హాస్య కవితలు...విషయసూచిక
1.నోరు జారితే ఆ మూడింటికి ముప్పే
2.ఇలాగైతే ఎలాగా
3.అన్నదాత సుఖీభవ
4.అదృష్టం అంటే అదే మరి
5.అమ్మో ఈభార్య నాకొద్దు
6.మా అల్లుడు బంగారం
7.చిలక జోస్యం
8.కీర్తి కిరీటం
9.స్మశానం లో దొంగలు పడ్డారు
10.దయచేసి దాని పేరు అడగండి
11.జాతిని పీడించే ఓ జలగలారా
12.నవయుగ ద్రౌపది
13.జానెడు పొట్ట జాగ్రత్త సుమీ
14.ఒక్క రాత్రిలో మూడుహత్యలు
15.అల్లుడా మజాకా
16.కోవీడ్ దొంగ
17.ఆడపిల్ల అయస్కాంతం
18.గాడిదలను సైతం గౌరవించాలి
19.జై పాతాళభైరవి
20.మారిన గౌతమ బుద్ధుడు
21.రాణిగారికి ముద్దుపెట్టిన రామచిలుక
22.స్వాగతం పలికకే ఓ శ్మశానమా
23.బేరం బ్రతుకు భారం
24.అమ్మో ఆన్లైన్ చదువులు
25.ఆ నాస్తికుడు ఆస్తికుడు ఎలా అయ్యాడు
26 .అత్త చేతివంట
27. మీ బుజ్జి బొజ్జ ?
28. పగటికల ?
1.నోరుజారితే ఆ మూడింటికి ముప్పే?
మీరు కోపంతో
రెచ్చిపోయి కళ్ళెర్ర జేసి
పళ్ళు పటపట కొరికితే...
పిచ్చిపిచ్చిగా
మాట్లాడేది...............మీ నోరు
రాలేది.....................మీ పళ్ళు
తెగేది......................మీ నాలుక
పగిలేది....................మీ తల
కారేది......................మీ రక్తం
విరిగేది....................మీ కాళ్ళుచేతులు
నలిగేది....................మీ మనసు
నలుగురిలోపోయేది...మీ పరువు
నవ్వులపాలయ్యేది....మీరు
అందుకే మీ నోటిమాట జాగ్రత్త
నోరుజారితే...
నోటమాట జారితే....
పరువు గంగలో కలిసిపోయిందే...
రక్తం ఏరులై పారిందే....
నోరుజారితే...
నోటమాట జారితే...
ముమ్మాటికీ ఆ మూడింటికి ముప్పే
మీ కంటికి ...
మీ పంటికి...
మీ ఒంటికి...
అందుకే మీ నోటిమాట కాస్త జాగ్రత్త సుమా!
2.ఇలాగైేతే ఎలాగ?
మీరు తృప్తిగా తింటే
మాకు పుణ్యమంటూ
మీ కడుపు నిండితే
మా జన్మధన్యమంటూ ఆకులేసి
తినండి...తినండి... తృప్తిగా అంటే ఎలాగ?
ఆకుల్లో ఇంత అన్నం పెట్టకుండా .........
మీరు గురి తప్పని
వేటగాళ్ళో వెర్రివెంగలప్పలో నేడే
తేలిపోవాలంటూ అందరికి గన్నులిచ్చి
కాల్చండి...కాల్చండి...పిట్టల్లాఅంటే ఎలాగ?
కాల్చేందుకు బులెట్లే ఇవ్వకుండా.........
గట్టిగా పోరాడి మీ ప్రత్యర్థులను
మట్టి కరిపించాలంటూ తప్పక
ఘనవిజయాన్ని సాధించాలంటూ
ఆడండి...ఆడండి...ఆటలంటే ఎలాగ ?
కాళ్ళు చేతులు రెండు గట్టిగా కట్టేసి........
అందుకే సరైన శిక్షణనివ్వాలి
అందరికి అవకాశాలందించాలి పాటు
అవసరమైతే అగ్నిపరీక్షలు పెట్టాలి
రాత్రింబవళ్ళు సానపట్టాలి
రాళ్ళలో రత్నాలుంటాయని మట్టిలో
మాణిక్యాలుంటాయని మరువనేరాదు
3.అన్నదాతా సుఖీభవ !
తంతే గారెల
బుట్టలో పడ్డట్టు...
మనం ఒకటి తలిస్తే
ఆ దైవం మరొకటి
తలచినట్టు అంటే...ఏంటంటే !
ఆకలితో
నకనకలాడే
ఓ అతిథి తనకు
ఆవకాయతో
ఇంత పప్పన్నం
పెడితే చాలనుకుంటే
ఆ ఇంటి ఇల్లాలు...
తాజ్ హోటల్లో
స్పెషల్ బిర్యానిలా
దమ్ము బిర్యాని చేసిపెట్టినట్టు...
ఆహా ! అన్నదాతా సుఖీభవ !
క్లర్కు ఉద్యోగం
కోసం కమ్మని
కలలుకనే
ఓ భక్తుడు...
ప్రతిరోజు ప్రార్థిస్తే
కరుణించి కనికరించి
ఆ భగవంతుడు
కలెక్టర్ ఉద్యోగమే
ప్రసాదించినట్టు...ఔను !
ఆ పరమాత్ముడు ప్రేమామయుడే !
కడుపులో
కక్ష పెట్టుకుని
ఖతం చేద్దామని
ప్రాణమిత్రున్ని
సముద్రంలోకి నెట్టేస్తే
ఈతొచ్చిన ఆ మిత్రుడు...
బంగారం బిస్కెట్లు మింగిన
చేపలతో బయటి కొచ్చినట్టు
ఔను ! అదృష్టమంటే అదేమరి !
4.అదృష్టమంటే అదేమరి?
తంతే గారెల
బుట్టలో పడ్డట్టు...
మనం ఒకటి తలిస్తే
ఆ దైవం మరొకటి
తలచినట్టు అంటే ఏమిటంటే...
బిజీగా
బజారులో
తిరిగి తిరిగి
ఎర్రని ఎండలో
ఇంటికొచ్చి
మంచినీళ్లడిగితే
అమ్మ...
చల్లని మజ్జిగిచ్చినట్లు...
ఔను ! అమ్మ మనసు వెన్న !
కొడుకు
హీరో హోండా బైకు
కొనివ్వమని అడిగితే
నాన్న...
మారుతీ కారునే
కొనిచ్చినట్టు...ఔను !
ఆ నాన్నకు పాదాభివందనం !
అర్జంటుగా
ఆపరేషన్ కోసం
ఇరవై వేలు అడిగితే
వడ్డీ లేకుండా తక్షణమే
అరవైలు అప్పిచ్చి
ఓ మిత్రుడు...
ఆపదలో దైవంలా ఆదుకున్నట్టు
ఓ స్నేహమా! వర్థిల్లు నిండూనూరేళ్ళు!
ఆకలితో
నకనకలాడే
ఓ అతిథి తనకు
ఆవకాయతో
ఇంత పప్పన్నం
పెడితే చాలనుకుంటే
ఆ ఇంటి ఇల్లాలు...
తాజ్ హోటల్లో
స్పెషల్ బిర్యానిలా
దమ్ము బిర్యాని చేసిపెట్టినట్టు...
ఆహా ! అన్నదాతా సుఖీభవ !
క్లర్కు ఉద్యోగం
కోసం కమ్మని
కలలుకనే
ఓ భక్తుడు...
ప్రతిరోజు ప్రార్థిస్తే
కరుణించి కనికరించి
ఆ భగవంతుడు
కలెక్టర్ ఉద్యోగమే
ప్రసాదించినట్టు...ఔను !
ఆ పరమాత్ముడు ప్రేమామయుడే !
కడుపులో
కక్ష పెట్టుకుని
ఖతం చేద్దామని
ప్రాణమిత్రున్ని
సముద్రంలోకి నెట్టేస్తే
ఈతొచ్చిన ఆ మిత్రుడు...
బంగారం బిస్కెట్లు మింగిన
చేపలతో బయటి కొచ్చినట్టు
ఔను ! అదృష్టమంటే అదేమరి !
5. అమ్మో ! ఈ భార్య నా కొద్దు !
అక్షయ తృతీయనాడు
కనీసం ఒక లక్షరూపాయలకైనా
బంగారు కొనాలనే సెంట్ మెంట్ ఏంటి ?
నున్నగాఉండి నిగనిగ మెరిసేపోయే
లలితా జ్యువెలరీ షాపు యజమాని
గుండ్రని గుండు రోజు కలలోకి రావడమేంటి ?
బట్టలషాపు కెళ్ళి గుట్టలు గుట్టలుగా బట్టలు
ముందు వేసినా ఒక్కటీ నచ్చకపోవడమేంటి ?
తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి
కొంటే పట్టుచీరలే కొనాలని పట్టుపట్టడమేంటి ?
భర్త నెలజీతాన్ని బట్టలషాపు వాడికి బాకీపెట్టి
రావడమేంటి? తీర్చలేక ఆ భర్తకు తిప్పలేంటి ?
పక్కింటి పాపారావు అందాలరాముడని అచ్చం
అక్కినేనిలా ఉంటాడని రోజు పొగడడమేంటి ?
ఏమండీ ఆఫీసు నుండి త్వరగా వచ్చి
అంట్లు తోమండి ! లేదంటే నేను తోముతా !
బట్టలు ఉతకండి ! లేదంటే నేను ఉతుకుతా ! అంటే
అర్థమేంటో అర్థం కాక రోజు జుట్టుపీక్కోవడమేంటి?
సంసారం ఈదేకన్నా సాగరంలో దూకడమే మేలని
ఇట్టి ఆశబోతు భార్యలతో ఇట్టి గయ్యాళి గంపలతో
కాపురంచేసే కన్నా సన్యాసం స్వీకరించడమే మేలని
భావించే ఓ భార్యా బాధితులారా ! భయపడకండి !
వారి బారినుండి తప్పించుకునే...
మార్గాలు మూడున్నాయి ముచ్చటగా !
ఒకటి...వారిచేత రామకోటి రాయించండి !
రెండు...వ్రతాలు పూజలు నోములు చేయించండి!
మూడు...వారానికి ఒకసారి మౌనవ్రతం దాల్చమనండి !
ఆపై భగవంతునిపై భక్తితో భర్తను మరిచిపోవడం ఖాయం!
పతియే ప్రత్యక్ష దైవమంటూ నిత్యం పూజించడం తథ్యం !
6. మా అల్లుడు బంగారం
వచ్చీ రాకముందే ఇంటికి
కొత్త పాత లేకుండా అల్లుడు
అత్తమామలకు పాదాభివందనం చేశాడు
ఆహా ! అల్లుడెంతటి వినయసంపన్నుడు!
పెళ్లిచూపుల్లో నచ్చిందా బాబు
పిల్లంటే నవ్వి ఊరుకున్నాడు
కనుసైగలతోనె కథ ముగించాడు
ఆహా ! అల్లుడెంతటి మృదుభాషి !
నిశ్చితార్థం రోజు వియ్యాలవారు
కయ్యాలవారు కట్నకానుకల
ప్రస్తావన తెస్తే కస్సుమని పైకి లేచాడు
ఆహా ! అల్లుడెంతటి ఆదర్శవాది !
పెళ్లిరోజు ఆర్భాటమక్కర్లేదని
కళ్యాణమండపం ఖర్చెందుకని
గుళ్ళో పూలదండలు మార్చుకుని
మూడు ముళ్లతంతు ముగించాడు
ఆహా ! అల్లుడెంతటి అభ్యుదయవాది !
పెళ్లికి వచ్చిన అక్షింతలు చల్లిన హితులకు
స్నేహితులకు అతిథులకు అరిటాకుల్లో
పప్పన్నం పెట్టి నాలుగు స్వీట్లిచ్చి నవ్వుతూ
పంపాడు ఆహా ! అల్లుడెంతటి పొదుపరి !
శోభనంరాత్రి గదిలో స్వీట్ హాట్
పాలు పళ్ళు పూలు పట్టెమంచం
అగరవత్తులు అక్కర్లేదన్నాడు
చల్లని వెన్నెల్లో శోభనం చాలన్నాడు
ఆహా ! అల్లుడెంతటి అల్పసంతోషి!
ప్లాట్లు లక్షల కోట్ల కట్నం ఖరీదైనకార్లు
కలర్ టీవీలు కావాలని కొత్తకోరికలతో
అత్తమామల రక్తాన్ని పీల్చేపిప్పిచేసే
ఆధునిక అల్లుళ్ళున్న ఈ కలికాలంలో
ఈ ! అల్లుడెంతటి ఉదారహృదయుడు !
తమది ఎంతో మహద్భాగ్యమని
కూతురుకాపురం స్వర్గతుల్యమేనని
కమ్మని కలలుకనే అత్తమామల ఆ
"పెళ్లికల" విధివక్రించి విషఘడియలు ప్రాప్తించి
పగటికలగా పిచ్చికలగా పీడకలగా మారింది
అల్లుడు కోరిన పిచ్చికోరికలతో
అత్తమామలు బిత్తరపోయారు
అల్లుడు పెట్టిన ఆ "వింత షరతులకు"
ఇద్దరి హృదయాలు బ్రద్దలయ్యాయి
పాలగ్లాసుతో కాదు...బీరుగ్లాసుతో...
కోటిరూపాయల....బ్రీఫ్ కేసుతో"
పడకగదికి కూతుర్ని పంపాలని
అప్పుడే ఇద్దరికి శోభనమని
అమెరికా..."అల్లుడి ఆజ్ఞ"
ఆహా ఎంతటి మోసం ?ఎంతటి దగా ?
ఔను మరి "అల్లుడా ! మజాకా" !
7.చిలక జోస్యం....
ఈ కరోనా కాలంలో
రోజు ఎండలో తిరగక
వ్యాయామం యోగ ధ్యానం చేయక
ఇమ్యూనిటీని పెంచుకోని
బద్దకస్తులకు ఈ భూమిపై "నూకలు"
చెల్లినట్లేనంటోంది...చెట్టుకింద...రామచిలక
ఈ కరోనా కాలంలో
రోజు శానిటైజర్ తో చేతులు
శుభ్రంచేసుకోని సోమరుల"ఆత్మ" పరమాత్మలో
లీనమైనట్లేనంటోంది...చెట్టుకింద...రామచిలక
ఈ కరోనా కాలంలో
హాల్స్ లో మాల్స్ లో సభల్లో
సమావేశాల్లో భౌతిక దూరాన్ని
పాటించనివారికి "స్మశానం" స్వాగతం
పలికినట్లేనంటోంది...చెట్టుకింద...చిలక
ఈ కరోనా కాలంలో
ముఖానికి డబుల్ మాస్కు లేక
సానుకూలంగా ఆలోచించక అతిగా
భయపడే ఆందోళన చెందేవారి"నీడ" వారికి దూరమైనట్లేనంటోంది...చెట్టుకింద...రామచిలక
ఈ కరోనా కాలంలో
మందుషాపులముందరే
మందెక్కువై మందిలో దూరి
చిందులేసే మందుబాబులను
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి
రోడ్లమీద విచ్చలవిడిగా వీరంగం చేస్తు
ఊరంతా ఊరేగే తిరుగుబోతులను
కరోనా "కాలనాగు" కాటేసినట్లేనంటోంది...
వారిముందు
"మృత్యువు" నృత్యం చేసినట్టేనంటోంది...
"కాటికి వారి పయనం"
ఖాయమైనట్లేనంటోంది...చెట్టుకింద...రామచిలక
ఔను మొక్కేకదాని...పీకేస్తే
"పీకలు" ఎగిరిపోతాయ్ ! అది నిన్నటి మాట !
కానీ చెప్పింది "రామచిలకే"కదా...నిర్లక్ష్యం వహిస్తే
బ్రతుకులో "నిప్పులు" కురుస్తాయ్ ! ఇది నేటి హెచ్చరిక !
8.కీర్తి కిరీటం
అన్ని దీపాలు ఆరిపోయినా
అన్ని దారులు మూసుకుపోయినా
కూల్ కూల్ అనుకుంటూ
కొద్దికొద్దిగా నెత్తిన నీళ్ళు చల్లుకోవాలి
కొండంత ఓపికతో ఉండాలి
మన పని అయ్యేంతవరకు
మనకు ఫలితం దక్కేంతవరకు
విత్తనాలు వెదజల్లిన
మరుక్షణమే
మొక్కలు పెరగాలని
కాయలు కాయలని
కడుపులు నిండాలని
ఆశించడం ఎంతటి అవివేకం ?
