తలనీలాలిచ్చి... తరించండి... కవిత...

 


తలనీలాలిచ్చి... తరించండి...!


ఏడుకొండలపైన 

కేశఖండనశాలలో 

"మొక్కుబడిగా" 

స్వామివారికి భక్తులు

సమర్పించిన "తలనీలాలు" 

ఆన్లైన్లో అమ్మకం కోట్లలో ఆదాయం 

విగ్గులతయారీకి అవి ఉపయోగకరం 



భక్తుల కోరికలు తీర్చేటి 

కొంగుబంగారం కోనేటిరాయుడు 

కోరుకునేది మీ "తలనీలాలే" కదా

కొండమీద గుండు చేయించుకున్న 

గుండెలనిండా అనంత ఆత్మతృప్తి 

సమస్యల బండలన్నీ దొర్లిపోయి 

గండాలనుండి మీరు గట్టెక్కుతారు

"సుడిగుండాలసునామీల" నుండి

ఆకస్మిక ప్రమాదాల నుండి

తృటిలో తప్పించుకుంటారు...



వయసొచ్చిన అమ్మాయిలకు

కోరుకున్న వరుడు దొరుకుతాడు...

కొత్త జంటలు కోరుకున్న 

బిడ్డలను పొందుతారు... 

ఉన్నతమైన ఉద్యోగాలొస్తాయి... 

అప్పుల బాధలు తొలగిపోతాయి... 

అనుకున్న పనులు నెరవేరుతాయి... 



రాజకీయంగా 

నేతలు రాణిస్తారు... 

బంధువులతో స్నేహితులతో

ఇరుగుపొరుగు వారితో

సత్సంబంధాలు కలిగి ఉంటారు... 

విరోధులందరూ విందులిస్తారు.....

శత్రువులందరూ మీకు మిత్రులౌతారు...


మొండిరోగాల నుండి

స్వస్థత పొందుతారు...  

మీ కలలు పండుతాయి... 

మీ కోరికలు నెరవేరుతాయి... 

కుటుంబాలు సుఖసంతోషాలతో 

ఎల్లవేళలా హాయిగా ఆనందంగా 

ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు 



సుఖసంతోషాలు సకలసౌభాగ్యాలు... 

శాంతి సమాధానాలు భోగభాగ్యాలు... 

ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి

సద్బుద్ధితో సత్సంకల్పంతో మీరు 

తలపెట్టిన కార్యాలన్నీ సఫలమౌతాయి


తిరుమలలో ఆ శ్రీవారిని 

దర్శించుకున్నవారంతా ధన్యజీవులే... 

వారు దానధర్మాలు చేస్తారు...  

దయార్ద్రహృదయం కలిగి ఉంటారు...

దైవాంశసంభూతులుగా మారిపోతారు... 

ఏడుకొండలెక్కిన వారికి...

వెంకటేశ్వరునికి మ్రొక్కిన వారికి...

దక్కే దివ్యమైన వరాలివే...ఇవే...ఇవే...



అందుకే ఓ భక్తులారా!

ఏడుకొండలు ఎక్కిన...

కోనేటి రాయుడికి మ్రొక్కిన...

హుండీలో కానుకలు వేసిన...

మొక్కుబడులు చెల్లించుకున్న...

కొండమీద కేశఖండన శాలలో

"తలనీలాలు" సమర్పించుకున్న...

"సుఖశాంతులు" మీకు సిద్ధిరస్తు..!

"ప్రశాంత జీవితం" మీకు ప్రాప్తిరస్తు..!



రచన. 

"కవి రత్న"

"సహస్ర కవి"

పోలయ్య కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్ 

చరవాణి...9110784502

Comments