ఓ మల్లయోధుల వారసుడాగా మళ్ళీ ఈ వేదభూమిలో మీ జన్మ ఎప్పుడు...?










 

ఓ మల్లయోధుల వారసుడా..! మళ్ళీ 
ఈ వేదభూమిలో మీ జన్మ ఎప్పుడు..?

కట్టుబాట్ల చెట్లమీద
కులం కులం అంటూ 
కాకుల్లా అరిచే...
సాటి మనుషులను 
కుక్కలకన్నా హీనంగా చూసే... 
ఆరని కులం కుంపట్లను రాజేసే 
నిరుపేదల హక్కులను కాలరాసే మనువాదుల మూకల తోకలకే కాదు 
నిచ్చెన మెట్ల వ్యవస్థకే నిప్పంటించిన...
ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..! 
ఓ మల్లయోధుల వారసుడా....!
మీరు చేసిన...ఆ సాహస కృత్యం..!

సరిగ్గా 97 సంవత్సరాల క్రితం 
వర్ణవ్యవస్థ విషవృక్షంగా 
విస్తరించే వేళ 
మనిషి మనిషి మధ్య 
కులం చిచ్చు రగిలించే 
బ్రాహ్మణ బైబిల్ వంటి 
మనుధర్మ శాస్త్రాన్ని 
మండే మంటల్లో విసిరేసి 
కసితో కాల్చి బూడిద చేసి 
మహద్ చెరువులో కలిపేసిన
ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..! 
ఓ మల్లయోధుల వారసుడా....!
మీరు చూపిన...ఆ గుండె‌ ధైర్యం..!

కాంగ్రెస్ కొండలనే ఢీకొట్టిన...
అగ్రవర్ణ అనకొండలను...ఎదుర్కొన్న
కోరలు చాచి కసితో బుసలు కొట్టే
కోడెనాగుల తోకలను త్రొక్కిన
పులుల నోట్లో తలదూర్చిన...
ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..! 
ఓ మల్లయోధుల వారసుడా....! 
విశ్వమే విస్మయంచెందే ఆ వీరత్వం..! 

కులమనే ముళ్ళకిరీటాన్ని 
ధరించిన అగ్రవర్ణాల వారికి
కనువిప్పు కలిగించేలా
మనువాదుల మదం అణిచేలా... 
కులనిర్మూలన కోసం మీ
జీవిత సర్వస్వం త్యాగం చేసిన 
ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..! 
మీ రెంతటి...ఘనులో త్యాగధనులో 
మా మట్టి బుర్రలకెప్పుడర్థమయ్యేను..?

ఓ బాబా సాహెబ్ అంబేద్కరా..! 
ఓ మల్లయోధుల వారసుడా....!
ఈ దళితజాతిని జాగృతం చేసేందుకు..! 
ఈ వేదభూమిలో మళ్ళీ మీ జన్మ ఎప్పుడో..? ఎప్పుడో...? ఎప్పుడో...?

కానీ ఓ మా మహాత్మా..! మొన్న మీరు
హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తులో 
నేడు విజయవాడ నడిబొడ్డున ...
206 అడుగుల భారీ కాంస్య విగ్రహమై విలసిల్లేరు...జ్ఞానసూర్యునిగా వెలిగేరు...
ఓ దళితరక్షకా ఓ అమరజీవి అంబేద్కరా 
నిత్యం మీ దర్శనంతో మా జన్మధన్యం..!
ఓ‌ దైవమా..! మీ స్మరణే మాకు ఓ ప్రేరణ..!

(19.01.2024 తేదీన విజయవాడలో 206 అడుగుల ఎత్తైన డా.బి.ఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి 
గారు ఆవిష్కరించిన సందర్భంగా)...




రచన:
"కవిరత్న"
"సహస్రకవి" 
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502



Comments