సముద్రస్నానం చేయాలన్న
ఆశతీరాలన్న ఆగక తప్పదే
ఉరుకులు పరుగులతో
ఉప్పొంగే అలలు అలసి
అలసి ఆవలితీరం చేరేవరకు
అందుకే
నిప్పురవ్వలా ఎగిసే
ఆవేశాన్ని ఆపుకోవాలట
పిచ్చి కోపమొచ్చినా
ఉద్రేకంతో రెచ్చిపోక
చిరునవ్వొకటి చిందించాలట
శాంతి శాంతిః అంటూ శాంతి
మంత్రమొకటి జపించాలట అలా
జపించినవారికి ఏ జబ్బురాదట
వారే ఎక్కువ కాలం బ్రతుకుతారట
కీర్తికిరీటం దక్కేది శాంతమూర్తులకేనట
9.స్మశానంలో దొంగలు పడ్డారు
కాని దోచుకునేందుకేముంది?
ఇన్ని ఎముకలు పుర్రెలు !
ఇంత బూడిద తప్ప !
వారెంతటి కోటీశ్వరులైనా
పేరుకే శ్రీమంతులు
భూమిమీద ఊపిరి ఉన్నంత వరకే
సిరిసంపదలు
వస్తూ పట్టుకొచ్చి
సమాధిల్లో దాచుకున్నదేమిటి?
సమాధులు త్రవ్వితే దొరికేదేముంది?
గుళ్ళూ గోపురాలు త్రవ్వినా
గుప్తనిధులు దొరుకునేమో !
ఎన్నికోట్లు ఆర్జించిలాభమేమి?
కన్నుమూసి కట్టెగా మారితే
ఎంతటి శ్రీమంతులైనా
బికారులే బిక్షగాళ్ళే సన్యాసులే !
కాటికి పయణం ఖాళీచేతులతోనే !
కానీ కాదేదీ కబ్జా కనర్హమన్నట్టు
ధనదాహం తీరని కబ్జాదారుల
కబంధహస్తాల్లో నేడు స్మశానాలు
వారికవి స్వర్గాధామాలౌతున్నాయి
ఔరా ! ఇది ఎంతవింత నమ్మలేనంత ?
10. దయచేసి దాని పేరు అడక్కండి
ఆ జీవి అంటే
అందరికీ అసహ్యం
కానీ కొన్ని నిరుపేద
కుటుంబాలకది జీవనాధారం
కాకితో కోకిలతో
పోటీపడే దాని అందం
ముక్కులదిరేపోయే
మురికే దానికి మకరందం
అది దొర్లుతుంది
భరించలేని దుర్గంధంలో
పొర్లుతుంది బురదలో సరదాగా
మునిగితేలుతుంది మురికిగుంటల్లో
తనకీ నీచజన్మ నిచ్చినందుకు
ఏనాడు ఎవరినీ
నిందించలేదు నిరాశ చెందలేదు
ఆ దైవాన్ని సైతం
దూషించలేదు దుఖించలేదు
ఛీపో అన్నా అది
చిరునవ్వులు చిందిస్తూ వుంటుంది
ఆహా! ఏమిటి ? ఎంతటి ఆశ్చర్యకరం ?
ఎంతటి అద్భుతం ఆ భగవంతుని సృష్టి ?
"కంపును ఇంపుగా" భావించే తత్త్వాన్ని
కడుపుతిప్పే" దుర్గంధాన్ని భరించే శక్తిని"
నిత్యం మనుషులమధ్యే నివసించే "భాగ్యాన్ని"
"వాసన ఎరుగనిముక్కును" ఆ జీవికి ప్రసాదించిన
ఆ భగవంతుడెంతటి మహిమాస్వరూపుడో కదా !
దాని ముచ్చటే...మురికి ముచ్చట
అందుకే దయచేసి దాని పేరు మాత్రం నన్ను
అడగకండి అదేమిటో మీ అందరికీ తెలుసు.....
11.జాతిని పీడించే ఓ జలగలారా!
నీతిలేని ఓ రాతి బొమ్మలారా ! వినండి !
జై పాతాళభైరవి !
నరుడా ఓ నరుడా !ఏమి నీ కోరిక ?
రాజకీయాల్లో రాణించేదెట్లు తల్లి ?
అదెంత పనిరా డింభకా !
అసమ్మతిచిచ్చును రేపవలెరా !
అవినీతిలో ఆరితేరవలేరా !
కుర్చీ కుమ్ములాటలో గెలిచేదెట్లు తల్లీ?
అదెంత పనిరా డింభకా !
నోట్లగాలంతో ఓట్లచేపలు పట్టవలెరా !
రిగ్గింగ్ చేయమని గూండాల్ని బెగ్గింగ్ చేయవలెరా !
కుర్చీలో కూర్చోగానే కుబేరుడయ్యేదెట్లు తల్లీ ?
అదెంత పనిరా డింభకా !
కోట్లు కోట్లు అర్జించవలెరా !
కొంపలు కొన్నైనా కూల్చవలెరా !
దోచుకున్న ప్రజాధనాన్ని దాచుకునేదెట్లు తల్లీ?
అదెంత పనిరా డింభకా !
హార్ట్ సర్జరీ అంటూ హంగరీ వెళ్ళరా డింగరీ !
చిత్తం తల్లీ ! వెళ్లి రారా ఊసరవెల్లి !
జై పాతాళ భైరవి !
బాలకా ఓ బాలకా ! ఏమిరా నీ కోరిక !
జన్మనిచ్చిన నాతండ్రి జాడతెలియలేదు తల్లి !
వినక తప్పదురా! బాలకా ఓ విషాద వార్త !
దూరదర్శన్ కు సైతం అందని ఓ దుర్వార్త !
విదేశీ విమానం కూలి
మంచుకొండల్లో నీ తండ్రి మరణించేడురా!
ఔరా! అక్కటా! ఏమీ దిక్కులేని కుక్కచావు?
"అంతేరా బాలకా ఉన్నది చాలక"
జాతికిద్రోహంచేయు నేతల జాతకాలే అంతర
ఉన్నదాంతో తృప్తి చెందేవాడే ఉత్తముడురా!
కసాయి తండ్రికి కర్మచేయుట నీ ఖర్మరా!
తల్లీ మరి నా ప్రస్తుత కర్తవ్యం ?
వినిపించరా ! నా ఈ విశ్వసందేశం !
దిక్కులు పిక్కటిల్లేలా...
జాతిని పీడించే ఓ జలగలారా !
నీతిలేని ఓ రాతి బొమ్మలారా !
ఇక్కడ బ్యాంకులు దోచుకొని అక్కడ
విదేశీ బ్యాంకుల్లో దాచుకుని దొరల్లా
విచ్చలవిడిగా విలాసవంతంగా జీవిస్తూ
విదేశాల్లో ఆస్తులున్నాయని విర్రవీగకండి !
మంచుకొండల్లో ప్రమాదంపొంచిఉందని మరువకండి !
12.నవయుగ ద్రౌపది...
వింటే భారతం వినాలి
తింటే గారెలు తినాలి
కొంటే పట్టుచీర కొనాలి
కంటే ఆడపిల్లనే కనాలి
అన్నసూక్తి నిన్న ఆడపిల్లలకు ఓఅక్షయపాత్ర
నేడు ఆడపిల్లతండ్రిగుండెల్లో ఓ మందుపాత్ర
ఎందుకంటే...
తన భార్య కడుపు
పండిన కబురువినిగానే
చెవిలో చెక్కెర పోసినట్టై
కమ్మని కలలలెన్నో కంటుంటే
వంశోద్దారకుడే పుట్టాలని కోరుకుంటుంటే
ఐదుగురు మహాలక్ష్మీలు ఆ ఇంట్లో వెలిశారు
ఐనా ఆ తండ్రికి ఆడపిల్లలంటే పంచప్రాణాలే
వారు కొండమీది కోతిని కోరినా తెచ్చిచ్చేవాడు
అందర్ని అల్లారుముద్దుగా అపురూపంగా పెంచాడు
అందరిలో పెద్దకూతురు చాలా తెలివైనది
ఆమెకు శ్రీ మద్రామాయణ భాగవత భగవద్గీత
గ్రంథాలకన్న మహాభారతమంటే మహాఇష్టం
ప్రతి నిత్యం పూజకు ముందు భక్తిశ్రద్దలతో
మహాభారతం పఠించేది...శ్లోకాలన్నీ కంఠస్థంచేసేది
ద్రౌపదికి తాను ఫ్యానునని ఆమే తనకాదర్శమనేది
ఆ అభిమానమే ఇప్పుడాకుటుంబం కొంపముంచింది
పెళ్ళీడు కొచ్చిన పెద్ద కూతురు
తాను ద్రౌపదిలా ఐదుమంది భర్తలకు
భార్యను కావాలన్నది ఒక తీయనికలని
"నవయుగ ద్రౌపదిగా" కీర్తి గడించాలని...
వారిసేవలో తాను తరించాలని...
