పిచ్చి పిచ్చి ఆలోచనలతో
"రెచ్చిపోకు...చచ్చి పోతావ్"
పిచ్చి పిచ్చి ఆలోచనలు
వచ్చి వచ్చి నిన్ను "పిరికివాన్ని" చేస్తాయి
వద్దు వద్దు నిద్దురమాని
అర్థరాత్రి వరకు పిచ్చి ఆలోచనలొద్దు
పిచ్చి ఆలోచనలే..."పిశాచుల పిల్లలు"
కడకవి నీ పీకనే పిసికి నీ ప్రాణం తీస్తాయి
కొన్ని...పిచ్చి ఆలోచనలు
పుట్టలో "బుసలు కొట్టే త్రాచులు"
ఆ త్రాచులతో ఆడుకోకు
అవి చాటుమాటుగా
కస్సుబుస్సుమంటాయి నిన్ను కాటేస్తాయి
కొన్ని...పిచ్చి ఆలోచనలు
మెడమీద "వ్రేలాడే గండ్రగొడ్డళ్ళు"
ఆ గొడ్డళ్ళను గంటలతరబడి నూరకు
అవి ఎన్నో ఏళ్ల బంధాలను
అనుబంధాలను మొదలంటూ నరికేస్తాయి
కొన్ని...పిచ్చి ఆలోచనలు
వీధిలో "మొరిగే పిచ్చికుక్కలు"
వాటిని రెచ్చగొట్టకు మీదపడి
రక్కుతాయి నీ రక్తాన్ని రుచిచూస్తాయి
కొన్ని...పిచ్చి ఆలోచనలు
కంట్లో పడిన "కొరివికారమే".....భరించలేం
కొన్ని...పిచ్చి ఆలోచనలు
కాలిలో "గుచ్చుకున్న ముళ్ళే"...కాస్తజాగ్రత్త
కొన్ని...పిచ్చి ఆలోచనలు
గుండెల్ని పిండిచేస్తాయి పిప్పిచేస్తాయి
ఆ పిచ్చిఆలోచనలే రగిలే అగ్నిపర్వతాలై
బ్రద్ధలై "విషాదపులావాను" విరజిమ్ముతాయి
అందుకే
చేయకు చేయకు
పిచ్చి ఆలోచనలతో
నీ విలువైన
కాలాన్ని వృధాచేయకు...అవి
నీ ఆరోగ్యాన్ని...
నీ ఆదాయాన్ని...
నీ ఆయుష్షును....
నీకు దూరం చేస్తాయి...
నీ బ్రతుకును అంధకారం చేస్తాయి.
ఆపై.....నీకు బంధాలు...భారమౌతాయి
దూరమౌతాయి మటుమాయమౌతాయి
ఇక మిగిలేది...
ఒంటరితనమే...
తరగని మానసిక క్షోభే...
భరించలేని ఒత్తిడే...అది వర్ణనాతీతమే...
ఆపై...ఏవేవో మానసివ్యాధులు
కనపడవు కానీ వేధిస్తాయి బాధిస్తాయి
"బలహీనతలకు నిన్ను బానిసను" చేస్తాయి
ఔను ఆ పిచ్చి ఆలోచనలకు "ఆనకట్టలు" కట్టాలి
పిచ్చిఆలోచనల "కలుపుమొక్కలను" తొలిగించాలి
మదినిండా "మంచితనం మానవత్వం"
పరిమళించే "ప్రేమమొక్కల్ని" పెంచాలి
అందుకే మిత్రులారా మరువకండి !
విరుద్దమైన..."ఆలోచనలే విషమని"...
అనురాగపూరిత..."ఆలోచనలే అమృతమని"...
ఆగని పాపిష్టి..."ఆలోచనలే ఆరని నిప్పని"...
దుష్టతలంపులే..."ముందున్న ముప్పుకు మూలమని"...
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment