అమర గాయకుడు... గాన గంధర్వుడు "సాయి చందుకు"...అశృనయనాలతో అక్షరనీరాజనం...29.06.2023...వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన "కన్నీటికవితలు"...చిత్రమాలిక...మరికొన్ని కవితలు...మీకోసం...పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

























 





























































1. అస్తమించిన అమర 

   గాయకుడు సాయిచందు ...

నాడు తెలంగాణ సాధనలో 
అమరుడైన శ్రీకాంత్ ఆచారి 
"సంస్మరణ సభలో "...
"రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
రక్తసంబంధం విలువ నీకు తెలియదురా
నుదుటి వ్రాతలు వ్రాసే ఓ దేవదేవా..! 
అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా...
తెలిసుంటే...చెట్టంత మా బిడ్డలా
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలూ"...
ఈశ్వరా...ఆఆఆఆఆఆఆఆఆఆ...అంటూ

గంభీరమైన కంఠంతో గుక్కతిప్పుకోకుండా 
అందరి గుండెల్ని పిండేసేలా...
అందరి కళ్ళలో పాతాళగంగఉప్పొంగేలా...
సుదీర్ఘంగా రాగం తీసి ఆలపించిన 
ఆగీతం విన్న శ్రీకాంత్ ఆచారితల్లి కన్నీటి 
పర్యంతమై విలవిలలాడిపోయిందే...
సీఎం కేసీఆర్ సైతం కంటతడి పెట్టారే...
ఓ మా బంగారు బిడ్డ ! 
ఓ సాయి చందు! ఎవరయ్యా..! ఎవరయ్యా..! 
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!

కేసీఆర్ ప్రతిసభ 
నీపాటతోనే ప్రారంభమే...
నీవు వేదికనెక్కి దిక్కులు పిక్కటిల్లేల 
ధూం...ధాం...గా పాటలు పాడుతుంటే 
యువకులంతా 
ఉత్తేజితులయ్యారే...
ఉర్రూతలూగిపోయారే...
ఉద్యమానికి ఊపిరిలూదారే...
ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయే...
ఓ మా బంగారు బిడ్డ ! ఓ సాయి చందు!
ఎవరయ్యా..! ఎవరయ్యా..! 
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!

పాటకు ప్రాణంగా...
ఉద్యమాలకు ఊపిరిగా...
ఓ విప్లవ వీరుడిగా ...
ఓ ఉద్యమ సూర్యుడిగా...
ఓ బహుజన బాటసారిగా...
ఓ అరుణోదయ కిరణంగా...
ఓ ప్రగతిశీల ప్రభంజనంగా...
అణగారిని ప్రజల ఆశాజ్యోతిగా...
అంబేద్కర్ ఆశయాల దివిటీగా... 
ఒక కవిగా...ఒక కళాకారుడిగా...
ఒక గాయకుడిగా...ఒక నాయకుడిగా...

ఎదుగుతున్న తరుణంలో 
ఎవరి కన్ను కుట్టిందో ఏమో
అనకొండలా...మృత్యువు...చుట్టేసింది 
39 ఏళ్ళకే మృత్యుకుహరంలోకి నెట్టేసింది

నీ ఆటపాటలతో 
నీ మధుర కంఠంతో 
మమ్మల్ని మంత్రముగ్ధుల్ని 
చేసిన ఓ గాన గంధర్వా...!
కులదురహంకారులపై 
అక్షరమే ఆయుధంగా పోరాడిన 
ఓ విప్లవ వీరుడా...ఓ శూరుడా ! 
ఓ మా బంగారు బిడ్డ ! ఓ సాయి చందు!
ఎవరయ్యా..! ఎవరయ్యా..! 
నీవులేని ఆ లోటును తీర్చేదెవరయ్యా..!
(అమర గాయకుడు సాయిచంద్
ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ...)

2. మరువలేని...మరణం లేని 
మహా గాయకుడు మన సాయిచందు..! 

ఓ ప్రతిశీల ప్రభంజనమా..!
ఓ అరుణోదయ కిరణమా..!
ఓ పాలమూరు పాటగాడా..! 
ఓ బహుజన బాటసారి..!
నీ కన్నీటి పాటతో చూపావే
ఎందరికో బంగారు బ్రతుకు దారి..!

ఓమా బంగారుబిడ్డా ! ఓ సాయిచందు..!
అణగారిన బడుగు బలహీన వర్గాల 
గొంతుకవై ఎందరికో అండగా నిలిచావే..!

