ఓ నా దగాపడ్డ దళిత బిడ్డలారా!
ఓ నా బహుజన బంధువులారా !
ఓ నా భరతమాత ముద్దు బిడ్డలారా!
ఎవరైనా...మీ శత్రువులు
మీ "తోక" త్రొక్కితే పర్వాలేదు
కానీ మీ "పీక" నొక్కితేనే ప్రమాదం
మీరు
మృత్యుంజయులై...
తోక త్రొక్కిన త్రాచులై...
కస్సు బుస్సుమనవచ్చు...
కాటు వేయవచ్చు...ఖతం చేయవచ్చు...
ఔను వారు ప్రేమతో నవ్వుతూ నటిస్తారు
వారే మీకు దైవాలన్న భ్రమను కలిగిస్తారు
వెయ్యి తరాలకైనా సూర్యోదయం రాకుండా
ఊపిరాడని ఊబిలోకి మిమ్మల్ని నెట్టేస్తారు
అదఃపాతాళానికి మిమ్ము అణగద్రొక్కుతారు
వారు మిమ్మల్ని ...
విద్యకు...
విజ్ఞానానికి...
ఆర్థిక వనరులకు...
ఆయుధ సంపత్తికి...
ఆమడదూరంగా ఉంచి...
మీరెక్కడ
వీరులౌతారోనని...
విజ్ఞానవంతులౌతారోనని...
ఆచారాలను అడ్డుకుంటారోనని...
తిరుగుబాటు చేస్తారోనని...ప్రశ్నిస్తారోనని...
ప్రతిఘటిస్తారోనని... ప్రాణం తీస్తారోనని...భయంతో
మీ తలపైకెక్కి తాండవమాడుతారు తస్మాత్ జాగ్రత్త
మరి మాలో మార్పు ఎప్పుడు?...
మీకు కనువిప్పు కలిగినప్పుడు...
మీలో చైతన్యజ్వాల రగిలినప్పుడు...
ఉరికంబాలనైన ముద్ధాడేందుకు సిద్దమై
యువకిషోరాలై మీరు పోరాడినప్పుడు...
మీలో మేధోమథనం మొదలైనప్పుడు...
మీరు కార్చే కన్నీటి విలువ మీకు తెలిసినప్పుడు...
మా బానిస బ్రతుకుల నుండి మాకు విముక్తి ఎప్పుడు?
వారి కబంధ హస్తాల నుండి మీరు బయట పడినప్పుడు
సంఘంలో సమానత్వం సౌభ్రాతృత్వం ఒక్కవిద్యద్వారానే
సాధ్యమన్న ఓ నగ్నసత్యాన్ని మీరంతా గ్రహించినప్పుడు...
ఉక్కుపిడికిలి బిగించి మీరంతా ఉద్యమించినప్పుడు...
రక్తతర్పణతోనైనా రాజ్యాధికారాన్ని సాధించినప్పుడు...
ఈ అంబేద్కర్
ఆఖరి ఆశయమైన...తీరని కలయైన
ఆ బహుజనరాజ్యాన్ని మీరు స్థాపించినప్పుడు...
ఆ బహుజనరాజ్యాన్ని మీరు స్థాపించినప్పుడు...
జై భీమ్...జై భారత్
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరణవాణి...9110784502

Comments
Post a Comment