మళ్ళీ మళ్ళీ పెళ్ళి చూపులా...? (కుటుంబ కవిత)

 


మళ్ళీ మళ్ళీ పెళ్ళి చూపులా...?...


పెళ్ళి చూపుల తర్వాత...

అమ్మాయి కళ్ళల్లో కమ్మని కలలు... 

కుటుంబమంతా ఎంతో ఆశతో 

ఎంతో నమ్మకంతో ఎదురుచూపులు... 

మాకు"మీ అమ్మాయి నచ్చింది" 

అన్న ఓ చల్లని కమ్మని కబురు కోసం...


ఆ కమ్మనైన కబురును వింటే చాలు...

అమ్మాయి ఎగిరి గంతేస్తుంది ఎలా? జింకలా...

పొంగిపోతుంది ఎలా? పొయ్యి మీది పాలలా...

తేలిపోతుంది ఆకాశంలో ఎలా? గాలిపటంలా...


అక్కడ...

వారు కాకితోనైనా

కాసింత కబురైనా అంపక

కాలయాపన చేస్తూవుంటే...

ఉలుకూ పలుకు లేకుండావుంటే...

మునులై మౌనంగా కూర్చొనివుంటే...


ఇక్కడ...

కుటుంబమంతా ఏమౌతుంది?

నేలలోకి క్రుంగిపోతుంది?

ఆశలపల్లకిలో ఊరేగే ఆ అమాయకపు 

పిచ్చిపిల్ల పాపం లోలోన ఏమౌతుంది ?

కుమిలి కుమిలిపోతుంది?...


తాను అందంగా లేనేమో...

తాను వారికి నచ్చలేదేమో...

తనకిక జీవితంలో కల్యాణం కాదేమో...

అన్న బాధతో.... వ్యధతో.... వేదనతో

ఒంటరిగా చీకటిలో కంటతడి పెడుతుంది?


ఔను ఆ సమయంలో తన

మనసంతా విరిగి...కలలన్నీ కరిగి 

ఆ అమ్మాయిపడే...ఆ మానసికక్షోభ

మౌనంగావున్న ఆ మూర్ఖులకేం తెలుసు..!

కన్నవారికి...పైనున్న ఆ పరమాత్మకు తప్ప..!


నిజానికి వారి మౌనానికి 

అసలు కారణం అమ్మాయి అందం కాదు 

అమ్మాయి నచ్చకాకాదు..."కట్నాలేవో కుదరక"


ఆ విషయం ఊరెళ్ళగానే కలిసి చర్చించి

వెంటనే తెలియజేసుంటే ఎంత బాగుండేదో...

ఆ అమ్మాయి మనసెంతగానో కుదుటపడేదో...

ఇంతగా పొగిలి...పొగిలి...ఏడ్చేది......కాదుగా


నిజమే‌... 

"మౌనం కొందరికి మరణ శిక్షతో సమానం"

కానీ అది ఎరుగని వారంతా

కళ్ళున్నా అంధులే...మూర్ఖులే...మునులే...

మళ్ళీమళ్ళీ పెళ్ళి చూపులంటే మనశ్శాంతి కరువే...


రచన: 

"కవిరత్న" 

"సహస్ర కవి" 

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9110784502

Comments