సంక్రాంతి కవితలు...

















సంక్రాంతి కవితల ఇండెక్స్ 

1. సంక్రాంతి పర్వదినమంటే...?
2. మకర సంక్రాంతి పర్వదినం
3. సంక్రాంతిలక్ష్మికి 
   స్వాగతం...సుస్వాగతం 
4. ఏది నిజమైన సంక్రాంతి ?
5. సంక్రాంతి పండుగ...
6. నిజమైన సంక్రాంతి ఎప్పుడంటే?
7. సంక్రాంతి సంబరాలు...

1. సంక్రాంతి పర్వదినమంటే..!

సంక్రాంతి 
పర్వదినమంటే...
ఊరినిండా 
పాడి పంటలే... 
భోగి మంటలే
ఇంటినిండా 
పిండివంటలే...
కొత్త జంటలే కోలాహలమే...

సంక్రాంతి
పర్వదినమంటే..... 
గంగిరెద్దులే... 
గాలిపటాలే...
కొత్త అల్లుళ్ళే.‌‌.. 
కోడిపందాలే...
ముసిముసి నవ్వులే...
ముత్యాల ముగ్గులే...
బసన్నల విన్యాసాలే...
హరిదాసుల వినోదాల విందులే...

సంక్రాంతి 
పర్వదినమంటే... 
పచ్చనిపాడిపంటలే...
గాదెలనిండా నవధాన్యాలే...
సిరిసంపదలే...చిరునవ్వులే
భోగభాగ్యాలే శాంతి సౌభాగ్యాలే...

సంక్రాంతి 
పర్వదినమంటే....  
జీవితాన 
ఏ విషాదంలేని...
ఏ విపత్తులురాని... 
ఏ మొండివ్యాధులు వెంటపడని...
చక్కని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలే...
ఇది చదివినవారికి సంక్రాంతి శుభాకాంక్షలే.

2. మకర సంక్రాంతి పర్వదినం

సంక్రాంతి పర్వదినమంటే...
దేవతలు మేల్కొనే...
స్వర్గద్వారాలు తెరుచుకునే...
ఉత్తరాయణం.... 

ఇది బాహ్యప్రపంచంలో
చిమ్మ చీకట్లను చీల్చివేసే...
అంతరంగాన కమ్మిన
అజ్ఞానాంధకారాన్ని తొలిగించే...

విజ్ఞాన దీపమైన...
ప్రత్యక్ష దైవమైన...
త్రిమూర్తుల శక్తిస్వరూపుడైన
వైద్యనారాయణుడైన...

సకల చరాచర జగత్తుకు
ప్రాణదాతయైన...
కాలపురుషుడైన...
ఆ మార్తాండుడు...

మకర రాశి నుండి...
మిధున రాశి వరకు...
చేసే...శుభకర...మంగళకర
ఆరురాశుల...అపురూపమైన
ప్రయాణమే...ఈ ఉత్తరాయణం

ఇదే పరమ పవిత్రమైన శ్రేష్టమైన
మన మకర సంక్రాంతి పర్వదినం

3. సంక్రాంతి లక్ష్మీకి స్వాగతం 

సంక్రాంతిలక్ష్మికి
స్వాగతం...సుస్వాగతం

క్రూరమృగాలు సైతం కారడవుల్లో
కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నాయ్
కానీ ఈ మానవ మృగాలెందుకో
మానవత్వం మరచిపోతున్నాయ్

కాలు బయట పెడితే...
ఒంటరిగా కంట పడితే...
వెంటపడి‌ వేధిస్తున్నారే...బాధిస్తున్నారే...
మాయమాటలతో...ప్రేమపేరుతో... 
వయసొచ్చిన అమాయకపు
అమ్మాయిల్ని మోసగిస్తున్నారే...
కసాయిలై ప్రవర్తిస్తున్నారే...

కామంతో కళ్ళుపొరలు కమ్మి
కామాంధులౌతున్నారే...
పశువులుగా మారుతున్నారే...
పశువాంఛ తీర్చుకుంటున్నారే...
పచ్చనినోటులాంటి పడుచుపిల్లల
బంగారు భవిష్యత్తును
చిత్తుకాగితం చేసి చించివేస్తున్నారే...