పంచపాండవులకు...జన్మనివ్వాలని
తనకు...ఐదుగురు భర్తలు కావాలని
తండ్రికి "పెళ్లిదరఖాస్తు"...పెట్టుకుంది
ఐదుగురితో పెళ్లిచేయాలని పట్టుపడుతోంది
లేదంటే సీలింగ్ ఫ్యాన్ చున్నీతో బెదిరిస్తోంది
ఐదుమంది అల్లుళ్ళను వెదకడం
నీటికై ఎండమావుల వెంటపడడమే
పెద్ద కూతురి పెళ్ళి ధరఖాస్తు
ఆ ఆడపిల్లల తండ్రికి ఒక పిడుగుపాటే అది
అమెరికా జపానుమీద విసిరిన అణుబాంబే
ఓదైవమా ఏమీటీ అంతుచిక్కని వింతశిక్ష
ఆడపిల్లల తండ్రికే ఎందుకు ఈ అగ్నిపరీక్ష
13.జానెడుపొట్ట జాగ్రత్త సుమీ!
కోటి విద్యలు "కూటి కొరకే"
రేయింబవళ్ళు రెక్కల్ ముక్కల్
చేసేది "జానెడు పొట్ట" కోసమే
దాని ఆకలిని తీర్చడం కోసమే
మనందరం ఏమి తిన్నా
ఎంత తిన్నా కరిగించే "యంత్రం"
మార్నింగ్ వ్యాయామం
యోగ ధ్యానమే దానికి "మంత్రం"
ఎవరికైనా పెళ్లికి ముందు
నైస్ గా నాజూగ్గా వుండే బెల్లి
ఆ తర్వాత తొండ ముదిరి
ఊసరవెల్లిగా మారుతుంది
అత్తామామలు ప్రేమతో పెట్టే
చెత్తాచెదారం తింటే అంతేమరి
బక్కగా వున్నంతకాలం
ఎవడైనా "అందాలరాముడే"
24/7 పిజ్జాలు బర్గర్ లు
చిరుతిండ్లు లాగించి లాగించి
బెల్లి కొండలా నిండుకుండలా
మారితే ఎవరైనా "బొజ్జగణపయ్యే"
ఔను దొరికిన ఓ దొంగ...నేరం
నాది కాదు...ఆకలిది అన్నాట్ట
ఔను పెరిగిన పొట్ట కూడా
అంటోంది ఈ బొజ్జకు కారణం
నేనుకాదు...ఆ జిహ్వానే అని
"పొట్టంటేనే రోగాల పుట్ట"
అందరూ తు.చ. తప్పక పాటించాలి
ప్రతిరోజు ఈ ఆరోగ్యగీతాన్నిపాడాలి
"తిరుగు తిరుగు...తిరుగు"
"తిరిగితేనే తిన్నది...అరుగు"
"నీ కొవ్వు...కరుగు నీ బొజ్జ...తరుగు"
"లేకున్న డాక్టర్ దగ్గరకు పరుగో...పరుగు"
ఇక నీబుజ్జిపొట్టని ఇంటిలో "పూలకుండీగా"
లేదా వీధిలో "చెత్తకుండీగా" మార్చుకుంటావో
అంతా నీచేతుల్లోనే ఉంది నీచేతల్లోనే ఉంది
నీ ఆలోచనల్లోనే ఉంది.....తస్మాత్ జాగ్రత్త !
14.ఒక్కరాత్రిలో మూడు హత్యలు
ఒకరోజు రాత్రి ఏమి జరిగిందంటే?....
దోమలదండొచ్చింది మా ఇంటి మీదికి
జపాన్ వృద్ధదోమలు రెండు
నా పొట్టమీద వాలి నా రక్తాన్ని తేనెలా
త్రాగేస్తుంటే కోపంతో గట్టిగా కొట్టి చంపేశా
నన్ను కుట్టిన ఆ దొంగదోమల్ని కొట్టగా అవిగిట్టగా
మరో చైనా కుర్రదోమొకటి శరవేగంగా వచ్చి
బ్రూస్లీ లా నాపై విరుచుకుపడింది
అది నన్ను కుట్టబోతే కోపంతో నేను కొట్టబోతే
తప్పించుకుని వెళ్లి మా భార్య వీపుమీద వాలింది
దొరికిందిలే దొంగని కోపంతో గట్టిగా ఒక్కటిచ్చా
అంతే మా ఆవిడ వీపు విమానం మోతమ్రోగింది
కానీ ఆ కుర్రదోమ తప్పించుకుని వెళ్లి...
మా పాప ముక్కు మీద వాలింది
దొరికిందిలే దొంగని కోపంతో గట్టిగా ఒక్కటిచ్చా
అంతే మాపాప ముక్కైతే పచ్చడైపోయింది
కానీ ఆ కుర్రదోమ మళ్ళీ తప్పించుకుని వెళ్ళి...
తిరిగి మెల్లగావచ్చి నా కుడిచెంప మీద వాలింది
దొరికిందిలే దొంగని నాచెంపను చెల్లుమనిపించా....
అంతే ఆ దెబ్బకు నా చెంప వాచిపోయింది
కానీ ఆ కుర్రదోమ మళ్ళీ తప్పించుకుపోయింది
నాకో సందేహం ఆ జపాన్ దోమలొచ్చాయి
మమ్మల్ని కుట్టాయి కొట్టగా అవి గిట్టాయి
కానీఎవరినీ కుట్టని ఎవరి రక్తం త్రాగని
ఎవరికీ ఏ హానిచేయని ఈ చైనాదోమను
కొట్టడం దాన్ని చంపడం న్యాయమేనా? అని
ఔను ఇది తప్పేనని తప్పుచేశానని నేను
నా రెండు చెంపలు చెల్లుమనిపించుకున్నా...
పాపం అప్పుడే ఎడమ చెంపమీద వచ్చి వాలిన
ఆ చైనా దోమకూడా చచ్చి...కిందపడిపోయింది
అలా ఆరోజు రాత్రి మూడు హత్యలు జరిగాయి
మరినేను దోషినా ? నిర్దోషినా ? నాకర్థం కాలేదు
ఆకాశవాణి అన్నది నీవు నిర్దోషివేనని,ఎందుకంటే?
ఈ రోజే ఆ మూడుదోమల్ని చంపకుంటే అవి
గుడ్లుపెట్టి పొదిగి కొన్ని వేలదోమలకు జన్మనిచ్చేవి
ఎందరినో కుట్టి కుట్టి...ఎందరి రక్తమో త్రాగి త్రాగి
ఎందరినో వ్యాధులకు గురిచేసేవి...
ఎందరినో బలితీసుకునేవి....కలరా వ్యాధితో
ఎందరినో కాటికి పంపేవి...కనుకనే నీవు నిర్దోషివి
15.అల్లుడా !..మజాకా !!.
అది ఓ కొత్త జంట
మ్రోగింది గుడిగంట
నెరవేరి వారి కలలపంట
కాలు పెట్టబోతుంది
ఓ బుజ్జి పానోబాబో ఆ ఇంట
తనకు ప్రెగ్నెన్సీ కన్ ఫాం ఐనందుకు
తల్లికాబోతున్నందుకు తన్మయంతో
ఆ ఇల్లాలు గాలిలో తేలిపోతోంది
అమ్మానాన్నలకు అత్తామామలకు చెప్పి
శతమానం భవతీ శ్రీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు
అంటూ ఆదర్శదంపతుల దీవెనలందుకుంది
పట్టరాని ఆనందంతో సంతోష సాగరాన
మునిగి తేలుతోంది...ఉక్కిరిబిక్కిరైపోతోంది
భర్తకు కాల్ చేస్తే బిజీ బిజీ అని వస్తోంది
అందుకే రాత్రి బాగా పొద్దు పోయాక వచ్చిన
భర్తను గట్టిగా వాటేసుకొని చెప్పింది
ఏమండీ గుడ్ న్యూస్ మనందరికీ త్వరలో
ప్రమోషన్ మీరు...డాడీ నేను...మమ్మీ
అత్తమామలు...అవ్వాతాతలు కాబోతున్నామని
స్వీట్ నోట్లో పెడుతూ...చిరునవ్వు నవ్వుతూ...
కానీ భర్త...నోనో వెరీ వెరీ బ్యాడ్ న్యూస్
నా "మూడుషరతులకు" ఒప్పుకుంటేనే
అదిగుడ్ న్యూస్ మనందరికీ ప్రమోషన్
కాదంటే కనడం కష్టం...ఆపై నీ అదృష్టం
అన్నాడు.. కాస్త కఠినంగా...కాస్తసీరియస్ గా
ఒకటి...
నీవు 9 నెలలకు కాదు ఐదారునెలల్లోనే కనాలి!
ఆ...
రెండు...అబ్బాయినే కనాలి అమ్మాయి వద్దేవద్దు!
ఆ...
మూడు...అమ్మాయిని కంటే నాకు అదనపు కట్నంగా
అక్షరాల లక్షరూపాయలు పాప పుట్టినరోజున ఇవ్వాలి
అంతే పాపం ఆ ఇల్లాలి ఆనందమంతా ఆవిరైపోయింది
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై స్పృహ తప్పి పడిపోయింది
అల్లుడా ! మజాకా !....ఔను
కొందరి ఆశకు అంతే వుండదు వారికి డబ్బే ప్రధానం
ఎప్పటికైనా అజ్ఞానులు అహంకారులు ఆశబోతులైన
శాడిస్ట్ భర్తలతో సంసారం సాఫీగా సాగడం దుర్లభమే
16.కోవిడ్...దొంగ
ఇప్పుడు
దోచుకోవడానికి
ఇంటికొచ్చిన దొంగ
చేతికిచిక్కినా తిట్టరు
కొట్టరు వానిపై కేసుపెట్టరు
తీసుకున్నంత తీసుకొని
దోచుకున్నంత దోచుకొని
వెంటనే ఇంటినుండి
వెళ్లి పొమ్మంటారు
వాడు తాకిన వస్తువేది
తమకు వొద్దంటారు
డబ్బైనా బంగారమైనా
ఖరీదైన పట్టుచీరలైనా సరే
ఇంట్లోకొస్తూ ఆ దొంగ తెలివిగా
కుక్కకిన్ని బిస్కెట్లు వేసి
కాపలా కుక్కను కాకాపట్టి
నోరు మూయించేసినా
కరవకుండా అరవకుండా ఏదో
మంత్రమేసినా మాయచేసినా
బీరువాల నిండా ఉన్న
బట్టల్ని డబ్బుల కట్టల్ని
మెరిసే బంగారునగల్ని
కోరుకున్నంత, వాడు
మోయ గలిగినంత
మూటకట్టుకొని
ముసిముసి నవ్వులు
నవ్వుతువుంటే ఖుషీఖుషీగా
కులుకుతువుంటే
మూలనున్న తేలొకటికుట్టినా
వాడు కెవ్వుమనికేక పెట్టక
బాధనంతా లోలోన భరించినా
ఏదైనా చిన్న "దగ్గు" దగ్గినా
"తుమ్ము" తుమ్మినా ఇంటిల్లిపాదీ
ఉలిక్కిపడి దిగ్గున మేల్కొంటారు
దొరికిన ఆ దొంగకు
దేహశుద్ధి చేయరు
కోవిడ్ సోకివుండొచ్చని
వాన్నెవరు పట్టుకోరు
ముట్టుకోరు ముందుకురారు
కొట్టరు తిట్టరు తాళ్ళతో కట్టరు
వాడిమీద కేసులు పెట్టరు
వాన్ని వెంటనే ఇంటినుండి
వెళ్ళి పొమ్మని వేడుకుంటారు
ఇల్లుగుల్ల చేసినా ఫర్వాలేదు తమ
ప్రాణాలు దక్కితే చాలనుకుంటారు
దవాఖానాలకెల్తే ప్రాణాలు పోవుడే కాదుగా
ఒళ్ళు ఇల్లు రెండు గుల్లైపోతాయిగా అందుకని...
ఇంతకీ ఎవరు అదృష్టవంతులు కోవిడ్ దొంగనా ?
లేక ఇళ్ళుగుల్లైనా ప్రాణాలు దక్కిన ఇంటివాళ్ళా ?
17.ఆడపిల్ల అయస్కాంతం
గోకుతా నే గోకుతా అని
ఎవరి వెంట పడకు
ఎవరికి దురదపుడితే
వాడేవద్దన్నా గోక్కుంటాడు
అంటాడు అనుభవంతో మా నాన్న
గోచి పెడతా గోచి పెడతా
అని ఎవరి వెంట పడకు
ఎవరి గోచి ఊడిపోతే వారే
వద్దన్నా పెట్టుకుంటారు
అంటాడు తల నెరిసిన మా తాత
తాళి కడతా తాళి కడతా
అంటూ సెల్లో చెవిలో
జోరీగలా నసపెట్టకు
కష్టపడడానికి ఇష్టపడేవాడు
కంటబడితే ప్రతి పడుచుపిల్లా
వద్దన్నా వెంటపడుతుంది
అంటుంది అత్తగా మారబోయే మా అమ్మ
ఔనిదినిజం
మగాడన్న వాడినే
రోషం ఉన్నవాడినే
మీసం రువ్వేవాడినే
ఆడపిల్ల అయస్కాంతములా ఆకర్షిస్తుంది
అటు ఇటుకాని అమాయకున్ని అసమర్థున్ని
ఆశపడే ఆడపిల్ల ఈ భూమిమీద ఇంకా పుట్టనేలేదు
నేను వీరున్ని తప్పక విజయాన్ని
సాధిస్తానన్న సాహసినే విజయం సైతం వరిస్తుంది
పోటీ అంటే భయపడి,పారిపోయే పిరికిపందనుకాదు
18.గాడిదలను సైతం గౌరవించాలి
గడ్డిమేసే ఓ గుడ్డిగాడిదా !
మురికి బట్టలుమోసే
ఓ ముసలిగాడిద!
ఊరంతా ఉలిక్కి పడేలా
ఓండ్ర పెట్టింది చాలిక
ఒంగోలు గిత్తలా పోజు పెట్టక
వెళ్ళపోవే ఓ వెర్రిగాడిద అంటూ
పొట్టచెక్కలయ్యేట్టు నవ్వుకుంటూ
వెర్రివెంగళప్ప ఒకడు
గాడిద వెనకాలె నిలబడి
వెళ్ళేగాడిదను వెక్కిరిస్తుంటే
తోకను గట్టిగా మెలి పెడుతుంటే
కాళ్ళమీద కర్రతో కొడుతూవుంటే
ఒళ్ళుమండి గాడిద ఒక్కసారి
కాళ్ళురెండు జాడించింది
గట్టిగా ముఖాన ఒక్క తన్ను తన్నింది
అంతే పాపం ఎగిరి వెంగళప్ప
ముళ్లకంచెలో పడ్డాడు
ముక్కు పచ్చడైంది
కళ్ళు బైర్లు కమ్మాయి
పళ్ళు పదారు రాలాయి
ఒళ్ళంతా గాయాలయ్యాయి
గాయాలపాలైన వెంగళప్పను
గాడిదమీదనే హాస్పటల్ కి తీసికెళ్ళారు
అప్పుడు కట్లు కడుతున్నప్పుడు
ఙ్నానోదయమైంది వెర్రివెంగళప్పకు
గాడిదలను సైతం మనం గౌరవించాలని
19..జై పాతాళభైరవి !
జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను అప్పుల్లో మునిగిపోయా...
"మోకాళ్ళోతుకు" కూరుకుపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను త్రాగుడుకు బానిసనైపోయా...
"నడుముల్లోతుకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! మళ్ళీ ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను డ్రగ్స్ కు బానిసనైపోయా...
"భుజాలవరకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! ప్రేమపిచ్చి పట్టి నేను
"పీకల్లోతుకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లి నేను నెట్టులో
"జుట్ఠు"దాకా కూరుకుపోయా
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! మళ్ళీ ఏమిరా నీ కోరిక ?
తల్లి నేను నిద్రాహారాలుమాని
వాట్సాప్ ఫేస్ బుక్కుల్లో
ఎరక్కపోయి ఇరుక్కుపోయా !
లైకులంటూ కామెంట్లంటూ కలవరిస్తున్నా
ఔరా బాలకా ! బానిసలైతే సెల్లుకు...
బ్రతుకు భారమేరా ! ఘోరమేరా !
దుర్భరమేరా ! దుఃఖభరితమేరా !
అందుకే ఓ బాలకా !
తెలుసుకోరా ! ఓ నిండునిజం !
"వాట్సాప్
అంటే ఒక ఊబిరా !
జారిపోతే అందులోకి
జాతకాలే మారిపోవురా !
తలరాతలే తారుమారౌనురా !
ఫేస్ బుక్ కాలాన్ని హరించే ఓ కార్చిచ్చురా !
అందుకే ఓ బాలకా !
తెలుసుకోరా ! ఓ నిండునిజం !
సెల్లుమాయలో పడిపౌవద్దురా!
బానిసలై సెల్లుకు బలైపోవద్దురా!
మీ గొయ్యిని మీరే తవ్వుకోవద్దురా!
మీ కంటిని మీరే పొడుచుకోవద్దురా!
మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకోవద్దురా!
మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కోవద్ధురా!
అందుకేరా ఓ బాలకా ! జాగ్రత్త ...తస్మాత్ జాగ్రత్త!
మీ సెల్లు జాగ్రత్త ! మీ కళ్ళు జాగ్రత్త ! మీ ఒళ్ళు జాగ్రత్త!
20.మారిన గౌతమబుద్దుడు.....
అమ్మా
మాతా కవళం
భవతీ భిక్షాందేహి
తల్లీ అన్నపూర్నేశ్వరి
కాస్త బిక్ష వేయండి తల్లి
ఆకలి దహించుకు పోతోంది
ఇది మూడవసారి
ఎంత గొంతుచించుకున్నా
ఎంతగా పిలిచినా ఆ ఇల్లాలు
కరుణించడంలేదు కనిపించడం లేదు
కారణమేమిటో అసలు తెలియకున్నది
వారం తర్వాత ఇంటిముందు
అవే అరుపులు అవే ఆకలికేకలు
గుమ్మం వైపు గుడ్లగూబలా చూపులు
ఇల్లాలు బయటికి రాదాయె బిక్ష వేయదాయె
ఆమెకు ఈ సన్యాసులంటే భయమేమో?
ఆ తల్లికి ఈ బిక్షగాళ్ళంటే అసహ్యమేమో ?
అరిచి అరిచి గొంతు బొంగురు పోతుంది కాదు
కాదు ఖచ్చితంగా ఆ ఇల్లాలు చెవిటిమేళమే?
సందేహాలతో సతమతమౌతూ ధైర్యంచేసి తలుపు
తట్టి కొట్టి భవతీ భిక్షాందేహి మాతా కవళమంటూ
బిగ్గరగా పెట్టిన ఆ గావుకేకకు తలుపు తెరుచుకుంది
తన శ్రమ ఫలించింది కాని ఆ ఇల్లాలును చూడగానే
కళ్ళు రెండుబైర్లు కమ్మాయి,కాలికింద భూమికదిలింది
ఆ ఇల్లాలు బిక్షతో రాలేదు బిడ్డనెత్తుకొని వచ్చింది
వారెవరో కాదు సాక్షాత్తు తన భార్యా తన కన్నబిడ్డే
తానప్పులపాలై తీర్చేదారిలేక "వేషంమార్చి" సన్యాసైతే
తనభార్య "ఊరినేమార్చి" ఒంటరిగా బ్రతుకుతోంది బిడ్డతో
భిక్షకోసం కాదు భార్యబిడ్డల కోసం అరచినట్టైంది
కన్నీళ్ళతో ఎదురుగా కట్టుకున్న భార్యా... కన్నబిడ్డ
అందుకే సన్యాసం ఆశ్రమానికి తాను మాత్రం ఇంటిలోనికి...
నాటి బుద్ధుడు భార్యాబిడ్డలను వదిలి సన్యాసిగా మారాడు
నేటి బుధ్దుడు సన్యాసాన్ని త్యజించి భార్యాబిడ్డల్ని చేరాడు
21. రాణిగారికి ముద్దుపెట్టిన రామచిలుక!
ఓ బంగరు రంగుల రామచిలుక ! నా
రామచిలుక ! ఎక్కడ ఎగురుచుంటివి ?
రాజుగారి తోటలో విహరించుచుంటిని
రాజుగారి తోటలో విహరిస్తు ఏమిచేస్తివి ?
నా కిష్టమైన జామపళ్ళు కొరికి తింటిని
జాంపళ్ళు తిన్న నిన్ను భటులేమిచేసిరి ?
పట్టుకెళ్ళి మహారాణి మందిరంలో వేసిరి
అప్పుడు రాణిగారొచ్చి ఏమి చేసిరి ?
పెద్ద పంజరంలో నన్ను బంధించి వేసిరి
అయ్యే ! ఓ రంగుల రామచిలుకా ! బంధీవై
నీవేమి చేసితివి ? ఆకలేసి అల్లరిచేస్తిని
అప్పుడు రాణిగారొచ్చి ఏమిచ్చిరి ?
మంచిఫలము లిచ్చిరి ముద్దులిచ్చిరి
రాణిగారు ముద్దుపెట్టగా నీవేమిచేస్తివి ?
రాణిగారి బుగ్గమీద నేచిన్నగాటు పెడితిని
భగ్గుమన్న రాజుగారు నీకేమి శిక్షవేసిరి ?
మళ్ళీ నన్ను పంజరంలో బంధించి చేసిరి
అయ్యో ! ఓ రంగుల రామచిలుక !
బంధీవై మళ్ళీ నీవేమి చేస్తివి ?
పంజరం నుండే మంచిపాట పాడితిని
ఏ మాపాట కొంచెం పాడి వినిపించవా!
"ఓ బంగరు రంగుల చిలకా పలకవా...
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ....
నాపైన ప్రేమే ఉందని ఈఈఈ...
నా పైన అలకే లేదని ఈఈఈ."
పాటకు పరవశించిన రాజు రాణి ఏమిచ్చిరి?
మెచ్చుకొని ఓ బంగారుహారం మెళ్ళోవేసిరి
ఓ బంగరు రంగుల రామచిలుక ! నీవేమిచేస్తివి?
నేనలిగి.....మూతిని ......ముడుచుకుంటిని
రాణిగారు ముద్దుపెట్టి అలకెందుకని అడిగింది
ఓ రంగుల రామచిలుక ! మరి నీవేమి కోరితివి ?
ఆకాశాన...హాయిగా...పిచ్చిగా...తిరగాలంటిని
గాలిలో ఎగరాలంటిని ఆడుకోవాలంటిని అంతే
రాజు రాణి నవ్వి నన్ను ఆకాశంలో ఎగురవేసిరి
ఇప్పుడు నేనాకాశంలో ఎంతో ఎత్తులో హాయిగా
హాయి హాయిగా ఎంతో స్వేచ్చగా ఎగురుతుంటినీ
అంతఃపురంలో కన్న...స్వేచ్చ... ఆకాశంలో మిన్న
అన్న ఒకచిన్న నగ్నసత్యం నేడు తెలుసుకుంటిని
22. స్వాగతం పలకకే ఓ శ్మశానమా !
ఒకనాడు కడుపేదరికంలో
దారిద్ర్యంలో దగ్ధమైన మనిషి
నేడు ధనవంతుడయ్యాడు,కాని
దానకర్ణుడు కాలేకపోయాడు
దొంగచాటుగా దోచుకున్నది
బ్యాంకుల్లో భద్రంగా దాచుకున్నది
ఎలా పట్టుకెల్లాలో
అర్థంకాక జుట్టు పీక్కుంటున్నాడు
సమాధిలో ఎలా దాచుకోవాలో
ఏమి చేయాలో అర్థంకాక
ఎవరికీ వినపడకుండా
కన్నీళ్ళు ఎవరికీ కనపడకుండా
చీకటిలో కుర్చొని చింతిస్తున్నాడు
కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ... ఏడుస్తూ
కుప్పకూలిపోయాడంతే...
రెప్ప మూయలేదు... ఇంకా...
బ్రతికే వున్నాడు...
అందుకే తొందరపడి....
స్వాగతం పలకకే ఓ శ్మశానమా !
కాటికాడి కాకులు రమ్మంటున్నా
కన్పబిడ్డలే కాటికి పొమ్మంటున్నా
రాత్రింబవళ్ళు తన రక్తాన్ని ధారబోసి
అష్టకష్టాలుపడి ఆర్జించిన ఆస్తినంతా
ఒక్కరోజు కూడా...ఒక్కగంట కూడా...
ఒక్క చెమటచుక్కనైనా కార్చని...
కాయకష్టమంటే ఏంటో ఎరుగని...
ఒక్కపూటైనా కడుపు నిండా
కన్నతల్లిదండ్రులకింత తిండిబెట్టని....
పరమ ఆశబోతులైన...దుష్టులైన...
దుర్మార్గులైన... దురాశాపరులైన...
కన్నవారిమీద ప్రేమలేని కఠినాత్ములైన...
కరుణ జాలిలేని కర్కశహృదయులైన...
ఈ కన్నబిడ్డల చేతుల్లో
ఎలాపెట్టాలో అర్థంకాక
మదనపడి... మదనపడి...
మంచాన పడిపోయాడంతే...
మరణించలేదు...ఇంకా ....
మాట్లాడుతూనేవున్నాడు...
అందుకే తొందరపడి...
స్వాగతం పలకకే ఓ శ్మశానమా !
ఈ జంజాటానికి ఈ ఆశలఆరాటానికి
ఈ జీన్మరణ పోరాటానికి కారణమొక్కటే
పోతూపోతూ పట్టుకు పోవడానికి...
వస్తూవస్తూ తానేమీ తేలేదన్న వాస్తవం ఎరుగక...
నాదినాది అనుకున్నదేదీ నీదికాదన్న నిజం తెలియక...
23. బేరం... బ్రతుకు భారం....
చేదైనా సరే
ఒక నిజం చెప్పుకోవాలి
ఆ భార్యాభర్తలవి
బక్కరిక్షావాళ్ళు
భయపడే భారీశరీరాలే...
పుణ్యం పురుషార్థమాశించి
గుడిలో పూజలు ప్రదక్షిణలు
చేయ భక్తితో బయలు దేరారు
భార్యాభర్తలిద్దరు
పిసనారీతనంలో పిహెచ్ డీ చేశారు..
బేరమాడకుండా వస్తువులు కొనడం
వారి ఇంటా వంటాలేదు.....
ఇంటినుండి గుడిదాక బేరాలే
రిక్షావాడితో బేరం...
పూలు పళ్ళు కొబ్బరికాయలు
కొనేవారితో బేరం...
గుడిముందర అడుక్కునే
బిక్షగాళ్ళ దగ్గర బేరం...
గుడిలో పూజారి హారతి
పళ్ళెంలో వేసేదక్షిణ దగ్గర బేరం....
చివరికి సాక్షాత్తు భగవంతునితోనే బేరం
గుండెపోటులాంటి రోగాలు రాకుండా చేస్తే
గుడికివచ్చి గుండుకొట్టించుకొంటామని
నూటొక్క ప్రదక్షిణలు చేస్తామని వింతబేరం
దర్శనం చక్కగా జరిగినా ఆతృప్తి అరక్షణం
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
గుడిబయటకురాగానే గూబగుయ్ మన్నది
గుండెపోటు వచ్చినంతపనైంది
చెంపచెల్లుమన్నది కొంపకొల్లేరైంది
భార్య చెప్పు తెగిపోయింది
భర్త ఖరీదైన కొత్త షూస్
దొంగలెత్తుకుపోయారు
ఐనా వారి బుద్ధిమారలేదు
మళ్ళీపాతచెప్పుకుట్టే వాడితోబేరం
కొత్త చెప్పులు కొంటూ బేరం
ఇళ్ళు చాలా దూరం, అందుకే
ఆటోడ్రైవర్ తో అరగంటబేరం..పాపం
ఇంటిమలుపు దగ్గర రెండు ఆటోలుఢీ
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
ఆటో తిరగబడి భర్తకుడికాలు విరిగింది
భార్య ఎడమచెయ్యి విరిగింది
తిరిగి అదేఆటోలో ఆసుపత్రికి ప్రయాణం
ఆసుపత్రిలో వారి బేరాలన్నీ బంద్
డాక్టర్ ఫీజు....నో బేరం
మందులషాపులో... నో బేరం
ఆసుపత్రి బిల్లులో...నో బేరం
ఈ బేరాల వల్లే వారికి జ్ఞానోదయమైంది
మిగిలిందానికన్న చేతికి తగిలిందే మిన్న
ఆగుడే వారికొక గొప్ప గుణపాఠం నేర్పింది
చేదైనా సరే ఒక నిజం చెప్పుకోవాలి
దానవత్వమే దైవత్వమని..............
మంచితనమే మానవత్వమని.......
చిత్తశుద్ధిలేని శివపూజలు శుద్ధదండగని....
24. అమ్మో ! ఆన్ లైన్ చదువులు???
పుస్తక పఠనమెందుకంటూ
నెట్లోనే అన్నీవున్నాయంటూ
భక్తితో భగవద్గీతను చదవాలని
విద్యార్ధులు కొందరు నెట్ ఓపెన్ చేశారు
పదినిముషాలు భగవద్గీతను
భక్తి శ్రద్దలతోచదివారు, అంతే
ఆపై బ్రేక్ పడింది, కారణం
చక్కని బాపుబొమ్మ ఒకటి
ప్రక్కనే కనపడుతోంది కన్నుకొడుతోంది
మనసును కలవరపెడుతోంది
ఆపై భగవద్గీత ప్రక్కకెళ్ళింది
అందమైన ఒంపుసొంపుల
బాపుబొమ్మ ఒకటి ముందుకొచ్చింది
కన్నార్పకుండా అందరు
అలా చూస్తూ,చూస్తూవుంటే,
క్షణంలో, ఆ బాపుబొమ్మ
ఒక్కసారి బూతుబొమ్మగా మారింది
అంతే, వయసు పులకరించింది.
మనసు పరవశించింది.
కొందరు కోర్కెలతో రగిలిపోయారు
మరికొందరు మత్తులో ఊగిపోయారు
సలసల కాగిపోయారు, సందేహాలతో
విద్యార్థులందరు సతమతమైపోయారు
భగవద్గీతనా?
బాపుబొమ్మనా?
బూతుబొమ్మనా?,ఏది?...
ఏది చూడాలో,ఏది చదవాలో అర్ధంకాక
జుట్టు పీక్కున్నారు.పిచ్చివాల్లై పోయారు
అసలే కోరికలతో రగిలే ఆ కుర్రకుంకల
కళ్ళన్నీ ఆ బూతుబొమ్మ...మీదనే
అది విద్యార్దుల తప్పు కాదు...
నిద్రలేచింది మొదలు పిల్లలు
చేసేపనిని, వెళ్ళేచోటును, కలిసేమిత్రుల్ని
నెట్లోచూసే బొమ్మల్ని,గమనించని,
నిఘాపెట్టని, తప్పనిచెప్పని, తల్లీదండ్రులదే
పిల్లలు చెడిపోయిన తర్వాత
ప్రేమలో పడిపోయిన తర్వాత
పీకలదాకా మునిగిపోయిన తర్వాత
తిట్టి,కొట్టి,ఇంటినుండి గెంటి,లాభమేంటి ?
అందమైన ఆ బూతుబొమ్మలె మీ
బంగారు బ్రతుకుల్నిఅంధకారం చేస్తాయని
వారికి తెలియజెప్పవలసిన బాధ్యత
ఇంటి పెద్దదే కాదు, ఇంటిలోవుండే ప్రతిఒక్కరిది
ఔను పుస్తకపఠనమే ఉత్తమం కారణం
భగవద్గీత ఓపెన్ చేస్తే భగవద్గీతనే చదువుతారు
బైబిల్ ని ఓపెన్ చేస్తే బైబిల్నేచదువుతారు
అందుకే ఆన్లైన్లో పాఠాలు వినే విద్యార్థులారా!
పాఠాలు బోధించే ఓ పంతుల్లారా! జాగ్రత్త!
మీ కళ్ళు జాగ్రత్త ! ...మీ సెల్లు జాగ్రత్త !
మీ ఒళ్ళు జాగ్రత్త.!..మీ మనసు జాగ్రత్త !
25. ఆ "నాస్తికుడు" ఆస్తికుడెలా అయ్యాడు ?
దేవుడు లేడు ఎక్కడున్నాడు ?
ఎలా వుంటాడు?
వుంటే,అదిగో ఆ చెట్టులా మనకళ్ళకు
కనిపించేవాడేగా
కనిపించడు,మనతో మాట్లాడడు కాబట్టే
దేవుడే లేడని గట్టిగా వాదించవచ్చు
దేవుడున్నాడనే వారిని ఒక్కసారి
కళ్లకు చూపించమని కోరవచ్చు
లేడూ లేడని బల్లగుద్ధి చెప్పవచ్చు
దేవుడున్నాడని ఎవరైనా నిరూపిస్తే
ఆర్జించిన ఆస్తినంతా రాసిస్తామని
ఛాలంజ్ చేయవచ్చు
అన్నాడో నాస్తికుడైన "నిరాశావాది"
అది విన్న ఆస్తికుడైన "ఆశావాది"
నాస్తికుడితో "నీకు బుర్రే"లేదన్నాడు
"నాకు బుర్రలేదా" అంటూ
బిగ్గరగా నవ్వాడు నాస్తికుడు
"ఉంటే చూపించన్నాడు" ఆస్తికుడు
కాని ఎలా చూపించాలో అర్థం కాక
బుర్రగోక్కున్నాడు జుట్టుపీక్కున్నాడు నాస్తికుడు
నిజంగా నీకు బుర్రేఉంటే...
