సురక్షాబంధన్...!
ఆ బాల్యంలో...
ఆ అమాయకత్వంలో...
గిల్లుకున్నా గిచ్చుకున్నా...
కొట్టుకున్నా తిట్టుకున్నా...
చాడీలెన్ని చెప్పుకున్నా....
అల్లరెంతగా చేసినా...
ఎండల్లో వానల్లో...
ఆటలు ఆడుకున్నాం...
పాటలు పాడుకున్నాం...
కలిసి ఒక కంచంలో తిని...
ఒక మంచంలో పడుకుని...
కోతుల్లా ఎగిరి ఎగిరి...
పక్షుల్లా స్వేచ్ఛగా తిరిగి తిరిగి...
పెరిగి పెరిగి...పెద్దై పెళ్లితో వేరై...
ఏ ఆపద వచ్చినా...
ఏ అవసరం వచ్చినా...
ఎంత దూరంలో ఉన్నా...
ఏ కష్టం వచ్చినా ఏ నష్టం జరిగినా...
"అన్నా" అనగానే రెక్కలు కట్టుకొనొచ్చి
ఒక్కచుక్కైనా కంటకన్నీరు రాలకుండా
అమ్మలోని "అనురాగాన్ని"
నాన్నలోని "ఆప్యాయతను" పంచుతూ
అడగకుండానే అన్నీ తానై ఆదుకునే ...
...ఓ"ఆపద్భాంధవుడే"...మా అన్నయ్య
చింతల చీకట్లను చీల్చే
...ఓ "మండే సూర్యుడే"...మా అన్నయ్య
దివ్యమైన దీవెనలనొసగే
...ఓ "చల్లని చంద్రుడే"...మా అన్నయ్య
కోరిక కోర్కెలు తీర్చి కోటి వరాలనిచ్చేటి
...ఆ "కోదండరాముడే"...మా అన్నయ్య
దినదిన గండాలనుండి
బ్రతుకు సుడిగుండాలనుండి తీరంచేర్చే
...ఓ "నవ్వుల నావే"...మా అన్నయ్య
పుట్టిన నాటి నుండి గిట్టేవరకు
ఆప్యాయతలను అనురాగాలను
మా మనసున కురిపించి మురిపించే
...ఓ "పువ్వుల వానే"...మా అన్నయ్య
మా "కంటివెలుగే"
...మా "గుండెల చప్పుడే"...మా అన్నయ్య
మా చుట్టు అల్లుకున్న
మా రక్షణకవచమైన
...ఓ "చైనా గోడే"... మా అన్నయ్య
మేము గుబాళించే గులాబీలమైతే
ముందుండే రక్షించే
...ఓ "మర ఫిరంగే"...మా అన్నయ్య
మేము కన్నులమైతే కాపాడి రక్షించే
...ఓ "కనురెప్పే"...మా అన్నయ్య
ఏ పిడుగు పడకుండా
అడుగడుగునా మమ్ము ఆదుకునే
...ఓ "గొడుగే"...మా అన్నయ్య
ధరణిలో "నడిచే దైవమే"
మా ఆత్మల్లో వెలిగే
...ఓ "ఆరని దీపమే"...మా అన్నయ్య
తల్లి పేగును తెంచుకొని...
తండ్రి రక్తాన్ని పంచుకొని...
అన్నయ్యకు తోబుట్టువులుగా...పుట్టడం...
తడిచిన మా కళ్ళను
తక్షణమే తుడిచే మా అన్నయ్య
"అభయ హస్తానికి"...ఈ రాఖీలు కట్టడం...
మా పూర్వజన్మ సుకృతం...ఇది మాకొక వరం
ఇది మా అన్నయ్య "అమృతహృదయానికి" వేసే
"అనురాగబంధం"...
ఇది ఎన్నాళ్ళైనా... ఎన్నేళ్ళైనా...
"ఇగిరిపోని గంధం" "తరిగిపోని బంధం"
మా అన్నాచెల్లెళ్ల "ఈ అపురూపమైన అనుబంధం"
రచన:
"కవిరత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502







Comments
Post a Comment