ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం...M.Com.....M.B.A...1978 - 80...& 1979 - 81 Batches...పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక...(తేది 18.03.2023)...సందర్బంగా...అందిస్తున్న...రెండు...కమ్మని కవితలు...ఒకటి గురువులకు...మరొకటి...నాటి నా తోటిమిత్రులకు...అంకితం...పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్...9110784502..
ఓ గురుదేవుళ్ళారా !
మీకు పాదాభివందనాలు !!
(గురువులకు అంకితం)
ఓ గురుదేవుళ్ళారా !
మేము పుట్టగానే
బడిలో అడుగుపెట్టగానే
పరిమళించే
పువ్వులని పసిగట్టేది...మీరే
మమ్ము కనని
అమ్మానాన్నలు...మీరే
మా భవిష్యత్తు
భవననిర్మాతలు...మీరే
మా జీవిత చక్రాలను తిప్పే
విష్ణుచక్రాలు మీ చేతుల్లోనే
మా దారిలో దీపాలు...మీరే
మా జీవితమార్గ నిర్దేశకులు...మీరే
మేము చదువుల్లో దిట్టలమైతే
మొట్టమొదట
భుజం తట్టేది...మీరే
సాన బట్టేది...మీరే
ముందుకు నెట్టేది...మీరే
మమ్ము రాళ్ళలో రత్నాలుగా
మట్టిలో మాణిక్యాలు తీర్చిదిద్దేది...మీరే
ఓ గురుదేవుళ్ళారా !
మా ఉజ్వల భవిష్యత్తును
నిర్మించేది...మీరే
మాలో అభ్యుదయ
భావాలను రగిలించేది...మీరే
మా హృదయాన్ని
వికసింపజేసేది...మీరే
ఒక "కన్నతల్లిలా "
బుజ్జగించిబుద్దిచెప్పేది...మీరే
ఒక "కన్నతండ్రిలా
చేయిబట్టి
నడిపించేది... మీరే
ఒక "ప్రాణస్నేహితుడిలా"
ఎవరెస్టుశిఖరమంత
ఎత్తుకు మేము ఎదగాలని
ఆశించేది...మీరే
ఆపదలో "భగవంతుడిలా"
ఆదుకునేది... మీరే
మా బ్రతుకులను
బంగారుమయం చేసేది...మీరే
ఓ గురుదేవుళ్ళారా !
మీరు నేలమీదున్నా...
మేము మాత్రం
వినువీధుల్లో...విదేశాల్లో...
విమానాలలో
విహరించాలని కలలు కనేది...మీరే
ఆ కలలే నిజమై మేము...
డాక్టర్లం...సినిమా యాక్టర్లం...కలెక్టర్లం...
కంప్యూటర్ ఇంజనీర్లమైతే...
రాజకీయ నేతలమై రాజ్యాలనేలితే...
ఉప్పొంగి పోయేది...మీ గుప్పెడు మనసే
ఆ కలలే నిజమై మేము...
సైంటిస్టులం...
అంతరిక్ష పరిశోధకులం...
వ్యోమగాములం...
మీలా ఉపాధ్యాయులమైతే...
పరవశించిపోయేది...
మీ పసిహృదయాలే...
మేము గురువులను
మించిన శిష్యులమైతే...
"ధీర్ఘాయుష్మాన్ భవా"యని దీవించేది..మీరే
ఓ గురుదేవుళ్ళారా !
బ్యాంకులో తీసుకున్న
కోట్ల రుణాన్ని
ఈ జన్మలో తీర్చవచ్చు...
కాని ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది
మాకు జన్మనిచ్చిన
అమ్మానాన్నల ఋణం...
మాకు ప్రాణం పోసిన ఆ బ్రహ్మ ఋణం...
మాకు జ్ఞానామృతం పంచిన మీ ఋణం...
ఓ గురుదేవుళ్ళారా !
మీకు రెండు చేతులెత్తి మొక్కుతాం...
మీ పాదాలకు పాలాభిషేకం చేస్తాం..
మా గుండెల్లో గుడి గట్టి
గురు బ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరాః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువేనమః అంటూ...
ప్రతినిత్యం మిమ్మల్ని
దైవాలుగా పూజిస్తాం...
మా బిడ్డలకు మీ పేర్లే పెట్టుకుంటాం..
ఇదే మీకు మా గురుదక్షిణ...
ఇంతకుమించి ఇంకేమిచ్చి
మీ ఋణాన్ని తీర్చుకోగలం...చెప్పండి
ఓ గురుదేవుళ్ళారా ! మీకు వందనాలు !
అభివందనాలు ! పాదాభివందనాలు !!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు M.Com. M.B.A పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక...
(తేది.18.03.2023)
సందర్భంగా "ఒక వీడ్కోలు కవిత "
(నాటి నా తోటి మిత్రులందరికీ అంకితం)
ఆహా ఆహా ఏమి సందడి..!
ఏమి సంతోషం..! ఏమి ఆనందం..!
అంబరాన్ని తాకే ఈ సంబరం...
అంతటా అలల కలల అలజడి...
ఎదలో ఎక్కడో తీపిజ్ఞాపకాల ఆరనితడి...
ఇది ఒక అపూర్వమైన ఆత్మీయ కలయిక...
ఇది ఒక అనిర్వచనీయమైన అనుభూతి...
అదిగో అదృశ్యంగా మనందరి
మదిలో కదిలిపోతున్నాయి
మధుర జ్ఞాపకాల
దొంతరలు తెరలు తెరలుగా...
పిల్ల గాలులుగా ...
మంచు బిందువులుగా...
ఎగురుతున్నాయి
గుంపులు గుంపులుగా...
రంగురంగుల రామచిలుకలుగా...
విరబూశాయి
యూనివర్సిటీ క్యాంపస్
విరితోటలో...కుసుమాలుగా...
గుండెల్లో గుభాళించే గులాబీలుగా...
ఈ క్యాంపస్ లోని గదులన్నీ
తీపితీపి జ్ఞాపకాల గనులేగా...
అందరి ముఖాలలో
వెన్నెల్లా వెలుగే స్నేహాదీపాలేగా...
ఆహా ! ఎంతటి మధురాతి
మధురమైనది..!
ఈ అపూర్వమైన
ఆత్మీయ కలయిక..!
ఆహా ఎంత తియ్యనిది..!
ఈ ఆత్మీయ ఆలింగనం..!
అరే ఒరే...అసే ఒసే...అంటూ
అతితియ్యని ఆత్మీయ పలకరింపుతో
అందరి మది పులకరించి పోతుంది...
ఇది కలకాదుగా పగటి కలకాదుగా
కళ్ళు తెరిస్తే కరిగిపోడానికి...
తీరం దాటిన తుఫానులా...
తీరని బాదై మిగిలిపోవడానికి...
నేడు మెరిసే ముత్యాలుగా
మనమంతా మూటకట్టుకొని
పట్టుకుపోతున్నవి ఎన్నో ఎన్నెన్నో...
ఈ తరగని కరగని తీపి జ్ఞాపకాలు...
ఈ సాయం సంధ్య వేళ
మురిసి ముద్దైపోయిన
బరువెక్కిపోయిన
హృదయ శిల్పాలపై
అభిమానం అనురాగం ఆత్మీయత
చెరగని చిరునవ్వుల ఉలులతో
చెక్కిన సుందరమైన అజంతా శిల్పాలే...
ఈ తరగని కరగని మన తీపి జ్ఞాపకాలు...
రవి వర్మ గీసిన ఆ సప్తవర్ణ చిత్రాలే...
ఈ తరగని కరగని మన తీపిజ్ఞాపకాలు...
కాలం కాగితం మీద ఆ బ్రహ్మ
లిఖించిన కమ్మని కావ్యాలే...
ఈ తరగని కరగని మన తీపిజ్ఞాపకాలు...
ఓ నా ప్రాణమిత్రులారా !
కనిపించని కన్నీటి ధారలతో...
వినిపించని మూగవేదనతో...రోదనతో
బరువెక్కిన బాధాతప్త హృదయాలతో
తరలిపోతున్న మనం
మళ్ళీ మళ్ళీ కలుద్దాం...
ఎక్కడా...? ఎక్కడా ...?
ఎక్కడో..! ఎక్కడో..!ఏమో...
ఎప్పుడూ..?ఎప్పుడూ..?
ఎప్పుడో...? ఎప్పుడో ..?..ఏమో
ఆ పరమాత్మే...ప్రేమతో
పిలవకపోతే...ఈ భువిలో
ఆపరమాత్మే ప్రేమతో పిలిస్తే...ఆ దీవిలో
మళ్ళీ మన గెట్ టు గెదర్...
ఎక్కడో...ఎప్పుడో ఎవరికెరుక...
ఏరులను...సెలయేరులను...
దారులను...ఎడారులను...ఏకం చేసే
బంధాలను...భవబంధాలను...
అనుబంధాలను...స్నేహబంధాలను...
రక్త సంబంధాలను పెంచే
తృటిలో తృంచే ఆ భగవంతునికి తప్ప...
ఈ అపూర్వమైన ఆత్మీయ కలయికకు తమ విలువైన సమయాన్ని వెచ్చించి అద్భుతంగా
ఆర్గనైజ్ చేసిన వారికి పేరుపేరున కృతజ్ఞతా కుసుమాంజలులు అర్పిస్తున్న...
మీ శ్రేయోభిలాషి...
మీ ఆత్మీయ మిత్రుడు...
పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ ...హైదరాబాద్
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502


Comments
Post a Comment