సుందర నందనవనాలు... కవిత

 



సుందర నందన వనాలు......


యువతా ! ఓ నవయువతా !

మీ చూపులు చురకత్తులు కావాలి

మీ కళ్ళెప్పుడూ నిప్పుల్ని విరజిమ్మాలి

మీరు పులులై చిరుతపులులై సింహాలై

శూరులై యుద్ధ‌వీరులై శతృవుల్ని వేటాడాలి


యువతా ! ఓ నవయువతా ! 

వొద్దు ఒంటరిపోరాటం వొద్దు మీరు 

సమిష్టిగా యుద్దానికి సిద్ధం కావాలి 

యుద్దభేరిని మ్రోగించాలి పోరాడాలి

శతృవుల గుండెల్లో ఫిరంగుల్ని పేల్చాలి

రక్తపాతరహితంగా విజయకేతనమెగరేయాలి


యువతా ! ఓ నవయువతా ! 

మీ అరుపులు ఆకాశంలో మెరుపులు కావాలి

మీ ఉగ్రరూపంతో నింగిలో ఉరుములు పుట్టాలి

మీరు పిడికిలి బిగించి సునామీలను సృష్టించాలి

మీరు భగభగమండే భాస్కరులుగా అవతరించాలి


యువతా ! ఓ నవయువతా ! 

ఎక్కడ అన్యాయం అక్రమం జడలు విప్పునో

అక్కడ మీ అడుగుల సవ్వడితో అలజడి పుట్టాలి

కన్నులున్న గుడ్డివారికి మీరు కంటిపాపలు కావాలి

నోరున్న మూగవారికి మీరు గర్జించే గళాలు కావాలి

చైతన్యరహితుల్ని మేల్కొల్పే అగ్నజ్వాలలవై రగలాలి


యువతా ! ఓ నవయువతా ! 

ధగధగ మెరిసే కీర్తికిరీటాలు మీరు ధరించాలి 

శాంతి కపోతాలను నింగిలోకి ఎగురవేయాలి

హిమగిరి శిఖరమంత ఎత్తుకు మీరు ఎదగాలి

మీ కమ్మని కలలన్నీ పండాలి....మీ జీవితాలు

సుఖశాంతుల సుందర నందనవనాలు కావాలి


రచన:

"కవిరత్న" 

"సహస్రకవి"

పోలయ్య కూకట్లపల్లి 

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9110784502










Comments