క్రిస్మస్ పండుగ...వివిధ దినపత్రికల్లో రమణీయమైన రంగుల్లో ప్రచురితమైన కొన్ని క్రీస్తు కవితలు...క్రిస్మస్ శుభాకాంక్షలు ...మీకోసం...పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్...


















 






9...క్రిస్మస్ కవితల ఇండెక్స్...

1. క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు...
2. ప్రభువైన యేసుక్రీస్తు సంక్షిప్త జీవితచరిత్ర
3. క్రిస్మస్ శుభాకాంక్షలతో...
    యేసుక్రీస్తు శుభసందేశాలు..
4. క్రిస్మస్ పండుగ..!!! 
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)
5. ఆకాశంలో ఆరనిజ్యోతి..!
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత
6. క్రిస్మస్ ట్రీ అంటే....
7. క్రీస్తు అంటే...?
8. పరమపావనం...క్రిస్మస్ పర్వదినం
9. ప్రేమించే ప్రేమమయుడు

1. క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు...

మిత్రులారా..! మీకోసం 
ఈ క్రిస్మస్ పర్వదినాన నేను 
ఆ కరుణామయున్ని కోరేదొక్కటే...

ఆ ప్రభువు యొక్క ఆపార 
కృపా కరుణా కటాక్ష వీక్షణాలు...

దయా దాక్షిణ్యాలు... 
ప్రేమాభిమానాలు...
శాంతి సమాధానాలు...
మీపై మీ కుటుంబసభ్యులపై 
కుంభవర్షమై కురియును గాక..!
 
సకల శుభములు 
మీకు కలుగును గాక..!
కలనైనా ఊహించని రీతిలో 
మీరు ఆశ్చర్యచకితులయ్యేలా...
ఇరుగుపొరుగు వారు ఈర్ష్య పడేలా... 

మీరు...ఆయురారోగ్యాలతో...
భోగభాగ్యాలతో...అష్టైశ్వర్యాలతో...

అనునిత్యం...
మీ ముఖాన...చెరగని చిరునవ్వులతో... 
మీ ఎదలో......కరగని సుఖశాంతులతో... 
మీ ఇంట........తరగని సిరిసంపదలతో...

మీరు మీ పిల్లాపాపలతో 
హాయిగా...ఆనందంగా...సంతోషంగా...
ఎంతో ప్రశాంతంగా...జీవించెదరుగాక..! 
నిండూనూరేళ్లు...చల్లగా వర్ధిల్లెదరుగాక..!

(అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో)

2. ప్రభువైన యేసుక్రీస్తు సంక్షిప్త జీవితచరిత్ర 
(క్రిస్మస్ సందర్భంగా.......శుభాకాంక్షలతో)

ఆదియందు వాక్యముండెను 
వాక్యము దేవుని వద్ద ఉండెను 
వాక్యము దేవుడై ఉండెను 
ఆ వాక్యము అబ్రాహాము కంటే 
ముందే ఉండెను... అన్నది
పరిశుద్ధ గ్రంథలేఖనము..
"ఆ వాక్యమే"...
వృద్ధుడైన ఏసేపుకు 
ప్రధానం చేయబడి... 

కన్య మరియ గర్భాన 
పరిశుద్ధాత్మచే బెత్లెహేంలో 
నజరేతను ఊరిలో... 
ఒక చిన్న పశువులపాకలో 
శిశువుగా జన్మించే... 
మనుష్యకుమారుడిగా అవతరించె... 
యోహానుచేత యోర్దానునదిలో 
బాప్తీస్మం పొంది... 
పరిశుద్ధాత్మచే అభిషేకింపబడె...
ఆపై నలుబది దినములు 
అడవిలో అపవాదిచే శోధింపబడె...

కొండలు గుట్టలు ఎక్కిదిగి 
ఊరూరా తిరిగి తిరిగి "ఒక వైద్యునిలా"
ఎన్నెన్నో మొండిరోగాలను నయం చేసి 
ఎన్నెన్నో అద్భుతకార్యాలను 
నమ్మలేని సూచకక్రియలను చేసి 
యూదులలో కొందరికి 
"ఆరాధ్య దైవమాయె"...
"అధికారులకు కంటిలో కారమాయె"...
"రోమా సైనికులకు ప్రక్కలో బల్లెమాయె"...

ఒక "బోధకునిలా"
చక్కని బోధనలు చేసి 
నేనే సత్యము... 
నేనే మార్గము... 
నేనే జీవము...
నేనే ఒక మంచి గొర్రెలకాపరిని...
నేనే సకలజనుల పాపములను 
మోసుకొని పోవు గొర్రె పిల్లనంటూ...
నా ద్వారా తప్ప 
ఎవరు తండ్రి వద్దకు రాలేరంటూ...
నా దగ్గరికి వచ్చిన వారికి 
ఆకలి...దప్పిక లుండవని...

"రక్షణ పొందుదురని"
"చనిపోయినా తిరిగి" 
"మృతులలోనుండి పైకి లేచెదరని" 
నిత్యజీవానికి వారసులగుదురని... 
అందరి "పాపాలు" తాను శిలువపై 
చిందించిన "పరిశుద్ధ రక్తముతో " 
శుద్ధి చేయబడునని...
ఒకడు ఒక దేవాలయాన్ని పడగొట్టి 
తిరిగి మూడుదినములలో కట్టురీతిగా
తాను మరణించి మూడవ దినమున 
తిరిగి లేచెదనని ముదుంగానే ప్రకటించే...
 
నిజానికి తాను నిర్దోషినని...
ఏ పాపం ఎరుగని పరిశుద్ధుడనని...
ఐనా పాషాణులైన మతపెద్దల చేత 
లేని పోని నీలాపనిందలు మోపబడి... 
పొంతిపిలాతు ఎదర విచారణచేయబడి 
తనలో ఏదోషము లేకపోయినా...
తాను నేరము చేయకపోయినా... 
కక్షతో సిలువ శిక్ష వేయబడి...

మోయలేని సిలువను 
భుజాన మోపబడి... 
వీధిలో ఒక బందిపోటులా 
ఈడ్చుకొనిపోబడి... 
తలపై ముళ్ళకిరీటం పెట్టబడి...
పిడిగుద్దులు గుద్దుతూ 
కొరడాలతో వీపును చీరుస్తూ...
"నీవు యూదుల రాజువా" అంటూ 
అవహేళన చేయబడి...
కలువరిగిరి పైకి చేర్చబడి... 

ఇద్దరు దొంగల నడుమ
అరచేతుల్లో అరికాళ్లల్లో 
మరమేకులు దిగగొట్టబడి... 
వధకు తీసుకుని వచ్చిన 
గొర్రెపిల్లలా శిలువపై వ్రేలాడదీసి...
"నిజంగా నీవు దేవుడివైతే క్రిందికి దిగిరా"... 
అంటూ అవమానపరచబడి... 
ప్రక్కలో బల్లెంతో పొడవపడి... 
క్రూరంగా ఘోరంగా హింసింపబడినా...

"తండ్రి వీరేమి చేయుచున్నారో 
వీరికి తెలియదని" ప్రేమగా పలికే... 
ఆపై అతికిరాతంగా చంపబడిన క్రీస్తు... 
తన ఆత్మను తండ్రికి కందించి... 
మరణించి సమాధి చేయబడి... 
మూడవ దినమున
మృత్యుంజయుడైన లేచి... 
పరలోకానికి ఆరోహణమైపోయి... 
తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండె...

తండ్రి కుమార 
పరిశుద్ధాత్మలో ఏకమైపోయిన 
ఆ "నిత్యసత్య సజీవవాక్యమే"..
అనంత శక్తి స్వరూపుడు... 
పరమపావనుడు...
పాపుల రక్షకుడు.. 
మృత్యుంజయుడు... 
కరుణామయుడు... 
ప్రేమామయుడు...
త్యాగధనుడైన... 
ప్రభువైన ఏసుక్రీస్తు... 
ఆయన జననం... 
సర్వలోకవాసులకు ఒక పర్వదినం... 

( క్రైస్తవ సోదర సోదరీమణులందరికి
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో.....)

3. క్రిస్మస్ శుభాకాంక్షలతో...
    యేసుక్రీస్తు శుభసందేశాలు..

బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథము
అది ప్రభువైన యేసుక్రీస్తు 
బోధనలతో నిండిన
ఒక బంగారు గని గుప్త నిధి 
అందులో నుండి వెలికి తీసిన 
కొన్ని "ఆణిముత్యాలు"...
కొన్ని "అమృతధారలు"...మీకోసం... 

కన్నవారిని పూజించవలె...
శతృవులను ద్వేషించరాదు...
నిన్నువలె నీ 
పొరుగువారిని ప్రేమించవలె...
రోగులకే వైద్యుడు అవసరం...

వెదుకుడి దొరుకును...
తట్టుడి తియ్యబడును..
అడుగుడి మీకియ్యబడును...
నమ్మువారి సమస్తము సాధ్యమే...
ఒకడు ఒక చెంపమీద 
కొడితే మరో చెంప తిప్పవలె...

రేపేమి జరుగునో మీకు తెలియదు
గనుక రేపటి గురించి చింతించవద్దు...
ముందు నీ 
కంటిలోని "దూలము" తీసుకో...
ఆపై నీ సహోదరుని కంటిలోని
"నలుసు" నీకు తేటగా కనిపిస్తుంది...

ధనవంతుడు పరలోక రాజ్యములో 
ప్రవేశించుట కంటే...
సూదిబెజ్జంలో ఒంటెదూరుట సులభం...
ఆత్మస్వరూపులకే...
పాపరహితులకే పరలోక రాజ్యప్రాప్తి.....

ఆ ప్రభువిచ్చిన 
ఈ శుభసందేశాలను
చెవులు గలవారు విందురుగాక !
ఆత్మశుద్ధి గలవారు ఆచరించెదరుగాక !
హృదయశుద్ది గలవారు గ్రహించెదరుగాక !

తెలిసి చేసిన తప్పులను
తెలియక చేసిన పాపాలను 
ఒప్పుకున్నవారు
మారుమనస్సును పొందినవారు
ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని  

ఆయన కలువరిగిరిపై 
తన పరిశుధ్ధరక్తాన్ని చిందించి 
శిలువవేయబడి మరణించి
సమాధి చేయబడి మృత్యుంజయుడై 
మూడవ దినాన లేచాడని... 
మృత్యువు ముల్లు విరిచాడని 
గాఢంగా నమ్మేవారు...
అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగివున్నవారు...

ఖచ్చితంగా పరలోకరాజ్యంలో ప్రవేశించెదరుగాక !
ప్రభువు కుడిపార్శ్వమున కూర్చుండెదరుగాక !
ఆకలిదప్పులు మృత్యుభయంలేని 
నిత్యజీవితాన్ని పొందెదరుగాక !

(క్రైస్తవ సోదరులందరికి 
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో)

4. క్రిస్మస్ పండుగ..!!! 
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)

రక్షకుడుదయించే రండో రండి...
అని దూత పిలవగానే పొదలోనుండి... 
చెంగు చెంగున దూకి చెంత కేగి...
పశువుల పాకలో ప్రభువును గాంచిన... 
...గొల్లలకే కాదు గొప్ప పండుగ..!

తార ఒకటి తూర్పున పొడిచి... 
దారిచూపగా ముందు నడిచి... 
అరుదెంచి అచ్చెరువొంది కానుకలతో
అభిషిక్తునికి అర్చన చేసిన జ్ఞానులు 
...ముగ్గురికే కాదు ఘనమైన పండుగ..! 

శరణంటే చేయి చాపి... 
రుగ్మతలను రూపుమాపి...
ముక్తిని ప్రసాదించునని మురిసిపోతూ ...
...భజనల్ చేసే భక్తులకేకాదు భలేపండుగ..!

ఆధ్యాత్మికంగా అంధులై...
చింతలకు చికాకులకు గురై... 
చిరుచీకటిలో చిందులు వేసే... 
...పాపులందరికీ ఇది పసందైన పండుగే...!

5. ఆకాశంలో ఆరనిజ్యోతి..!
(30 సం.రాల క్రితం వ్రాసిన కవిత)

కక్షలతో... 
కార్పణ్యాలతో... 
కుట్రలతో... 
కుతంత్రాలతో... 

దారిదోపిళ్ళతో...
దారుణ హత్యలతో... 
శిలాపహరణాలతో... 
చిత్రహింసలతో... 

కులతత్వాలతో... 
కుమ్ములాటలతో... 
మతవిద్వేషాలతో... 
మారణహోమాలతో... 
మారణాయుధాలతో 

భీకరమైన యుద్దాలతో... 
భయంకరమైన
బాంబుదాడులతో... 
రాజ్య కాంక్షతో...
రక్తపాతాలతో...

మానవత్వం
మంటకలిసిపోతూ...
మలినమైపోతున్న 
తరుణాన..."మానవజాతి"... 

పరిశుద్ధాత్మ ఫలితంగా... 
పాపుల రక్షణే ధ్యేయంగా... 
ప్రపంచ ప్రక్షాళనే 
ప్రధాన లక్ష్యంగా... 

మరియ గర్భాన... 
మనుష్య రూపాన... 
అరుణారుణ రక్షణ 
కిరణాలను వెదజల్లుతూ... 
ఆవిర్భవించింది..."ఒక ఆరనిజ్యోతి"

6. క్రిస్మస్ ట్రీ అంటే....

నాడు..
ఏదేను తోటలో 
దైవం ఏర్పరచిన "జ్ఞానవృక్షం"
అందించిన పళ్ళను ఆరగించిన
ఆదాము అవ్వలకు జ్ఞానోదయమాయె

నాడు...
మోషే ధర్మశాస్త్రమను
"పరిశుద్ధ గ్రంథ వృక్షం" అందించిన
పది ఆజ్ఞల ఫలాలను ఆరగించిన
జనులందరి జన్మలు ధన్యమైపోయె

నేడు... 
క్రిస్మస్ ట్రీ అంటే....
అది ఒక "వరాల వృక్షం"
ప్రేమ...దయ...జాలి...కరుణ... 
కృప...శాంతి...సమాధానాలె...
దాని శాఖలు...కొమ్మలు రెమ్మలు

క్రిస్మస్ పర్వదినాన
ప్రతి క్రైస్తవకుటుంబం
క్రిస్మస్ ట్రీ ని ఇంటింటా 
ఏర్పాటు చేసుకుంటారు
ఎంతో అందంగా...
ఎంతో ఆకర్షణీయంగా... 
విద్యుత్ దీపాలతో...
అలంకరించుకుంటారు

దైవమందిరంలో
అందరి కలిసి 
ప్రార్థనలు చేసుకుంటారు
విలువైన బహుమతులను 
ఇచ్చిపుచ్చుకుంటారు
క్రిస్మస్ మరియు రాబోయే 
నూతన సంవత్సర 
శుభాకాంక్షల్ని తెలుపుకుంటారు
ఆపై రుచికరమైన పదార్థాలు 
ప్రేమతో ఇరుగుపొరుగుకు పంచి 
తాము ఆరగిస్తారు...ఆనందిస్తారు

7. క్రీస్తు అంటే...?

ఒక ప్రవక్త
ఒక వైద్యుడు
ఒక బోధకుడు

ఒక అభిషిక్తుడు
ఒక పరిశుద్ధుడు
ఒక త్యాగధనుడు

ఒక ప్రేమామయుడు
ఒక పాపుల రక్షకుడు
ఒక కరుణామయుడు

ఒక "మృత్యుంజయుడు"
ఒక మంచి "గొర్రెల కాపరి"
ఒక "మనుష్యకుమారుడు"

ఒక "దైవాంశ సంభూతుడు"
ఒక "మహిమా స్వరూపుడు"
దావీదు మహారాజు "వంశాంకురం"

యేసేపు మరియమ్మల "గర్భఫలం"
పాపులను చేపలను పట్టు "జాలరి"
ఆ "దేవుని అద్వితీయ కుమారుడు"

క్రీస్తు అంటే ఒక "రక్షణ దుర్గం"...
క్రీస్తు అంటే ఒక‌ "శాంతి మార్గం"...
క్రీస్తు అంటే క్రమాగుణానికి "ప్రతిరూపం"
క్రీస్తు అంటే ఎన్నటికీ ఆరని‌ ఒక "ఆత్మ‌దీపం"

(క్రైస్తవ సోదర సోదరీమణులందరికి
క్రిస్మస్ శుభాకాంక్షలు) 

8. పరమపావనం...క్రిస్మస్ పర్వదినం

కనిపించని కాలం
విభజింపబడింది
చీకటి వెలుగులుగా...

మనిషి జీవితం
విభజింపబడింది
జనన మరణాలుగా...

ప్రపంచంలో ఉనికిలో ఉన్న
క్యాలండర్ విభజింపబడింది
క్రీస్తుకు పూర్వం...క్రీస్తు తర్వాతగా...

నిజానికి వృద్ధుడైన యేసేపుకు
కన్య మరియకు పశువులపాకలో 
పరిశుద్ధాత్మచే మనుష్యకుమారుడుగా
క్రీస్తు జననం...ఒక వింత ఒక విచిత్రం...

రోమా సామ్రాజ్యాధినేతల
అకృత్యాలను ప్రశ్నించి తన బోధనలతో
అమాయకపు ప్రజల్ని మేల్కొల్పినందుకు
ఏ పాపమెరుని పరమపావనుడిపై
ఏ నేరం చేయని నిర్దోషిపై నిందలు మోపి
తలపై ముళ్ళ కిరీటం పెట్టి...
కొరడాలతో దారుణంగా కొట్టి...
అరచేతుల్లో మరమేకులతో బహిరంగంగా...
శిలువ శిక్ష వేసి చిత్రహింసలకు గురిచేసిన
క్రీస్తు మరణం...ఒక వింత ఒక విచిత్రం...

నిజానికి యేసుక్రీస్తు ఈ నేలపై
నడయాడిన కాలం అత్యంతస్వల్పం...
కానీ అది ఒక చారిత్రాత్మకం...కారణం
2000 సంవత్సరాల క్రితం
1400 సంవత్సరాలుగా
40 మంది ప్రవక్తలచే...ఏర్చి...కూర్చి...
ఎంతో శ్రమకోర్చి...లిఖించబడిన
అద్భుతమైన...అపురూపమైన
పవిత్రమైన బృహత్ గ్రంథం బైబిల్ "
"మతంలో మచ్చలుండవచ్చు"
కానీ "బైబిల్" మాత్రం స్వచ్ఛమైనది
ఆ బైబిల్ లోని క్రీస్తుబోధనలలోని
ప్రతిఅక్షరం ఒక "ఆణిముత్యమే"...
ప్రతివాక్యం ఒక "అమృతబింధువే"...
నేటికీ మతాలకతీతంగా సదా పఠనీయమే
శిరోధార్యమే...చిరస్మరణీయమే...

బైబిల్ లోని ప్రభువు బోధనలు
మనుషుల జీవితాల్నిమార్చే మంత్రాలు...
చేసిన పాపాలను కడిగి వేసి...
శాపాల నుండి విముక్తి కలిగించే..‌
పాపాంధకారాన్ని పారద్రోలే...
ఆరని దారి దీపాలు...ఆత్మీయ రూపాలు...
సుఖజీవనానికి పునాదులు...అందుకే
క్రీస్తుయేసు జననం క్రైస్తవులకు పర్వదినం

పాపుల కోసమే
ప్రాణాలర్పించిన ఆ యేసుక్రీస్తు
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు 
పరమపావనుడు ...పాపుల రక్షకుడు
అభిషక్తుడు...అద్వితీయ కుమారుడు
మహిమాస్వరూపుడు...నరరూపదారుడు
చిత్రహింసలకు గురియై శిలువ శిక్షకు బలియై
మరణించిన మహనీయుడు...
మూడవదినాన లేచిన మృత్యుంజయుడు
అందుకే క్రీస్తు స్మరణ ప్రతివ్యక్తికి ఒక ప్రేరణ 
సుఖజీవనానికి ఒక సోపానం క్రీస్తు జననం

9. ప్రేమించే ప్రేమామయుడు..! 

ప్రేమించే 
ప్రేమామయుడు... 
కలువరి గిరిపై రక్తం 
చిందించిన లోకరక్షకుడు...
మన ఘోరమైన పాపాలను 
తన పరిశుద్ధ రక్తంతో కడిగి 
మనలను పాపవిముక్తులను
చేసిన ఆ విమోచన కర్త...
మేఘారూఢుడై వచ్చువేళ
ప్రతినేత్రము ఆయనను చూచును

అల్ఫాయు 
ఓమెగయు ఆయనే...
భూత భవిష్యత్ 
వర్తమాన కాలాలలో ఉండేది 
సర్వాధికారియైన ఆ ప్రభువే...
మహా తేజస్సుతో 
ప్రకాశించేది ఆ నీతిసూర్యుడే...

మరణము మరియు 
పాతాళలోకపు తాళపు చెవులు 
ఆయన స్వాధీనములోనే ఉన్నవి...

మొదటివాడు కడపటి వాడు 
నిత్యం జీవించువాడు ఆయనే... 

మృతుడైననేమి 
మూడవ దినమున 
మృత్యుంజయుడై లేచి
యుగయుగములు 
సజీవుడైయున్నాడు 

మృతులలోనుండి ఆది 
సంభూతుడుగా లేచినవాడు
భూపతులకు అధిపతియైన ప్రభువైన 
యేసుక్రీస్తు నుండి కృపా కరుణ కనికరం 
శాంతిసమాధానముల్ మీకు కలుగునుగాక.



రచన:
"కవిరత్న"
"సహస్రకవి" 
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments