జంతు జన్మ...? ( హాస్య కవిత )
ఓ డాడీ ! ఓ మమ్మీ !
మీకు దణ్ణం పెడతా !
మీరు నన్ను
తిండిపోతు...తిరుగుబోతు
వదరబోతు...నిదురబోతు అని
ఎన్నైనా అనండి తిట్టండి కానీ
"ఛీపోరా దున్నపోతని" మాత్రం అనకండి !
నాకు మరో జన్మంటూ ఉంటే
హర్యానా రాష్ట్రంలో
పానిఫట్ జిల్లాలో
దిడ్వాడి గ్రామంలో
రైతు నరేంద్ర సింగ్
"షెహన్ షా" అని
ముద్దుగా పిలుచుకునే
25 కోట్ల ఖరీదైన
ముర్రేజాతి దున్నపోతుగా
మళ్ళీ మన ఇంటే పుట్టాలని ఉంది
అయ్యో రామా ఇదేమి చాదస్తం...
ఇదేమి పిచ్చికోరికరా వెర్రివెధవా...
ఓ డాడీ ! ఓ మమ్మీ !
మీకు దణ్ణం పెడతా !
నా మాట నమ్మండి !
విదేశాల్లో దాని వీర్యాన్ని అమ్మి
మీరు నెలకు 10 లక్షలు ఆర్జించవచ్చు
షెహన్ షా "నల్లదున్నపోతు"
కాదట...అది"నల్ల బంగారమట...
ఏదో పోటీలో పాల్గొని ఆ దున్నపోతు
"30 లక్షల బహుమతిని" కొట్టేసిందట
అందుకే ఓ డాడీ ! ఓ మమ్మీ !
మీకు దణ్ణం పెడతా !
మీరు నన్ను "దీర్ఘాయువుష్మాన్ భవాని"
దీవించకపోయినా పర్వాలేదు
కానీ మరోజన్మలో ఖచ్చితంగా
"నల్లదున్నపోతుగా" పుట్టాలని
"నవ్వుతూ నన్ను దీవించండి" !
మీకు పుణ్యముంటుంది...
నాకు "జంతుజన్మ" సార్థకమౌతుంది...
ఇదే నా దున్నపోతు శపథం...
నల్లదున్నపోతునై పుట్టి మీ ఇంట...!
తీరని మీ ఋణాన్ని తీర్చుకుంటా...!


Comments
Post a Comment