ప్రియమైన మిత్రమా !
ఓ నా ఆత్మీయ నేస్తమా !
రిక్షావాడికైనా...
రియల్ ఎస్టేట్ వ్యాపారికైనా...
ముష్టి వాడికైనా...
ముఖేష్ అంబానీకైనా...
ఆ భగవంతుడిచ్చిన
సమయం 24 గంటలే...
కనిపించే మనిషి...
కనిపించని కాలం
కప్ప...పాము లైతే
సమయం సమర్పయామి...
చిలకా గోరింక లైతే
సమయం సద్వినియోగం....
ప్రియమైన మిత్రమా !
ఓ నా ఆత్మీయ నేస్తమా !
కళ్ళు పొరలు కమ్మిన
కామాంధుడవై.....
దుష్ట తలంపులతోనా...
కామపు చూపులతోనా...
పరస్త్రీ వ్యామోహంతోనా...
పర పురుషుల భార్యలవేటలోనా...
చాటుమాటుగా వలపువలలు
విసరడంలోనా...ఎలా ?ఎలా ?
నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ?
ప్రియమైన మిత్రమా !
ఓ నా ఆత్మీయ నేస్తమా !
అక్రమంగా
అర్జించు...
అనుభవించు...
ఆపై అస్తమించు...
అన్న త్రిసూత్రాలతో
లంచాలకు మరిగి
లంచగొండివై.....
పరుల జేబులకు
చిల్లులు పెట్టడంలోనా...
పైకి దొరలా లోపల దొంగలా...
పరుల ఇళ్లకు కన్నం వేయడంలోనా...
దొరికినంత దోచుకోవడంలోనా...
స్విస్ బ్యాంకుల్లో
దాచుకోవడంలోనా...ఎలా ?ఎలా ?
నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ?
ప్రియమైన మిత్రమా !
ఓ నా ఆత్మీయ నేస్తమా !
తిండిబోతువై...
కుంభకర్ణుడివై...
పరమ సోమరిపోతువై...
బద్ధకస్తుడివై... భ్రష్టుడివై...
దుర్వేసనాలతో బ్రతుకును
ఈడ్చడంలోనా...ఎలా ? ఎలా ?
నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ?
ప్రియమైన మిత్రమా !
ఓ నా ఆత్మీయ నేస్తమా !
విలాస పురుషుడివై...
విదేశాలలో విమానాలలో
విహరించడంలోనా...
పబ్బుల్లో క్లబ్బుల్లో
విందుల్లో వినోదాల్లో
మునిగి తేలడంలోనా...ఎలా ?ఎలా ?
నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ?
ప్రియమైన మిత్రమా !
ఓ నా ఆత్మీయ నేస్తమా !
శృంగార పురుషుడవై...
అందాలు ఆరబోసే
సుందరాంగుల పొందులకై
పరితపించడంలోనా...
డ్రగ్స్ కు బానిసవై
బంగారు భవిష్యత్తును
బలితీసుకోవడంలోనా...
సోషియల్ మీడియాలో
సొల్లు కబుర్లతోనా...ఎలా ? ఎలా?
నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ?
ప్రియమైన మిత్రమా !
ఓ నా ఆత్మీయ నేస్తమా !
కోహినూర్ వజ్రంకన్నా
అతిఖరీదైన అతివిలువైన
తిరిగిరాని ఈ కాలానికి
నీవిలా కళ్ళెం వేసెయ్ ?
నీ సద్భుద్దితో...
నీ సత్సంకల్పంతో...
నీ సత్క్రియలతో...
నీ మంచితనంతో...
నీ మానవత్వంతో...
నీ దయా గుణంతో...
నీ దాతృత్వంతో...
నీ దైవత్వంతో...
కరుణ ప్రేమ జాలి వంటి
నీ సద్గుణాలతో... వేసెయ్
నీ కాలానికి కళ్ళెం వేసెయ్ ? కానీ
ఒక్కనిజం తెలుసుకో నేస్తం!
కాలమే నీచేతిలో
త్రిశూలమైతే నీవు త్రినేత్రుడవని...
కాలం గాలానికి నీవు చిక్కితే
నీవు మహిమలులేని మాంత్రికుడవని...
కాలం ఒక శక్తివంతమైన ఆయుధమని
అది ఏ పునాదికైనా...ఏ సమాధికైనా
ఏ అంతరిక్షానికైనా....ఏ అదఃపాతాళానైనా...
రచన.
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment