101 కవితలు...

 Index

1. గుసగుసలాడే గువ్వలు...? 

2. నగరజీవితం....

3. పుత్రోత్సాహమెప్పుడు?

4. జయహో ! జయహో!!

ఉదయమా ! మెట్రో ఉదయమా...!

5. ఆకలికి తెలుసు...?

6. జనహితమే" మన మతమైతె..?

7. విరులే...సింగారపు సిరులు..! 

8. ఓ కుక్క కేసు...(హాస్య కవిత)

9. బంధాలు భగవంతుని వరాలు...!

10. అమరవీరులు...ఆదర్శప్రాయులు...?

11. వెలిగేదీపం ఏమంటుంది?

12. పలకాలి నోట‌...ఓ మంచి మాట..! 

13. అగ్నిపరీక్ష...శ్రీరామరక్ష...?

14. ప్రచండ చండిక...

15. పిరికి పందలో...గొర్రెల మందలో...

16. అంబరాన్నంటే సిరిమాను సంబరం" 

17. మనిషి"మహనీయుడు"కావాలంటే?...

18. ఓం దుర్గామాత నమోనమః...

19. ఉచ్చు...! ఆరని చిచ్చు...!

20. విషపు నవ్వులు"...?

21. శిరసు వంచిన శిఖరం...!

22. కరుణించవమ్మా ! ఓ కనకదుర్గమ్మ ! 

23. పోయేదేముంది? చెప్పండి...

24. ధర్మో రక్షతి రక్షితః"...!

25. చల్లని చూపుల వరాలజల్లు..!

26. నిన్న కన్నుమూసిన మా కన్నతల్లి ?

27. ఏడు గుణపాఠాలు...?

28. నా కలం కుంటుంది ఓ కమ్మని కల...?.

29. కారైనా...కనక సింహాసనమైనా...?

30. బతుకమ్మ వేడుకలు....

      తొమ్మిది రోజుల" బతుకమ్మ పండుగ...

31. నా కలం కుంటుంది ఓ కమ్మని కల... 

32. ఈ అక్షర ఋణం...తీరేదెలా?

33. ఎందుకు పుట్టావయ్యా బాలయ్యా?

34. స్పూర్తి ప్రదాత మన సురవరం

35. జ్ఞానముద్ర...యోగనిద్ర...?

36. గౌరవిస్తాం..! ఘనంగా సత్కరిస్తాం..!

37. నమ్మితే నరకం స్వశక్తియే స్వర్గం 

38. అంబేద్కర్ అమృత సందేశం ?

39. పక్షి పిల్ల పడుచు పిల్ల 

40. గూగులమ్మే అందరికి గురువాయె...

41. మొగల్తూరు మహారాజ్ అమర్ రహే...

42. జింక...మదిలో...ఏదో శంక...?

43. సాధనతో సర్వం సాధ్యమే..!

44. వక్రబుద్ధి...వంకర చూపులు

45. బ్రిటిష్ రాజకుటుంబం......

46. జ్ఞానముద్ర...యోగనిద్ర...?

47. నా అంతరంగ ప్రబోధం...?

48. విషపు నవ్వులు"...?

49. రవి అస్తమించని రాజ్యంలో 

       అస్తమించిన రాణి ఎలిజబెత్ -||

50. గురువులు కరువౌతున్నారు...

51. నమ్మితే నరకం...స్వశక్తియే స్వర్గం..!

52. వర్తమానం...ఒక బహుమానం..?

53. గురుదక్షిణ...

54. ఉచ్చు...! ఆరని చిచ్చు...! 

55. గిజిగాడి గూడులా...? 

56. లక్షలదీపాలను ఆర్పిన మనిషి...?

57. మూర్ఖులు...ముళ్ళకంచెలు ?

58. రాస్తే కవిత్వం...?

59. సత్కవులకు సందేశం ?

60. మూర్ఖులు...ముళ్ళకంచెలు ? 

61. శిరసు వంచిన శిఖరం...!

62. తండ్రిని తాతగా మార్చవచ్చు...!

63. ఓ నందకిశోరా...ఓ నవనీతచోరా...!

64. ఏముంది మీ‌ కవిత్వంలో ? 

65. మరబొమ్మలా ? మతిలేనికోతులా ?

66. మద్యం ఏరులై పారితే ఏమౌతుంది ?‌

67. ఓ నందకిశోరా...ఓ నవనీతచోరా...!

68. వెన్న దొంగను వేడుకుందాం...

69. ఈ చిన్ని కృష్ణుడే...

      ఈ చిలిపి కృష్ణుడే...

70. వీరు కదా గాన గంధర్వులు...!

వీరు కదా మట్టిలో మాణిక్యాలు...!

71. మనిషి...దైవం....

72. నమ్మకు నమ్మకు నరహంతకుల్ని...

73. అతిచనువుకు...అర్థమేంటి...??

74. నోట అన్న‌మాట మరువకు...!

75. ఏడు కొండలు ఎక్కుదాం...! పార్టు...

76. కాలానికి కళ్ళెం వేద్దాం ! 

77. పులిలా బ్రతుకు ....

78. నేను...నా భారత దేశం...(పార్టు...1)

79. ఈ కవికి జ్ఞానోదయమెప్పుడు?

80. ప్రేమతీర్థం...పుచ్చుకుంటే..?' 

81. విశ్వవిజేతలు....వారే...

82. ఇదేమి కాపురం "కల్తీ కాపురం" !!! 

83. హాయిగా..."హంస"లా...జీవించు...! 

84. గుప్పెడు గుండెలో...

85. ఓ అమ్మా ! ఓ నాన్నా !

      మీకు వందనం ! పాదాభివందనం !!

86. మన్మధుని మాయాజాలం ?

87. ఆగస్టు 15 - అర్థరాత్రి స్వాతంత్ర్యం?

88. ఎక్కడ ? ఎక్కడ ?ఎక్కడ?

89. విపత్తులో విశ్వం...

(వి అనే అక్షరంతో కరోనా కవిత)

90. పరువు హత్యలు....

91. చిరునవ్వుల జాతర...!

92. మట్టినుండే‌ మెతుకు‌ పుట్టె !

93. ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా..!

94. పరమాత్మకు ప్రతిరూపం...

95. ఒంటరి జీవితం ఒక శాపమా? 

96. కరుణించవమ్మా ! ఓ కనకదుర్గమ్మ ! 

97. ఓ మానవుడా ! 

      నీ వెంతటి మహోన్నతుడివయ్యా !

98. నరజాతికి నమస్కారం...

99. ఎడారి గుండెలో ఏముందో?

100. తెలుగు భారతికి అక్షర హారతి

101. తెలుగు ఎక్కడో వెలుగు అక్కడ



1. గుసగుసలాడే గువ్వలు...? 


గూటిలో..."గుసగుసలాడే 

గువ్వలు"...చెప్పెను ఏమని?

కులమతాల కుంపట్లు రగిలి 

రక్తసంబంధీకులే రాక్షసులై పులులు 

జింకల్ని వేటాడినట్లు వేటాడి వేటాడి 

వేధించి వేధించి వెతలకు గురిచేసి

దానవత్వంతో దహించి వేస్తుంటే...

దారుణంగా...శారీరకంగా...

మానసికంగా...హింసిస్తుంటే...   

సహించలేక మానసికక్షోభను 

భరించలేక "భగ్న ప్రేమికులిద్దరు" 

మనోవేదనతో...మరణించారని...


గదిలో...గాఢాంధకారంలో 

వ్రేలాడే "గబ్బిలం"...చెప్పెను ఏమని?

ఈసమాజంలో కాగడాపెట్టి వెతికినా 

ఎక్కడా సమానత్వమన్నది లేదని...

వ్యక్తి తన శక్తిసామర్థ్యాలకు మించి... 

నిబద్ధతతో ఎంత శ్రమించినా...

అంతా పెట్టుబడిదారులదే పెత్తనమని... 

దొంగలది దోపిడీదారులదే ఈ రాజ్యమని... 


"పెరటిలో...పెరిగే 

"గడ్డిపోచ"...చెప్పెను ఏమని?

శక్తి సామర్థ్యాలెన్నిఉన్నా

మచ్చలేని వ్యక్తిత్వం లేకున్న 

జీవితంలో అభివృద్ధి సున్నని...

ఆత్మ న్యూనతకు గురికారాదని...

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారాదని...


మురికి బట్టలు...

మోసుకుంటూ చెరువు 

"గట్టుకు చేరిన గాడిద"...చెప్పెను ఏమని?

ఎంత శ్రమించినా కొందరు యజమానులు 

కరుణ జాలి దయలేని....కఠినాత్ములేనని...

నిర్దయులేనని....పాషాణహృదయులేనని...


ఔను మనిషి మనిషిలో 

పెను మార్పు కోసం శ్రమించి...

మార్పే జీవిత లక్ష్యంగా జీవించి...

మార్పు కోసమే...మరణించిన...

మహనీయుల...సంఘసంస్కర్తల 

"శుభ సందేశం" ఒక్కటే...


సమాజంలో 

సమానత్వం......సౌభ్రాతృత్వం  

సంస్కృతి.........సంప్రదాయాలు  

సంస్కారం........సమాధి కారాదని... 

సమ సమాజ స్థాపనకు 

పునాదిరాయి....నీవే కావాలని...


2. నగరజీవితం....


మహానగరంలో ఏదైనా

ఎత్తైన ఓ భవనం పైకెక్కి...చుట్టూ 

ఎటు వీక్షించినా కనుచూపుమేరలో...

కళ్ళకు కనిపించేది...కనువిందుచేసేది

నిరుపేదల చమటచుక్కలతో

నిర్మించిన "ఆకాశ హార్మ్యాలే". ‌

 

ఒక వ్యవసాయ క్షేత్రంలో 

గట్టుపై నిల్చొని...చుట్టూ 

ఎటు తిలకించినా కనుచూపుమేరలో... 

కళ్ళకు కనిపించేది...కనువిందుచేసేది

పంటపొలాల్లో "ప్రవాహించే పచ్చదనమే"


నిశిరాత్రిలో నింగిలోకి...తలపైకెత్తి

తొంగ చూస్తే కనుచూపుమేరలో...

కళ్ళకు కనిపించేది...కనువిందుచేసేది

"కటిక చీకటిలో నవ్వే నక్షత్రాలే"


సముద్రం ఒడ్డున నిలుచుని...చుట్టూ 

ఎటు దర్శించినా కనుచూపుమేరలో...

కళ్ళకు కనిపించేది...

కనువిందుచేసేది...నీరే....నీరే...నీరే...


ఒంట్లో మొండి వ్యాధులతో... 

ఇంట్లో సమస్యల సంకెళ్లతో... 

బంధింపబడిన అభాగ్యుల బ్రతుకుల్లో...

చుట్టూ ఎటుచూసినా కనుచూపుమేరలో...

అంతా...అంధకారమే..అగమ్యగోచరమే... 

తీరనివ్యధే...ఆరనిఆవేదనే...ఆగనికన్నీరే...


3. పుత్రోత్సాహమెప్పుడు?


ప్రతి కుమారుడు

వంశానికి వారసుడే....వాడు 

పుట్టిన ఊరికి...పెట్టిన పేరుకి...

కన్నవారికీ...కీర్తి ప్రతిష్టలు తెచ్చే 

బుద్ధిమంతుడైతే...గుణవంతుడైతే 

బాధ్యతగలవాడైతే...ప్రయోజకుడైతే 

జన్మనిచ్చిన 

తల్లిదండ్రుల...జన్మే...ధన్యమౌతుంది

పుత్రోత్సాహంతో వారు పులకించిపోతారు 

 

కానీ అతిప్రేమతో పుత్రులను 

వ్యసనపరులుగా...

దుర్జనులు....దుష్టులుగా

కొరకరాని కొయ్యలుగా...

అంధులుగా...అసమర్థులుగా  

అపరాదులుగా అజ్ఞానులుగా మార్చరాదు

పుత్రులు పుడితేనే పుణ్యమనితలంచరాదు


నేడు కన్నబిడ్డలు

ఇంటికి "గొడుగులు" కాక 

నెత్తిన "పిడుగులౌతున్నారు"

"కంట్లోకారం" చల్లుతున్నారు

"ఇంట్లో సమస్యగా" మారుతున్నారు


ప్రతి తల్లీతండ్రీ తమ కొడుకును

ఒక సోదరుడిగా...బాధ్యతగల ఒక భర్తగా 

సమాజంలో పరిపూర్ణమైన...పౌరుడిగా  

ఒక వరంగా...వంశవృక్ష ఫలంగా" 

"ఇంటికి ఓ ప్రతినిధిగా"తప్పక తీర్చిదిద్దాలి


4. జయహో ! జయహో!!

ఉదయమా ! మెట్రో ఉదయమా...!!!


మూడు పువ్వులు 

ఆరుకాయలుగా కాక...

20 పేజీల రమణీయమైన

రంగవల్లులతో...

7 రంగుల ఇంద్రధనుస్సులా

7 పేజీల కవితోదయంతో...

77 కవుల ముఖచిత్రాలతో

పసందైన శీర్షికలతో విలువైన వార్తలతో

ప్రతిసూర్యోదయం కనువిందుచేసే 

ఉదయమా ! మెట్రో ఉదయమా...!!!

కవుల కవయుత్రుల

కడుపు మనసు నింపే ఓ కవితోదయమా...


చైర్మన్ శ్రీ లక్ష్మీ నారాయణ గారి 

ఉదార హృదయమా....!

కవితల కుంభవర్షమా...!

కవులకు అనంత హర్షమా...!

జయహో జయహో...! 

ఓ ఉదయమా ! మెట్రో ఉదయమా...!


కవులపాలిటి కల్పవృక్షమా...!

కవయిత్రుల కార్తీక దీపమా...!

"సాహిత్య సాగరమా...!

కవితల మణిహారమా...!

జయహో జయహో...!

ఓ ఉదయమా ! మెట్రో ఉదయమా...! 

 

పత్రికారంగాన ఓ "ధృవతారగా" వెలగాలని

విశ్వవ్యాప్తమై విలసిల్లాలని....వర్ధిల్లాలని..‌ 

కోరుకుందాం...ఆర్థికంగా ఆదుకుందాం...


5. ఆకలికి తెలుసు...?


ఆకలికి తెలుసు... 

"శ్రమ విలువ" 

భయానికి తెలుసు... 

"ప్రాణం విలువ" 


చీకటికి తెలుసు... 

"వెలుగు విలువ" 

కన్నీళ్లకు తెలుసు... 

"సంతోషం విలువ" 


మోసానికి తెలుసు... 

"స్నేహం తియ్యదనం" 

ఓటమికి తెలుసు... 

"గెలుపు గొప్పతనం" 


త్రాగి మత్తెక్కిన 

తుంటరి తుమ్మెదకు 

తెలుసు...పూలలోని

"మకరందపు మధురిమ" 


విడిపోయి...జీవితంలో 

ఓడిపోయి...ఒంటరిగా 

దూరంగా...భారంగా

మదన పడుతూ బ్రతుకే

మాజీ భార్యాభర్తలకు

తెలుసు..."వివాహం విలువ" 


మోసే గర్భానికి తెలుసు... 

పుట్టబోయే "బిడ్డ చరిత"

పైనున్న పరమాత్మకు తెలుసు... 

ఈ భూమిపై తిరిగే "ప్రతిజీవి భవిత"


6. జనహితమే" మన మతమైతె..?


అజ్ఞాతంగా ఉన్ననేమి

అట్టడుగున పడి ఉన్ననేమి

అగ్రస్థానమే నీ లక్ష్యం కావాలి

ఆ లక్ష్య సాధనకై తపించాలి 

తపించి శ్రమించిన 

"అఖండ విజయం" 

సాధ్యమే అది అక్షరసత్యమే  


ఈ జీవితం "ఆశయాల ఆకృతి" 

ప్రేమ ప్రమాద "ప్రమోదాల ప్రకృతి"

విధి "విషాదాల వికృతి* అయినా

"ఆనందనిధి" కోసం అన్వేషణ జరగాలి


విలాసాలకు వికృత చేష్టలకు 

విందులకు వినోదాలకు విచ్చలవిడి జీవితాలకు సూదూరంగా జరగాలి 


ఆ పరమాత్మ ఆరాధన అనుగ్రహంతో 

"ఆశయ సిద్ధికి అంకురార్పణ" జరగాలి 


ఈ జీవితంలో 

"ధన దాహంతో" ఎవరు 

ఉన్నతులు కారు ఉద్ధరింపబడరు 

"జ్ఞాన దాహంతో" పండితులౌతారు 

ప్రపంచానికి విజ్ఞానజ్యోతులౌతారు

 "దివిటీలౌతారు...దిక్చూచి"లౌతారు

"దివ్యత్వాన్ని" వరంగా" పొందుతారు 


ఆర్తుల సేవతో

"ఆశాదీపంగా"... 

ఆత్మసాక్షాత్కారముతో 

"ఆశయాలకు ప్రతిరూపంగా"...

"జనహితమే" మన మతమైతె...

"జన్మసాఫల్యమే" ఈ జీవితం సార్థకమే...


7. విరులే...సింగారపు సిరులు..! 


కొన్ని "విరులు"...

స్త్రీల కురులకు

"సింగారపు సిరులు"... 

విరిసీ విరియకముందే 

సుమ సౌరభాలను వెదజల్లు... 

వనాలను వసంతమయం చేయు... 


కొన్ని "విషాదపు విరులు"... 

కళ్ళు తెరిచినంతనే ఖర్మ కాలి

మండుటెండలకు మాడి పోవు...

నేల రాలి...ధూళిలో కలిసిపోవు...


కొన్ని "కొంటె పూలు"... 

ఝుం...ఝుమ్మంటూ

కమ్మని వలపు గీతాలను 

ఆలపించే తుంటరి తుమ్మెదల్ని 

చెంతకు రారమ్మని పిలిచి

మకరందాన్నందించి మత్తెక్కించి

చిరునవ్వుతో...చిందులు వేయు... 


కొన్ని "కులికే కుసుమాలు"..

కన్నెపిల్లల ముంగురులకు

ముద్దులిచ్చి మురిసి పోవు...


కొన్ని "పురివిప్పిన పుష్పాలు" ‍... 

నూతన వధూవరుల శోభనంగదిలో 

ఘుమఘుమలాడే పరిమళాలతో 

కొత్త జంటల "తీరని కోర్కెలను" తీర్చి 

మధురమైన "తీపిజ్ఞాపకాలను" మిగిల్చు...


కొన్ని "విజ్ఞానపు విరులు"... 

కన్న కలలు పండి ఆ పరమాత్ముని 

పాదారవిందాలకు చేరి పరవశించి పోవు....


8. ఓ కుక్క కేసు...(హాస్య కవిత)


ఎవరు ఏ ఆట ఆడినా 

ఎవరు ఏ పోటీలో పాల్గొన్నా 

ఒకరికి ఓటమి...ఒకరికి గెలుపు అది 

బంగారుపతకమైనా...కప్పైనా ఒకరికే


కానీ ఓ కుక్క కేసులో 

కోర్టుకెక్కిన ఇద్దరూ ఓడిపోయారు 

జైలుశిక్ష పడింది ఇద్దరికి జడ్జి వింతతీర్పుతో


ఓ ధనవంతుడికి 

తన "కాపలా కుక్కంటే ప్రాణం"... 

అది ఇంటి మనిషి కన్న మిన్న...


పక్కింటివాడికది "పరమ శతృవు"... 

వేళాపాళా లేకుండా "భౌభౌ" మంటూ 

చెవులు చిల్లులు పడిపోయేలా 

అరిచే ఆ కుక్క అరుపులకు విసుగెత్తి 

కుక్కను యజమానిని కలిపి తిట్టేవాడు 

"కుక్కను తిట్టాడో....తనను తిట్టాడో "

అర్థంకాక యజమాని జుట్టుపీక్కునేవాడు 


ఓరోజు యజమాని లేని సమయంలో

గన్నుతో...కుక్కను...కాల్చిచంపేశాడు

కోపంతో యజమాని కోర్టు కెక్కాడు...


ఇరువురి వాదనలు విన్న జడ్జి వింతగా 

ఇద్దరికి విధించాడు కఠిన "కారాగార శిక్ష"


ఓ మూగజీవి పాలిట

మృత్యువైనందుకు...పక్కింటి వాడికి.


అరిచే కుక్కను 

అదుపు చేయనందుకు... 

ఇరుగుపొరుగుకు ఇబ్బంది

కలిగించినందుకు...కుక్క యజమానికి.


9. బంధాలు భగవంతుని వరాలు...!


విరిగిన...

నలిగిన మనసు 

పగిలిన అద్దమే...

చిరిగిన కాగితమే...


చిరిగిన కాగితాన్ని అతికించవచ్చు 

పగిలిన అద్దాన్ని అతికించలేము...


కన్నీళ్ళు నిండిన కళ్ళతో... 

వెళ్లే దారిని సరిగా వీక్షించలేము...


పగిలిన అద్దంలో.... 

చిన్నరాయి పడి చెదిరిన నీటిలో...

ప్రతిబింబాన్ని స్పష్టంగా తిలకించలేము...


భవబంధాలైనా... 

మానవ సంబంధాలైనా అంతే

"ఏదీ ఒక హద్దు దాటరాదు"...

"దేనినీ తెగేదాక లాగరాదు"...


ప్రాణమిత్రులైనా...

భార్యా భర్తలైనా...

బద్దశతృవులౌతారు...

శాశ్వతంగా దూరమౌతారు...

విధిఆడే ప్రతిఆటలో ఓడిపోతారు...

కంటిఎదుటే...

ఎందరు వున్నా ఒంటరివారౌతారు...


పెనవేసుకున్న బంధాలను పెంచేది..!

తృటిలో తృంచేది...ఆ భగవంతుడే..!

అందుకే మిత్రమా..! ఓ నా నేస్తమా..!

బంధువులతో బంధాలతో బహుజాగ్రత్త..!

 

10. అమరవీరులు...ఆదర్శప్రాయులు...?


ఎంతటి శతృవు

ఎదురు పడినా

ఎవరి ముఖంపై 

"చిరుమందహాసం" ఒక

"చిరుదీపమై" వెలుగుతుందో...


ఆడిన పందెంలో ఓడినా

ఎవరైతే తన ప్రత్యర్ధిని

ప్రశంసిస్తారో "ఆత్మీయంగా 

ఆలింగనం" చేసుకుంటారో...


కన్న కలలు శిలలైనా...

ఆశలు అలలైనా...

సమస్యల పిడుగులెన్ని 

తలపై పడినా...అనకొండలై

నడుమును చుట్టేసినా...

తొణకకుండా...గంభీరంగా...

నిండుకుండలా... 

నిర్మలంగా...నిశ్చలంగా... 

నిబ్బరంగా...నిప్పులా 

ఎవరెస్ట్ శిఖరంలా...

ఎవరైతే ఉంటారో...

అట్టివారే...స్థితప్రజ్ఞతగలవారు


అట్టి వారే గేలిచేసినా...

ముఖాన ఉమ్మి వేసినా...

కొరడాలతో కొట్టినా...

తలపై ముళ్ళకిరీటం పెట్టినా...


శిలువ వేసినా...

చిత్రహింసలకు గురిచేసినా...

భరించిన...సహించిన...

క్షమించిన...మరణించిన...


"మహా క్షమాగుణానికి" మారుపేరైన

పరిశుద్ధుడు పాపులరక్షకుడైన  

"మరియ సుతునితో "...

రాజభోగాలు గడ్డిపరకలన్న

"బుద్ధ భగవానునితో" సమానులు

వారే సాత్వికులు...శాంతమూర్తులు

వారే అమరవీరులు...ఆదర్శప్రాయులు


11. వెలిగేదీపం ఏమంటుంది?


చీకటిని 

చీల్చమంటుంది 

చిరునవ్వు 

నవ్వమంటుంది 


మనిషిగా 

మారిపొమ్మంటుంది 

చీకటిని 

చూసి పారిపోకంటుంది 


దేదిప్యమానంగ 

వెలుగును 

పదిమందికి పంచమంటుంది 

దేవతల 

చెంతకు చేరిపొమ్మంటుంది

 

సోమరివై 

దుప్పటిలో దూరకంటుంది

వెన్నెల వెలుగుల్ని 

పదిమందికి పంచమంటుంది 


ఊపిరాడని ఊబిలోకి 

అథఃపాతాళానికి జారిపోకంటుంది

గతించిన కాలం...కరిగిన కాంతి... 

తరిగిన వయసు...మళ్ళీరావంటుంది


12. పలకాలి నోట‌...ఓ మంచి మాట..! 


"మనిషి జీవితం 

కరిగిపోయే మంచు 

అందుకే మంచిని 

నలుగురికి పంచు"...అన్నారు

కళారత్న శ్రీ బిక్కీకృష్ణ గారు 


మనసుకు హత్తుకునేలా... 

దారి దీపాలవంటి... 

మంచిమాటలు నాలుగు చెబితే 

పోయేదేముంది...చెప్పండి

విని నలుగురు చీకటి నుండి 

వెలుగులోనికి రావడం తప్ప... 


పడిపోయిన పదిమంది... 

తిరిగి పైకి లేవడం తప్ప... 


చెడిపోయిన బడుగు... 

బ్రతుకులు బాగుపడడం తప్ప... 


వేలమంది...అభాగ్యుల జీవితాల్లో

వెన్నెల వెలుగులు విరజిమ్మడం తప్ప...


అందుకే అంటారు

మంచి మనసుతో 

మనం ప్రేమగా ‌పలికే

మధురమైన మాటలే... 

వెలుగు కిరణాలని...

మంగళ తోరణాలని...

బంగరు ఆభరణాలని...


మనిషికి మాటలే ఔషదాలని...

మాటలే మారణాయుధాలని...

మాటలే ముత్యాల మూటలని...

మాటలే ప్రాణాలు‌తీసే తూటాలని...


ఔను కొందరు మాట్లాడితే  

రాలుతాయో లేదొ "నోటిముత్యాలు"

కానీ కొందరు పెదవి విప్పితే‌‌ చాలు

వెలుగుచూసేను ఎన్నో"నగ్నసత్యాలు"


కొందరి మాటలు 

"నీటిమూటలు"... 

"ఇసుకలో వ్రాతలు"...

కానీ కొందరి మాటలు 

శిలలపైన చెక్కిన "శిలాక్ష‌రాలు"...


అందుకే పలకాలి "మీ నోట"...  

మధురమైన "ఓ మంచిమాట"...


13. అగ్నిపరీక్ష...శ్రీరామరక్ష...?


ఓ మనిషీ ! 

ప్రశ్నించు...ప్రశ్నించు

ప్రశ్నించని మనిషికి 

ఎదుగుదల ఎక్కడిది ?

అది అర్ధాంతరంగా ఆగిపోతుంది

ఆపై నీ "ఆశలదీపం" ఆరిపోతుంది

 

ఓ మనిషీ ! 

ప్రయత్నించు...ప్రయత్నించు

కసితో కృషితో...

దృఢమైన దీక్షతో...

ఒక పక్కా ప్రణాళికతో...

చక్కని ఫలితం చిక్కుతుంది

ఘనవిజయం నీకు దక్కుతుంది 


ఓ మనిషీ ! 

ప్రతిఘటించు...ప్రతిఘటించు

నీ కళ్ళెదుట జరిగే

పరమ దుర్మార్గాన్ని...

దుష్టుల స్వభావాన్ని...

దున్నపోతుల అహంకారాన్ని...

దేనికీ ఎవరికీ భయపడకు

"బానిసత్వపు పులికి" బలికాకు


ఓ మనిషీ ! 

ఎదురించు...ఎదురించు

ఎంతటి అన్యాయాలనైనా... 

అక్రమాలనైనా...అకృత్యాలనైనా...

ఘోరమైన మహాదారుణాలనైనా...

ఎంతటి వారినైనా...ఎదురించు

వారిగుండెల్లో..."సింహమై" నిదురించు


ఓ మనిషీ! 

పోరాడు...పోరాడు

విజయమో...

వీరస్వర్గమో అంటూ... 

నీ గమ్యం చేరే వరకు... 

నీ లక్ష్యం నెరవేరే వరకు... 

నీలో ఊపిరి ఉన్నంత వరకు...

విజయలక్ష్మి నిన్ను వరించేంత వరకు...

 

ఓ మనిషీ! 

అదే నీ సహనానికి "అగ్నిపరీక్ష"

అదే నీ జీవితానికి "శ్రీరామరక్ష" 


14. ప్రచండ చండిక...


మశూచి మహమ్మారినుండి

పేద ప్రజలను రక్షించిన

"మహంకాళి...మంగళగౌరి" 

మన "పసిడి కాంతుల పైడితల్లి"


ఆర్థిక సంక్షోభంలో ఆదుకున్న

"అన్నపూర్ణ...అమృతమయి" 

కోరిన కోర్కెలు తీర్చేటి

భక్తుల "కొంగు బంగారం" 

మన "పసిడి కాంతుల పైడితల్లి"


నుదుట "రక్తతిలకం" దిద్దుకొని 

విజయమో వీరస్వర్గమో అంటూ

బొబ్బిలి యుద్ధంలో పోరాడిన

పెద విజయరామరాజుకు

"అఖండవిజయాన్ని" అందించిన

"పరమపావని...ప్రచండ చండిక"

మన "పసిడి కాంతుల పైడితల్లి"


విజయనగరం జిల్లాలో మూడులాంతర్ల

కూడలి ఆలయాన కొలువైవున్న 

ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవం...

విజయనగర రాజుల ఇలవేల్పు...

పెద విజయరామరాజు ముద్దుల చెల్లెలు.. 

మన "పసిడికాంతుల"పైడితల్లి"కి 

ప్రణామం... ప్రణామం...ప్రణామం...


15. పిరికి పందలో...గొర్రెల మందలో..


సంకల్పబలం లేని...

సత్సాంగత్యమెరుగని...


సన్నిహితుల ఉచిత

సలహాలు స్వీకరించని...

సహాయాన్ని అర్థించని...


సమస్యలకు పరిష్కారం 

చావు కాదు కాదు కాదన్న

నగ్నసత్యాన్ని గ్రహించని...


జన్మనిచ్చిన అమ్మానాన్నలను

ఒక్కక్షణమైనా గుర్తుచేసుకోని...


ప్రాణంపోసిన ఆ పరమాత్మను  

ఒక్క క్షణమైనా స్మరించుకోని...


సమయస్ఫూర్తితో వ్యవహరించని...

సమస్యలను ధైర్యంతోఎదుర్కోలేని...


ఆవేశం తప్ప ఆలోచనలేని

అమాయకత్వం తప్ప 

ఆత్మహత్యలపై అకాలమృత్యువుపై 

ఆవగింజంతైనా అవగాహనలేని


ఓ బలహీనమైన క్షణాల్లో

బలవన్మరణానికి పాల్పడే

బంగారుభవిష్యత్తును బలితీసుకొనే


సకాలంలో సరైన మార్గాల్లో 

పరిష్కారాలకై పట్టుదలతో అన్వేషించని


ఈ జీవితం వ్యర్థం వ్యర్థమనే తప్ప

దానికో అర్థం పరమార్ధముందని తెలుసుకోని 


కుటుంబ పరువును కుప్పకూల్చే

పచ్చని కాపురాల్లో చిచ్చు రగిలించే

చింతలేలేని చిరునవ్వుల 

కుటుంబాన్ని చిమ్మచీకటిలో ముంచేసే

ఆ మూర్ఖులు...

ఆ మొండివారు...

ఆ ఆవేశపరులు...

గతజన్మలో పిరికిపందలో...గొర్రెలమందలో

ఎవరికెరుక ? ఆ పరమాత్మకు తప్ప... 


16. అంబరాన్నంటే సిరిమాను సంబరం" 


విజయనగరం జిల్లాలో మూడులాంతర్ల

కూడలి ఆలయాన కొలువైవున్న 

ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవం...

విజయనగర రాజుల ఇలవేల్పు...

పెద విజయరామరాజు ముద్దుల చెల్లెలే...

"పసిడి కాంతుల పైడితల్లి" అమ్మవారు...


250 ఏళ్ళనాడు పెద్ద చెరువుగర్భంలో నిక్షిప్తమైవున్న పైడితల్లి మూలవిరాట్టును బయటకుతీసి జాతి కులమతాలకతీతంగా 

లోకపావని పైడితల్లి దర్శనభాగ్యం కలిగిన  

"జాలర్ల వల జాతరే" ఈ సిరిమాను జాతర

 

ఎన్నో ఏళ్ళనాడు ఈటెలు ధరించి కోటను రక్షించిన శక్తిస్వరూపులైన ఆదివాసులకు

అమ్మవారి శక్తికి ప్రతిరూపమైన కనువిందైన

"జనధార జాతరే" ఈ సిరిమాను జాతర


భక్తులపాలిట దేవతలు పైడితల్లి ఏడుగురు అక్కచెల్లెళ్ల సోదరుల.....సాక్షాత్కారం 

గజపతుల ప్రాభవానికి ప్రతిబింబమైన...

"తెల్లఏనుగు జాతరే" ఈ సిరిమాను జాతర


భక్తిప్రపత్తులతో ఐదుగురు పరిచారికలు

అమ్మవారికి అంజలి ఘటించే అందమైన 

"అంజలి రథం జాతరే" పైడితల్లి జాతర.


పూజారి వేషంలో సిరిమానుపై ఆశీనురాలై 

భక్తులకోర్కెలు తీర్చేటి...ఆ పైడితల్లి జాతరే

అంబరాన్నంటే సిరిమాను ఉత్సవ సంబరం


17. మనిషి"మహనీయుడు"కావాలంటే?..


పార్టు...1


ఆగకు...ఆగకు... 

స్నానమాడేందుకు

సంద్రంలో ఎగిసిపడే 

అల్లరిఅలలు ఆగేంతవరకు...


ఊగకు...ఊగకు... 

ఉద్రేకంతో ఊపిరి

ఆగిపోయేంతవరకు...

నీ నరాలు తెగేంతవరకు...


వాగకు...వాగకు...

నీలోని అవివేకం...

అజ్ఞానం...అహంకారం.. 

బట్టబయలయేంతవరకు...


త్రాగకు త్రాగకు...

నీ "ఇంట్లో" ఆస్తిఅంతా 

ఆవిరయ్యేంత వరకు...

అప్పుల్లో చిక్కుకుని నీ

ఆలూ బిడ్డలు ఆకలితో

అలమటించేంత వరకు...

నీ "ఒంట్లో" ఆరోగ్యం ఖర్చై 

కన్నుమూసి కాటికెళ్ళేంతవరకు...


పార్టు...2


త్రుంచకు...త్రుంచకు...

విరితోటలో విరబూసి... 

గుడికి చేరని‌ గులాబీలను... 


ముంచకు...ముంచకు...

నవ్వుతూ నవ్వుతూ నమ్మిన 

వారిని నట్టేట ముంచకు...


వంచకు...వంచకు...

ఎవరికీ తలవంచకు...

ఎన్ని సమస్యలెదురైనా...

ఎవరెన్ని నిందలు మోపినా...

ఎంతగా విధి విషం చిమ్మినా...

ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా...


పార్టు...3


రెచ్చిపోకు...రెచ్చిపోకు...

పిచ్చికోపంతో...

రక్తసంబంధాలన్నీ

రద్దయ్యేంతవరకు...


ద్వేషించకు...ద్వేషించకు...

ఎవరినీ పగాప్రతీకారంతో...

సత్సంబంధాలన్నీ 

సమాధి అయ్యేంతవరకు...


దాచుకోకు...దాచుకోకు...

కసాయితనాన్ని...మదిలో

బంధు మిత్రులందరూ 

బద్ధశత్రువులయ్యేంతవరకు...

ఓడిపోయి ఒంటరివయ్యేంతవరకు...


పార్టు...4


ప్రేమించు...ప్రేమించు... 

ప్రకృతిలోని ప్రతిజీవిని...

విశ్వసించు...విశ్వసించు 

జన్మనిచ్చింది అమ్మని

ఊపిరి పోసింది ఆ బ్రహ్మని


ఆరాధించు...ఆరాధించు...ఆశతో... 

ప్రార్థించు...ప్రార్థించు...భక్తితో 

నిత్యం...వరాల వర్షం కురిపించే...

కరుణామయుడైన ఆ పరమాత్మను... 

"కోరిన కోరికలు" తీరేంతవరకు...

"కన్న కలలు" ఫలించేంతవరకు...

ముందు జన్మలోనైనా

"ముక్తి" లభించేంతవరకు...


ఓ మిత్రమా ! 

ఓ నా ప్రియ నేస్తమా ! 

ఇదే ఇదే...చిరుచిట్కా...

ఇదే ఇదే...రాజమార్గం...

ఇదే ఇదే...సుఖజీవన సూత్రం... 

మనిషి...మహనీయుడయ్యేందుకు... 

అస్తమించినా...అమరుడైపోయేందుకు...


18. ఓం దుర్గామాత నమోనమః...


ఓం సర్వ  

స్వరూపే సర్వేశే 

సర్వశక్తి సమన్వితే 

భయేభ్య స్త్రాహి నో దేవీ 

దుర్గా దేవి నమోస్తుతే|| ... 


ఓం నమస్తేస్తు 

మహామాయే 

శ్రీ పీఠే సుర పూజితే

శంఖు చక్ర గదా హస్తే 

మహాలక్ష్మీ నమోస్తుతే||...


ఓం యాదేవీ 

సర్వ భూతేషు... 

శక్తి రూపేణ సంస్థితా  

నమస్తస్మై నమస్తస్మై నమో నమః|| ...


ఓం సర్వ 

మంగళ మాంగళ్యే 

శివే సర్వార్థ సాధకే 

శరణ్యే త్రంభకే దేవి 

నారాయణే నమోస్తుతేః||...అంటూ


దుఃఖ నివారిణి... 

దుష్ట సంహారిణియైన 

ఆ మహంకాళిని...ఆ దుర్గామాతను...

మహిషాసుర మర్ధినియైన 

ఆ జగదాంబను...ఆ జగన్మాతను

నిత్యం నిష్టతో కోవెలకెళ్ళి కొలిచిన చాలు

మదినేమందిరం చేసుకొని తలచిన చాలు 

ఘనవిజయాలు ప్రాప్తిరస్తు...

సకలశుభాలు... 

సుఖశాంతులు...మీకు సిద్ధిరస్తు...


శక్తికి బుద్దికి సంకల్పసిద్ధికి

నిలయమైన శక్తిస్వరూపిణియైన 

ఆ పరమ పావనమూర్తిని...

ఆ దుర్గామాతను...ఆ అన్నపూర్ణను... 

ప్రతినిత్యం భక్తితో ప్రార్థించిన చాలు

ఆరోగ్యం...ఆయుష్షు...సిద్ధిరస్తు... 

భోగభాగ్యాలు...అష్టైశ్వర్యాలు...  

ప్రశాంతమైన జీవితం...మీకు ప్రాప్తిరస్తు...


నా ఈ కవితను ఓపికతో చదివిన 

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 

"విజయ దశమి"... శుభాకాంక్షలు...


19. ఉచ్చు...! ఆరని చిచ్చు...!


ఓ ప్రియా !

ఓ నా సఖియా !

నాడు నీ మెళ్ళో

మూడుముళ్లు పడగానే

ముక్కోటి దేవతలు

దీవించలేదా...? మనల్ని

ఆ సీతా రాముల్లలా...

ఆ పార్వతీ పరమేశ్వరుల్లా...

చిరకాలం ఆ చిలకా గోరింకల్లా...

చిరునవ్వులు చిందిస్తూ కడదాకా

"కలిసిమెలిసి " జీవించాలని...


కానీ నేడేమి జరిగింది

విధి ఓ "విషపు నవ్వు" నవ్వింది

ఇద్దరిని కోర్టులచుట్టు తిప్పింది

"విడాకులు" ముఖాన విసిరికొట్టి

విజయగర్వంతో మురిసిపోయింది


కారణం నాడు నా

బిగి కౌగిలిలో బంధీవై

స్వర్గంలో విహరిస్తూనే

ఏవేవో ఊహల్లో ఊరేగావు

కలతనిద్రలో కాపురం చేశావు

నన్ను "ఊబిలోనికి" త్రోశావు

నాకు "విడాకుల విషమిచ్చావు"

నేడు కక్కినదానికి ఆశపడే

"కుక్కతో  కులుకుతున్నావు"

ఓ ప్రియా !

ఓ నా సఖియా ! ఇది నీకు తగునా?

మూడో వ్యక్తి నీ మెడకు ఉచ్చు కాదా !

అది పచ్చని కాపురంలో ఆరనిచిచ్చు కాదా !

కాటికెళ్ళినా తీరదేమో కదా నీ కామదాహం..!


20. విషపు నవ్వులు"...?


ప్రియా !

ఓ నా సఖియా !

అనునిత్యం

నన్ను మురిపించే...

మురిపాలు పంచే...

నీ మూగ మనసెందుకో...

నేడు మౌనంగా రోదిస్తుంది?


నా మనసును ఉల్లాస పరిచే...

మత్తెక్కించే మంత్రాలు వల్లించే...

నీ సుమధుర గాత్రమెందుకో... నేడు

మౌనవ్రతం దాల్చి...మూగబోయింది?


నన్ను గాఢంగా ప్రేమించే...

చిరునవ్వులు చిందించే...నీ

చిలిపి పెదవులెందుకో...నేడు

చిగురుటాకుల్లా...వణుకుతున్నాయి?


నిన్న క్షణక్షణం

నా నామమే...జపించిన...

నా స్పర్శకై...తపించిన...నీ

తనువెందుకో... నేడు

దూరంగా దుప్పట్లో దూరి దుఃఖిస్తుంది?


నా కళ్ళకెందుకో..."నీ రూపు"

సుస్పష్టంగా కనిపించడం లేదు ?

నా కళ్ళు రెండు కన్నీటిధారలతో

నిండిపోయినందుకే...


నా హృదయమెందుకో...బ్రద్దలైంది?

నీవు "విషపు నవ్వులు" విసిరినందుకే...


ప్రియా ! ఓ నా సఖియా !

త్రాగాను నీ ప్రేమ "అమృతమని"...

త్రాగాక తెలిసింది అది "హాలాహలమని"...

నీవు"ప్రేయసివి"కాదని..."ప్రేతాత్మవని"...

నా ముందునిలుచున్న..."మృత్యువువని"...


తెలిసిందిప్పుడే"వన్ సైడ్ లవ్" "విషమని"...

దాని"ముగింపు"ఎప్పుడూ "విషాదమేనని"...


21. శిరసు వంచిన శిఖరం...!


ఓ నా ప్రియమిత్రమా ! 

అదిగో అంబరాన్ని చుంబించే

ఆ సుందర పర్వత శిఖరశ్రేణిని

తిలకించి తిలకించి పులకించిపోక

చింతించేవెందుకు ? వాటికి 

శిరసు వంచి నమస్కరించేవెందుకు ?

అవి నీకంటే "ఎత్తుగా" ఉన్నాయనే కదా !


కానీ ఒక "సాహసివై"

ఒక "సమరయోధుడివై"

పట్టువదలని ఒక "విక్రమార్కుడివై"

కసితో కృషితో చక్కని శిక్షణతో

పక్కా ప్రణాళికతో ప్రయత్నిస్తే 

ఆ శిఖరాల నరోధిహిస్తే

ఆ శిఖరాలే నీకు శిరస్సు 

వంచి నమస్కరిస్తాయి

కారణం అవి ఇప్పుడన్నది 

నీ కాళ్ళ క్రిందనే...

అవి దాసోహం అంటున్నది

నీ కృషికి నీ పట్టుదలకు 

నీ దృఢసంకల్పానికే...


22. కరుణించవమ్మా ! ఓ కనకదుర్గమ్మ ! 


సర్వమంగళ మాంగల్యే శివే 

సర్వార్థ సాధికే...శరణ్యే త్రంబకే 

దేవీ నారాయణి నమోస్తుతే...


తల్లీ ! ఓ తల్లీ ! ఓ మా కల్పవల్లీ ! 

కరుణించవమ్మా ! ఓ కనకదుర్గమ్మ ! 


ఈ శుభప్రదమైన...

ఈ అద్భుతమైన.. 

ఈ ఆనందకరమైన...

ఈ సుందరమైన...

ఈ శుభకరమైన...

ఈ మధురమైన...

ఈ మనోహరమైన...

ఈ మంగళకరమైన...

ఈ శుభదినాన... 

ఈ సుప్రభాతవేళ...


మా చింతలు చీకాకులు 

అగ్నిలో ధగ్దమైపోనియ్...


నిన్న కన్నీటి వరదలైన మా కంట 

నేడు ఆనంద భాష్పాలు రాలనియ్...


తరతరాలకు తరగని సిరిసంపదలు 

శాంతిసౌభాగ్యాలు మా ఇంట పొంగిపొర్లనియ్...


అంబరాన్నంటే సంతోష‌ సంబరాలతో

చిరునవ్వులతో మమ్ము చిందులు వేయనియ్...


సూర్యోదయమే ఎరుగక చితికిపోయిన 

మా చీకటి జీవితాలు సుఖశాంతులతో వర్థిల్లనియ్...


ఆకలి కేకలు...చిమ్మచీకటి తప్ప

వ్యాధులు...వ్యధలు...వేదనలు తప్ప 

చింతలు చీకాకులు...బాధలు భయాలు తప్ప 

విషాదమే తప్ప వినోదం వికాసం లేని మోడువారిన 

మా ఎడారి బ్రతుకుల్లో వేయివెన్నెలలను కురవనియ్...


తల్లీ ! ఓ మా చల్లని తల్లీ ! మా ఇంటి కల్పవల్లీ ! 

కరుణించి మమ్ము కాపాడవమ్మా ! ఓ కనకదుర్గమ్మ ! 

తల్లీ ! ఓ మా తల్లీ ! 

మీకు వందనాలు ! శతకోటి వందనాలు !


23. పోయేదేముంది? చెప్పండి...


నడవండి... 

ఉదయాన్నే "నడవండి"...

నడిస్తే పోయేదేముంది ? చెప్పండి 

మీ కొవ్వు కరగడం తప్ప... 

మీ ఆయుష్షు పెరగడం తప్ప...


కాస్త "వ్యాయామం చేయండి"...

చేస్తే పోయేదేముంది ? చెప్పండి 

మీకు ఆందోళన తొలగడం తప్ప...

మీలో ఆరోగ్యదీపం వెలగడం తప్ప...


నవ్వండి...

హాయిగా మనసారా "నవ్వండి"...

నవ్వితే పోయేదేముంది ? చెప్పండి 

మీ హృదయాలలో ఉల్లాసం...  

ఉత్సాహం ఉత్తేజం ఉప్పొంగడం తప్ప


అడిగిన వారికి "ఇవ్వండి"...

బ్రతుకు దారొకటి"చూపండి...

చూపిస్తే పోయేదేముంది ? చెప్పండి

చితికిన వారిజీవితాలు చిగురించడం తప్ప

గుండెల్లో గుడి కట్టి గుర్తుంచుకోవడం తప్ప


తుదిశ్వాస వరకు "పోరాడండి"... 

పోరాడితే పోయేదేముంది? చెప్పండి 

మీ బానిస బ్రతుకులు బాగుపడడం తప్ప


24. ధర్మో రక్షతి రక్షితః"...!


నేటి చీకటి శిలలేరా... 

రేపటి సుందర శిల్పాలు... 


నేటి రాతి గుండెలేరా... 

రేపటి నవనీతాలు....

సుందర నందనవనాలు...


నేటి రాళ్లలో రత్నాలు... 

మట్టిలో మాణిక్యాలేరా.. 

రేపటి విశ్వ విజేతలు... 

విశ్వశాంతి కపోతాలు...


నేడు గుండెలో రేగే మంటలేరా.. 

రేపు గుడిలో మ్రోగే గంటలు....


నేటి ఆకలి కేకలేరా... 

రేపటి ఆనందతాండవాలు...

 

నేడు గుండెలోన విషము 

గ్రక్కు కామ క్రోధ లోభ మోహ 

మద మాత్సర్యాలకు విరుగుడేదిరా...?

స్వార్థమను పిశాచి మదిన

దూరిన బ్రతుకంతా ప్రళయమేనురా...

మనిషిలో మానవత్వం మాయమౌనురా...


చేతిలో ధర్మం...

గుండెలో ధైర్యం...

భగవంతునిపై భక్తి...

నిండుగా మెండుగా ఉన్న 

చాలునురా...రేపటి 

నీ జీవన వినీలాకాశంలో  

రంగుల హరివిల్లులు విరిసేనురా...

ఎదలో పూలజల్లులు కురిసేనురా...

 

"ధర్మో రక్షతి రక్షితః"యని 

ధర్మజ్యోతిని చేబూనిన చాలునురా...

మనసే దివ్యమందిరమై వెలుగొందునురా...

మనిషే మహనీయుడుగా మారిపోవునురా..


25. చల్లని చూపుల వరాలజల్లు..!


కోవెలకెళ్ళి

కోనేటిలో స్నానమాడి

కోదండరామున్ని దర్శించి 

కోటి ఆశలతో భక్తులంతా

కోరుకునేది ఏమంటే...?


రోజంతా హృదయంలో 

ఉల్లాసం...ఉత్సాహం...

అనంతమైన ఆత్మతృప్తి...


ఆందోళన లేని క్షణాలు...

ఆనందం వైపు అడుగులు... 

గండాలు లేని ఘడియలు...

నిరాశతో నిండని నిమిషాలు..

గాయాలమయం కాని గంటలు... 


తడబడని నడక... 

ప్రశాంతతో కూడిన పడక...

కలవరపరచని కమ్మని కలలు...

రోగాలు రొస్టులు లేని రోజులు...


జీవితంలో శాంతి...

ముఖంలో తరగని కాంతి...

పెదవులపై చెరగని చిరునవ్వు... 


సుఖశాంతులు...సిరిసంపదలు...

భోగభాగ్యాలు...ఆరోగ్యఅష్టైశ్వర్యాలు...


ప్రశాంతతను ప్రసాదించే పూలపాన్పు...

కుంభకర్ణుడి కునుకు కర్ణుడి దాతృత్వం... 


మనసును ఊరడించే ఉత్తేజపరిచే...  

మరిచిపోలేని మధురమైన తీపిజ్ఞాపకాలు... 


చల్లని చూపుల వరాలజల్లు...

దీర్ఘాయుష్షు నిచ్చే దివ్యమైన దీవెనలు...

ఆపరమాత్మ ప్రేమ కరుణా కటాక్షవీక్షణాలు.. 


26. నిన్న కన్నుమూసిన మా కన్నతల్లి ?


ఎనబది ఏళ్ళనాడు...

నవమాసాలు మోసి... 

ప్రాణాలు ఫణంగా పెట్టి...

ప్రసవ వేదనను భరించి...

పండంటి బిడ్డలకు‌ జన్మనిచ్చి... 

ఆకలేస్తే పాలిచ్చి కడుపు నింపి... 

అనారోగ్యం పాలైతే ఆందోళన చెంది... 


నిత్యం మా మలమూత్రాలనెత్తివేసి... 

"ఒడిలో" ఉంచి ఊయల లూగించి...

"బడిలో" చేర్పించి అక్షరాలు దిద్దించి...మా

బంగారు భవిష్యత్తుకు బాటలు వేయించి...

కట్టుకున్న భర్త కన్ను మూసినా...

కూలినాలి చేసి మా క్షుద్బాధను తీర్చి... 


మండే గుండెలతో...మండుటెండల్లో... 

కొండలమీద...కండలు కరిగేలా...

బండలు మోసి...బ్రద్దలు చేసి...

కంటినిండా కునుకు లేకున్నా...

కడుపునిండా తిండి లేకున్నా...

అష్టకష్టాలు పడి...అప్పులు చేసి...


ఖరీదైన చదువులు చెప్పించి...

ఉన్నతమైన ఉద్యోగాలిప్పించి...

ఉన్నంతలో ఘనంగా పెళ్ళిళ్ళు చేసి...

అహర్నిశలు మా సంక్షేమాన్నే కాంక్షించి... 

కమ్మని కలలెన్నో కని నిస్వార్థంగా...

తన రక్తాన్ని స్వేదంలా చిందించి...

సమాజంలో మాకో ఉన్నతస్థానం కల్పించి...


ఏ ప్రతిఫలమాశించక...సర్వం త్యాగంచేసి... 

మా కోసమే...తన సంపూర్ణ జీవితాన్ని... 

ధారబోసిన... ఖర్చు చేసిన... 

కన్నుమూసి...ఖాళీచేతులతో కాటికెళ్ళిన...


ఆమె ఎవరు...? ఎవరో కాదు...నిన్న

కన్నుమూసిన మా"కన్నతల్లి"...మా"దేవత"...

మరణించిన...మా "ఇంటి మామిడి చెట్టు"... 

మా"కంటికి"దూరమైన మా"ఇంటివెలుగు"...


27. ఏడు గుణపాఠాలు...?


నాడు కరోనా కాలంలో 

మూతపడనివి"మూడు"...

బ్యాంకులు...

హాస్పిటల్స్...

శ్మశానాలు...


నాడు విధుల్లో వీధుల్లో 

మృత్యువుతో పోరాడిన 

వీరులు "ముగ్గురు"...

వైద్యసిబ్బంది...

పోలీసు సిబ్బంది... 

పారిశుద్ధ్య కార్మికులు...


మాయదారి కరోనా వచ్చి"నాడు"

మనకు నేర్పిన గుణపాఠాలు"ఏడు"...

1....నమస్కారమే గొప్ప సంస్కారమని...

2...పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదని...

3...నాది నాది అనుకున్నదేదీ నీదికాదని... 

4...రాత్రికి రాత్రే 

     రక్తసంబంధాలు రద్దౌతాయని...

5...ఈ సంబంధ బాంధవ్యాలేవీ 

     శాశ్వతం కాదని...

6...మృత్యువు ముందు 

     అందరూ సమానమేనని...

7...అపరకుబేరుడైనా 

    అంత్యక్రియల్లేని అనాధేనని...


28. నా కలం కుంటుంది ఓ కమ్మని కల...?


నా కవితలను ధగధగ 

మెరిసే బంగారు భావాల 

ఆభరణాలతో అలంకరించాలని... 


నా కవితల్లో

పచ్చదనం పండాలని...

అవి కరుణను కుమ్మరించాలని...  

ప్రేమకుసుమాలై గుభాళించాలని...


నా కవితల్లో భక్తి అనురక్తి 

అనంతమైన శక్తి దాగి ఉండాలని...


నా కవితలు 

ఇంపైన ఇంద్రధనస్సులని

రంగురంగుల రామచిలకలని

నా అక్షరాలు వెన్నెల్లో ఆడపిల్లలని


నా కవితల్లో 

సూర్యుని వెలుగుండాలని 

చంద్రుని చల్లదనముండాలని 

నా అక్షరాలు నక్షత్రాలై నవ్వాలని

నా కలం కుంటుంది ఓ కమ్మని కల...?


నా కవిత గలగలమని 

గోదారిలా పరవళ్ళు తొక్కాలని

నా ప్రతికవిత జలపాతమై 

జాతీయగీతమై పులకింపచేయాలని 

మనసులను పరవశింపచేయాలని 


నా కవితలు కమ్మని కలలై

అందమైన అలలై అలరించాలని... 

దివ్యమైన దేవతాశిల్పాలై దీవించాలని...

నా కలం కుంటుంది ఓ కమ్మని కల...?


తింటే హైదరాబాద్ 

దమ్ బిర్యానే...తినాలని 

కొంటే పట్టు చీరలే...కొనాలని

వింటే మహాభారతమే...వినాలని 

చూస్తే బాహుబలి చిత్రమే...చూడాలని 

చదివితే నా కమ్మని కవితలే...చదవాలని

నా కలం కుంటుంది ఓ కమ్మని కల...?


ఓ నా కలమా..! ఓ నా ప్రాణమా..!

నీ కోరిక తీరాలంటే నీ కల నెరవేరాలంటే...

"ఆలోచనామృతంలో" స్నానం చేయాలి... 

"అక్షరాల అమ్మ"చేతి వరాలను పొందాలి... 


29. కారైనా...కనక సింహాసనమైనా...?


అహంకారంతో 

విర్రవీగే ఓ వెర్రివారలారా !

మిడిమిడి జ్ఞానంతో 

మిడిసిపడే ఓ మిడతలారా !

ఉన్నదంతా తృప్తిచెందని ఓ ఉడతలారా !


గగనాన విహరించే గంధర్వుడైనా

నేడో రేపో నేలపైకి దిగిరాక తప్పదు 

గాలిలో ఎగిరే గాలిపటమైనా 

దారం తెగక తప్పదు 

నేడో రేపో నేలరాలక తప్పదు 

ఈ భువిలో జన్మించిన ఏ జీవియైనా 

కన్నుమూయక తప్పదు 

కనుమరుగైపోక తప్పదు 


మొన్న కొన్న ఖరీదైన కొత్త కారుతో  

మీరు పొందిన ఆత్మతృప్తి

మీకు అందిన గౌరవం అనంతం  

గర్వంతో మీరు విర్రవీగిన రోజులెన్నో  


కానీ ఏమైంది కాలచక్రం గిర్రున తిరిగింది 

నిన్నకొన్న ఆ కొత్తకారు నేడు చెత్తకారైంది 

 ఇంటి ముందరే ముళ్లపదల్లో పడి వుంది 


నిజానికి నిన్నది క్లాసే...నేడది చెల్లని కాసే...


ఔను కదిలే కాలమే కన్నెర్ర చేస్తే... 

విధియే విషపునవ్వు నవ్వితే...

గ్రహాలే గతితప్పితే... 

ప్రకృతియే పగబడితే... 

నరుడి బ్రతుకు నరకమే...

ఇదెవరూ కాదనలేని పచ్చినిజమే...

రేపు కారే కాదు కనకసింహాసనమైనా... 

కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమే...


30. బతుకమ్మ వేడుకలు....

తొమ్మిది రోజుల" బతుకమ్మ పండుగ...


గునుగు...తంగేడు...బంతి... 

చామంతి...నందివర్ధనం...

తీరొక్క పూలతో....

తెలంగాణ...సంస్కృతి 

సంప్రదాయాలకు ప్రతీకగా...

వెయ్యి ఏళ్ళుగా...

జరుపుకునే...పూలపండుగే 

ఈ "తొమ్మిది రోజుల" బతుకమ్మ పండుగ...


రంగురంగుల పూలసృష్టి ఆపరమాత్మది

పూలనే దేవతలుగా భావించి పూజించేది

నా తెలంగాణా తెలుగింటి ఆడపడుచులు

నాటి నిజాం నవాబుల భూస్వాముల 

పెత్తందారీల దాష్టీకానికి అకృత్యాలకు బలై

వారి కబంధహస్తాలలో పువ్వుల్లా 

నలిగిపోవడం ఇష్టం లేక ఆత్మహత్యలు 

చేసుకున్న ఆడపడుచుల ఓదార్పు పండుగే

ఈ "తొమ్మిది రోజుల" బతుకమ్మ పండుగ


త్రికోణాకారంలో పూలతో గౌరీ దేవిని పేర్చి

చుట్టూ వలయాకారంలో ఆడపడుచులు చేరి 

చప్పట్లతో జానపద గీతాలతో ఆడుతూ పాడుతూ

 సాంప్రదాయ‌ నృత్యాలు చేస్తుంటే 

సంబరాలు అంబరాన్ని తాకే ప్రకృతి పండుగే  

ఈ "తొమ్మిది రోజుల" బతుకమ్మ పండుగ 


మొదటిరోజు...వేడుకలో

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"ఎంగిలి పూల" బతుకమ్మ...ఉయ్యాలో


రెండవరోజు...వేడుకలో 

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"అటుకుల" బతుకమ్మ....ఉయ్యాలో


మూడవరోజు...వేడుకలో 

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"ముద్దపప్పు" బతుకమ్మ...ఉయ్యాలో


నాలుగవ రోజు...వేడుకలో 

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"నాన బియ్యం" బతుకమ్మ...ఉయ్యాలో


ఐదవ రోజు...వేడుకలో 

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"అట్ల" బతుకమ్మ...ఉయ్యాలో


ఆరవ రోజు...వేడుకలో 

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"అలిగిన" బతుకమ్మ...ఉయ్యాలో


ఏడవరోజు...వేడుకలో 

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"వేపకాయల" బతుకమ్మ...ఉయ్యాలో


ఎనిమిదవ రోజు...వేడుకలో 

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"వెన్నముద్దల" బతుకమ్మ...ఉయ్యాలో


తొమ్మిదవ రోజు...వేడుకలో 

బతుకమ్మ బతుకమ్మ...ఉయ్యాలో 

"సద్దుల" బతుకమ్మ...ఉయ్యాలో...అంటూ 


పట్టుచీరలు కట్టిన ఆడపడుచులంతా 

వలయాకారంలో తిరుగుతూ 

వీధులన్నీ మారుమ్రోగిపోయేలా

కమ్మని జానపదగీతాలతో 

చప్పట్లతో ఆడిపాడి అలసిపోయి

ఏ చెరువులోనో ఏ బావిలోనో

"బతుకమ్మను" నిమజ్జనం చేసి

తమను తమ

కుటుంబాన్ని దీవించమని...

కష్టాలు కన్నీళ్లు తొలిగించమని...

చీకటిజీవితాలను వెలిగించమని...

సుఖశాంతులను ప్రసాదించమని...

కోటిఆశలతో బతుకమ్మను కోరుకుంటారు

రుచికరమైన నైవేద్యాలతో వేడుకుంటారు 


31. నా కలం కుంటుంది ఓ కమ్మని కల... 


నా కవితలను ధగధగ 

మెరిసే బంగారు భావాల 

ఆభరణాలతో అలంకరించాలని... 


నా కవితల్లో

పచ్చదనం పండాలని...

అవి కరుణను కుమ్మరించాలని...  

ప్రేమకుసుమాలై గుభాళించాలని...


నా కవితల్లో భక్తి అనురక్తి 

అనంతమైన శక్తి దాగి ఉండాలని...


నా కవితలు కమ్మని కలలై

అందమైన అలలై 

అందరినీ అలరించాలని..


నా కవితలు 

ఇంపైన ఇంద్రధనస్సులని

రంగురంగుల రామచిలకలని

నా అక్షరాలు వెన్నెల్లో ఆడపిల్లలని


నా కవితల్లో 

సూర్యుని వెలుగుండాలని 

చంద్రుని చల్లదనముండాలని 

నా అక్షరాలు నక్షత్రాలై నవ్వాలని

నా కలం కుంటుంది ఓ కమ్మని కల...?


నా కవిత గలగలమని 

గోదారిలా పరవళ్ళు తొక్కాలని

నా ప్రతికవిత జలపాతమై 

జాతీయగీతమై పులకింపచేయాలని 

మనసులను పరవశింపచేయాలని 


తింటే హైదరాబాద్ 

దమ్ బిర్యానే...తినాలని 

కొంటే పట్టు చీరలే...కొనాలని

వింటే మహాభారతమే...వినాలని 

చూస్తే బాహుబలి చిత్రమే...చూడాలని 

చదివితే నా కమ్మని కవితలే...చదవాలని

నా కలం కుంటుంది ఓ కమ్మని కల...?


32. ఈ అక్షర ఋణం...తీరేదెలా?


ఉదయమా..! ఓ ఉదయమా..!

మా మెట్రో ఛైర్మన్ లక్ష్మీ నారాయణ 

గారి "అమృత హృదయమా"..! 


ఉదయమా..! ఓ మా హృదయమా..! 

కనువిందు చేసే "కవితోదయమా"..!

మదిని దోచే "మలయమారుతమా"..!


ఉదయమా..! ఓ మా హృదయమా..!

కవులపాలిటి "కల్పవృక్షమా"..! 

కవయిత్రులకు "కార్తీక దీపమా"..!

 

ఉదయమా..! ఓ మా హృదయమా..!

కవులను ప్రోత్సహించే

ఓ "రాయల వారసత్వమా"..!

ఔత్సాహిక కవులను

ఆదరించే ఓ "అభయహస్తమా"..!


ఉదయమా..! ఓ మా హృదయమా..!

కమ్మని కవితల "కాసులహారమా"..!

మమతల "మామిడి తోరణమా"..!


ఉదయమా..! ఓ మా హృదయమా..!

విరబూసే కవితాకుసుమాల 

సుందర "సాహితీ వనమా"..!

నిత్యం మేము తిలకించి 

పులకించిపోయే ఓ "సాహితీ క్షేత్రమా"..! 

కమనీయమైన రమణీయమైన

కవితలతో పలకరించే "ప్రేమపుష్పమా"..!


ఉదయమా ! మా హృదయమా..!

కనువిందు చేసే ఓ కవితోదయమా...! 

కవుల కడుపు నింపే "అక్షరధాతవో"... 

కలల్ని సాకారం చేసే "అక్షయపాత్రవో"...

ఎవరివో నీవెవరివో నీకు "అక్షరాభిషేకం"...

చెప్పుమా..! చెప్పుమా..!

నీఈ "అక్షరఋణం" తీరే దగ్గరి దారేది ?


శేఖరా ! ఓ పోలయ్య కవి శేఖరా !

వలదు సందేహం విను నా సందేశం... 

ధనవంతులందరూ "దాతలు" కారు

కానీ దాతలందరూ...

"ధన్యజీవులే" "పుణ్యమూర్తులే" 


కలం పట్టి...

కలలు కంటూ... 

కమ్మని కవితలల్లే...

కవులందరూ కరుణామయులే...

దయార్థ హృదయులే దాతలే ధర్మదాతలే... 

 

అందరూ సహృదయంతో సకాలంలో ...

స్పందిస్తే...చాలు 

"ఆవగింజంత ఆర్థిక సహాయం"...

అందిస్తే...చాలు అదే మాకు 10,000....


33. ఎందుకు పుట్టావయ్యా బాలయ్యా?


అమృతం నిండిన...

మీ గానమాధుర్యంతో... 

మీ గంభీరమైన గాత్రంతో... 

ఆబాలగోపాలాన్ని అలరించి ఈ

తెలుగుజాతికి"ఖండాంతర ఖ్యాతిని" 

ఆర్జించి పెట్టడానికా?


ఎందుకు పుట్టావయ్యా బాలయ్యా ?

ఎందరో ఔత్సాహిక 

గాయనీ గాయకులకు...

కొత్త జీవితాలను ప్రసాదించి వారి కుటుంబాలకు "కులదైవమై" నిలిచి పోవడానికి ?... ఔను అసలు 


ఎందుకు మరణించావయ్యా బాలయ్యా ?

ఆ దుర్వార్త విని దూరదర్శన్ దుఃఖించింది

తెలుగు చలనచిత్రసీమ శోకసముద్రమైంది

మీ మరణం... 

మాకొక "పరమసత్యాన్ని" ప్రబోధించింది...

మీరు మాకు భౌతికంగా దూరమైనా... 

నిత్యం టీవీఛానెల్లో ప్రత్యక్షమౌతారని...

మీ "సుందరరూపం" 

మా కనులకు కనిపిస్తుందని... 

మీ "సుమధుర గాత్రం" 

మా వీనులకు వినిపిస్తుందని....


మీ మరణం...

మాకొక "ప్రశ్నగా" మిగిలిపోయింది...ఔను 

ఎన్నో వేల "భక్తిగీతాలను" ఆలపించిన 

మీ కంచుకంఠాన్ని కాటువేసే 

ఆ కరోనా మహమ్మారిని

ఏ "ఒక్కదైవం" కూడా"శిక్షించలేదు"

ఆ కాలసర్పంనుండి మిమ్మల్ని"రక్షించలేదు" 

ఎందుకో ఏమో...అందుకే 


మీ మరణం... 

మాకొక "జీవితసత్యాన్ని" ప్రబోధించింది

ఈ జీవితం ఒక జగన్నాటకమని...

అందులో మనమంతా పాత్రధారులమని...

మన తలరాతల్నివ్రాసే బ్రహ్మే సూత్రధారని...

జననమరణాలు ఆపరమాత్మ ఆధీనమని...


34. స్పూర్తి ప్రదాత మన సురవరం


తెలంగాణ గడ్డపై 

పుట్టిన "తెలుగు బిడ్డ" 

రాజకీయనేత...

యువతకు"స్పూర్తిప్రదాత" 


తెలుగు‌ హిందీ ఉర్దూ 

సంస్కృతం ఫారసీ‌ 

ఆంగ్లభాషల్లో...

పట్టు సాధించిన"దిట్ట"


గోల్కొండ పత్రిక 

భారతి సాహిత్య పత్రిక

ప్రజావాణి పత్రికల...

"సంపాదక శిఖామణి"


తెలంగాణ ప్రజల 

కన్నీటిగాథలకు 

కరిగిన సురవరం 

కలంచెక్కిన "ప్రతిఅక్షరం"వారి 

పాండిత్యానికి "ప్రత్యక్షసాక్ష్యం"


తన కలంకత్తితో నిజాం 

నిరంకుశపాలనను వ్యతిరేకించిన 

ఉక్కుమనిషి...ఉద్యమకారుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి... 


తెలుగు భాషకై కృషి చేసిన పరిశోధకుడు...

బహుభాషా కోవిదుడు...

కేంద్ర సాహిత్య అకాడమి"అవార్డు గ్రహీత"


తెలంగాణలో కవులు లేరన్న 

నిందా వ్యాఖ్యలకు నిరసనగా 

354 మందితో గోల్కొండ 

కవుల సంచిక తెచ్చిన"వైతాళికుడు"


శాసనసభ్యుడిగా 

అఖండ ఖ్యాతినార్జించి 

ట్యాంక్ బండ్ పై 

విగ్రహమై వెలసిన వీరుడు

తెలంగాణ ప్రజలగుండెల్లో 

"ఆరనిదీపమై'"

వెలిగే మన‌ "సురవరం" 

తెలుగుజాతికి ఒక "గొప్పవరం" 

తెలుగుతల్లి మెడలో మెరిసే 

ఓ "ముత్యాలహారం"

ఆ అమరజీవికి... 

ఆ త్యాగమూర్తికిదే 

నా "అక్షరనీరాజనం"


35. జ్ఞానముద్ర...యోగనిద్ర...?


ఆశలు రేపే... 

అమృతం కురిపించే...

ఆకలి తీరని మీ అధరాలపై  

చిత్రించాలి చిత్రించాలి..."ప్రేమముద్ర" 


కామ క్రోధ లోభ మోహ మద... 

మాత్సర్యాలను త్యజించే...

మీ హృదయాంతరాలలో...

చిత్రించాలి చిత్రించాలి..."శాంతిముద్ర" 


జ్ఞానం కోసం జపించే... 

విజ్ఞానం కోసం తపించే...

అహర్నిశలు అన్వేషించే...మీ మేధస్సుపై 

చిత్రించాలి చిత్రించాలి..."జ్ఞానముద్ర"


ఆరోగ్యం కోసం... 

దీర్ఘాయుష్షు కోసం...

సుఖశాంతుల కోసం...

నిత్యం శారీరక శిక్షణతో శ్రమతో

వ్యాయామంతో అలసిన మీ దేహాలపై

చిత్రించాలి చిత్రించాలి..."ధ్యానముద్ర"


మీ గత చరిత్ర 

ఎంతో ఘనమైనదని... 

ఆదర్శవంతమైనదని... 

మీ జీవితాలు ముందుతరాలకు  

గొప్ప గుణపాఠమని...చరిత్రపుటల్లో 

చిత్రించాలి చిత్రించాలి..."మీ పాదముద్ర"


శ్వాస మీద ధ్యాస కోసం...

నిశ్చలమైన మనస్సుకోసం...

ప్రశాంతమైన జీవనం కోసం...

ప్రకృతి మీద ఆధిపత్యం కోసం...

అతీంద్రియశక్తుల ఆవాహన కోసం...

ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాల నియంత్రణకోసం... 

సంధించాలి ఒకేఒక్క ఆయుధం"యోగనిద్ర"


36. గౌరవిస్తాం..! ఘనంగా సత్కరిస్తాం..!


మనం కొందరిని అభిమానిస్తాం...

ప్రేమిస్తాం గౌరవిస్తాం పూజిస్తాం...

ఎవరైనా మన కంటికి కనిపిస్తే

చిన్నగా చిరునవ్వు విసురుతాం...


కొందరిని ప్రేమగా పలకరిస్తాం... 

కొందరికి నమస్కారం చేస్తాం... 

కొందరికి షేక్ హ్యాండ్ యిస్తాం... 

కొందరిని ఆలింగనం చేసుకుంటాం...


కొందరిని భుజాలపై మోస్తాం...

కొందరికి పూలదండలు వేస్తాం...

కొందరిని గజమాలతో గౌరవిస్తాం... 

కొందరికి పాదాలకు నమస్కరిస్తాం...

కొందరికి సాస్టాంగనస్కారం చేస్తాం...


బాణాసంచా కాలుస్తాం...

డప్పుల మోతలతో 

ఆట పాటలతో కీర్తిస్తాం...

సభలు సమావేశాలు పెట్టి 

భాజా భజంత్రీలతో ఘనంగా 

సన్మానిస్తాం...సత్కరిస్తాం...


పూలతో పూజిస్తాం...

పాలతో పాలాభిషేకం చేస్తాం...

తలపై కిరీటం పెడతాం...

చేతికి ఉంగరం పెడతాం...

మెళ్ళో బంగారుహారం వేస్తాం...


కాలికి గండెపెండేరం తొడుగుతాం...

ఊరంతా పూలరధంలో ఊరేగిస్తాం...

అభిమానంతో "పూలవర్షం" కురిపిస్తాం...


కానీ

వారే "తప్పులు" చేస్తే 

"చెప్పులు" విసురుతాం...

నిరసిస్తాం "నిప్పులు" కురిపిస్తాం...

బురద జల్లుతాం...బుద్ది చెబుతాం...

"దిష్టి బొమ్మను" వీధిలో దగ్దంచేస్తాం...

పరువు ప్రతిష్టలను..."సమాధి" చేస్తాం...


ఇది మానవనైజం...

నచ్చితే ఆకాశానికి...ఎత్తేస్తాం...

నచ్చకపోతే అధఃపాతాళానికి తొక్కేస్తాం...


37. నమ్మితే నరకం స్వశక్తియే స్వర్గం 


ఆరని ఆశలకు...

ఆగని కన్నీళ్లకు

తీరని వ్యధలకు...

తరగని బాధలకు

ఆ భగవంతున్ని 

నిత్యం నిందిస్తూ...

అప్పులే...ఆస్తులుగా... 

వ్యసనాలే...వ్యాధులుగా... 

సమస్యలే...సంకెళ్ళుగా.... 

అడుగడుగున గండాలతో... 

సుఖదుఃఖాల సుడిగుండాలతో... 

అతుకుల గతుకుల బ్రతుకు 

జట్కాబండినీడ్చే ఓ బడుగుజీవులారా...!

ఓ మధ్యతరగతి మహరాజులారా...!

తెలుసుకోండి...ఒక్కనిజం తెలుసుకోండి..!


దారం లేక "దండ" లేదని...

సూర్యుడు లేక "ఎండ" లేదని... 

మట్టి లేక "కుండ" లేదని...

కుండ లేక "తిండి" లేదని... 

తిండి లేక "కండ" లేదని...

"కష్టేఫలి" అన్న నినాదాన్ని

కలనైనా మరువరాదని...

"నేతలను"నమ్మిన నరకమని... 

"స్వశక్తియే" స్వర్గమని...


మీ "ఓటే" మీకు వజ్రాయుధమని...

ఎన్నికల్లో తిరుగులేని తీర్పునిచ్చి

మీరే నేతల తలరాతల్ని మార్చవచ్చని... 

మహామహులనే మట్టి కరిపించవచ్చని...

మీ నిండుజీవితాలలో మీరే 

"పండువెన్నెలలను"కురిపించుకోవచ్చని...

తెలుసుకోండి...ఒక్కనిజం తెలుసుకోండి...


38. అంబేద్కర్ అమృత సందేశం ?


ఓ నా దగాపడ్డ దళిత బిడ్డలారా!

ఓ నా బహుజన బంధువులారా !

ఓ నా భరతమాత ముద్దు బిడ్డలారా! 

ఎవరైనా...మీ శత్రువులు 

మీ "తోక" త్రొక్కితే పర్వాలేదు 

కానీ మీ "పీక" నొక్కితేనే ప్రమాదం 


మీరు 

మృత్యుంజయులై...

తోక త్రొక్కిన త్రాచులై...

కస్సు బుస్సుమనవచ్చు...

కాటు వేయవచ్చు...ఖతం చేయవచ్చు... 


ఔను వారు ప్రేమతో నవ్వుతూ నటిస్తారు

వారే మీకు దైవాలన్న భ్రమను కలిగిస్తారు

వెయ్యి తరాలకైనా సూర్యోదయం రాకుండా

ఊపిరాడని ఊబిలోకి మిమ్మల్ని నెట్టేస్తారు 

అదఃపాతాళానికి మిమ్ము అణగద్రొక్కుతారు

 

వారు మిమ్మల్ని ...

విద్యకు...

విజ్ఞానానికి...

ఆర్థిక వనరులకు...

ఆయుధ సంపత్తికి...

ఆమడదూరంగా ఉంచి... 


మీరెక్కడ 

వీరులౌతారోనని...

విజ్ఞానవంతులౌతారోనని...

ఆచారాలను అడ్డుకుంటారోనని...

తిరుగుబాటు చేస్తారోనని...

ప్రశ్నిస్తారోనని...

ప్రతిఘటిస్తారోనని... 

ప్రాణాలు తీస్తారోనని...భయంతో 

మీ తలపైకెక్కి తాండవమాడుతారు 

తస్మాత్ జాగ్రత


మరి మీలో మార్పు ఎప్పుడు?...


మీకు కనువిప్పు కలిగినప్పుడు...

మీలో చైతన్యజ్వాల రగిలినప్పుడు...

ఉరికంబాలనైన ముద్ధాడేందుకు సిద్దమై 

యువకిషోరాలై మీరు పోరాడినప్పుడు...

మీలో మేధోమథనం మొదలైనప్పుడు...

మీరు కార్చే కన్నీటి విలువ‌ మీకు తెలిసినప్పుడు...


మీ బానిస బ్రతుకుల నుండి 

మీకు విముక్తి ఎప్పుడు?


వారి కబంధ హస్తాల నుండి 

మీరు బయట పడినప్పుడు...

సంఘంలో సమానత్వం సౌభ్రాతృత్వం 

ఒక్కవిద్యద్వారానే 

సాధ్యమన్న ఓ నగ్నసత్యాన్ని 

మీరంతా గ్రహించినప్పుడు...

ఉక్కుపిడికిలి బిగించి 

మీరంతా ఉద్యమించినప్పుడు...

రక్తతర్పణకైనా మీరు సిద్దమైనప్పుడు...

అమరజీవి అంబేద్కర్ 

ఆఖరి ఆశయమైన...తీరని కలయైన...

ఆ "బహుజన రాజ్యాన్ని" 

మీరు సాధించినప్పుడు...జై భీమ్ 


39. పక్షి పిల్ల పడుచు పిల్ల 


రెక్కలొచ్చిన ఏ "పక్షి"

ఎగరక మానదు...ఎగిరి 

ఆకాశంలో హాయిగా 

తిరగక మానదు...తిరిగి తిరిగి 

ఆకలేసి నేలపై 

వాలకమానదు...వాలి 

తీయనైన మత్తు గింజల్ని 

తినక మానదు...తిని 

నక్కినక్కి తిరిగే వేటగాడు 

విసిరిన వలలో చిక్కి 

గిలగిల కొట్టుకోక మానదు 

గింజుకోక మానదు...అలాగే 


పాలలా వయసు 

పొంగిన "పడుచు పిల్ల"

హాయిగా రంగులలోకంలో 

విహంగంలా 

విహరించకమానదు...విహరిస్తూ 

పగటి కలలు కనకమానదు...కంటూ 

ఇంటర్నెట్లో 

ఇరుక్కోక మానదు...ఇరుక్కుని 

చాటింగ్ అంటూ చీటింగ్ చేసే 

మాయలోడి మాటలు నమ్మి 

"ప్రేమలోయలో పడి" 

విలవిలలాడక తప్పదు 

విలపించక తప్పదు 


ఔనిది పచ్చినిజం 

"పక్షిపిల్లైనా" 

"పడుచు పిల్లైనా" 

"స్వేచ్ఛ ఇస్తే" రెచ్చిపోయి 

పిచ్చిపిచ్చిగా బరితెగించి 

తిరిగితే బ్రతుకు బలి కాక తప్పదు


40. గూగులమ్మే అందరికి గురువాయె...


గురు బ్రహ్మ గురు విష్ణుః 

గురుదేవో మహేశ్వరాః 

గురుసాక్షాత్ పరబ్రహ్మ 

తస్మై శ్రీ గురువేనమః అన్నారు పెద్దలు 


తాము నేలమీదున్నా తమ విద్యార్థులు 

విదేశాల్లో విమానాల్లో విహరించాలని

విశ్వవిజేతలు కావాలని కలలు కనేది

ఆ కలలే నిజమై విద్యార్థులు 

డాక్టర్లు కలెక్టర్లు కంప్యూటర్ ఇంజనీర్లైతే...

రాజ్యాలనేలే రాజకీయ నేతలైతే ....

గురువులను మించిన శిష్యులైతే...


ఉప్పొంగి పోయేది 

గురువులగుప్పెడు మనసే...

"ధీర్ఘాయుష్మాన్ భవా" అంటూ 

"దీవెనలవర్షం" కురిపించేది

ఆ గురుబ్రహ్మలే... కానీ


అట్టి గురువులే నేడు కరువాయే...  

ఆ గూగులమ్మే అందరికి గురువాయే...

నేడన్నీఆన్లైన్లో చదువులాయె...విజ్ఞతకు 

విధేయతలకు విద్యార్థులు దూరమాయె...


ఖరీదైన కార్పోరేట్ చదువులే దిక్కాయె...

నేడు పిల్లలకు తల్లిదండ్రులకు 

విద్య బహు భారమాయె...

బ్రతుకు ఘోరమాయె...


మన పాలకులు అంధులాయె...

భవిష్యత్ అంతా అగమ్యగోచరమాయే...

ప్రతిభావంతులకు విద్య అందని ద్రాక్షాయె...

అక్షరాలను నమ్మిన గురువుల 

జీవితాలు అంధకార‌బంధురమాయె...

నీతి కథలు బోధించే గురువులే

నీతి తప్పి నీచకృత్యాలకు పాల్పడేవేళ

విద్యా వ్యవస్థ విషతుల్యమాయే...ఔను 


పటిష్టమైన విద్యాచట్టాలు పుట్టేదెప్పుడో..!

సంకుచిత భావాలకు సమాధికట్టేదెప్పుడో..!

సంస్కరణలకు శ్రీకారం చుట్టేదెప్పుడో...!

విద్యాకుసుమాలు వికసించేదెప్పడో...!


41. మొగల్తూరు మహారాజ్ అమర్ రహే...


విజయనగర సామ్రాజ్య 

క్షత్రియ రాజవంశంలో... 

పశ్చిమగోదావరి జిల్లా 

మొగల్తూరులో జననం... 

బాల్యంలో గుర్రపుబండిలో 

బడికెళ్లిన సంపన్నుల బిడ్డ... 

సహధర్మచారిణి శ్రీమతి శ్యామలాదేవి... 

ముత్యాల్లాంటి ముగ్గురాడపిల్లలు 

ప్రసీద...ప్రకీర్తి...ప్రదీప్తి...ల కన్నతండ్రి...


"ఆంధ్రరత్నా" పత్రికలో జర్నలిస్టు...

"రాయల్ ఫోటో స్టూడియో" "నిర్మాత".... 

గోపికృష్ణ మూవీస్ "అధినేత" 

శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 

"చిలకా గోరింక" చిత్రంతో 

సినీరంగంలో ప్రవేశించి...

శ్రీ "నారాయణరావు" గారిచే శిక్షణ పొంది 

188 చిత్రాల్లో సాంఘిక పౌరాణిక చారిత్రక 

జానపద పాత్రల్లో అపూర్వ నటనను

ప్రదర్శించిన "విలక్షణమైన నటుడు"...

 

గోపికృష్ణ మూవీస్ సొంత బ్యానర్ లో 

"కృష్ణవేణి...భక్తిరస చిత్రం భక్తకన్నప్ప... 

బొబ్బిలి బ్రహ్మన్న"చిత్రాలు నిర్మించి... 

రౌద్రం...కరుణ రస పాత్రలను అద్భుతంగా 

పోషించి... ప్రేక్షకులచే జేజేలందుకున్న...  

"సాటిలేని మేటి నటుడు" "రెబల్ స్టార్'"

"తెలుగు తెర రారాజు" మన కృష్ణంరాజు 


చిత్ర నిర్మాతగా...

విలక్షణమైన నటుడిగా...

గోపికృష్ణ మూవీస్ అధినేతగా...

అటు సినిమారంగంలో... 


రాజకీయ నాయకుడిగా... 

అటల్ బిహారీ వాజపేయి 

మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా...

ఇటు రాజకీయాల్లో.... 

వారు చేసిన సేవలు చిరస్మరణీయం...

 

మనసున్న మహారాజు... 

అందగాడు అందరివాడు... 

మంచితనానికి మారుపేరు... 

ఆరడుగుల ఆజానుబాహుడు... 

అజాతశత్రువు ఆపద్బాంధవుడు...

శ్రీ కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని...

ఆ పరమ శివున్ని ప్రార్ధిస్తూ...

వారి కుటుంబసభ్యులకు...

ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ...

అశృనయనాలతో ఇదేనా అక్షరనీరాజనం...


జోహార్....జోహార్ ...రెబల్ స్టార్...

అమర్ రహే...అమర్ రహే... 

మొగల్తూరు మహారాజ్...


42. జింక...మదిలో...ఏదో శంక...?


అప్పటిదాకా... 

పచ్చని ఆకులు మేసే 

"జింకపిల్ల"ఒక్కసారి ఉలిక్కి పడింది... 

జింక మదిలో "ఏదోశంక" మొదలైంది

భయంభయంగా దిక్కులు చూస్తుంది 

పెనుప్రమాదమేదో ముంచుకొచ్చింది 

తన ప్రాణాలను తీసేందుకు అది

పొదలమాటున "ఆకలిగొన్నపులి"

"అడుగుల సవ్వడి" కావచ్చు...


అప్పటి దాకా... 

గడ్డిలో గింజలు తింటూ 

గంతులు వేస్తూ ఆనందంగా 

పరమానందంగా తల్లితో ఆడుకునే 

"కోడిపిల్ల'" ఒక్కసారి ఉలిక్కి పడింది...

తల్లికోడి మదిలో "ఏదోశంక" మొదలైంది

ఆకాశంలో మృత్యువల్లె

గ్రద్ద ఒకటి ఎగురుతోంది 

తక్షణమే పిల్లల్ని రెక్కలక్రింద దాచుకుని 

గ్రద్దతో యుద్ధానికి సిద్ధమౌతుంది తల్లికోడి


అప్పటిదాకా... 

తీయతీయని మాటలతో 

చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి  

మాయమాటలు చెప్పి మత్తుచల్లి 

ముద్దడిగితే ఇచ్చి మురిసిపోయే 

"అమాయకపు ఆడపిల్ల" 

ఒక్కసారిగా ఉలిక్కిపడింది 

కారణం...ఒక్కటే

కామాంధుడి కళ్ళు తన మీద పడడమే

కాటు వేయటడానికి వాడు సిద్ధపడడమే


అప్పటిదాకా... 

భర్త కబంధహస్తాలలో 

స్వర్గాన్ని రుచి చూసే 

"భార్యామణి" 

ఒక్కసారిగా ఉలిక్కిపడింది

కారణం...ఒక్కటే 

కలలో మూడోవ్యక్తి ప్రత్యక్షమై...

ముసిముసి నవ్వులు నవ్వడమే...

కలతనిద్రలో సైతం కలవరపెట్టడమే...


కానీ...

భయపడితే....

బ్రతుకు నరకమే...

తెలిసి తప్పుచేస్తే... 

పచ్చని కాపురంలో సైతం... 

కారుచిచ్చు రేగడం ఖాయమే....

ప్రయత్నిస్తే...కసిగా కృషి చేస్తే...

ప్రతిసమస్యకు పరిష్కారం సాధ్యమే...

సాహసంచేస్తే అందుతుంది ఆ స్వర్గమే...


43. సాధనతో సర్వం సాధ్యమే..!


ఆహా ! ఓహో !

ఔరా ఇదేమి ?

వింత ఎక్సర్సైజ్ 

ఊహకందకున్నది...

నమ్మశక్యం కాకున్నది...


అద్భుతం...మహా అద్భుతం...

 ఆశ్చర్యకరం...అనితరసాధ్యం...

ఏమి సాధన ! ఎంతటి శిక్షణ ! 

"అసాధ్యాన్ని సుసాధ్యం" 

చేసిన అఖండుడు...


"సాధన చేయుమురా 

నరుడా సాధ్యము కానిది లేదురా"...

అన్నాడో కవి ...


నిజమే "యోగవిద్యతో" 

"మనసును" నియంత్రించవచ్చు కానీ "

ఎముకల గూడును"

ఇలా "ఇంద్రధనుస్సులా" వొంచడం...

 "నియంత్రించడం"...ఎవరికి సాధ్యం ? 


అది "కఠోరమైన దీక్షతో "

సుశిక్షితులైన ట్రైనర్ల దగ్గర

"శిక్షణ" పొంది నిరంతరం

సాధన చేసే కొందరికే సాధ్యం...


44. వక్రబుద్ధి...వంకర చూపులు


ఓ ప్రియా ! 

ఓ నా సఖియా !

నిన్న నా గుండెగూటిలో

దూరి గుసగుసలాడి

గుబులు రేపిన "గువ్వవు" నీవు 

నేడు ఆ గుండెల్లోనే 

ఆరని మంటలు 

రేపుతున్న "అగ్గిరవ్వవు" నీవు 


నిన్న నాలో 

కోటి ఆశలు రేపిన

నీ "అందం ఒక మకరందం"

నేడది నాకు "పరమ దుర్గంధం" 


నిన్నటి రోజు 

ఆ చీకటి గదిలో 

నీ చిరునవ్వులు

నీ చిలిపి చేష్టలు 

నీ చిలకపలుకులు

"గుభాళించే గులాబీలు"

"మత్తెక్కించే మరుమల్లెలు"


నేటి నీ "వక్ర బుద్ధి" 

పచ్చని మన కాపురాన

"నిందల నిప్పులు" పోసింది 

నేటి నీ "వంకర చూపులు" నా

"గుండెను చీల్చే గులాబి ముళ్ళు"


నాడు నీ మెళ్ళో 

మూడుముళ్లు పడగానే

ముక్కోటి దేవతలు 

దీవించలేదా...? మనల్ని 

ఆ సీతా రాముల్లలా...

ఆ పార్వతీ పరమేశ్వరుల్లా...

చిరకాలం చిలకా గోరింకల్లా..?

చిరునవ్వులు చిందిస్తూ  

"కలిసిమెలిసి కడదాకా" జీవించాలని...


కానీ నేడేమి జరిగింది

విధి ఓ "విషపు నవ్వు" నవ్వింది

ఇద్దరిని కోర్టులచుట్టు తిప్పింది

"విడాకులు" ముఖాన విసిరికొట్టి

విజయగర్వంతో మురిసిపోయింది 


కారణం నాడు నా 

బిగి కౌగిలిలో బంధీవై

స్వర్గంలో విహరిస్తూనే

ఏవేవో ఊహల్లో ఊరేగావు 

కలతనిద్రలో కాపురం చేశావు

నన్ను "ఊబిలోనికి" తోసేశావు

నాకు "విడాకుల విషమిచ్చావు"

కక్కినదానికి ఆశపడే 

"కుక్కతో నేడు కులుకుతున్నావు"


ఓ ప్రియా !

ఓ నా సఖియా ! ఇది నీకు తగునా?

మూడో వ్యక్తి నీ మెడకు ఉచ్చు కాదా..!

పచ్చనికాపురంలో ఆరనిచిచ్చు కాదా..!

కాటికెళ్ళినా తీరదుకదా నీ కామదాహం..!


45. బ్రిటిష్ రాజకుటుంబం......


ఆహా ! ఔరా !

అదేమి కుటుంబం ?

అది రవి అస్తమించని 

బ్రిటిష్ రాజకుటుంబం...

ఆహా అదేమి యోగం ? అదేమి భోగం ?

ఔరా ! అదేమి రాజరిక వైభోగం ?

వారు "శయనించే"...

ఆ విలాసవంతమైన "బకింగ్ హామ్ 

ప్యాలెస్" ఇలలో ఒక ఇంద్రభవనమే...

వారు లండన్ ప్రజలకు దేవుళ్ళే దేవతలే...

వారు "అనుభవించేది" భూతలస్వర్గమే...

వారు "ఆరగించేది"... 

అతి రుచికరమైన పసందైన పదార్థాలే...

అనునిత్యం విలాసాలే ఖుషీ కులాసాలే...

 విందు...వినోదాలే...ప్రతిరోజు పండగలే...


వారు "ధరించేది"... 

"కోహినూర్" పొదిగిన వజ్రకిరీటాలే...  

ఖరీదైన "బ్రాండెడ్ దుస్తులే...

మేలిమి "బంగారు ఆభరణాలే"...

వజ్రవైడూర్యాలే...రవ్వలే...రత్నాలే...

ఆణిముత్యాలే...మణి మాణిక్యాలే... 


రవి అస్తమించని ఆ "బ్రిటిష్ చక్రవర్తులు" 

ప్రక్కరాజ్యాలకు ప్రక్కలో బల్లెమై

దండయాత్రలతో దోచుకున్న భద్రంగా 

దాచుకున్న ఆస్తులు అంతస్తులు...

ఆకాశంలో వెలిగే నక్షత్రాల్లా...

సముద్రతీరంలో... 

ఇసుకరేణువుల్లా...లెక్కించలేనివే... 


వారి సంపద...

మరోవెయ్యి తరాలకైనా తరగనిదే...

ఎంతో ప్రతిష్టాత్మకంగా...

అంగరంగ వైభవంగా... 

ఏటా అక్కడ "జరిగేవి"... 

కళ్ళుచెదిరే వెన్నెల కురిసే వేడుకలే... 

వారు పొందే గౌరవం వెలకట్టలేనిదే... 

వారిది ఏజాతకచక్ర ప్రభావమో ఏమో...

ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఏమో

వారెంతో అదృష్టజాతకులు....

వారే ఈ అవినిపై అపరకుబేరులు... 


సువర్ణాక్షరాలతో లిఖించబడిన

ఆ బ్రిటిష్ రాజకుటుంబ చరిత్ర... 

తరతరాలకైనా...

తరగనిదే...చెక్కు చెదరనిదే....

చిరకాలం చిరస్మరణీయమే.....


46. జ్ఞానముద్ర...యోగనిద్ర...?


ఆశలు రేపే... 

అమృతం కురిపించే...

ఆకలి తీరని మీ అధరాలపై  

చిత్రించాలి చిత్రించాలి..."ప్రేమముద్ర" 


కామ క్రోధ లోభ మోహ మద... 

మాత్సర్యాలను త్యజించే.. 

మీ హృదయాంతరాలలో...

చిత్రించాలి చిత్రించాలి..."శాంతిముద్ర" 


జ్ఞానం కోసం జపించే... 

విజ్ఞానం కోసం తపించే...

అహర్నిశలు అన్వేషించే...మీ మేధస్సుపై 

చిత్రించాలి చిత్రించాలి..."జ్ఞానముద్ర"


ఆరోగ్యం కోసం... 

దీర్ఘాయుష్షు కోసం...

సుఖశాంతుల కోసం...

నిత్యం శారీరక శిక్షణతో శ్రమతో

వ్యాయామంతో అలసిన మీ దేహాలపై

చిత్రించాలి చిత్రించాలి..."ధ్యానముద్ర"


మీ గత చరిత్ర 

ఎంతో ఘనమైనదని... 

ఆదర్శవంతమైనదని... 

మీ జీవితాలు ముందుతరాలకు  

గొప్ప గుణపాఠమని...చరిత్రపుటల్లో 

చిత్రించాలి చిత్రించాలి..."మీ పాదముద్ర"


శ్వాస మీద ధ్యాస కోసం...

నిశ్చలమైన మనస్సుకోసం...

ప్రశాంతమైన జీవనం కోసం...

ప్రకృతి మీద ఆధిపత్యం కోసం...

అతీంద్రియశక్తుల ఆవాహన కోసం...

ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాల నియంత్రణకోసం... 

సంధించాలి ఒకేఒక్క ఆయుధం"యోగనిద్ర"


47. నా అంతరంగ ప్రబోధం...?


నా"గతం"......

గజిబిజి గందరగోళమైతే..!

ఆందోళనకరమైతే..! అగ్నిగోళమైతేఖ్ఖ..! 

అల్లకల్లోలమైన సాగరమైతే..!

ఆకలి కేకలైతే..! రక్తసిక్తమైతే..! 

ఎడారియైతే..!ఎండమావైతే..! 

ఎంగిలి విస్తరాకైతే..!

ఎక్కలేని శిఖరమైతే..! ఎదురీతైతే..! 

ఎదుగుబొదుగులేని జీవితమైతే..! 

దానితో నాకేంటి పని ?అది నాకక్కర్లేదు 


నా"భవిష్యత్తు"......

బంగారుగని యైనా..! 

బాధరబందీలేని బ్రతుకైనా..!

ఆశలపల్లకిలో ఊహలఊరేగింపైనా..! 


అందని ద్రాక్ష ఐనా..! 

పొందని బహుమతియైనా..! 

అందమైన చందమామైనా..! 

దానితో నాకేంటి పని ? అది నాకక్కర్లేదు


కానీ... 

నా"వర్తమానం"......ఒక "వరమని"......

అది "భగవంతుని బహుమతియని"

అది దొరికిన "తేనెపట్టని"జుర్రుకోమని... 

ఆత్మతృప్తిగా అనుభవించమని...

అద్భుతమైన...అపురూపమైన 

ఆ "బహుమానాన్ని" వదులుకోవద్దని...

గట్టిగా హత్తుకోమని ముద్దుపెట్టుకోమని...


అరుదైన ఆ "బంగారు అవకాశాన్ని"...

దుర్వినియోగం చేసుకోవద్దని...

"దూరంగా నెట్టి దుఃఖించవద్దని"... 

నా అంతరంగ ప్రబోధం...


ఔను మనం 

"బూజుపట్టే బుద్దిని" కాదు... 

"స్పందించే హృదయాన్నే" నమ్మాలి...

అప్పుడే "విజయం"

"బొమ్మాళీ" నిన్ను వదలనంటుంది"...

"విశ్వవిజేతవు" నీవే నీవేనంటుంది...

నా ఈ మంచిమాట నమ్మి...

నా కవితను ఓపికతో చదివిన

మీకు "సకలశుభాలు" కలుగును గాక...! 


48. విషపు నవ్వులు"...?


ప్రియా !

ఓ నా సఖియా !

అనునిత్యం

నన్ను మురిపించే...

మురిపాలు పంచే... 

నీ మూగ మనసెందుకో...

నేడు మౌనంగా రోదిస్తుంది?


నా మనసును ఉల్లాస పరిచే...

మత్తెక్కించే మంత్రాలు వల్లించే...

నీ సుమధుర గాత్రమెందుకో... నేడు 

మౌనవ్రతం దాల్చి...మూగబోయింది?


నన్ను గాఢంగా ప్రేమించే... 

చిరునవ్వులు చిందించే...నీ 

చిలిపి పెదవులెందుకో...నేడు 

చిగురుటాకుల్లా...వణుకుతున్నాయి?


నిన్న క్షణక్షణం 

నా నామమే...జపించిన...

నా స్పర్శకై...తపించిన...నీ 

తనువెందుకో... నేడు

దూరంగా దుప్పట్లో దూరి దుఃఖిస్తుంది?


నా కళ్ళకెందుకో..."నీ రూపు" 

సుస్పష్టంగా కనిపించడం లేదు ? 

నా కళ్ళు రెండు కన్నీటిధారలతో 

నిండిపోయినందుకే...


నా హృదయమెందుకో...బ్రద్దలైంది?

నీవు "విషపు నవ్వులు" విసిరినందుకే...


ప్రియా ! ఓ నా సఖియా !

త్రాగాను నీ ప్రేమ "అమృతమని"...

త్రాగాక తెలిసింది అది "హాలాహలమని"...

నీవు"ప్రేయసివి"కాదని..."ప్రేతాత్మవని"...నా

ముందునిలుచున్న..."మృత్యువువని"...


తెలిసిందిప్పుడే"వన్ సైడ్ లవ్" "విషమని"...

దాని"ముగింపు"ఎప్పుడూ "విషాదమేనని"...

ప్రేమికులందరికిదొక పాఠమనిగుణపాఠమని


49. రవి అస్తమించని రాజ్యంలో 

అస్తమించిన రాణి ఎలిజబెత్ -||


రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని

ఏడు దశాబ్దాలుగా పరిపాలించి...

స్నేహహస్తం అందించి ప్రపంచ 

దేశాధినేతల మనన్నలనందుకుని...

96 ఏళ్ల వయస్సులో"దివికేగిన ధీరవనిత"

మహారాణి ఎలిజబెత్ అలెగ్జాండ్రా 


బ్రిటన్ రాజు జార్జ్ VI, క్వీన్ ఎలిజబెత్ ల 

గర్భఫలం 02 ..ఏప్రిల్..1926 లో..జననం

గ్రీస్‌ యువరాజు నేవీ లెఫ్టినెంట్‌ 

"ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌"తో ప్రేమ పెళ్లి...

20...నవంబర్...1947 లో.... 


నలుగురు పిల్లల తల్లిగా... 

తండ్రి జార్జ్ VI మరణంతో...

గత 900 ఏళ్ళుగా జరిగే పట్టాభిషేక 

మహోత్సవంలో " బ్రిటిష్ యువరాణిగా" 

1661లో తయారైన 2.23 కేజీల బంగారు 

కిరీటధారణ 02...జూన్......1953 లో...


15 మంది ప్రధానులతో పనిచేసి...

25 దేశాలకు స్వేచ్ఛను ప్రసాదించి...

240 కోట్ల జనాభా ఉన్న 56 స్వతంత్ర 

దేశాల కామన్వెల్త్ రాజ్యాలకు "అధినేత"....


రాజ కుటుంబాన్ని ఎన్నో 

"సమస్యల సునామీలు" ముంచెత్తినా

"రగడలఅగ్ని" రాజుకున్నా చలించక

పట్టుదలతో పరిష్కారించుకుని 

సమస్యల సుడిగుండాలను దాటిన "ప్రతిభాశాలి"...


సభలలో సమావేశాలలో తన 

హాస్యచతురతతో సమయస్ఫూర్తితో  

అందరినీ ఆకర్షిస్తూ...ఆహ్వానిస్తూ...

అలరిస్తూ...ఆత్మీయంగా పలకరిస్తూ... 

చిరునవ్వులు చిలకరిస్తూ...స్నేహశీలిగా

"సత్సంబంధాల సారథిగా" విశ్వవారధిగా" 

70 ఏళ్ళు బ్రిటన్ మహా పట్టపురాణిగా...

"దివినుండి దిగివచ్చిన ఓ దేవతగా... 


96 ఏళ్ళు సంపూర్ణ జీవితాన్ని సంతృప్తిగా

 అనుభవించింది...అస్తమించింది...

దివికేగింది..."ధృవతారగా"మిగిలిపోయింది 

క్వీన్ ఎలిజబెత్...|| 

వారి పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని...

ఆ దైవాన్ని ప్రార్థిస్తూ....అర్పిస్తున్న.....

అక్షరనీరాజనం...


50. గురువులు కరువౌతున్నారు...


పిల్లలు పుట్టగానే

బడిలో అడుగుపెట్టగానే

పరిమళించే పువ్వులని 

పసిగట్టేది గురువులే

కనని అమ్మానాన్నలు

పిల్లల భవిష్యత్ భవననిర్మాతలు 

దారిలో దీపాలు జీవితమార్గ నిర్దేశకులు 

గురువులే... కానీ 

అట్టి గురువులు నేడు కరువాయే...

ఆ గూగులమ్మే అందరికి గురువాయే...


పిల్లలు చదువుల్లో దిట్టలైతే

మొదట భుజం తట్టేది

సాన బట్టేది ముందుకు నెట్టేది

పిల్లలను రాళ్ళలను రత్నాలుగా  

మట్టిలో మాణిక్యాలు తీర్చిదిద్దేది 

గురువులే...కానీ 

అట్టి గురువులు నేడు కరువాయే... 

ఆ గూగులమ్మే అందరికి గురువాయే...


విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును నిర్మించేది 

వారిలో అభ్యుదయ భావాలను రగిలించేది 

వారు ఎవరెస్టుశిఖరమంత

ఎత్తుకు ఎదగాలని ఆశించేది 

అడుగడుగున మార్గదర్శకులై ఆదుకునేది 

వారి బ్రతుకులను బంగారుమయం చేసేది

గురువులే...కానీ 

అట్టి గురువులు నేడు కరువాయే...

ఆ గూగులమ్మే అందరికి గురువాయే...


51. నమ్మితే నరకం...స్వశక్తియే స్వర్గం..!

 

ఆరని ఆశలకు...ఆగని కన్నీళ్లకు

తీరని వ్యధలకు...తరగని బాధలకు

ఆ భగవంతున్ని నిత్యం నిందిస్తూ

ఎవరో వస్తారని...ఏదో చేస్తారని... 

ఎదురు చూస్తూ...ఎదురు చూస్తూ...


అప్పులే...ఆస్తులుగా... 

వ్యసనాలే...వ్యాధులుగా... 

సమస్యలే...సంకెళ్ళుగా.... 

అడుగడుగున గండాలతో... 

సుఖదుఃఖాల సుడిగుండాలతో... 


అతుకుల గతుకుల బ్రతుకు 

జట్కాబండినీడ్చే ఓ బడుగుజీవులారా...!

ఓ మధ్యతరగతి మహరాజులారా...!

తెలుసుకోండి...ఒక్కనిజం తెలుసుకోండి..!


దారం లేక "దండ" లేదని...

సూర్యుడు లేక "ఎండ" లేదని... 

మట్టి లేక "కుండ" లేదని...

కుండ లేక "తిండి" లేదని... 

తిండి లేక "కండ" లేదని...


"కష్టేఫలి" అన్న నినాదాన్ని 

కలనైనా మరువరాదని...

"నేతలను" నమ్మితే నరకమేనని... 

మీ "స్వశక్తియే" మీకు స్వర్గమని...


మీ "ఓటే" మీకు వజ్రాయుధమని...

ఎవరికోసమో ఎదురు చూడవద్దని...

ఓట్లకోసం నోట్లను పంచే...

అరచేతిలో స్వర్గం చూపించే...

ఏరుదాటిన తర్వాత తెప్పతగలేసే...

చేసిన వాగ్దానాలను ఇచ్చిన వరాలను 

నిర్లజ్జగా గంగలో నిమజ్జనం చేసే...

నేతల "తలరాతలను" మార్చవచ్చని...


ఎన్నికల్లో తిరుగులేని తీర్పునిచ్చి 

మహామహులనే మట్టి కరిపించవచ్చని...

మీ నిండుజీవితాలలో మీరే 

"పండు వెన్నెలలను" కురిపించుకోవచ్చని...

తెలుసుకోండి...ఒక్కనిజం తెలుసుకోండి... 


52. వర్తమానం...ఒక బహుమానం..?


"నిన్నన్నది"

ఒక కమ్మని కలరా...!


"రేపన్న"

దానికి రూపే లేదురా...!


"నేడన్నది"

ఒక పచ్చినిజంరా...!


అది అమృతం

కన్నా అతిమధురంరా...!

తనివితీర త్రాగి తరించరా...!

ఆత్మతృప్తిగా దాన్ని అనుభవించరా...!


వర్తమానానికి

"కర్తవ్యాన్ని" జత చేస్తే...

కసితో నిరంతరం "కృషి" చేస్తే...


స్వేదాన్ని చిందిస్తే...

సాహసంతో చిందేస్తే...

సోమరితనాన్ని బంధిస్తే...


"విశ్వవిజేతవు" నీవేరా...!

ప్రపంచం ప్రకృతి రెండు 

నీకు పాదాక్రాంతమయ్యేనురా...!


ఘనవిజయం నీకు...చిక్కేనురా...!

ఓటమిభూతం నీకు...మ్రొక్కేనురా..!

నీకిక ఎదురే లేదురా...! "కీర్తి కిరీటం"

"ఖండాంతర ఖ్యాతి" నీకు...దక్కేనురా...!


53. గురుదక్షిణ...


ఒక "కన్నతల్లిలా "బుజ్జగించి

బుద్దిచెప్పేది...గురువే...

ఒక "కన్నతండ్రిలా" చేయిబట్టి 

నడిపించేది...గురువే...

ఒక "స్నేహితుడిలా" ఆపదలో 

ఆదుకునేది...గురువే... 


బ్యాంకుల్లో తీసుకున్న 

"కోట్లఋణం" ఈజన్మలో తీర్చుకోవచ్చు 

కాని ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది

జన్మనిచ్చిన ఆ "అమ్మ ఋణం" 

జ్ఞానామృతం పంచిన "గురుబ్రహ్మ ఋణం"

 

అందుకే 

ఓ గురుదేవుళ్ళారా !

మీకు రెండు చేతులెత్తి మొక్కుతాం...

మీ పాదాలకు పాలాభిషేకం చేస్తాం...

మా గుండెల్లో గుడి గట్టి 

మిమ్మల్ని "అక్షరదైవాలుగా" 

ప్రతినిత్యం పూజిస్తాం...

పుట్టిన మా బిడ్డలకు 

మీ పేర్లే పెట్టుకుంటాం...

ఇదే మీకు "మా గురుదక్షిణ"

ఇంతకుమించి ఇంకేమిచ్చి

మీ ఋణాన్ని తీర్చుకోగలం, చెప్పండి

ఓ గురుదేవుళ్ళారా ! మీకు వందనాలు !

అభివందనాలు ! పాదాభివందనాలు !!


54. ఉచ్చు...! ఆరని చిచ్చు...! 


ఓ ప్రియా !

ఓ నా సఖియా !

నాడు నీ మెళ్ళో 

మూడుముళ్లు పడగానే

ముక్కోటి దేవతలు 

దీవించలేదా...? మనల్ని 

ఆ సీతా రాముల్లలా...

ఆ పార్వతీ పరమేశ్వరుల్లా...

చిరకాలం ఆ చిలకా గోరింకల్లా...

చిరునవ్వులు చిందిస్తూ కడదాకా

"కలిసిమెలిసి " జీవించాలని...


కానీ నేడేమి జరిగింది

విధి ఓ "విషపు నవ్వు" నవ్వింది

ఇద్దరిని కోర్టులచుట్టు తిప్పింది

"విడాకులు" ముఖాన విసిరికొట్టి

విజయగర్వంతో మురిసిపోయింది 


కారణం నాడు నా 

బిగి కౌగిలిలో బంధీవై

స్వర్గంలో విహరిస్తూనే

ఏవేవో ఊహల్లో ఊరేగావు 

కలతనిద్రలో కాపురం చేశావు

నన్ను "ఊబిలోనికి" త్రోశావు

నాకు "విడాకుల విషమిచ్చావు" 

నేడు కక్కినదానికి ఆశపడే 

"కుక్కతో కులుకుతున్నావు"

ఓ ప్రియా !

ఓ నా సఖియా ! ఇది నీకు తగునా?

మూడో వ్యక్తి నీ మెడకు ఉచ్చు కాదా ! 

అది పచ్చని కాపురంలో ఆరనిచిచ్చు కాదా !

కాటికెళ్ళినా తీరదు కదా నీ కామదాహం..!


55. గిజిగాడి గూడులా...? 


ప్రతికవి తన కవితను 

గిజిగాడు గూడు అల్లినట్టుగా 

కాసింత నేర్పుగా..ఓర్పుగా... 

కూసింత శ్రద్ధగా... శ్రమపడి...

ఇష్టపడి కష్టపడి...ఆశపడి....   


ఒక తల్లి తొమ్మిది నెలలు   

ఆగి బిడ్డను ప్రసవించినట్టు... 

ఆలోచలకు పదును పెడుతూ

ఊహలే ఊపిరిగా ఊహించని 

మార్పులు చేస్తూ 

మెరుపులు మెరిపిస్తూ

విరుపులు కురిపిస్తూ

మేలిమి మెరుగులు దిద్దుతూ

గర్భంలోని బిడ్డకు పుష్టికరమైన 

ఆహారాన్ని అందించినట్లు... 


కవి తాను కనే కవితలకు 

ఉత్కృష్టమైన పదసృష్టితో

బంగరు భావాల వన్నెచిన్నెలతో

అందమైన సుందరమైన ఆకృతితో...

వ్రాసే ప్రతి కవితను 

కొత్త పెళ్లికూతురులా 

ముస్తాబు చేయాలి ముత్తైదువ

నుదిటి తిలకంలా తీర్చిదిద్దాలి... 

పుష్టికరంగా పురుడు పోయాలి...


అప్పుడే కదా కవితను 

వినువీధిలోకి విసరాలి...

అప్పుడే కదా కవిత రెక్కలొచ్చి 

పక్షిలా స్వేచ్ఛగా విహరించేది...

అప్పుడే కదా కవిత 

పాఠకదేవుళ్ళకు

కనువిందు చేసేది

కనువిప్పు కలిగించేది

అందరి మెప్పును పొందేది... 


56. లక్షలదీపాలను ఆర్పిన మనిషి...?


లక్షలదీపాలను 

ఆర్పేసిన ఒక

మతిలేనిమనిషి

వెలిగించకుండునా...

ఒక్క చిరుదివ్వెనైనా...?


ఆడిఆడి పూజారి 

"వెయ్యి అబద్దాలు"

కుదుర్చకుండునా...

చక్కనైన ఒక్కసంబంధమైనా...?


త్రవ్వగా త్రవ్వగా 

"వెయ్యి అడుగులలోతు"

పైకి రాకుండునా...

బోరునుండి ఒక్కచుక్కనీరైనా...?


ఓట్లకోసం జననేత చేసిచేసి 

"వందలవాగ్దానాలు"

పరిష్కారించకుండునా... 

ఒక్కచిక్కుసమస్యనైనా...?


కొట్టికొట్టి శిల్పాకారుడు 

"వేలవేల ఉలిదెబ్బలు"

చెక్కకుండునా...

ఒక్క సుందర దేవతాశిల్పమైనా...?


చేయగా చేయగా దైవానికి

"వెయ్యి కన్నీటి ప్రార్థనలు"  

తీరకుండునా.....ఒక్కకోరికైనా ....?

దక్కకుండునా....ఒక్కవరమైనా....?


57. మూర్ఖులు...ముళ్ళకంచెలు ?


మన చూపులు మరొకరిని‌‌ వెతకనంత‌ కాలం

వేరొకరి చూపులు మనల్ని కలవరపెట్టనంత కాలం

మనకు దూరంగా ఉన్నవారిని చూడాలని...

వారి కంట్లో పడాలని తపించనంత కాలం...పడాలని

ఏదో విధంగా అక్కడిక్కడ తచ్చట్లాడనంతకాలం


మన ఆలోచనల్లో చెడులేనంతకాలం

మన మనసు ‌మన ఆదీనంలో ఉన్నంతకాలం

మన‌ చూపులు వంకర చూపులు కానంతకాలం

మన మనసులో తప్పుడు తలంపులు పుట్టనంతకాలం

ఏఇబ్బందీ లేదు ఏకష్టమూ లేదు ‌ఏనష్టమూలేదు కానీ...


ఇతరుల మీద రోజు రోజుకు....ఇష్టం పెరుగుతూవుంటే...

కట్టుకున్నోడి మీద రోజురోజుకు ప్రేమ తరుగుతూఉంటే...

అయిష్టత....అసహనం.....అసహ్యం పెరుగుతూవుంటే...

కట్టుకున్నోడు ఏదడిగినా లేదూ లేదంటూనే...

ఇరుగుపొరుగువాళ్ళకు అడగకముందే ...

అన్నీ సంతోషంగా ఇష్టపడి ఇచ్చేందుకు...

సిద్ధపడడంలో...అర్థమేంటి?...నిజానికి...


నీవు నీకు...తెలియకుండా...దారి తప్పినావనే...కదా

నీవు మరొకరి మాయలో చిక్కుకున్నావనే.........కదా

నీవుమరొకరి చేతిలోనో కీలుబొమ్మవై పోయావనే...కదా

ీఔాఅందుకే మత్తులో జోగే ఓ మగువా జాగ్రత్త !

నీ‌ చూపులు ‌జాగ్రత్త ! నీ‌ ఆలోచనలు జాగ్రత్త !

నీ కళ్ళు జాగ్రత్త ! నీ ఒళ్ళు‌‌ జాగ్రత్త ! నీ ఇల్లు జాగ్రత్త !


నీలోని మంచితనాన్ని పాపులకు పంచకు...

ఒక "చిన్న బలహీనతకు"

నీ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకోకు...

నీ బంగారు భవిష్యత్తుని బలిచేసుకోకు...

నీ చుట్టూ మూర్ఖులుంటారు...

ముళ్ళ కంచెలుంటాయి జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త !


58. రాస్తే కవిత్వం...?


రాస్తే కవిత్వం... 

దేవతలే దివి నుండి భువికి 

దిగివచ్చి నిన్ను దీవించాలి 

దివ్యమైన కావ్యమంటూ...

దీర్ఘాయుష్మాన్ భవా అంటూ... 


రాస్తే కవిత్వం...

సమాజంలోని రుగ్మతల్ని

రూపు మాపాలి

రాస్తే కవిత్వం...

సమాజంలోని సమస్యలకు 

సమాధులు కట్టాలి 


రాస్తే కవిత్వం... 

రాతిగుండెల సైతం కరిగిపోవాలి

రాస్తే కవిత్వం... 

మంచుకొండల్లో సైతం మంటలు రేగాలి


రాస్తే కవిత్వం... 

రామాయణ కల్పవృక్షంలా...

మహాభారత భాగవత భగవద్గీలా

రసరమ్యంగా...రక్తి కట్టేలా  

జనరంజకంగా...జగతిమెచ్చేలా ఉండాలి 


 59. సత్కవులకు సందేశం ?


భావకవిత్వం...

ఒక బంగారు వెన్నెల..! 


పద్యం...

ఒక పంచభక్ష్య పరమాన్నం..!


వచనం...

ఒక వడ్డించిన విందుభోజనం..! 


ఔను ఓ కవిమిత్రులారా ! 

శ్రద్ధగా నూతన కవితా భవన

నిర్మాణ పద్ధతులను నేర్చుకుందాం..! 


అక్షరాల ఆకాశంలో

నవ్వే‌‌ నక్షత్రాలమౌదాం...!


నిత్యం నిష్టతో భక్తితో ఆ 

సరస్వతీ దేవికి మ్రొక్కుదాం..!


మన కవితలను అందమైన 

అజంత శిల్పాలుగా చెక్కుదాం..!


కనువిందుచేసే రవివర్మ 

వర్ణచిత్రాలుగా‌ తీర్చిదిధ్ధుదాం..!


ఈ సాహితీ క్షేత్రంలో పచ్చని

కవితల పంటలు పండిద్దాం..!


రుచికరమైన కమ్మని కవితా 

సంపుటాల వంటలు వడ్డించి 

పాఠకుల క్షుద్బాధను తీరుద్దాం..!


పాఠకుల గుండెగుడిలో

విజ్ఞాన జ్యోతులను వెలిగిద్దాం..!


నవ సమాజనిర్మాణానికి

మనమే మార్గదర్శకులమౌదాం...!


సాహితీ చక్రవర్తులమై...

సాహితీ సామ్రాట్టులమై...

సాహితీ మహరాజులమై...

ఆదికవి నన్నయ తిక్కనలా...

అఖండ ఖ్యాతిని ఆర్జిద్దాం..!


మన ఘన చరిత్రను మనమే

సువర్ణాక్షరాలతో లిఖించుకుందాం..!

దివిలో ధృవతారలుగా మిగిలిపోదాం..!


60. మూర్ఖులు...ముళ్ళకంచెలు ? 


మన చూపులు మరొకరిని‌‌ వెతకనంత‌ కాలం

వేరొకరి చూపులు మనల్ని కలవరపెట్టనంత కాలం

మనకు దూరంగా ఉన్నవారిని చూడాలని... 

వారి కంట్లో పడాలని తపించనంత కాలం...

ఏదో విధంగా పడాలని 

అక్కడిక్కడ తచ్చట్లాడనంతకాలం


మన ఆలోచనల్లో చెడులేనంతకాలం

మన మనసు ‌మన ఆధీనంలో ఉన్నంతకాలం

మన‌ చూపులు వంకర చూపులు కానంతకాలం

మన మనసులో తప్పుడు తలంపులు పుట్టనంతకాలం


మాటలు లేక మౌనంగా వున్నందుకు

చాటుమాటుగా దొంగచూపులు చూసుకొని

మానసికానందం పొందనంతకాలం


ఏఇబ్బందీ లేదు ఏకష్టమూ లేదు ‌ఏనష్టమూలేదు కానీ...


ఇతరుల మీద రోజు రోజుకు....ఇష్టం పెరుగుతూవుంటే...

కట్టుకున్నోడి మీద రోజురోజుకు ప్రేమ తరుగుతూఉంటే...

అయిష్టత....అసహనం.....అసహ్యం పెరుగుతూవుంటే...

ఇక కలిసివుండడం కష్టమే


కలిసి ఉన్నా అది నటనే

కళ్ళకు గంతలే... అందుకే 


మత్తులో జోగే ఓ మగువా జాగ్రత్త !

నీ‌ చూపులు ‌జాగ్రత్త ! నీ‌ ఆలోచనలు జాగ్రత్త ! 

నీ కళ్ళు జాగ్రత్త ! నీ ఒళ్ళు‌‌ జాగ్రత్త ! నీ ఇల్లు జాగ్రత్త !


నీలోని మంచితనాన్ని పాపులకు పంచకు...

ఒక "చిన్న బలహీనతకు"

నీ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకోకు...

నీ బంగారు భవిష్యత్తుని బలిచేసుకోకు...

నీ చుట్టూ మూర్ఖులుంటారు... 

ముళ్ళ కంచెలుంటాయి జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త


61. శిరసు వంచిన శిఖరం...!


ఓ నా ప్రియమిత్రమా ! 

అదిగో అంబరాన్ని చుంబించే

ఆ సుందర పర్వత శిఖరశ్రేణిని

తిలకించి తిలకించి పులకించిపోక

చింతించేవెందుకు ? వాటికి 

శిరసు వంచి నమస్కరించేవెందుకు ?

అవి నీకంటే "ఎత్తుగా" ఉన్నాయనే కదా !


కానీ ఒక "సాహసివై"

ఒక "సమరయోధుడివై"

పట్టువదలని ఒక "విక్రమార్కుడివై"

కసితో కృషితో చక్కని శిక్షణతో

పక్కా ప్రణాళికతో ప్రయత్నిస్తే 

ఆ శిఖరాల నరోధిహిస్తే

ఆ శిఖరాలే నీకు శిరస్సు వంచి నమస్కరిస్తాయి

కారణం అవి ఇప్పుడన్నది 

నీ కాళ్ళ క్రిందనే...

అవి దాసోహం అంటున్నది

నీ కృషికి నీ పట్టుదలకు 

నీ దృఢసంకల్పానికే...


62. తండ్రిని తాతగా మార్చవచ్చు...!


ఓ నా ప్రియమిత్రమా !

తెలుసుకో ఓ నగ్నసత్యం అది 

గుర్తుంచుకో గుండెల్లో ప్రతినిత్యం 

ఏ కొడుకు కూడా 

తన తండ్రి కన్న మిన్న కాదని...

కోరితే "తండ్రిని తాతగా" 

మార్చవచ్చునేమో కానీ "మరోజన్మ"నివ్వలేడని...


అందుకే 

ఓ నా ప్రియమిత్రమా !

తెలుసుకో ఓ నగ్నసత్యం అది 

గుర్తుంచుకో గుండెల్లో ప్రతినిత్యం

ఎవరూ "తాతకు దగ్గును

చేపకు ఈతను" నేర్పలేరని...

ఎవరూ "గురువులకు 

పాఠాలు" బోధించలేరని... 

ఎవరూ "విధిని" ఎదిరించలేరని... 

ఎవరూ"బ్రహ్మవ్రాతను" మార్చలేరని ...

ఎవరూ"ఆ సృష్టిని"కానీ 

ఆ "సృష్టికర్తను" కానీ 

ఆ ప్రకృతిని" కానీ శాసించలేరని...


63. ఓ నందకిశోరా...ఓ నవనీతచోరా...!


చల్లని దీవెనలనొసగే 

ఓ నల్లని కృష్ణయ్యా !!

ఎంతకూ బోధపడకున్నవయ్యా !

నీ లీలలు...నీ మాయలు...

ఎంతకూ అంతుచిక్కకున్నదయ్యా

నీ గీతాసారం...


ఓ పరమాత్మా ! నీవు 

విధాతవో...

విష్ణుమూర్తివో...అర్దం కావడం లేదు

ఓ పరమాత్మా ! నీవు 

జగద్గురువువో...

జటాజూటధారివో...అర్దం కావడం లేదు


ఓ పరమాత్మా ! నీవు 

నందకిశోరునివో...

నవనీతచోరునివో...అర్థం కావడం లేదు

ఓ పరమాత్మా ! నీవు 

మదిలో మంటలు రేపే మన్మధునివో...

మాయలమాంత్రికునివో...అర్దం కావడం లేదు


ఓ పరమాత్మా ! నీవు 

కుచేలుని ఆప్తమిత్రునివో...

కురుక్షేత్ర సంగ్రామ 

...అర్దం కావడం లేదు

కారణం గోకులంలో 

పేదగోపికల ఇళ్ళలో దొంగలాదూరి 

"పెరు‌గు వెన్నముద్దలు" తింటావు

మరుక్షణంలోనే "మన్ను" తింటావు 

గోపికల వలువలు చెట్లకొమ్మల్లో దాచి 

తల్లి యశోదమ్మచే "చీవాట్లు" తింటావు


అందుకే ఓ పరమాత్మా ! 

నీగుడిమెట్లు ఎక్కిమ్రొక్కి

నిన్ను వేడుకునేదొక్కటే...

మాఎదనిండా భక్తినినింపి 

మాకు ముక్తిని ప్రసాదించు... 

మా జ్ఞాననేత్రాలను తెరిపించు...

మాచే అగ్నిస్నానం చేయించు....

మాలోని అజ్ఞానాన్నితొలిగించు...

నీ విశ్వరూపాన్ని తిలకించి పులకించే

ఆ మహద్భాగ్యాన్ని మాకు కలిగించు... 


64. ఏముంది మీ‌ కవిత్వంలో ? 


ఓ కవిమిత్రులారా ! 

ఒక నిజం నిగ్గుతేలాలి...

నిజానికి మీ 

కవిత్వంలో ఏముంది? 


మీ కవిత్వంలో...

నీరుందా ? 

నిప్పుందా ?


మీ కవిత్వంలో... 

పొగ వుందా ? 

పొగరుందా ?  


మీ కవిత్వంలో...

వేడి వుందా ?  

వెలుగుందా ? 


మీ కవిత్వంలో...

త్యాగముందా ? 

అనురాగముందా ?


మీ కవిత్వంలో... 

ఆకలిగోలవుందా ? 

అగ్నిజ్వాలవుందా ?


మీ కవిత్వంలో... 

అమృతముందా ? 

హాలాహలముందా ?


మీ కవిత్వంలో... 

నిజముందా ? 

నీతినిజాయితీవుందా ?


మీ కవిత్వంలో ...

పచ్చదనముందా ?

వెన్నెల వెచ్చదనముందా ?


మీ కవిత్వంలో...

గడ్డి పరకలున్నాయా ? 

గండ్ర గొడ్డళ్ళున్నాయా ?


మీ కవిత్వంలో... 

వేడి ముద్దులున్నాయా ? 

ముందుతరాలకు 

పాదముద్రలున్నాయా ?


ఏమున్నాయో మీ కవిత్వంలో 

మీరే తేల్చుకోండి మిత్రులారా !


65. మరబొమ్మలా ? మతిలేనికోతులా ?


ఈ దోపిడీ సమాజంలో... 

ఈ జనన మరణ చక్రంలో... 

ఈ ఊరుకు పరుగుల జీవితంలో... 

ఈ సుఖదుఃఖాల సుడిగుండంలో...

ఈ నవనాగరిక నయవంచక నరకకూపంలో... 


ఈ ఆశల ఆరాటంలో... 

ఈ జీవన పోరాటంలో ...

ఈ కులాల కుమ్ములాటలతో... 

ఈ మతాల మారణహోమాలతో...

మానవత్వం మంట కలిసిపోతున్నవేళలో...


దయగల ఓ దైవమా ! 

రావా...తక్షణమే

దివి నుండి భువికి దిగిరావా...

ఈ కలికాలంలో... 

ఈ కంప్యూటర్ యుగంలో...

మరబొమ్మలుగా మారిపోతున్న...

మతిలేని కోతుల్లా తిరుగుతున్న...


విషపూరిత ఈ మనుషుల మెదళ్ళలో 

కాసిన్ని "విజ్ఞానపు విత్తనాలను" చల్లిపోవా...!

దుర్గంధభరిత ఈ మనుజుల హృదయాలను 

"మానవత్వపు సుగంధపరిమళాలతో " నింపిపోవా...!

దయగల ఓ దైవమా ! రావా దివినుండి భువికి దిగిరావా...!


66. మద్యం ఏరులై పారితే ఏమౌతుంది ?‌


మద్యం ఏరులై పారితే ఏమౌతుంది ?

ప్రభుత్వ ఖజానా మార్వాడి 

గల్లా పెట్టెలా గలగలలాడుతుంది

నాగార్జున శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్టుల్లా

నిండుకుండలా కళకళలాడుతుంది


మద్యం ఏరులై పారితే ఏమౌతుంది ?

నిన్న డొక్కు సైకిల్ ఎక్కి తిరిగిన గుత్తేదారులు

నేడు మెర్సిడెస్ బెంజ్ BMW ఖరీదైన కార్లలో...

నిన్న సింగిల్ బెడ్ రూముల్లో సర్ధుకున్న కాంట్రాక్టర్లు

నేడు విలావంతమైన విశాలమైన ఖరీదైన విల్లాలలో... 


మద్యం ఏరులై పారితే ఏమౌతుంది ?

నిన్న పాడిపంటలతో పచ్చని పొలాలతో విలసిల్లిన 

పల్లెలనిండా త్రాగి తాండవమాడేది మందుబాబులే...

పబ్బుల్లో క్లబ్బుల్లో అర్థరాత్రుల్లో మందేస్తు చిందేస్తు

 వయ్యారిభామల పొందుల్లో మునిగితేలేది యువతే...


మద్యం ఏరులై పారితే ఏమౌతుంది ?

మాయమైపోయేది మంచితనమే...

మంట కలిసిపోయేది మానవత్వమే...

సోమరితనం....పోకిరితనం...

పోగరుబోతుతనంతో... 

మనచుట్టూ విచ్చలవిడిగా తిరిగేది

కళ్ళుపొరలు కమ్మిన మానవ మృగాలే...

చేసేది అతివలపై హత్యలే అత్యాచారాలే...


67. ఓ నందకిశోరా...ఓ నవనీతచోరా...!


చల్లని దీవెనలనొసగే 

ఓ నల్లని కృష్ణయ్యా !!

ఎంతకూ బోధపడకున్నవయ్యా !

నీ లీలలు...నీ మాయలు...

ఎంతకూ అంతుచిక్కకున్నదయ్యా

నీ గీతాసారం...


ఓ పరమాత్మా ! నీవు 

విధాతవో...

విష్ణుమూర్తివో...అర్దం కావడం లేదు

ఓ పరమాత్మా ! నీవు 

జగద్గురువువో...

జటాజూటధారివో...అర్దం కావడం లేదు


ఓ పరమాత్మా ! నీవు 

నందకిశోరునివో...

నవనీతచోరునివో...అర్థం కావడం లేదు

ఓ పరమాత్మా ! నీవు 

మదిలో మంటలు రేపే మన్మధునివో...

మాయలమాంత్రికునివో...అర్దం కావడం లేదు


ఓ పరమాత్మా ! నీవు 

కుచేలుని ఆప్తమిత్రునివో...

కురుక్షేత్ర సంగ్రామ వ్యూహకర్తవో...

మాకు అర్దం కావడం లేదు

కారణం గోకులంలో 

పేద గోపికల ఇళ్ళలోదూరి 

పెరు‌గు వెన్నముద్దలు తింటావు

మరుక్షణంలోనే మన్ను తింటావు 

తల్లి యశోదమ్మచే తిట్లు తింటావు


అందుకే ఓ పరమాత్మా ! 

నీగుడిమెట్లు ఎక్కిమ్రొక్కి

నిన్ను వేడుకునేదొక్కటే...

మాఎదనిండా భక్తినినింపి 

మాకు ముక్తిని ప్రసాదించు... 

మా జ్ఞాననేత్రాలను తెరిపించు...

మాచే అగ్నిస్నానం చేయించు....

మాలోని అజ్ఞానాన్నితొలిగించు...

నీ విశ్వరూపాన్ని తిలకించి పులకించే

ఆ మహద్భాగ్యాన్ని మాకు కలిగించు... 


68. వెన్న దొంగను వేడుకుందాం...


ఈ కృష్ణాష్టమి 

పర్వదినాన ఉదయాన్నే 

శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని 

గంగాజలంతో స్నానం చేయించి... 

పంచామృతంతో అభిషేకించి...

వెన్న పంచదార నైవేద్యం పెట్టి...

బంగారు ఆభరణాలతో... 

తెల్లని వస్త్రాలతో ‌అలంకరించి... 

మాయలు చేసే కన్నయ్యని 

మమతల ఊయలలో...ఊపి ఊపి 

జోజో ముకుందాయని 

జోలపాటలు...పాడి‌ పాడి

దాండియా నృత్యాలు...ఆడి ఆడి 

ఉట్టిని...కొట్టి కొట్టి

ఓం దేవకీ నందాయ...

విద్యయే వాసుదేవాయ... 

ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్...అంటూ 

శ్రీకృష్ణ అష్టోత్తర మంత్రాలు...జపించి జపించి 

గీతాపారాయణం...చేసి ‌చేసి

భక్తితో శ్రద్ధలతో...ప్రార్థించి ప్రార్థించి 

ఆ అల్లరికృష్ణున్ని అడుగుదాం...

ఆ వెన్న దొంగను‌‌ వేడుకుందాం...

...మనమదిలో ఇంత ప్రశాంతతను కుమ్మరించమని

...మన జీవితాలను వెలిగించే గీతాసందేశమివ్వమని

...నాడు ద్రౌపది మానాన్ని కాపాడినట్టు కొవ్వుక్కిపోయి 

...కళ్ళుపొరలు కమ్మిన కామాంధులను కాటికి పంపమని

...దుష్టశిక్షణ శిష్టరక్షణకు సుదర్శనచక్రాన్ని సిద్ధంచేసుకోమని


69. ఈ చిన్ని కృష్ణుడే...

      ఈ చిలిపి కృష్ణుడే...


శ్రీ మహావిష్ణువు 

ఎనిమిదవ అవతారంగా‌...

శ్రావణమాసం...శుక్లపక్షంలో 

బహుళ అష్టమినాడు...

అర్థరాత్రివేళ కంసుని చెరసాలలో 

దేవకీ వసుదేవులకు జన్మించి 

కసాయి కంసున్ని ఖతం చేసిన‌ 

సుదర్శన చక్రధారి...

ద్వాపరయుగంలో "యాదవుల కులదైవం"

కలియుగంలో భారతీయులందరికీ "ఇష్టదైవం"


గోపికల "వలువలు" దొంగిలిస్తేనేమి ?

దుర్మార్గుడైన దుశ్శాసనుడిచే నిండుసభలో

అవమానింపబడిన చెల్లి "ద్రౌపది మానాన్ని" 

కాపాడిన "ఆపద్బాంధవుడు"అనాధరక్షకుడు"

...ఈ చిన్ని కృష్ణుడే......ఈ చిలిపి కృష్ణుడే...


ద్వాపరయుగంలో జన్మిస్తేనేమి ?

అర్జునుడికి "గీతామృతాన్ని" పంచిన 

"ఆదర్శపురుషుడు"..."అవతారమూర్తి"

మహభారత సంగ్రామంలో అర్జనుని 

"రథసారథి" కురుక్షేత్ర యుద్దానికి "మార్గదర్శి" 

సర్వమానవాళికి "జగద్గురువు"... 

...ఈ గోపాలబాలుడే...ఈ మురళీలోలుడే...


శ్రీ కృష్ణాష్టమినాడు ... 

ఇష్టదైవమైన శ్రీకృష్ణ భగవానుని...నిష్టతో... 

ఉదయం నుండి ఉపవాసముండి భక్తిశ్రద్ధలతో... 

పూజిస్తే చాలు అష్టైశ్వర్యాలు...ఆరోగ్యసౌభాగ్యాలు 

"పుణ్యలోకం" ప్రాప్తరస్తు !‌ "సత్సంకల్పాలు" సిద్ధిరస్తు ! 


70. వీరు కదా గాన గంధర్వులు...!

వీరు కదా మట్టిలో మాణిక్యాలు...!


ఒక చారిత్రక గేయం రాయడం ఒక ఎత్తు 

అది గుర్తుపెట్టుకొని 

పొల్లుపోకుండా...

గుక్కతిప్పుకోకుండా...

ఊపిరితీసుకోకుండా...పాడడం ఒక ఎత్తు 


వీరు కదా గాన గంధర్వులు...

వీరి గాత్రమే కదా గంగాజలపాతం... 


వీరు కదా మట్టిలో మాణిక్యాలు... 

వీరు కదా మన ఆణిముత్యాలు...


వీరు కదా మన సంగీత సామ్రాట్ లు...

వీరే కదా మన తెలుగుజాతి జ్యోతులు...


వీరి గానమాధుర్యానికి కదా 

మనం జేజేలు పలకవలసింది...

వీరి కళానైపుణ్యానికే కదా 

మనం చేతులెత్తి సెల్యూట్ కొట్టవలసింది... 


ఎంతటి ఏకాగ్రత..... ఎంతటి జ్ఞాపక శక్తి...

ఎంతటి ప్రావీణ్యత...ఎంతటి నైపుణ్యం...


వీరు కదా భావితరాలకు భాగ్యరేఖలు... 

వీరు కదా యువతకు స్ఫూర్తి ప్రదాతలు...


వీరు కదా మనకు 

ఖండాంతర ఖ్యాతిని

ఆర్జించే తెలుగు వీరులు...

వీరు కదా భుజంతట్టి 

ప్రోత్సహించదగిన కళాకారులు...

వీరినే కదా ప్రభుత్వం 

ఆదరించి అక్కున చేర్చుకోవలసింది...


వీరు కదా సదా అభినందనీయులు...

అందుకే వీరికి వీరి ప్రతిభకు...వీరి ప్రజ్ఞకు... 

వందనాలు శతకోటి వందనాలు తెలియజేద్దాం..!

జయహో జయహో ! ఓ గాన గంధర్వ...!

జయహో జయహో ! ఓ ‌తెలుగు‌ తేజమా...!


71. మనిషి...దైవం....


మనిషి 

ఎందుకో దైవాన్ని

దర్శించలేకపోతున్నాడు

ఆ "దైవం" అదృశ్యంగా ఉన్న

ఓ "అణుశక్తి" కాబోలు 

" కోటిసూర్యుల తేజస్సు" కాబోలు

 

అందుకే మనిషి 

తన రెండుకళ్ళతో దైవాన్ని 

వీక్షించలేకపోతున్నాడు

దైవం ఆధీనంలో ఉన్న 

ఆ జనన మరణాలను 

లెక్కించలేకపోతున్నాడు 

వాటిని నియంత్రించలేకపోతున్నాడు


మనిషి 

పుడుతున్నాడు

గిడుతున్నాడు 

ఈ మనిషి ఎక్కడికి 

వెళుతున్నాడో ఎవరికి తెలియదు 

ఏమైపోతున్నాడో అర్థం కావడంలేదు 

 

నిన్న "వెలిగిన ఒక దీపం" 

ఈ రోజు ఆరిపోతుంది

నిన్న "పుట్టిన ఒక పువ్వు"

నేడు రాలిపోతుంది

మనిషి జీవితం 

ఒక "నీటి బుడగే" 

"తామరాకుమీద నీటి బొట్టే" 

ఈ జీవితం అంతే...అది ఒక వింతే...


72. నమ్మకు నమ్మకు నరహంతకుల్ని...


ఛీఛీ ! ఛీఛీ !

సిగ్గులేని ఈ జనాన్ని...

నిగ్గదీసి అడగాలని ఉంది

అసమానతలతో ఊరేగే

ఈ సమాజాన్ని...ఉరితీయాలని ఉంది


ఆకలి గొన్నవానికి అన్నం పెట్టమని...

దాహం వేసిన వారికి నీళ్ళు ఇవ్వమని...

కదా మన పవిత్రగ్రంథాలు బోధించేది

ఆ నీతికథలే కదరా...నిత్యం నీవు

పాఠశాలలో పిల్లలకు నేర్పేది

మరి నీకు ఈ కులపిచ్చేంటి? 

కులంపేర కోతిలా ఇలా రెచ్చి పోవడమేంటి ?

నీకుండలో నీళ్ళు త్రాగిన నేరానికి

ఒక అమాయకుడి ప్రాణాలు

హరించే హక్కు నీకెక్కడిదిరా నీచుడా ?


ఛీఛీ ! ఛీఛీ ! ఎవర్రా నీవు ?

ఉన్నత విలువలు నేర్పవలసిన

ఉపాధ్యాయుడివా ? 

సిగ్గులేని కులదురహంకారివా ?

మనువాదివా ? మానవత్వం 

మంటగలిపిన మానవ మృగానివా ? 


ఎవరిచ్చారురా ? 

ఎక్కడిదిరా నీకీ అధికారం ?

ఎక్కడనుండి వచ్చిందిరా నీకీ‌ధైర్యం ?

దళితుడు బలహీనుడనే కదా !

బాలున్ని బలి తీసుకున్నావు

చట్టాలు మీ చుట్టాలనే కదా !

సాటి మనిషిని శునకంలా చూస్తున్నావు

నీ కులం గొప్పదనే కదరా! నిర్రనీల్గుతున్నావు

వెర్రివాడా ? కులం కులం అన్న...విన్న

వీధికుక్కలు సైతం నిన్ను వెక్కిరించేనురా

కారణం ఒక్కటేరా "కుక్కల్లో లేదురా కులతత్వం" 


ఛీఛీ ! ఛీఛీ !

ఆ బహుజనులే కదరా

నీ కోసం పొలంలో తమ 

ఎర్రటి ‌రక్తపు ధారలను 

చెమట చుక్కలుగా మార్చి

ఎర్రనిఎండలో ఎండినడొక్కలతో

మొక్కలు పెంచి ధాన్యం పండించి

ఇంత తిండి వండి నీ నోటికందిస్తే

"కూడుతిని కుండను" కూడా పగులగొట్టే 

నీచసంస్కృతిరా నీది ఛీఛీ ! 

నీ "కులపిచ్చిని" నిప్పులో పోసి తగలెయ్య


నిజానికి నీ "కులంకంపును" కడగడానికి

చాలవురా "కడలిలో నీళ్ళు" సైతం 

చట్టం నీ చుట్టం కావొచ్చునురా

అధికారులు నీకండగా ఉండవచ్చునురా 

కానీ నీవు దోషివి...ద్రోహివి...దొంగవి 

అని పంచభూతాల సాక్షిగా 

"నీ మనస్సాక్షి" నిత్యం

నిన్ను "ఉరితీస్తూనే" ఉంటుంది 

"నీ ఊపిరి" ఉరికొయ్యలమీద 

గబ్బిలంలా వ్రేలాడుతునే ఉంటుంది


కానీ...

నీ "కుండలోని నీళ్ళనుండే నిప్పుపుట్టి"

నిట్టనిలువునా నిన్ను

దహించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న

నగ్నసత్యం తెలుసుకోరా...నరహంతకా !


(తన కుండలోని నీరు త్రాగినందుకు ఒక అగ్రవర్ణ

 ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు ప్రాణాలొదిలిన 

ఒక దళిత బాలుడి మరణానికి నిరసనగా...)


73. అతిచనువుకు...అర్థమేంటి...??


(పార్టు...1)


తమకు నచ్చిన 

వారిని క్షణక్షణం 

గుర్తు చేసుకోవడం...

కళ్ళకు కనపడకపోతే 

కలవరపడి‌ పోవడమే...అతిచనువంటే...


కళ్ళకు కనిపించి

ఒక కుళ్ళుజోకు వేస్తే 

ఒళ్ళు మరిచిపోవడం...

కోతిలా పళ్ళికలించడం...

పక పకమని నవ్వడమే...అతిచనువంటే...


కారణం 

వారేదో మాయచేశారని...

వారేదో మత్తుమందు చల్లారని... 

తమను కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నారని... 

వీరికి తెలియక పోవడమే...అతిచనువంటే...


తాము ఇష్టపడిన 

వారిని అతిగా సమర్ధించడం...

ప్రతిదానికి వెనకేసుకు రావడం...

వారి తరుపున గట్టిగా వాదించడం...


వారి మీద ఈగ వాలనివ్వకపోవడం...

వారెంత చెడు చేసినా అది మంచేనంటూ

వారికి వత్తాసుపలకడమే...అతిచనువంటే...


(పార్టు...2)


ఎదురెదురుగా ‌నిల్చొని

ప్రక్క ప్రక్కనే కూర్చొని

వారికళ్ళల్లో కళ్ళుపెట్టి

ముఖంలో ముఖంపెట్టి

ముసిముసి నవ్వులు‌ నవ్వుకుంటూ

గంటలతరబడి సొల్లు కబుర్లు

కాకమ్మ కబుర్లు...చెప్పుకొని చెప్పుకొని

చెవులు...కొరుక్కొని కొరుక్కొని

కుళ్ళు జోకులు...వేసుకొని వేసుకొని

వీధిలో విరగబడి...నవ్వుకొని నవ్వుకొని

ఆపై నలుగురిలో 

నవ్వులపాలై పోవడమే...అతిచనువంటే..!


ఎదుటివారి చూపు... 

ఎంత చెడుగా ఉన్నా

అది మంచిగానే...అనిపించడం

ఎదుటివారి మాట... ‌

ఎంత చేదుగా ఉన్నా

అది తేనెలా తియ్యగా...వినిపించడం

ఎదుటివారు చేసే పనేదైనా...

ఎంతటి నీచకార్యమైనా 

అది పరమ పవిత్రమని...భావించడం

ఏదో "మత్తుభూతం" ఆవహించి

తమకు తెలియకుండానే 

మనసంతా వారితో...నిండిపోవడం

తమకు తెలియకుండానే 

వారంటే తెగ...ఇష్టపడిపోవడం

ఎందుకో వీరిలో కలలో సైతం 

ఊహించని కళ్ళుచెదిరే...మార్పురావడం

ఎంతో...వింతగా...విచిత్రంగా...

సరికొత్తగా ప్రవర్తించడమే...అతిచనువంటే..!


(పార్టు...3)


ఇష్టమైనవారు 

ముఖాన ఉమ్మివేసినా

చిరునవ్వుతో 

తుడుచుకొనిపోవడమే...

పిచ్చిబట్టి 

నచ్చిన వారి వెనుక 

పిచ్చికుక్కలా తిరగడమే... 

అడగకుండానే వారికి అన్నీ ...

ఇష్టపడి ఇచ్చివేయడమే...అతిచనువంటే..!


ఒకరినొకరు కలవపోయినా

ఫోన్లో మాట్లాడుకొని తృప్తిచెందడమే... 

ఒకరితో ఒకరు 

ఫోన్లో‌ మాట్లాడుకోకపోయినా

చాటుమాటుగా 

దొంగచూపులు చూసుకొని 

మానసికానందం పొందడమే...అతిచనువంటే..!


ఎప్పుడూ 

ఏదో భ్రమలో భ్రాంతిలో బ్రతకడమే... 

మత్తని తెలియని ఏదో మాయలో 

ఏదో మైకంలో మునిగితేలడమే...అతిచనువంటే..!


అద్దంలో 

ప్రతిబింబమల్లే

కుడిని ఎడమగా... 

ఎడమను కుడిగా...తలంచడమే

మంచిని చెడుగా...

చెడును మంచిగా‌ భావించడమే...అతిచనువంటే..!


(పార్టు...4)


ఇతరులంటే అతిగా ఇష్టపడడమే...

భర్తంటే భయం భక్తి లేకపోవడమే...


మానసికంగా భర్తను బాధపెట్టడమే... 

పొమ్మనకుండా మెల్లగా పొగ పెట్టడమే...

ఇష్టమైనవారిని ఇంట్లోకి సిగ్గులజ్జ లేకుండా 

విందుకు ఆహ్వానించడమే...అతిచనువంటే


మరి అతిచనువే... 

ఏర్పడితే... ఏమౌతుంది?

తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు

అతిచనువు ముదిరితే 

అది అక్రమసంబంధమౌతుంది

అప్పుడేమౌతుంది?

అతిచనువన్నది ఒక మత్తుమందని

అది ఒక మాయని....అది ఒక మైకమని

తెలియక

కన్నతల్లినైనా... 

కన్నతండ్రినైనా... 

కట్టుకున్న భర్తనైనా...

కడకు ఆ భగవంతుడినైనా....ఎదిరించడం

ఆపై...నిప్పుల కుంపటిపై......నిదురించడం

క్రమేపి...మనశ్శాంతి కరువై...మరణించడమే

అతిచనువంటే...


ఔను ఏదో మాయలో 

"మత్తని తెలియని"...

ఏదో "మైకంలో " మునిగితేలే... 

ఓ మగువలారా ! జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త !

మీ కళ్ళు జాగ్రత్త ? మీ ఒళ్ళు జాగ్రత్త ! 

మీ ఇల్లు జాగ్రత్త ! మీ పచ్చని కాపురం జాగ్రత్త !


74. నోట అన్న‌మాట మరువకు...!


నల్లవన్నీ....నీళ్లు కాదు...

తెల్లవన్నీ....పాలు కాదు...


మ్రోగేదంతా.....కంచు కాదు... 

మెరిసేదంతా...బంగారం కాదు...


కనిపించేదంతా....నిజమూ కాదు...

కనపడనిదంతా...మాయా కాదు... 


ఎవ్వరి జీవితాలు... 

వడ్డించిన విస్తర్లు కాదు...

విందు భోజనాలు కాదు... 


ఎవరి కష్టాలు వారివి... 

ఎవరి బాధలు వారివి...

ఎవరి ఆర్థిక ఇబ్బందులు వారివి... 


సమయానికి మనకు సహాయం...

చేసిన వారంతా.....మిత్రులు కారు...

చేయని వారంతా...శత్రువులు కాదు... 


కాని తినే ఈనోట...

ఒక మాటిచ్చి...తప్పే‌వారు...ఆ

మాటమీద....నిలబడని వారు మాత్రం...

మనుషులే కాదు...వారికి విలువే లేదు...


75. ఏడు కొండలు ఎక్కుదాం...! పార్టు...(1)


ఓ సుందరీ !

నా ప్రేమ పందిరీ !!

అలా చిలిపి చూపులు చూడకే...

నాపై చిరునవ్వులు చిలకరించకే...


ఓ పంచదార చిలకా !

నా ప్రేమ మొలకా !!

నీ అందం ఆహా మకరందం...

ఎంత త్రాగినా తనివి తీరదే...


ఓ వయారీ !

మత్తెక్కించే నాట్య మయూరీ !!

నేటి మన ఈ అనురాగ బంధం...

కావాలి జన్మజన్మల అనుబంధం... 


కానీ ప్రియా నా ఓ ప్రియ !

లేదా నామీద నీకు దయ !

నాడు పార్కుపొదల్లో పుట్టిన 

మన చిట్టి పొట్టి పిచ్చిప్రేమ

మొన్న...

కోటిదేవుళ్ళకు....మ్రొక్కింది...

నిన్న......పెళ్ళి పీటలెక్కింది...

నేడు విధిచేతిలో...చిక్కింది...

విలవిలలాడిపోతోంది...ఔను...


మొన్న...

కమ్మని కలలెన్నో కన్నాం...

ఆశలెన్నో పెంచుకున్నాం...

బాసలెన్నో చేసుకున్నాం ...

మూడుముళ్లు వేసుకున్నాం...

ఏడడుగులు నడిచాం...

ఇలా జన్మజన్మలకు జతగా

ఉండాలని ఉబలాటపడ్డాం...


కానీ విధి ఎందుకో 

విషపు నవ్వు నవ్వుతోంది...

నీవక్కడ...నేనిక్కడ

ఇక మనకు మనశ్శాంతి ఎక్కడ?


ఓసీ నా ప్రేయసి !

నా ఊహల ఊర్వశీ !!

పడిపోయినా తిరిగి లేవడానికి...

విడిపోయినా మళ్ళీ కలవడానికి...

చెడిపోయినా తిరిగి బాగుపడడానికి...

ప్రతి జంట ప్రయత్నించాలి

అదే అదే సుఖజీవన సూత్రం...

అందుకే ఈ జీవితం చిత్రవిచిత్రం...


పెనవేసుకుపోయిన బంధాలను...

అనుబంధాలను...భవబంధాలను...

పెంచేది తృటిలో త్రుంచేది ఆ భగవంతుడే...

అందుకే ఏడు కొండలు ఎక్కుదాం...

సిరులొసగే ఆ శ్రీనివాసునికి మ్రొక్కుదాం...

విడివిడిగా ఉంటూ విలపించే 

ఈ ప్రేమపక్షులను ఒక గూటికి చేర్చమని...


76. కాలానికి కళ్ళెం వేద్దాం ! 


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


రిక్షావాడికైనా... 

రియల్ ఎస్టేట్ వ్యాపారికైనా...

ముష్టివాడికైనా... 

ముఖేష్ అంబానీకైనా... 

ఆ భగవంతుడిచ్చిన 

సమయం 24 గంటలే...

కనిపించే మనిషి...

కనిపించని కాలం

కప్ప...పాములైతే 

సమయం సమర్పయామి...

చిలకా గోరింక లైతే

సమయం సద్వినియోగం....


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


కోహినూర్ వజ్రంకన్నా 

అతిఖరీదైన అతివిలువైన 

ఆ తిరిగిరాని కాలానికి

నీవెలా కళ్ళెం వేస్తున్నావు ?

సద్భుద్దితోనా... 

సత్సంకల్పంతోనా... 

సత్క్రియలతోనా...

మంచితనంతోనా... 

మానవత్వంతోనా...

దయా గుణంతోనా... 

దాతృత్వంతోనా...

దైవత్వంతోనా... 

కరుణ ప్రేమ జాలివంటి

సద్గుణాలతోనా...ఎలా ? ఎలా?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావు ?


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


కళ్ళు పొరలు కమ్మిన 

కామాంధుడవై.....

దుష్ట తలంపులతోనా...

కామపు చూపులతోనా... 

పరస్త్రీ వ్యామోహంతోనా...

పర పురుషుల భార్యలవేటలోనా...

చాటుమాటుగా వలపువలలు 

విసరడంలోనా...ఎలా ?ఎలా ?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ?


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


అక్రమంగా 

అర్జించు... 

అనుభవించు...

ఆపై అస్తమించు...

అన్న త్రిసూత్రాలతో 

లంచాలకు మరిగి 

లంచగొండివై.....

పరుల జేబులకు 

చిల్లులు పెట్టడంలోనా... 

పైకి దొరలా లోపల దొంగలా...

పరుల ఇళ్లకు కన్నం వేయడంలోనా... 

దొరికినంత దోచుకోవడంలోనా...

స్విస్ బ్యాంకుల్లో 

దాచుకోవడంలోనా...ఎలా ?ఎలా ?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ? 


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


తిండిబోతువై...

కుంభకర్ణుడివై... 

పరమ సోమరిపోతువై... 

బద్ధకస్తుడివై... భ్రష్టుడివై...  

దుర్వేసనాలతో బ్రతుకును 

ఈడ్చడంలోనా...ఎలా ? ఎలా ?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ? 


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


విలాస పురుషుడివై... 

విదేశాలలో విమానాలలో 

విహరించడంలోనా... 

పబ్బుల్లో క్లబ్బుల్లో 

విందుల్లో వినోదాల్లో 

మునిగి తేలడంలోనా...ఎలా ?ఎలా ?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ? 


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


శృంగార పురుషుడవై...

అందాలు ఆరబోసే 

సుందరాంగుల పొందులకై 

పరితపించడంలోనా...

డ్రగ్స్ కు బానిసవై

బంగారు భవిష్యత్తును 

బలితీసుకోవడంలోనా...

సోషియల్ మీడియాలో

సొల్లు కబుర్లతోనా...ఎలా ? ఎలా? 

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ? 


ఔను నానేస్తమా ! కాలమే నీచేతిలో 

త్రిశూలమైతే నీవు త్రినేత్రుడవు...

కానీ కాలం గాలానికి నీవు చిక్కితే 

నీవు మహిమలులేని మాంత్రికుడవు...


77. పులిలా బ్రతుకు ....


కదలని 

పులికి 

కడుపెలా 

నిండుతుంది ?

ఆకలితో గుహలో 

అల్లాడి పోతుంది...

నకనకలాడిపోతుంది...

మలమల మాడిపోతుంది...

  

ఔను...

పులి అడవికి వెళ్ళక తప్పదు...

ఆహారంకోసం వెదకక తప్పదు... 

మెల్ల మెల్లగా పిల్లిలా 

నక్కినక్కి నడవక తప్పదు... 

అవసరమైతే ఆహారం కోసం 

వేల మైళ్ళు వెళ్లక తప్పదు.... 


కానీ...

చిక్కినట్లే చిక్కి.... 

దొరికినట్లే దొరికి...

అందినట్లే అంది... 

పరుగులు తీసే జింకల కోసం 

నరాలు తెగేలా... 

పరుగులు తీయక తప్పదు... 

కారణం...అది గడ్డి తినదు గనుక...


అందుకే...

ఓ మనిషి 

బావిలో కప్పలా...

పంజరంలో పక్షిలా...

గదిలో గబ్బిలంలా...బ్రతక్కు...

ఎక్కుపెట్టిన విల్లులా ...

ఎగిరే తారాజువ్వలా...

రగిలే నిప్పు రవ్వలా...

రోడ్డుపై కొచ్చిన వాహనంలా...

ఆకలితో ఉన్న "పులిలా బ్రతుకు"... 

కారణం "వేగమే" నేటియుగంలో ప్రధానం...


78. నేను...నా భారత దేశం...(పార్టు...1)


బుద్ధం శరణం గచ్చామి 

సంఘం శరణం గచ్చామి 

ధర్మం శరణం గచ్చామి అన్న 

....శాంతమూర్తి బుద్దుడు...


ఆంగ్లేయుల నెదిరించి 

వారి గుండెల్లో నిదురించి

వారిని తరిమి తరిమికొట్టి

భరతమాత దాస్యశృంఖలాలను త్రెంచిన 

భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి

...సాహసవీరులు... 


బాలగంగాధర్ తిలక్ 

సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి 

...స్వాతంత్ర సమరయోధులు... 


గాంధీ నెహ్రూ ఇందిర అటల్ అబ్దుల్ కలాం వంటి

...జాతినేతలు పుట్టిన దేశం నా భారతదేశం..!


రక్షణ కవచంవంటి రాజ్యాంగమున్న

...అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం 

నా భారతదేశం..!


79. వందేమాతరం...వందేమాతరం..!


ఏ పాట వింటే...

భారతీయులందరి 

ఒళ్ళు పులకరిస్తుందో...


ఏ పాట వింటే...

తెల్లదొరల గుండెల్లో 

మరఫిరంగులు పేల్తాయో...


ఏ పాట వింటే...

ప్రజలు ఒక ప్రభంజనమై 

ఒక ఉప్పెనై విరుచుకుపడతారో...


ఏ పాట వింటే...

పశువులు శిశువులు 

సైతం ఉలిక్కిపడి లేస్తాయో...


ఏ పాట వింటే...

అణువణువునా 

తరతరాలుగా నరనరాలలో 

స్వాతంత్ర్య కాంక్ష

దేశభక్తి రగులుతుందో...


ఏ పాట వింటే...

మన స్వాతంత్ర్య 

సమరయోధులంతా

పిడికిళ్లు బిగించి సింహాలై

సమరానికి సిద్దమౌతారో...


ఏ మంత్రదండంతోనైతే

మన విప్లవవీరులు

భగత్ సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి

అల్లూరి సీతారామరాజులు

పరమకౄరులైన,

ఆ తెల్లదొరలను ఎదిరించారో...

వారి గుండెల్లో నిదురించారో...


అదేఅదే మన జాతి పదేపదే 

పాడుకునే "వందేమాతరం" 


వందేమాతరమంటే...

ఒక పాట కాదు ఒక తూటా...

వందేమాతరమంటే...  

ఒక గేయం కాదు ఒక ఆయుధం...


వందేమాతరమంటే...

ఒక శంఖారావం ఒక సింహనినాదం...

వందేమాతరమంటే...

జాతిపిత మనకిచ్చిన జైలు పిలుపు...


వందేమాతరమంటే...

చారిత్రాత్మక మైన ఒక గొప్ప మలుపు...

వందేమాతరమంటే మన భరతమాత గెలుపు...


79. ఈ కవికి జ్ఞానోదయమెప్పుడు?


ఓ కవి మిత్రులారా !

కడుపులు నింపని ఈ కవితలు 

మనసుకు ఊరట కలిగిస్తాయని 

ఏదో భ్రమలో ఏదో భ్రాంతిలో 

ఏదో ఊహాలోకంలో ఊరేగుతూ

ఏదో తెలియని మత్తులో జోగుతూ  

ఆనాడు అయోధ్యరాముడు 

ఆ మాయలేడి వెంట పరుగులు తీసినట్టు... 

కష్టపడి కవితలల్లుతూ‌ ప్రశంసాపత్రాల 

బంగారుజింకల వేటలో మనం ఉన్నాం  


స్వార్థమో నిస్వార్థమో అర్థం కాని 

కవితల పోటీలంటూ ఈ సాహితీసంస్థలు 

విసిరే‌ సాహితీసేవా ఉచ్చులో చిక్కుకున్నాం..

 

ఒక శాలువా కప్పితే...చాలు 

ఒక మెమొంటో ఇస్తే....చాలు 

ఊరు పేరులేని ఏ సాహితీ సంస్థైనా 

చిరు సన్మానం చేస్తే.....‌చాలు 

కవిత పేపర్లో కనిపిస్తే..చాలు 

పిల్లవాండ్రు రెండు చాక్లెట్స్ ఇస్తే 

పొయ్యి మీదపాలలా పొంగిపోయినట్లు  

మనం అలా అలా గాలిలో తేలిపోవడం ...


24/7 సాహితీ సాగు చేస్తూ...

కవితల విత్తనాలు చల్లుతూ... 

కామెంట్ల మొక్కల కోసం...

కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడటం.. 

ఎవరైనా "మీ కవిత బావుంది" అంటే చాలు

(పూర్తిగా చదవకపోయినా...కొందరు)  

కొండమీద కోతిలా...

మన మనసు చిందులు వేయడం...

విహంగాల్లా విశ్వంలో విహరించడం... 


కళ్ళ ముందే ...పెనుప్రమాదం 

ఖచ్చితంగా పొంచివున్నా... 

రోజురోజుకు ఆవిరౌన్నా... 

కవిత కవితకు ఆరోగ్యం క్షీణిస్తున్నా

ఖాతరు చేయకుండా పట్టించుకోకుండా  

అటు భర్తలు ( కవయిత్రులకు )...

ఇటు భార్యలు( కవిమిత్రులకు )...

ఇంట్లో చీవాట్లు పెడుతుంటే....కృంగిపోవడం... 

బయట చప్పట్లు కొడుతుంటే..పొంగిపోవడం... 

ఎంతకాలం ? ఇంకెంత కాలం... 


కవితలకు... 

లాక్ డౌన్ పెట్టాలనుకుంటూనే... 

కవిత్వం......ఒక పిచ్చిగా...

సాహిత్యం...ఒక‌ మత్తుమందుగా...

ముందుకు సాగిపోవడం 

ఎంత వరకు న్యాయమో...ఎరికెరుక...

అదృశ్యంగా వుండి....

ఆడించే......ఆ పరమాత్మకే...  

వ్రాయించే...ఆ సరస్వతీమాతకే తెలియాలి... 

నీకు నాకేం తెలుసు...నిమ్మకాయ పులుసు...


80. ప్రేమతీర్థం...పుచ్చుకుంటే..?' 


భార్యభర్తల 

వివాహబంధం ఒక

విచిత్రమైన బంధం ఆ 

మూడుముళ్ళ బంధంలో

మొదటి ముడి...మోహం

రెండో ముడి......అవసరం

మూడో ముడి... స్నేహం


స్వచ్చమైన స్నేహంతో

"సమభావన" అంకురిస్తుంది

ఒకరెక్కువ ఒకరు తక్కువన్న 

ఆలోచనకు "జననమే" లేదు


స్వచ్ఛమైన ప్రేమను

ఒకరికొకరు పంచుకుంటే

గట్టి నమ్మకంతో 

ఒకరినొరొకరు "లతలా"

అల్లుకుపోతే ఇక

''వంచన" వంతెనలెక్కడ?

"కాపురాలు" కూలిపోయేదెక్కడ?


భార్యభర్తల సంబంధానికి

పటిష్టమైన స్నేహమే పునాదైతే 

పడకగదిలో....."పవిత్రతకు" 

ఇద్దరిమదిలో...."ప్రశాంతతకు"

కొదవే వుండదుగా కొంచెమైనా


"సంసారం ఒక సాగరం"

చిన్నచిన్న "పొరపాట్లఅలలు"

అప్పుడప్పుడు ఎగిసిపడతాయి

"నీళ్లల్లో నిప్పును" వెదజల్లుతాయి

చిన్నచిన్న తప్పులే "పెనుఉప్పెనలౌతాయి"

 

ఒకరికొకరు "ప్రేమతీర్థం" పుచ్చుకుంటే

"సహనంతో ఓర్పుతో" సర్దుకుపోతుంటే

ఆ దాంపత్యం "సుందర నందనవనమే"

ఆ గృహం ఇలలో ఒక "భూతలస్వర్గమే"


81. విశ్వవిజేతలు....వారే...


ఏ క్లిష్టపరిస్థితుల మాయో కానీ

ఏ దుష్టశక్తుల ప్రభావమో కానీ

ఏ ప్రకృతి వైపరీత్యమో కానీ 

ఏ విధి వికృత విషప్రయోగమో కానీ


అనుకోకుండా ఆకస్మికంగా

కలలో కూడా ఊహించని రీతిలో 

ఏదో ఒక దుర్ఘటన దుస్సంఘటన 

కనురెప్పపాటులో జరిగిపోయి


అప్పటివరకు 

ఎంతో అభిమానంగా

ప్రాణానికి ప్రాణంగా

ఎంతో అన్యోన్యంగా ఉన్న

అమ్మానాన్నలు, అన్నాతమ్ముళ్ళు 

అక్కాచెల్లెళ్ళు, ప్రాణమిత్రులు

దూరపు బంధువుల మధ్య

బంధాలు తెగి బద్దశత్రువులౌతారు

ఒక్కసారిగా దూరమైపోతారు కానీ


ఎవరైతే దూరంగా వెళ్లినా

తిరిగి దగ్గరకు రావడానికి

పడిపోయినా, పైకి లేవడానికి

చెడిపోయినా, బాగుపడడానికి 

విడిపోయినా, కలిసి బ్రతకడానికి 


మనస్ఫూర్తిగా శక్తి వంచనలేకుండా

విశ్వప్రయత్నం చేస్తారో వారే వారే 

విధిని ఎదిరించే విజయాన్ని సాధించే 

వీరాధివీరులు, శూరులు, విశ్వవిజేతలు


82. ఇదేమి కాపురం "కల్తీ కాపురం" !!! 


ఎదిరించే 

భార్య ప్రక్కలో

ఏ భర్తా ప్రశాంతంగా 

నిదురించలేడు అతడు 

"అర్థనారీశ్వరుడైతే తప్ప"


బెదిరించే 

భర్త‌ ప్రక్కలో

ఏ భార్యా నిశ్చింతగా 

నిదురించలేదు ఆమె 

"అపర కాళికామాతైతే తప్ప"


పెళ్ళికి ముందు 

వారిద్దరు "ప్రేమపక్షులు"

పెళ్ళి తర్వాత 

చిరునవ్వుల"చిలకా గోరింకలు"


నేడు 

"ప్రేమలు"

తరిగిపోయి...

కన్న కమ్మని

"కలలు" కరిగిపోయి...

అనుమానాలు

"అపార్థాలు" పెరిగిపోయి...

ఆ ఇద్దరు బద్ధశత్రువులై

"పిల్లీ ఎలుకలై...పాము కప్పలై"

నిత్యం కాపురం ఒక "నిప్పులకుంపటై...


ఇద్దరికీ "మనశ్శాంతి" కరువై

మానసికంగా ఒకరికొకరు దూరమై

నిన్నటి ఆ బిగికౌగిలి నేడు"విషకౌగిలియై"

నిన్నటి "పండువెన్నెలలు కురిసిన ఆ పడకగది" 

నేడు పగాప్రతీకారాలు తీర్చుకునే "రచ్చబండయై"

రాత్రింబవళ్లు ....

రాస క్రీడ‌యై

రాక్షస యుద్ధమై...

రంపపు కోతయై....

బ్రతుకు రావణకాష్టమై రగిలి పోతోంది...


ఉండే ఇళ్ళు ఒక్కటైనా...

పడుకుండే పాన్పు ఒక్కటైనా...

మాటలు లేక మౌనంగా

కసితో కక్షతో పగతో రగిలిపోతూ...

ఒకరిపై ఒకరు విషం గ్రక్కుకుంటూ... 

కనిపిస్తే కత్తులు విసురుకుంటూ...

కుత్తుకలు తెంచుకుంటూ...

ఒకరి వినాశనాన్ని మరొకరు

ఒకరి మరణాన్ని మరొకరు కోరుకుంటూ...

కడుపులో కత్తులుంచుకొని కౌగలించుకొంటూ...

కాలం గడుపుతున్నారు "కల్తీ కాపురం" చేస్తున్నారు


మరి వీరు మారేదెప్పుడు...?

నాటి ఆ కమనీయమైన"ఆ కళ్యాణ వేదికను"...

నాడు "దీర్ఘాయుష్మాన్ భవ" అంటూ 

"ఈ కొత్త జంట మా కనుల పంట" అంటూ 

"చిరకాలం చిలకాగోరింకల్లా" జీవించమంటూ

అక్షింతలు జల్లి ఆశీర్వదించిన"ఆ అతిథిదేవుళ్ళను"

కన్న "అమ్మానాన్నలను" కొన్న "అత్తామామలను"...


నాడు శోభనం గదిలో గడిపిన 

ఆ సరస సంగీత శృంగార "రసభరిత‌ రాత్రులను"...

విహారయాత్రలకెళ్ళి పిండారబోసినట్టి 

పండువెన్నెలలో ఏకాంతంగా మత్తులై 

ఉన్మత్తులైన గడిపిన ఆ తియ్యని తేనియల 

మరణంవరకు చెరగని "ఆ మధురమైన రాత్రులను"...

"ఆ తీపిజ్ఞాపకాలను" నెమరు వేసుకుంటూ...


సహనంతో...సర్దుబాటుగుణంతో...

సంయమనంతో...సమయస్పూర్తితో...

సలసలకాగే సమస్యల్ని చల్లార్చుకుంటే చాలు

ఇక ఆ ఇద్దరిలో...

"కొత్త ఆశలు" చిగురిస్తాయ్ !

ఆ కల్తీకాపురంలో...

"కారుచీకట్లు" తొలిగిపోతాయ్ !

"ప్రేమలు" పరిమళిస్తాయ్...

"పండువెన్నెలలు" కురుస్తాయ్ !

నిన్న 

"సునామీలు పుట్టిన...

"సుడిగాలులు రేగిన"... 

ఆ సున్నితహృదయాల్లో నేడు

"సుఖశాంతులు" వెల్లివిరుస్తాయ్ !

 

83. హాయిగా..."హంస"లా...జీవించు...! 


ఓ నా ప్రియ నేస్తమా ! 

నీ పరుగు ఆపకు...

నీ గమ్యం‌ చేరేవరకు...

నీ లక్ష్యం నెరవేరేవరకు...

నీ మాటలో నీ బాటలో 

భారతీయతనే..........."జపించు"

విశ్వశాంతికై నిత్యం....."తపించు"

...స్వామి వివేకానందలా


నీలోని పగా ప్రతీకారాన్ని...

అసూయా ద్వేషాన్ని...

కోపాన్ని క్రోధాన్ని... 

తక్షణమే....."త్యజించు"

...గౌతమబుధ్ధునిలా


నీ శత్రువులను సైతం.........."ప్రేమించు"

నిన్ను హింసించిన వారిని... "క్షమించు" 

మంచిని మానవత్వాన్ని......"ప్రబోధించు"

...ప్రభువైనయేసుక్రీస్తులా


అట్టడుగు వర్గాల హక్కులకై 

నీ రక్తాన్ని స్వేదంలా...."చిందించు 

"నిప్పులా.................."జ్వలించు

అణగద్రొక్కబడిన నీ జాతి 

స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం 

నిరంతరం.................."పోరాడు"

...డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ లా


రక్తపాత రహితంగా...

అహింసే ఆయుధంగా...

ఊపిరి ఓపిక ఉన్నంతవరకు...

ఉక్కుసంకల్పంతో..."ఉద్యమించు

పులులనైనా ...

సింహాలనైనా........."ఎదురించు" 

నీ హక్కుల్ని.........."సాధించు"

...జాతిపిత మహాత్మాగాంధీలా


అమాయకుల అజ్ఞానుల 

నేత్రాలు..........."తెరిపించు"

వారికి సుఖజీవన నవజీవన 

సూత్రాలను......"బోధించు

ఆథ్యాత్మికంగా..."జీవించు"

... శ్రీ రామకృష్ణ పరమ"హంస"లా


84. గుప్పెడు గుండెలో...


గతం తాలూకు 

తీపి జ్ఞాపకాలు...!


మదిలో 

మానని గాయాలు...!


ఎదురైన

చేదు అనుభవాలు...! 


తగిలిన

ఎదురు దెబ్బలు

పెట్టిన పెడబొబ్బలు...!


జీవితంలో

నేర్చుకున్న కొత్తపాఠాలు...!

 

గుండెల్ని

గుచ్చుకున్న గుణపాఠాలు...!


బంగారు బాటలు వేయాలి 

వెన్నెల వెలుగులు తేవాలి...!


చీకటిలో చిరుదివ్వెలు కావాలి 

గుప్పెడుగుండెలోని గంపెడుఆశలు తీరాలి...!


85. ఓ అమ్మా ! ఓ నాన్నా !

మీకు వందనం ! పాదాభివందనం !!


నాకై

నీ ఎర్రని రక్తాన్ని 

తెల్లని చనుబాలుగా 

అందించి ఆకలి తీర్చిన

ఓ అమ్మా ! నీకు వందనం !

అభివందనం ! పాదాభివందనం !


నాకై

నీ ఎర్రని రక్తాన్ని స్వేదంగా 

చిందించి రేయింబవళ్ళు 

రెక్కలు ముక్కల్జేసిన

ఓ నాన్నా ! నీకు వందనం ! 

అభివందనం ! పాదాభివందనం !!


ఈ అనంత సృష్టిలో 

అత్యంత ఉన్నతమైన 

ఉత్తమమైన ఉత్కృష్టమైన

ఈ మానవజన్మను నాకందించిన

ఓ అమ్మా ! ఓ నాన్న ! మీకు వందనం !

అభివందనం ! పాదాభివందనం !!


మీ పాదారవిందాలకు 

పాలాభిషేకం చేసి

మీ పాదపద్మాలకు మ్రొక్కి 

పంచభూతాల సాక్షిగా

నేడు ప్రమాణం చేస్తున్నా

మీకు ఆకలైతే 

మీ నోటికి అన్నాన్నౌతా

మీకు చలివేస్తే 

మీ ఒంటికీ దుప్పటి నౌతా


మీకు చూపు తగ్గితే 

మీ కంటికి వెలుగునౌతా

మీరు నడవలేకపోతే 

మీ చేతికి ఊతకర్రనౌతా

మీరు మంచాన పడితే 

మీకు మందునౌతా


మీ కంట కన్నీటిచుక్క 

రాలకుండా కంటిపాపలా 

మిమ్ము కాపాడుకుంట

మీరు నాకు రెండుకళ్ళు 

మీరే నా ప్రత్యక్ష దైవాలు

మీమ్ము నా గుండెగుడిలో 

ప్రతిష్టించుకుని, నిత్యం

ప్రతినీత్యం స్మరించుకుంట


మీ కళ్ళలో 

ఆనందం కోసం 

మీ ముఖాలలో

చెరగని చిరునవ్వు కోసం, నా 

ప్రాణాలనైనా అర్పించేందుకు సదానేనుసిద్దం

ఓ అమ్మా ! ఓ నాన్న ! మీకు వందనం!

అభివందనం ! పాదాభివందనం !!


86. మన్మధుని మాయాజాలం ?


ప్రేమించే వయసు వచ్చిందా?

ప్రేమించే పిల్ల నచ్చిందా?  

అది నిజమైన ప్రేమా?

అర్థం లేని ఆకర్షణా ?

అది తొలి పరిచయమా ? 

కళ్ళుపొరలు కమ్మిన కామమా?


ప్రేమించిన వాన్ని ఒక్కసారైనా  

చూడాలని కలసి మాట్లాడాలని 

కమ్మని కలలు కనడమెందుకు ?


తలుపు దగ్గర వాడి పిలుపుకోసం 

తహతహలాడి పోవడమెందుకు ?

తపించడం జపించడమెందుకు? 


లేఖకోసమో ప్రియురాలి రాకకోసమో

ఒళ్ళంతా కళ్ళుచేసుకుని ‌వాడు

నిద్రమాని నిరీక్షించడమెందుకు ?


చదివే చదువు బుర్రకెక్కక పోవడం 

తిన్న తిండి సహించకపోవడం 

కాళ్లు చేతుల్లో చమటలు పట్టడం 

ఊపిరాడక‌‌పోవడం ఇలా ఇద్దరు  

ఉక్కిరిబిక్కిరై పోవడమెందుకు?


ఏదో మత్తులో మాయలోఉండేవేళ

అహోరాత్రులు అష్టకష్టాలుపడి 

కని, పెంచిన అమ్మానాన్నలసలు

గుర్తుకు రాకపోవడమేమిటి ?


అమ్మానాన్నల అక్కాచెల్లెళ్ల 

అన్నాతమ్ముళ్ళ స్నేహితుల 

శ్రేయోభిలాషుల బంధువుల 

చెక్కెరలాంటి చక్కనిసలహాలు

చెవులకెక్కక పోవడమేమిటి ?


ఔను ప్రేమఊబిలో పీకల 

వరకు కూరుకుపోవడమే

మదిలో మన్మధభాణాలు 

గ్రుచ్చుకొని తీరనికోర్కెలతో 

రగిలిపోవడమే ప్రేమంటే...!


అదే పిచ్చి ప్రేమంటే...!

అదే ప్రేమ మాయంటే...!

అదే లోతైన ప్రేమలోయంటే...! 

అదే మన్మధుని మాయాజాలమంటే...!


87. ఆగస్టు 15 - అర్థరాత్రి స్వాతంత్ర్యం?


ఆనాడు‌ 

అల్లూరి సీతారామరాజు

భగత్ సింగ్ ఝాన్సీలక్ష్మీబాయిలాంటి 

విప్లవ వీరులెందరో...

తెల్లదొరల మరఫిరంగులకు నేలకొరిగితేనే...


గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్

సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి

జాతినేతలెందరో....

లాఠీదెబ్బలు తింటేనే...జైళ్ళల్లో మ్రగ్గితేనే...


స్వాతంత్ర్య కాంక్షతో రగిలిపోయే

స్వాతంత్ర్య సమరయోధులెందరో...

జాతిపిత పిలుపుతో జనసంద్రమై

పిడికిళ్లు బిగించి "క్విట్ ఇండియా"

అంటూ "సమర శంఖాన్ని" పూరిస్తేనే...


"వందేమాతరం" అంటూ 

దిక్కులు పిక్కటిల్లేల నినదిస్తేనే...


దేశభక్తులెందరో

ఉద్యమకెరటాలై 

అహింసామార్గంలోె 

ఉవ్వెత్తున ఎగసిపడితేనే...


విప్లవ సింహాలై 

అలుపెరుగక పోరాటం చేస్తేనే...

తమ ప్రాణాలను ఫణంగా పెడితేనే...

జులియన్ వాలాబాగ్ లో రక్తతర్పణచేస్తేనే...

వచ్చింది...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం ...


ఈ భారతజాతికి

అంబేద్కర్ అందించిన 

- రక్షణ కవచమే రాజ్యాంగం

పంచిన అమృత ఫలాలే...

- పౌర హక్కులు

- స్వేచ్ఛా - స్వాతంత్ర్యం 

- సమానత్వం - సౌభ్రాతృత్వం

ప్రసాదించిన అద్భుత వరాలే...

- భిన్నత్వంలో ఏకత్వం

- రామరాజ్యం - ప్రజాస్వామ్యం


88. ఎక్కడ ? ఎక్కడ ?ఎక్కడ?


ఎక్కడుంది ? ఎక్కడుంది ?

ఈ ప్రపంచంలో శాంతి సమాధానం ?

ఎటుచూసినా భీకరయుద్ధాలే...

అమాయక ప్రజల రక్తపుటేరులే...

రెక్కలు విరిగిన శాంతి కపోతాలే...


ఎక్కడుంది ? ఎక్కడుంది ?

ఈ సమాజంలో సమానత్వం ?

ఎటుచూసినా పేదరికమే...

కూడు గూడులేని నిరుపేదలే...

దుర్గంధంలో దుర్భర దారిద్ర్యంలో

మురికివాడల్లో పూరిగుడిశల్లో 

జీవించే జీవశ్చవాలే...

విద్యకు విజ్ఞానానికి 

స్వేచ్చా స్వాతంత్ర్యాలకు

నోచుకోని విధివంచితులే...


ఏమున్నది ? ఏమున్నది ?

గర్వకారణం ? ఎటు చూసినా 

మెతుకులకై ఆరాటమే... 

అనునిత్యం పోరాటమే...

చెత్తా చెదారం ఏరుకుంటూ...

పంపునీళ్ళతో కమ్మగా 

కడుపునింపుకుంటూ...

చెత్తకుండీలచెంత 

"కుక్కలతో కుస్తీపడే వీధిబాలలే"...


ఎక్కడిది ? ఎక్కడిది ?

సూర్యోదయమెరుగని ఆ చీకటి 

బ్రతుకుల్లో సుఖము శాంతి...?

ఔను మేధావులు పాలకులు కావాలి

పాలకులు కరుణామయులు కావాలి

ప్రజాచైతన్యం రావాలి 

పేదరిక నిర్మూలన జరగాలి 


89. విపత్తులో విశ్వం...

(వి అనే అక్షరంతో కరోనా కవిత)


ఇది ఏ

వి/ధి ఆడిన 

విం/త నాటకమో,గాని

వి/షక్రిమొకటి ఈ నేలపై పుట్టింది

వి/మానాలలో 

వి/చ్చలవిడిగా

వి/హరించే నరులపై

వి/సిరింది తన పంజా

వి/శ్వమంతా

వి/స్తరిస్తుంది

వి/ర్రవీగుతుంది

వి/జృంభిస్తుంది, దీని

వి/షపు కోరలకు చిక్కినవారు

వి/లవిలలాడిపోతున్నారు ఓ

వి/పత్తులా

వి/రుచుకుపడి ఒక మృత్యువై

వి/లయతాండవం చేస్తుంది

వి/కటాట్టహాసం చేస్తుంది

వి/షాన్ని చిమ్ముతుంది, 

వి/షాదాన్ని నింపుతుంది

వి/ధ్వంసాన్ని సృష్టిస్తుంది 

వి/స్తుపోయేలా ప్రపంచమంతా

వి/నిపిస్తుంది మరణం మృదంగం

వి/నడమే కాని కంటికి కనపడని

వి/కృతమైన 

వి/చిత్రమైన ఈ

వి/షక్రిమి

వి/రుగుడుకోసం ఈ

విం/త వ్యాధి అంతంకోసం

వి/శ్వమంతా ఏకమై

వి/శ్రమించక శ్రమిస్తుంది

వి/జయకాంక్షతో వాక్సిన్ కోసం

వి/శ్వప్రయత్నమే చేస్తోందొక టీకా కోసం


90. పరువు హత్యలు....


ఎంతకాలం అలా బస్ స్టాపులో 

దొంగచూపులు చూసుకుంటారు 


ఎంతకాలం సెల్లో 

దొంగమాటలు మాట్లాడుకుంటారు 


ఎంతకాలం పార్కులో 

దొంగచాటుగా కలుసుకుంటారు 


ఎంతకాలం మీ కన్నవాళ్ళకళ్ళకు 

గంతలు కడతారు, కొంతకాలమే కదా


కళ్ళకు పొరలు కమ్మినంత కాలమే 

చీకటి తెరలు చిరగనంత కాలమే 


ఆపై అంతా బట్టబయలెే

దొంగలిద్దరు అందరిముందు దోషులే 


అందుకే ఇద్దరిక

దాగుడు మూతలు మానండి 

ధైర్యంగా ముందుకు రండి  


కడుపులో వున్నది కక్కండి  

మనసులో ఉన్నది చెప్పండి 


వ్యక్తం చేయనంతకాలం

మీ ప్రేమ వ్యర్థమే 

అది దాచుకున్నంతకాలం 

మీ బ్రతుకు దగ్దమే 


ఆస్తిఅంతస్తులు అడ్డువస్తే

ఆర్జించవచ్చు అధిగమించవచ్చు

కాని కులమతాలు అడ్డువస్తేనే

కుట్రలు కుతంత్రాలు పెరిగేది

పరువు హత్యలు జరిగేది జాగ్రత్త సుమీ !


91. చిరునవ్వుల జాతర...!


చిమ్మ చీకటి వెనుక 

నిండుపున్నమి ఉండు 

చిరునవ్వుల జాతరలుండు 


ఓటమి వెనుక ఒక గుణపాఠముండు

ఘనవిజయం వెనక ఒక ఘనత ఉండు


ఆకలికేకల వెనుక అస్థిపంజరాలుండు

అస్థపంజరాల వెనుక ఆక్రందనలుండు

ఆ ఆక్రందనల వెనుక ఆకలి చావులుండు


ఆకలి వెనక శ్రమశక్తి ఉండు 

శ్రమశక్తి వెనుక శ్రమదోపిడీ ఉండు

అంటరానితనం వెనుక అమాయకత్వం 

అమాయకత్వం వెనుక అజ్ఞానముండు

అజ్ఞానంవెనుక అణిచివేతలుండు 

అణచిచేతల వెనుక అగ్నిజ్వాలలుండు 


ఆ అగ్నిజ్వాలలే విజ్ఞానవీచికలై కత్తులై కాగడాలై విప్లవ శంఖాలను పూరించు 


ఉద్రేకం వెనుక ఉన్మాదముండు

ఉన్మాదం వెనుక ఉగ్రవాదముండు

ఉగ్రవాదం వెనుక ఉక్కుపాదముండు

ఇవే నగ్నసత్యాలు..నిప్పులాంటి నిజాలు 


92. మట్టినుండే‌ మెతుకు‌ పుట్టె !


ఒకరు...శ్లోకాలు పఠించి పఠించి

ఓ కొత్త జంటకు కమనీయంగా 

కళ్యాణం జరిపించే

శోభనంగదికి పంపించే

జేగంటలు మ్రోగించే

సంతానం కోసం సమరం జరిపించే

కెవ్వుమన్న ఓ కేక వినిపించే

కొత్త జంటల కడుపు‌లు..."పండే"


ఒకరు...రేయింబవళ్లు

రెక్కలుముక్కల్జేసిదుక్కి దున్నే

సేద్యం చేసే స్వేదం చిందించే

మట్టిని మంత్రించే మెతుకును సృష్టించే

కోట్లాదిమందికి కడుపులు..."నిండే"


ఒకరుండే గుడిలో చల్లనినీడలో

ఆ పరమేశ్వరుని పదసన్నిధిలో...


ఒకరుండే మడిలో ఎర్రని ఎండలో

దళారుల దగాకోరుల విషకౌగిలిలో...


మరి వీరిలో విజేత ఎవరు ?

ఇద్దరూ విజేతలే కారణం...?


ఒకరు మెతుకును...సృష్టిస్తే

మరొకరు ఆ మెతుకును 

సృష్టించే శక్తినే...సృష్టించే...


ఔనానాడు మట్టి నుండే ఈ మనిషి పుట్టె

నేడా మట్టినుండే‌ మళ్ళీ ఓ మెతుకు‌ పుట్టే


93. ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా..!

(యువతకు వివేకానందుని సందేశం)


ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా..!

మీరు పాపులు కాదు పరమపవిత్రులు...

మీరు వృద్ధులు కాదు యువకిశోరాలు...

మీరు బలహీనులు కాదు బాహుబలులు...

పిరికివాళ్ళం మేమేమీచెయ్యలేమనకండి...

శవాలే నయమనేలా బానిసలై బ్రతక్కండి...

వీరులై విజయశంఖారావాన్ని పూరించండి...


ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా..!

మేము ఏదైనా సాధించగలమనే

అఖండ విశ్వాసంతో అగ్నికణాలై...

ఇనుప కండరాలతో ఉక్కునరాలతో

శత్రువులకు సింహస్వప్నం కావాలి...

ఉత్తర కుమారులవోలె ఉరమకండి...

చీల్చే చిరుతలై ముందుకు దూకండి...


ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా..!

లేవండి మీరు సింహాలని గుర్తుంచుకోండి...

మీ గమ్యం చేరేవరకు మీ పరుగు ఆపకండి...

భయపడకండీ ధైర్యంగా బలంగా వుండండి...

అభివృద్ధికి సోపానం సాహసం సత్సంకల్పమే... 

బలం ఒక జననమే బలమహీనత ఒక మరణమే...


ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా..!

బద్దకమొక బద్దశత్రువు అదొక మాయరోగం ఆ

వింతరోగంతో వీధిలో తిరిగే హక్కు మీకెక్కడిది?...

వెలిగే సూర్యున్ని చూస్తే చీకటి భయపడుతుంది...

శ్రమించే మనిషిని చూస్తే ఓటమి భయపడుతుంది...

మీరు విశ్రమించక శ్రమించాలి విశ్వవిజేతలై వర్ధిల్లాలి... 


94. పరమాత్మకు ప్రతిరూపం...


ఓ మనిషీ ! నీ "ఆనందం" 

నీకు "అందిన అమృతం" 

అది నీకు ఆరోగ్యాన్ని 

ఆయుష్షును ప్రసాదిస్తుంది 


నీ కన్నీటి మేఘాల వెనుక 

చిరునవ్వుల చినుకులుంటాయి


ఆ భగవంతునిపై 

నీకు అపారమైన భక్తి

విశ్వాసముముంటే చాలు

సుడిగాలులైనా సుడిగుండాలైనా

భయాలైనా బాధల భూతాలైనా  

నీకు సుదూరంగా ఉంటాయి


"సుఖసంతోషాలు" 

సూర్యుని చుట్టూ భూమిలా

నీ చుట్టే తిరుగుతు ఉంటాయి 


ఓ మనిషీ ! నీ "ఓటమి" 

నీకు ఓర్పును నేర్పుతుంది

నీ "విజయం" పగలు సూర్యునిలా 

రాత్రి చంద్రునిలా ప్రకాశిస్తుంది 

నీవున్నా...లేకున్నా...

"ఒలంపిక్ జ్యోతిలా"

నిత్యం వెలుగుతూనే ఉంటుంది


ఓ మనిషీ ! నీవు మంచినే చేస్తూ 

మంచినే నిత్యం జపిస్తూ...తపిస్తూ

మంచితనం...మానవత్వమే...

"ఆర్జించిన ఆస్తిగా" నీవు అస్తమించి

మరలిరాని లోకాలకు తరలి పోతేనేమి ? 


ఓ మనిషీ...నీవు మహనీయుడవే...

మహాత్ముడవే...చింజీవివే...ధృవతారవే...

దయామయుడు...

కరుణామయుడు...

ప్రేమామయుడైన...

ఆ "పరమాత్మకు" నీవు "ప్రతిరూపానివే"...


95. ఒంటరి జీవితం ఒక శాపమా? 


పార్టు...(1)


ఔను 

ఒంటరి జీవితం 

చాలా దుర్భరం... 

దుఃఖదాయకం...

జతగా ఉంటేనే జగతి మెచ్చు...

జగతిలో జంట జీవితం...

భగవంతుని వరం... 

అదృష్టం...ఆనందదాయకం 

ఆ జీవితం సుఖసంతోషాల 

సుందర నందనవనం... 


విడివిడిగాతిరిగే పక్షులనైనా

జంతువులనైనా 

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగే 

ఏ పరిచయంలేని జనులనైనా 

కలుపుతోంది కాలం 

జననం మరణం జతగా జీవనం...

అంతా ఆ దైవ నిర్ణయం....

అది ప్రకృతి ధర్మం సృష్టి మర్మం...


కొన్ని కలయికలు కాకతాళీయం...కానీ 

స్త్రీపురుషుల కలయిక లేక సృష్టి ఎక్కడిది?

ఆ కలయిక సరసం కోసం కావచ్చు 

సంతానం కోసం కావచ్చు 

శృంగార కోసం కావచ్చు 

సుఖజీవనం కోసం కావొచ్చు... 


పార్టు...(2)


అది ఒక అపురూపమైన బంధం 

కొన్ని బంధాలు అనుబంధాలు 

కొంత కాలమే కానీ 

ఏ బంధం శాశ్వతం కాదు...

కాని కళ్ళు కళ్ళు కలిసి 

మనసు మనసు ఏకమై 

కలిసి జీవించాలన్న కోరిక పుట్టి 

అది స్వచ్చమైన ప్రేమగా మారి 


ఏదో ఒక సుముహూర్తంలో 

కళకళలాడే ఓ కళ్యాణ వేదికపై

ముక్కోటిదేవతల దీవెనలతో  

మూడుమూళ్ళుపడి

ఏడడుగులు నడిచి 

అతిథుల ఆశిస్సులతో...

అక్షింతలతో ఒకటౌతారు 

ఒక జంటగా 

కనులపంటగా ఉంటారు 

చిరకాలం 

చిలకా గోరింకల్లా ఉండాలని 

కమ్మని కలలెన్నో కంటారు 


కానీ కొన్ని జంటలే 

కలకాలం కలిసి ఉండేది 

కొన్ని జంటలు విధివక్రించి 

భగభగమండే అనుమానాల 

అపార్థాల మంటల్లో దగ్ధమై

పామూ కప్పలై నిత్యం 

కాపురం నిప్పుల కుంపటై  

కలిసి బ్రతకలేక విడిపోతారు 

ఒంటరి పక్షులై విపిస్తూ ఉంటారు... 


పార్టు...(3)


మగరాయుళ్ళు...మాత్రం 

మళ్ళీ కొత్తపెళ్ళికొడుకులై 

నూతన జీవితం ప్రారంభిస్తారు...

మహిళలకే బ్రతుకు నరకం...ఔను 

ఒంటరి మహిళలంటే అందరికీ అలుసే...

అంగడి సరుకే...రక్షణ కరువే....


మహిళలుగురైతే మానభంగానికి...

వెలివేసి వేధించే ఈ వెర్రిసంఘానికి..

వెరవక మహిళలంతా ఏకమై 

ఉక్కుసంకల్పంతో ఉద్యమించాలి...

ఈ సభ్యసమాజం మారాలి... 


స్త్రీలే స్త్రీలకు శతృవులు కారాదు...

మగవారు సైతం మానవ మృగాలుగా  

కామాంధులుగా మారరాదు 

మగవారిలో మంచితనం మానవత్వం 

సభ్యత సంస్కారం పెరగాలి... ...

కఠినమైన చట్టాలు పుట్టాలి... 

ఒంటరి మహిళల కంటకన్నీరు తుడిచి 

బ్రతుకుమీద ఆశనుపెంచే పథకాలను 

ప్రభుత్వాలు పాలకులు చేపట్టాలి... 


సృష్టికి మూలమైన ఈ స్త్రీ

విలాస వస్తువుగా కాక 

ఒక కన్న తల్లిలా... 

కనిపించే దేవతలా...

పూజలందుకోవాలి.... 

అర్థరాత్రిలో స్త్రీలు ఒంటరిగా  

స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలి... 

పంజరంలో పక్షుల్లా కాక 

చెరువులో చేపల్లా

తిరగాలి.........స్వేచ్ఛగా

వినువీధిలో విహంగాల్లా

ఎగరాలి.........హాయిగా 

నిదురించాలి...నిశ్చింతగా 

జీవించాలి.......ప్రశాంతంగా 

ఒంటరితనం...ఏ స్త్రీకి ఒక శాపం కారాదు.


96. కరుణించవమ్మా ! ఓ కనకదుర్గమ్మ ! 


ఈ వసంతకాలంలో ఈ శరన్నవరాత్రుల్లో 

తల్లీ ! ఓ తల్లీ ! ఓ మా కల్పవల్లీ ! మమ్ము 

కరుణించి కాపాడవమ్మా ! ఓ కనకదుర్గమ్మ ! 


మాతా ! ఓ దుర్గామాత ! మా చింతల 

చీకాకుల చితిమంటలు మీ చల్లని 

చూపుల చిరుగాలులతో చల్లారిపోనియ్


మాతా ! ఓ దుర్గామాత ! కన్నీటి వరదలైన 

మా కంట ఆనంద భాష్పాలు రాలనియ్...


మాతా ! ఓ దుర్గా మాత ! 

తరతరాలకు తరగని సిరిసంపదలు 

శాంతిసౌభాగ్యాలు మా ఇంట పొంగిపొర్లనియ్...


అంబా ! ఓ జగదాంబా‌ ! అంబరాన్నంటే 

సంతోష‌ సంబరాలతో చిరునవ్వులతో 

మమ్ము చిందులు వేయనియ్...


తల్లీ ! ఓ తల్లీ ! ఓ మా కల్పవల్లీ ! 

సూర్యోదయమే ఎరుగక చితికిన మా చీకటి 

జీవితాలు సుఖశాంతులతో వర్థిల్లనియ్...


ఆకలి కేకలు...చిమ్మచీకటి తప్ప

వ్యాధులు...వ్యధలు...వేదనలు తప్ప... 

భయాలు బాధలు విచారం విషాదమే తప్ప

వినోదం వికాసం లేని మోడువారిన మా 

ఎడారిబ్రతుకుల్లో వేయివెన్నెల్ని కురవనియ్


తల్లీ ! ఓ చల్లని తల్లీ ! మా ఇంటి కల్పవల్లీ ! 

కరుణించి కాపాడవమ్మా ! ఓ కనకదుర్గమ్మ ! 


97. ఓ మానవుడా ! 

      నీ వెంతటి మహోన్నతుడివయ్యా !


భగభగమండే 

సూర్యుని చెంతకు చేరి

భస్మమైపోకుండ మంత్రించి 

ఓ యంత్రాన్నే 

పంపించి సూర్యదేవుని 

గుట్టంతా రట్టుచేస్తున్నావే !

ఓ మానవుడా ! 

నీ వెంతటి "మహనీయుడవయ్యా" !


ఆకాశహార్మ్యాలతో 

సుందర నగరాలు

తరతరాలకు చెక్కుచెదరని సుందరశిల్పాలతో

కళ్ళు తిరిగే గుళ్ళుగోపురాలు నిర్మిస్తున్నావే !

ఓ మానవుడా ! 

నీ వెంతటి "మహోన్నతుడివయ్యా"!


క్లోనింగ్ లతో  

టెస్టు ట్యూబ్ బేబీలతో 

గుండెమార్పిళ్ళతో 

సృష్టికే ప్రతిసృష్టి చేస్తున్నావే !

అంతర్యామినే 

ఆశ్చర్యచకితున్ని చేస్తున్నావే !

ఓ మానవుడా ! 

నీ వెంతటి "అపర బ్రహ్మ" వయ్యా!


ఆ నీలినింగిలో 

విహంగంలా విహరిస్తున్నావే !

రాకెట్లతో ఎగిరి అంతరిక్షం అంతుచూస్తున్నావే !

అంతుదొరకని 

సృష్టిరహస్యాలను 

వెలికితీస్తున్నావే !

ఓ మానవుడా ! 

నీ వెంతటి "విజ్ఞాన గని"వయ్యా !


ప్రకృతి ప్రకోపించి కుంభవృష్టిని 

మంచుతుఫాన్లను సునామీలను 

భూకంపాలను సృష్టించినా  

అగ్నిపర్వతాలు బ్రద్దలై 

లావాను విరజిమ్మినా 

చింతయేలేక చిరునవ్వుతో 

చిందులు వేస్తున్నావే !

ఓ మానవుడా ! 

నీ వెంతటి "స్థితప్రజ్ఞుడివయ్యా" !


మహత్తర ప్రయోగాలతో 

మందులు టీకాలు కనిపెట్టి

ఆయుష్షును పెంచుకొని 

అమరత్వాన్నాశిస్తున్నావే !

మృత్యుశాసనం లిఖిస్తూ 

మృత్యువునే శాసిస్తున్నావే !

ఓ మానవుడా ! 

నీ వెంతటి "మృత్యుంజయుడివయ్యా" !


98. నరజాతికి నమస్కారం...


ఆత్మస్థైర్యం

ఆత్మ జ్ఞానం

ఆత్మ బలం 

ఆత్మ త్యాగం 

ఆత్మ గౌరవం

ఆత్మ విశ్వాసం

ఆత్మ సాక్షాత్కారం

ఆత్మ జీవాత్మ పరమాత్మ 

ప్రేతాత్మల అవగాహనలే ముద్దు 

ఆత్మ న్యూనత...

కులమతాల కుమ్ములాటలే వద్దు


పరమతద్వేషం వద్దు 

పరమతసహనమే ముద్దు

విభేదాలు విద్వేషాలు వద్దు

భిన్నత్వంలో ఏకత్వమే ముద్దు 


నీ కులమేదని నిలదీసి అడిగితే

దారినవెళ్ళు కుక్కలు సైతం

పక్కుననవ్వేనురా...కారణం

కుక్కల్లో లేదురా "కులతత్వం"... 


మన మనసంతా 

"నిండితే మానవత్వం"  

ఇక మతాలతో పనేముంది?

మరి మతమన్నదే లేకుంటే

ఇక మారణహోమమెక్కడిది ?

నడిరోడ్డుపై నరమేధమెక్కడిది?

అందుకే...చేయాలి 

కౄరమైన "నరజాతికి నమస్కారం"

చెప్పాలి "స్వేచ్చస్వాతంత్ర్యాలకు స్వాగతం" 


99. ఎడారి గుండెలో ఏముందో?


నీవు ఉప్పువు 

నేను నిప్పని తెలుసు 

నీకు నాకు పడదని తెలుసు 


నీ నీడ ఆకాశంలో నిద్రపోతూ 

జారి కత్తుల వంతెన మీదపడింది

నెత్తురు మంచుగడ్డై పోయింది 


నీవు నాడు ఆరబోసిన అందాలన్ని 

నేడు ఆరిపోయే దీపాలయ్యాయి 

వాడిపోయే పూలయ్యాయి 


అక్కరకు రాని అందాలను 

లెక్క వేసుకుంటూ 

ముక్కలైన బంధాలను 

ఏరుకుంటున్నావు


మూడుముళ్ల బంధం 

ఒక ముచ్చటైనందుకు 

అనుబంధాలు ముళ్ళమీద 

పారేసుకున్న బట్టలైనందుకు బాధలేదు 


నీ నిర్దయ నన్ను గడ్డివాములో 

తగలబెట్టింది ఐనా బాధలేదు 


నీ చూపులు చురకత్తులై 

నీ చేదుజ్ఞాపకాలు గుణపాలై 

గుండెల్లో గుచ్చుకున్నాయి ఐనా బాధలేదు 


నాకు కన్నీళ్లు రావడం లేదు 

ఏనాడో ఇంకిపోయాయి 


నా ఎడారిగుండె నీ తలపులతో 

ఒక పూలతోటై మళ్ళీ విరిసింది 

మనసులో ప్రేమవాన కురిసింది


100. తెలుగు భారతికి అక్షర హారతి


తెలుగు భాషంటే..."వెలుగు భాష"

తెలుగు భాషంటే...ఒక "సముద్రపు ఘోష"

తెలుగు యాసంటే... "గొంతులో శ్వాస"


కొమ్మల్లో దాగిన జుంటి తేనియలకన్న

మధురమైనది..."మనతెలుగుభాష"

ఒయ్యారా లొలికే ఆ బాపుబొమ్మ కన్నా

అందాల ఆ చందమామ కన్నా అతి 

సుందరమైనది..."మన తెలుగుభాష"


పరుగుల తీసే మన సజీవ నదులన్నవి

తమ పరుగులు భారతావని వరకేనని కానీ 

ఈ విశాల విశ్వంలో ప్రవహించనిదెక్కడ

"తేనెలూరే నా తెలుగు నది"


"అమ్మతనమున్నది" అందమైన మనతెలుగుభాషలో...

"తెలుగుతనమున్నది" పింగళి వెంకన్న వూహల్లో

 పురుడుపోసుకున్న మన జాతీయజెండాలో...


దేశాలెన్నిదండెత్తినా చలించనిది"మనభరత ఖండం"

పరాయి బాషలెన్ని దండయాత్రలు చేసినా

చెక్కుచెదరినిది...మన "తెలుగుభాషా సౌందర్యం"


ఎక్కడ తెలుగు వుంటుందో అక్కడ వెలుగు వుంటుంది

ఎక్కడ వెలుగు వుంటుందో అక్కడ వికాస ముంటుంది


తెలుగు భాషే మన శ్వాస...తెలుగు భాషే మన ఊపిరి

తెలుగుతల్లే మనదేవత...

ఆ తల్లికిదేనా వందనం పాదాభివందనం 


101. తెలుగు ఎక్కడో వెలుగు అక్కడ


నా తెలుగు భాష నా జాతి ఆత్మ ఘోష

నా తెలుగు యాస నా జాతి జీవనశ్వాస


నేను తెలుగువాన్ని నా భాష తెలుగు భాష

యాబైఆరు అక్షరాలు నాతెలుగుజాతికి వరాలు


ఆ అక్షరాలే 

నా తెలుగునేలపై కురిసిన విరిజల్లులు


ఆ అక్షరాలే 

నా తెలుగుజాతి గుండెల్లో విరిసిన హరివిల్లులు


ఆ అక్షరాలే

నా తెలుగుతల్లి సిగలో మురిసేటి ముద్దమందారాలు


నా కవులు వ్రాసిన పద్యాలే 

నా తెలుగుతల్లికి సమర్పించే పారిజాతపుష్పాలు


నా తెలుగు పండితుల కావ్యాలే బృహత్ గ్రంథాలే

నా తెలుగుతల్లికి అలంకరించే పట్టుపీతాంబరాలు


నా తెలుగు సంస్కృతే

నా తెలుగుతల్లి నుదుట దిద్దిన కుంకుమతిలకం


నా తెలుగు సాంప్రదాయాలే

నా తెలుగుతల్లికి వెలకట్టలేని బంగరుఆభరణాలు


నా తెలుగు గాయకులు ఆలపించే మధురగీతాలే

నా తెలుగుతల్లి మెడలో మెరిసేటి పూలహారాలు


ఎక్కడ తెలుగు వుంటుందో అక్కడ వెలుగు వుంటుంది

ఎక్కడ వెలుగు వుంటుందో అక్కడ వికాస ముంటుంది


ఏమనివర్ణింతు తెలుగుభాష వైభవం తెలుగువాడిపౌరుషం

ఓ తెలుగుతల్లి నీకడుపున పుట్టడం నాపూర్వజన్మ సుకృతం


అందుకే ఓ నా తల్లీ నీకు ప్రణామం ..ప్రణామం... ప్రణామం..

ఓ తెలుగుతల్లి నీకు వందనం అభివందనం పాదాభివందనం
















 



 



























 



 





 















 

 







Comments