పాలల్లో ఉన్న వెన్నను వ్రేలువంచకుండా
కవ్వంతో చిలకుండా వేరుచెయ్...
సముద్రంలో అలలను ఎగిసిపడకుండా
క్షణం సేపు ఆపుచెయ్...
మిట్టమధ్యాహ్నం భగభగమండే సూర్యున్ని
ఒక్కగంట సేపు కన్నార్పకుండా వీక్షించు...
వర్షాన్ని కురిపించు...
వేర్లులేని చెట్లను చూపించు...
అడవిలోని చెట్లను ఆచెట్లకున్న ఆకుల్ని
ఆకాశంలోని నక్షత్రాలను
సముద్రతీరాన ఇసుక రేణువుల్ని లెక్కించు...
అన్నాడాస్తికుడు ఆవేశంతో...
ఆ ప్రశ్నలకి నాస్తికుడి
బుర్రే కాదు భూమి కూడ గిర్రున తిరిగింది
ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక
బుర్రగోక్కున్నాడు జుట్టుపీక్కున్నాడు నాస్తికుడు
ఏటేటీ? పాలలోని
వెన్నను వేరు చెయ్యాలా ?
సముద్రంలో అలలను
ఎగిసిపడకుండా ఆపాలా?
మిట్టమధ్యాహ్నం
సూర్యున్ని కన్నార్పకుండా చూడాలా?
వర్షం కురిపించాలా?
వేర్లులేని చెట్లను చూపించాలా?
అడవిలోని చెట్లను ఆచెట్ల ఆకుల్ని
ఆకాశంలోని నక్షత్రాలను సముద్రతీరాన
ఇసుక రేణువుల్ని లెక్కించాలా?
"హౌఈజ్ ఇట్ పాజిబుల్"...అంటూ మళ్ళీ
బుర్రగోక్కున్నాడు జుట్టుపీక్కున్నాడు నాస్తికుడు
అందుకే ఓ నాస్తిక మిత్రమా !
సూర్యుడు తూర్పునే
ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో
ఆ సృష్టికర్త వున్నాడన్నది అంతే నిజం
నీవు మృత్యువును...తీగలోని కరెంటును...
నీ రెండు కళ్ళతో...ఎలా చూడలేవో...
నీ రెండు చేతులతో...ఎలా తాకలేవో...
అలాగే కోటి సూర్యప్రభలతో సమానమైన
ఆ దైవం నీ ముందు ప్రత్యక్షమైనా,నీవు
ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోలేవు....
నిజానికి...
ఈ విశ్వంలో "కొన్ని,లేవన్నా"ఉన్నట్టే
పగటిపూట కనిపించని నక్షత్రాల్లాగ...
"కొన్ని కంటికి కనిపించకపోయినా"
విశ్వమంతా వ్యాపించి వున్నట్లే
కనిపించక వీచే చల్లని గాలిలాగ...
అన్నాడు ఆస్తికుడు...వేదాంతిలాగ...
ఔను"అనంతమైన ఈ సృష్టి" వెనుక
"అఖండమైన ఒక శక్తి" వున్నదన్న
"నగ్నసత్యం" తెలిసిన ఆ "నాస్తికుడు"
జ్ఞాన బుద్దడయ్యాడు పరిశుద్దుడయ్యాడు
"బుర్రవెలిగి"బుద్దిపెరిగి"ఆస్తికుడైపోయాడు
26. అత్త చేతివంట చెత్తనకమ్మా ఓ కొత్త కోడలా !
ఓ కొత్త కోడలా !
అత్త చేతివంట చెత్తనకమ్మా !
ఓ గడుసరి అత్తా !
కొత్త కోడలి వంటకు
కోటి వంకలు పెట్టకమ్మా !
ఓ కొడుకా ! ఓ కూతురా !
నిన్న అమ్మవంట
అమృతం కన్న మిన్న
కానీ నేడు కమ్మగాలేదని
కసురుకోకండి !
కస్సుబుస్సుమనకండి!
కరుకుగా మాట్లాడకండి!
ఓ కోపిష్టి మొండిమొగుళ్ళారా !
భార్యల వంటకాలను
భరించలేమంటూ బజారు కెక్కకండి!
భార్యలను బాధపెట్టకండి!
కారం ఎక్కువని ఉప్పు తక్కువని
నిప్పు మీద పడ్డ ఉప్పులా
చిటపటలాడకండి చిరుకోపంతో
పటపటమని పళ్ళుకొరక్కండి!
ఎంతో ఆశపడి ఎంతో శ్రమపడి
ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి
ఎంతో భ్రమపడి మెచ్చుకుంటారని
నిలబడి,గంటల తరబడి
వంటలు చేసే భార్యల
మనసులను గాయపరచకండి!
రైతులు పొలాల్లో
రేయింబవళ్ళు శ్రమించి
స్వేదాన్ని చిందించి
పచ్చని పంటలు పండిస్తారు
అమ్మైనా అత్తైనా
కొత్త కోడలైనా
వంటగదుల్లో బంధీలై
ఎంతో ఓర్పుతో ఓపికతో
విలువైన కాలాన్ని వెచ్చించి
తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
తమకున్న నైపుణ్యాన్ని జోడించి
కమ్మగా వంటలు చేస్తారు
మన కడుపులు నింపుతారు
ఎప్పుడైనా ఏదైనా చిన్నపొరపాటు
జరిగితే సహనంతో సర్దుకుపోవాలి!
ఓ అతిథి దేవుల్లారా !
వివాహ వేడుకల్లో
వియ్యాలవారి విందులో
ఆశతో వడ్డించుకొని ఆకలిలేకున్నా
తినలేక వంటకాల్ని వృధా చేయకండి!
వీధిచివర అనాధలెందరో
విసిరేసిన విస్తరాకుల్లో ఎంగిలి
మెతుకులకోసం కుక్కలతో కుస్తీ
పడుతుంటారని గుర్తుంచుకోండి!
అన్నం పరబ్రహ్మస్వరూపమన్న
నగ్నసత్యాన్ని కలనైనా మరువకండి!
27. మీ బుజ్జి బొజ్జ ?
తిరుగు...తిరుగు
తిరిగినంతనే
తిన్నదంతా ...అరుగు...అరుగు
తిరుగు...తిరుగు
తిరిగినంతనే
నీ కొవ్వంతా ...కరుగు...కరుగు
నీ కొవ్వు
కరిగినంతనే
నీ బుజ్జిబొజ్జ ...తరుగు...తరుగు
నీ కొవ్వు పేరుకున్న
నీవు తిన్నది అరగకున్న
నీ బొజ్జ పెరుగుతున్న ఆపై ఇక
డాక్టర్ దగ్గరకు...పరుగో...పరుగు
28. పగటికల ?
చక్కగా వున్నావ్ ప్రక్కనే కూర్చున్నావ్
ముద్దుగా వున్నావ్ ముద్దిస్తానన్నావ్?
ఎత్తుకుంటానన్నావ్?
ఎంత మత్తుగా వుండునో! నీమేనిస్పర్శ
ఎదకు హత్తుకుంటానన్నావ్?
ఎంత హాయిగా వుండునో! ఈచల్లనివెన్నెలరేయి
ఊహకందకుండా ఉన్నదే నా ఊహలఊర్వశి
ఆహా ! చిలకల్లే రంగుల
రామచిలకల్లే వున్నావ్
చిరునవ్వు నవ్వుతున్నావ్
అందంగా ఉన్నావు
అపురూపంగావున్నావ్
అతిలోకసుందరిలా వున్నావ్
మైకంలో క్రింద పడిపోతానేమో
కాస్త నన్ను పరుపుపైకి చేర్చవా డార్లింగ్?
ఓ సుందరీ ! ఓ సుకుమారీ !
ఎందుకో నాలో నిప్పురగులుతోంది
మెత్తనిపాన్పు......ఒప్పుకుంది...
ఎర్రనిబెడ్ లైట్.... తప్పుకుంది...
చీకటి నల్లనిచీర...కప్పుకుంది...
కాస్త దుప్పటిలా నన్ను కప్పుకోవా డార్లింగ్?
ప్లీజ్ .....ప్లీజ్..... ప్లీజ్.... ప్లీజ్...
తెలవారింది...సూర్యోదమైంది
మెల్లమెల్లగా మెలుకువ వచ్చింది...
కమ్మనైన కల కాస్త కరిగిపోయింది...
మనసుచెదిరింది జ్ఞానోదయమైంది...
ఆశ వ్యర్థం....అత్యాశ అనర్థం...
అని కాబోలు...ఆ పగటికలకు అర్థం...
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment