల్లో కుక్కిన ఖైదీలు...
పంజరంలో బంధించిన పక్షులు...
అంటున్నారు కొందరు ప్రత్యక్ష సాక్షులు...
మంచిమార్కులు రాకున్ననేమి..?
"స్టేట్ ర్యాంకులు" రావాలని...
ఐఐటీలలో "సీట్లు" రావాలని...
కార్పోరేట్ కాలేజీలలో చదవాలని...
సాప్ట్వేర్ ఇంజనీర్లై విదేశాలలో
లక్షలు...కోట్లు...ఆర్జించాలని...
ఓ కన్నతల్లీదండ్రులారా..!
మీరు "పగటి కలలు" కనకండి..!
మీ పిల్లలకనే "కమ్మని" కలలేమిటో...?
కాసుల మధ్య...
కార్పోరేట్ కాలేజీల
ర్యాంకుల రేసుల మధ్య...
నలిగిపోయే మీ పిల్లల
రేపటి బంగారు భవిష్యత్ ఏమిటో...?
ఖరీదైన కార్పొరేట్ కాలేజీలు
ముక్కుపిండి వసూలు చేసిన ఆ
లక్షల ఫీజులు గంగలో విసిరినట్లేనా..?
అక్కడ పిల్లలు విద్యనే అభ్యసిస్తున్నారో...
మానసిక క్షోభను ఆందోళనను ఒత్తిడిని
"ప్రత్యక్ష నరకాన్ని" అనుభవిస్తున్నారో...
కార్పోరేట్ వారు మీ కళ్ళకు
కట్టిన "గంతలు" విప్పి చూడండి..!
"నిఘానేత్రాలతో "...పరిశీలించండి..!
"నిప్పులాంటి నిజాలను" తెలుసుకోండి..!
అక్కడ పిల్లలకు నేర్పేది"చదువే"కాదు
చదువు పేర జరిగేది "చీకటి వ్యాపారం"
మీ పిల్లలు వారి చేతుల్లో "కీలుబొమ్మలు"
వారికి ర్యాంకులు ఆర్జించే "రేసుగుర్రాలు"
తల్లిదండ్రులూ జాగ్రత్త..! తస్మాత్ జాగ్రత్త..!!
3. దైవాంశ సంభూతుడు...?
సకల చరాచర
జీవరాశుల మీద
జాలి జనించడమే...
ప్రేమ పుష్పించడమే...
దయ ప్రవహించడమే...
కరుణను కురిపించడమే...
ఉదారత ఉదయించడమే...
మన మనలోని లోపాలను
చూసి మనం నవ్వుకోవడమే...
అంతులేని ఆధ్యాత్మిక సౌందర్యం.
విశ్వహితుడై...
సత్క్రియవ్రతుడై...
అహంకార రహితుడై...
నిందలకు ప్రశంసలకు
అరిషడ్వర్గాలకు అతీతుడై...
ఆధ్యాత్మిక శక్తిని...
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని...
ఆధ్యాత్మిక పురోగతిని...
ఆధ్యాత్మిక సంస్కారాన్ని...
పరిపూర్ణతను సాధించి
చిదానంద స్థితిని చేరుకున్న
ప్రతిమానవుడు"దైవాంశసంభూతుడే"..
4. అరిషడ్వర్గాలు...
అతీంద్రియ శక్తి..?
అర్ధానికి...
మించిన "స్వార్థం" లేదు
కామానికి...
మించిన "వ్యాధి" లేదు
క్రోధానికి...
మించిన "అగ్ని" లేదు
మొహానికి...
మించిన "శత్రువు" లేదు
మదంకు...
మించిన "మాయని మచ్చ"లేదు
మాత్సర్యానికి...
మించిన "మానసిక వ్యధ" లేదు
ఆధ్యాత్మికతను...
మించిన "అతీంద్రియ శక్తి" లేదు
5. అలౌకికానందమే....
ఆధ్యాత్మికత అంటే...?
రోగిని.....త్యాగిగా
భోగిని....యోగిగా
రాగిని....విరాగిగా
దానవున్ని...దైవంగా
అజ్ఞానిని... జ్ఞానిగా...
మనిషిని... మనీషిగా...
మనీషిని....మహనీయునిగా...
మహనీయున్ని...మహాత్ముడిగా...
మార్చి పొందే
అలౌకికానందమే...
ఆధ్యాత్మికత అంటే...
ఆ ఆధ్యాత్మికానందమే...
బ్రహ్మానందం...నిత్యానందం...
పరమానందం...మోక్షానందం...
6. నీ రూపం ? నీ నామం ? ఏది గొప్ప?
నీ ఖరీదైన
హంసతూలికా తల్పాలు
నీ సుందరమైన
పాలరాతి రాజమందిరాలు
ధగధగ మెరిసే హారాలు
నీ బంగరు ఆభరణాలు
నీవు నిర్మించిన
ఎత్తైన ఎన్నో గుళ్ళు గోపురాలు
అన్నీ అశాశ్వతమే...
నీవు శిలలపై చెక్కించిన
శిలాశాసనాలే శాశ్వతం ....
నీవే రాజువైతే...
నీ రాజభోగాలన్నీ అశాశ్వతమే...
నీ మంచితనం నీ మానవత్వం
నీవు ప్రజలకు పంచిన ప్రేమ
చూపిన జాలి దయాదాక్షిణ్యాలే శాశ్వతం...
నీ అందం నీ ఆస్తి
నీ అధికారం అశాశ్వతం
నీ ఊరు నీ పేరే శాశ్వతం
నీ కిరీటం
అశాశ్వతం
నీ కీర్తి శాశ్వతం
నీ ధనం అశాశ్వతం
నీ దాతృత్వమే శాశ్వతం
"నీ రూపం" అశాశ్వతం
అది 100 సంవత్సరాలే
అంతకుముందే...ఏ క్షణంలోనైనా
ఎండిన ఆకులా...పండిన పండులా...
నేల రాలిపోవచ్చు ధూళిలో కలిసిపోవచ్చు
నీనిండు జీవితానికి ముగింపు పలకవచ్చు
కానీ "నీ నామం" శాశ్వతం
అది 1000 సంవత్సరాలు...
ప్రజల నాలుకలపై నానవచ్చు
అంతకు మించి వర్ధిల్లనూవచ్చు....
నింగిలో తళతళ మెరిసే తారలా...
ఆకాశాన ప్రకాశించే...
ఆ సూర్యునిలా చల్లని ఆ చంద్రునిలా...
7. యువకులెవరు..? వృద్ధులెవరు...?
కొందరు
యువకులు
వృద్ధులన్నారు
మహాకవి శ్రీశ్రీ నాడు
కానీ కొందరు వృద్ధులు
యువకులే నవయువకులే నేడు
కొందరు వృద్ధులు
నాడు ఋషులు మహర్షులు
నేడు ఘనులు త్యాగధనులు
నిన్న తలకు మించి
అప్పులు చేసిన వారు
తీర్చలేక తిప్పలు పడినవారు
నిన్న వారు నిప్పులా
భగ్గున మండినవారు
నేడు తలలు పండినవారు
వారు వారి ఆశయాల
ఆక్సిజన్ మనకు ఎక్కిస్తారు
అనుభవాల అమృతాన్ని పంచుతారు
వారు కష్టాల కలల అలల మీద
పయనించి జ్ఞాపకాల మూటలను
జ్జాననిధులను జీవితతీరాలకు చేర్చినవారు
కొందరు వయసులో వృద్దులైనా...వారు
ఆలోచనల్లో...ఆచరణలో...నవయువకులే
8. ఎవరు ? ఎవరు ?
ఇంకెవరు ఆ పరమాత్మే..?
నీ ఆలోచనలు నీ తలంపులు
నీ భావనలు నీ ఊహలు పుట్టేది
నీ మేధస్సు నుండి నీ మనసు నుండి
నీ బుద్ధి నుండి నీ హృదయం నుండి
నీ ఊపిరినుండి నీ ఆత్మనుండే కదా !
నీ నాలుకకు...
మాటలు నేర్పేదెవరు ?
నిన్ను మాటలు రాని
మూగవాడిగా మార్చేదెవరు ?
నీ పాదాలకు...
నడక నేర్పేదెవరు ?
ఆ నడకను ఆపేదెవరు ?
నీ కనులకు...
చూపు నిచ్చేదెవరు ?
ఆ చూపును నీ కనురెప్పలను
శాశ్వతంగా మూసివేసేదెవరు ?
నీకు ఆశలు రేపేదెవరు?
నీకు ఆకలి పుట్టించేదెవరు ?
ఆ ఆకలిమంటలను ఆర్పేదెవరు ?
నిన్ను రాత్రివేళ
నిద్రపుచ్చేదెవరు ?
తిరిగి సూర్యోదయం వేళ
నిద్రనుండి నిన్ను మేల్కొల్పేదెవరు ?
నీ ప్రయాణంలో ఆకస్మికంగా
ఘోర ప్రమాదాలను కలిగించేదెవరు ?
ఆ ప్రమాదాల నుండి నిన్ను రక్షించేదెవరు ?
నీకు ఘోరమైన రోగాలను
వ్యాధులను పుట్టించేదెవరు ?వాటి
నుండి నీకు స్వస్థత కలిగించేదెవరు ?
నిన్ను ఆకాశానికి ఎత్తేదెవరు ?
నిన్ను అగాధములో పాతాళంలో
ఊపిరాడని ఊబిలో పడద్రోసేదెవరు ?
నీకు అంతులేని ఆనందాన్ని
సంతోషాన్ని కలిగించేదెవరు ?
నీ కళ్ళనుండి జలజల కురిసే
ఆ కన్నీటిధారలకు కారణమెవరు ?
వాటిని తుడిచే అదృశ్యహస్తములెవరివి ?
నీవు చేసే ప్రతికార్యానికి
ఊహించని ప్రతిఫలాన్ని అందించేదెవరు ?
ఈ భూమిపైన
నీ జనన మరణాలను
నీ సుఖ...దుఃఖమయ
జీవితాన్ని శాసించేదెవరు ?
నీవు సర్వం శాశ్వతమని
తలంచిన మరుక్షణమే కాదు కాదు
నీ జీవితం క్షణికమేనని...అదొక
నీటిబుడిగేనని నీకు గుర్తు చేసేదెవరు ?
నీ నీడలో నీడై
నీ రక్తంలో రక్తమై
నీ ఊపిరిలో ఊపిరి
నిన్ను నిత్యం నడిపించేదెవరు ?
ఎవరు ఎవరు ఇంకెవరు ?
నీకు అర్థం కాని ఆ అంతర్యామి
నీకు దర్శనం ఇవ్వని ఆ దైవమే కదా !
నీ మృత్యువే మీ శత్రువై
నిన్ను వేధిస్తుంటే బాధిస్తుంటే
భయపడకు...నేనున్నానని...
ఆపద్బాంధవుడిలా ఆపదలో
ఆదుకునేదెవరు? ఆ భగవంతుడే కదా !
9. ఓ మానవా...
ఇకనైనా నీవు మారవా?
నీ కన్నులు పీకబడును...
నీ నాలుక కోయబడును...
నీ చేతులు నరకబడును...
నీ కాళ్లు విరగగొట్టబడును...
నీ పీక పిసికి వేయబడును...
నీ నోరు మూసివేయబడును...
నీ తల తీసివేయబడును...ఎప్పుడు..?
నీవు నీకు జన్మనిచ్చిన
నీ అమ్మానాన్నల
చెంతకుచేరి చిరునవ్వుతో
ప్రేమలో పలకరించనినాడు...
వారు ఎగరలేని
గూటిలో గువ్వలని
వారు నీ గుండె గుడిలో
వెలసిన ప్రత్యక్ష దైవాలని...
వారే నీ కళ్ళకు కనిపించే దేవతలని...
భావించి
భయభక్తులతో...
వినయ విధేయతలతో...
పూజించక వారిని
నిర్లక్ష్యం చేసినవాడు...
ముసలి నక్కలని కసురుకున్ననాడు...
వారిని ఆనాధాశ్రమాలలో చేర్చిననాడు...
నీ తల్లి చీకటి గర్భాన
నీవుండగానే నీకు ప్రాణం పోసిన
ఆ పరమాత్మే తప్పక తీర్పుతీర్చును
ఈ క్రూరమైనశిక్షలు నీకు విధించబడును
అందుకే జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త...
ఓ మానవా... ఇకనైనా నీవు మారవా?
10. మన బంధాలే సుమగంధాలైతే..?
నిన్నటి ప్రాణ మిత్రులే
నేడు బద్ధ శత్రువులౌవుతున్నారు బంధువులు రాబందులౌతున్నారు రక్తసంబంధీకులే రక్తాన్ని పిలుస్తున్నారు
ఎవరు మిత్రులో...
ఎవరు శత్రువులో...
ఏవి బంధాలో...అనుబంధాలో...
స్వచ్ఛమైన స్నేహబంధాలో...
నకిలీ వ్యాపారబంధాలో...
రక్తబంధాలో...రాక్షసబంధాలో...
ఎంతకూ ఈ మనిషికి అర్థం కాకున్నది
గుర్తుకొస్తే గుండె పగిలి రగిలి పోతుంది
మనసు ముక్కలై పోతున్నది...కళ్ళు
కన్నీళ్ళకు బదులు రక్తాన్ని శ్రవిస్తున్నవి
కారణం మానవుడు
దానవుడైపోతున్నాడు...
అడవి మృగమైపోతున్నాడు...
అంధుడౌతున్నాడు...
కామాంధుడౌతున్నాడు...అసలు
మనిషన్నవాడే మాయమైపోతున్నాడు
ఈ భవబంధాలను
పెంచేదెవరో..? శాసించేదెవరో ?
శాశ్వతంగా ఉంచేదెవరో..?
అర్ధాంతరంగా త్రుంచేదెవరో..?
ఎంతకూ ఈ మనిషికి అర్ధం కాకున్నది
కానీ ఈ మనిషిలోని
ఈ కులగజ్జిని...
ఈ మతపిచ్చిని...
ఈ బంధుప్రీతిని...
ఈ అర్ధంలేని స్వార్థాన్ని...
ఈ అంతులేని అహంకారాన్ని...
ఈ మానవత్వంలేని వ్యక్తిత్వాన్ని...
ఈ నక్క వినయాలను...
ఈ పగా ప్రతీకారాలను...
ఈ అసూయా ద్వేషాలను...
నిత్యం వీక్షించే...పరీక్షించే.సస
ఆ పరమాత్మకు సాధ్యమే
ఈ మనిషి ముందు జీవితాన్ని
బంధాలతో...సుమగంధాలతో నింపడం
అందుకే ఓ మానవా...ఇకనైనా మారవా..?
ఈ కంప్యూటర్ యుగంలోనైనా
నీ రెండు కళ్ళు తెరుచుకొని
ఒక నిండు నిజాన్ని తెలుసుకోవా..?
ఈభువిపై బంధాలులేని బ్రతుకొక నరకమని
సత్సంబంధాలున్న చాలు నదొక స్వర్గసీమని
11. చేదు...తీపి గుర్తులు...?
ప్రతి మనిషి
తన జీవితంలో
మరిచిపోలేనివేమిటి...?
ఆపదలో చిక్కుకొని
దిక్కుతోచని స్థితిలో ఉన్న వేళ...
సకాలంలో స్పందించి ప్రాణమిత్రుడు"
అందించే..."చిరుసహాయం"...
మనం దైవమని పూర్తిగా
"నమ్మినవాడే" నవ్వుతూ
నట్టేట ముంచేసి మన మనసుకు
చేసిన..."మానని గాయం"...
చిలిపి వయసు అల్లరి మనసు
విసిరే వలపువలలోచిక్కుకొని
అర్థం లేని ఆకర్షణలకు లొంగి
దారి తప్పిపోయే యువతకు"
సకాలంలో ఇచ్చిన..."శుభసందేశం"...
కలహాలతో...కలతలతో మునిగి
కలిసి కాపురమా...?విడిపోవడమా...?
అంటూ దంపతులిద్దరు
మానసికంగా మదనపడే వేళ
తీర్చిన..."ధర్మసందేహం"...
ఆకలికి అలమటించే వేళ
ఒక "అనాధకు" ఆప్యాయతతో
అందించిన..."ఆత్మీయ బిక్ష "...
తెలిసీతెలియక చేసిన చిరునేరానికి
ఓ "విధి వంచితకు" విధించిన
భయంకరమైన..."శిలువ శిక్ష "...
ఔను "గతం" కొందరికి "భూతం"
కొందరికి మరిచిపోలేని
మధురమైన ఒక "తీపిజ్ఞాపకం"
గుర్తుకొస్తే...కొన్ని
ఘోర సంఘటనలు..."ఆ విధివ్రాత"...
"ఆ గుండె కోత"...ఆగదు కన్నీటి ధార...
గుర్తుకొస్తే ...కొన్ని మధుర స్మృతులు
హృదయం ఒక "సంతోషసాగరమే"
అంతటా "అంతులేని ఆనందమే"...
"పరమానందమే"..."బ్రహ్మానందమే"...
ఔను అదే జీవితమంటే...ఆపై
అందరి బ్రతుకులు..."నందనవనాలే "...
ఆ భగవంతుడే...."నిత్యం తోడుంటే "...
12. కార్మికుల హక్కులను కాలరాస్తే?
(మేడే సందర్భంగా కార్మికుల కవిత)
అరచేతిని అడ్డుపెట్టి
సూర్యకాంతిని ఆపాలనుకుంటే...
అఖండమైన కార్మిక కర్షక శక్తిని
అణచివేయాలనుకుంటే...
అది అజ్ఞానం...అవివేకం...అసాధ్యం...
సంస్థసిబ్బందిని ఇబ్బంది పెట్టి...
వారి కడుపులు కొట్టి శ్రమను దోచి
కార్మికుల హక్కులను కర్కశంగా
కాలరాసిన కార్పోరేట్ సంస్థలెన్నో
కాలగర్భంలో కలిసి కనుమరుగైపోయే...
కష్టజీవులు తమ కన్నబిడ్డలన్నవే
చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే...
ప్రగతి రథచక్రాలు కదలాలన్నా
ప్రజలు సుఖంగా జీవించాలన్నా
శ్రామికులు కార్మికులు కర్షకులు
తమ రక్తాన్ని స్వేదంగా చిందించక తప్పదు
ఔను...ఎండే కడుపులతో
మండే గుండెలతో మండు టెండల్లో
కొండలమీద కండలు కరిగేలా
బండలుమోసే బ్రద్దలుచేసే ఓ కార్మికులారా !
కార్ఖానాల్లో యంత్రాలనడుమ
రేయింబవళ్ళు శ్రమించే ఓ శ్రామికులారా !
బంజరు భూముల్లో బంగారం పండించే
ఓ కర్షకులారా ! ఓ రైతుకూలీల్లారా!
ఓ తాడిత పీడిత బడుగు
బలహీన వర్గాల బహుజనులారా !
మీ యజమానులను గౌరవించండి !
వారిని దేవుళ్ళుగా పూజించండి!
సంస్థ పురోభివృద్ధికి కృషి చేయండి !
కానీ బానిసత్వానికి మాత్రం బలికాకండి !
మీ హక్కులను కాలరాస్తే?
మీరు పులులై పోరాడండి !
పోరాడితే పోయేదేముంది? చెప్పండి
మీకు సంఘంలో సమానత్వం రావడం తప్ప
ఓ కార్పొరేట్ సంస్థ యజమానులారా !
ఓ బడా పారిశ్రామిక వ్యాపారవేత్తలారా !
మీ సంస్థల్లో శ్రామికులతో కార్మికులతో బండచాకిరి చేయించుకున్నప్పుడు...
వారు ఆకలిని అణచుకొని
తమ రక్తాన్ని స్వేదంగా మార్చినప్పుడు...
వారు ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
మీ సంస్థ అభివృద్ధికి కృషి చేసినప్పుడు...
వారి "చెమటచుక్కలు"ఆరిపోక మునుపే
వారి "కష్టార్జితాన్ని" వారికి చెల్లించాలన్న
"అల్లా సందేశాన్ని" కలనైనా మరువకండి...
"కార్మికుల హక్కులను" కాలరాయకండి...
రచన.
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...
చరవాణి...9110784502

Comments
Post a Comment