దివిలోని దైవం నిన్ను దీవించును గాక !
నిన్న నీవు ఎందరినుండో
"స్పూర్తిని" పొందావు
నేడు "ఉన్నత శిఖరాలకు"
చేరుకున్నావు...ఊహించనిరీతిలో
అందుకే...
రేపు నీవు ఒక్కరికైనా
ఒక "మెట్టుగా" నిలవాలి
అదే కదా కృతజ్ఞత...
అదే కదా పుణ్యం...
అప్పుడే కదా నీ జన్మధన్యం...
నిన్న నీవు ఎందరినుండో
"వెలుగును" పొందావు
నేడు "పున్నమి చంద్రుడిలా"
వెలిగిపోతున్నావు
అందుకే...
రేపు నీవు ఒక్కరికైనా
"జీవన జ్యోతివై" నిలవాలి
అదే కదా కృతజ్ఞత...
అదే కదా అనురాగం ఆప్యాయత...
అప్పుడే కదా నీవు అందరికీ స్పూర్తి ప్రదాత...
నిన్న నీవు ఎందరో
"ఉత్తములైన గురువుల"నుండి
ఉచిత శిక్షణ పొంది ఉన్నావు
నేడు "మేధావిగా మెప్పు" పొందావు
అందుకే...
రేపు నీవు ఒక్కరికైనా
నీ "విజ్ఞానపు వెలుగుల్ని" పంచాలి
అజ్ఞానాంధకారాన్ని....తొలిగించాలి
అదే కదా కృతజ్ఞత...
అదే కదా సంస్కారం...
అప్పుడే కదా నీ ఈ మానవ జన్మసార్థకం...
నిన్న నీవు ఎందరినుండో
"ఆపదలో ఆదుకోమని"
అర్థించి...ప్రార్థించి ఉంటావు
నేడు సుఖంగా...సురక్షితంగా...
నిశ్చింతగా "ప్రశాంతంగా జీవిస్తున్నావు"
అందుకే...
రేపు నీవు ఏ అండలేని నిరుపేదలకు
నిస్సహాయకులకు "రక్షణ కవచంగా"నిలవాలి
అదే కదా కృతజ్ఞత...
అదే కదా పరమాత్మకు ప్రతిరూపం...
అప్పుడే కదా నీ జీవితానికి అర్థం పరమార్థం...
నిన్న నీవు ఎందరినుండో
"ఆర్థిక సహాయం"పొంది ఉన్నావు
నేడు "కోట్లకు పడగలెత్తే కోటీశ్వరుడివైనావు"
అందుకే...
రేపు నీవు అనాధలకు...అభాగ్యులకు
కొండంత అండగా "ఆపద్భాందవునిగా" నిలవాలి
అదే కదా దాతృత్వం...
అదే కదా మానవత్వం...
అప్పుడే కదా "దివిలోని ఆ దైవం" నిన్ను దీవించేది...
నిన్న నీవు ఎందరినుండో
"ఉచిత సేవలెన్నో"పొందావు
నేడు ఆరోగ్యంగా...ఆనందంగా
ఏ చీకు చింతాలేకుండా
"చిరునవ్వులు చిందిస్తున్నావు"
అందుకే...
రేపు నీవు "విధివక్రించి" అనుకోని ఆపదలోపడి
ఆసుపత్రిలో పాలైతే "అభయహస్తమందించాలి"
అదే కదా మంచితనం...
అదే కదా మానవత్వం...
అప్పుడే కదా నీవు "ధరణిలో నడిచే దైవమయ్యేది"...

Comments
Post a Comment