సింగరేణి కార్మికుల కన్నీటి గాథలను 
పాలమూరు ప్రజల వలస జీవితాలను 
కమ్మని పాటల రూపంలో కళ్లకు కట్టిన 
నీ కంఠస్వరం నేడు...మూగబోయిందే...

నీ పాట ఒక తూటై...
నీ ఆట ఒక పూలబాటై...
నీ మాట ఒక తేనెలఊటై...
నీ ప్రతి పాట మా గుండెల్లో... 
నిత్యం మారుమ్రోగుతూనే ఉంటుంది
నిత్యం నీ పేరు వినిపిస్తూనే ఉంటుంది
నిత్యం నీ రూపం కనిపిస్తూనే ఉంటుంది
ఓ మా బంగరు బిడ్డా..! సాయిచందు..! 
లేదయ్యా లేదు..! నీకు మరణం లేదు..!

ఆ సూర్య చంద్రులు
ఆ నక్షత్రాలున్నంతకాలం..! 
నీవు భౌతికంగా దూరమైనా 
నీ పాటలే నీకు ప్రాణం పోస్తాయి... 
ఓ సాయిచందు నీవు బ్రతికే ఉంటావు..!
నీవు తెలంగాణ ప్రజల గుండెల్లో...
ఆరనిజ్యోతిలా వెలుగుతూనే ఉంటావు..! 
నీ అకాలమరణవార్త...
మన తెలంగాణాతల్లికి ఓ గుండెకోతే..! 

ఓ బిడ్డా ! నీ ఆత్మకు శాంతి కలుగును గాక !
జోహార్ జోహార్..! సాయీ చందు జోహార్..!
అమర్ రహే..!అమర్ రహే ..! 
సాయీ చందు అమర్ రహే..! 

3. పాటే ప్రాణంగా..!ఉద్యమమే ఊపిరిగా..!

అయ్యో ఓ దైవమా..!  
అమర గాయకుడు 
తెలంగాణ ఉద్యమానికి ఉపిరైన
సాయిచందు హఠాన్మరణమా..!
తన మధురగాత్రంతో ఎన్ని హృదయాలనో 
దోచిన ఆగుండెఅర్ధాంతరంగా ఆగిపోయిందే

తన పాటను విను ప్రతివారిని 
కదిలించే...కరిగించే మదిని మురిపించే...
ఆ మధుర స్వరం మాయమై పోయిందే... 

యువతలో స్ఫూర్తి జ్వాలలు రేపుతూ
బహుజనులకి కొండంత అండగా నిలిచిన 
ఆ కమ్మని కంచుకంఠం మూగబోయిందే...
ఇంత దయలేనివాడా...ఆ దైవము...?

రాజకీయాలలో రాణిస్తున్న
ఎవరెస్టు శిఖరంలా ఎదుగుతున్న 
మన సాయి చందును ఎత్తుకెళ్లిందే...
ఇంత క్రూరమైనదా...ఆ మృత్యువు..?

ముద్దుబిడ్డల్నిద్దర్ని అనాధలను చేసి... 
ముచ్చటైన పచ్చనికాపురాన చిచ్చురేపి 
నిత్యం చిరునవ్వులు చిందించే...
చిలుకా గోరింకలైన అమర ప్రేమికులైన 
ఆ సాయి రజనీని విడదీసి 
విషపునవ్వు నవ్విందే ! 
ఆవిధి ఎంతటి కసాయిదో కదా..!

ఓ దైవమా..! 
ఈ జీవితం ఇంత క్షణికమా..!
నిముషంలో పుట్టి నిముషంలో 
మాయమయ్యే నీటిబుడగేనా !
ఆ వింతవిధి చాటుమాటుగా 
కాటువేసే పాము పడగేనా!
ఒక క్షణం చిరునవ్వులా..! 
మరుక్షణం చితిమంటలా..!
ఎంతగా శోధించినా అర్థం కాకున్నదే...!
ఈ ప్రకృతి ధర్మం..! నీ సృష్టి మర్మం..!

4. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
    రక్తసంబంధం విలువ నీకు తెలియదురా

సినీగేయ రచయిత 
శ్రీ మిట్టపల్లి సురేందర్ వ్రాసిన 
అమరవీరులను కన్నతల్లుల
"పురిటి నొప్పుల పాటను" 
కూసింత మార్పులు చేసి...

"రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..!
రక్తసంబంధం విలువ నీకు తెలియదురా..!
నుదుటి వ్రాతలు వ్రాసే ఓ బ్రహ్మ దేవా..! 
అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా...
తెలిసుంటే...చెట్టంత మా బిడ్డలా
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలూ"...
ఈశ్వరా...శంకరా...అంటూ సాయిచందు 
సుదీర్ఘంగా గుక్కతిప్పుకోకుండా రాగంతీసి
పాటలో లీనమైపోయి పాడుతూవుంటే...
ఒళ్ళు పులకరిస్తుంది..!
గుండె బరువెక్కుతుంది..!
కళ్ళవెంట కన్నీటి వర్షమే..!
 
ప్రత్యేక తెలంగాణా సాధనకై...
కిరోసిన్ మంటల్లో చిక్కుకుపోయి... 
కళ్ళముందే కాలిపోయి అమరవీరుడైన 
కన్నకొడుకు శ్రీకాంత్ ఆచారి గుర్తొచ్చి 
ఆ కన్నతల్లి తల్లడిల్లి పోతుంటే...
విలవిలలాడిపోతుంటే...
విలపిస్తూవుంటే...
కుర్చీలో కూర్చొని 
కుమిలి కుమిలి ఏడుస్తూవుంటే... 

కన్న...ఎవరి కంటనైనా 
కన్నీటి వరదలే...
విన్న...ఎవరి గుండెలైనా 
పొంగిపొరలే చెరువులే...
సియం కేసీఆర్ నే కంటతడి 
పెట్టించిన తెలంగాణా సాధనకు 
ఊపిరైన ఈ పాటను ఎన్నిసార్లు 
విన్నా తనివి తీరదు...కన్నీరు ఆగదు... 

5. సాహస వీరుడా ! ఓ సాయిచందు..!

ఓ సాహస వీరుడా ! 
ఓ సాయిచందు..!
జలజల దూకే ఓ జలపాతమా..!
చీకటిలో వెలిగే ఓ చిరుదీపమా..!
గలగల పారే ఓ గంగా ప్రవాహమా..!
భగ భగ మండే ఓ అగ్నిపర్వతమా..! 
అణగారిన ప్రజల ఓ ఆశాకిరణమా..!
 
ఓ విప్లవ వీరుడా..! 
ఓ ఉద్యమ సూర్యుడా..! 
నీ "అకాలమరణవార్త " 
కోట్లాదిమంది అభిమానుల 
గుండెల్లో పేలిన"అణుబాంబు"..! 

ఓ గాన గంధర్వా..!
ఓ అమర గాయకుడా..! 
నీ పాటతో చైతన్యం పుట్టాలని... 
నీవు చట్టసభల్లో అడుగు పెట్టాలని...
కమ్మని కలలు కంటూ కన్నుమూశావా..?

ఓ సాయిచందు..!
ఓ సాహస వీరుడా ! 
పుట్టాలయ్యా..! పుట్టాలి..! 
నీవు మళ్ళీ మళ్ళీ పుట్టాలి..!

ఎగిరే తారాజువ్వవై..!
రగిలే నిప్పురవ్వవై...!
రణభేరి మ్రోగిస్తూ రణసూర్యుడవై..!
రావాలయ్యా..! రావాలి..!
దివినుండి భువికి నీవు దిగి రావాలి..!
కావాలయ్యా..! కావాలి..!
"నిప్పులు చెరిగే నీ పాట" మాకు కావాలి..!

6. నిప్పులు చెరిగే నీ పాట మాకు కావాలి 

బాబా అంబేద్కరా..!
భారత్ కే భాస్కరా..!
మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో..!
మీరే రాకుంటే మా బ్రతుకులెట్లుఉండెనో..! 
మీరే ఆ రాజ్యాంగం రాయకుంటే..!
ఈ భరత భూమిలో మేము 
బుగ్గైపోతుంటిమో‌..!
మసిబొగ్గై పోతుంటిమో..!

బాబా అంబేద్కరా..! 
బడుగులకే భాస్కరా..! 
మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో 
అంటూ...ఏదో భూకంపం పుట్టినట్లు... 
ఎక్కిన ప్రతి సభావేదిక 
దద్దరిల్లేటట్లు...గొంతెత్తి 
కంచుకంఠంతో మీరు పాడుతువుంటే...
ఎదురుగా మొద్దు నిద్రలో ఉన్న 
అణచబడిన...అణగారిన
అమాయకపు జనంలో చైతన్య 
జ్వాలల్ని మీరు రగిలిస్తుంటే...

