ఎగురవేద్దాం...ఎగురవేద్దాం...మువ్వన్నెల జెండా...(దేశభక్తి కవిత)

 


ఎగురవేద్దాం ! ఎగురవేద్దాం ! మువ్వన్నెల జెండా ! 


స్మరించుకుందాం ! స్మరించుకుందాం !

దేశభక్తిని...చైతన్యజ్వాలను రగిలించే  

వందేమాతరం...జనగణమనవంటి 

సుమధురగీతాల సృష్టికర్తలైన ఆ

బంకించంద్ర చటర్జీ...రవీంద్రనాథ్ ఠాగూర్ లను...

స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపే జాతీయపతాక 

రూపశిల్పి గాంధేయవాది శ్రీ పింగళి వెంకయ్యను...



తెలుపుదాం ! తెలుపుదాం ! విప్లవాభివందనాలు

అమర్ రహే అంటూ దిక్కులుపిక్కటిల్లేలా నినదిస్తూ 

పిన్నవయసులోనే దేశరక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగంచేసి తల్లి భరతమాత 

నుదుట రక్తతిలకాన్ని దిద్దిన విప్లవవీరులైన 

ఆ భగత్ సింగ్...ఆ అల్లూరి సీతారామరాజులకు...



గుర్తుచేసుకుందాం ! గుర్తుచేసుకుందాం !

భారతమాత దాస్య శృంఖలాలను త్రెంచ

ఆంగ్లేయుల అకృత్యాల నెదిరించి జైళ్ళలో మ్రగ్గిన 

స్వాతంత్ర్య సమరయోధులు...జాతినేతలైన 

ఆ గాంధీజీ నెహ్రూ నేతాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 

అటల్ బిహారీ వాజపేయి ఇందిర అబ్దుల్ కలాంలను...



ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అత్యున్నతమైన 

రక్షణ కవచనం వంటి రాజ్యాంగాన్ని రచించిన 

ఆ అపర మేధావి అమరజీవి అంబేద్కర్ ను...



తీసుకుందాం ! తీసుకుందాం ! ఆదర్శంగా...

తమ సర్వస్వాన్ని దేశసేవకే అంకితంచేసిన 

ఆ త్యాగమూర్తులను...ఆ సమతావాదులను... 

మనకు ఖండాంతర ఖ్యాతినార్జించిన 

ఆ అపరమేధావులను...ఆ సంఘసంస్కర్తలను....



చేద్దాం ! చేద్దాం ! ప్రణమిల్లి పాదాభివందనం...

మన విభిన్న సంస్కృతి సాంప్రదాయాలను 

సనాతన ధర్మాలను భగవద్గీత ప్రబోధాలతో 

ముందు తరాలకందిస్తున్న ఆ సద్గురువులకు...



చేద్దాం ! చేద్దాం ! నిత్యం పూజలు...

చేతులుజోడించి...శిరమునువంచి...భక్తితో...

"బంగారుతల్లి భరతమాత" పాదారవిందాలకు....


చేద్దాం! చేద్దాం ! నేడే భగవద్గీతపై ప్రమాణం...

దేశ‌సమగ్రతే...మా ఆశయమని మాఆఖరి లక్ష్యమని...

ఏ యుద్ధానికైనా ప్రాణార్పణకైనా సదా మేంసిద్ధమని..



జైహింద్ జైహింద్...జై భారత్ జై భారత్ 


రచన: 

"కవిరత్న" 

"సహస్ర కవి" 

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9110784502


Comments