వావి వరుసలులేక
అంధులై కామాధులై
కన్నబిడ్డల్లాంటి పసిమొగ్గలను
చీకటిలో చిదిమేస్తున్నారే...
కన్నతల్లుల్లాంటి పండుముసలుల జీవితాలతో ఆడుకుంటున్నారే...
జింకలను పులులు వేటాడినట్లు 
నిస్సహాయులను చేసి నీచకార్యాలకు
అత్యాచారాలకు అమానుషచర్యలకు
అకృత్యాలకు పాల్పడుతున్నారే...
మానవమృగాలై
చిత్రహింసలకు గురిచేస్తున్నారే...

అమ్మా..! ఓ సంక్రాంతిలక్ష్మీ రావమ్మా రా..!
నీవైనా ఈ మానవమృగాల
బుద్ధిని మార్చరావమ్మా..!
పాషాణ హృదయులైన
పాలకుల్ని కదిలించరావమ్మ..!
అంధులైన అధికారుల
కళ్ళకున్న గంతల్ని విప్పరావమ్మా..!
నీవైనా ఈ అబలల విషాద గాధల్ని
కన్నీటి వ్యధల్ని వినరావమ్మా..!
సృష్టికి మూలమైన ఈ స్త్రీజాతి
వెతలను వేదనలను కడతేర్చరావమ్మా..!
అందుకే ఓ సంక్రాంతి లక్ష్మీ..!
నీకు స్వాగతం !సుస్వాగతం !ఘన స్వాగతం

4. ఏది నిజమైన సంక్రాంతి ?

ఇంటినిండా గాదెలనిండా 
ధనరాశులుంటే సరిపోదు
...ఆ గుండెలనిండా
సుఖశాంతుల ధనరాశులుండాలి 

ఇంటి కుటుంబసభ్యుల 
మధ్య సత్సంబంధాలుంటే సరిపోదు
...అందరి గుండెల్లో అనురాగం
ఆప్యాయత ఆత్మీయతలు వెల్లివిరియాలి

పగలు ప్రతీకారాలు లేని స్వచ్ఛమైన 
మానవ సంబంధాలుంటే సరిపోదు
...ఆ మనుషులందరు మానవీయ 
విలువలకు మణిదీపాలుగా వెలగాలి

పదిమందికి ప్రేమను పంచితే సరిపోదు
...పేదలను అనాధలను వికలాంగులను
విధవలను ఆదుకునే ధర్మదాతలు కావాలి 

ఇంట కలతలు కన్నీళ్లు లేకుంటే సరిపోదు
...అందరు కలిసిమెలిసి ఆనందంగా ఉన్న 
ఆ ఇంట మంచితనం గంగలా ప్రవహించాలి 
మానవత్వపు పరిమళాలను వెదజల్లాలి

అప్పుడే అందరి 
బ్రతుకులు ధన్యమౌతాయి
అదే అదే నిజమైన సంక్రాంతి 
అప్పుడే జీవితాన నవ్య క్రాంతి

ఇదే మనసుల్ని పరవశింపజేసే 
మకర సంక్రాంతి పర్వదినం 
నా కవితను చదివిన మీ 
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు... 

5. సంక్రాంతి పండుగ...

అదిగో...అదిగో...
వచ్చింది వచ్చింది...
సంక్రాంతి పండుగ...
సుఖ సంతోషాలను... 
సంబరాలను తెచ్చింది...
మెండుగా ఎదనిండగా...
ఇది గంగిరెద్దుల పండగ...
ఇది పతంగుల పండుగ...
ఇది హరిదాసుల పండుగ...
ఇది పిండివంటల పండుగ...
ఇది ఆడపడుచుల పండుగ...
ఇది భోగి మంటల పండుగ...
ఇది ముత్యాల ముగ్గుల పండుగ...
ఇది ఆడ పడుచుల్ని కొత్త అల్లుళ్ళను...
ఇళ్ళకు ఆహ్వానించే అతిథుల పండుగ...
ఇది సుఖశాంతులను సకలభోగాలను...
శుభాల నొసగే సూర్యదేవుని పండుగ....
ఇది గోవులను పూజించే గొప్ప పండుగ...
ఇది మూడురోజుల ముచ్చటైన పండుగ...
ఇది భోగి... 
మకర సంక్రాంతి...
కనుమల పండుగ... 
ఇది పితృదేవతలకు... 
సంతర్పణ చేసే పెద్దల పండుగ...
ఇదే ఇదే సంతోషాలు సంబరాలు... 
అంబరాన్ని తాకే సంక్రాంతి పండుగ...

6. నిజమైన సంక్రాంతి ఎప్పుడంటే?

సంక్రాంతి పర్వదినమంటే...
ఇంటినిండా 
పిండివంటలు...కొత్త జంటలే....
ఊరినిండా 
పాడి పంటలు...భోగి మంటలే...

సంక్రాంతి పర్వదినమంటే...
గంగిరెద్దులు...గాలిపటాలే...
కొత్త అల్లుళ్ళు.‌‌..కోడిపందాలే...
ముసిముసి నవ్వులు...
ముత్యాల ముగ్గులే...
హరిదాసుల వినోదాలు...
బసన్నల విన్యాసాలే...కాని...

నిజమైన సంక్రాంతి ఎప్పుడంటే?
ఆడిపాడే ఆ పసిమొగ్గలు 
అంధులైన కామాంధులైన 
మానవ మృగాల పశువాంఛకు బలికానప్పుడే...ఆడపడుచులు
అర్థరాత్రిలో నిర్భీతితో తిరిగినప్పుడే...
విహంంగాలై స్వేచ్ఛగా విహరించినప్పుడే...

సంక్రాంతి పర్వదినమంటే... 
పచ్చనిపాడిపంటలు...
గాదెలనిండా నవధాన్యాలు...
భోగభాగ్యాలు...సిరిసంపదలే...కానీ...

నిజమైన సంక్రాంతి ఎప్పుడంటే?
ప్రజల ఎదల్లో ఆనందాల
హరివిల్లులు విరిసినప్పుడే...
ముఖాలలో చిరునవ్వుల 
చిరుజల్లులు కురిసినప్పుడే...
ఇంటిల్లిపాదీ మధుర జ్ఞాపకాలతో  
ముద్దు ముచ్చట్లతో మురిసినప్పుడే...

సంక్రాంతి పర్వదినమంటే....  
జీవితాన ఏ విపత్తులురాని...
ఏ విషాదాలు లేని...
ఏ మొండివ్యాధులు వెంటపడని...
చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలే...కానీ...

నిజమైన సంక్రాంతి ఎప్పుడంటే?
అందరి ఆశలు కోరికలు తీరినప్పుడే...
అన్నదాతల ఆత్మహత్యలు ఆగినప్పుడే...
ఆకలిమంటల అగ్నిజ్వాలలు ఆరినప్పుడే...
జీవితాల్లో ప్రశాంతత పంట పండినప్పుడే...
అందరు కన్న కమ్మనికలలు పండినప్పుడే...

అప్పుడు కదా అంబరాన్ని 
తాకే సంక్రాంతి సంబరాలు...
అప్పుడు కదా సకల 
జనులకు సుఖశాంతులు... 
అప్పుడు కదా అందరి జీవితాల్లో 
వెల్లివిరియు దివ్యమైన నవ్యక్రాంతులు...

7. సంక్రాంతి సంబరాలు...

మూడురోజుల పండుగ 
ముచ్చటైన పండుగ...
సంక్రాంతి పండుగ...వేళ
మీ సంతోషాలు సంబరాలు...
ఆ అంబరాన్ని తాకాలంటే...

మీలోని చెడును 
ఈర్ష్యా ద్వేషాలను 
భోగి మంటల్లో 
దగ్ధం చేసిన చాలు...

"భోగి" పండుగ...
మీకు భోగభాగ్యాలను...
శాంతి సౌభాగ్యాలను... 
ఆయురారోగ్యాలను... 
అష్టైశ్వర్యాలను..."బంగారు"
"బహుమతులుగా" మీకందిస్తుంది

మీరు గతంలో 
నేర్చుకున్న 
గుణపాఠాలను 
గుర్తుంచుకొని... 
బంగారు భవిష్యత్తుపై 
ఆశలు పెంచుకొని...
వర్తమానంలో పరోపకారులుగా... 
మీరు "ప్రశాంతంగా" జీవిస్తే చాలు...

"మకర సంక్రాంతి"...
పర్వదినం...
సరదాలను...
సంబరాలను...
సుఖసంతోషాలను... 
చెరగని చిరునవ్వులను... 
తరగని సిరిసంపదలను...
మీకు వరాలుగా "...అందిస్తుంది...

గత ఏడాది మీ కష్టాలలో 
మీకు తోడుగా నీడగా ఉండి 
మీ ఇళ్ళు ధనధాన్యాలతో 
కళకళలాడేందుకు మీతో పాటుగా 
రేయింబవళ్ళు శ్రమించిన పశువులను 
చక్కగా అలంకరించి పూజించిన చాలు 
మీ పితరులను స్మరించుకున్న చాలు...
 
"కనుమ" పండుగ...
ఘుమఘుమ లాడే  
రుచికరమైన రకరకాల 
కమ్మనైన వంటకాలతో 
మీ కడుపులను...
ప్రేమానురాగాలతో...
ఆత్మీయ అనుభూతులతో...  
మీ మనసులను నింపాలని...
ఆ సంక్రాంతి లక్ష్మిని కోరుకుంటూ...
ఈ కవిత చదివిన మీ అందరికీ
సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.

8. సంక్రాంతి అంటే..?
    కొత్త అల్లుళ్లే..? కోడి పందేలే..?

సంక్రాంతి అంటే..?
కొందరికి సరదా...
కొందరికి లక్షల్లో 
కోట్లల్లో ఆదాయం... 
అంతులేని ఆనందం 
అంబరాన్ని తాకే సంబరం... 

కానీ సంక్రాంతి అంటే..?
పాపం కోడిపుంజులకు 
జీవన్మరణ పోరాటం...
గెలుపుకోసం ఆరాటం... 
పందెపు కోళ్లకు ప్రాణసంకటం...

పోలీసుల ప్రకటనలను ఆదేశాలను 
హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరుచేసి
అవినీతి అధికారులతో లాలూచీపడి 
ఈ కోడిపుంజుల ప్రాణాలతో చెలగాటం 
ఆడేహక్కెవరిచ్చారు వీరికి...ఏమో..? 

కానీ కోళ్లు మాత్రం పందెంలో దూకాక
ఆట మొదలెట్టాక ఆగేదేలే తగ్గేదేలా...
అన్నట్టుగా...ఒంట్లో ఉన్న శక్తినంతా
ధారపోసి తమపై ఎంతో ఖర్చుపెట్టి 
తమను మహరాజుల్లాగా పెంచిన 
యజమానులను గెలిపించాలన్న... 
తమ ఋణం తీర్చుకోవాలన్న... 
తమ పౌరుషం చూపించాలన్న...

తపనతో రెక్కలు రెపరెపలాడించి... 
గాల్లోకి...ఎగిరి ఎగిరి...ప్రత్యర్థుల్ని 
ముక్కులతో...పొడిచి పొడిచి..? 
కత్తుల కాళ్ళతో...తన్ని తన్ని... 
గుండెల్లో కత్తులు...గుచ్చిగుచ్చి...
ప్రాణాలను ఫణంగా పెట్టి...పాపం 
పందెంకోళ్ళు రక్తపుమడుగులో 
గిలగిల లాడుతూ వుంటే... 
ఈ పందెపురాయుళ్ళకు...
ఈ రాజకీయనేతలకు...
రాక్షసానందమే...ఆర్జన కోట్లలోనే... 

ఔను ఒంటినిండా గాయాలైనా... 
రక్తం ఏరులై పారుతున్నా... 
చిట్టచివరి రక్తపుబొట్టు వరకు... 
బొందిలో ప్రాణమున్నంతవరకు...
నేలకొరిగేవరకు కళ్ళు మూసేవరకు... 
పందెపు కోళ్ళు కొట్లాడి...కొట్లాడి... 
పోట్లాడి...పోట్లాడి...పోరాడి...పోరాడి...
పందెపు రాయుళ్ల ఆశలకు...
రాజకీయ నాయకుల బెట్టింగ్ లకు
బలైపోయే ఆమూగజీవులకే ...

మాటలొస్తే..? ముందు శపించేది...
ప్రేక్షకపాత్ర వహించే ప్రభుత్వాన్నే...

మా కాళ్ళకు కత్తులు కట్టొద్దని...
చిందే మా రక్తాన్ని చూసి 
చిందులు వేయవద్దని... 
వేడుకునేది...పందెపురాయుళ్ళనే...

మా ప్రాణాలతో చెలగాటమాడవద్దని... 
కోళ్ళను పెంచైనా కోట్లు ఆర్జించవచ్చని...
కోరుకునేది...రాజకీయనాయకుల్నే... 




రచన:
"కవి రత్న" 
"సహస్ర కవి" 
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502








Comments