బోధించు...సమీకరించు...పోరాడు... 
సింహాలనెవ్వరూ బలివ్వరు...
మేకలను తప్ప...
పోరాడితే పోయేదేముంది..?
మీ బానిసత్వపు సంకెళ్ళు తప్ప... 
రాజ్యాధికారం కోసమై మీరంతా 
రక్తతర్పణకైనా సిద్దం కావాలి...అన్న 

అంబేద్కర్ ఆశయాలకు జీవంపోసి..
అంబేద్కర్ సిద్ధాంతాలను 
బడుగు బలహీన వర్గాలకు 
పాటల రూపంలో వినిపిస్తూ... 
కోట్లాదిమందిని చైతన్యవంతుల్ని చేస్తూ... 
ఎవరెస్టు శిఖరమంత 
ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే
ఓ సాయిచందు...ఓ సాహస వీరుడా ! 
నీ "అకాలమరణవార్త " 
కోట్లాది మంది వీరాభిమానుల 
గుండెల్లో పేలిన ఒక "అణుబాంబు"..! 

ఓ గాన గంధర్వా !
ఓ అమర గాయకుడా ! 
చీకటిలో వెలిగే ఓ చిరుదీపమా..!
జలజల దూకే ఓ జలపాతమా..!
గలగల పారే ఓ గంగా ప్రవాహమా..!
భగభగ మండే ఓ అగ్నిపర్వతమా..! 
అణగారిన ప్రజల ఓ ఆశాకిరణమా..!

ఓ విప్లవ వీరుడా ! 
ఓ ఉద్యమ సూర్యుడా !
నీవు మళ్ళీ మళ్ళీ పుట్టాలి...
నీవు దివినుండి భువికి దిగి రావాలి... 
"నిప్పులు చెరిగే నీ పాట" మాకు కావాలి.

7. కంచు కంఠం మూగబోయింది
   మంచు పర్వతం కరిగిపోయింది 

ఎవ్వడు చెప్పిండురా..!
మీరెక్కువజాతోళ్ళని..?
ఏడా రాసుందిరా..!
మేం తక్కువ జాతోళ్ళని..?

నిన్ను నన్ను కన్నతల్లి
భరతమాత ఒక్కటే..!
నీవు నేను బ్రతుకుతున్న
భరత భూమి ఒక్కటే..!

నీకు నాకు నడుమ
ఈకులం అఢ్డుగోడ ఏందిరా..?
ఈ కులం కుళ్ళును 
సృష్టించింది ఎవ్వడురా..?
ఎవడు...ఎవడు...?
ఎవ్వడు వాడెవ్వడురా..?

అంటూ సాయిచందు
కులనిర్మూలనకు...కృషి చేస్తూ...
తరతరాలుగా ఆరని అంటరానితనాన్ని...
మంట కలిపేందుకు...కంకణబద్దుడై...

గొంతెత్తి వేదికలమీద 
అభ్యుదయ గీతాలనాలపిస్తూ...  
కుర్రకారును ఉర్రూతలూగిస్తూ...
బహుజనులను ఉత్తేజపరుస్తూ...

అసెంబ్లీలో అడుగు పెట్టాలని...
అణగారిన బడుగు బలహీన 
మైనారిటీ వర్గాలకూ అండగా 
నిలవాలని కమ్మని కలలెన్నోకంటూ...

అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా...
రాజకీయాలలో రాణిస్తున్న తరుణంలో
క్రూరమైన విధి ఓ విషపు నవ్వు నవ్వింది
సాయిని 39ఏళ్ళకే మృత్యువు ముద్దాడింది

ఔరా విధి ఎంతటి బలీయమైందో కదా...
మనిషొకటి తలంచిన దైవం మరొకటి 
తలంచునే సృష్టి స్థితి లయలు దైవాధీనాలే

కానీ ఎందుకంత తొందరో ఏమో...
ఓ చైతన్య శిఖరం కుప్పకూలిపోయింది
ఓ చల్లని మాటలమంచు కరిగిపోయింది
ఓ పాటల పర్వతం క్షణాల్లో ఒరిగిపోయింది
సాయిచందు"కంచు కంఠం"మూగబోయింది 

8. చెట్టంత...సాయి చందు..!  

అయ్యో..! కళ్ళముందే
కట్టుకున్న భార్య చేతిలో ...
చెట్టంత...సాయి చందు...
మట్టిముద్దగా మారిపోయెనే...
ఆ విధి ఎంతటి కసాయిదో కదా..!

అయ్యో! మా "పాలమూరు 
"పాలపిట్ట" పారిపోయెనే..!
ఎక్కడికో ఎగిరి పోయెనో..!
ఆ "కోయిలకంఠం" మూగబోయెనే..!

కేసిఆర్...కేటీఆర్...హరీష్ రావ్ లకు
బిఆరెస్ పార్టీకి సాయిపాట పల్లకి మోత...
సాయి మరణవార్త ఎందరో అభిమానుల
తోటి కళాకారుల గుండెల్లో రంపపు కోత...

రేయింబవళ్ళు ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
తెలంగాణా పల్లెపల్లెను సుడిగాలై చుట్టి  
వేల వేదికలపై ఉద్యమ పాటలు పాడి
కుర్రకారును ఉర్రూతలూగించి...
కోట్లాదిమంది తెలంగాణ ప్రజల్ని 
జాగృతం చేసిన చైతన్య శిఖరం...
అందరి గుండెల్లో ప్రజ్వరిల్లుతున్న...
ఆరని జ్యోతి...మా సాయిచందు...

ఎక్కిన ప్రతివేదిక దద్దరిల్లేలా...
కంచుకంఠంతో చైతన్య గీతాలు 
ఆలపించి...శ్రోతలను అలరించి... 
కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి...
పార్టీనాయకుల మదినిదోచిన గాయకుడు
సాయి మరణం పార్టీకి పూడ్చలేని అగాధం
కుటుంబానికి ఎన్నటికీ మాయని ఓ గాయం 

సాయి చందు పాల్గొన్న ప్రతిసభను 
తన కంచుకంఠంతో విజయవంతం చేసి 
తనకు...పార్టీ...పాటే...ప్రాణంగా...
ఉద్యమం...ఉద్యోగం...
అంబేద్కర్ ఆశయాలే..ఊపిరిగా...
అంకితభావంతో...అకుంఠితదీక్షతో...
పార్టీకి వెన్నెముకగా...
ఒక మూలస్తంభంగా...
ఒక పునాది రాయిగా...
ఒక సైనికుడిగా...
ఒక గాయకుడిగా...
ఒక ప్రజానాయకుడిగా...

ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు 
ఎదిగే వేళ మాయమైపోయిన  
"చెట్టంత మా సాయి చందును"
రాతిబొమ్మల్లో కొలువైన శివుడా...
నుదుటి వ్రాతలు వ్రాసే ఓ బ్రహ్మదేవా..! 
తెచ్చివ్వగలవా...మీ మహిమలూ..?
తెచ్చివ్వగలవా...మీ మహిమలూ..?

అంటూ గుండెలుపగిలేలా రోదిస్తున్నారు...
భవిష్యత్తు అంధకారమైన భార్యాబిడ్డలు...
మొన్న కరెంట్ షాక్ తో...కట్టుకున్న భార్య
నిన్న పెద్దకొడుకు నేడు చిన్నకొడుకు సాయి 
దూరమై కన్నీరుమున్నీరౌతున్న కన్నతండ్రి... 
విధి విషనాగై కుటుంబాన్ని కాటేసినందుకు..



దారితప్పిన పిలగాడు..!
తనది కాని పాట పాడిన సాయిచంద్..!!
ఎస్.ఎ. డేవిడ్
సెల్ : 8309844923

పాడే గొంతు మూగబోయింది
అలసిన గుండె ఆగిపోయింది.
ఇక నావల్ల కాదు అంటూ ఆ గుండె
మారాం చేస్తూ ముందస్తు హెచ్చరిక 
చేసినా లెక్కచేయని తనం నాలుగు 
పదుల వయసు నిండకముందే అతన్ని 
శాశ్వతంగా నిష్క్రమించేలా చేసింది.
తమ్ముడు సాయి చంద్ మరణించాడు.

సాయి మా ఊరి పిలగాడు. 
కళ్ళముందే తిరుగాడిన వాడు. న్యూడెమోక్రసీ నాయకుడైన తన తండ్రి వెంకట్రాములు కైగట్టి 
పాట పాడుతుంటే అనుకరిస్తూ వంతపాడేది. 
గొంతు కలిపేది..గజ్జకట్టి ఆడి పాడేది. 
ఆ వారసత్వమే, ఆ కొనసాగింపే తండ్రిని 
మించిన గాయకుణ్ణి చేసింది. 
చరిత్ర తనకంటూ ఓ స్థానాన్ని కల్పించింది. అయితే 
ఈ మొత్తం జర్నీలో సాయి గురితప్పిన పిలగాడు. 
అతడో గమ్యంలేని బాటసారి. "నీకంటూ ఒక లక్ష్యం లేకపోతే వేరేవాళ్ళ లక్ష్యం కోసం నువ్వు వాడబడతావు" అని ఛత్రపతి శివాజీ అన్నట్లు, అతను తనది కానీ ఆట ఆడాడు, తనది కానీ పాట పాడాడు,తనది కానీ జీవితం జీవించాడు. అదే అతన్ని మృత్యువు ఒడిలో చేర్చింది.

మా ఇంట్లో సాయిచంద్ దగ్గరి బంధువులు (లక్ష్మీ అక్క 
అని పిలిచేవాన్ని) కిరాయికి ఉండేది. మాఇంటి మనిషిలా కలిసిపోయేది..ఏ ఆపద వచ్చిన ఒకరికి ఒకరు 
అన్నట్లుగా మా ఇంట్లో వాళ్ళతో తోడుగా ఉండేది. 2001 అనుకుంటాను ఏదో పని ఉండి మా ఊరు అమరచింత వెళ్ళాను. ఇంట్లో ఏదో పనిలో ఉంటే ఉన్నట్లుండి లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో నుండి ఏడుపు వినిపించింది, "ఇలా మీ వెంకట్రాములు భార్యకు మణెమ్మ కరెంట్ షాక్ కొట్టిందట చనిపోయిందంటున్నారు" అని ఎవరో చెప్పినట్లున్నారు ఆమె ఏడుస్తూ పరిగెడుతుంది. వాళ్ళతోపాటు మేము వెళ్ళాం. వెళ్లి చూస్తే సాయిచంద్ వాళ్ళ అమ్మ నిర్జీవంగా పడివుంది. వాళ్ళమ్మ ఉతికిన బట్టలు తీగమీద అరేస్తుంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. పక్కన సాయిచంద్ తల్లిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు.15, 16 ఏళ్ళు ఉండొచ్చు తనకప్పుడు. బహుశా కళ్ళముందే తల్లి చనిపోవడం 
చూసి ఉండొచ్చు ఎవరు ఓదార్చిన కన్నీటి పర్యంతం అవుతున్నాడు. బహుశా అదే మొదటి సారి అనుకుంటాను సాయికి సంబంధించిన జ్ఞాపకం బాగా గుర్తుండి పోయింది.

సరిగ్గా రెండేళ్ల తర్వాత 2003లో హైదరాబాద్ లో 
ప్రత్యక్ష మయ్యాడు...నిజాం కళాశాల గ్రౌండ్లో వామపక్షాలు, ఆస్తిత్వవాదులు, ఎన్జీవోల ఆధ్వర్యంలో 'ఏషియన్ సోషల్ ఫోరం' సదస్సు జరుగుతుంది. ఆ సమయంలో 
SFI విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాను కాబట్టి నిర్వహణలో ఒక భాగంగా ఉన్నాను..విద్యార్థి సంఘానికి అక్కడ వాలంటీర్ వర్క్ అప్పగించారు ఆ పనిలో ఉన్నాను. అక్కడ కలిసాడు సాయి. చేతిలో ఏవో కరపత్రాలు 
పట్టుకొని ఉన్నాడు. కలిసి వెళ్లిన పది నిమిషాల్లో 
ఆ సదస్సు ప్రాంగణంలోనే ఏదో గొడవ జరుగుతుందని తెలిస్తే అక్కడికి పరిగెత్తుకొని వెళ్లితే కొద్దిమంది ఒక అబ్బాయిని కొడుతున్నారు. వెళ్లి చూస్తే 
అది సాయి చంద్..! కొడుతున్న వాళ్లలో నాకు తెలిసిన SFI, DYFI, CPM పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు.వెళ్లి 
అపాను నాకు తెలిసిన వాడు.మా ఊరు వాడు ఆగండి నేను మాట్లాడతా అని సర్దిచెప్పాను. కారణం ఏంటని ఆరాతీస్తే 'ఏషియన్ సోషల్ ఫోరం సదస్సు' బహుళజాతి కంపెనీల కనుసన్నల్లో జరుగుతున్న సదస్సు దీన్ని బహిష్కరించండి' అని న్యూ డేమోక్రసి 
పార్టీ ముద్రించిన కరపత్రాలను ఆ వేదిక దగ్గర పంచుతున్నాడు. ఇది జీర్ణించుకోలేక సాయిచంద్ మీద దాడికి పాల్పడ్డారు. అంతలో పొలీసులు రావడం, 
ఆ సదస్సుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్న వాళ్ళను అక్కడిని తరిమేయడంతో 
ఆ గొడవ అలా సద్దుమణిగింది.

ఆ తర్వాత అప్పుడప్పుడు యూనివర్సిటీకి వచ్చి కలిసి వెళ్ళేవాడు.విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణలో 
మీటింగ్స్ లో కలిసేవాడు.. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో తదితరులతో కలిసి పాటలు పాడటం, Padma Vangapally అక్కవాళ్ళతో కలిసి బుర్రకథలు వేస్తూ కనిపించేవాడు. కొన్నాళ్ళు ఏమైందో తెలియదు కనిపించలేదు తెలంగాణా ఉద్యమం ఓయూ కేంద్రంగా జరుగుతున్నప్పుడు మళ్లీ ప్రత్యక్షయ్యాడు. అయితే 
ఈ సారి తను పనిచేసిన పీడీఎస్యూ (PDSU)కు, 
అరుణోదయ సంఘానికి క్రమంగా దూరమైనట్లు అర్థమైంది. టీఆర్ఎస్ కు, ముఖ్యంగా హరీష్ రావుకు దగ్గరైనట్లు అర్థమైంది. అప్పుడప్పుడు వేదికల మీద కేసీఆర్, హరిష్ రావుల కాళ్ళు మొక్కడం మనసు చివుక్కుమనేది. 
ఇదే క్రమంలో రజినీ రెడ్డి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది అని తెలిసింది.

తెలంగాణ లాంటి భావోద్వేగ పూరిత 
ఉద్యమాలు మనిషిని ఆలోచించనివ్వవు. 
నిలకడగా ఒక దగ్గర కూర్చొనివ్వవు. 
ఎక్కడ ఆగిపోతే వెనకబడిపోతామో 
అనే భయం ప్రతి ఒక్కరినీ పరుగుపెట్టిస్తుంది. 
ఆ పరుగు పందెంలో అందరూ పరిగెత్తారు.. అందరితో పాటూ సాయిచంద్ పరుగుపెట్టాడు. అయితే ఏ మనిషైనా కాసింత సేపైనా ఆగి ఆలోచించాల్సింది ఇక్కడే. ఆ క్షణం మన ఆలోచన పనిచేయకపోతే ఇక మన పరుగు దారి తప్పినట్లే. ఇక్కడే అందరి మేధావుల్లాగే సాయి దారి తప్పాడు. 

ఇటాలియన్ మార్క్సిస్టు గ్రాంస్కీ అంటాడు "వాస్తవానికి ప్రజలందరూ మేధావులే కానీ అందులో అధ్యాపకులు, గాయకులు, చిత్రకారులు, కళాకారులు పేరెన్నిక గన్న మేధావులు" అంటాడు. ఆ మేధావుల్లో ఆలోచించేగుణం సన్నగిల్లితే, వర్గస్పృహ కోల్పోతే ఇక పీడితులకు 
న్యాయం జరగనట్లే అని. ఇవాళ తెలంగాణలో జరిగింది అదే. సాయిచంద్ తను పుట్టి పెరిగిన సామాజిక 
నేపధ్యాన్ని మరిచిపోయాడు. వర్గస్పృహను మరచిపోయాడు. తనకు తెలియని ఓ ఆటలో 
పావుగా మారాడు.

దేశమంతా స్వాతంత్రోద్యమంలో ఊరేగుతున్నా 
డా.బీ.ఆర్. అంబేద్కర్ నావర్గాలకు న్యాయం జరగని స్వతంత్ర్యం నాకెందుకూ అంటూ దూరంగా ఉండిపోయారు.దళిత (మాల) సామాజిక వర్గం నుండి వచ్చిన సాయి చంద్ కు అంబేద్కర్ రాజకీయం అర్థమైనా తను ఎవరికోసం ఆడిపాడాలో అర్థమయ్యేది. 
పోనీ వర్గ స్పృహ తనలో మిగిలి వున్నా 
ఏ వర్గాలకోసం గొంతెత్తి పాడాలో అర్థమై ఉండేది. 
ఈ రెండింటికీ దూరమైన అతను ఇంకెవరో మేడలకోసం గోడలు కట్టాడు..తన శ్రమను దారపోసాడు. గొంతును అరువిచ్చాడు. ఈ మొత్తం జర్నీలో అతను కాసిన్ని డబ్బులు వెనకేసుకోవచ్చేమో. కాసింత పేరు పరపతి, దానితో పాటు హోదాలు వచ్చి చేరవచ్చేమో కానీ 
అతనో తప్పిపోయిన కొడుకు. తనది కానీ ఆటలో 
ఆడుతూ అర్దాంతరంగా తనువు చాలించాడు!!

పార్లమెంటరీ రాజకీయాల్లో గాయకులకు జరిగే లాభ నష్టాలు ఏంటో తెలుసా..సరిగ్గా ఉపయోగించుకుంటే 
మంచి పేరు వస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో కీలక స్థానాల్లోకి చేరుకోవడం మాత్రం ఉండదు.. రాజకీయ నాయకులని పదవుల్లోకి తెచ్చేందుకు ఎక్కడికంటే అక్కడికి తిరగాలి, నాయకులని పొగుడుతూ ఆడిపాడాలి తప్ప తనకంటూ ఓ నిలకడైన స్థానం (ప్రాతినిధ్య నియోజకవర్గం) ఉండదు (ఆ మధ్య అలంపూర్ ఎస్సీ రిజర్వ్ స్థానాన్ని అతనికి ఇస్తారు అని చెబితే..అక్కడి వెళితే సొంత పార్టీ వాళ్లే కొట్టినంత పనిచేశారు). కేసీఆర్ లాంటి వాడైతే అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే మరీ 
మీటింగుల్లో పాటలు పాడేది ఎవరూ అని బహిరంగంగా అనే రకం. ఇక్కడే సాయిచంద్ కి పేరు వచ్చింది. 
కానీ అదే సమయంలో అలసిపోయాడు కూడా...
పదేళ్ల క్రితమే పాడుతూ పాడుతూ (2009)లో కుప్పకూలిపోయాడు, అతిచిన్న (28) వయసులో గుండెజబ్బుకి గురయ్యాడు. అప్పుడు జాగ్రత పడినా బాగుండేది కానీ అధికారం అనే ఆశ మనిషిని ఒక దగ్గర స్థిమితంగా ఉండనివ్వదన్నట్లు తనను తాను మరిచి పరుగెత్తాడు..ఇంటిని, ఒంటినీ పట్టించుకోకుండా 
తిరిగాడు. చివరకు ఆరడుగుల నెలకే పరిమితమయ్యాడు.

మొన్నీ మధ్య (జూన్ 4న) చిత్తనూర్ ఇథనాల్ 
ఫ్యాక్టరీ బాధితులను కలవడానికి చిత్తనూర్ గ్రామానికి 
వెళ్లినప్పుడు (మా ఊరుకి 18 కిలోమీటర్లు ఉంటుంది) గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరనున్న శిలాఫలకం మీద మా నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేరుతో పాటు సాయిచంద్ పేరు కనిపించింది.. గ్రామస్తులను అడిగాను ఎలా జరిగింది మీటింగ్ అని..మేము ఎమ్మెల్యేను అడ్డుకుంటామని రాత్రి అందరూ పడుకునే సమయంలో 100 మంది పోలీసులకు వెంట బెట్టుకొని వాళ్ళ అనుచరులను తీసుకొని వచ్చారు... గ్రామస్తులం ఎవరం వెళ్ళలేదు ఆ విగ్రహావిష్కరణకు వాళ్ళే వచ్చారు... వాళ్లే వెళ్లిపోయారు అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సాయిచంద్ కు సంబంధించిన చివరి జ్ఞాపకం నాకు.

ఈ మొత్తం జర్నీలో కన్నవాళ్లకు,
పు‌ట్టిన ఊరుకు దూరమయ్యాడు..
అరుణోదయ సాయిచంద్...
టీఆర్ఎస్ సాయిచంద్ అయ్యాడు.

"ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని 
పాటమ్మ ఊరేగుతున్నావ్.
దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి...
అని సుక్క రాం నర్సయ్య పాడినట్లు 

మట్టిచేతులు అతన్ని మేధావిగా మలిస్తే
దోరలకోసం గేయాలు కడుతూ తిరిగాడు
ఇవాళ అతనో దారితప్పిన పిలగాడు.






Comments